Natural agriculture
-
చేనుకుచేవ.. రైతుకు రొక్కం..బయోచార్!
పిఠాపురం: గత కొన్నేళ్లుగా మోతాదుకు మించి వాడుతున్న రసాయనిక ఎరువులు, పురుగు మందులతో భూమి తన సహజ గుణాలను కోల్పోయింది. దీంతో ఆశించిన నాణ్యమైన ఉత్పత్తులను అందించలేక, క్రమంగా చౌడుబారుతోంది. మొక్కలకు ఉపయోగపడే సూక్ష్మజీవులు భూమిలో అంతరించిపోతున్నాయి. తద్వారా భూమి సారాన్ని కోల్పోయి నిస్తేజంగా మారి, నాణ్యమైన పంటలు పండే అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఈ సమస్య నుంచి రైతులను ఆదుకోవడానికి పూర్వం వాడుకలో ఉండే బయోచార్ను (బయో అంటే జీవం.. చార్ అంటే బొగ్గు) మళ్లీ వాడుకలోకి తీసుకు రావడానికి ప్రకృతి వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.బయోచార్‌తో ఇదీ మేలు... వాస్తవానికి 1850 నుంచే ఈ పద్ధతి వినియోగంలో ఉన్నప్పటికీ కాలక్రమంలో మరుగున పడిపోయింది. ఎలాంటి ఎరువునైనా మొక్కలు గ్రహించి మంచి దిగుబడి రావడానికి బయోచార్ ఒక మంచి ఔషధంగా పని చేస్తుంది. ఆమ్ల గుణాలున్న మట్టి పీహెచ్ స్థితిని సాధారణ స్థాయికి తీసుకుని రావడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. సహజంగా మనం ఎన్ని ఎరువులు వేసినా, వాటిలో మొక్కకు 30 నుంచి 40 శాతం మాత్రమే అందుతాయి. పంటలకు వేసే ఎరువుల్లో బయోచార్ను కలపడం ద్వారా వంద శాతం ఎరువులను మొక్కలు గ్రహించే అవకాశముంటుంది. మట్టిలో తేమ శాతాన్ని క్రమబద్దీకరించి, తగిన తేమ అందేలా చేయడంలో దీనికి మించింది మరొకటి లేదు. మొక్కలకు పోషకాలు అందని చోట ఇది ఉ్రత్పేరకంగా పని చేసి, మొక్కలకు పోషకాలు అందేలా చేస్తుంది. ముఖ్యమైన సూక్ష్మజీవుల సంఖ్యను పెంచుతుంది. నేలలో రసాయనాల గాఢతను తగ్గించి, సహజంగా మార్చుతుంది. ఉపయోగించే విధానం... కర్ర బొగ్గు 50 కేజీలు, చివికిన పశువుల పెంట 50 కేజీలు, రసాయనాలు వాడని అడవి మట్టి లేదా పుట్ట మట్టి 10 కేజీలు తీసుకుని, 8 నుంచి 10 లీటర్ల నీరు, రెండు కేజీల బెల్లం కరిగించి తీసుకోవాలి. దీంతో పాటు ద్రవ జీవామృతాన్ని నేరుగా దీనిలో కలపాలి. వీటన్నిటినీ బాగా కలియబెట్టి వారం పది రోజుల పాటు ఒక డబ్బాలో వేసి నీడలో పెట్టాలి. రోజుకోసారి కలుపుతూ ఉండాలి. లోపల గాలి తగిలే విధంగా గోనె సంచి మూత పెట్టి ఉంచుకోవాలి. పది రోజుల తరువాత బయోచార్ తయారవుతుంది. దీన్ని వరి దమ్ములో వేసుకోవాలి, ఉద్యాన పంటల్లో మొక్కల మొదళ్ల చుట్టూ పళ్లెం కట్టి దానిలో బయోచార్ను వేసి మట్టితో కప్పివేయాలి. దీనివల్ల పంట నాణ్యత పెరుగుతుంది.బయోచార్ తయారీ ఇలా.. బహిరంగంగా కాల్చడం » రెండు మీటర్ల పొడవు, ఒక మీటరు లోతున గొయ్యి తవి్వ, దానిలో వృక్ష వ్యర్థాలను వేసి, ఒకసారి మంట మండిన తరువాత దాన్ని పచ్చటి ఆకులతో కప్పి బయటి నుంచి ఆమ్లజని అందకుండా చేయాలి. తద్వారా రెండు రోజులకు బయోచార్ తయారవుతుంది. » స్థానికంగా లభ్యమయ్యే వృక్ష వ్యర్థాలను, నిరుపయోగంగా పడి ఉండే కట్టెలను కాల్చడానికి వీలుగా గుల్ల తయారీ బట్టీల మాదిరిగా అర్ధచంద్రాకారంలో బట్టీలను తయారు చేసుకోవాలి. ఆ బట్టీల్లో వృక్ష వ్యర్థాలు వేసి, కాల్చి రెండు రోజుల తరువాత తీసుకుంటే బయోచార్ సిద్ధమవుతుంది. నాణ్యత, దిగుబడి పెరిగాయి... రెండేళ్లుగా బయోచార్ ద్వారా నువ్వులు, వేరుశనగ, ఆకుకూరలు పండిస్తున్నాను. దీన్ని వేయక ముందు పంటలు నాసిరకంగా ఉత్పత్తయ్యేవి. బయోచార్ వాడటం మొదలు పెట్టాక పంటల నాణ్యతతో పాటు దిగుబడి బాగా పెరిగింది. నేల సారవంతంగా మారి వర్షాభావ పరిస్థితులను తట్టుకుని, మొక్కలు జీవంతో ఉంటున్నాయి. తేమ తగ్గిపోకుండా ఉంచడంలో ఇది చాలా బాగా పని చేస్తోంది. భూమిలో కార్బన్ శాతం పెరగడానికి ఇది బాగా ఉపయోగపడుతోంది. – దుర్గాప్రసాద్, ఫార్మసీ సైంటిస్టు, రైతు, బలభద్రపురం, జగ్గంపేట మండలం, కాకినాడ జిల్లా బయోచార్‌తో మంచి ఫలితాలు.. మా పొలంలో ఆరేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. గత ఏడాది ప్రకృతి వ్యవసాయ అధికారులు బయోచార్ గురించి వివరించడంతో దీన్ని ఉపయోగించడం ప్రారంభించాం. దీనివల్ల పంటలకు నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. తడులు తక్కువగా పెట్టినా ఇబ్బంది ఉండటం లేదు. పంటలు గతంలో కంటే ఆశాజనకంగా, నాణ్యతగా వస్తున్నాయి. ఎరువుల వాడకమూ తగ్గింది. కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉంటున్నాయి. మొక్కల పెరుగుదల చాలా బాగుంది. – ఎం.మల్లీశ్వరి, రైతు, ఒమ్మంగి, ప్రత్తిపాడు మండలం, కాకినాడ జిల్లా ప్రయోగాత్మకంగా చేపట్టాం... బయోచార్ విధానాన్ని గత ఏడాది నుంచి జిల్లాలో ప్రయోగాత్మకంగా ఆచరణలోకి తెచ్చాం. ఈ ఏడాది 1,500 ఎకరాల్లో ఈ విధానంలో సాగు చేయాలని నిర్ణయించాం. ఇప్పటి వరకూ 50 ఎకరాల్లో 60 మంది రైతులు ఈ విధానంలో సాగు చేపట్టారు. ప్రస్తుత ఖరీఫ్‌లో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ విధానం అమలుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. దీన్ని ఒకసారి ఉపయోగిస్తే కనీసం 60 నుంచి 80 రోజుల పాటు పంటలకు పోషకాలను అందిస్తుంది. ఎనిమిదేళ్లపాటు ఫలితం ఉంటుంది. ఎరువుల వాడకం 60 నుంచి 70 శాతం తగ్గిపోతుంది. నీటి ఎద్దడి ఉన్నా పంటలు నష్టపోకుండా దిగుబడులు ఇస్తాయి. – ఎలియాజర్, ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారి, కాకినాడ కమిటీతో బయోచార్ పంటల సాగు... బయోచార్‌తో లాభాలను జిల్లాలోని రైతులకు తెలియజేస్తున్నాం. 2024 రబీలో 19 మంది రైతు శాస్త్రవేత్తలతో బయోచార్ తయారు చేయించి, పొలాల్లో వేయించి, ఆ పొలాల పరిస్థితిని అంచనా వేశాం. ఈ ఏడాది ఖరీఫ్, వచ్చే రబీలో 19 మంది రైతు మెంబర్లతో దీన్ని తయారు చేయించి, వారి పొలాల్లో వేయించి, పంటల తీరును ఇతర రైతులకు తెలియజేసేవిధంగా అవగాహన కల్పించాం. ఎక్కువ మంది రైతులు ఈ విధానంలో పంటలు సాగు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. – రేష్మ సోమ, జిల్లా పాయింట్ పర్సన్, ప్రాజెక్టు లింక్ అసోసియేట్, కాకినాడ -
పర్యావరణ హిత జీవనశైలి అవశ్యం
క్రమపద్ధతి లేని ఉష్ణోగ్రత, వర్షపాతాల రూపంలో వాతావరణ మార్పు పరిణామాలు అనుభవిస్తున్నాం. ఒక శతాబ్దానికి పైగా, మండుతున్న శిలాజ ఇంధనాలు, అసమానమైన, నిలకడలేని శక్తి, భూవినియోగాల వలన, యావత్ ప్రపంచం మితిమీరి వేడెక్కడానికి దారితీసిందని, వాతావరణ మార్పును పరిశీలించడానికి నియమింపబడిన ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ తన నివేదికలో నిర్ధారించింది. పర్యావరణాన్ని రక్షించడానికి సమగ్రమైన ప్రతిస్పందన, ప్రతి ఒక్కరికీ దానిని రక్షించాలనే భావన అనివార్యం. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ విపరీత పర్యావరణ సవాలును ఎలా ఎదుర్కోవాలనే విషయమై సతమతమవుతున్నాయి. పర్యావరణ రక్షణకు ఉపయోగపడే స్థిరమైన జీవనశైలి, ప్రతి వ్యక్తి తీసుకునే చర్యలు పెద్ద మార్పును తేగలవు. గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడా నికి తక్షణ, నిశ్చయాత్మకమైన ప్రయత్నాల అవసరం ఎంతైనా ఉంది. దీనికి గాను వాతావరణ నిపుణులు, సర ఫరా, వినియోగ ప్రవర్తన వైపు పరిష్కారాలు ప్రతిపాదించారు.ఇందులో ఉద్గారాలు, వాటి నిర్వహణ, సాంకేతిక ఎంపికలు, జీవనశైలి మొదలైన వాటిని లక్ష్యంగా చేసుకుని, పరిష్కారాలు సూచించారు. వినియోగ నిర్వహణ అనునది, ఉత్పత్తి వ్యవస్థల నుండి వచ్చే ప్రతి కూల పర్యావరణ ప్రభావాలను తగ్గించడం కొరకే గానీ, నాణ్యమైన జీవితం కోల్పోవడానికి కాదనీ వక్కాణించారు. ఈ ప్రయత్నంలో, వ్యక్తిగత ప్రవర్తన ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మన దేశంలోని నీతి ఆయోగ్, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం(యూఎన్డీపీ) వారిచే సంయుక్తంగా ఒక కార్యాచరణ నివేదిక 2023లో విడుదల అయింది. భారతదేశంతో సహా అనేక దేశాలలో నిర్వహించిన అధ్య యనాల ఫలితాలను క్రోఢీకరించి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఉపయోగపడే ఏడు ముఖ్యమైన అంశాలు ఈ నివేదికలో పొందుపర చారు. వీటిలో నీటి పొదుపు, వ్యర్థాల నిర్వహణ, సుస్థిరమైన ఆహార వ్యవస్థ, ఇంధన సంరక్షణ, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, స్థిరమైన జీవన శైలి, ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ ఉన్నాయి. అన్ని అధ్యయనాలు భారతదేశంలో జరగనప్పటికీ, ఫలితాలు మాత్రం పర్యావరణాన్ని పరిరక్షించడానికి మనకు కూడా వర్తిస్తాయి. ఆహార రంగం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆహారాన్ని సక్రమంగా వినిగించు కొని, పంట నుండి వినియోగం వరకు వృథాను తగ్గించాలి. మొక్కల ఆధారిత ఆహారాలను ఎక్కువగా తిని, జంతు ఆధారిత ఉత్పత్తులను తక్కువగా తినడం అలవాటు చేసుకోవాలి. ‘ఆహారాన్ని ప్రేమించు – వ్యర్థాలను ద్వేషించు’ అను నినాదం, ఆహార వృథాను తగ్గించడానికి ఉపయోగపడటంతోపాటు, ఆహారం తయారీ యజమానులలోను, చిల్లర వ్యాపారులలోను, వినియోగదారులలోను గణనీయమైన సాను కూల ఫలితాలను అందించింది. గృహ స్థాయిలో వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించడం వల్ల కంపోస్ట్ తయారీకి దారితీసి, నేల సారాన్ని పెంపొందించడంలో సహాయపడింది. స్థానికంగా పండించిన, కాలానుగుణమైన, ప్రకృతి మరియు సేంద్రీయ పద్ధతిలో పండించిన ఆహారాన్ని వినియోగిస్తున్నవారు, శాకాహారులు, యితర వ్యక్తు లతో పోలిస్తే, తక్కువ తలసరి ప్రతికూల పర్యావరణ ప్రభావాన్ని కలిగిస్తున్నారని ఫలితాలు చూపించాయి. వ్యవసాయం, భూమి నిర్వహణ పద్ధతులు ఉత్పాదకతను పెంచడానికి పచ్చిక బయళ్లలో చెట్లను పెంచడం, వార్షిక పంటలతోపాటు చెట్లను పెంచడం, ప్రకృతి వ్యవసాయం పాటించడం, అనగా కంపోస్ట్ ఎరువు వాడకం, కలుపు అణచివేసే కవరు పంటలు వేయడం, రసాయన ఎరువుల వాడకం నిషేధించడం, యితర సహజ/సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు పాటించడం, సారం క్షీణించిన వ్యవసాయ భూమిని పునరుద్ధరించడం,పంట మార్పిడి చేయడం, పంట వేయడానికి నేలను తక్కువసార్లు దున్నడం, డ్రిప్ లేదా స్ప్రింక్లర్ పద్ధతుల ద్వారా పంటలకిచ్చే నీటి విని యోగాన్ని, వృథాను బాగా తగ్గించడం లాంటివన్నీ పర్యావరణ పరిరక్షణకు దారి తీస్తాయి. నీటికి సంబంధించిన లెక్కలు, తనిఖీ ప్రయోగం విజయవంతమైన వ్యూహంగా నిరూపితమైంది. నీటి విని యోగదారుల సంఘాలను ఏర్పాటు జేసుకోవడం, నీటి సంరక్షణ, వాతావరణ అంచనా కోసం అందుబాటులో ఉన్న సాంకేతికతను స్వీకరించడం వలన నీటి నిల్వను, వినియోగాన్ని మెరుగుపరచు కోవచ్చని ధ్రువీకరించడమై నది. ఆంధ్రప్రదేశ్‌లో, సహజ వ్యవసా యంతో బాటు, రుతుపవనా లకు ముందు అనగా వేసవి కాలంలో పంట వేయడం, స్థిరమైన వ్యవసాయం వైపు ప్రోత్సహించడం దీనికి ఒక ఉత్తమ ఉదాహరణ. ఈ పద్ధతులు నీటి సంరక్షణకు తోడ్పడుతూ, నేల నాణ్యతను సైతం మెరుగుపరుస్తున్నాయి. దీనికితోడు, రసాయన రహిత ఆహార ధాన్యాలను అందిస్తూ, భూమిలో 365 రోజుల పచ్చ దనాన్ని, చల్లటి వాతా వరణాన్ని యిస్తున్నాయి. రవాణా కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో రవాణా కీలక పాత్ర వహిస్తు న్నది. పట్టణాలు, నగరాల్లో ప్రయాణించడానికి, ప్రజలు వ్యక్తిగత వాహనాలను ఉపయోగించకుండా ప్రజా రవాణాను ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. బ్యాటరీతో నడిచే వాహనాలను ఉప యోగించడం, గమ్యస్థానాలు చేరుకోడానికి సైకిలు ఉపయోగించడం, సాధ్యమైన చోటల్లా నడవడం, ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది కలిసి వాహనాల్లో వెళ్ళడం, కార్‌పూలింగ్ పద్ధతులను పాటించడం, భౌతిక ఉనికికి బదులుగా వీడియో సాంకేతికతలను ఉపయోగించి టెలిప్రెసెన్స్ను పెంపొందించి రవాణా ఖర్చు తగ్గించడం వంటి చర్యలన్నీ కాలుష్యాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. రవాణాలో రద్దీని, ఖర్చును తగ్గించడానికి, సమర్థవంతమైన ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం సహాయపడుతున్నది. శక్తి సంబంధిత పదార్థాలు శక్తి వినియోగంలో, పొదుపు ప్రవర్తన పెద్ద సవాలుగా మారింది. భవనం పైకప్పులో సోలార్‌ను అమర్చడం, వేడి నీటి కోసం సోలార్ హీటర్లను అమర్చుకోవడం, ఇంట్లో వెలుతురు, వంట కోసం బయో గ్యాస్ ఏర్పాటు చేసుకోవడం, ఎల్ఈడీ బల్బులు ఉపయోగించడం, ఇంధన సమర్థవంతమైన వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలను వాడటం, పైకప్పులో తోటలను పెంచడం పర్యావరణ పరిరక్షణకు గణ నీయంగా దోహదపడతాయి. వంటకు మెరుగైన స్టవ్‌లు (పొయ్యిలు) వాడితే, పొగ స్థాయిలను 55 శాతం వరకు తగ్గించాయని మన దేశంలో చేసిన ప్రయోగాలు నిరూపించాయి. అవసరమైన వ్యూహాలు మీడియా ప్రసారాలు, ప్రకటనలు, వార్తాపత్రికలలో కథనాలు అవగాహన స్థాయిని పెంచడంలో సహాయపడతాయి. పర్యావరణ అనుకూల పద్ధతులను పాటిస్తున్న వినియోగదారులను, ప్రభుత్వాలు తగు రీతిలో ప్రోత్సహించి, ప్రశంసిస్తే ఇతరులు కూడా అనుసరిస్తారని పరిశోధనలలో తేలింది. వినియోగదారుల నిర్ణయం ప్రభావితం చేయ డానికి, వస్తువులపై ‘పర్యావరణ అనుకూలమైనది’ అని ముద్రించాలి. వ్యర్థాలు, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, ఆరోగ్యకరమైన జీవనము నకు, స్థిరమైన ఆహార పద్ధతులను స్వీకరించడానికి దోహదపడుతుంది. పల్చటి ప్లాస్టిక్ కలిగించే ప్రతికూల ప్రభావాలను పాఠశాల పిల్లలకు తెలియబరిచాక, వారిలో గణనీయమైన మార్పు వచ్చింది. ధూమపానం చేసేవారు, తమ సిగరెట్ పీకలను నిర్ణీత ప్రదేశంలో పడ వేసేలా అవగాహన కల్పించాలి. సిగరెట్ పీకలు పర్యావరణంలోకి హానికరమైన రసాయనాలను వెదజల్లి, మైక్రోప్లాస్టిక్లుగా విడ దీయడం వల్ల పర్యావరణం కలుషితమవుతున్నది. కుళాయిలలో నీటి ప్రవాహాన్ని తగ్గించడం, నీటి లీకేజీలను ఆపడం, పళ్ళు తోముకునే టప్పుడు కుళాయిని ఆపివేయడం వంటి చర్యల ద్వారా గృహాలలో నీటి ఆదా చేయవచ్చని అధ్యయనాలు వెల్లడించాయి. వ్యర్థాలను తగ్గించడానికి, చిన్న చిన్న మోతాదులలో వస్తువులను ప్యాకేజి చేయడం, ఒకసారి ఉపయోగించి పారవేయకుండా తిరిగి వాడటం అత్యంత ప్రభావవంతమైన మార్గాలు. సూట్‌కేసులు, ప్రింటర్లు, బూట్లు, వాషింగ్ మెషీన్లు సుదీర్ఘ కాలం ఉండేవి కొనుగోలు చేయ డానికి వినియోగదారులు ఇష్టపడతారు, కాబట్టి వీటి జీవితకాలాన్ని ప్రముఖంగా కనబడేటట్లు ముద్రించాలి. తద్వారా వీటి వ్యర్థాలను తగ్గించవచ్చు. మొబైల్, టెలివిజన్, కంప్యూటర్ తయారీదారులు, వాటి వ్యర్థాలను రీసైకిల్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. పైన చెప్పినట్లుగా, వ్యక్తిగత స్థాయిలో ప్రవర్తన మార్పులు వచ్చి నచో, కచ్చితంగా పర్యావరణాన్ని రక్షించవచ్చు. డా‘‘ పి. పృథ్వీకర్ రెడ్డి వ్యాసకర్త హైదరాబాద్‌లోని ‘సెస్’(సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్) సీనియర్ పరిశోధకుడు ‘ prudhvikar@cess.ac.in -
ఢిల్లీ కాలుష్యానికి రీజనరేటివ్ వ్యవసాయమే విరుగుడు..? అసలేంటది..?
ఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకీ పెరిగిపోవడంతో ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఢిల్లీ సహా చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనంతో కాలుష్యం తీవ్రతరమౌతోందని సుప్రీంకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుగొనాలని ఆదేశించింది. ఇదే క్రమంలో ఆనంద్ మహీంద్రా రీజనరేటివ్ అగ్రికల్చర్(పునరుత్పత్తి వ్యవసాయం) సరైన ప్రత్యామ్నాయ మార్గమని ఎక్స్‌లో షేర్ చేశారు. ఇంతకీ ఈ పునరుత్పత్తి వ్యవసాయం అంటే ఏంటీ..? పునరుత్పత్తి వ్యవసాయం అనేది వ్యవసాయం చేసే విధానాల్లో ఓ పద్ధతి. పురుగు మందులు, ఎరువులు, భారీ పనిముట్లు వాడకుండా ప్రకృతికి అనుగుణంగా నేలసారాన్ని పెంచుతూ సాగు చేసే విధానం. గ్రీన్ హౌజ్ ఉద్గారాలను తగ్గించే విధానాలను ఎంచుకుంటూ జీవవైవిధ్యాన్ని పెంపొందిస్తారు. పర్యావరణ అనుకూలమైన వ్యవసాయ విధానాలను అనుసరిస్తారు. పంట కోతలను కాల్చివేయకుండా వాటినే ఎరువుగా వాడుకునే విధానాలను అనుసరిస్తారు. ఇదీ చదవండి: వాయు కాలుష్యం ఎఫెక్ట్‌తో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం ఇందులో అనుసరించే కొన్ని పద్ధతులు.. నేల సహజ నిర్మాణాన్ని భంగపరచకుండా సాగు చేస్తారు. ఇందుకు నేలను భారీ యంత్రాలతో కాకుండా పశువులతో దున్నుతారు. అతిగా దున్నడం వల్ల నేల నుంచి వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ విడుదల అవుతుంది. పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలి. ఓకేసారి వివిధ రకాల పంటలను వేస్తారు. దీని వల్ల పోషకాలతో నేల సారవంతమౌతుంది. కలుపు మొక్కలను నిరోధిస్తుంది. కంపోస్టు ఎరువును వినియోగిస్తారు. నేలలో నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని ఈ విధానం పెంచుతుంది. అంతేకాకుండా సూక్ష్మజీవుల కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది. రసాయనిక ఎరువులు ఉపయోగించడం వల్ల నేలను సారవంతం చేసే సూక్ష్మజీవులు అంతం అవుతాయి. పశువుల ఎరువును మాత్రమే పంటలకు ఉపయోగిస్తారు. దీనివల్ల మొక్కలు ఏపుగా పెరగడమే కాకుండా నేల సారాన్ని పెంచుతాయి. తెగుళ్లను కూడా నియంత్రిస్తాయి. వ్యవసాయంలో ఉత్పాదకతతో పాటు పోషక విలువల్ని పెంచే పంటలను ఎంచుకోవాలి. పునరుత్పత్తి వ్యవసాయం పర్యావరణానికి మాత్రమే కాదు, రైతులకు, వినియోగదారులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది రైతుల ఆదాయాన్ని, అలాగే ఆహార నాణ్యత, పరిమాణాన్ని మెరుగుపరుస్తుంది. శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడం ద్వారా వాతావరణ మార్పులను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇదీ చదవండి: ఢిల్లీ కాలుష్యాన్ని తగ్గించడానికి ఆనంద్ మహీంద్రా చక్కని ఉపాయం -
తక్కువ ఖర్చుతో నాటు కోళ్ళని పోషించవచ్చు
-
ప్రకృతి ఫలసాయం.. శ్రీవారి ప్రసాదం!
సాక్షి, అమరావతి: శ్రీవారి ప్రసాదం, అన్నప్రసాదం తయారీ కోసం తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన 12 రకాల ఉత్పత్తుల సరఫరాకు రంగం సిద్ధమైంది. శ్రీవారికి సమర్పించే నైవేద్యంతో పాటు స్వామి దర్శనానికి వచ్చే లక్షలాది భక్తులకు నాణ్యమైన, రుచికరమైన ప్రసాదంతో పాటు.. అన్నప్రసాదాల తయారీలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించాలని టీటీడీ సంకల్పించింది. పైలట్ ప్రాజెక్టుగా 2021–22 సీజన్లో 1,304 టన్నుల శనగలను ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా సేకరించి టీటీడీకి సరఫరా చేశారు. కాగా 2022–23 సీజన్ నుంచి 15 రకాల ఉత్పత్తుల కోసం టీటీడీ ప్రతిపాదించగా.. 12 రకాల ఉత్పత్తుల సరఫరాకు ఏపీ మార్క్‌ఫెడ్ ముందుకొచ్చింది. ఈ మేరకు రైతు సాధికార సంస్థతో కలిసి మార్క్‌ఫెడ్.. టీటీడీతో అవగాహన ఒప్పందం చేసుకుంది. బియ్యం, కంది, మినుములు, శనగలు, పెసలు, బెల్లం, పసుపు పొడి, వేరుశనగ, మిరియాలు, కొత్తిమీర, మస్టర్డ్ సీడ్, చింతపండు రకాలకు సంబంధించి 15 వేల టన్నులు సరఫరా చేయనున్నారు. ఈ ఒప్పందం మేరకు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటల వారీగా సాగు చేస్తున్న 21,181 మంది రైతులను గుర్తించి రైతు సాధికార సంస్థ ద్వారా ప్రత్యేక శిక్షణనిచ్చారు. సాగు, ధరల నిర్ణయం, సేకరణ, నిల్వ, సరఫరా, కార్యకలాపాలను జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ సీఎం యాప్ ద్వారా పర్యవేక్షిస్తుంది. 15 శాతం ప్రీమియం ధర చెల్లింపు జిల్లాల వారీగా గుర్తించిన రైతుల వివరాలను ఈ యాప్ ద్వారా ఎన్రోల్ చేసి ఆర్బీకేల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల ద్వారా.. మార్కెట్ ధరల కంటే కనీసం 15 శాతం ప్రీమియం ధర చెల్లించి సేకరిస్తారు. ఇలా గడిచిన ఖరీఫ్ సీజన్లో సాగైన సోనామసూరి (స్లెండర్ వెరైటీ) ఆవిరి పట్టని పాత బియ్యం, బెల్లం, శనగలను సరఫరా చేస్తుండగా, మిగిలిన ఉత్పత్తులను ప్రస్తుత రబీ సీజన్ నుంచి సరఫరా చేయనున్నారు. ఆర్బీకేల ద్వారా సేకరించిన ఈ ఉత్పత్తులను జిల్లా స్థాయిలో గుర్తించిన గోదాములు, కోల్డ్ స్టోరేజ్‌ల్లో నిల్వ చేస్తారు. సాగు, కోత, నిల్వ సమయాల్లో ఆయా ఉత్పత్తుల నాణ్యతను నిర్ధారించుకునేందుకు మూడు దశల్లో నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు లిమిటెడ్(ఎన్ఏబీఎల్) గుర్తింపు పొందిన థర్డ్ పార్టీ ల్యాబ్‌లో తనిఖీ చేస్తారు. రసాయన అవశేషాలు లేవని, నిర్దేశించిన ప్రమాణాలకనుగుణంగా ఫైన్ క్వాలిటీ(ఎఫ్ఏక్యూ) ఉత్పత్తులని నిర్ధారించుకున్న తర్వాతే ప్రాసెసింగ్ మిల్లుకు సరఫరా చేసేందుకు అనుమతినిస్తారు. అక్కడ ప్రాసెస్ చేశాక టీటీడీకి సరఫరా చేస్తారు. ఇలా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసిన చెరకుతో తయారు చేసిన బెల్లం ఉత్పత్తులను ఈ నెల 10వ తేదీన టీటీడీకి సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నెలాఖరులోగా నిర్దేశించిన శనగలు, సోనామసూరి బియ్యాన్ని సరఫరా చేయనున్నారు. 15 శాతం ప్రీమియం ధర చెల్లిస్తున్నాం టీటీడీకి 12 రకాల ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను సరఫరా చేస్తున్నాం. ఖరీఫ్‌లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగైన బెల్లం, శనగలు, బియ్యం సరఫరా చేస్తున్నాం. మిగిలిన 9 ఉత్పత్తులను ప్రస్తుత రబీలో సేకరించి సరఫరా చేస్తాం. –రాహుల్ పాండే, ఎండీ, ఏపీ మార్క్‌ఫెడ్ ప్రకృతి ఉత్పత్తులను ప్రోత్సహించడమే లక్ష్యం ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసే రైతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏపీ మార్క్‌ఫెడ్‌తో కలిసి టీటీడీతో ఒప్పందం చేసుకున్నాం. జిల్లాల వారీగా ఎకరంలోపు కమతాలు కలిగిన చిన్న, సన్నకారు రైతులను గుర్తించి వారు పండించిన ఉత్పత్తులను సేకరించి మార్క్‌ఫెడ్ ద్వారా టీటీడీకి సరఫరా చేస్తున్నాం. –పి.విజయకుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, రైతు సాధికార సంస్థ -
హైటెక్ వ్యవసాయం..మేము సైతం అంటున్న విద్యాధికులు
‘తాతా... నాకు వ్యవసాయం నేర్పుతావా?’ – మహర్షి సినిమాలో రుషి పాత్రధారి మహేష్‌బాబు ప్రశ్న ‘ఒకరు నేర్పేదేంటి బాబూ...? ఈ నేలపైన కాలు పెడితే ఆ భూమి తల్లే నిన్ను లాగేసుకుంటది’ – ఓ తాత సమాధానం నాడు వ్యవసాయం దండగని పాలకులు చిన్నచూపు చూస్తే నేడు పండుగలా మార్చి అన్నదాతకు అండగా నిలుస్తోంది ప్రభుత్వం. రైతన్నలకు మేలు చేయడంతోపాటు ఆరోగ్యకరమైన సమాజం దిశగా చర్యలు చేపట్టింది. పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు, బయో పెస్టిసైడ్స్ వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. రైతులకు అవగాహన కలిగించేందుకు రాష్ట్ర స్థాయిలో రైతు సాధికారత సంస్థ పర్యవేక్షిస్తుండగా జిల్లాల్లో డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు మేనేజర్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు పనిచేస్తోంది. ఇందులో నేచురల్ ఫార్మింగ్ అసోసియేట్స్ (ఎన్ఎఫ్ఏ) మాస్టర్ ట్రైనర్స్, యూనిట్ ఇన్చార్జిలు, గ్రామ స్థాయిలో ఇంటర్నల్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు (ఐసీఆర్సీ) పని చేస్తున్నారు. ఒక్కో ఐసీఆర్సీ 50–100 మంది రైతులను గుర్తించి ప్రకృతి వ్యవసాయంలో శిక్షణ ఇవ్వడమే కాకుండా దగ్గరుండి సహకారం అందిస్తోంది. ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని ఏర్పాటు చేసి దేశీ విత్తనాలు, 40 శాతం సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లను సమకూరుస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులకు ప్రభుత్వం మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తోంది. ప్రభుత్వం అందిస్తోన్న ప్రోత్సాహంతో రైతులతో పాటు ఉద్యోగులు సైతం సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. తగ్గిన పురుగుమందుల వినియోగం.. 2020–21 ఖరీఫ్ (1,388.48 మెట్రిక్ టన్నులు)తో పోలిస్తే 2021–22 (1,018 మెట్రిక్ టన్నులు) ఖరీఫ్‌లో పురుగు మందుల వినియోగం 370.48 మెట్రిక్ టన్నులు తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం పంటల విధానంలో మార్పు, సమగ్ర తెగుళ్ల నిర్వహణ పద్ధతులు, బయో పెస్టిసైడ్ల వాడకం, సేంద్రియ వ్యవసాయం తదితర విధానాలను ప్రోత్సహించటం దీనికి కారణం. 2014–15లో 4,050 మెట్రిక్ టన్నుల పురుగు మందులు వినియోగించగా 2020–21 నాటికి 2,342.86 మెట్రిక్ టన్నులకు తగ్గడం గమనార్హం. ప్రత్యేక యూనివర్సిటీ.. ప్రకృతి వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు చేపట్టే పరిశోధనలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పులివెందుల ఐజీ కార్ల్ ప్రాంగణంలో ఇండో–జర్మన్ ప్రపంచ వ్యవసాయ విజ్ఞాన పరిశోధన–శిక్షణా అకాడమీ (ఐజీజీఏఏఆర్‌ఎల్)ని ఏర్పాటు చేస్తోంది. ఈ యూనివర్సిటీకి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జూలై 7వ తేదీన శంకుస్థాపన చేశారు. జర్మనీ గ్రాంట్‌తో రూ.222 కోట్ల వ్యయంతో యూనివర్సిటీని రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పుతోంది. -బీవీ రాఘవరెడ్డి టెక్కీ.. హైటెక్ వ్యవసాయం గుంటూరుకు చెందిన బీటెక్ గ్రాడ్యుయేట్ మెండా నిశ్చల్కుమార్ లండన్‌లో ఉన్నత విద్య చదివాడు. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్‌గా కొన్నేళ్లు పనిచేశాడు. ఆయన తండ్రి డాక్టర్ ఫణికుమార్ గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో కంటి విభాగం హెచ్వోడీగా పదవీ విరమణ చేయగా తల్లి కె.విజయకుమారి గుంటూరు మెడికల్ కళాశాలలో బయోకెమిస్ట్రీ విభాగం హెచ్వోడీగా ఉన్నారు. ఉద్యోగంతో సంతృప్తి చెందని నిశ్చల్ స్వదేశానికి తిరిగి వచ్చి నరసరావుపేటకు సమీపంలోని కోటప్పకొండకు 8 కి.మీ. దూరంలో ‘ఎన్సీ ఎకోఫారమ్స్’ ఏర్పాటు చేశారు. ఇక్కడ 60 ఎకరాల్లో 11 రకాల పంటలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. గొర్రెలు, ముర్రా గేదెలు, గిరి, సహివాల్, ఒంగోలు జాతి ఆవులను పోషిస్తున్నారు. నాటు, గిరిరాజ, అశీక క్రాస్, గిన్నె, టర్కీ కోళ్లను పెంచుతున్నారు. అమెరికాలో ఉద్యోగం.. స్వగ్రామంలో సేద్యం అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తువ్వదొడ్డి గ్రామానికి చెందిన మధు కేశవరెడ్డి ఏటా రెండు నెలలు గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేస్తున్నాడు. ఆయన సోదరులు మద్దిలేటిరెడ్డి, మహేశ్వరరెడ్డి సహకారంతో 40 ఎకరాల్లో దానిమ్మ, 25 ఎకరాల్లో మామిడి తోటల పెంపకం చేపట్టారు. ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తల సలహాలు తీసుకుంటూ అమెరికా నుంచే వీడియో కాల్ ద్వారా సోదరులకు సాగులో మెళకువలు సూచిస్తున్నారు. సేంద్రియ పద్ధతుల్లో తోటలు సాగు చేసేందుకు పది ఆవులను ప్రత్యేకంగా పెంచుతున్నారు. గ్రామంలో రైతులకు సైతం సూచనలు అందిస్తూ ప్రకృతి వ్యవసాయంలో పాలు పంచుకుంటున్నారు. ఉద్యోగాన్ని వీడి.. వైఎస్సార్ జిల్లా చెన్నూరు మండలం ఉప్పరపల్లె గ్రామానికి చెందిన గాజులపల్లి జగన్మోహన్రెడ్డి మహీంద్ర అండ్ మహీంద్ర డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పని చేశారు. ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తితో ఉద్యోగాన్ని వదిలేసి 16 ఎకరాల్లో పండ్ల తోటలు, మరో 10 ఎకరాల్లో దేశీయ వరి పంట సాగు చేస్తున్నారు. ప్రభుత్వ సహకారం, అధికారుల సూచనలతో ఇబ్బందులను అధిగమిస్తున్నట్లు ఆయన తెలిపారు. (చదవండి: గుంటూరు నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు) -
సహజ సేద్యం.. భలే లాభం
సాక్షి, అమరావతి: సహజ సేద్యంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఇటీవల వెల్లడించిన నీతి ఆయోగ్ రాష్ట్రంలో ఆ తరహా సేద్యం చేస్తున్న రైతుల అభిప్రాయాలను సేకరించింది. సంప్రదాయ సాగు పద్ధతుల్లో కన్నా సహజ సేద్యంవల్ల రైతులకు అధిక లాభాలు వస్తున్నాయని, ఇదే సమయంలో వారికి పెట్టుబడి వ్యయం కూడా తగ్గుతోందని తెలిపింది. అయితే.. మొదట్లో ఒకట్రెండేళ్లు దిగుబడి తక్కువ వచ్చినప్పటికీ ఆ తర్వాత నుంచి దిగుబడులు పెరుగుతున్నాయన్న అభిప్రాయం రైతుల్లో నెలకొంది. ఈ విషయాన్ని రైతుల మాటల్లో నీతి ఆయోగ్ గమనించింది కూడా. అలాగే, రసాయన ఎరువులకు బదులు సాంకేతిక సహజ ఇన్పుట్స్ వినియోగంతో ఆరోగ్య సమస్యలు తలెత్తకపోగా పర్యావరణ హితానికీ దోహదపడుతోందని వెల్లడించింది. సంప్రదాయ సాగు విధానంలో ఎకరా విస్తీర్ణంలో వరి సాగుచేస్తే సగటున రసాయన ఎరువుల ఇన్పుట్స్ వ్యయం రూ.5,961 అవుతోందని.. అదే సహజ సేద్యంలో కేవలం రూ.846 మాత్రమే అవుతోందని నీతి ఆయోగ్ పేర్కొంది. మరోవైపు.. సహజ సేద్యాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు వివిధ రాష్ట్రాల్లో ఈ విధానాన్ని అనుసరిస్తున్న రైతుల అనుభవాలను నీతి ఆయోగ్ క్రోడీకరించి విస్త్రృత ప్రచారం కల్పిస్తోంది. ‘సహజం’తో దిగుబడి.. ధర అధికం ఇక సంప్రదాయ సాగుతో పోలిస్తే సహజ సేద్యం పద్ధతుల్లో పెట్టుబడి వ్యయం బాగా తగ్గుతుందని నారాయణమూర్తి ‘సాక్షి’కి చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ► సహజ సేద్యంలో కొంత ఎక్కువ శ్రమచేయాల్సి ఉంటుంది. ► ఆవు మూత్రంతో పాటు బెల్లం, పప్పుల పిండి, పుట్ట మన్ను, అవు పేడతో ఎరువు చేస్తా. ► పురుగు చేరకుండా వేప, జిల్లేడు, తదితర ఐదు రకాల ఆకులతో కాషాయం తయారుచేసి ప్రతీ 15 రోజులకోసారి పిచకారి చేస్తా. ► దీనికి కొంత శ్రమ తప్ప ఖర్చు పెద్దగా కాదు. ► సహజ సేద్యం ద్వారా దిగుబడి పెరగడంతో పాటు పంటకు ఎక్కువ ధర వస్తోంది. ఈ విధానం ద్వారా పండించిన 75 కేజీల ధాన్యం బస్తా రూ.2,000 పలుకుతోంది. ► సహజ సేద్యం ఉత్పత్తులకు సర్టిఫికేషన్ ఇస్తే మరింత లాభాలు వస్తాయి. ► అలాగే, పొలంలో వానపాముల సంఖ్య పెరిగింది. ► నీటిని నిలుపుకునే సామర్థ్యం పెరగడంతో నేల మెత్తగా మారింది. ► ఇదే పొలంలో నువ్వులు, పిల్లిపెసర, మినుములు, జనుము కూడా సాగుచేస్తున్నా. ► రసాయనాల వినియోగాన్ని తగ్గించేందుకు పరిసరాల్లోని రైతులను కూడా సహజ సేద్యం వైపు ప్రోత్సహిస్తున్నా. మరోవైపు.. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం, నాగమంగళం గ్రామానికి చెందిన ఎ. వెంకట సుగుణమ్మ సహజ సేద్యం పద్ధతుల్లో 0.4 హెక్టార్లలో వరి పండిస్తోంది. దీనివల్ల సాగు ఖర్చు తగ్గిందని, రసాయన రహిత ఆహారం లభిస్తోందని ఆమె పేర్కొంటోంది. తెగుళ్లు, వ్యాధులు సోకడం తగ్గిందని, పొలంలో వానపాముల సంఖ్య పెరగడంవల్ల భూసారం పెరిగినట్లు ఆమె తెలిపింది. విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం పి. కొత్తగూడెం గ్రామానికి చెందిన ఎ. నారాయణమూర్తి సహజ సేద్యంచేస్తూ సంప్రదాయ సాగు విధానాల కన్నా ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ విధానంలో ఆయన ఒక హెక్టార్లో వరి పండిస్తున్నారు. దీంతో సంప్రదాయ సాగు విధానంలో కన్నా హెక్టార్‌కు అదనంగా రూ. 30,520 లాభం వస్తోంది. రసాయన ఎరువులు, పురుగు మందులకు బదులు సహజ జీవామృతం, ఘన జీవామృతం, ద్రవ జీవామృతం వంటి అన్ని సహజ వ్యవసాయ పద్ధతులను అనుసరించారు. ప్రతి 15 రోజులకోసారి ద్రవ జీవామృతాన్ని పిచికారీ చేశారు. ఫలితంగా.. సంప్రదాయ వరి సాగుకన్నా సహజ సేద్యంతో హెక్టార్‌కు 16.05 క్వింటాళ్ల ధాన్యం అధిక దిగుబడి వచ్చింది. -
‘ప్రకృతి’ సాగుకు జైకొడదాం
సాక్షి, అమరావతి: ప్రకృతి వ్యవసాయ విధానాల వైపు మళ్లిన రైతన్నను దేశానికి గొప్ప సేవకుడిగా భావించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. సేంద్రీయ సేద్యంపై రైతులను ప్రోత్సహిస్తూ ఒక విధానాన్ని తేవాలని నీతి ఆయోగ్‌ను కోరారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల వల్ల రసాయన ఎరువుల సబ్సిడీ భారం తగ్గుతుందన్నారు. ఇలాంటి విధానాలను అనుసరించే అన్నదాతలకు రివార్డులు అందచేసే విధానం తేవాలని సూచించారు. సహజ, ప్రకృతి వ్యవసాయ విధానాలపై నీతి ఆయోగ్ సోమవారం ఢిల్లీ నుంచి నిర్వహించిన వర్చువల్ సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ముఖ్యమంత్రి స్పెషల్ సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్ హరికిరణ్ తదితరులు సదస్సులో పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయంపై జాతీయ స్థాయిలో దృష్టి పెట్టాల్సిన పలు కీలక అంశాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తావించారు. ఆ వివరాలివీ.. ఆర్థిక సంఘం సిఫార్సుల్లో వెయిటేజీ ప్రకృతి వ్యవసాయంపై నీతి ఆయోగ్ జాతీయ స్థాయి సదస్సు నిర్వహించడం ప్రశంసనీయం. హరిత విప్లవం వల్ల వ్యవసాయ రంగంలో భారీ దిగుబడులు సాధించాం. రసాయన ఎరువులు, విషపూరిత పురుగు మందులపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజానికి నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను అందించాలి. పెద్ద మొత్తం విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తున్న రాష్ట్రాలకు ఆర్థిక సంఘం సిఫార్సుల్లో వెయిటేజీ ఇవ్వాలి. కర్బన ఉద్గారాలు, వాతావరణ మార్పుల నివారణ లక్ష్యాలను చేరుకోవడంలో ఈ రాష్ట్రాలు దేశానికి సహాయకారిగా నిలుస్తున్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ప్రకృతి, సేంద్రీయ వ్యవసాయ ధృవీకరణ పద్ధతులు స్నేహపూర్వకంగా ఉండాలి. ప్రతి రైతుకు అందుబాటులో ఉండాలి. 90 శాతం నిధులివ్వాలి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లే రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో కేంద్రం ఉదారంగా వ్యవహరించాలి. నిధుల కేటాయింపులో భిన్నమైన విధానాలు ఉండాలి. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు ప్రస్తుతం 60 శాతం నిధులిస్తుండగా భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని ప్రకృతి సేద్యాన్ని అనుసరించే రాష్ట్రాలకు 90 శాతం నిధులివ్వాలి. ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించే ఖర్చుతో పోలిస్తే రసాయన ఎరువుల సబ్సిడీ కోసం వెచ్చించే ఖర్చు చాలా ఎక్కువ. వ్యవసాయ వర్శిటీల్లో పాఠ్యాంశాలు ప్రకృతి సాగు విధానాలపై వ్యవసాయ యూనివర్సిటీ కోర్సుల్లో పాఠ్యాంశాలను పొందుపరచి వ్యవస్థీకృత పరిశోధనలు కొనసాగాలి. సహజ ఉత్పత్తులు, రసాయనాల ద్వారా పండించిన పంటల మధ్య వ్యత్యాసం, ఆరోగ్యంపై ప్రభావాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి. రసాయన ఉత్పత్తులను విడనాడాలి రసాయన ఎరువులు, పురుగు మందుల ప్రభావం ఉన్న ఆహారాన్ని ఉత్పత్తులను విడనాడి ప్రజలందరికీ ఆహార భద్రత, పౌష్టికాహారాన్ని అందించాలి. ప్రకృతి వ్యవసాయ విధానాల్లో నేల పునరుత్పత్తి ప్రక్రియ అన్నిటికంటే ముఖ్యం. నీటి పరిరక్షణ, పర్యావరణ హితం మనం లక్ష్యం కావాలి. భవిష్యత్తు తరాలకు కూడా ఆరోగ్యకరమైన జీవితం, చక్కటి జీవనోపాధి అందించేలా ‘సతత హరిత విప్లవం’ (ఎవర్గ్రీన్ రివల్యూషన్) దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. సమున్నత లక్ష్యాలు 2021–22లో ఆంధ్రప్రదేశ్‌లో 6.3 లక్షల మంది రైతులు 2.9 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించారు. 3,009 రైతు భరోసా కేంద్రాల పరిధిలో ఈ కార్యక్రమం అమలవుతోంది. రాష్ట్రంలోని సాగు భూమిలో దాదాపు 5 శాతం విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం జరుగుతోంది. రైతులు తాము సాగు చేస్తున్న భూమిలో ఇప్పటికిప్పుడే రసాయన ఎరువులు, పురుగు మందులను పూర్తిగా వదిలేయమని చెప్పడం లేదు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి క్రమంగా, సజావుగా ప్రకృతి వ్యవసాయం దిశగా మళ్లేగా ప్రభుత్వం సహకారం అందిస్తోంది. పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానాలను అమలు చేసేందుకు రైతుకు కనీసం 3 నుంచి 5 ఏళ్లు పడుతుంది కాబట్టి సుస్థిర విధానాల ద్వారా జీవనోపాధి మెరుగుపరిచేలా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఇష్టపూర్వకంగా... స్వచ్ఛందంగా రసాయన ఎరువులు, పురుగు మందులతో గత 30–50 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న రైతన్నలు వాటిని విడనాడి పూర్తిగా ప్రకృతి పద్ధతుల్లో సేద్యం చేయడం అంత సులభమైన పనికాదు. ఇప్పటికిప్పుడు అలా చేయాలని కూడా మనం కోరలేం. కానీ ప్రకృతి సాగు విధానాల వైపు మళ్లడం అత్యంత ఆవశక్యం. సాంకేతిక సంస్థలు, శాస్త్రవేత్తల సహకారంతో దశలవారీగా అడుగులు వేయాలి. ఈ ప్రక్రియ మొత్తం ఇష్టపూర్వకంగా, స్వచ్ఛందంగా జరగాలి. ప్రకృతి సాగుకు జర్మనీ సహకారం మన రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని భారీ ఎత్తున చేపట్టేందుకు, ప్రకృతి సాగు విధానాలను మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం నిధులు ఇచ్చేందుకు జర్మనీ ముందుకు వచ్చిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నా. ఈ ప్రాజెక్టుకు అనుమతులు చివరి దశలో ఉన్నాయి. ఐదేళ్లలో 20 మిలియన్ యూరోల ఆర్థిక సాయం అందించేందుకు జర్మనీ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ నిధులతో ఇండో–జర్మనీ గ్లోబల్ అకాడమీ ఆన్ ఆగ్రో ఇకాలజీ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ (ఐజీజీఏఏఆర్‌ఎల్) సంస్థను ఏపీలో ఏర్పాటు చేయనుంది. ప్రకృతి వ్యవసాయంలో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అనుసరించేలా ఐజీజీఏఏఆర్‌ఎల్ కృషి చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దీని కోసం భూములు, భవనాలను సమకూరుస్తుంది. మా ప్రయత్నాలకు సహకరిస్తున్నందుకు నీతిఆయోగ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎఫ్ఏఓ, యు.ఎన్.ఇ.పి, ఐసీఆర్‌ఏఎఫ్, యూనివర్శిటీ ఆఫ్ రీడింగ్, యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్‌బరో, సీఐఆర్‌ఏడీ (ఫ్రాన్స్), జీఐజెడ్, కె ఎఫ్ డబ్ల్యూ లాంటి అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం, ఆర్బీకేల స్థాయిలో ఉత్పత్తులకు సర్టిఫికేషన్ ప్రకృతి వ్యవసాయాన్ని నిర్మాణాత్మంగా విస్తరించడంలో ఎంతో కీలకం. మూడేళ్లుగా సానుకూలత గత మూడేళ్లుగా ప్రకృతి వ్యవసాయంపై రాష్ట్రంలో చాలా సానుకూల పరిస్థితి ఉందని వెల్లడవుతోంది. పెట్టుబడి ఖర్చులు గణనీయంగా తగ్గుతున్నాయి. ప్రస్తుత సగటు దిగుబడులతో సమానంగా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు కూడా ఉంటున్నాయి. వరదలు, కరువు, చీడపీడలను సమర్థంగా తట్టుకుంటున్నట్లు స్వతంత్ర పరిశోధనల ద్వారా వెల్లడవుతోంది. జీవ వైవిధ్యంతోపాటు మంచి పౌష్టికాహారం లభిస్తోందని, ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. – సీఎం జగన్ ఆర్బీకేలు.. అద్భుతం ఆంధ్రప్రదేశ్‌లో రైతు భరోసా కేంద్రాల సేవలు బాగున్నాయి. వాటి పనితీరును స్వయంగా పరిశీలించి చెబుతున్నాను. ప్రకృతి వ్యవసాయ విధానాలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఆచరణలోకి తెచ్చింది. సీఎం జగన్ అద్భుతమైన చర్యలు తీసుకున్నారు. – డాక్టర్ రాజీవ్ కుమార్,నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ -
కలిసి 'సాగు'దాం
రైతు భరోసా కేంద్రం... ఓ విప్లవం. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు.. వేటికీ ఊరు దాటివెళ్లాల్సిన పనిలేకుండా... ఆఖరికి పంట విక్రయానికి కూడా అక్కరకొచ్చేలా ఊళ్లో వెలసిన సేద్యాలయం. రైతాంగం స్థితిగతుల్ని సమూలంగా మార్చే శక్తి కలిగిన ఈ ఆర్బీకే.. యావత్తు దేశానికీ ఓ రోల్‌మోడల్. దీనికి అనుబంధంగా రైతులకు పనిముట్లు అందించేందుకు ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు... తదుపరి అడుగుగా సేంద్రియ సేద్యాన్ని ప్రోత్సహిస్తూ తీసుకున్న నిర్ణయాలు... ఇవన్నీ ఇప్పుడు యావద్దేశాన్నీ ఆకర్షిస్తున్నాయి. పలు రాష్ట్రాలు ఇప్పటికే ఏపీకి వచ్చి వెళ్లాయి. ఏపీ మాదిరి సేంద్రియ సాగుకు ఇప్పటికే ఒడిశా, మధ్యప్రదేశ్, రాజస్తాన్ సిద్ధంకాగా... మరో ఏడు రాష్ట్రాలు ఇదే బాటలో నడవనున్నాయి. దీనిపై ఏపీతో కలసి పనిచేసేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ త్వరలోనే ఒప్పందం చేసుకుంటోంది కూడా!!. ఇక వైఎస్సార్ యంత్ర సేవా పథకం ద్వారా అద్దె ప్రాతిపదికన రైతన్నలకు వ్యవసాయ ఉపకరణాలను అందిస్తున్న కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు దేశవ్యాప్తంగా ప్రత్యక్షం కానున్నాయి. ఇదే తరహాలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు అద్దెకు యంత్రాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేయాలని కేంద్రం భావిస్తోంది. ఇవన్నీ ఒకెత్తయితే... వైఎస్ జగన్ ఏపీలో ఆరంభించినట్లే తామూ ఈ ఏడాది 600 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తామని శుక్రవారం అసెంబ్లీ ముఖంగా తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ ప్రకటించటం మరో ఎత్తు. ఏపీలో విమర్శలు మాత్రమే తెలిసిన విపక్షాలకు ఇవన్నీ అర్థం కాకున్నా... యావత్తు దేశమూ బాగానే అర్థం చేసుకుంటోంది.!! ప్రతి ఆదివారం... ప్రత్యేకం ‘నిన్నటికంటే నేడు బాగుండటం... రేపు మరింత బాగుంటామనే ఆశ కల్పించటం’ ఇదే అభివృద్ధికి నిర్వచనమంటూ విద్య, వ్యవసాయ, ఆరోగ్య రంగాలను అత్యంత ప్రాధాన్య రంగాలుగా చేసుకుని... సమూల సంస్కరణలతో ముందుకెళుతున్న ఏపీ ఇపుడు పలు రాష్ట్రాలకు రోల్‌మోడల్‌గా నిలుస్తోంది. సచివాలయాల నుంచి మొదలుపెడితే... సంచార పశువైద్య శాలలు, సేంద్రియ సాగు విధానాలు, కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు, రెండు భాషల్లో పాఠ్యపుస్తకాలు, రేషన్ డోర్ డెలివరీ, సరికొత్త ఆక్వా కల్చర్ చట్టం, ఆర్బీకేలు, విద్యాసంస్థలు– ఆసుపత్రుల రూపురేఖలు మార్చేసిన నాడు–నేడు... ఇవన్నీ పలు రాష్ట్రాల్లో అమల్లోకి రాబోతున్నాయి. పొరుగునున్న తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల అధికారులు వచ్చి వీటిని అధ్యయనం చేసి వెళుతున్నారు. కొన్నింటిని ఏకంగా కేంద్రమే దేశవ్యాప్తంగా తేవాలనుకుంటోంది. ఆ వివరాలతో... ప్రతి ఆదివారం ప్రత్యేకంగా ఇస్తున్న కథనాల్లో రెండవ కథనమిది. నెల్లూరు జిల్లా అల్లూరు ఆర్బీకే సీహెచ్‌సీలో రైతు కమిటీకి ఇచ్చిన యంత్ర పరికరాలు ఏపీలో అద్భుత ఫలితాలు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి సాగు అమలవుతున్న తీరును పరిశీలించాం. అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. ఇదే తరహాలో ఎరువులు, రసాయన పురుగు మందులను వినియోగించకుండా సహజసిద్ధ ఆహార ఉత్పత్తులను పండించేలా రైతులను ప్రోత్సహిస్తాం. ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పనిచేసేలా మధ్యప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఎంవోయూ కుదుర్చుకోనుంది. ఖరీఫ్ నుంచి దశలవారీగా ప్రకృతి సాగును ప్రోత్సహిస్తాం. ఇందుకు అవసరమైన క్షేత్ర స్థాయి వ్యవస్థ ఏర్పాటులో ఏపీ రైతు సాధికారసంస్థ క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. సిబ్బందితో పాటు రైతులకు కూడా శిక్షణ ఇవ్వనుంది. – భగవాన్‌దాస్ బైసర్, జిల్లా ప్రాజెక్టు మేనేజర్, మాండ్లా జిల్లా, మధ్యప్రదేశ్ మనవైపు దేశం చూపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోత్సాహం వల్ల ప్రకృతి సాగులో అద్భుత ఫలితాలు నమోదవుతున్నాయి. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ త్వరలో ఎంఓయూ చేసుకోనుంది. రాష్ట్రంలో ప్రకృతి సాగును పలు రాష్ట్రాలు అధ్యయనం చేశాయి. ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అమలు దశకు చేరుకోగా మరో ఏడు రాష్ట్రాలు చర్చల దశలో ఉన్నాయి. – టి.విజయకుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, ఏపీ రైతు సాధికార సంస్థ మోడల్.. మోడర్న్ సాగుబాట వ్యవసాయ రంగానికి నూతన జవసత్వాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, వినూత్న విధానాలు జాతీయ స్థాయిలో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. దేశవ్యాప్తంగా వీటి అమలుకు కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. అద్దెకు గ్రామాల్లో యంత్ర పరికరాలు సన్న, చిన్నకారు రైతులకు అద్దె ప్రాతిపదికన యంత్ర పరికరాలను గ్రామ స్థాయిలో అందుబాటులోకి తేవాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం మేరకు ఆర్బీకేలకు అనుబంధంగా వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 2020లో శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రూ.1,615 కోట్లతో గ్రామ స్థాయిలో 10,750 సీహెచ్‌సీ (కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు), వరి సాగయ్యే జిల్లాల్లో రూ.404 కోట్లతో క్లస్టర్ స్థాయిలో 1,615 కంబైన్డ్ హార్వెస్టర్స్‌తో సీహెచ్‌సీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పథకం కింద ఆర్బీకే స్థాయిలో గరిష్టంగా రూ.15 లక్షలు, క్లస్టర్ స్థాయిలో రూ.25 లక్షల విలువైన యంత్రాలను సమకూరుస్తున్నారు. ఇప్పటికే రెండు విడతల్లో రూ.645 కోట్లతో 4,061 ఆర్బీకే స్థాయి సీహెచ్‌సీలు, రూ.161.50 కోట్లతో 142 క్లస్టర్ స్థాయి సీహెచ్‌సీలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఆర్బీకే స్థాయిలో మరో 4,105 సీహెచ్‌సీలతో పాటు 491 క్లస్టర్ స్థాయి సీహెచ్‌సీలను త్వరలో ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఇక మిగిలిన సీహెచ్‌సీలను జూన్ కల్లా గ్రౌండింగ్ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. సీహెచ్‌సీల ఏర్పాటుతో విత్తనం నుంచి నూర్పిడి వరకు అన్నదాతలు ఎదుర్కొంటున్న కూలీల కొరతకు ప్రభుత్వం చెక్ పెట్టగలిగింది. పెట్టుబడి వ్యయం గణనీయంగా తగ్గుతోంది. ట్రాక్టర్లు కూడా.. ఆర్బీకేల స్థాయిలోనే ట్రాక్టర్లను కూడా అద్దె ప్రాతిపదికన రైతులకు అందుబాటులోకి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తొలి విడతగా 3,500 ట్రాక్టర్లను మే నెలలో రైతు కమిటీలకు అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏపీ తరహాలో అండగా నిలిచేలా.. గ్రామాల్లో రైతు గ్రూపులకు యంత్ర పరికరాలను అందించి అద్దె ప్రాతిపదికన మిగిలిన అన్నదాతల అవసరాలను తీర్చేలా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ యంత్ర సేవా పథకం కేంద్ర ప్రభుత్వాన్ని ఆకర్షించింది. ఇదే రీతిలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల(ఎఫ్‌పీవో)కు అద్దె ప్రాతిపదికన యంత్రాలతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చాలని కేంద్రం భావిస్తోంది. వ్యవసాయ యాంత్రీకరణ పరిధి పెంచడం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరహాలో అండగా నిలవాలని నిర్ణయించింది. 2022–23 కేంద్ర బడ్జెట్లో ఈ మేరకు కేటాయింపులు కూడా చేశారు. యాంత్రీకరణ దిశగా శిక్షణ.. జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున కస్టమ్ హైరింగ్ సెంటర్లను ప్రోత్సహించడం, హై ప్రొడక్టివ్ ఫామ్ మిషనరీ అందుబాటులోకి తేవడం ద్వారా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తొలగించాలని కేంద్రం భావిస్తోంది. 40–50 శాతం రాయితీని కొనసాగిస్తూ బ్యాంకుల ద్వారా ఆర్ధిక చేయూతనందించేలా కేంద్ర వ్యవసాయశాఖ చర్యలు చేపట్టింది. వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించే లక్ష్యంతో రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం సహకారంతో డిమాండ్ ఉన్న ఆర్బీకేల్లో అదనంగా రెండో సీహెచ్‌సీ ఏర్పాటుతోపాటు రైతులకు వ్యక్తిగతంగా యంత్ర పరికరాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. రూ.15 లక్షల అంచనా వ్యయంతో 40 శాతం సబ్సిడీపై వీటిని నెలకొల్పనున్నారు. ‘ప్రకృతి’లో ఆదర్శం ప్రకృతి సాగు విధానాలలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పని చేసేందుకు కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ త్వరలో ఎంవోయూ చేసుకోనుంది. సేంద్రియ సేద్యంపై యూనివర్సిటీల్లో ప్రత్యేక కోర్సులను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏపీని ఆదర్శంగా తీసుకొని ప్రకృతి సాగును ప్రోత్సహించేందుకు పలు రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ తరహాలో వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి ప్రకృతి సాగును ప్రోత్సహించేందుకు మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ ప్రభుత్వాలు కార్యాచరణ సిద్ధం చేయగా కేరళ, తమిళనాడు, మేఘాలయ, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, బిహార్ మన రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పని చేసేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. ఇప్పటికే మన రాష్ట్రంతో ఒడిశా ప్రభుత్వం ఎంవోయూ చేసుకోగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఈ నెలాఖరులో ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. రాష్ట్రంలో ప్రకృతి సాగు ఇలా.. రాష్ట్రంలో జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్ కింద రూపుదిద్దుకున్న ప్రకృతి వ్యవసాయం ప్రస్తుతం ఏపీ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ (ఏపీసీఎన్ఎఫ్)గా అమలవుతోంది. గత ఖరీఫ్‌లో 3,730 గ్రామాల్లో 5.92 లక్షల మంది రైతులు 6.71 లక్షల ఎకరాల్లో దీన్ని అనుసరించారు. ప్రస్తుత రబీలో 71 వేల మంది రైతులు 76 వేల ఎకరాల్లో ప్రకృతి సాగు చేశారు. మధ్యప్రదేశ్‌లో వంద గ్రామాల్లో.. మధ్యప్రదేశ్ మాండ్లా జిల్లాలో 4 బ్లాకుల (మండలాలు) పరిధిలో సహజ వ్యవసాయ పరివర్తన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. తొలుత బిచియా బ్లాకులోని 3 క్లస్టర్స్, నివాస్ బ్లాకులోని ఓ క్లస్టర్‌ను ఇందుకు ఎంపిక చేసి వంద గ్రామాల్లో అమలు చేస్తున్నారు. 18,750 ఎకరాల్లో 15 వేల మందికిపైగా గిరిజన రైతులు దీని ద్వారా లబ్ధి పొందనున్నారు. ఈ ప్రాజెక్టుకు ఏపీ రైతు సాధికార సంస్థ టెక్నికల్ ఏజెన్సీగా, వాసన్ సంస్థ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్నాయి. ఇక్కడ ఎక్కువగా వరి, ఉల్లి, కందులు, శనగలు (చనా), అరికెలు (కోడా), సామలు (కుట్కి), కూరగాయలు సాగవుతాయి. గ్రామ స్థాయిలో సీఆర్పీ వ్యవస్థ ప్రకృతిసాగు అమలు కోసం మధ్యప్రదేశ్‌లో సీఆర్పీ (కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్) వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. గ్రామానికి ఇద్దరు చొప్పున కనీసం 200 మందిని సిద్ధం చేస్తారు. సీఆర్పీలతో పాటు క్లస్టర్, బ్లాకు స్థాయిలో సమన్వయం కోసం ఐసీఆర్పీ(ఇంటర్నల్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్)తో పాటు ఎఫ్ఈఎస్ (ఫౌండేషన్ ఫర్ ఎకోలాజికల్ సెక్యూరిటీ), ఎంపీఎస్ ఆర్ఎల్ఎం (మధ్యప్రదేశ్ స్టేట్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్)కు చెందిన సీబీఓ(కమ్యూనిటీ బేస్ట్ ఆర్గనైజషన్) సభ్యులకు సహజ వ్యవసాయ నమూనాలు, ప్రోటోకాల్‌పై ప్రత్యేక శిక్షణనిస్తారు. ఎంపిక చేసిన 8 గ్రామ పంచాయతీల్లో డెమాన్‌స్ట్రేషన్ ప్లాట్‌ఫామ్‌లను అభివృద్ధి చేస్తారు. ఆయా గ్రామాల్లో ఇన్పుట్ కమ్ అవుట్‌లెట్స్‌ను ఏర్పాటు చేస్తారు. ఘన జీవామృతాలు, కషాయాల తయారీ విధానంతో పాటు వినియోగంపై రైతులకు శిక్షణనిస్తారు. రెండు రౌండ్లలో 45 రోజుల పాటు మరో రెండు రౌండ్లలో 30 రోజుల పాటు శిక్షణ కొనసాగనుంది. -
అంతర పంటలతో తామరపురుగు విజృంభనకు చెక్ పెట్టండిలా..!
అధిక వర్షాలు, మబ్బులతో కూడిన వాతావరణ పరిస్థితులు తామర పురుగు విజృంభించడానికి దోహదపడ్డాయి. రసాయనిక వ్యవసాయం చేసే రైతులు మిర్చి పంట కాలంలో ఎకరానికి 25–30 నుంచి బస్తాల రసాయనిక ఎరువులు వాడుతున్నారు. ఇప్పటికే 12–13 బస్తాల చొప్పున వాడి ఉంటారు. మార్చి వరకు దఫదఫాలుగా ఈ ఎరువులు వేస్తూ.. తరచూ పురుగుమందులు పిచికారీ చేస్తూ ఉంటారు. అధిక రసాయనాలతో మిర్చిని ఏకపంటగా సాగు చేయటం వల్లనే తామరపురుగు విజృంభించింది. విపరీతంగా రసాయనాలు గుప్పించి ఏటా మిరప సాగు చేసే భూముల్లో సేంద్రియ కర్బనం 0.3 – 0.4 మేరకు మాత్రమే మిగిలి ఉంటుంది. మొక్కలు రసాయనిక ఎరువుల వల్ల ఏపుగా పెరిగినా రోగనిరోధకశక్తి సన్నగిల్లిపోతున్నది. అందువల్లనే మిరప పంటకు ఇప్పుడు తామర పురుగులు ఆశిస్తున్నాయి. తామర పురుగులు ఆశించిన తోటల్లో పూత రాలుతున్నది. ఆకుల పైముడత వల్ల కొత్త పూత రావటం లేదు. అనేక రకాల రసాయనిక పురుగుమందులు కలిపి పిచికారీ చేయటం వల్ల సమస్య మరింత జటిలం అవుతున్నది. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో మిరపను సాగు చేసే రైతులు చీడపీడల నుంచి చాలా వరకు రక్షణ పొందుతున్నారు. అంతర పంటలు వేయటం.. జిగురు పూసిన పసుపు, నీలిరంగు అట్టలు పెద్ద ఎత్తున పెట్టుకోవటం.. ఘనజీవామృతం, జీవామృతంతోపాటు కషాయాలు, ద్రావణాలు వాడటం ద్వారా చీడపీడలను ఎదుర్కొనే శక్తి పంటలకు చేకూరుతున్నది. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడుతున్న రైతులు కూడా ఇప్పటికైనా వెంటనే మిరప తోటల్లో జిగురు అట్టలు పెట్టుకోవాలి. నీలిరంగు అట్టలు ఎకరానికి 5–10 పెట్టుకుంటే పురుగు తీవ్రత తెలుస్తుంది. ఇప్పుడు ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి ఎకరానికి 50 నుంచి 100 వరకు పెట్టుకుంటే పురుగును నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు. మిరప మొక్కల మధ్య ఏదో ఒక అంతర పంట ఉండేలా చూడాలి. అక్కడక్కడా బంతి మొక్కలు నాటుకోవాలి. మిరప మొక్కల మధ్య కొత్తిమీర, ఉల్లి, ముల్లంగి వంటి అంతర పంటల విత్తనాలు విత్తుకుంటే కొద్ది రోజుల్లోనే మొలకెత్తి చీడపీడల నియంత్రణలో ప్రభావాన్ని చూపుతాయి. వీటితోపాటు.. మిరప పొలం చుట్టూతా 3 వరుసలు సజ్జ, మొక్కజొన్న, జొన్న విత్తుకుంటే చీడపీడల నుంచి రక్షణ కల్పిస్తాయి. 4 రోజుల వ్యవధిలో 4 పిచికారీలు ►మిరప పంటపై తామరపురుగులను అరికట్టడానికి వేప నూనె లేదా వేప గింజల కషాయం, అగ్ని అస్త్రం, నల్లేరు కషాయంలను ఒకదాని తర్వాత మరొకటి 4 రోజుల వ్యవధిలో 4 పిచికారీలు చేస్తే పంటను రక్షించుకోవచ్చు. ►1,000–1,500 పిపిఎం వేపనూనె పనిచేయదు. 10,000 పిపిఎం వేప నూనె మార్కెట్లో దొరికితే వాడుకోవచ్చు. అర లీటరు వేపనూనెను ఎమల్సిఫయర్ లేదా 100 గ్రాముల సబ్బు పొడిని 200 లీ. నీటితో కలిపి పిచికారీ చేయాలి. ►10,000 పిపిఎం వేప నూనె దొరక్కపోతే.. 5% వేపగింజల కషాయాన్ని వెంటనే పిచికారీ చేస్తే పంటను రక్షించుకోవచ్చు. వేప నూనెను లేదా 5% వేప గింజల కషాయాన్ని 4 రోజుల వ్యవధిలో మరోసారి పిచికారీ చేయాలి. ►ఆ తర్వాత 4 రోజులకు అగ్ని అస్త్రం పిచికారీ చేయాలి. 100 లీ. నీటికి 4 లీ. అగ్ని అస్త్రం పిచికారీ చేయాలి. ఆ తర్వాత 4 రోజులకు నల్లేరు కషాయం పిచికారీ చేయాలి. మళ్లీ ఇదే వరుసలో వీటిని పిచికారీ చేయటం ద్వారా మిరప పంటను తామరపురుగుల నుంచే కాదు ఇతర చీడ పీడల నుంచి కూడా రక్షించుకోవచ్చని ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల అనుభవాలు తెలియజెబుతున్నాయి. తామర పురుగు రానీయను గత సంవత్సరం ఎకరంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మిరప సాగు చేశాను. మంచి ధర వచ్చింది. ఈ ఏడాది 1.6 ఎకరాలలో మిర్చి విత్తనాలను వెద పద్ధతిలో ట్రాక్టర్ సీడ్ డ్రిల్‌తో వేసుకొని ఖర్చులు తగ్గించుకున్నా. 70 రోజుల పంట. పూత వస్తోంది. వేపగింజల కషాయం, నీమాస్త్రం రెండేసి సార్లు పిచికారీ చేశా. బొబ్బర రాకుండా గానుగ నుంచి తెచ్చిన వేప నూనె పిచికారీ చేశా. ఇప్పటికైతే తామరపురుగులు కనిపించలేదు. రోజూ పొలాన్ని గమనిస్తూ ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతున్నా. తామరపురుగులను 90% రానీయను. – చింతా వరప్రసాద్ (91211 47705), కొప్పర్రు, పెదనందిపాడు మం., గుంటూరు జిల్లా జిగురు అట్టలు, కషాయాలతో ఉపయోగం 9 ఎకరాల్లో మిరప పంట సాగు చేస్తున్నా. ఇందులో 2.5 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. మిగతా పొలానికి రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడుతున్నా. పచ్చిమిర్చి – ఉల్లిపాయ కషాయం, వేపగింజల కషాయం పిచికారీ చేశాను. పసుపు జిగురు అట్టలు పెట్టాను. మిరప పువ్వుపై 10–15 తామరపురుగులు ఉండేవి. ఇప్పుడు వీటి సంఖ్య 4–5కు తగ్గింది. రసాయనిక ఎరువులు, పురుగుమందులు మాత్రమే వాడిన పొలం కన్నా.. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న పొలం పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. జిగురు అట్టలు, వేపగింజల కషాయం బాగా ఉపయోగపడ్డాయి. – బైకా వెంకటేశ్వరరెడ్డి (96667 13343), మానుకొండవారిపాలెం, చిలకలూరిపేట మం., గుంటూరు జిల్లా చదవండి: Health Benefits Of Saffron: కుంకుమ పువ్వు గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా? -
టీవీ చూడరు, మద్యం, మాంసం ముట్టరు.. ప్రత్యేక జీ‘వనం’
భవిష్యత్ తరాలకు ఆరోగ్యకర సమాజాన్ని అందించాలనే లక్ష్యంతో వారంతా సంఘటితమయ్యారు. యాంత్రిక జీవనాన్ని వీడి ప్రకృతి వైపు అడుగులు వేశారు. పలువురికి స్ఫూర్తి కలిగేలా ప్రత్యేక జీవనం గడుపుతున్నారు. ఉరుకులపరుగుల మనుషుల మధ్య కాకుండా ఆహ్లాదకర వాతావరణంలో నివాసముంటూ సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆదర్శంగా జీవిస్తున్నారు. వీరి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే బేతంచెర్ల పట్టణానికి కిలో మీటరు దూరంలో కొలుములపల్లె రహదారిలోని రాధాస్వామి నగరిని సందర్శించాల్సిందే. బేతంచెర్ల: ఆధునిక ప్రపంచంలో మనుషుల మధ్య దూరం పెరుగుతోంది. ఇరుగుపొరుగు అనేది కనుమరుగవుతోంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేదు.. అంతటా ఇదే పరిస్థితి. ఎవరి జీవితం వారిది అన్నట్లుగా మారుతోంది. ఆత్మీయతలు, ఆప్యాయతలు మసకబారుతున్నాయి. బేతంచెర్లలోని రాధాస్వామి నగరి ప్రజలు వీటికి అతీతం. అందరిదీ ఒకే మాట. ఒకే బాట. వేర్వేరు వృత్తుల్లో కొనసాగుతున్నా.. పర్యావరణ రక్షణ, ఆరోగ్య సంరక్షణకు రాధాస్వామి ధార్మిక సంస్థ వైపు అడుగులు వేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా పట్టణానికి చెందిన ఈ సంస్థ ప్రస్తుతం 8వ గురువు పరమ గురువు ప్రేమ్‌శరన్ సత్సంగి సాహెబ్ వారి ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఇప్పటికే పలు కాలనీలు, విద్యాసంస్థలు, పరిశ్రమలు, సేవా సంస్థలు, ఆసుపత్రులు అనుబంధంగా కొనసాగుతున్నాయి. చిరు తిండ్లను తయారు చేస్తున్న మహిళలు ఈ క్రమంలో బేతంచెర్ల పట్టణానికి చెందిన ప్రేమ స్వరూప్ అధ్యక్షతన 14 కుటుంబాలు ప్రత్యేక జీవనం అలవర్చుకున్నాయి. వీరికి స్ఫూర్తిగా రామళ్లకోట, కొలుములపల్లె, ముద్దవరం ప్రాంతాల్లో మరో 20 కుటుంబాలు వీరి బాటలో పయనిస్తున్నాయి. కర్నూలు నగరంలో కూడా దాదాపు 300 కుటుంబాలు ఉన్నాయి. ఈ ధార్మిక సంస్థలో సభ్యులుగా ఉన్నవారంతా గురువు ఆదేశాల ప్రకారం కొన్ని నియమాలు తప్పక పాటిస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగించే ఏసీలు వినియోగించడం లేదు. వ్యవసాయంలో రసాయన, పురుగు మందులకు దూరంగా ఉంటున్నారు. అలాగే మద్యం, మాంసం తీసుకోవడం లేదు. ఉదయం వ్యాయామం తప్పక చేస్తున్నారు. ఏ ఇంట్లో కూడా టీవీలు కనిపించవు. ప్రతి ఒక్కరూ తెల్లవారు జామున 3.30 గంటల నుంచి ప్రార్థన, సత్సంగంతో వారి దిన చర్య ప్రారంభమవుతోంది. కష్టపడి పనిచేస్తూ జీవన విధానం కొనసాగిస్తూ, సేవా మార్గంలో నడవాలనేది వారి అభిమతం. సమష్టిగా వ్యవ‘సాయం’ బేతంచెర్ల రాధాస్వామి కాలనీలో నివాసం ఉంటున్న దాదాపు 100 మంది పెద్దలు, పిల్లలు, వృద్ధులు సామూహికంగా వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. రెండు ఎకరాల్లో సపోట, జామ, సీతాఫలం పండ్ల మొక్కలతో పాటు రోజు వినియోగించుకునేందుకు ఆకుకూరలు, కూరగాయలు పండించుకుంటూ ఆరోగ్యకరమైన జీవనం గడుపుతున్నారు. ఉదయం, సాయంత్రం వ్యవసాయ పనులు చేస్తారు. ఆధునిక యంత్రాలను ఉపయోగిస్తున్నారు. అలాగే నాణ్యమైన వస్తువులు (కాటన్ దుస్తులు, దోమ తెరలు, దుప్పట్లు, పాదరక్షలు) తయారు చేసి సేవాదృక్పథంతో ఏడాదికోసారి లాభాపేక్ష లేకుండా విక్రయిస్తారు. స్వయం ఉపాధిని పెంపొదించుకునేందుకు మహిళలు ఖాళీ సమయంలో చిరుతిండ్లను తయారు చేసి విక్రయిస్తున్నారు. -
ఈ వ్యవసాయం ఓ ఆశాకిరణం
పురుగుమందులను, రసాయనిక ఎరువులను వాడకుండా సాగుతున్న ప్రకృతి వ్యవసాయం ఒక సరికొత్త సామాజిక ఉద్యమంలా ఆవిర్భవించింది. ఈ నూతన వ్యవసాయం ఇప్పుడు అంతర్జాతీయంగా ఒక ఆశాకిరణంగా కనిపిస్తోంది. ఛిన్నాభిన్నమైపోయిన ఆహార వ్యవస్థను ఇది చక్కదిద్దుతోంది. ప్రకృతి వ్యవసాయంతో పంటలకు పట్టే తెగుళ్ల కేసులు 86 శాతం పడిపోయాయి. ప్రతి రైతు కుటుంబం ఆరోగ్య ఖర్చులకు పెడుతున్న మొత్తంలో 50 శాతం దాకా తగ్గిపోయింది. వ్యవసాయ ఖర్చులు 68 శాతం తగ్గిపోయాయి, పంట దిగుబడుల్లో 88 శాతం పెరుగుదల నమోదైంది. పంటల రకాలను బట్టి, రాబడి 8 నుంచి 111 శాతం వరకు పెరిగింది. ఇది భవిష్యత్ సమాజ ఆహారానికి నిలకడైన మార్గంవైపుగా జరుగుతున్న మౌలిక పరివర్తన. దేశంలో రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకంతో ఛిన్నాభిన్నమైపోయిన ఆహార వ్యవస్థను ప్రకృతి వ్యవసాయం ఎలా చక్కదిద్దుతుంది అనేది పెద్ద ప్రశ్న. ఈ విషయంపై స్పష్టత కోసం, భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) మాజీ డైరెక్టర్ జనరల్‌కి నేను కాల్ చేసి, కమ్యూనిటీ నేతృత్వంలో వ్యవసాయం సాగుతున్న ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని గ్రామాలను సందర్శించాల్సిందిగా అభ్యర్థించాను. పురుగుమందులను వాడకుండా నడుస్తున్న ఈ నూతన వ్యవసాయ వ్యవస్థ ఏపీలో ఒక సరికొత్త సామాజిక ఉద్యమంలా ఆవిర్భవించిందని చెప్పాను. ఆయన నా మాటలు ఓపిగ్గా విన్నారు. పురుగుమందులు లేని వ్యవసాయ వ్యవస్థ ఏపీ రైతులను ఎలా ఆకట్టుకుందీ, ఒక సురక్షితమైన, ఆరోగ్యకరమైన వ్యవసాయ విధానం వైపుగా రైతుల పరివర్తన ఎలా జరిగిందీ వివరంగా తెలుసుకోదలిచినట్లు ఆయన చెప్పారు. నా కాల్ ముగించిన వెంటనే ఆయన హైదరాబాద్ లోని ఐసీఏఆర్ డైరెక్టరేట్‌ను సంప్రదించారు. ప్రకృతి వ్యవసాయంపై ప్రాథమిక అంచనా నిమిత్తం, ఏపీలోని కొన్ని గ్రామాలను సందర్శించడానికి శాస్త్రవేత్తల బృందాన్ని పంపించాలని ఆయన ఆదేశించారు. కొద్ది రోజుల తర్వాత ఆయన నాకు కాల్ చేసి ఈ అంశంపై తానందుకున్న నివేదిక చాలా సానుకూలంగా ఉందనీ, ఇప్పటికే అమలవుతున్న వ్యవసాయ విధానాల నుంచి కొత్త పద్ధతికి మారడానికి రైతాంగం ఆలోచనల్లోనే సమూల మార్పులు అవసరమనీ తెలిపారు. పురుగుమందుల అవసరం లేని సాగు వ్యవస్థ వైపు మళ్లడానికి ఉన్న అపారమైన అవకాశాలను ఎంత త్వరగా చూడగలం అని చెప్పడానికే నేను ఈ కథనాన్ని ఇక్కడ పొందుపర్చాను. ఈ నూతన వ్యవసాయ వ్యవస్థ ఇప్పుడు అంతర్జాతీయంగా ఒక ఆశాకిరణంగా కనిపిం చడానికి ముందుగా, ఒక చిన్న చొరవ ద్వారా ప్రారంభమైందని తెలుసుకుంటే మన హృదయాలు ఉప్పొంగుతాయి. కమ్యూనిటీ స్థాయిలో ప్రకృతి వ్యవసాయ (సిఎమ్‌ఎన్‌ఎఫ్) కార్యక్రమం అని మనం చెప్పుకుంటున్నది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లోని 3,780 గ్రామాలకు విస్తరించింది. దాదాపు 7 లక్షలమంది రైతులు ఇప్పుడు ఈ మార్గంలో పయనిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రపంచంలోనే అతి పెద్ద వ్యవసాయ పర్యావరణ వ్యవస్థగా ఆవిర్భవించింది. గ్లోబల్ అలయెన్స్ ఫర్ ది ఫ్యూచర్ ఆఫ్ ఫుడ్ సంస్థ తాజాగా విడుదల చేసిన ‘నిజమైన విలువ : ఆహార వ్యవస్థ పరివర్తన సానుకూల ప్రభావాల వెల్లడి’ అనే నివేదిక ఈ కార్యక్రమాన్ని, ఛిన్నాభిన్నమైన ఆహార వ్యవస్థలను సమర్థంగా చక్కదిద్దగల ఆరు అంతర్జాతీయ ప్రేరణల్లో ఒకటిగా పేర్కొంది. ప్రపంచం ఎదురుచూస్తున్న గొప్ప మార్పునకు ఇది ఒక నాందీవాచకమై నిలిచిందని ఈ నివేదిక ప్రశంసించింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న సహజ వ్యవసాయ విధానం 8 లక్షల హెక్టార్లలో అమలవుతోంది. వికేంద్రీకరించిన వ్యవసాయ వ్యవస్థ కింద నడుస్తున్న ఈ కార్యక్రమం ప్రభుత్వ యాజమాన్యంలోని లాభాలతో నిమిత్తం లేని రైతు సాధికార సంస్థ (ఆర్‌వైఎస్‌ఎస్) ద్వారా కొనసాగుతోంది. ఒక్కొక్కటి 2 వేల కుటుంబాలను పర్యవేక్షిస్తున్న 12,500 గ్రామ కౌన్సిళ్లతో విజయవంతమైన ఈ కార్యక్రమం పరస్పర అనుసంధానంతో నడుస్తోంది. దీంట్లో స్థానికంగా గుర్తింపు పొందిన ఒక రైతు నిపుణుడు, ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు, వ్యవసాయ నిపుణుడితో కూడిన ముగ్గురు ముఖ్యమైన రైతుల బృందం నిత్యం ఈ విధానంలో సాగు చేస్తున్న తోటి రైతులకు సూచనలు అందిస్తూ మార్గదర్శకత్వం వహిస్తుంటుంది. పై నివేదిక పేర్కొన్నట్లుగా స్థానికంగా ప్రకృతి వ్యవసాయ సూత్రాల అమలులో మహిళా బృందాలు గొప్ప పాత్ర పోషిస్తున్నాయి. మహిళా శక్తి ఒక సమాజాన్ని ఎలా మార్చివేయగలదో తెలుసుకోవాలంటే ఏపీలో 70 లక్షల మంది మహిళలు 6,52,440 స్వయం సహాయక బృందాలను ఏర్పర్చి నిర్వహిస్తున్న వైనాన్ని మీరు స్వయంగా వచ్చి చూడాలి. ప్రకృతి వ్యవసాయ ఉద్యమానికి ‘ఆధ్యాత్మిక పెట్టుబడి’లాగా పేరొందిన ఈ మహిళా బృందాలు నిర్ణయాలను తీసుకోవడంలో ముందంజ వేస్తున్నాయి. నా పర్యటనల సందర్భంగా మహిళా శక్తి సామర్థ్యాలను చూసి నిజంగానే ఆశ్చర్యపోయాను. రుణాలను పంపిణీ చేయడంలో, పంట దిగుబడి సరఫరాలను నిర్వహించడంలో, ఆహార ధాన్యల నిల్వల నిర్వహణ, ప్రాసెస్ చేయడంలో, తమకు తెలిసిన జ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడంలో వీరి ప్రతిభ అసాధారణం. ప్రకృతి వ్యవసాయ ఉద్యమాన్ని ఏది ముందుకు తీసుకెళుతోందో, నూతన వ్యవసాయ శక్తి కేంద్రాలుగా మహిళలు ఎలా వ్యవహరిస్తున్నారో తెలుసుకోవాలంటే మీరు స్వయం సహాయక బృందాల సమావేశాలకు తప్పకుండా హాజరై పరిశీలించాల్సి ఉంది. హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్ కార్యనిర్వాహక డైరెక్టర్ డాక్టర్ జీవీ రామాంజనేయులు ఈ పురుగుమందుల రహిత వ్యవసాయానికి సమర్థ ప్రచారకర్త. వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలపై అపార విశ్వాసం ఉన్న ఈయన, మహిళా స్వయం సహాయక బృందాల సమావేశాలకు నన్ను తీసుకెళ్లారు. కమ్యూనిటీ స్థాయిలో ప్రకృతి వ్యవసాయంలో నిమగ్నమై ఉన్న 38 ఎన్జీవోలలో ‘సెంటర్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్’ తలమానికంలా ఉంది. ఈ సంస్థ వరంగల్ జిల్లాలోని ఒక గ్రామం మొత్తాన్ని సేంద్రియ వ్యవసాయం వైపు మరల్చడమే కాకుండా, ఈ గ్రామంలో వ్యవసాయ కో ఆపరేటివ్‌ను కూడా ఏర్పర్చింది. అప్పటి నుంచి మరో ఆరు సేంద్రియ వ్యవసాయ గ్రామాలు తయారయ్యాయి. పురుగుమందుల వాడకం పూర్తిగా నిలిపివేయడంతోపాటు, రసాయనిక ఎరువులను తగ్గించి వాడటంతో పంటలకు పట్టే తెగుళ్ల కేసులు 86 శాతం పడిపోయాయి. అంతే కాకుండా ప్రతి రైతు కుటుంబం ఆరోగ్య ఖర్చులకు పెడుతున్న మొత్తంలో 50 శాతం దాకా తగ్గిపోయింది. వైద్య ఖర్చులు అమాంతంగా పెరిగిపోవడం, దేశంలో రైతుల ఆత్మహత్యల పెరుగుదలకు కారణమైంది. ఈ నేపథ్యంలో రైతులను రుణాల విషవలయం నుంచి తప్పించడమే ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం లక్ష్యం. పైగా ప్రకృతి వ్యవసాయంతో రైతులకు వ్యవసాయ ఖర్చులు 68 శాతం తగ్గిపోయాయి, పంట దిగుబడుల్లో 88 శాతం పెరుగుదల నమోదైంది. వ్యవసాయ పంటల రకాలను బట్టి వ్యవసాయ రాబడి 8 నుంచి 111 శాతం వరకు పెరిగింది. ప్రకృతి వ్యవసాయంలో పంటలకు 55 శాతం నీళ్లు, విద్యుత్ మాత్రమే అవసరమవుతాయి. దీనివల్ల కాలుష్య ఉద్గారాలు 55 నుంచి 99 శాతం దాకా తగ్గిపోయే అవకాశముంది. నేల క్షయాన్ని నిరోధించడం ద్వారా ఏటా రూ. 12.3 లక్షల కోట్ల ఖర్చును ఆదా చేయవచ్చు కూడా! తమ భూముల్లో 43 శాతం దాకా వానపాములు పెరిగినాయని, 52 శాతం దాకా నేల గుల్ల అయిందని, పచ్చదనం 36 దాకా పెరిగిందని రైతులు చెప్పారు. పైగా తాము పండించిన పంటల రుచి ఎంతో మెరుగైందని 95 శాతం రైతులు చెప్పడంతో నేను ఆశ్చర్యపోయాను. రసాయనాలు లేని ఆహారాన్ని 70 శాతం దాకా స్థానికంగా వాడుతున్నారు. దీంతో పీచుపదార్థం సమృద్ధిగా ఉన్న పోషకాహారం తీసుకోవడం బాగా పెరిగింది. ఏపీ వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు ప్రకృతి వ్యవసాయం కోసం ఒక విధానపరమైన చట్రాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో వ్యవసాయ జనాభాను మొత్తంగా రసాయన రహిత సేద్యం వైపు మళ్లించేందుకు బడ్జెట్లో మద్దతు కూడా అవసరం. ప్రపంచంలో ప్రతి విజయవంతమైన మార్పు వెనుక ఒక శక్తిమంతమైన ఉత్ప్రేరకం ఉంటుంది. ప్రస్తుతం ఆర్‌వైఎస్‌ఎస్‌కో చైర్మన్‌గా ఉంటున్న సీనియర్ రిటైర్డ్ ప్రభుత్వాధికారి విజయకుమార్ థిల్లామ్... ఏపీలో ప్రకృతి వ్యవసాయ పరంగా జరుగుతున్న అద్భుతమైన పరివర్తనకు ప్రేరణ. ఏపీలో స్మార్ట్ వ్యవసాయం పేరిట జరుగుతున్న గొప్ప పరివర్తనకు ఈయనే మూలకర్తగా ఉన్నారు. ఇది ఏపీకి గర్వకారణమే కాదు.. భవిష్యత్ సమాజ ఆహారానికి నిలకడైన మార్గం వైపుగా జరుగుతున్న మౌలిక పరివర్తన కూడా! -దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహారం, వ్యవసాయరంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com -
1,2లలో కర్నూలు జిల్లాలో డా. ఖాదర్ వలీ సదస్సులు
సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం, అటవీ కృషి పద్ధతులపై డిసెంబర్ నెల 1, 2 తేదీల్లో కర్నూలు జిల్లాలో జరిగే సదస్సుల్లో ప్రముఖ ఆహార, ఆరోగ్య, అటవీ కృషి నిపుణులు డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. ప్రవేశం ఉచితం. 1వ తేదీ (ఆదివారం) ఉ. 10 గం. నుంచి కర్నూలులోని బి.క్యాంపులో గల సిల్వర్‌జూబ్లీ కళాశాల ఆడిటోరియంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ద్రోణ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో జరిగే సదస్సులో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. సూర్యప్రకాశ్‌రెడ్డి – 96038 34633, ఆనందరావు – 93981 24711, ప్రశాంత్‌రెడ్డి – 95029 90938. డిసెంబర్ 1వ తేదీ సా. 5.30 గంటలకు నంద్యాలలోని శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల ఆవరణలోని ఆడిటోరియంలో డా. ఖాదర్ వలి సదస్సు జరుగుతుంది. వివరాలకు.. 94416 54002, 91006 70553. డిసెంబర్ 2వ తేదీ (సోమవారం) ఉ. 10 గంటలకు కోయిలకుంట్లలోని అయ్యప్పస్వామి గుడి హాల్లో కోయిలకుంట్ల పంచాయతీ, మానవతా సేవా సంస్థ, రోటరీక్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే సదస్సులో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. సుబ్బారెడ్డి – 94407 54184, వీరభద్రశివ – 93466 69655. సిరిధాన్యాల సాగు, వాననీటి సంరక్షణపై సదస్సు నేడు మిషన్ జలనిధి, వాటర్ మేనేజ్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సిరిధాన్యాల సాగు, వాననీటి సంరక్షణపై నేటి ఉదయం 9 గం. నుంచి సిద్ధిపేట జిల్లా జగ్దేవ్పూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో రైతు సదస్సు జరగనుంది. సాక్షి సాగుబడి పేజీ ఇన్చార్జ్ పంతంగి రాంబాబు, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్షులు సంగెం చంద్రమౌళి, వాటర్ మేనేజ్మెంట్ ఫోరం చైర్మన్ మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి, మిషన్ జలనిధి చైర్మన్ జి.దామోదర్‌రెడ్డి అవగాహన కల్పిస్తారు. వివరాలకు.. కృష్ణమోహన్ – 99490 55225. 1న సేంద్రియ కూరగాయలు, ఆకుకూరల సాగుపై శిక్షణ డిసెంబర్ 1(ఆదివారం)న ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కొర్నెపాడులోని రైతు శిక్షణ కేంద్రంలో సేంద్రియ వ్యవసాయ విధానంలో క్యాబేజి, కాలిఫ్లవర్, వంగ, బెండ, టమాట, గోరుచిక్కుడు, బీర, కాకర, సొరకాయలు, ఆకుకూరల సాగుపై ప్రకృతి వ్యవసాయదారులు శరత్‌బాబు, శివనాగమల్లేశ్వరరావు శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 97053 83666, 0863–2286255. 1న బసంపల్లిలో ప్రకృతి వ్యవసాయ శిక్షణ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వివిధ పంటల సాగుపై అనంతపురం జిల్లా సి కె పల్లి మండలం బసంపల్లిలోని దేవాలయ ఆశ్రమ ప్రాంగణంలో డిసెంబర్ 1వ తేదీ(ప్రతి నెలా మొదటి ఆదివారం)న సీనియర్ రైతు నాగరాజు శిక్షణ ఇస్తారు. ఉ. 9 గం. నుంచి సా. 4 గం. వరకు శిక్షణ ఉంటుంది. ఫీజు రూ. 100. వివరాలకు.. 91826 71819, 94403 33349. 29,30 తేదీల్లో హైదరాబాద్‌లో చిరుధాన్యాలపై సదస్సు భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ(ఐ.ఐ.ఎం.ఆర్.) ఆధ్వర్యంలో ఈ నెల 29,30 తేదీల్లో హైదరాబాద్ కొండాపుర్‌లోని హెచ్.ఐ.సి.సి.లో న్యూట్రిసెరియల్స్ –2019 కాంక్లేవ్ జరగనుంది. వివరాలకు.. 040–24599331, 95501 14466. -
ప్రత్యక్షంగా చూడాలని వచ్చాను : గవర్నర్ బిశ్వభూషణ్
సాక్షి, కృష్ణా జిల్లా : ఒకప్పుడు ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్లమని, కానీ వాణిజ్య కారణాల వల్ల రైతులు ఎరువుల ఉపయోగం వైపు మళ్లారని ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ వ్యాఖ్యానించారు. ఆదివారం కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ రైతులు, స్వయం సహాయక బృంద మహిళలతో గవర్నర్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. రసాయనాల వల్ల భూసారం తగ్గిపోయి కొన్నాళ్లకు భూమి వ్యవసాయానికి పనికిరాకుండా పోతుందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చానని వెల్లడించారు. పంట మొత్తం విషపూరితమవుతోన్న ఈ రోజుల్లో ఇలాంటి పద్దతులు సమాజానికి చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోమని కోరతానని తెలిపారు. కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ.. అంతర పంటల ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చని సూచించారు. జిల్లాలో రోజురోజుకీ ప్రకృతి వ్యవసాయం పెరుగుతున్న నేపథ్యంలో రైతులు ఆవులు కొనుగోలు చేయడానికి కావలసిన ఆర్ధిక సహాయం అందిస్తామని వెల్లడించారు. జిల్లాలో 18 వేల మంది ప్రకృతి రైతులున్నారని, ఇటీవల ఢిల్లీలో ఈ విభాగంలో పురస్కారం కూడా అందుకున్నామని తెలిపారు. గవర్నర్ స్వయంగా ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించడం శుభపరిణామమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. -
3న పద్మారంలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ
గ్రామభారతి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 3 (ఆదివారం)న రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం పద్మారంలో పదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న సీనియర్ రైతు మనోహరాచారి తన వ్యవసాయ క్షేత్రంలో రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఉ. 10 గం.- సా. 4 గం. వరకు శిక్షణ ఉంటుంది. ప్రవేశ రుసుము : రూ. వంద. వివరాలకు.. 97057 34202. 3న కొర్నెపాడులో పండ్లు, కూరగాయల సాగుపై శిక్షణ రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడి గుంట దగ్గరలోని కొర్నెపాడులో ఫిబ్రవరి 3 (ఆదివారం)న ప్రకృతి వ్యవసాయ విధానంలో పండ్ల తోటలు, కూరగాయల సాగుపై శిక్షణ ఇవ్వనున్నారు. ఉద్యాన సహాయ సంచాలకులు రాజా కృష్ణారెడ్డి, డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కరుణశ్రీ రైతులకు శిక్షణ ఇస్తారు. ఉద్యాన శాఖ రాయితీలనూ తెలియజేస్తారు. ఉ. 10 గం. నుంచి సా. 5 గం. వరకు శిక్షణ ఉంటుంది. రిజిస్ట్రేషన్ వివరాలకు.. 97053 83666, 0863-2286255. 16 నుంచి పర్మాకల్చర్ డిజైన్ కోర్సు అరణ్య అగ్రికల్చరల్ ఆల్టర్నేటివ్స్ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ శాశ్వత వ్యయసాయ (పర్మాకల్చర్) నిపుణులు కొప్పుల నరసన్న ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు పర్మాకల్చర్పై శిక్షణా శిబిరం(పర్మాకల్చర్ డిజైన్ కోర్సు) జరగనుంది. జహీరాబాద్ సమీపంలోని బిడకన్నె గ్రామంలో అరణ్య సంస్థ ఏర్పాటు చేసిన సుసంపన్న శాశ్వత వ్యవసాయ క్షేత్రంలో శిక్షణ ఉంటుంది. నరసన్న, పద్మతోపాటు పలువురు నిపుణులు అనేక అంశాలపై శిక్షణ ఇస్తారు. రిజిస్ట్రేషన్ తదితర వివరాలకు.. 79817 55785, 040 - 24142295. మార్చిలో హైదరాబాద్‌లో సేంద్రియ ఉత్పత్తుల మేళా అమృతాహారాన్ని పండిద్దాం, ఆరోగ్య తెలంగాణను సాధిద్దాం అన్న నినాదంతో మార్చి 1,2,3 తేదీల్లో హైదరాబాద్(హైటెక్ సిటీ) శిల్పారామం నైట్ బజార్లో తెలంగాణ రాష్ట్ర స్థాయి సేంద్రియ మేళా నిర్వహించనున్నట్లు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం తెలంగాణ అధ్యక్షులు డా. ఎ. వీరభద్రరావు, ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం రాజు (76598 55588) తెలిపారు. సేంద్రియ రైతుల ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలతోపాటు ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త, అటవీ కృషి నిపుణులు డా. ఖాదర్ వలి తదితరులతో మూడు రోజులూ అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. అటవీ చైతన్య ద్రావణం పంపిణీ చేస్తారు. స్టాల్స్, ఇతర వివరాలకు.. 76598 55588, 91001 02229. -
ప్రకృతిసేద్య నిపుణుడు నారాయణరెడ్డి మృతి
సాక్షి, హైదరాబాద్: సుప్రసిద్ధ ప్రకృతి వ్యవసాయ నిపుణుడు డాక్టర్ ఎల్. నారాయణరెడ్డి(84) కర్ణాటకలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం నిద్రలోనే కన్నుమూశారు. మరలేనహళ్లిలో గల తన వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం సైతం ఆయన రైతులకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇచ్చారు. కాగా, ఆయన స్వస్థలం బెంగళూరు రూరల్ వర్తూర్‌లో సోమవారం అంత్యక్రియలు నిర్వర్తించారు. జపాన్‌కు చెందిన ప్రకృతి వ్యవసాయ నిపుణులు మసనొబు ఫుకువోకా శిష్యుడిగా నారాయణరెడ్డి ప్రసిద్ధి పొందారు. ఫుకువోకా భారత్‌లో పర్యటనకు వచ్చినప్పుడు మరలేనహళ్లిలోని నారాయణరెడ్డి వ్యవసాయక్షేత్రాన్ని సందర్శించారు. డాక్టర్ నారాయణరెడ్డి 35 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయంలో ఉన్నారు. తన వ్యవసాయ క్షేత్రాన్ని అంతర్జాతీయ ప్రకృతి వ్యవసాయ శిక్షణా కేంద్రంగా తీర్చిదిద్దారు. ఆ పొలంలోని మట్టి 5 శాతం సేంద్రియ కర్బనంతో కూడి ఉండటం విశేషంగా చెబుతారు. దేశ విదేశాల నుంచి రైతులు వచ్చి ఆయన వద్ద అనుభవపూర్వకంగా ప్రకృతి వ్యవసాయ పాఠాలు నేర్చుకుంటూ ఉంటారు. లీసా ఇండియా ఆంగ్ల ప్రకృతి వ్యవసాయ మాసపత్రికకు చాలా ఏళ్లుగా ఆయన కాలమిస్టు. వేలాది మంది రైతులను ప్రకృతి వ్యవసాయంలోకి మళ్లించిన డా. నారాయణరెడ్డి మరణం తీరని లోటని పలువురు నివాళులర్పించారు. -
17,18 తేదీల్లో సిరిధాన్యాల అటవీ వ్యవసాయంపై శిక్షణ
అటవీ కృషి నిపుణులు డా. ఖాదర్ వలి పర్యవేక్షణలో కర్ణాటకలో జనవరి 17, 18 తేదీల్లో అటవీ చైతన్య ద్రావణంతో భూసారం పెంపుదల, సిరిధాన్యాలు – పప్పుధాన్యాల మిశ్రమ సాగు, సిరిధాన్యాల శుద్ధి విధానాలపై తెలుగు రైతుల కోసం శిక్షణా కార్యక్రమం జరగనుంది. హెచ్.డి. కోటెకు దగ్గరలోని హ్యాండ్ పోస్టులోని మైరాడ బేస్ క్యాంప్‌లో వసతి. బిదర హల్లి కబిని డ్యాం దగ్గర గల అటవీ వ్యవసాయ క్షేత్రంలో శిక్షణ నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్ ఇతర వివరాలకు.. 99017 30600, 81234 00262, 93466 94156. మార్చి 15–17 తేదీల్లో నాగపూర్ బీజోత్సవం మహారాష్ట్రలోని నాగపూర్ నగరంలో వరుసగా ఏడో ఏడాది దేశీ బీజోత్సవం జరగనుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విత్తన పరిరక్షకులు విత్తనాలను ప్రదర్శనకు ఉంచుతారు. ఈ బీజోత్సవంలో దేశీ వంగడాలతోపాటు సేంద్రియ ఆహారోత్పత్తులు, సుస్థిర జీవన శైలికి దోహదపడే ఉత్పత్తులు, సేంద్రియ ఖాదీ తదితర ఉత్పత్తులను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. రిజిస్ట్రేషన్ తదితర వివరాలకు.. 90750 12745 13న కొర్నెపాడులో సేంద్రియ పశుగ్రాసం సాగుపై శిక్షణ ప్రకృతి వ్యవసాయ విధానంలో పశుగ్రాసాలు, సూపర్ నేపియర్ సాగుపై గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు రైతు శిక్షణా కేంద్రంలో జనవరి 13 (ఆదివారం)న రైతు సీతారామశాస్త్రి, గన్నవరం పశువైద్య కళాశాల ప్రొఫెసర్– హెడ్ డాక్టర్ సి.హెచ్.వెంకట శేషయ్య రైతులకు ఉ. 10 గం.ల నుంచి సా. 5 గం.ల వరకు శిక్షణ ఇస్తారు. అనంతరం శిక్షణకు హాజరైన రైతులకు సూపర్ నేపియర్ కణుపులను ఉచితంగా పంపిణీ చేస్తారు. పాల్గొనదలచిన రైతులు రిజిస్ట్రేషన్ తదితర వివరాలకు సంప్రదించవలసిన నంబర్లు.. 97053 83666, 0863 2286255 -
పత్తి/కంది.. మధ్యలో పచ్చిరొట్ట
మహారాష్ట్ర.. విదర్భ.. యవత్మాల్.. ఈ పేర్లు వినగానే అప్పుల్లో కూరుకుపోయి బలవన్మరణాల పాలైన వేలాది మంది పత్తి రైతుల విషాద గాథలు మదిని బరువెక్కిస్తాయి. అయితే, ఈ కథ అంతటితో ముగిసిపోలేదు. ఎడారిలో ఒయాసిస్సు మాదిరిగా సేద్యాన్ని ఆనందమయంగా మార్చుకున్న అతి కొద్ది మంది ప్రకృతి వ్యవసాయదారులు కూడా అదృష్టవశాత్తూ అక్కడ ఉన్నారు. రసాయనాలను త్యజించి, నేలతల్లికి ప్రణమిల్లుతూ భూసారాన్ని పరిరక్షించుకుంటూనే అధిక దిగుబడులు సాధిస్తున్న అద్భుత ప్రకృతి వ్యవసాయదారుల్లో సుభాష్ శర్మ ఒకరు. ప్రకృతి వ్యవసాయంలో ఆచ్ఛాదన అతి ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే, ఆచ్ఛాదనగా వేయడానికి గడ్డీ గాదం ఎక్కడ దొరుకుతుంది అని రైతులు ప్రశ్నిస్తుంటారు. ఈ సమస్యకు సుభాష్ శర్మ అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నారు. రెండు సాళ్లు పత్తి వేస్తారు (కందిని కూడా ఇలాగే సాగు చేయవచ్చు). ఆ పక్కనే 3 సాళ్లలో పచ్చిరొట్ట మొక్కలు పెంచి, వాటినే కత్తిరించి ఆచ్ఛాదనగా వేస్తారు. పొలం అంతా ఇలాగే వేయడం ద్వారా అధిక దిగుబడిని సాధించే వినూత్న పద్ధతిని ఆయన గత కొన్నేళ్లుగా అనుసరిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయదారుడిగా, పరిశోధకుడిగా ప్రయోగాలు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్న సుభాష్ శర్మతో ‘సాక్షి సాగుబడి’ ఇటీవల ముచ్చటించింది. ముఖ్యాంశాలు.. సుభాష్ శర్మకు 60 ఏళ్లు. వ్యవసాయంలో 40 ఏళ్ల అనుభవం ఉన్న రైతు. అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని, గడ్డు సమస్యలకు అద్భుతమైన పరిష్కారాలను వెదకి తలపండిన ప్రకృతి వ్యవసాయదారుడు, రైతుశాస్త్రవేత్త. క్షేత్రస్థాయిలో వ్యవసాయ సమస్యలను లోతుగా పరిశీలిస్తూ.. తన అనుభవం, ప్రజ్ఞలతో ప్రకృతికి అనుగుణమైన సాగు పద్ధతులను రూపొందించుకున్నారు. కరువుకు, పత్తి రైతుల ఆత్మహత్యలకు నిలయమైన మహారాష్ట్ర విదర్భలోని యవత్మాల్ జిల్లా (చోటి గుజారి) వితస గ్రామ వాస్తవ్యుడైన ఆయనకు 19 ఎకరాల నల్లరేగడి భూమి ఉంది. 1975 నుంచి వ్యవసాయం చేస్తున్న సుభాష్ శర్మ 20 ఏళ్ల పాటు రసాయనిక ఎరువులు, పురుగుమందులతోనే వ్యవసాయం చేశారు. ఫలితంగా ఆర్థికంగా నష్టాలపాలవటమే కాకుండా భూసారం సర్వనాశనమైపోయింది. 1986 తర్వాత ఖర్చులు పెరుగుతున్నా దిగుబడులు తగ్గిపోతూ వచ్చాయి. ఆ దశలో రసాయనిక వ్యవసాయ పద్ధతే నష్టదాయకమైనదన్న సత్యాన్ని గ్రహించారు. 1994 నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వైపు మళ్లారు. నిశిత పరిశీలనతో ప్రకృతికి అనుగుణమైన ఆచరణాత్మక సుస్థిర వ్యవసాయ పద్ధతులను రూపొందించుకుని అనుసరిస్తూ మంచి నికరాదాయాన్ని పొందుతున్నారు. ఆయనకున్న 13 ఎకరాల నల్లరేగడి భూమిలో 3 ఎకరాలను ఆవులు, ఎద్దులు మేయడానికి కేటాయించి మిగతా పది ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా కంది, పత్తి, కూరగాయలు, ఆకుకూరలను ఏడాది పొడవునా సాగు చేస్తుంటారు. పత్తి/కంది సాళ్ల మధ్యలో పచ్చి రొట్ట సాగు పత్తి లేదా కంది సాగులో సుభాష్ శర్మ అధిక దిగుబడులు పొందుతున్న పద్ధతి ఆసక్తికరంగానే కాదు.. రైతులెవరైనా సులభంగా అనుసరించడానికి వీలుగానూ ఉంది. రెండు సాళ్లలో పత్తి లేదా కంది పంట, వాటి పక్కనే మూడు సాళ్లలో పచ్చిరొట్ట మొక్కలను సాగు చేస్తారు. ప్రతి సాలుకు మధ్య 2 అడుగుల దూరం ఉంటుంది. ఈ ఐదు సాళ్లు 10 అడుగుల స్థలంలో ఉంటాయి. అంటే.. 4 అడుగుల్లో పంట, 6 అడుగుల్లో పచ్చిరొట్ట పెరుగుతాయి. పత్తి లేదా కంది సాళ్ల మధ్య 2 అడుగులు, మొక్కల మధ్య అడుగున్నర దూరం ఉంటుంది. సాధారణంగా పత్తి సాగు చేసేరైతులు 4“2 అడుగుల దూరం పాటిస్తారు. 2“1.5 అడుగుల దూరాన వేస్తున్నందున ఎకరానికి వేసే మొక్కల సంఖ్య గానీ దిగుబడి గానీ తగ్గబోదని, ఎకరానికి కిలో పత్తి విత్తనాలు అవసరమవుతాయని సుభాష్ శర్మ అన్నారు. పచ్చిరొట్ట పంటలుగా ఎకరానికి 4 కిలోల సజ్జ, 6 కిలోల అలసంద, 15 కిలోల జనుము విత్తనాలను కలిపి వరుసలుగా బోదెలపై విత్తుతారు. పత్తి లేదా కంది సాళ్లలో కలుపును అతి చిన్నగా ఉన్నప్పుడే మనుషులు పీకేస్తారు లేదా కుర్ఫీతో తీసేస్తారు. నెలకోసారి కలుపు తీసి అక్కడే ఆచ్ఛాదనగా వేస్తారు. మరీ అవసరమైతే పంట తొలిదశలో గుంటక తోలుతారు. కలుపు మొక్కలు చిన్నగా ఉన్నప్పుడే తీసేస్తే కలుపు తీత ఖర్చు 80% తగ్గుతుందని సుభాష్ శర్మ తెలిపారు. పచ్చిరొట్ట పంటలున్న సాళ్లలో కలుపు తియ్యరు. 45–50 రోజులు పెరిగిన తర్వాత పచ్చిరొట్ట పంట మొక్కలను, కలుపును కోసి అక్కడే ఆచ్ఛాదనగా వేస్తారు. ఆ తర్వాత 30–35 రోజులు గడచిన తర్వాత మరోసారి కోసి అక్కడే ఆచ్ఛాదనగా వేస్తారు. ఈ రెండు సార్లూ ఆచ్ఛాదనగా వేసే పచ్చిరొట్ట మూరెడు ఎత్తున వస్తుంది. కాబట్టి, ఆచ్ఛాదనతో సత్ఫలితాలు వస్తున్నాయి. పంటలో పచ్చిరొట్ట సాగుతో అనేక ప్రయోజనాలు పంటల సాళ్ల పక్కనే పచ్చిరొట్టను పెంచి ఆచ్ఛాదన చేయటం వల్ల చాలా స్థలం వృథా అయినట్లు పైకి కనిపిస్తుంది. కానీ, నిజానికి బహుళప్రయోజనాలు నెరవేరతాయి. దీని వెనుక ఉన్న శాస్త్రీయతను రైతులు సరిగ్గా అర్థం చేసుకోవాలని సుభాష్ శర్మ అంటారు. పొలం బెట్టకు రాకుండా భూమిలో తేమను పచ్చిరొట్ట పంటలు కాపాడతాయి. కోసి వేసిన ఆచ్ఛాదన వల్ల నేలలోని తేమ ఆరిపోకుండా ఉండటమే కాకుండా, వాతావరణంలో నుంచి నీటి తేమను ఆచ్ఛాదనగా వేసిన గడ్డీ గాదం గ్రహించి భూమికి అందిస్తుంది. ఫలితంగా వానపాములు, సూక్ష్మజీవులు తమ కార్యకలాపాలను సజావుగా నిర్వర్తిస్తూ నేలను సారవంతం చేస్తూ ఉంటాయి. పత్తి లేదా కంది మొక్కల వేర్లు పక్కన ఉన్న పచ్చిరొట్ట ఆచ్ఛాదన కిందికే చొచ్చుకు వచ్చి దాహాన్ని తీర్చుకోవడంతోపాటు పోషకాలను గ్రహిస్తాయి. ఈ విధంగా పచ్చిరొట్ట సాగు వల్ల పత్తి లేదా కంది పంట దిగుబడి పెరుగుతుంది. పచ్చిరొట్ట ఆచ్ఛాదనతో ప్రయోజనాలు.. 1. పంట పక్కనే పచ్చిరొట్టను కూడా పెంచడం వల్ల సూర్యరశ్మి పూర్తిగా వినియోగమవుతుంది. ఆచ్ఛాదన వల్ల నేలలో సేంద్రియ కర్బనం పెరిగి భూసారం ఇనుమడిస్తుంది. 2. పొలం అంతటా వత్తుగా పంటలు ఆవరించి ఉండటం వల్ల, ఆచ్ఛాదన వల్ల వర్షాలకు భూమి పైపొర మట్టి కొట్టుకుపోకుండా రక్షింపబడుతుందని తెలిపారు. 3. పచ్చిరొట్ట పంటలు ఎర పంటగా పనిచేస్తాయి. జీవ నియంత్రణ వల్ల చీడపీడలు కూడా అదుపులో ఉంటాయి. ప్రతి 75 మిత్రపురుగులకు 25 శత్రుపురుగుల చొప్పున పెరుగుతుంటాయని.. మిత్రపురుగులు శత్రుపురుగులను తింటూ వాటి సంతతిని అదుపు చేస్తూ ఉంటాయి. పురుగుల మందులు, కషాయాలు కూడా చల్లాల్సిన అవసరం లేదని, ఆ ఖర్చంతా రైతుకు మిగిలిపోతుందని సుభాష్ శర్మ తెలిపారు. సూరజ్ సూటి రకం పత్తి గులాబీ పురుగును సైతం తట్టుకుంటుందన్నారు. 4. భూమిలో తేమ ఆరిపోకుండా ఎక్కువ కాలం నీటి ఎద్దడి రాకుండా చూస్తుంది. పత్తి వేర్లకు బోజనంతోపాటు తేమ కూడా దొరుకుతుంది. వర్షాలు మొహం చాటేసి మరీ ఇబ్బంది అయినప్పుడు ఒకటి, రెండు తడులు ఇస్తున్నామని సుభాష్ శర్మ తెలిపారు. పత్తి లేదా కంది సాళ్లు వేసిన చోట వచ్చే పంటకాలంలో పచ్చిరొట్ట పంటలు వేస్తామని, ఇప్పుడు పచ్చిరొట్ట విత్తనాలు చల్లిన చోట పత్తి లేదా కంది పంటలు వేస్తూ పంటమార్పిడి చేస్తుంటామన్నారు. పత్తి 12, కంది 15 క్వింటాళ్ల దిగుబడి పత్తిని పచ్చిరొట్టతో కలిపి సాగు చేసే ప్రయోగంలో.. సూరజ్(సూటి రకం) పత్తి తొలి ఏడాది ఎకరానికి 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మూడో ఏడాదికి 12 క్వింటాళ్లకు పెరిగింది. మరో రెండు, మూడేళ్లలో 20 క్వింటాళ్లకు పెరుగుతుందని సుభాష్ శర్మ ధీమా వ్యక్తం చేశారు. నల్లరేగడి నేలలో ఇది ఒకటి, రెండు తడులు ఇచ్చే పద్ధతిలో దిగుబడి వివరాలు. పూర్తిగా వర్షాధారంగా ప్రయోగాత్మక సాగు వచ్చే ఏడాది ప్రారంభిస్తామన్నారు. అదేవిధంగా, కంది స్థానిక సూటి రకాలను విత్తి 15–20 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నామని తెలిపారు. రైతులు ఈ పద్ధతి వెనుక దాగి ఉన్న శాస్త్రీయతను అర్థం చేసుకొని సాగు చేస్తే చక్కటి ఫలితాలు వస్తాయని, తక్కువ ఖర్చుతోనే అధిక దిగుబడి, అధిక నికరాదాయం పొందవచ్చని తెలిపారు. (సుభాష్ శర్మ–హిందీ– 94228 69620,డా. రాజశేఖర్(సి.ఎస్.ఎ.)–తెలుగు– 83329 45368) ప్రకృతి సేద్యంలో శాస్త్రీయతను రైతులు అర్థం చేసుకోవాలి పత్తి 2 సాళ్లు వేసి.. ఆ పక్కనే 3 సాళ్లలో అనేక రకాల పచ్చిరొట్టను సాగు చేస్తే దిగుబడి పెరగడంతోపాటు భూసారం పెరగడం, బెట్టను తట్టుకోవడం వంటి ఎన్నో ప్రయోజనాలు నెరవేరతాయి. చీడపీడల బెడద కూడా తీరిపోతుంది. పత్తి మాదిరిగానే కందిని కూడా ఇలాగే సాగు చేయవచ్చు. ప్రకృతి వ్యవసాయంలో ఈ విషయాలు చాలా కీలకం. రైతులు మనసుపెట్టి ప్రకృతి సేద్యంలో దాగి ఉన్న శాస్త్రీయతను అర్థం చేసుకోవాలి. పచ్చిరొట్ట సాగుకు స్థలం వృథా అవుతున్నదని పొరబడకూడదు. రసాయనిక వ్యవసాయంలో కన్నా ప్రకృతి వ్యవసాయంలో అధిక దిగుబడి, అధికాదాయం పొందటం ముమ్మాటికీ సాధ్యమే. – సుభాష్ శర్మ, ప్రసిద్ధ ప్రకృతి వ్యవసాయదారుడు, రైతు శాస్త్రవేత్త, వితస, యవత్మాల్, మహారాష్ట్ర ఎక్కడ కురిసిన వాన అక్కడే ఇంకాలి నల్లరేగడి భూమి అయినప్పటికీ ఏ గజం స్థలంలో పడిన వర్షాన్ని ఆ గజంలోనే ఇంకింపజేయడం సుభాష్ శర్మ ప్రత్యేకత. ఏ పంటనైనా బోదెలపైనే సాగు చేస్తారు. బోదెల మధ్యలో ప్రతి మీటరుకూ అడ్డుకట్ట వేసి జల స్తంభన చేస్తారు వేసవికి ముందు నుంచే ఇలా వాన నీటి సంరక్షణ ఏర్పాటు చేస్తారు. మరీ కుండపోత వర్షం కురిస్తే పంట ఉరకెత్తకుండా అడ్డుకట్టలను తాత్కాలికంగా తొలగించి, వరద నీరు పోయిన తర్వాత మళ్లీ కట్టలు వేస్తారు. ఏడాదిలో ఏ సీజన్లోనైనా అకాల / సకాల వర్షాలన్నిటినీ ఒడిసిపడతారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి నీటి బొట్టునూ పొలంలో ఎక్కడికక్కడే ఇంకింపజేస్తారు. దీంతో భూగర్భ జలాలకు లోటుండదు. అయినా చాలా పొదుపుగా మరీ అవసరమైతేనే ఒకటి, రెండు తడులు ఇస్తూ పత్తి, కంది, కూరగాయలను సాగు చేస్తారు. భూమిలో ఎకరానికి 4 టన్నుల చొప్పున దిబ్బ ఎరువు వేసి కలియదున్నుతారు. ఆ తర్వాత పంట ఏదైనా సరే బోదెలు తోలి, బోదెలపైన విత్తనాలు వేసి సాగు చేస్తారు. విత్తనాలతో పాటే ప్రతి పాదులో దోసెడు తాను స్వయంగా తయారు చేసుకున్న ‘అలౌకిక్ ఖాద్’ను ఎకరానికి టన్ను చొప్పున వేస్తారు. బోదెలపై 2 సాళ్లలో పత్తి మొక్కల మధ్యలోని 3 సాళ్లలో ఏపుగా పెరుగుతున్న పచ్చిరొట్ట. వర్షపు నీరు పొలంలోనే ఎక్కడికక్కడే ఇంకింపజేసేందుకు బోదెల మధ్య వేసిన అడ్డుకట్టలు కంది మధ్య పచ్చిరొట్టను 2 సార్లు కోసేసిన తర్వాత ఆకుకూరలు కూడా పండించుకోవచ్చు – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
మనసుకు నచ్చిన సేద్యం దిశగా..
ఒత్తిళ్లతో కూడిన రొటీన్ ఉద్యోగం కొనసాగిస్తూ, రసాయనిక అవశేషాలతో కూడిన ఆహారం తింటూ అనారోగ్యం పాలవడం కన్నా ప్రకృతి వ్యవసాయం చేపట్టి ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని సమాజానికి అందించడమే మేలైన జీవనమార్గమని భావించారు మహమ్మద్ రఫీ. కార్పొరేట్ ఐటీ కంపెనీలో ఏడాదికి రూ. 12 లక్షల ఆదాయాన్నిచ్చే ఉద్యోగాన్ని వదిలేసి సొంత జిల్లా నెల్లూరుకు వెళ్లిపోయారు. మరికొందరు మిత్రులతో కలసి 250 ఎకరాల భూమిని కొని, ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. ఆరోగ్యదాయకమైన సిరిధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలను సాగు చేసి తక్కువ ధరకే వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నారు. ఏడాదంతా స్థిరమైన, సరసమైన ధరకే ఆకుకూరలు, కూరగాయలను, మున్ముందు పండ్లను కూడా అందించడం తమ అభిమతమని ఆయన అంటున్నారు. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం పురిణి గ్రామంలో రైతు ఖాదర్ బాషా కుమారుడైన మహమ్మద్ రఫీకి వ్యవసాయంపై మక్కువ ఉన్నప్పటికీ.. కొత్తగూడెంలో మైనింగ్ ఇంజినీరింగ్ బీటెక్ చదివారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంటెక్ చదివిన తర్వాత హైదరాబాద్‌లో టీసీఎస్‌లో చేరారు. కొద్ది ఏళ్లలోనే టీమ్ లీడర్‌గా ఎదిగారు. ఏడాదికి రూ. 12 లక్షల జీతం అందుకుంటున్నప్పటికీ సంతృప్తి లేదు. రొటీన్ ఉద్యోగం, రసాయనిక అవశేషాలతో కలుషితమైన ఆహారం, నగర జీవనశైలితో అనారోగ్య సమస్యలు.. వెరసి సంతృప్తి లేని జీవితం. అటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో కొన్ని సంవత్సరాల క్రితం సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతిపై శిక్షణా శిబిరానికి హాజరయ్యారు. అంతే.. ప్రకృతి వ్యవసాయంపైనే దృష్టి పెట్టారు. పదేళ్లుగా చేస్తున్న ఉద్యోగం వదిలి 18 మంది మిత్రులతో కలసి భాగస్వామ్య సంస్థను ఏర్పాటు చేసి నెల్లూరు జిల్లా కలువాయి మండలం పర్లకొండలో 250 ఎకరాల భూమి కొని, రెండేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. యూకలిప్టస్ చెట్లతో అడవిని తలిపించేలా ఉన్న భూమిని కొనుగోలు చేసి ప్రస్తుతం 120 ఎకరాలను సాగులోకి తెచ్చారు. 30 బోర్లు తవ్వించారు. వాన నీటి సంరక్షణ కోసం ఒకటిన్నర, మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో రెండు చెరువులు తవ్వించారు. 30 ఒంగోలు జాతి ఆవులు, 18 గేదెలు కొనుగోలు చేశారు. పాలేకర్ పద్ధతిలో జీవామృతం, కషాయాలను ఉపయోగించి పంటలు పండిస్తున్నారు. నాటుకోళ్లను పెంచుతున్నారు. కొర్రలు, అరికలు, అండుకొర్రలు, సామలు, ఒరిగెలను 50 ఎకరాల్లో.. మునగ 20 ఎకరాల్లో, ఆకుకూరలను 5 ఎకరాల్లో, ఆపిల్ బెర్ను 7 ఎకరాల్లో, మామిడిని 10 ఎకరాల్లో, అరటిని 5 ఎకరాల్లో, 8 ఎకరాల్లో కరివేపాకు సాగు చేస్తున్నారు. ఆవులు, గేదెలకు పశుగ్రాసాన్ని 5 ఎకరాల్లో జీవామృతంతో సాగు చేస్తున్నారు. నిమ్మ, సీతాఫలం, బొప్పాయి, దానిమ్మ తదితర తోటలు వేయబోతున్నారు. సేంద్రియ సర్టిఫికేషన్ తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. తమ వ్యవసాయ క్షేత్రానికి 60 కిలోమీటర్ల దూరంలోని నెల్లూరు నగరంలో ప్రస్తుతం తమ ప్రకృతి వ్యవసాయోత్పత్తులను విక్రయిస్తున్నామని రఫీ తెలిపారు. ఫతేఖాన్‌పేట రైతు బజార్లో స్టాల్‌ను తెరిచారు. ఇటీవలే ఒక మొబైల్ వ్యాన్‌ను సైతం ఏర్పాటు చేసుకొని నెల్లూరులోని వివిధ ప్రాంతాల్లో రసాయన రహిత ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తున్నామని ఆయన తెలిపారు. ఆరోగ్యదాయకమైన జీవనానికి కట్టె గానుగ నూనెల ఆవశ్యకతను గుర్తెరిగి తమ వ్యవసాయ క్షేత్రంలోనే కట్టె గానుగను ఏర్పాటు చేసి హళ్లికర్ ఎద్దుల సహాయంతో నిర్వహిస్తున్నారు. సొంతంగా పండించిన వేరుశనగ, నువ్వులతోపాటు బయటి నుంచి కొని తెచ్చిన కొబ్బరితో నూనెలను తయారుచేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తుండటం విశేషం. ఏడాది పొడవునా స్థిరమైన ధర ఆరోగ్యదాయకమైన రసాయనాల్లేని ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రకృతి వ్యవసాయోత్పత్తులంటే జనం భయపడేంత ఎక్కువ ధరకు అమ్మకూడదని నిర్ణయించుకున్నాం. ఏడాది పొడవునా స్థిరంగా ఒకే ధరకు ఆకుకూరలు, కూరగాయలను వినియోగదారులకు అందిస్తున్నాం. కిలో రిటైల్ ధర టమాటో, దోస, వంకాయలు రూ. 20, మునక్కాయ రూ. 2.00 –2.50, ఆకుకూరలు కిలో రూ. 30కే విక్రయిస్తున్నాం. మున్ముందు హైదరాబాద్, చెన్నైలలోని సేంద్రియ దుకాణదారులకు తమ ఉత్పత్తులను సరఫరా చేయనున్నాం. – మహమ్మద్ రఫీ (90002 31112), పర్లకొండ, కలువాయి మండలం, నెల్లూరు జిల్లా – పులిమి రాజశేఖర్‌రెడ్డి, సాక్షి, నెల్లూరు సెంట్రల్ -
పట్నం నుంచి ప్రకృతిలోకి..
ఆరోగ్య దాయకమైన మన సంప్రదాయక గ్రామీణ ఆహార సంస్కృతి పరిర క్షణ యజ్ఞం కోసం చిత్తూరు జిల్లా తవణంపల్లికి చెందిన వినోద్ రెడ్డి అనే యువకుడు నడుం బిగించాడు. కాంక్రీటు జనారణ్యం బెంగళూరులో మంచి జీతంతో కూడిన ఫార్మా మార్కెటింగ్ ఉద్యోగాన్ని వదలి.. ప్రకృతి వ్యవసాయం, పుంగనూరు ఆవుల సంరక్షణ, ఆరోగ్యదాయకమైన గ్రామీణ – ఆరోగ్య స్వరాజ్యం కోసం భార్యా బిడ్డలతో మూడేళ్ల క్రితం తిరిగి పుట్టింటికొచ్చేశారు. పుంగనూరు ఆవుల సంరక్షణ గురించి ఆలోచిస్తూæ.. ఎద్దులకు సరైన శారీరక శ్రమ ఉంటేనే బ్రీడ్ డవలప్మెంట్ జరుగుతుందని గుర్తించి కట్టె గానుగ ఏర్పాటు చేసుకున్నారు. కాలక్రమంలో మరుగున పడిపోయిన గానుగలను తయారు చేయిస్తూ ప్రజలకు ఆరోగ్యదాయకమైన గానుగ నూనెలను అందించడమే కాకుండా సొంత ఊళ్లోనే గౌరవప్రదమైన ఉపాధిని పొందుతూ తమ గ్రామంలోని వడ్రంగులకూ ఉపాధి కల్పిస్తున్నారు. ఆవు పేడ, మూత్రంతో అనేక ఉత్పత్తులు తయారు చేసి ఆన్‌లైన్‌లోనూ విక్రయిస్తూ గతంలో కన్నా మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు. అన్నిటికీ మించి.. మనసుకు నచ్చిన పని చేస్తూ ప్రకృతి ఒడిలో సకుటుంబంగా ఆనంద పరవశుడవుతున్న యువ రైతు పేరు వినోద్‌పై ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక కథనం. సాతంబాకం వినోద్‌రెడ్డి(34)ది చిత్తూరు జిల్లా తవణంపల్లి స్వగ్రామం. వ్యవసాయ కుటుంబం. 5 ఎకరాల భూమిలో మామిడి తోట 15 ఏళ్లుగా సాగులో ఉంది. బీఎస్సీ పూర్తి చేశాడు. మొదట్లో టీటీడీలో ఉద్యోగం చేశారు. ఫార్మాçస్యూటికల్ కంపెనీలో మార్కెటింగ్ ఉద్యోగానికి మారి, కొన్ని ఏళ్ల పాటు హైదరాబాద్, బెంగళూరుల్లో ఉద్యోగం చేశారు. ఐదంకెల జీతం. అయినా, ఏదో వెలితి మనసును స్థిమితంగా ఉండకుండా రొద పెడుతూనే ఉంది. ఉరుకులు పరుగుల జనారణ్యంలో కేవలం లాభార్జన కోసం మార్కెటింగ్ వ్యూహాలను అమలు చేయడం మంచి ఆదాయాన్ని ఇస్తున్నప్పటికీ మనసును సంతృప్తిపరచలేకపోతోంది. చిన్నప్పటి నుంచి వ్యవసాయంలో ఏదో చేసి సాధించాలన్న తీరని కోరికే ఇందుకు మూలకారణమని వినోద్ గుర్తించారు. ఈ వెలితిని తీర్చుకోవడానికి ప్రకృతి వ్యవసాయం, దేశీ సంప్రదాయ ఆహారం–ఆరోగ్యం గురించి ఏ కార్యక్రమం జరిగినా కుటుంబంతో సహా పాల్గొనే అలవాటు చేసుకున్నారు. ఆ క్రమంలో గాంధీ కృషి విజ్ఞాన కేంద్రం ఆర్గానిక్ ఫార్మింగ్ వింగ్‌లో సభ్యుడిగా చేరాడు. అక్కడే నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్డీఆర్ఐ) విశ్రాంత డైరెక్టర్ డాక్టర్ ఓబిరెడ్డి, డైరెక్టర్ డాక్టర్ రమేశ్ పరిచయం అయ్యారు. పుంగనూరు ఆవుల విశిష్టతను వారి నుంచి వినోద్ తెలుసుకున్నారు. తిరిగి ప్రకృతికి దగ్గరవ్వాలన్న బలమైన కోరిక తీర్చుకోవడానికి, పుంగనూరు ఆవుల సంరక్షణపై దృష్టి సారించాలనే ఉద్దేశంతో మూడేళ్ల క్రితం ఉద్యోగం వదిలేశాడు. పాలేకర్ వ్యవసాయ పద్ధతులతో వ్యవసాయం చేస్తే వచ్చే లాభాల గురించి వివరించడంతో భార్య మమత, తల్లిదండ్రులు కూడా వినోద్ మనోభీష్టాన్ని అంగీకరించి ప్రోత్సహించారు. నారాయణరెడ్డి, పాలేకర్ శిక్షణా తరగతులకు హాజరై ప్రకృతి వ్యవసాయంపై వినోద్ లోతైన అవగాహన పొందారు. 5 ఎకరాల మామిడి తోటను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోకి మార్చి సాగు చేస్తున్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో విజృంభించిన తేనెమంచుపురుగు గత ఏడాది మామిడి పంట దిగుబడిని భారీగా దెబ్బతీసిందని తెలిపారు. అంతకుముందు వరకు క్రమంగా దిగుబడి పెరుగుతూనే వచ్చిందని వినోద్ అన్నారు. మామిడిలో అంతరపంటలుగా పశుగ్రాసాలు, జొన్న, ఉలవలు సాగు చేస్తున్నారు. ఘనజీవామృతం, ఆవుమూత్రం, పేడను రైతులకు, ఇంటిపంటల సాగుదారులకు విక్రయిస్తూ ప్రకృతి వ్యవసాయం వ్యాప్తికి దోహదపడుతున్నారు. ఉద్యోగం అయితే వదిలేసి వచ్చాడు కానీ.. పుంగనూరు ఆవులు దొరకడం కష్టమయింది. తవణంపల్లి చుట్టుపక్కల అడవుల్లో తిరిగే నాటు ఆవులను అతికష్టమ్మీద తీసుకొచ్చారు. వీటి రక్త నమూనాలను బెంగళూరులోని ఎన్డీఆర్ఐలో పరీక్షించారు. వాటి డీఎన్ఏ పుంగనూరు ఆవులకు దగ్గరగా ఉందని తేలింది. ఎన్డీఆర్ఐ శాస్త్రవేత్తల సలహాతో గుంటూరులోని లామ్ ఫాం నుంచి పుంగనూరు ఆవుల వీర్యం తీసుకొచ్చి నాటు ఆవులతో సంపర్కం చేసి.. పుంగనూరు ఆవులను ఉత్పత్తి చేశారు. అయితే, వీటి ఎదుగుదలలో కొన్ని లోపాలు బయటపడుతుండటం ఇబ్బందిగా మారింది. దీంతో నాణ్యమైన బ్రీడ్ రాలేదు. ఆవులకు వేసే మేతలోనే లోపాలున్నట్లు వినోద్ గుర్తించారు. ఆహారాన్ని మార్చి, ఎద్దులకు శారీరక శ్రమ కల్పించాలని శాస్త్రవేత్తలు కూడా సూచించారు. గానుగ ఆడించిన చెక్కను వాటికి పౌష్టికాహారంగా ఉపయోగపడుతుందన్నారు. ఈ నేపథ్యంలో తమ గ్రామంలోని వడ్రంగి కోదండాచారిని వినోద్ సంప్రదించి, ఇనుము వాడకుండా పూర్తిగా చెక్కతో గానుగను తయారు చేశారు. జోడెద్దుల గానుగను ప్రతి రోజూ కనీసం 5 గంటల పాటు ఆడిస్తున్నారు. నాణ్యతే కట్టె గానుగ నూనెల ప్రత్యేకత వేరుశనగ, నువ్వులు, కొబ్బరి నూనెలు తీసి.. ఇంటికి వచ్చిన వారికి అమ్ముతున్నారు. ప్రత్యేకించి ప్యాకేజింగ్, బ్రాండింగ్ చెయ్యకుండా స్టీలు క్యాన్లలో నూనె విక్రయిస్తున్నారు. అడిగిన వారికి లీటరుకు గ్లాస్ బాటిల్ రూ. 60 చొప్పున తీసుకొని నూనెలు పోసి ఇస్తున్నారు. తిరిగి గ్రామానికి వెళ్లి ప్రకృతి ఒడిలో ఆరోగ్యదాయకమైన, సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుదాం అన్న వినోద్ లక్ష్యం ఈ మాదిరిగా నెరవేరుతోంది. పుంగనూరు గోజాతి సంరక్షణతోపాటు ప్రజలకు ఆరోగ్యదాయకమైన కట్టె గానుగ నూనెలు అందుబాటులోకి వచ్చాయి. గానుగ చెక్క(పిట్టు) ఆవులు, ఎద్దులకు మంచి ఆహారం అందుబాటులోకి వచ్చింది. ఎద్దులకు పని దొరుకుతోంది. తగిన శారీరక శ్రమ ఉన్న ఆంబోతులతో మేలైన బ్రీడ్ రూపొందుతున్నది. ఒక్కసారి దిటిస్తేనే ఆవులు చూలు నిలుస్తున్నది. ఇంతకన్నా ఏమి కావాలి? అంటున్నారు వినోద్. కట్టె గానుగ తయారీ ఇలా.. కట్టె గానుగను బలమైన బాగి చెట్టు కాండంతో తయారు చేస్తున్నారు. రోలు 9 అడుగులు, 8 అడుగులు చుట్టుకొలత ఉండేలా చూసుకోవాలి. రోలు భూమి లోపలికి ఆరు అడుగులు, బయటికి 3 అడుగులు ఉండేట్టుగా చూసుకోవచ్చు. కాడిమాను, బొమ్మ కొయ్యి, రోకలి తదితరాలు స్థానికంగా ఉండే నాణ్యమైన చెక్కతో అయినా తయారు చేసుకోవచ్చు. రోలును తుమ్మ, చింతతో తయారు చేయొచ్చు. ఒక్కో గానుగ తయారు చేయడానికి కనీసం ఒక నెల సమయం పడుతోంది. ఒకసారి గానుగ స్థాపిస్తే కనీసం 30 సంవత్సరాలు పాడుకాకుండా ఉపయోగపడుతుందని బాల్యం నుంచి కట్టె గానుగల్లో పని చేసిన అనుభవం ఉన్న వడ్రంగి కోదండాచారి చెబుతున్నారు. తాము కట్టె గానుగలను నెలకొల్పుకోవడమే కాకుండా ఇతరులక్కూడా వీటిని అందుబాటులోకి తెస్తుండటం విశేషం. ఒక్కో గానుగకు రూ. లక్ష వరకు, ట్రాన్స్పోర్ట్ చార్జీలు అదనంగా ఖర్చవుతుందని వినోద్ వివరించారు. కట్టె గానుగలకు పెరుగుతున్న గిరాకీ ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరిగింది. కట్టె గానుగలో ఆడించిన వంట నూనెలే కావాలని వినోద్‌ను చాలా మంది వినియోగదారులు అడుగుతుంటారు. కట్టె గానుగ నూనెలకు మార్కెట్లో గిరాకీ ఉన్నందున లాభదాయకంగా ఉంది. దీంతో కట్టె గానుగ నూనెల ఉత్పత్తి, అమ్మకంపై వినోద్ శ్రద్ధ పెడుతున్నారు. ప్రస్తుతం వేరుశనగ, నువ్వులు, కొబ్బరి గానుగ ఆడిస్తున్నారు. 80 కేజీల వేరుశనగ గుళ్లను గానుగ ఆడిస్తే 26 నుంచి 28 కేజీల నూనె వస్తుంది. నువ్వులు 80 కేజీలకు 26 కేజీల నూనె, రెండున్నర కిలోల కొబ్బరికి ఒక లీటర్ నూనె వస్తుందని వినోద్ తెలిపారు. గింజల నాణ్యతను బట్టి కొంచెం అటు ఇటుగా తేడా ఉంటుందన్నారు. కట్టె గానుగలతో నూనెలపై 3 రోజుల శిక్షణ ఆరోగ్య పరిరక్షణకు దోహదం చేసే కట్టె గానుగ నూనెల వినియోగం నగరాలు, పట్టణాల్లో ఇటీవల కాలంలో పెరుగుతోంది. కట్టె గానుగల ద్వారా నూనెను వెలికితీయడం నైపుణ్యంతో కూడిన పని. ఇందులో ఇమిడి ఉన్న సాంకేతిక అంశాలను ఆకళింపు చేసుకోవాలంటే ఎవరికైనా శిక్షణ అవసరమవుతుంది. గ్రామీణుల ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఉన్నందున ఆసక్తి కలిగిన యువతీ, యువకులకు వినోద్ తవణంపల్లెలో తన ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన కట్టె గానుగలపై శిక్షణ ఇస్తున్నారు. 10 మంది కలిసి ఒక బ్యా^Œ గా ఏర్పాటు చేసి 3 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఒక్కొక్కరికి 3 రోజులకు కలిపి రూ.4 వేల రుసుం వసూలు చేస్తున్నారు. సాధారణ వసతి, భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆసక్తి కలిగిన వారు. 9381321079, 9440230052 నంబర్లలో సంప్రదించవచ్చు. 25 వరకు కట్టెగానుగలు తయారు చేయించి అడిగిన వారికి సరఫరా చేశామని అంటూ.. వాడకపోతే పగుళ్లు వచ్చి కట్టె గానుగ పాడైపోతుందని వినోద్ తెలిపారు. సొంత ఊళ్లోనే గౌరవప్రదమైన ఉపాధిని వెతుక్కోవడంతోపాటు ఆరోగ్యదాయకమైన ఆహార స్వరాజ్యం కోసం శ్రమిస్తున్న వినోద్‌కు, అండగా నిలిచిన కుటుంబానికి ‘సాక్షి సాగుబడి’ జేజేలు చెబుతోంది. – గాండ్లపర్తి భరత్ రెడ్డి, సాక్షి, చిత్తూరు ఫొటోలు: ఎన్ మురళి ప్రకృతికి దగ్గరగా సంతృప్తిగా జీవిస్తున్నాం.. ఉద్యోగం మాని ప్రకృతి వ్యవసాయం, పుంగనూరు గోజాతి పరిరక్షణ, కట్టెగానుగల తయారీ వంటి పనుల్లో నిమగ్నం కావడం తమ కుటుంబానికి మానసికంగా ఎంతో సంతృప్తిగా ఉంది. మట్టిపాత్రల్లో సిరిధాన్యాలు కట్టెల పొయ్యి మీద వండుకు తింటున్నాం. కాలుష్యంలేని, కల్మషం లేని పనులు, ఆలోచనలు ప్రశాంతతను, సంతృప్తిని కలిగిస్తున్నాయి. మా ఆహారపు అలవాట్లు, జీవన విధానం కాలుష్యానికి దూరమై ప్రకృతికి దగ్గరైంది. కట్టె గానుగ నూనెలు వాడి ఆనందిస్తున్న వారి స్పందనలు మా కుటుంబానికి ఎంతో సంతృప్తినిస్తున్నాయి. ఉద్యోగంలో ఏటా రూ. 2 లక్షలు మిగిలేవి. రైతుగా మారిన తర్వాత ఖర్చులు పోను ఏటా రూ. 3–4 లక్షలు మిగులుతున్నాయి. మా తల్లిదండ్రులు, శ్రీమతి మమత ప్రోత్సాహంతోనే రైతుగా ఆనందంగా ఉన్నాను. భవిష్యత్తు మరింత ఆనందమయంగా ఉంటుందని చెప్పడానికి ఎటువంటి సందేహమూ లేదు. – సాతంబాకం వినోద్‌రెడ్డి (94402 30052), తవణంపల్లి, చిత్తూరు జిల్లా సంతృప్తికరమైన వేతనం.. ఆనందం.. నా యుక్త వయసులో నేర్చుకున్న పనికి ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది. గానుగ తయారీ వల్ల ప్రతి రోజూ రూ.400 నుంచి రూ.500 వరకు సంతృప్తికరమైన వేతనం లభిస్తోంది. పది మంది ఆరోగ్యంగా ఉండేందుకు సహాయ పడుతున్నందుకు ఆనందంగా ఉంది. – కోదండాచారి, కట్టె గానుగల వడ్రంగి ∙ గోమయంతో తయారు చేసిన వివిధ ఉత్పత్తులు -
ప్రకృతి వ్యవసాయంపై 29 నుంచి వారం రోజుల శిక్షణ
ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రకృతి వ్యవసాయ ట్రస్టు ఆధ్వర్యంలో బెంగళూరులోని మానస గంగ ఆశ్రమంలో ఈనెల 29 నుంచి వచ్చే నెల 4 వరకు గోఆధారిత ప్రకృతి వ్యవసాయం, 5 లేయర్ మోడల్, టెర్రస్ గార్డెనింగ్పై వారం రోజుల రెసిడెన్సియల్ శిక్షణా శిబిరం జరగనుంది. పత్తిలో గులాబీ పురుగు, మొక్కజొన్న ఆర్మీ లద్దెపురుగులను అరికట్టే పద్ధతులపై కూడా శిక్షణ ఇస్తారు. రిజిస్ట్రేషన్ వివరాలకు.. ఉమామహేశ్వరి – 90004 08907, నాయుడు – 79937 95246, లయ – 88973 32296. -
పచ్చని బంగారం శ్రీగంధం!
కవిత మిశ్రా.. విలక్షణ మహిళా రైతు.. శ్రీగంధం వంటి విలువైన కలప పంటతోపాటు 10 రకాల పండ్ల చెట్లు, కూరగాయలు, ఆవులు, గొర్రెలు, పందెం కోళ్లతో పాటు మొక్కల నర్సరీ పెంచుతున్నారు. 8 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని దేశానికే అద్భుత నమూనా క్షేత్రంగా మార్చారు. సమీకృత ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఏటా రూ. 25 లక్షల వరకు ఆర్జిస్తున్నారు. జాతీయ మహిళా రైతు దినోత్సవం సందర్భంగా ఇటీవల కవితను కేంద్ర వ్యవసాయ శాఖ ‘ఆనర్ ఆఫ్ ఎక్సలెన్సీ’ పురస్కారంతో సత్కరించడం విశేషం. ఈ అవార్డును తన క్షేత్రంలో వ్యవసాయ కార్మికులకు అంకితం ఇచ్చిన ఉత్తమ రైతు కవిత.. స్ఫూర్తిదాయకమైన ఆమె వ్యవసాయాను భవాలు.. ‘సాగుబడి’ పాఠకులకు ప్రత్యేకం.. కర్ణాటకలోని రాయ్‌చూర్ జిల్లా మాన్వి తాలూకా కవితల్ గ్రామం ఆదర్శ మహిళా రైతు కవిత మిశ్రా స్వస్థలం. ఎమ్మెస్సీ, కంప్యూటర్ డిప్లొమా పూర్తిచేసి ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం పొందారు. నియామక లేఖను భర్తకు చూపిస్తే.. ‘ఉద్యోగం వద్దులే. మన భూమిలో వ్యవసాయం చెయ్యి’ అన్నారట. భర్త మాటలకు ఆమె కుంగిపోలేదు. సవాలుగా తీసుకున్నారు. ఏసీ గదిలో కంప్యూటర్ ముందు పనిచేయాలన్న అభిలాష ఉన్నప్పటికీ.. పెద్దగా సారం లేని, ఇంచున్నర నీరున్న బోరుతో కూడిన తమ 8 ఎకరాల మెట్ట భూమిలోకి అడుగుపెట్టారు. తొలుత రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో దానిమ్మ తోటను సాగు చేసి బ్యాక్టీరియా తెగుళ్లవల్ల లక్షలాది రూపాయల పెట్టుబడి నష్టపోయారు. ఆ చేదు అనుభవం నుంచి మెట్ట ప్రాంత రైతుగా రెండు గుణపాఠాలు నేర్చుకున్నారు. 1. ఒకే పంటను సాగు చేయకూడదు. ఒకే పొలంలో అనేక పంటలు, అంతర పంటలు సాగు చేయాలి. కేవలం పంటల మీదే ఆధారపడకూడదు. పశువులు, చిన్న జీవాలు, కోళ్లను సైతం పెంచుతూ.. అనేక విధాలుగా నిరంతరం ఆదాయం వచ్చేలా చూసుకోవాలి. 2. ప్రకృతికి ఎదురీదటం కాదు, ప్రకృతికి అనుగుణమైన సాగు పద్ధతి మేలు. ఈ గ్రహింపుతో రసాయనిక వ్యవసాయానికి స్వస్తి చెప్పి, పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించారు. శ్రీగంధం సాగుతోపాటు 10 రకాల సీజనల్ పండ్ల చెట్లు నాటి.. దేశం గర్వించదగిన ఆదర్శ మహిళా రైతుగా ఎదిగారు. ఆగ్రోఫారెస్ట్రీ, సమీకృత వ్యవసాయంలో అన్ని విషయాలపైనా ఆమెకు స్వీయానుభవంతోపాటు లోతైన అవగాహన ఉండటంతో.. ప్రాంతీయ, జాతీయ స్థాయి వర్క్‌షాపులలో రైతుగా తనకున్న అపారమైన జ్ఞానాన్ని పంచుతున్నారు. శ్రీగంధం+10 రకాల పండ్ల చెట్లు 2,100 శ్రీగంధం చెట్లతో పాటు వెయ్యి దానిమ్మ, 600 మామిడి, 300 జామ, 450 సీతాఫలం, 100 నేరేడు, 100 మునగ, 100 ఉసిరి, 200 నిమ్మ, 100 కొబ్బరి చెట్లను 8 ఎకరాల్లో కవిత పెంచుతున్నారు. పొలంలో ఒక్క చదరపు అడుగు కూడా ఖాళీగా వదలకుండా పంటలు సాగు చేయాలని ఆమె సూచించారు. ట్రాక్టర్ కాదుకదా ఎద్దుల నాగలితో కూడా దుక్కి చెయ్యరు. ప్రకృతి వ్యవసాయంలో సూక్ష్మజీవులు, వానపాములే భూమిని గుల్లపరిచి సారవంతం చేస్తాయంటారామె. డ్రిప్ మైక్రోట్యూబ్స్ ద్వారా ప్రతి పది రోజులకోసారి చెట్లకు జీవామృతం, పంచగవ్య, దశపర్ణికషాయం మార్చి మార్చి ఇస్తున్నారు. 15 రోజులకోసారి పిచికారీ చేస్తారు. ఆవులు.. గొర్రెలు.. పందెం కోళ్లు.. చెట్లు చిన్నగా ఉన్న దశలో కొన్ని ఏళ్ల పాటు కూరగాయలు, వేరుశనగ తదితర సీజనల్ అంతర పంటలు సాగు చేసుకునేవారు కవిత. 5 ఆవులు, 30 గొర్రెలు, 150 సేలం నుంచి తెచ్చిన డ్రాగన్ ఫైటర్స్ రకం పందెం కోళ్లను పెంచుతున్నారు. శ్రీగంధం, ఇతర పండ్ల విత్తనాలు సేకరించి, వాటితో మొక్కలు పెంచి అమ్ముతున్నారు. ఈ ఏడాది 6–7 క్వింటాళ్ల శ్రీగంధం విత్తనాలను సేకరించారు. కిలో విత్తనాలను రూ.వెయ్యికి విక్రయిస్తున్నారు. ఏడాది వయసున్న శ్రీగంధం మొక్కను రూ.30కి అమ్ముతున్నారు. అనేక రాష్ట్రాల రైతులు కవిత నర్సరీ నుంచి మొక్కలను కొనుగోలు చేస్తున్నారు. రైతుకు రోజూ, వారం, నెల, సీజన్, 15 ఏళ్లకు.. నిరంతరం ఏదో ఒక విధంగా ఆదాయం వచ్చేలా సమీకృత ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించడం వ్యవసాయంపై కవితకు ఉన్న అపారమైన అవగాహన, శ్రద్ధకు నిదర్శనం. తోటలోనే ఇల్లు నిర్మించుకొని కవిత కుటుంబం నివసిస్తోంది. 5 వ్యవసాయ కార్మికుల కుటుంబాలతో సహా తోటలోనే మకాం ఉంటున్నారు. దీంతో ఆమె తన తోటను అనుక్షణం కంటికిరెప్పలా కాపాడుకుంటూ మంచి దిగుబడులు పొందుతున్నారు. ప్రస్తుతం ఏడాదికి 8 ఎకరాల్లో రూ. 25 లక్షల వరకు ఆదాయం పొందుతున్నానని కవిత గర్వంగా చెబుతారు. మైక్రోచిప్‌తో శ్రీగంధం చెట్లకు రక్షణ శ్రీగంధం వంటి విలువైన జాతి చెట్లు పెరుగుతున్నాయంటే.. వాటితోపాటే అభద్రత కూడా పెరుగుతున్నట్లే. అయితే, ఏడేళ్లు పెరిగిన చెట్టుకు మైక్రో చిప్‌ను అమర్చడం ద్వారా అది దొంగల పాలు కాకుండా కాపాడుకోవచ్చని కవిత మిశ్రా తెలిపారు. తన తోటలో శ్రీగంధం చెట్లకు త్వరలో మైక్రోచిప్‌లను అమర్చుకోబోతున్నారు. ఒక్కో చెట్టుకు రూ. 2,500 ఖర్చవుతుంది. కర్నాటక ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ వుడ్‌సైన్స్ టెక్నాలజీలో సర్వర్‌తో అనుసంధానం అయి ఉండే ఈ చిప్ వల్ల.. ఎవరైనా చెట్టును తాకిన వెంటనే సర్వర్‌కు, రైతు మొబైల్‌కు, పోలీస్ స్టేషన్‌కు కూడా హెచ్చరిక సందేశం వస్తుంది. తద్వారా విలువైన శ్రీగంధం చెట్లను సులువుగా రక్షించుకోవచ్చని కవిత తెలిపారు. ప్రతి రైతూ ఒక ఎకరంలోనైనా శ్రీగంధం నాటాలి.. ఆత్మాభిమానం కలిగి ఉండే రైతులు అప్పుల్లో కూరుకుపోకుండా తెలివితో ప్రణాళికాబద్ధంగా సమీకృత ప్రకృతి సేద్యం చేయాలని కవిత సూచిస్తున్నారు. ప్రతి రైతూ తమకున్న మొత్తం పొలంలో కాకపోయినా.. కనీసం ఒక ఎకరంలోనైనా ఈ పద్ధతిలో శ్రీగంధం, పండ్ల మొక్కలు వేసుకోవాలని సూచిస్తున్నారు. శ్రీగంధం 15 ఏళ్లకు ఎకరానికి కోట్లలో ఆదాయం వస్తుంది. శ్రీగంధం చెట్ల మధ్య నాటిన సీజనల్ పండ్ల చెట్లు బోనస్‌గా రైతుకు అందుతాయని, రైతులు ఉద్యోగుల మాదిరిగా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఇది మేలైన సాగు పద్ధతి అని కవిత మిశ్రా(94487 77045) అనుభవపూర్వకంగా చెబుతున్నారు. అరుదైన విద్యాధిక ఆదర్శ మహిళా రైతు కవిత మిశ్రా. ఆమె దీక్ష, దక్షతలకు ‘సాగుబడి’ జేజేలు పలుకుతోంది. ఎకరానికి 300 శ్రీగంధం చెట్లు.. 2011లో కర్ణాటక ప్రభుత్వం శ్రీగంధం సాగుకు రైతులను అనుమితిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ కొత్తల్లోనే 12“12 అడుగుల దూరంలో ఎకరానికి 300 శ్రీగంధం మొక్కలు నాటారు. శ్రీగంధం తనంతట తాను పెరిగే చెట్టు కాదు. పక్కన ఉన్న చెట్ల వేర్లపై ఆధారపడి బతుకుతుంది. ప్రతి శ్రీగంధం మొక్కకు 6 అడుగుల దూరంలో మామిడి, జామ, చింత, నేరేడు, కరివేపాకు మొక్కలు విధిగా నాటాలన్నది కవిత అభిప్రాయం. నాటిన 15 ఏళ్లకు శ్రీగంధం కోతకు వస్తుంది. కాండంలో చేవ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ ధర లభిస్తుంది. చెట్టుకు 20 కిలోల చేవ వచ్చినా ఎకరానికి 6 వేల కిలోల చేవ కలప దిగుబడి వస్తుంది. కిలో రూ. 8 వేల చొప్పున ఎకరానికి రూ. 4 కోట్ల 80 లక్షల ఆదాయం వస్తుందని ఆమె ఆశిస్తున్నారు. ఆమె శ్రీగంధం తోట వయసు 6 ఏళ్ల 8 నెలల. మరో 8 ఏళ్లకు కోతకు వస్తుంది. చెట్టుకు 70 కిలోల శ్రీగంధం చావ వచ్చింది! 2002లో బత్తాయి తోట సాళ్ల మధ్యలో 20 శ్రీగంధం మొక్కలు నాటా. 10 సంవత్సరాల వరకు నీళ్లిచ్చా. ఆ తర్వాత వేసవిలో నీళ్లిచ్చి బతికించా. 14.5 ఏళ్లు పెరిగిన తర్వాత ఏడాదిన్నర క్రితం అటవీ శాఖ అధికారుల అనుమతి తీసుకొని చెట్లు నరికి అమ్మాను. చెట్టు కాండం లోపల చావ కలప (హార్డ్ ఉడ్) ఎంత ఎక్కువ వస్తే రైతుకు అంత ఎక్కువ ఆదాయం వస్తుంది. కొన్ని చెట్లకు 70 కిలోల వరకు వచ్చింది. కిలో రూ. 6 వేలకు అమ్మాను. ఆ చెట్టుకు 4,20,000 వచ్చింది. తాటి చెట్ల నీడ వల్ల కొన్ని చెట్లకు చావ 20–30 కిలోలు మాత్రమే వచ్చింది. ఈ చెట్ల గింజలు పడి మా భూముల్లో కొన్ని మొక్కలు మొలిచి, పెరుగుతున్నాయి. ఉద్యాన కమిషనర్ వెంకట్రామ్రెడ్డి చొరవతో ఇప్పుడు శ్రీగంధం మొక్కలతోపాటు డ్రిప్ కూడా రైతులకు ఇవ్వనున్నారు. శ్రీగంధం చెట్లు పెంచిన తర్వాత వాటిని నరకడానికి అటవీ శాఖ అనుమతుల కోసం తిరగాల్సి వస్తున్నది. అయితే, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సులభంగా అనుమతి ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్న చీఫ్ కన్సర్వేటర్ ఇటీవల చెప్పారు. ప్రతి రైతూ శ్రీగంధం చెట్లు వేసుకుంటే.. మున్ముందు మంచి ఆదాయం వస్తుంది. – విస్తారపు రెడ్డి (63043 91957), పసునూరు, నాంపల్లి మండలం, నల్లగొండ జిల్లా ఎర్ర నేలలు శ్రీగంధం సాగుకు అనువైనవి! కర్ణాటకలోని కవిత మిశ్రా ఆదర్శ రైతు. శ్రీగంధం చెట్లతో పాటు వివిధ రకాల పండ్ల చెట్లు, కూరగాయలు, కోళ్లు, ఆవులు పెంచుతున్నారు. నర్సరీని కూడా ఏర్పాటు చేశారు. రోజూ, ఆరు నెలలకు, 15 ఏళ్లకు ఆదాయం వచ్చేలా అనేక జాతుల చెట్లు, పంటలు సాగు చేస్తూ మంచి ఆదాయం గడిస్తున్నారు. ఆమె విజయగాథ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో శ్రీగంధం సాగును ప్రోత్సహిస్తున్నాం. నీటికొరత, ఎర్ర, గ్రావెల్ నేలలున్న తెలంగాణకు శ్రీగంధం సాగు చాలా అనువైనది. ఔషధ, సుగంధ మొక్కల బోర్డు ఎకరానికి 3 ఏళ్లలో 18 వేల నుంచి 20 వేల వరకు సబ్సిడీ ఇస్తున్నది. ప్రతి రైతూ శ్రీగంధం మొక్కలు కనీసం పదైనా వేసుకుంటే భవిష్యత్తులో మంచి ఆదాయం వస్తుంది. అంతేకాదు, కార్బన్‌డయాక్సయిడ్‌ను పీల్చుకోవడం ద్వారా పర్యావరణానికి ఈ చెట్లు ఎంతో మేలు చేస్తాయి. మన దేశం సహా 8 దేశాల్లోనే శ్రీగంధం పెరుగుతుంది. కాబట్టి గిరాకీ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. ములుగులోని ఉద్యాన సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌లో 18 లక్షల శ్రీగంధం మొక్కలు పెంచుతున్నాం. జూలై–ఆగస్టు నాటికి మొక్క రూ. 15–20 ధరకు రైతులకు అందిస్తాం. ముందుగా పేర్లు నమోదు చేయించుకున్న రైతులకే శ్రీగంధం మొక్కలు ఇస్తాం. ఆసక్తి ఉన్న రైతులు ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయ ప్రసాద్(83744 49007)ను సంప్రదించవచ్చు. – ఎల్. వెంకట్రామ్రెడ్డి, కమిషనర్, తెలంగాణ ఉద్యాన శాఖ కవిత తోటలో ఉద్యాన కమిషనర్ తదితరులు తన తోటలో బత్తాయిలు, సీతాఫలాలతో కవిత మిశ్రా -
ప్రకృతి సేద్యంలో మేమే మేటి
సాక్షి, అమరావతి: సాంకేతిక పరిజ్ఞానాన్ని, ప్రకృతిని కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. భారతదేశంలో ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని చెప్పారు. 8 మిలియన్ల హెక్టార్లలో 60 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారని, రాష్ట్రంలో ప్రకృతి సేద్య విధానం ప్రపంచానికే ఒక ఆదర్శ నమూనాగా నిలిచిందని పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు మంగళవారం ఐక్యరాజ్యసమితి సదస్సుల్లో ‘సుస్థిర సేద్యం–ఆర్థిక చేయూత–అంతర్జాతీయ సవాళ్లు’ అనే అంశంపై ప్రసంగించారు. రాష్ట్ర జీఎస్డీపీలో 28 శాతం వ్యవసాయ రంగానిదేనని అన్నారు. రాష్ట్రంలో 62 శాతం జనాభాకు వ్యవసాయం, అనుబంధ రంగాలే జీవనాధారమని వెల్లడించారు. చంద్రబాబు ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘వ్యవసాయం అంటే అత్యధిక వ్యయం, శ్రమతో కూడుకున్నది. భూసారం క్షీణించి పర్యావరణం దెబ్బతింటుంది. ఉత్పత్తి, మార్కెటింగ్ చాలా కష్టంతో కూడుకున్నవి. పంటలు సరిగ్గా పండక గ్రామీణులు పట్టణాలకు వలస వెళుతుంటారు. వాతావరణ మార్పులతో కరవు కాటకాలు, వరదలు సంభవిస్తుంటాయి. ఈ దుష్ప్రభావాలను అధిగమించడానికే ప్రకృతి వ్యవసాయాన్ని (జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌ను) ప్రోత్సహిస్తున్నాం. ప్రకృతి సేద్యంలో మీరు ఒక డాలర్ పెట్టుబడి పెట్టినట్లయితే 13 డాలర్ల లాభం వస్తుంది. రసాయన ఎరువులతో వచ్చే దుష్ప్రభావాలు మేం ప్రవేశపెట్టిన ప్రకృతి వ్యవసాయంతో తొలగిపోతున్నాయి. సురక్షితమైన, మిక్కిలి పోషకాలతో కూడిన ఆహారోత్పత్తి సాధ్యమవుతోంది. వ్యవసాయాన్ని మేము లాభసాటిగా తీర్చిదిద్దడంతో ఐటీ నిపుణులు ఆ రంగంవైపు ఆసక్తి చూపుతున్నారు. రివర్స్ మైగ్రేషన్ ప్రారంభమైంది. యువతను వ్యవసాయం వైపు ఆకర్శిస్తున్నాం. ప్రకృతి సేద్యంతో పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నాం. ప్రకృతి సేద్యంతో పండించిన ఆహారోత్సత్తులు తీసుకుంటుండటంతో తమ ఆరోగ్యం బాగుపడిందని ప్రజలు చెబుతున్నారు. వచ్చే ఐదేళ్లలో రైతాంగాన్ని 100 శాతం ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. 2020 నాటికి 1.7 మిలియన్ల రైతులు, 2022 నాటికి 4.1 మిలియన్ల రైతులను ఈ సేద్యం వైపు మళ్లించాలన్నదే మా ధ్యేయం. కోర్ డ్యాష్‌బోర్డును మీకు కనెక్ట్ చేస్తా.. 20 ఏళ్ల క్రితం స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేశాం. ఇప్పుడు 9 లక్షల స్వయం సహాయక బృందాలున్నాయి. వీరంతా తమ గ్రామాలు దాటి తమ భాష రాని, తమ ప్రాంతం కాని ప్రాంతాలకు వెళ్లి ప్రకృతి వ్యవసాయంపై రైతాంగానికి అవగాహన కలిగిస్తున్నారు. భూమి ఉపరితలంపై కురిసే వర్షపు నీటిని రియల్ టైమ్ మేనేజ్మెంట్ ద్వారా ఒడిసి పడుతున్నాం, భూగర్భ జలాలుగా మారుస్తున్నాం. అల్పపీడనాలు ఏర్పడి అవి తుపానులుగా మారి ఎక్కడ కేంద్రీకృతమయ్యాయో రియల్ టైమ్ ట్రాకింగ్ వ్యవస్థతో చెప్పగలుగుతున్నాం. న్యూయార్క్‌లో ఉండి ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల గ్రామంలో వీధిలైట్ల వ్యవస్థను నేను రియల్ టైమ్ వ్యవస్థ సహాయంతో నిర్వహించగలను. నాకు సీఎం కోర్ డ్యాష్‌బోర్డు ఉంది. సీఎం కోర్ డ్యాష్‌బోర్డును మీకు కనెక్ట్ చేస్తా. మీరు అందులోని అంశాలన్నీ చూడొచ్చు’’ అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. -
30న పాలకొల్లులో ప్రకృతి సేద్యం–సిరిధాన్యాల ఆహారంపై సదస్సు
ప్రకృతి వ్యవసాయం ఆవశ్యకత, సేంద్రియ వ్యవసాయోత్పత్తుల విశిష్టత, సిరిధాన్య వంటకాల తయారీ– వినియోగం, ప్రయోజనాలపై రైతులను, ప్రజలను చైతన్యవంతం చేసే లక్ష్యంతో ఈ నెల 30న పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని సత్యవతి మెమోరియల్ లయన్స్ కమ్యూనిటీ హాల్లో సదస్సు జరగనుంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, పాలకొల్లు అర్బన్– రూరల్ లయన్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో ఉ. 9 గం. నుంచి మ. 3 గం. వరకు సదస్సు జరుగుతుంది. 29న సిరిధాన్య వంటకాలపై ఆహార నిపుణులు ‘మిల్లెట్స్ రాంబాబు’ శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 98487 11445, 94401 24253 -
జూన్‌లో వర్షాలకు బోర్లు పూర్తిగా రీచార్జ్!
కందకాలు తవ్వించడం వల్ల ఈ ఏడాది జూన్‌లో కురిసిన 4, 5 వర్షాలకు భూగర్భ నీటి మట్టం బాగా పెరిగిందని, మూడు బోర్లూ పుష్కలంగా జలకళను సంతరించుకున్నాయని చింతా నరసింహరాజు చెప్పారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం అర్మాయిపేట గ్రామ పరిధిలో ఆయనకున్న 27 ఎకరాల నల్లరేగడి భూమిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. 2017 నవంబర్‌లో తీవ్ర సాగునీటి కొరత ఏర్పడింది. మూడు బోర్లుంటే.. ఒక బోరే ఒక మోస్తరుగా పోసేది. మిగతా రెండు దాదాపు ఎండిపోయాయి. నాలుగు రోజులకోసారి పది నిమిషాలు నీరొచ్చే దుస్థితిలో ఉండేవి. అటువంటి సంక్షోభ పరిస్థితుల్లో ‘సాక్షి’, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం ఆధ్వర్యంలో కందకాల ద్వారా ‘చేనుకిందే చెరువు’ సాధించుకోవచ్చంటూ నిర్వహిస్తున్న ప్రచారోద్యమం గురించి మిత్రుడు క్రాంతి ద్వారా రాజు తెలుసుకున్నారు. పొలం అంతటా 50 మీటర్లకు వాలుకు అడ్డంగా ఒక వరుసలో.. మీటరు లోతు, మీటరు వెడల్పున కందకాలు తీసుకుంటే.. ఎంతటి కరువు ప్రాంత మెట్ట పొలాల్లో అయినా సాగు నీటి కొరత ఉండదని తెలుసుకున్నారు. కందకాలు తవ్వడానికి ఖర్చు అవుతుంది కదా అని తొలుత సందేహించినా.. నీరు లేకపోతే భూములుండీ ఉపయోగం లేదన్న గ్రహింపుతో కందకాలు తవ్వించారు. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్షులు, రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ (ఇరిగేషన్) సంగెం చంద్రమౌళి (98495 66009), సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ దామోదర్‌రెడ్డి (94407 02029)లను తమ పొలానికి ఆహ్వానించి, వారి ఉచిత సాంకేతిక సహకారంతో కందకాలు తవ్వించామని రాజు తెలిపారు. నల్లరేగడి నేల కావడంతో కందకాలలో అంత త్వరగా నీరు ఇంకదు. కందకాలు నిండగా పొంగిపొర్లి వెళ్లిపోయే నీటిని కూడా ఒడిసిపట్టుకోవడానికి మట్టికట్టతో కూడిన ఫాం పాండ్‌ను కూడా తవ్వించారు. కందకాలు, ఫాం పాండ్ తవ్వడానికి రూ. 2 లక్షల వరకు ఖర్చయిందన్నారు. గత ఏడాది నవంబర్ తర్వాత కురిసిన వర్షాలతోపాటు ఈ ఏడాది జూన్‌లో కురిసిన వర్షాలకు 4, 5 సార్లు కందకాలు పూర్తిగా నిండాయి. జూలైలో వర్షం పడలేదు. ఆగస్టులో వర్షాలకు రెండు, మూడు సార్లు కందకాలు నిండాయి. దీంతో భూగర్భ నీటి మట్టం బాగా పెరిగి, మూడు బోర్లూ పుష్కలంగా నీటిని అందిస్తున్నాయి. ఫాం పాండ్ దగ్గరలో ఉన్న బోరు పూర్తి సామర్థ్యంతో నీటిని అందిస్తున్నదని రాజు ‘సాగుబడి’కి వివరించారు. ప్రస్తుతం 4 ఎకరాల్లో కందులు (అంతరపంటలుగా మినుము, పెసలు, కొర్రలు), 5 ఎకరాల్లో తెలంగాణ సన్నాలు వరి పంట వేసినట్లు తెలిపారు. కొంత ఖర్చు అయినప్పటికీ, కందకాల ప్రభావం అద్భుతంగా ఉందని నరసింహరాజు (90084 12947) ఆనందంగా తెలిపారు. నీటి భద్రత రావటంతో పంటలకు ఇబ్బంది లేకుండా ఉందన్నారు. నీటికి ఇబ్బంది లేకుండా ఉండాలనుకునే రైతులు కందకాల ఆవశ్యకతను గుర్తించాలని సూచించారు. -
ఒకే పంట సరికాదు! ఏ పంటైనా దిగుల్లేదు!
ఘనజీవామృతం, జీవామృతం, నీమాస్త్రం.. వీటితో ఏ పంటలోనైనా నిస్సందేహంగా మంచి నికరాదాయం పొందడం సాధ్యమేనా? అని అంటే.. ముమ్మాటికీ సాధ్యమేనంటున్నారు యువ రైతు శ్రీనివాసరెడ్డి. ఏడేళ్ల అనుభవం ఆయనకు ఇచ్చిన భరోసా ఏమిటంటే.. ఏదో ఒక పంటకే రైతు పరిమితం కాకూడదు. మార్కెట్ పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు పంటల/తోటల సరళిని మార్చుకుంటూ వెళ్లడమే ఉత్తమ మార్కెటింగ్ వ్యూహమని అంటున్నారు శ్రీనివాసరెడ్డి. మార్కెట్ ఒడిదుడుకుల్లోనూ కరివేపాకు సాగులో.. ఏడాదికి ఎకరానికి కనీసం రూ. లక్షన్నర నికరాదాయం సాధిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఏ పంటనైనా పండించొచ్చన్న భరోసాతో ఈ యువ రైతు గొప్ప ఆశావహ జీవితాన్ని నిర్మించుకోవడంపై ‘సాగుబడి’ కథనం. ప్రకాశం జిల్లా దర్శి మండలం చలివేంద్ర గ్రామానికి చెందిన రైతు బాదం మల్లారెడ్డి, పద్మల కుమారుడైన శ్రీనివాసరెడ్డి బీకాం చదివి మట్టినే నమ్ముకొని జీవితాన్ని పండించుకుంటున్నాడు. తాతల కాలం నాటి 18 ఎకరాల సొంత భూమిలో ఏడేళ్లుగా మనసుపెట్టి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఆచరిస్తూ ఉద్యాన పంటల్లో స్థిరమైన ఆదాయాన్ని పొందుతున్నారు. పాలేకర్ శిక్షణా తరగతుల్లో పాల్గొనడం.. యూట్యూబులో వీడియోలు చూడటం, ప్రకృతి వ్యవసాయ పుస్తకాలు చదవడం ద్వారా నేలతల్లి ఆరోగ్యమే రైతు, దేశ సౌభాగ్యమని గుర్తించి తదనుగుణంగా ధైర్యంగా ఏడేళ్ల క్రితమే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఐదెకరాల్లో కరివేపాకు, 11 ఎకరాల్లో దానిమ్మ, ఎకరంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు. కివీ పండ్ల సాగుపై తాజాగా దృష్టిసారిస్తున్నారు. కరివేపాకులో ఎకరానికి రూ. లక్షన్నర ఎకరంలో ఏడేళ్ల క్రితం కరివేపాకు నాటి జీవామృతం, ఘనజీవామృతంతో సాగు ప్రారంభించిన తొలి ఏడాదే సత్ఫలితాలు రావడంతో క్రమంగా విస్తరించారు. ప్రస్తుతం ఐదెకరాల్లో సాగు చేస్తున్నారు. బోదె పద్ధతిలో కరివేపాకు సాగు చేపట్టిన శ్రీనివాసరెడ్డి క్రమంగా పదెకరాలకు విస్తరించారు. అయితే, కరివేపాకుకు మార్కెట్ విస్తరించకపోవడంతో గత మూడేళ్లుగా దానిమ్మ వైపు దృష్టి మరల్చారు. కరివేపాకు ఏటా 3 కోతల్లో ఎకరానికి మొత్తం 18 టన్నుల దిగుబడి వస్తుంది. శీతాకాలంలో అత్యధికంగా కిలోకు రూ. 25 ధర పలుకుతుంది. ఎండాకాలంలో హాస్టళ్లు మూతపడతాయి, ఆకు పెరుగుదల ఎక్కువగా ఉంటుంది కాబట్టి అసలు అడిగే వారే ఉండరు. ఏదేమైనా మొత్తంగా సగటున కిలోకు రూ. పది ధర పలుకుతుందని, ఎకరానికి ఏటా రూ. లక్షన్నర వరకు నికరాదాయం పొందుతున్నానని శ్రీనివాసరెడ్డి తెలిపారు. రసాయనిక సేద్యంలో రూ. 50 వేలు అధికంగా ఖర్చవుతుందన్నారు. 11 ఎకరాల్లో దానిమ్మ సాగు దానిమ్మలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న శ్రీనివాసరెడ్డిని కొందరు రైతులు దానిమ్మ పంటకు ప్రకృతి వ్యవసాయంలో దిగుబడి రాదని నిరాశపరిచారు. అయితే, నిరాశ చెందకుండా మూడేళ్ల క్రితం 4 ఎకరాల్లో దానిమ్మ నాటాడు. ఏడాదిన్నర క్రితం 3 ఎకరాలు, 2 నెలల క్రితం 4 ఎకరాల్లో దానిమ్మ నాటాడు. రసాయనిక మందులు వాడకుండా జీవామృతం, ద్రావణాలు, కషాయాలతోనే రెండు కోతల్లో ఖర్చులు వచ్చాయి. ఈ దఫా మంచి దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాడు. బోర్లు అడుగంటి, బావి నీరు కూడా చాలకపోవడంతో మూడు కిలోమీటర్ల దూరంలో రెండెకరాలు కొనుగోలు చేసి బోర్లు వేసి పైప్‌లైన్ ద్వారా బావిలోకి ఆ నీటిని తరలించి.. బావి నుంచి 18 ఎకరాలకు డ్రిప్ ద్వారా నీటి తడులు పెడుతున్నారు. రైతులకు సూచనలు, సలహాలు శ్రీనివాసరెడ్డి వద్ద ఆరు దేశీ ఆవులున్నాయి. కరివేపాకుకు 15 రోజులకోసారి జీవామృతం డ్రిప్ ద్వారా ఇస్తారు. వారానికోసారి వేపనూనె, నీమాస్త్రం.. 20 రోజులకోసారి ముడినూనెల పిచికారీ చేయడం వల్ల కరివేపాకు మంచి నాణ్యత, రంగు వస్తున్నాయని తెలిపారు. తండ్రి మల్లారెడ్డి ఆవుల సంరక్షణ బాధ్యతలు చూస్తూ కుమారునికి సూచనలు, సలహాలు అందిస్తుంటారు. ఏడేళ్లుగా ప్రకృతి సాగు వల్ల భూసారం పెరిగింది. పొలంలో ఎక్కడ మట్టి తీసి చూసినా తమ విసర్జితాలతో భూసారం పెంచే వానపాములు కనిపిస్తాయి. ఆవుల మూత్రం, పేడతో తానే కాక ఇతరులకు ద్రావణాలు, కషాయాలు తయారు చేసి ఇస్తున్నాడు. ఎప్పుడూ ఒకే ఉద్యాన పంటపై ఆధారపడటం కన్నా అనేక పంటలపై దృష్టిపెట్టడం రైతుకు శ్రేయస్కరమని ఆయన విశ్వాసం. ఏడాది క్రితం ఎకరంలో డ్రాగన్ ఫ్రూట్ నాటారు. ఇప్పుడు కివీ పండ్ల సాగుపై దృష్టిసారిస్తున్నానన్నాడు. శ్రీనివాసరెడ్డి వద్ద నుంచి రైతులు స్వయంగా వచ్చి, సోషల్ మీడియా ద్వారా కూడా సలహాలు తీసుకుంటూ ఉండటం విశేషం. – మేడగం రామాంజనేయరెడ్డి ,సాక్షి, దర్శి, ప్రకాశం జిల్లా డ్రాగన్ ఫ్రూట్ తోటలో శ్రీనివాసరెడ్డి.. బావిలోకి బోరు నీరు.. పొలం వానపాముల మయం -
నాన్ బీటీ.. నాదే విత్తనం!
విత్తనమే లేకుంటే వ్యవసాయమే లేదు. పది వేల సంవత్సరాల క్రితం నుంచీ రైతులు తాము పండించిన పంటలో నుంచే మెరుగైన విత్తనాన్ని సేకరించి దాచుకుని.. తర్వాత సీజన్లో విత్తుకుంటున్నారు. అంతేకాదు, ఇతర రైతులతో విత్తనాలు ఇచ్చి పుచ్చుకుంటున్నారు. అమ్ముతున్నారు. ఇది రైతుకున్న హక్కు. విత్తన సార్వభౌమత్వమే రైతు స్వాతంత్య్రానికి ప్రాణాధారం. అయితే, విత్తనం కంపెనీల సొత్తుగా మారిపోయిన ఆధునిక కాలంలోనూ.. విత్తనం కోసం అంగడికి పోకుండా.. తమదైన సొంత విత్తనాన్ని అపురూపంగా కాపాడుకుంటున్న రైతు కుటుంబాలు లేకపోలేదు. వరి వంటి పంటల్లో సొంత విత్తనాన్నే వాడుకుంటున్న రైతులు చాలా చోట్ల కనిపిస్తారు. అయితే, ఆశ్చర్యకరమేమిటంటే ఏళ్ల తరబడీ పత్తి, మిర్చి పంటల విత్తనాలూ సొంతవే వాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో అధిక దిగుబడులు తీస్తున్న కుటుంబాలు చాలా అరుదనే చెప్పాలి. అటువంటి అరుదైన రైతు దంపతులు లావణ్య, రమణారెడ్డి! రమణారెడ్డి, లావణ్య దంపతుల స్వగ్రామం కారువంక(నాగర్‌కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం). ఇతర పంటలతోపాటు గత 29 ఏళ్లుగా పత్తి పండిస్తున్న కుటుంబం ఇది. గత ఎనిమిదేళ్లుగా పత్తి, మిర్చి పంటలకు సొంత విత్తనాలనే వాడుకుంటూ రైతు లోకానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. పత్తిని వర్షాధారంగా, మిర్చిని డ్రిప్‌తో సాగు చేస్తున్నారు. పంట ఏదైనా కుటుంబ సభ్యులందరూ నిమగ్నమై పొలం పనులు చేసుకోవడం వీరి అలవాటు. 2010 నుంచి సుభాష్ పాలేకర్ చూపిన బాటలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు. నాన్ బీటీ సూటిరకం లోకల్ పత్తి విత్తనాన్నే గత ఎనిమిదేళ్లుగా వాడుతున్నారు. తమ పత్తి పంటలో 2,3 విడతల తీతల్లో నాణ్యత ఉన్న చెట్ల నుంచి దూదిని సేకరించి విత్తనం కోసం వేరుగా పక్కన పెట్టుకుంటారు. దగ్గర్లోని జిన్నింగ్ మిల్లులో ఆ పత్తిని జిన్నింగ్ చేయించి, గింజలను శుద్ధి చేయించి ఇంటికి తెచ్చుకుని తర్వాత పంట కాలంలో విత్తుకుంటారు. క్వింటా పత్తి నుంచి 65 కిలోల వరకు విత్తనాలు వస్తాయని, వాటిని శుద్ధి చేయించి ప్రతి ఏటా విత్తుకుంటున్నామని రమణారెడ్డి తెలిపారు. మార్కెట్లో కంపెనీలు అమ్మే జన్యుమార్పిడి పత్తి విత్తనాలను కొనుగోలు చేయకుండా పత్తిని సైతం తన సొంత నాన్‌బీటీ సూటి విత్తనంతోనే సాగు చేస్తున్నామని తెలిపారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు.. ఏవీ వాడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే సాగు చేస్తున్నారు. ఆవులు, ఎద్దులన్నీ కలిపి 16 ఉన్నాయి. ఎకరానికి ఘనజీవామృతం మొత్తం 600 కిలోలు, 400 లీ. ద్రవ జీవామృతం, అవసరం మేరకు కషాయాలు వాడుతున్నారు. ప్రతి పది పత్తి సాళ్లకు ఒక సాలు కందిని విత్తుతున్నారు. ఘనజీవామృతం దుక్కి ఎకరానికి వంద కిలోలు వేస్తారు. జీవామృతాన్ని నెలకోసారి పది రెట్లు నీటితో కలిపి మొక్కకు పోస్తారు, నెలకోసారి పిచికారీ చేస్తారు. దీపావళి రోజుల్లో పత్తిలో ఆవాలను అంతరపంటగా చల్లుతారు. తమ పత్తి పంటకు గులాబీ రంగు పురుగు బెడద అసలు లేకపోవడం విశేషం. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఎకరానికి వర్షాధారంగా 12–15 క్వింటాళ్ల పత్తి దిగుబడి పొందుతున్నారు. గత ఏడాది 18 ఎకరాల్లో అధిక వర్షాల కారణంగా కొంత నష్టం జరగడంతో 219 క్వింటాళ్ల (ఎకరానికి 12 క్వింటాళ్ల చొప్పున) పత్తి దిగుబడి వచ్చిందని రమణారెడ్డి ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. ఈ ఏడాది 10 ఎకరాల్లో నాన్ బీటీ పత్తిని ఇప్పటికే విత్తామని, మరో పదెకరాల్లో త్వరలో విత్తబోతున్నామని చెప్పారు. రోహిణీ కార్తెలోనే విత్తుకోవడం..! రోహిణీ కార్తెలో వర్షానికి ముందే తాము ఎకరానికి 3 కిలోల విత్తనాన్ని సాళ్లుగా విత్తుకుంటామని, అధిక దిగుబడి పొందడానికి ఇదే ముఖ్యకారణమని రమణారెడ్డి చెబుతున్నారు. ఒక వేళ వర్షాలు సరిగ్గా లేక విత్తనంలో సగం మొలిచినా మంచి దిగుబడే వస్తున్నదని, ఇది గత ఎనిమిదేళ్లుగా తమ అనుభవమని ఆయన అంటున్నారు. తమ సొంత విత్తనమే కాబట్టి పూర్తిగా మొలవకపోయినా మళ్లీ విత్తనం వేసుకోవచ్చన్న భరోసా వీరిలో కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు తమకు ఆ అవసరం ఎప్పుడూ రాలేదని అంటున్నారాయన. ఆరుద్రలో మిరప, వరి నారు.. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఎండు మిరపను డ్రిప్‌తో సొంత విత్తనంతో సాగు చేస్తూ.. ఎకరానికి 30–36 క్వింటాళ్ల వరకు దిగుబడి పొందుతూ రమణారెడ్డి, లావణ్య తమ ప్రత్యేకత చాటుతున్నారు. నాగపూర్‌లో ఒక రైతు నుంచి గత 14 ఏళ్ల క్రితం హర్షవర్ధిని మిరప విత్తనాన్ని తెచ్చారు. 2,3 కోతల్లో మంచి నాణ్యతతో ఉన్న కాయలను విత్తనానికి పక్కన పెట్టుకుంటూ.. ఇప్పటికీ అదే వంగడం వాడుకుంటున్నామని తెలిపారు. 9 నెలల పంటకాలంలో 5 విడతలుగా ఎకరానికి 2 నుంచి 4 టన్నుల వరకు ఘనజీవామృతం వేస్తారు. 5 విడతల్లో ఎకరానికి వెయ్యి లీ. ద్రవజీవామృతం ఇస్తున్నారు. గత ఏడాది 3 ఎకరాల్లో ఎండు మిరప సాగు చేశారు. ఆరుద్ర కార్తెలో మిరప, వరి నార్లు పోసుకుని నాటు వేస్తారు. మొదట్లోనే మిర్చి పొలం చుట్టూ ఎర పంటగా ఆవాలు చల్లడం ద్వారా పురుగుల తాకిడిని అదుపు చేస్తున్నారు. మొక్కనాటిన 3 నెలల తర్వాత ధనియాలు, మెంతులు, గోధుమలు, పప్పుశనగ వంటి స్వల్పకాలిక అంతర పంటల విత్తనాలు చలుతున్నారు. గత ఏడాది ఎకరానికి 30 క్వింటాళ్ల ఎండు మిర్చి దిగుబడి తీశామని రమణారెడ్డి(99513 41819) వివరించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పూర్తిస్థాయిలో అనుసరిస్తే నాన్‌బీటీ సూటిరకం పత్తి, మిరప పంటలను కూడా నిశ్చింతగా సాగు చేసి మంచి దిగుబడులు పొందవచ్చని ఈ రైతు దంపతులు చెబుతున్నారు. ఇదేమి చోద్యం?! రమణారెడ్డి, లావణ్య గత 8 ఏళ్లుగా ప్రకృతి సేద్యంలో చేస్తున్న సఫల ప్రయోగాలపై వ్యవసాయ విశ్వవిద్యాలయం, స్పైసెస్ బోర్డు పట్టించుకున్న దాఖలాల్లేవు. అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే ముఖ్యమైన వాణిజ్య పంటలపై 8 ఏళ్ల క్షేత్రస్థాయి ఆదర్శ సేద్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం విడ్డూరం! -
అమృతాహారం.. ఆర్థికానందం!
అడపా వెంకట రమణ చైతన్యవంతుడైన రైతు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలంలోని భోగాపురం ఆయన స్వగ్రామం. సొంత పొలంలో నాలుగేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ.. సంతోషంగా ఉన్నారు. ‘సాక్షి’లో ప్రతి మంగళవారం ప్రచురితమవుతున్న ‘సాగుబడి’ కథనాల ద్వారా పొందిన స్ఫూర్తితోనే ప్రకృతి వ్యవసాయం చేపట్టానని, అప్పటి నుంచీ ‘సాగుబడి’ పేజీలన్నిటినీ సేకరించి దాచుకుంటూ మళ్లీ మళ్లీ చదువుకుంటున్నానని వెంకట రమణ సంతోషంగా చెప్పారు.రసాయనాలు వాడకుండా పండించిన బియ్యం తినడం వల్ల తనకున్న ఆస్తమా, డస్ట్ ఎలర్జీ పూర్తిగా పోయాయని, భూమి తల్లితోపాటు తన ఆరోగ్యం కూడా బాగైందని ఈ విలేకరితో ముఖతా చెబుతున్నప్పుడు ఆయన కళ్లలో కృతజ్ఞతాపూర్వకమైన సంతృప్తి, ఆనందం కనిపించింది. వెంకట రమణ తొలినాళ్లలో ఒడిదుడుకులను, ఇరుగు పొరుగు వారి ఎగతాళి మాటలను లక్ష్యపెట్టకుండా ముందడుగు వేసి.. అమృతాహారాన్ని అపురూపంగా పండిస్తున్న ఒక రైతుగా గొప్ప ఆనందాన్ని అనుభవిస్తూ ఆర్థికానందాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా పొందుతున్నారు.తన ప్రకృతి వ్యవసాయ ప్రస్థానం గురించి ఆయన మాటల్లోనే.. ‘‘సాక్షి సాగుబడిలో ప్రచురితమైన ‘జీవితేచ్ఛకు నార్వోసి నీర్వెట్టి..’ అనే కథనం నాలుగేళ్ల క్రితం నన్ను కదిలించింది. అదే సంవత్సరం నుంచే ప్రకృతి వ్యవసాయం చేపట్టాను. ప్రతి వారం సాగుబడి కథనాలు చదివి, అవగాహన చేసుకుంటున్నాను. పాటించాల్సిన మెలకువలు, పద్ధతులను సవివరంగా వస్తున్న కథనాలతో సొంతంగా అన్ని సేంద్రియ ఎరువులు తయారు చేసుకోగలుగుతున్నాను.. ఎక్కడెక్కడో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతుల క«థనాలతో అదే బాటలో తాము పయనించడానికి సాక్షి సాగుబడి మార్గదర్శిగా మారింది. తొలి ఏడాదే మా సొంత పొలం ఆరెకరాల్లో వరిని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వేశాను. పిండీ(రసాయనిక ఎరువులు), పురుగుమందులు కొట్టిన తోటి రైతులకు ఎకరానికి 30 బస్తాల ధాన్యం పండితే నాకు 15 బస్తాలు పండాయి(నాలుగో ఏడాదికి ఎకరా దిగుబడి 25 బస్తాలకు పెరిగింది). పిండెయ్యకపోతే ఎలా పండుతుంది? అంటూ ప్రత్తిపాడు– రాపర్తి గ్రామాల రైతులు తెగ ఎగతాళి చేశారు. ఇది పనికొచ్చే వ్యవసాయం కాదన్నారు. అయితే, మార్కెట్లో సాధారణ ధరకే ధాన్యం అమ్ముకోవాల్సి వచ్చింది. రసాయనిక అవశేషాల్లేని బియ్యం అని చెప్పి అమ్ముకోవడం తెలియలేదు. ఆవేశంతో ఒకేసారి ఆరెకరాలు వేయడం తప్పని అర్థమైంది. తర్వాత నుంచి రెండెకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే ఏలేరు కాల్వ నీటితో సార్వా, దాళ్వా ఊడుస్తున్నాను. ఇప్పుడు ఎకరానికి ఖాయంగా 25 బస్తాలు పండిస్తున్నా. చీడపీడలొస్తాయేమోనన్న బెంగ లేదు. రెండేళ్లుగా అయితే పురుగు కషాయాల అవసరం కూడా నాకు రాలేదు. కలుపు మందులు చల్లటం లేదు. నిశ్చింతగా పంట పండుతుంది. మూడో పంటగా మినుములు వేస్తున్నా. వర్షాలు దెబ్బతీయకపోతే చేతికి మినుములు వస్తాయి. లేదంటే భూసారం పెంచడానికి భూమిలో కలిపి దున్నేస్తున్నాను.. నేను చిన్నప్పుడు వర్షాధారంగా పిండి వేయకుండానే మా అమ్మానాన్నా పంటలు పండించే వారు. పెద్దయ్యేటప్పటికి రసాయనిక వ్యవసాయం పుంజుకుంది. రెండు పంటలకూ కలిపి ఎకరానికి 14 బస్తాల రసాయనిక ఎరువులు వేస్తున్నారు. రెండు సార్లు గుళికలు, ఐదారుసార్లు పురుగుమందులు చల్లుతున్నారు. రెండు పంటలకు ఎకరానికి రూ. 50 వేలు ఖర్చవుతున్నది. సార్వాలో 30–35 బస్తాలు, దాళ్వాలో 27 బస్తాలు పండిస్తున్నారు. వాళ్లు బస్తా ధాన్యం మహా అయితే, రూ. 1,400కు అమ్ముతున్నారు. ప్రకృతి వ్యవసాయంలో నాకు ఎకరానికి రెండు పంటలకు కలిపి రూ. 20 వేలు ఖర్చవుతుంది. సార్వా, దాళ్వా కలిపి 50 బస్తాలు పండించి, క్వింటా ధాన్యం రూ. 2,000కు అమ్ముతున్నా. వాళ్లకన్నా నాకే నికరాదాయం ఎక్కువగా వస్తున్నది. వాళ్లు మార్కెట్‌కు తీసుకెళ్లి ధర ఎంతుంటే అంతకు అమ్ముకోవాలి. నేను మార్కెట్ కోసం వెతుక్కోనక్కరలేదు. ఖాతాలున్నాయి. వాళ్లే ఇంటికి వచ్చి నేను చెప్పిన ధరకు తీసుకెళ్తున్నారు..పిండేసిన బియ్యం తినేటప్పుడు నాకు ఆస్తమా, డస్ట్ ఎలర్జీ ఉండేవి. ప్రకృతి ఆహారం తిన్నాక అవి పోయాయి. మా చేనును చూస్తుంటే పసిపాప నవ్వును చూసినట్టుంటుంది. ఎటెళ్లి వచ్చినా చేలోకి వెళ్లి 10 నిమిషాలు గట్టుమీద కూర్చుంటే కానీ ఊసుపోదు..’’ – వెలుగుల సూర్య వెంకట సత్యవరప్రసాద్, సాక్షి, పిఠాపురం, తూ.గో. జిల్లా నేను ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన రెండో ఏడాది మా ఇరుగు పొరుగు వరి పొలాలకు ఎండాకు తెగులు వచ్చింది. ఎకరానికి 10 బస్తాలు కూడా రాలేదు. అయితే, మా పొలానికి ఎండాకు తెగులు రాలేదు. నా దిగుబడి తగ్గలేదు. ఇది చూసిన తర్వాత రైతుల్లో ఆలోచన మొదలైంది. ఏమో అనుకున్నాం గానీ ప్రకృతి వ్యవసాయంలో ఇంత శక్తి ఉందా? అంటూ నోరెళ్లబెట్టారు. అయితే, కౌలు రైతులు నష్టాల భయంతో ముందుకు రాలేకపోతున్నారు. ఎకరానికి కౌలు పది బస్తాలు. అందువల్ల వాళ్లు వెనకాడుతున్నారు. ఎరువుల మీద సబ్సిడీని రైతులకు నేరుగా నగదు రూపంలో వరుసగా మూడేళ్లు ఇస్తేగానీ కౌలు రైతులు మారలేరు. భూమికి, రైతుకు తల్లీబిడ్డకున్న అనుబంధం ఉంది. ప్రకృతి వ్యవసాయంతో భూమిని బతికించి, రైతును బతికించుకోవాలి.. (రైతు వెంకట రమణను 99899 84347 నంబరులో సంప్రదించవచ్చు). జీవామృతం కలుపుతున్న వెంకట రమణ నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
జింజుబా గడ్డి ఆవులకు భలే ఇష్టం!
తెలుగు రాష్ట్రాల్లో పాల కోసమో, బ్రీడ్ అభివృద్ధి కోసమో, ఆసక్తి కొద్దీనో ఆవులను పెంచేవారు కొందరు ఈ మధ్య జుంజుబా గడ్డి పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. ఇది ప్రాచుర్యంలోకి రావడానికి ముఖ్యంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఈ రకం గడ్డి పోచలు సన్నగా మెత్తగా ఉండడం, 14.5% ప్రొటీన్‌తో కూడి రుచిగా ఉండడం వల్ల ఆవులు ఈ గడ్డిని ఇష్టంగా తినడం ఒక కారణమైతే.. దీన్ని పెంచడానికి శ్రమ గానీ, ఖర్చుగానీ పెద్దగా లేకపోవడం మరొకటని చెబుతున్నారు. ఒకసారి నాటుకుంటే.. మొదట 45 రోజులకు.. తర్వాత ప్రతి 35 రోజులకోసారి గడ్డి కోతకు వస్తుంది. జుంజుబా గడ్డిని గుజరాత్ నుంచి తెచ్చి కొందరు దేశీ ఆవుల పోషకులు, పాడి రైతులు సాగు చేస్తున్నారు. వీరిలో ‘సేవ్’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు, ప్రకృతి వ్యవసాయదారులు విజయరామ్ ఒకరు. గత కొన్ని నెలలుగా జుంజుబా గడ్డిని పెంచి సత్ఫలితాలను గమనించిన ఆయన ఇతర రైతులకు ఈ గడ్డి విత్తనాన్ని ఆయన అందిస్తున్నారు. విజయరామ్ అందించిన సమాచారం ప్రకారం.. గుప్పెడు జుంజుబా గడ్డి పోచలు(సుమారు 100 పోచలు) ప్రతి రైతుకూ ఇస్తారు. దీన్ని ఆరు అంగుళాల పొడవున కత్తిరించి, ఒకటి లేదా రెండు గణుపులు మట్టిలోపలికి వెళ్లేలా.. ఎటు చూపినా అడుగున్నర దూరంలో.. నాటుకోవాలి. రెండు సెంట్లకు సరిపోతుంది. మొలక వచ్చిన 20 రోజులకోసారి, తర్వాత 15 రోజులకోసారి నీటితో కలిపి జీవామృతాన్ని అందిస్తే చాలు. అవకాశం ఉన్న రైతులు రెండు వారాలకోసారి జీవామృతాన్ని పారగట్టడం లేదా డ్రిప్ ద్వారా అందిస్తే మంచిది.35 రోజులకోసారి.. ఏళ్ల తరబడి గడ్డి దిగుబడి వస్తూనే ఉంటుంది. ఆవుకు రోజుకు ఎండుగడ్డి, దాణాతోపాటు 15 కిలోల పచ్చిగడ్డి వేస్తున్నారు. ఆ లెక్కన చూస్తే 30 ఆవులకు ఏడాది పొడవునా పచ్చి మేతను అందించడానికి ఎకరం పొలం అవసరమవుతుంది. ఎకరాన్ని చిన్న మడులుగా విభజించుకొని నాటుకోవాలి. ఒక మడిలో గడ్డి కోత పూర్తయ్యాక ఘనజీవామృతం వేయడం అవసరమని విజయరామ్ తెలిపారు. వికారాబాద్ జిల్లాలోని తమ వ్యవసాయ క్షేత్రంలో జూన్ నాటికి ఈ గడ్డి విత్తనం రైతులకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ గడ్డి పొలంలో నడిచే వారి కాళ్లకు కోసుకుపోవడం ఉండదని, గడ్డిపోచలు మెత్తగా ఉండటమే కారణమన్నారు.కృష్ణా జిల్లా గూడూరు మండలం (తరకటూరు చెక్‌పోస్ట్ దగ్గర) పినగూడూరు లంక గ్రామంలోని తమ సౌభాగ్య గోసదన్‌లో ఈ గడ్డి విత్తనం దేశీ ఆవులను పెంచే రైతులకు పంపీణీ చేయనున్నారు. వివరాలకు.. తిరుపతి– 90002 69724, ‘సేవ్’ ప్రతినిధి సురేంద్ర: 99491 90769 -
శెహభాష్ సాంబిరెడ్డి
వంగా సాంబిరెడ్డి స్వగ్రామం గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలోని వల్లభాపురం. కూరగాయల దగ్గర్నుంచి బియ్యం, పసుపు, కందుల వరకు ఇంటికి అవసరమైన చాలా రకాల ఆహార పంటలను సాగు చేస్తున్నారు. ఏడాదిలో ఏ రోజైనా మార్కెట్ ధరతో నిమిత్తం లేకుండా రైతు ధరకే తీసుకెళుతున్నారు. విజయవాడ, గుంటూరు నగరాల నుంచి వ్యాపారులు చేను వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. పెట్టుబడులు పెరిగి పుట్టెడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వ్యవసాయరంగంలో ఈ రైతు సాధించిన విజయం అద్భుతం. అదెలాగో ఆయన మాటల్లోనే... బీటెక్ చదివి ఎంబెడెడ్ ఇంజనీరుగా చెన్నైలో మూడు దశాబ్దాలు సాఫ్ట్వేర్ సంస్థను నడిపాను. స్వస్థలం వల్లభాపురంలో పెద్దల్నుంచి వచ్చిన భూమి కౌలుకిస్తే ఫలసాయం పెద్దగా లేకపోగా, రసాయనాల వాడకంతో ఏటికేడాది సారం తగ్గిపోతోంది. బాధనిపించింది. కంపెనీని కుటుంబసభ్యుల కప్పగించి వచ్చేశాను. భూమి ఆరోగ్యం మెరుగుపడితేనే ఏదైనా సాధించగలం అనిపించింది. ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టాను. ఇంటర్నెట్లో ప్రకృతి వ్యవసాయ సూత్రాలను అధ్యయనం చేస్తూ, సాగుకు ఉప్రకమించాను. అయిదేళ్లుగా కష్టనష్టాలకోర్చి చేసిన వ్యవసాయానికి తగ్గ ఫలితాలను ఏడాదిగా చవిచూస్తున్నా.. సహజసిద్ధంగా పంటల సాగు... టూత్‌పేస్ట్‌తో సహా తయారీ రంగంలోని ఏ వస్తువుకైనా గరిష్ట చిల్లర ధర(ఎంఆర్పీ)ను ఆయా కంపెనీలే నిర్ణయిస్తున్నపుడు.. పండించిన పంట ధరను నిర్ణయించటానికి రైతులకు అవకాశం ఎందుకు ఉండటం లేదనే ప్రశ్న నా మనసును వేధిస్తుండేది. ఆరోగ్యకరంగా పండించిన నాణ్యత కలిగిన పంటను తీసుకురాగలిగితే, అమ్మకానికి ఢోకా ఉండదు, పైపెచ్చు వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడినట్టు అవుతుందని భావించాను. ఇందుకు ప్రకృతి వ్యవసాయం భేషైన పరిష్కారంగా తోచింది. చిక్కుడు పొలంలో సాంబిరెడ్డి మాకున్న 30 ఎకరాల పొలంలో బిందు సేద్య పద్ధతిలో నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకొని.. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటల సాగుకు ఐదేళ్ల క్రితం ఉప్రకమించాను. రసాయనాల ప్రభావం తగ్గిపోయి, భూమి పూర్తిస్థాయి సహజ స్వభావాన్ని సంతరించుకోవటానికి నాలుగేళ్లు పట్టింది. తెగుళ్లు, పురుగు రాకుండా భూమి నిరోధకశక్తి పెరిగింది. ఏడాది నుంచి గుంటూరు, విజయవాడ, మంగళగిరి, కుంచనపల్లి నుంచి వ్యాపారులు మా పొలం దగ్గరకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. కూరగాయలేవైనా కిలో ధర రూ. 30..ఏడాది మొత్తం ఒకటే ధర మరో ఆరు ఎకరాలు తీసుకుని మొత్తం 36 ఎకరాల వ్యవసాయం చేస్తున్నా. పోషకాలు ఎక్కువగా ఉండే బ్లాక్ రైస్, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే రకం ఆర్ఎన్ఆర్ 15048, సన్నాలు (005), ప్రగతి రకం (కుర్కుమిన్ 4.62 శాతం) పసుపు, మినుములు, పెసలు, కందులు, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, శెనగ, ఉలవలు సాగు చేస్తున్నాను. వీటికి తోడు బొప్పాయి, కూర అరటి, దానిమ్మ సాగు చేయబోతున్నాను. సీజనువారీగా చాలా రకాల కూరగాయలు పండిస్తున్నాను. ప్రస్తుతం వంకాయ, టొమాటో, గోరుచిక్కుడు, పచ్చిమిర్చి, పండుమిర్చి, కాప్సికం, బీట్రూట్, క్యారట్, ముల్లంగి, దోస, సొరకాయ ఉన్నాయి. తర్వాతి సీజనులో బీర, పొట్లకాయ, సొరకాయ, కాకరకాయ వేస్తాం. ఏ కూరగాయ అయినా కిలో రూ.30 ధర నిర్ణయించాను. మార్కెట్లో కిలో రూ.10 అయినా, రూ.60కి పెరిగినా నా ధరలో మార్పుండదు. పండించే పంటకు కనీస ధర ఎంతన్నది ముందు తెలిస్తే భరోసా ఉంటుంది కదా! ఎర పంటలతో సమగ్ర సస్య రక్షణ.. మన భూమి ఎంత ఆర్గానిక్ అయినా పరిసరాల్లోని పొలాల్లోంచి తెగుళ్లు, పురుగు వచ్చే అవకాశం ఉంది. సమగ్ర సస్య రక్షణ చేస్తున్నాం. క్యాబేజి, కాలీఫ్లవర్‌ను ఆశించే పురుగులను ఆకర్షించేందుకు చేను మధ్యలో అక్కడక్కడా ఆవాలు పంట వేస్తున్నా. వాటికి ఆహారంగా ఆవాలు పంటను ఇచ్చి, ప్రధాన పైరును నిరపాయకరంగా తీసుకుంటున్నా. తులసి, కొత్తిమీర, సోంపు, జీలకర్ర, వాము వంటి మొక్కలు తమ వాసనతో పురుగులను నిరోధిస్తాయి. ఇవి పంట నివ్వటమే కాదు, ఇతర పంటల రక్షణకు ఉపయోగపడుతున్నాయి. అలాగే ఎర పంటలు... టొమాటోకు బంతి, వంగకు బెండ.. ఇలా ఒక్కో పంటకు ఒక్కో ఎర పంటను ఉంచుతూ పంట సరిహద్దుల్లో ప్రధాన పైరుకన్నా ఎక్కువ ఎత్తులో ఉండే జొన్న/ మొక్కజొన్న, మొత్తం చేను చుట్టూ అవిశె తోటను పెంచుతూ వస్తున్నా. మిత్ర, శత్రు పురుగులనూ పట్టించుకుంటున్నా. శత్రు పురుగులను అశక్తులను చేసేందుకు పసుపు, నీలిరంగు, నీటిరంగు తరహాలో రకరకాల ట్రాప్స్‌ను చేలో వాడుతున్నాం. మిత్ర పురుగులకు పొలంలో చోటు కల్పిస్తున్నాం. పంటను దెబ్బతీసే శత్రు పురుగుల గుడ్లను ఇవి ఆహారంగా తీసుకుంటూ పంటకు రక్షణ కల్పిస్తుంటాయి. భూమి ఉత్పత్తి శక్తిని పెంచేందుకు... భూమి ఉత్పత్తి శక్తిని పెంచుకొనేందుకు బాక్టీరియా, సేంద్రియ ఎరువు, పొలం వ్యర్ధాలు (కంది పొట్టు, మినప పొట్టు, కాల్చని చెత్తయినా సరే), ఫ్యాక్టరీ వ్యర్ధాలు (వేరుశెనగ పొట్టు, నూనె తీసిన నువ్వుల చెక్క, చెరకు పిప్పిని రెండేళ్లకోసారి వేస్తున్నాం. కానుగ పిండి, వేప పిండి, విప్ప పిండి, ఆముదం పిండిని వాడుతున్నాం. ఉదజని సూచిక(పీహెచ్) స్థాయి, పోషకాలను పరిశీలించుకుని పైన చెప్పిన వాటిలో తగినవి భూమిలో దున్నేశాం. ఆ విధంగా భూమిని ‘సకల పోషకాల గని’గా చేసుకోగలిగాం. బిందు సేద్యంతో ప్రతి మొక్కకు పోషకాలు అందేలా చూస్తున్నాం. ఇందుకు బాక్టీరియా తోడ్పడుతోంది. వచ్చే ఏడాది వరి సాగుకు బిందు విధానం వాడదలిచాను. పసుపులో 4.62% కుర్కుమిన్‌తో విప్లవం కీలకమైన పసుపు పంటను ఏటా సాగు చేస్తూ 50 శాతం విత్తనాభివృద్ధికి వినియోగిస్తున్నా. ఈసారి 8 ఎకరాల విస్తీర్ణంలో వేశా. దున్నటం అయిపోయింది. ప్రగతి రకంలో 35 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. 4.62 శాతం కుర్కుమిన్ సాధిస్తున్నా. గతేడాది నంద్యాల, విశాఖ ఉద్యాన శాఖల అధికారులు తీసుకెళ్లారు. సాధారణంగా పసుపు వేసిన చేలో పోషకాలు సరిపోవని మరుసటి సంవత్సరం మళ్లీ పసుపు వేయరు. మేం వాడే విత్తనంతో డిసెంబరులో పంట తీసి, జనవరిలో మిర్చి, టొమాటో, వంగ వేశాం. వీటి తర్వాత జూన్‌లో మళ్లీ పసుపు సాగు చేయబోతున్నా. పసుపును వండకుండా, రెండేళ్లుగా నిల్వ చేయడంలోనూ సేంద్రియ పద్ధతులను అనుసరిస్తున్నా. సాంబిరెడ్డి పొలంలో పసుపు కొమ్ముల గ్రేడింగ్ పచ్చి పసుపు వినియోగంపై ప్రచారం... పసుపు పంటను ఉడకబెట్టిన తర్వాత ఎండబెట్టగా వచ్చిన కొమ్ముల నుంచి తీసిన పసుపు పొడిని ఇళ్లలో వినియోగిస్తుండటం సాధారణంగా జరుగుతుంది. ఇందుకు బదులుగా అల్లం పేస్ట్‌లాగా పచ్చి పసుపును కచ్చాపచ్చాగ నూరి కూరల్లో వాడుకొంటే పసుపు ప్రయోజనం పూర్తిగా అందుతుంది. దీనినే ప్రచారం చేస్తూ ఆర్గానిక్ ఉత్పత్తుల అమ్మకం కేంద్రాలకు శాంపిల్‌గా కొన్ని కిలోలు పంపా. అనుకున్నట్టే ఆదరణ బాగా ఉంది. కిలో రూ.50కి నేను ఇస్తుంటే రూ.80 నుంచి రూ.160లకు వ్యాపారులు కొనుగోలు చేస్తుండటం విజయానికి నిదర్శనం.. (సాంబిరెడ్డిని 97044 13596 నంబరులో సంప్రదించవచ్చు) సాంబిరెడ్డి తోటలో టొమాటోలు పండుతాయి. తను మార్కెట్‌కు వెళ్లడు. మార్కెట్ తన దగ్గరకు వస్తుంది. తన తోటలో గట్టుమీద కిలోకు 30 రూపాయలు ఇచ్చిపోతున్నారు. టొమాటో కుళ్లిపోయిందని రైతుని పీడించే కుళ్లిపోయిన మార్కెట్ వ్యవస్థను జయించిన మన సూపర్ హీరో రైతు సాంబిరెడ్డి రైతులందరికీ ఒక కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తున్నాడు. టొమాటో ఒక్కటే కాదు. చాలా రకాల కూరగాయలు పండిస్తున్నాడు. పంట ఏదైనా ఆయన చెప్పిందే ధర. అదే ఫైనల్. ప్రకృతి వ్యవసాయదారుడు సాంబిరెడ్డి వల్ల రైతుకు, వ్యవసాయానికి, దిగుబడికి డబ్బే కాదు.. గౌరవం దక్కింది. శెహభాష్ సాంబిరెడ్డి. ఈ పచ్చటి కథ మీదాకా తేవడానికి ‘సాక్షి’ కూడా చాలా గర్వపడుతోంది. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి, గుంటూరు జిల్లా -
అమెరికాలో ఉద్యోగం వదిలేసి వ్యవసాయం చేస్తున్నాడు
-
పీహెచ్డీ చదువొదిలి.. ప్రకృతి సేద్యంలోకి..!
ఆంగ్ల సాహిత్యంపై మక్కువతో హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (‘ఇఫ్లూ’)లో పీహెచ్డీ చేస్తున్న ఓ యువకుడు.. ఉన్నట్టుండి ఒక రోజున భార్యా బిడ్డలతోపాటు తిరిగి ఇంటికెళ్లి.. అంతే మక్కువతో రెండున్నరేళ్లుగా, ప్రశాంతంగా ప్రకృతి వ్యవసాయం చేసుకుంటున్నారు. అందుకు దారితీసిన బలమైన కారణం ఏమై ఉంటుంది? ‘‘మట్టి ఆరోగ్యంపైనే మనుషులు సహా సకల జీవరాశి ఆరోగ్యం, జీవావరణం శ్రేయస్సు ఆధారపడి ఉన్నాయని గ్రహించా. పరిశోధన కొనసాగించి అధ్యాపకుడిగా జీవించే కన్నా.. నేలతల్లికి ప్రణమిల్లి.. ప్రకృతి వనరులను పొదుపుగా వాడుకుంటూ మట్టిని నెమ్మదిగా బాగు చేసుకుంటూనే ఆయురారోగ్య సిరులనిచ్చే చిరు(సిరి)ధాన్యాలను సాగు చేస్తున్నా..’’ అంటున్నారు కిశోర్ చంద్ర (38). శిక్షణ పొంది ప్రకృతి సేద్యంలోకి.. ఆంగ్ల సాహిత్యంలో ఎమ్.ఎ, ఎంఫిల్, బీఈడీ చేసి దేశ విదేశాల్లో ఐదేళ్లు అధ్యాపకుడిగా పనిచేసి.. ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ‘ఇఫ్లూ’లో పరిశోధన విద్యార్థిగా చేరారు. ఆ కొత్తలోనే అమీర్‌ఖాన్ ‘సత్యమేవ జయతే’ టీవీ షోలో విషతుల్య ఆహారంపై స్ఫూర్తి పొందారు. ఒకవైపు ఆంగ్ల భాషా బోధనపై పరిశోధనను కొనసాగిస్తూనే.. అరణ్య అగ్రికల్చరల్ ఆల్టర్నేటివ్స్ సంస్థలో పర్మాకల్చర్‌లో, భూమి కాలేజీ (బెంగళూరు)లో ఆహారం–వ్యవసాయంపైన, మనసబు ఫుకుఓకా ప్రకృతి వ్యవసాయంపైన శిక్షణ పొంది అవగాహనను పరిపుష్టం చేసుకున్నారు. 2015 ఏప్రిల్‌లో తన జీవితాన్ని అర్థవంతమైన మలుపుతిప్పే నిర్ణయం తీసుకున్నారు! నాలుగేళ్లు కొనసాగించిన పరిశోధనకు స్వస్తి చెప్పి ప్రకృతి వ్యవసాయదారుడిగా మారారు. ఉన్నత విద్యావంతులైన జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు ఆయన నిర్ణయాన్ని స్వాగతించి తోడ్పాటునందించడం విశేషం. రసాయనిక వ్యవసాయానికి స్వస్తి కిశోర్‌చంద్ర స్వస్థలం డా. వైఎస్సార్ జిల్లాలోని ప్రొద్దుటూరు. తండ్రి డాక్టర్ పాతకోట చిన్నగురివిరెడ్డి ఆంత్రోపాలజీలో పీహెచ్డీ చేసి, శ్రీహరికోట ‘ఇస్రో’లో కొంతకాలం యానాదులపై పరిశోధన చేశారు. కుటుంబ కారణాల వల్ల ఉద్యోగానికి స్వస్తి చెప్పి ప్రొద్దుటూరులోనే ఉంటున్నారు. అక్కడికి సమీపంలోని తాళ్లమాపురం గ్రామంలో వారికి మెట్ట భూమి ఉంది. పదేళ్లుగా రసాయనిక వ్యవసాయం చేయిస్తున్నారు. ఆరేడేళ్ల క్రితం వారి పొలంలో పురుగులమందు పిచికారీ చేసిన ఇద్దరు కూలీలు తీవ్ర అస్వస్థతకు గురైతే.. రూ. 50 వేల ఖర్చుతో వైద్యం చేయించి వారి ప్రాణాలను కాపాడారు. రసాయనిక వ్యవసాయం కొనసాగింపు సరికాదన్న భావం బలపడడానికి ఈ సంఘటన కూడా ఒక కారణమని కిశోర్ చంద్ర వివరించారు. ఆ నేపథ్యంలో రసాయన రహిత సేద్యం వైపు మళ్లిన ఆయన తండ్రితో కలసి గత రెండున్నరేళ్లుగా ప్రకృతి సేద్యం చేస్తున్నారు. అండుకొర్రల సాగుపై దృష్టి సాగునీటి వసతి లేని తమ పొలాన్ని అందుబాటులోని ప్రకృతి వనరులతోనే సారవంతం చేసుకుంటూనే తమ ప్రాంతానికి అనువైన చిరుధాన్యాల సాగును కిశోర్ చంద్ర చేపట్టారు. పచ్చిరొట్ట ఎరువులతోపాటు ‘రామబాణం’ పద్ధతిలో భూసారాన్ని పెంపొందిస్తున్నారు. జీవామృతం, పంచగవ్యలతో కొర్రలు, ఊదలతోపాటు అరుదైన సిరిధాన్య పంట అండుకొర్రలు(బ్రౌన్‌టాప్ మిల్లెట్) సాగు చేస్తూ.. తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో 10 ఎకరాల్లో ఏకపంటగా అండుకొర్రలు సాగు చేశారు. ఇది 80–90 రోజుల పంట. పంట మూడు అడుగుల ఎత్తు పెరిగింది. కోతకు వచ్చే దశలో ఎడతెగని వర్షాల వల్ల దిగుబడి ఎకరానికి 9 క్వింటాళ్ల నుంచి 6 క్వింటాళ్లకు తగ్గింది. అండుకొర్ర ధాన్యం క్వింటాల్‌కు రూ. 3,500కు అమ్మారు. రబీలో 14 ఎకరాల్లో అండుకొర్రలను సాగు చేస్తున్నారు. డిసెంబర్ 15న చాడ గట్టి(బోరు నీటిని పారగట్టి్ట) గొర్రుతో ఇరుసాళ్లు విత్తనం విత్తారు. ఎకరానికి రెండుంపావు కిలోల విత్తనం వాడారు. దుక్కిలో ఎకరానికి 100 కిలోల వేప పిండి, 100 కిలోల ఆముదం పిండి చల్లారు. విత్తిన ఐదు వారాలకు బోరు నీటితోపాటు జీవామృతం పారగట్టారు. 8 వారాలకు ఎకరానికి రెండున్నర లీటర్ల పంచగవ్యను వంద లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేశారు. మార్చిలో నూర్పిడి చేయనున్నారు. రబీ పంట వేశాక వర్షం పడకపోవడం వల్ల పంట అడుగున్నర ఎత్తు మాత్రమే ఎదిగింది. ఎకరానికి 6 క్వింటాళ్ల అండుకొర్రల ధాన్యం దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. గత ఏడాది ఊదలు, కొర్రలు, జొన్నలు సాగు చేసినప్పుడు.. ఊదలను సగం వరకు పక్షులు తిన్నాయని, అండుకొర్రలకు పక్షుల బెడద లేదన్నారు. సిరిధాన్యాల్లోకెల్లా అత్యధికంగా 12.5% పీచు కలిగి ఉండటం అండుకొర్రల విశిష్టత. ఇంటిల్లిపాదికీ సిరిధాన్యాలే ఆహారం.. ప్రొద్దుటూరులో జన్మించి మైసూరులో స్థిరపడిన సుప్రసిద్ధ స్వతంత్ర ఆహార శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్‌వలి సూచనల మేరకు 8 నెలలుగా తమ 8, 2 ఏళ్ల పిల్లలతోపాటు ఇంటిల్లిపాదీ సిరిధాన్యాలనే ప్రధాన ఆహారంగా తింటూ ఆరోగ్యంగా ఉన్నామని కిశోర్ చంద్ర ఆనందంగా తెలిపారు. జలవనరులు తక్కువగా ఉన్న తమ పొలంలో అతి తక్కువ నీటితో పండే సిరిధాన్యాలను సాగు చేయడంతోపాటు.. వాటినే ప్రధాన ఆహారంగా తినటం ద్వారా విద్యాధిక రైతు కిశోర్‌చంద్ర యువ రైతాంగానికి ఆదర్శంగా నిలవడం విశేషం. ఇటీవల సేంద్రియ గ్రామసభలో కిశోర్చంద్రను అధికారులు ఘనంగా సత్కరించారు. బాధ్యతగల రైతుగా సిరిధాన్యాలు పండిస్తున్నా.. వ్యవసాయ సంక్షోభానికి మూల కారణం మట్టిని, నీటిని, వాతావరణాన్ని, మొత్తం జీవావరణాన్ని నాశనం చేసే రసాయనిక సేద్యమేనని.. అతిగా నీటిని తాగే పంటలేనని అర్థం చేసుకున్నా. మనకూ భూమి ఉంది కదా. బాధ్యతగల పౌరుడిగా ఏం చేయొచ్చు? ఏం చేయగలం? అని ఆలోచించా. నాన్నతో కలిసి ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టా. తినే పంటలనే పండిస్తున్నాం. తినగా మిగిలినది అమ్ముతున్నాం. నిదానంగా భూమి సారవంతమవుతోంది. సీతాకోకచిలుకలు, తేనెటీగలు, వానపాములు, పీతలు కనిపిస్తుంటే సంతోషంగా ఉంది. సిరిధాన్యాలతోపాటు పండ్లు, కూరగాయలూ పండించి నలుగురికీ అందించాలన్నది లక్ష్యం. – పాతకోట కిశోర్‌చంద్ర (94900 28642), ప్రొద్దుటూరు, డా.వైఎస్సార్ కడప జిల్లా – కుడుముల వీరారెడ్డి, సాక్షి, ప్రొద్దుటూరు, డా.వైఎస్సార్ కడప జిల్లా -
అమ్మిన 12 ఎకరాలు..మళ్లీ కొన్నది
రసాయనిక వ్యవసాయంలో నష్టాలపాలై ఉన్న 20 ఎకరాల్లో 12 ఎకరాలను తెగనమ్ముకున్నారు. అంతటి సంక్షోభ కాలంలో పరిచయమైన ప్రకృతి వ్యవసాయం వారి ఇంట సిరులు కురిపిస్తోంది. అమ్మిన ఆ 12 ఎకరాలను తిరిగి కొనుక్కున్నారు.. అవే పంటలు.. అదే పొలం.. మారినది సాగు పద్ధతి మాత్రమే.. రసాయనిక వ్యవసాయం వారిని అప్పుల్లో ముంచింది. ఆ అప్పులు ఉన్న 20 ఎకరాల పొలంలో 12 ఎకరాలను మింగేశాయి. ఇక వ్యవసాయం వద్దే వద్దు.. అనుకుంటున్న తరుణంలో పరిచయం అయిన ప్రకృతి వ్యవసాయం ఈ లావణ్యా రమణారెడ్డి కుటుంబం తలరాత మారిపోయింది. కల నెరవేరింది..! తెగనమ్ముకున్న అదే 12 ఎకరాల భూమిని మళ్లీ తిరిగి కొనుక్కున్నారు. నమ్ముకున్న రైతు కుటుంబానికి ప్రకృతి వ్యవసాయం దీర్ఘకాలంలో ఎంత మేలు చేస్తుందో లావణ్యా రమణారెడ్డి కుటుంబాన్ని చూస్తే అర్థమవుతుంది. నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం కారువంగ గ్రామానికి చెందిన లావణ్య భర్త రమణారెడ్డితో కలిసి 16 ఏళ్లుగా ప్రకృతి సేద్యాన్ని లాభదాయకంగా కొనసాగిస్తున్నారు. కళ్లు చెదిరే దిగుబడులు తీస్తున్నారు. కారువంగ గ్రామానికి ఎంపీటీసీ సభ్యురాలిగా ఎన్నికైన లావణ్య ప్రజలకు సేవలందిస్తూనే ప్రకృతి వ్యవసాయంపై దృష్టికేంద్రీకరిస్తున్నారు. రైతులకూ శిక్షణ ఇస్తున్నారు. లావణ్య భర్త రమణారెడ్డితో కలిసి ప్రతి రోజూ తమ పొలంలో పత్తి, మిరప, ఆముదం,మొక్కజొన్న, వరి లాంటి పంటలను గతంలో రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసేవారు. అప్పులపాలై 12 ఎకరాలు అమ్ముకున్న తర్వాత వ్యవసాయం మానేద్దామనుకున్న తరుణంలో.. మహారాష్ట్రకు చెందిన పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ పుస్తకాల్లో చదివి తెలుసుకున్నారు. భర్త ప్రోత్సాహంతో మహారాష్ట్ర వెళ్లి పాలేకర్‌ను కలుసుకొని.. కొద్దిరోజులపాటు అక్కడే ఉండి శిక్షణ పొందారు. మొదట కేవలం ఒక సెంటు భూమిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో 2002లో ప్రయోగాత్మకంగా కనకాంబరం తోటను సాగు చేసి అధిక దిగుబడులు సాధించారు. 2003లో అర ఎకర పొలంలో మిర్చి పంట వేసి ఆరు క్వింటాళ్ల దిగుబడి పొందారు. జీవామృతం, ఘనజీవామృతం, కషాయాలను స్వయంగా తయారు చేసుకొని వాడుతున్నారు. ఈ ఏడాది ఎకరానికి 10 క్వింటాళ్ల పత్తి దిగుబడిని సాధించారు. ఈ ఏడాది రసాయనిక వ్యవసాయంలో వరిని సుడిదోమ దెబ్బతీసింది. అయితే, లావణ్య పొలంలో ఎకరానికి 78 బస్తాల(బస్తా 60 కిలోలు) ధాన్యం దిగుబడి వచ్చింది. 3 ఎకరాల్లో మిరప తోట సాగు చేయగా.. ఇప్పటికి పండు మిర్చి 3 కోతల్లో 18 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇంకా ఎకరానికి 6–7 క్వింటాళ్ల కాయ ఉందని ఆమె తెలిపారు. మిరపలో ధనియాలు, ఆవాలు, మెంతులు, గోధుమలు, వేరుశనగ వంటి అంతర పంటలు ఉన్నాయి. అంతరపంటల ద్వారా ఖర్చు తిరిగి వచ్చేస్తే.. ప్రధాన పంట ద్వారా వచ్చే ఆదాయం అంతా నికరాదాయంగా ఉంటుందన్నది పాలేకర్ వ్యవసాయంలో మూల సూత్రం. ఈ సూత్రాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తూ దినదినాభివృద్ధి సాధిస్తున్నారు లావణ్యా రమణారెడ్డి దంపతులు. ప్రకృతి సాగే తమకు ఎంతగానో నచ్చిందని, ఖర్చు కూడా బాగా తగ్గిందన్నారు. ఇతర గ్రామాల రైతులు సైతం లావణ్య, రమణారెడ్డి చేపట్టిన ప్రకృతి సేద్యంపై ఆసక్తి పెంచుకున్నారు. – శ్రీధర్, సాక్షి, నాగర్‌కర్నూల్, తెలంగాణ వ్యవసాయాన్ని ఉద్యోగంలా భావిస్తేనే లాభాలు! వ్యవసాయాన్ని చాలా మంది రైతులు చాలా తేలికగా తీసుకుంటారు. నిరాసక్తతతో సేద్యం చేస్తారు. ఈ ధోరణే వారిని నష్టాల పాలు చేస్తున్నది. వ్యవసాయ రంగం ఇతర రంగాలకు ఏ మాత్రం తీసిపోదు. దీన్ని ఓ ఉద్యోగంలా భావించి, అనుదినం కనిపెట్టుకొని అన్ని పనులూ స్వయంగా చేసుకోవాలి. మరీ అవసరం ఉన్నప్పుడే కూలీలపై ఆధారపడాలి. ఎంతో శ్రమకోర్చి పండించిన పంటను మార్కెట్ చేసుకునే విషయంలోనూ శ్రద్ధ చూపాలి. మేము పండించే ఎండు మిరప కాయలతో కారం పొడిగా మార్చి వినియోగదారులకు నేరుగా విక్రయిస్తున్నాం. దీంతో మిర్చి ఆదాయం రెండింతలైంది. – కసిరెడ్డి లావణ్య రమణారెడ్డి(77300 61819), సీనియర్ ప్రకృతి వ్యవసాయదారు,కారువంక, నాగర్‌కర్నూల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం -
జీవామృతమే జీవనాధారం!
భర్తను కోల్పోయిన యువతికి బతుకుబాట చూపిన ప్రకృతి వ్యవసాయం. జీవామృతాల ఉత్పత్తులతో దేశవిదేశీ ప్రముఖుల ప్రశంసలందుకుంటున్న యువ మహిళా రైతు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి గ్రామానికి చెందిన మహిళా రైతు కొండా ఉషారాణి విజయగాథ ఇది. ‘‘పదోతరగతి పూర్తికాగానే పదిహేడేళ్ల వయసులో పెళ్లి పేరుతో అత్తింట కాలు మోపాను. మూడున్నరేళ్లలో ఇద్దరు బిడ్డలు కలిగారు. సాఫీగా సాగుతున్న నా జీవితంలో భర్త సుధాకర్‌రెడ్డి ఆకస్మిక మరణం నాకో పెద్ద షాక్. ఏం చేయాలో తెలీదు. చంటిపిల్లలు. అర ఎకరం భూమి తప్ప ఆస్తులు లేవు. చదువు పెద్దగా లేదు. బిడ్డల్ని ఎలా సాకాలో దిక్కుతోచేది కాదు. దుఃఖాన్ని దిగమింగుకుంటూనే మా అమ్మ సాయంతో సమీప గ్రామం కాజలో పొగాకు కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిలో చేరాను. రోజూ 12 గంటల డ్యూటీ చేసినా నెలాఖరుకు చేతిలో పడేవి రూ.1500. అవి ఏమూలకూ వచ్చేవి కావు. ఇలా కాదని రూ.20 వేలు పెట్టుబడితో చీరలు తెచ్చి, ఇంట్లోనే అమ్మసాగాను. కొన్ని రోజులు ఫర్వాలేదు అనిపించింది. ఓ రోజు ఇంట్లో దొంగలు పడి విలువైన వస్తువులతో పాటు చీరలూ ఎత్తుకుపోయారు. దీంతో మళ్లీ నా బతుకు ప్రశ్నార్ధకమైంది. ఉపాధి కోసం వెతుకులాట. బయో ఎరువుల మార్కెటింగ్ నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి వ్యవసాయం పట్ల అవగాహన ఉంది. చుట్టు పక్కల రైతులు కొందరు సొంతంగా జీవామృతాలను తయారుచేసి వాడటం చూసేదాన్ని. బయో ఎరువుల కంపెనీ నుంచి అలాంటి మార్కెటింగ్ చేస్తే బాగుంటుందనిపించింది. ప్రయత్నించి చూద్దామని షాపుల వాళ్లను కలిసి, ఎరువుల శాంపిల్స్ తీసుకున్నాను. సంచిలో ఆ శాంపిల్స్ పెట్టుకొని ఆటోలో మంగళగిరి చుట్టుపక్కల 14 గ్రామాలు తిరుగుతూ మార్కెటింగ్ చేసేదాన్ని. సూర్యోదయంతో పాటే నా ప్రయాణం మొదలయ్యేది. ఉదయం 6.30 గంటలకు బయట కాలుపెడితే తిరిగొచ్చే సరికి చీకటి పడేది. చంటి బిడ్డల ఆలనా పాలనా చూడలేకపోతున్నాను అనే నిస్సహాయత గుండెను పిండేస్తుండేది. కానీ, ఈ పని మానుకొంటే నా పిల్లల నోటికి నాలుగు మెతుకులు అందించేదెలా? అమ్మానాన్నలు ఎన్నాళ్లని సాయం చేస్తారు? అందుకే నా నడక ఆగేది కాదు. ఆశల సాగు ఈ క్రమంలోనే 2007–08లో సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకున్నాను. నా జీవితానికో ఆలంబన దొరుకుతుందన్న ఆశ మొలకెత్తింది. కాకినాడ, గుంటూరు, తిరుపతిలో శిక్షణ తరగతులకు హాజర య్యాను. ప్రతి అంశాన్నీ నోట్స్ రాసుకుని సొంతంగా ప్రకృతి సేద్య ప్రయోగాలు ఆరంభించాను. జీవామృత తయారీకి ఆవు కావాలి. కొనాలంటే డబ్బు లేక కొన్ని గోశాలల నుంచి గో మూత్రం, పేడ సేకరించేదాన్ని. ఉమ్మెత్త, వేపాకు, రావి, జిల్లేడు.. వంటి ఆకులను సేకరించి వీటితో జీవామృత కషాయాల తయారీని మొదలుపెట్టాను. వీటిని రైతులకు ఎలా అమ్మాలి.. నేను ఆచరణలో పెడితేనే నలుగురూ నమ్ముతారు. అందుకే మా ఆయన మిగిల్చి వెళ్లిన అర ఎకరం పొలం, పుట్టింటి వాళ్లిచ్చిన 40 సెంట్ల పొలంలో దొండ పందిరి, మినుము వేశాను. తర్వాత మునగ, అంతర పంటగా మిర్చి సాగు చేశాను. నా కష్టాన్ని చూసి ఎగతాళి చేసినవారున్నారు. సాధ్యమయ్యే పనికాదని నిరుత్సాహపరిచిన వారున్నారు. కానీ, మా అమ్మ నాకు అండగా నిలిచింది. పంటలకు నేను తయారు చేసిన జీవామృత కషాయాలను వాడాను. దిగుబడులు బాగానే వచ్చాయి. పంట మార్పిడి కోసం కాలీఫ్లవర్ వేశాను. ధరలు తగ్గిపోవడంతో నష్టం వచ్చింది. నాలుగేళ్లుగా మునగ, పసుపు, వరి పంటలు సాగు చేస్తున్నాను. తర్వాత 80 సెంట్లలో మినుము 4.5 క్వింటాళ్ల దిగుబడి రావడంతో అంతరపంటగా కూరఅరటి, చిక్కుళ్లు సాగు చేశాను. కిందటి సీజనులో 40 సెంట్లలో వేసిన మునగ నెలన్నర ముందుగానే దిగుబడినిచ్చింది. టన్నుకు పైగా మునగ కాయల దిగుబడి వచ్చింది. మళ్లీ ఇప్పుడు మునగ, పసుపు, వరి పైర్లు సాగులో ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర రెండు ఆవులు ఉన్నాయి. వీటి మూత్రం, పేడ, ఆకులతో చేసిన జీవామృతం మా పొలం వరకు సరిపోతాయి. నేను సాగుచేస్తున్న విధానాలు చూసిన రైతులు ఘన, ద్రవ జీవామృతాన్ని తయారుచేసిమ్మన్నారు. రైతుల ఆదరణతో కషాయాల ఉత్పత్తి రెండేళ్ల క్రితం ఊరి బయట మా సొంత స్థలంలోనే శ్రీవాసవీ దుర్గా ప్రకృతి వ్యవసాయ కషాయాల ఉత్పత్తుల యూనిట్‌ను స్థాపించాను. ప్రభుత్వం ఎన్‌పీఎం యూనిట్ కింద రూ.40 వేలు సబ్సిడీ ఇచ్చారు. ఘనజీవామృతం, ద్రవ జీవామృతం, దశపర్ణిక కషాయం, పంచగవ్య, అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, నీమాస్త్రం సొంతంగా యూనిట్లో తయారీ చేస్తున్నాను. వీటికి కావల్సిన గోమూత్రం, పేడ గోశాలల నుంచి సేకరిస్తున్నాను. 2 కేజీల నుంచి 50 కేజీల వరకు వీటి ప్యాకింగ్ ఉంటుంది. వీటిని దాదాపు 150 మంది రైతుల వరకు కొనుగోలు చేసి ప్రకృతి సేద్యంలో వినియోగిస్తున్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన స్టాల్‌కు మంచి ఆదరణ లభించింది. పూల నర్సరీల నిర్వాహకులు, మేడలపై ఇంటిపంటల సాగుదారులు, పల్నాడు రైతులు కూడా ఈ ఉత్పత్తులను కొని తీసుకెళుతున్నారు. ఒక్కోసారి డిమాండుకు సరిపడా సరఫరా చేయలేకపోయానే అనుకునే సందర్భాలూ ఉన్నాయి. ఇద్దరు పనివారిని పెట్టుకుని స్వయంగా ఈ పనులను చేస్తుంటాను. మా అమ్మ, పిల్లలూ ఈ పనిలో సాయం చేస్తుంటారు. ఖర్చునెలకు రూ.65 వేల వరకు వస్తుంది. అన్ని ఖర్చులు పోను నెలకు 15 నుంచి 20 వేల రూపాయల వరకు ఆదాయం ఉంటుంది. నిపుణుల ప్రశంసలు ఈ విజయంతో ప్రకృతి వ్యవసాయ సలహాదారు విజయకుమార్, కెన్యాలోని వరల్డ్ ఆగ్రో ఫారెస్ట్రీకి చెందిన నిపుణులు సహా పలువురు విదేశీ ప్రతినిధులు, ప్రముఖులు మా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల యూనిట్‌ను సందర్శించి, అభినందించారు. ప్రభుత్వం ఆర్థికంగా తోడ్పాటునందిస్తే 500 ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేయించాలని, సమీప ఊళ్లలో ఆదర్శ వ్యవసాయ క్షేత్రాలను నెలకొల్పాలనేది నా ఆశయం’’ అంటూ తన విజయగాథను వివరించారు ఉషారాణి. ఆమె (94948 49622) కల నెరవేరాలని ఆశిద్దాం. ప్రభుత్వం ఆర్థికంగా తోడ్పాటునందిస్తే 500 ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేయించాలని, సమీప ఊళ్లలో ఆదర్శ వ్యవసాయ క్షేత్రాలను నెలకొల్పాలనేది నా ఆశయం – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి, గుంటూరు జిల్లా -
దేశీ విత్తనాలు, గోవులను రక్షించుకోవాలి
హైదరాబాద్: దేశీ విత్తనాలు, దేశీ గోవులను రక్షించుకోవాలని హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతీస్వామి పిలుపునిచ్చారు. బహుళజాతి సంస్థలు అధిక దిగుబడి ఆశ చూపి సంకర జాతి విత్తన సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నాయని చెప్పారు. ఈ సేద్యంలో ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం వల్ల భూసారం నాశనమవుతోందని, ఆ పంటలను ఆహారంగా తీసుకోవడం వల్ల జనం రోగాల పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భూసారాన్ని ధ్వంసం చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్న ఈ వ్యవసాయానికి వ్యతిరేకంగా రైతులను చైతన్యం చేసి దేశీ విత్తన సాగును ప్రోత్సహించాలని, మనం ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. దోమలగూడలోని రామకృష్ణమఠం ఆడిటోరియంలో సేవ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ దేశీ విత్తనోత్సవం రెండో రోజు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయం లాభదాయకం.. దేశీ విత్తనాలతో ప్రకృతి వ్యవసాయం చేసి పండించిన పంటలనే ఆహారంగా తీసుకోవాలని విద్యారణ్య భారతీస్వామి సూచించారు. దేశీ ఆవు మలమూత్రాలతో తయారయ్యే ఎరువు, జీవామృతంతో పెట్టుబడి అవసరంలేని ప్రకృతి వ్యవసాయం రైతులకు లాభదాయకమన్నారు. మాతా నిర్మలానంద భారతి మాట్లాడుతూ అమృతంలా ఉండాల్సిన ఆహారం కాస్తా విషంగా మారుతోందని, దీనికి ప్రకృతి సాగే పరిష్కారమని చెప్పారు. మాతా విజయేశ్వరీ మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో బీపీ, షుగర్, కాళ్ల, కీళ్ల నోప్పులు అనే మాటలు సర్వసాధారణం అయ్యాయన్నారు. రోగాలు కొనితెచ్చే వ్యవసాయం మాని ఆరోగ్యాన్ని పెంచే ప్రకృతి సాగు చేపట్టాలని కోరారు. దేశీ విత్తనాలకు మంచి స్పందన.. విత్తనోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో దేశీ విత్తనాలను ప్రదర్శిస్తున్నారు. వందలాది మంది ప్రకృతి సాగు రైతులు ఈ స్టాళ్లను సందర్శించారు. కర్ణాటక, తమిళనాడు, ఒరిశా, ఏపీ, బిహార్, ఛత్తీస్‌గఢ్ తదతర రాష్ట్రాలకు చెందిన ప్రకృతి వ్యవసాయ రైతులు పండించిన వివిధ రకాల వరితో పాటు చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయల సహజసిద్ధ విత్తనాలను రైతులు ఆసక్తిగా పరిశీలించారు. నాలుగేళ్లుగా ప్రకృతి సాగు మా వారు, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్లమే. అయితే వ్యవసాయంపై మక్కువ. గ్రామంలో మాకున్న 25 ఎకరాల్లో నాలుగేళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వరితో పాటు పండ్ల తోటలను పెంచుతున్నాం. దేశీ విత్తనోత్సవంలో అనేక కొత్త విషయాలు తెలుసుకున్నాం. ఇక్కడ దేశీ విత్తనాలు కొనుగోలు చేశాం. – కృష్ణవేణి, జయలక్ష్మిపురం, ఖమ్మం జిల్లా ప్రకృతి సాగువైపు అడుగులేస్తున్నారు దేశీ విత్తనోత్సవానికి మంచి స్పందన వస్తోంది. ప్రకృతి సాగుపై ఆసక్తితో తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల రైతులు కూడా హాజరయ్యారు. ప్రకృతి వ్యవసాయం ప్రయోజనాలను స్వయంగా చూస్తున్న రైతులు క్రమేణా ఈ విధానంవైపు అడుగులేస్తున్నారు. – విజయ్‌రాం, సేవ్ సంస్థ అధ్యక్షుడు, విత్తనోత్సవ నిర్వాహకుడు -
భూమి బాగుంటేనే రైతు బాగుండేది!
ఓ వైపు వర్షాభావ పరిస్థితులు, మరో వైపు పెరుగుతున్న పెట్టుబడులతో రైతులకు ఆదాయం రాక, అప్పుల ఊబిలో చిక్కుకుపోయి, వ్యవసాయం అంటేనే పారిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గత నాలుగేళ్లుగా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేస్తూ, ఉన్న వనరులతోనే అధిక నికరాదాయం పొందుతున్నారు ప్రకృతి వ్యవసాయదారుడు మిట్టపెల్లి రాములు. భూమిని రసాయనాలతో పాడు చేయటం మాని.. జీవామృతంతో సారవంతం చేస్తే వ్యవసాయదారుడి జీవితం ఆనందంగా ఉంటుందని చాటిచెబుతున్నారు. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న రైతు సంతోషంగా ఉంటాడనడానికి మిట్టపెల్లి రాములే నిదర్శనం. జగిత్యాల జిల్లాలోని బీర్పూర్ మండలంలోని తుంగూర్ గ్రామమే రాములు స్వస్థలం. దుబాయ్ వెళ్లి 15 ఏళ్లు కార్మికుడిగా పనిచేసి 20 ఏళ్ల క్రితమే తిరిగి వచ్చారు. అప్పట్లోనే గ్రామంలో దాదాపు 12 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. భూమిని చదును చేయించి, 10 ఎకరాల మామిడి తోటలో 600 చెట్లు నాటారు. రెండెకరాల్లో వరిని రసాయనిక పద్ధతిలో సాగు చేశారు. రెండు బావులు తవ్వారు. బంగెనపల్లి, దశేరి, హిమాయత్, కేసరి వంటి మామిడి చెట్లతోపాటు ఉసిరి, జామ, బొప్పాయి, బత్తాయి, మునగ తదితర చెట్లు ఉన్నాయి. ‘సాక్షి సాగుబడి’ ద్వారా పాలేకర్ ప్రకృతి వ్యవసాయాన్ని గురించి తెలుసుకొని, కరీంనగర్లో జరిగిన పాలేకర్ శిక్షణకు హాజరయ్యారు. మహారాష్ట్ర వెళ్లి అక్కడ కొందరు రైతుల క్షేత్రాలను పరిశీలించి అవగాహన పెంచుకున్నారు. నాలుగేళ్లుగా అనుసరిస్తున్నారు. మామిడి తోటలకు జీవామృతాన్ని వర్షాకాలం ప్రారంభం నుంచి నెలకోమారు ఇస్తుంటారు. దోమ ఎక్కువగా ఉన్నప్పుడు అగ్ని అస్త్రం పిచికారీ చేస్తారు. దశపర్ణ కషాయాన్ని పూత దశకు ముందు పిచికారీ చేస్తారు. అలాగే, వరి సాగుకు ముందు.. జనుము పెంచి పొలంలో కలియ దున్నుతారు. బీజామృతం తయారు చేసి విత్తనాలను విత్తనశుద్ధి చేస్తారు. నాటు వేసే ముందు ఎకరానికి క్వింటాల్ ఘన జీవామృతం వేస్తారు. 20 రోజులకొకసారి జీవామృతాన్ని నీటితో కలిపి ఇస్తుంటారు. ఇటీవల తయారు చేస్తున్న వర్మీవాష్‌ను లేత మామిడి మొక్కలకు అందిస్తున్నారు. గతంలో 2 ఆవులను కొన్నారు. ఇప్పుడు వాటి సంతతి 20కి పెరిగాయి. ఒక్కో ఆవును ఉదయం ఓ మామిడి చెట్టు నీడన, సాయంత్రం ఓ చెట్టు దగ్గర కట్టేస్తుంటారు. చెట్ల చుట్టూ ఉండే పచ్చిగడ్డిని తినటంతోపాటు పేడ, మూత్రం విసర్జించటం ద్వారా నేలను సారవంతం చేస్తున్నాయి. నీటి నిల్వ కోసం గుంతను తవ్వారు. జీవామృతం నేరుగా డ్రిప్ ద్వారా వెళ్లేలా ఏర్పాటు చేశారు. గత నాలుగేళ్లుగా ఏనాడూ మామిడి తోటను ట్రాక్టర్‌తో గానీ, నాగలితో గానీ దున్నలేదు. సొంత వరి విత్తనాన్నే వాడుతున్నారు. ఎకరానికి 30 క్వింటాళ్ల వరి ధాన్యం దిగుబడి వస్తున్నది. మర ఆడించి నేరుగా వినియోగదారులకు బియ్యం అమ్ముతున్నారు. మామిడి కాయలను తోట దగ్గరే అమ్ముతున్నారు. ఎడాపెడా ఖర్చులు పెట్టాల్సిన పని లేకుండా.. హైరానా పడకుండా ప్రశాంతంగా వ్యవసాయం చేస్తూ.. రసాయనిక అవశేషాల్లేని దిగుబడితోపాటు అధిక నికరాదాయం పొందుతున్నారు. రైతును నిశ్చింతగా బతికించేది ప్రకృతి వ్యవసాయమే! ప్రకృతి వ్యవసాయం పరిచయం అయిన తర్వాత గత నాలుగేళ్లుగా రసాయనాలు వాడలేదు. ఈ ఏడాది అందరి వరి పొలాలకు దోమ పోటు వచ్చినా మా పొలానికి ఏ చీడపీడా రాలేదు. నాలుగేళ్లుగా పెద్దగా ఖర్చు పెట్టింది లేదు. నన్ను చూసి మా గ్రామంలో నలుగురు, ఐదుగురు రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంతో సాగు ఖర్చులు తగ్గించుకుంటేనే రైతు నిశ్చింతగా బతకగలిగేది. తరచూ మా తోటను సందర్శిస్తున్న రైతులకు నా అనుభవాలను పంచుతున్నాను. – మిట్టపెల్లి రాములు (81878 23316), తుంగూరు, బీర్పూర్(మం.), జగిత్యాల జిల్లా – పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్, జగిత్యాల జిల్లా -
దోమ రాలేదు.. దిగుబడి తగ్గలేదు..!
రసాయనిక వ్యవసాయం చేసే వరి రైతుల పొలాల్లో ఈ ఖరీఫ్‌లో దోమ తీవ్రనష్టం కలిగించింది. ఎక్కువ సార్లు పురుగుల మందు పిచికారీ చేసినా పంట దెబ్బతిన్నది. కొన్నిచోట్ల అసలు పంటే చేతికి రాని పరిస్థితి. అయితే.. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న తన వరి పంటకు అసలు దోమే రాలేదని నలవాల సుధాకర్ అనే సీనియర్ రైతు సగర్వంగా చెబుతున్నారు. ద్రావణాలు, కషాయాలు ముందస్తు ప్రణాళిక ప్రకారం తయారు చేసుకొని వాడుకోవటం వంటి పనులను ఓపికగా అలవాటు చేసుకోగలిగిన రైతులకు ప్రకృతి వ్యవసాయం లాభదాయకంగా, ఆరోగ్యదాయకంగా ఉంటుందని ఆయన స్పష్టం చేస్తున్నారు.. ‘తొలకరి జల్లుకు తడిసిన నేల... మట్టి పరిమళాలేమైపాయే.. వానపాములు, నత్తగుల్లలు భూమిలో ఎందుకు బతుకుత లేవు.. పత్తి మందుల గత్తర వాసనరా.. ఈ పంట పొలాల్లో..’ అంటూ ఓ కవి రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులు పంట పొలాలకు ఎంతటి చేటు చేస్తున్నాయో వివరించారు. ప్రస్తుతం పంట పొలాలు చాలావరకు రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందుల బారిన పడుతున్నవే. అధికంగా పంట అధిక దిగుబడిని ఆశించి వారానికో మందు కొడుతున్న ఫలితంగా పచ్చని పంట భూములన్నీ విషపూరితమవుతున్నాయి. స్వచ్ఛమైన పంటకు బదులు, రోగాలకు దారితీసే కలుషితమైన ఆహార పదార్థాలను తినాల్సి వస్తోంది. పర్యావరణంలో సమతుల్యత కూడా దెబ్బతింటోంది. ఈ ఫలితంగానే ఈ ఏడాది ఖరీఫ్‌లో వరి పొలాల్లో దోమ విధ్వంసం సృష్టించింది. వరి దిగుబడులను తీవ్రంగా దెబ్బతీసింది. ఖర్చుకు వెనకాడకుండా వరుస పిచికారీలు చేసినా రైతులకు దుఃఖమే మిగిలింది. దిగుబడి కూడా ఎక్కువే.. అయితే, ఎనిమిదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న నలువాల సుధాకర్ పొలంలో మాత్రం వరికి దోమ సోకలేదు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్‌లోని పెర్కపల్లి వాస్తవ్యుడైన సుధాకర్ ఐదెకరాల్లో గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఈ ఏడాది 4 ఎకరాల్లో తెలంగాణ సోన, ఎకరంలో జైశ్రీరాం సన్నరకాల వరిని సాగు చేస్తున్నారు. ఎకరానికి 30 బస్తాల (70 కిలోల)కు ధాన్యం దిగుబడి తగ్గదని భరోసాతో ఉన్నారు. ప్రకృతి వ్యవసాయంలో మొదట దిగుబడి తక్కువగా వచ్చినా, కొద్ది ఏళ్లకు వరి దిగుబడి ఎకరానికి 30 బస్తాలకు పెరిగింది. ఈ ఏడాది రసాయనిక వ్యవసాయంలో కన్నా 5 బస్తాలు ఎక్కువగానే దిగుబడి వచ్చే అవకాశం ఉందని ఆయన పొలం చూస్తేనే అర్థమవుతుంది. ఈ పంటకు మార్కెట్లో ధర ఎక్కువగా ఉండడంతో సాగు లాభసాటిగానే ఉంది. ఎలాంటి హానికరమైన రసాయనాలు వాడకుండా, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో రసాయనిక అవశేషాల్లేని ఆరోగ్యదాయకమైన, సంతృప్తికరమైన దిగుబడిని సుధాకర్ సాధిస్తున్నారు. మియాపూర్ ప్రాంతంలో సాధారణ రసాయనిక సాగులో ఎకరానికి దాదాపు 40 బస్తాల వరి ధాన్యం పండుతుంది. ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చే స్తే, మొదటి సంవత్సరంలో 20 నుంచి 25 బస్తాల వరకే వస్తాయి. కానీ, మూడు నుంచి ఐదు సంవత్సరాల్లో ఇవి 40 బస్తాలకు చేరుకొంటాయి. సాధారణ బియ్యానికి కిలో సుమారు రూ.30 ఉంటే, ప్రకృతి వ్యవసాయ బియ్యానికి స్థానికంగా కిలోకు సుమారు రూ.50ల ధర పలుకుతోంది. సాధారణ రసాయనిక పద్ధతిలో కన్నా ప్రకృతి వ్యవసాయంలో ఎకరాకు రూ.8 నుంచి రూ.10 వేల వరకు పెట్టుబడి తగ్గుతుంది. ‘రసాయనిక వ్యవసాయం కొనసాగిస్తున్న వరి రైతు విషం తిని ప్రజలకు విషాహారాన్ని పంచుతున్నాడు.. కేన్సర్ రోగుల సంఖ్య పెరిగిపోవటం, సుగర్ రావటం, చిన్న వయసులోనే పళ్లు ఊడిపోవటం.. వంటి ఆరోగ్య సమస్యలన్నిటికీ రసాయనిక అవశేషాలున్న ఆహారమే కారణం.. రైతులు ఓపిక పెంచుకుంటే ప్రకృతి వ్యవసాయం కష్టమేమీ కాద’ని సుధాకర్ చెబుతున్నారు. ప్రభుత్వం మార్కెటింగ్ సదుపాయం కల్పించి ప్రోత్సహిస్తే ఎక్కువ మంది రైతులు ఈ దారిలోకి రావటానికి అవకాశం ఉందని ఆయన అంటున్నారు. మీ పంటే బాగుందంటున్నారు.. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడే పద్ధతిలో వరి సాగు చేసిన పొలాల్లో దోమ బాగా నష్టం చేసింది. వారం వారం మందులు వేయటంతో పంట వేగంగా పెరుగుతుంది. చీడపీడలు కూడా తొందరగా ఆశిస్తాయి. ఈ ఏడాది 7–8 సార్లు పురుగుమందులు పిచికారీ చేశారు. మొత్తం ఖర్చు ఎకరానికి రూ. 20 వేల వరకు వచ్చింది. కానీ, దోమ వల్ల దిగుబడి 25 బస్తాలకు పడిపోయింది. అయితే.. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మా పొలంలో వరికి ఈ సంవత్సరం అసలు దోమ రానే లేదు. వేప నూనె ఒకే ఒక్కసారి పిచికారీ చేశా. ఎప్పటిలాగా భూమిలో ఎకరానికి క్వింటా వేప పిండి వేశా. జీవామృతం, ఘనజీవామృతం వేశా.. నాకు మొత్తంగా ఎకరానికి రూ. 10 –11 వేలు ఖర్చయింది. దిగుబడి వారికన్నా ఎక్కువగానే 30 బస్తాలు కచ్చితంగా వస్తుంది. ఆ రైతులు మా పంటను మొదట్లో ఎదుగుదల తక్కువగా ఉందనే వారు. ఇప్పుడు చివరకొచ్చే వరకు మీ పంటే బాగుందంటున్నారు. రైతులందరూ ఈ పద్ధతిలో సాగు చేస్తే, ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలు తినే అవకాశం లభిస్తుంది. దిగుబడి లాభసాటిగా ఉంటుంది. పర్యావరణ సమస్య తలెత్తదు. భూమి విషపూరితం కాదు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ‘పరంపరాగత్ కృషి వికాస్ యోజన’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ప్రకారం రైతుకు ఎకరాకు రూ.15 వేలు ప్రోత్సాహకంగా ఇవ్వాలి. దీన్ని ఆచరణలోకి తీసుకురావాలి. మార్కెటింగ్ సౌకర్యం లేక ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వాళ్లు కూడా మానేస్తున్నారు. ప్రభుత్వం సాయం చేస్తే చాలా మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తారు. – నలువాల సుధాకర్ (98498 86034), మియాపూర్, సుల్తానాబాద్ మండలం, పెద్దపల్లి జిల్లా – ఆది వెంకట రమణారావు, స్టాఫ్ రిపోర్టర్, పెద్దపల్లి ఫోటోలు : మర్రి సతీష్ కుమార్, ఫోటో జర్నలిస్టు -
కుటుంబ ఆరోగ్యం కోసం ప్రకృతి సేద్యంలోకి..
చుట్టూతా ఉన్న బంధుమిత్రుల్లో అక్కడొకళ్లు, ఇక్కడొకళ్లు.. కేన్సర్‌తో అకాల మరణం పాలవుతుంటే తల్లడిల్లిన ఆ కుటుంబం మిన్నకుండిపోలేదు. దీనికి మూల కారణం రసాయనిక అవశేషాలతో కూడిన ఆహారోత్పత్తులేనని గుర్తించింది. సేంద్రియ ఆహారోత్పత్తులు మార్కెట్లో అందుబాటులో లేకపోయినా సరిపెట్టుకోలేదు. వ్యవసాయం అంటే బొత్తిగా తెలియకపోయినా.. 40 ఎకరాల పొలం కొని సుమారు ఐదేళ్ల క్రితం నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు మహిళా రైతు గుళ్లపల్లి సుజాత. ప్రకృతి వ్యవసాయం గురించి మాటసాయం చేసే వాళ్లు కూడా దగ్గర్లో లేకపోయినా పట్టువీడలేదు. ప్రకృతి సేద్యం గురించి పుస్తకాల ద్వారా మౌలిక పరిజ్ఞానాన్ని పెంచుకొని, పాలేకర్ శిక్షణ ద్వారా పరిపుష్టం చేసుకున్నారు. మొక్కవోని దీక్షతో ఆచరణ ద్వారా స్వానుభవం పొందారు. పండించుకున్న అమృతాహారాన్ని తాము తింటూ.. తమ బంధుమిత్రులకు కూడా ఆనందంగా అందిస్తున్నారు సుజాత. మెకానికల్ ఇంజనీరైన తన భర్త తోడ్పాటుతో సొంత ఖర్చుతో పొలంలో వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని వాతావరణానికి అనుగుణంగా పంటలు సాగు చేస్తున్నారు. డ్రోన్‌ను వినియోగిస్తున్నారు. వృత్తి వ్యాపారాలలో స్థిరపడి, ఆదాయ వనరులకు లోటు లేని మధ్యతరగతి ప్రజలు సైతం.. తమ వంతు బాధ్యతగా రసాయన రహిత ఆహారాన్ని పండించుకోవాల్సిన ఆవశ్యకతను ఆచరణాత్మకంగా చాటిచెబుతున్న సుజాతకు, సుస్థిర సేద్యమే జీవనంగా మలచుకున్న అక్క చెల్లెళ్లందరికీ మహిళా రైతుల దినోత్సవం సందర్భంగా అభినందనలు.. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి గ్రానైటు ఎగుమతి వ్యాపారంలో అనుభవం గడించిన ప్రకాశం జిల్లా వాస్తవ్యురాలు గుళ్లపల్లి సుజాతకు వ్యవసాయంలో పూర్వానుభవం బొత్తిగా లేదు. అయినా, రసాయనిక అవశేషాల్లేని ఆహారాన్ని స్వయంగా పండించుకొని తినటం ద్వారా ఆరోగ్యదాయకమైన జీవనం సాగించాలన్న పట్టుదలతో ప్రకృతి వ్యవసాయంలో లోతుపాతులను అధ్యయనం చేశారు. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం పెదారకట్ల గ్రామ పరిధిలో రాళ్లు, రప్పలతో కూడిన 40 ఎకరాల భూమిని కొనుగోలు చేసి గత ఐదేళ్లుగా వ్యయప్రయాసలకోర్చి రాజీ ఎరుగని రీతిలో ప్రకృతి సేద్యం చేస్తున్నారు. కేన్సర్ బెడదతో సేద్యం దిశగా కదలిక.. ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చిన తీరును సుజాత ఇలా వివరించారు.. ‘‘అప్పట్లో మేం చెన్నైలో ఉండేవాళ్లం. మా దగ్గరి బంధువుల్లో అనేక మంది వైద్యులు ఉన్నారు. ఆహారం గురించి, ఆరోగ్య రక్షణ గురించి చాలా జాగ్రత్తలు తీసుకునేవాళ్లం.. అయినా.. బంధుమిత్రుల్లో కొందరు కేన్సర్ తదితర దీర్ఘరోగాలతో అకాల మరణాల పాలయ్యే వారి సంఖ్య చూస్తుండగానే పెరిగిపోతుండటం మాకు చాలా ఆందోళన కలిగించింది. ఈ దుస్థితికి రసాయనిక అవశేషాలతో కూడిన ఆహారమే మూల కారణమని గ్రహించాం. ఐదేళ్ల క్రితం సేంద్రియ ఆహారోత్పత్తుల కోసం, సేంద్రియ కూరగాయల కోసం చెన్నై నగరమంతా గాలించినా.. దూరంగా ఎక్కడో ఒక చోట దొరికేవి. కూరగాయలు దొరికేవి కాదు. అటువంటి పరిస్థితుల్లో మనమే ఎందుకు ప్రకృతి వ్యవసాయం చేపట్టకూడదన్న ఆలోచనతో.. పెదారకట్ల గ్రామంలో పొలం కొన్నాం. పాలేకర్ పుస్తకాలతోపాటు వివిధ పత్రికలు చదువుతూ ప్రకృతి వ్యవసాయంలో మౌలిక విషయాలను ఒంటపట్టించుకున్నాను. రైతుకు అవసరమైన విషయాలన్నీ పుస్తకాల్లో దొరకవు కదా.. సుస్థిర వ్యవసాయ కేంద్రం వంటి స్వచ్ఛంద సంస్థలను, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ పరిజ్ఞానాన్ని పెంచుకున్నాను..’’ అన్నారామె. ఏడాదిలో పూర్తి అవగాహన పట్టుదల ఉంటే ప్రకృతి వ్యవసాయం నేర్చుకోవడానికి ఒక సంవత్సరం చాలని సుజాత స్వానుభవంతో చెబుతున్నారు.. ‘‘ఆవు పేడ, మూత్రం తొలి దశలో పొదిలిలోని గోశాల నుంచి సేకరించి తీసుకెళ్లి జీవామృతం, వివిధ ఔషధ మొక్కల ఆకులు అలములను సేకరించి కషాయాలను స్వయంగా నేనే తయారు చేశాను. దగ్గరుండి పంటలకు వాడించాను. మా వారు కోటేశ్వరరావు గారు ఆస్ట్రేలియా షిప్పింగ్ కంపెనీలో మెకానికల్ ఇంజనీర్‌గా పని చేస్తూ.. తనకు వీలైనప్పుడల్లా పొలం పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూ ప్రోత్సహించారు. తొలుత విద్యుత్ సదుపాయం లేకపోవడంతో సోలార్ పంపుతోనే డ్రిప్‌తో పంటలు పండించాము. సొంతంగా అన్ని పనులూ చక్కబెట్టుకుంటూ, తెలియని విషయాలను వాళ్లనూ వీళ్లనూ అడిగి తెలుసుకుంటూ.. పాలేకర్ పుస్తకాల్లో చెప్పినవి తు.చ. తప్పకుండా ఆచరించే ప్రయత్నం చేయడంతో మొదటి సంవత్సరం పూర్తయ్యే నాటికే నాకు ప్రకృతి వ్యవసాయ మౌలిక భావనలపై అవగాహన, అనుభవం వచ్చాయి. మొదటి పంట మొక్కజొన్న అద్భుతంగా పండే సరికి ధైర్యం వచ్చింది. కినోవా కూడా పండించాను. అయితే, ప్రాసెసింగ్ సదుపాయాల్లేక చెన్నై తీసుకెళ్లి ప్రాసెస్ చేయించుకోవాల్సి వచ్చింది...’’ అంటూ తన ప్రకృతి వ్యవసాయ ప్రయాణాన్ని వివరించారామె. మా కుటుంబాలకు, సిబ్బంది కుటుంబాలకు సరిపడా అన్ని రకాల కూరగాయలను పొలంలో పండించుకొని తింటున్నాం. అందరమూ ఆరోగ్యంగా ఉన్నామన్నారు. గత ఏడాది ఒకటే వర్షం.. ఒంగోలుకు 75 కి.మీ. దూరంలోని వ్యవసాయ క్షేత్రంలో మొత్తం 40 ఎకరాలకు గాను 20 ఎకరాల్లో మామిడి, నేరేడు, దానిమ్మ, సీతాఫలం, అరటి, జామ, బొప్పాయి, నిమ్మ, సపోట తదితర పండ్ల తోటలతోపాటు అంతర పంటలను సుజాత సాగు చేస్తున్నారు. మిగతా పొలంలో అపరాలు, చిరుధాన్యాలు, అన్ని రకాల కూరగాయ పంటలను పంటల మార్పిడి పద్ధతిలో సాగు చేస్తున్నారు. 5 ఎకరాల్లో మామిడి ప్రధాన పంటగా పాలేకర్ చెప్పిన విధంగా 5 అంతస్తుల సేద్యం ప్రారంభించారు. అరెకరంలో పశుగ్రాసాన్ని సాగు చేస్తున్నారు. కేవలం పక్షుల ఆహారం కోసం పొలం చుట్టూ కొన్ని సాళ్లలో జొన్న పంట వేస్తున్నారు. ప్రతి రోజూ సాయంత్రం 4 గంటలకు గుంపులుగా వచ్చే పక్షులు జొన్న గింజలు తిని వెళ్తుంటాయని.. అవి ఇతర పంటల జోలికి ఎప్పుడూ రాలేదని ఆమె తెలిపారు. పాలేకర్ పద్ధతిపై కుదిరిన నమ్మకం తమ ప్రాంతంలో గత ఏడాది తీవ్ర కరువు పరిస్థితుల్లో ఒక్కటే వర్షం కురిసినప్పుటికీ కందులు, మినుములు, కొర్రలు, జొన్న, శనగ వంటి పంటలు పండించగలిగానని సుజాత తెలిపారు. ఆ ప్రాంతంలో భూములన్నీ బీళ్లుగా ఉన్న రోజుల్లో తాము ప్రకృతి సేద్యం ప్రారంభించి.. వివిధ పంటలు సాగు చేస్తుండటంతో స్థానికులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పుడు చాలా పొలాల్లో పంటలు సాగవుతున్నాయని ఆమె సంతృప్తిగా తెలిపారు. గత ఏడాది తీవ్ర కరువు పరిస్థితుల్లో తమ ప్రాంతంలో రసాయనిక వ్యవసాయం చేసిన వారికి తీవ్రనిరాశే మిగిలిందని, తాము చెప్పుకోదగిన దిగుబడి పొందగలిగామన్నారు. పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతిపై తమకు నమ్మకం కలిగినందున ఇతర సేంద్రియ సాగు పద్ధతులను పట్టించుకోలేదని ఆమె తెలిపారు. ఈ ఏడాది పొలం అంతటా జనుము, జీలుగ సాగు చేసి పచ్చిరొట్ట ఎరువుగా కలియదున్నుతున్నారు. అరెకరంలో వరి సాగు చేస్తున్నారు. గత ఏడాది 100 మిరప మొక్కలు సాగు చేయగా మంచి దిగుబడినిచ్చాయి. ఆ స్ఫూర్తితో ఈ ఏడాది 15 ఎకరాల్లో మిరప తోట సాగు చేయాలనుకుంటున్నానని సుజాత చెప్పారు. మార్కెటింగ్ సమస్యే లేదు.. వ్యవసాయం చేసిన అనుభవం లేకపోయినా పొలం కొని పట్టుదలగా ఏడాది కష్టపడి ప్రకృతి వ్యవసాయంలో లోతుపాతులను ఔపోశన పట్టాను. గత నాలుగేళ్లుగా మొక్కజొన్న మొదలుకొని కినోవా వరకు అనేక రకాల పంటలను పండించిన అనుభవం గడించాను. కందులు, మినుములు, కొర్రలు తదితర పంటలను గత ఏడాది తీవ్ర కరువులోనూ చక్కగా పండించాను. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో బెట్టను తట్టుకొని, తక్కువ నీటితో సాగు చేస్తున్నాను. ఈ ధైర్యంతోనే ఈ ఏడాది 15 ఎకరాల్లో మిరపను ప్రధాన పంటగా సాగు చేయబోతున్నాను. మేం పండించిన ఉత్పత్తులను మొదటి ఏడాది బంధుమిత్రులకు ఉచితంగా ఇచ్చి రుచి చూపించాం. తర్వాత నుంచి మా ఇంటికి వచ్చి మరీ కొనుక్కెళ్తున్నారు. చెన్నైలో బంధుమిత్రులు, వైద్యులతో పాటు స్థానిక వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు సైతం మా ఇంటికి వచ్చి కొనుక్కెళ్తున్నారు. కిలో కందిపప్పు రూ. 180, మినప్పప్పు రూ.150, శనగలు రూ. 80, రాగులు, జొన్నలు, సజ్జలు రూ. 50 చొప్పున అమ్ముతున్నాం. నమ్మకంగా, రాజీలేకుండా ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల మా ఆహారోత్పత్తులకు మార్కెటింగ్ సమస్యే రాలేదు. – గుళ్లపల్లి సుజాత (94942 59343), ప్రకృతి వ్యవసాయదారు, పెదారకట్ల, కొనకనమిట్ల, ప్రకాశం జిల్లా వ్యవసాయ క్షేత్రంలో సొంత వాతావరణ కేంద్రం! గుళ్లపల్లి సుజాత తన భర్త కోటేశ్వరరావు తోడ్పాటుతో తమ వ్యవసాయ క్షేత్రంలో వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సొంత ఖర్చుతో ఆస్ట్రేలియా నుంచి తెప్పించిన యంత్రపరికరాలతో దీన్ని నెలకొల్పారు. దీని ద్వారా సేకరించే తాజా సమాచారం ద్వారా వర్షం రాకపోకల గురించి, వాతావరణ మార్పుల గురించి కచ్చితమైన ముందస్తు సమాచారం తెలుసుకోగలగడం చాలా ఉపయోగకరంగా ఉందని కోటేశ్వరరావు తెలిపారు. ఈ రోజు వర్షం వస్తుందన్న సూచన ఉన్నప్పుడు పురుగుల మందు చల్లడం లేదని, నీటి తడి ఇవ్వటం లేదని.. ఆ విధంగా వనరుల వృథా తగ్గిందని అంటున్నారు. వాతావరణ సూచనలను బట్టి పొలం పనుల ప్రణాళిక ఎప్పటికప్పుడు సవరించుకుంటూ ప్రయోజనం పొందుతున్నామన్నారు. వర్షం, ఉష్ణోగ్రత, గాలిలో తేమ, గాలుల తీవ్రతపై ఈ కేంద్రం అందించే సమాచారం 5 కిలోమీటర్ల పరిధిలోని రైతులకు కూడా ఉపయుక్తంగా ఉంటాయన్నారు. ఇటీవల ఒక డ్రోన్‌ను కొనుగోలు చేశారు. పంటలు, తోటల తీరుతెన్నుల పరిశీలన, పర్యవేక్షణ ఇక మరింత సులభతరం కానుందని కోటేశ్వరరావు, సుజాత చెప్పారు. తమ ప్రాంతంలో ఇతర రైతులకు కూడా సేవలందించాలన్న ఆలోచన ఉందన్నారు. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఇన్పుట్స్: నాగం వెంకటేశ్వర్లు, సాక్షి, కొనకనమిట్ల, ప్రకాశం జిల్లా -
ఆకుపచ్చని వాస్తవం..ప్రకృతి సేద్య జగత్తు!
నిరాశా నిస్పృహలు అలముకున్న రైతు జీవితానికి ఆశాదీపం ప్రకృతి సేద్యమని నిరూపిస్తున్నారు యువ రైతు జగదీశ్‌రెడ్డి. డబ్బు ధారపోసి రసాయనిక సేద్యం చేసి నష్టపోయిన చోటే.. ప్రకృతి సేద్యంలో విజయపతాక ఎగరేస్తున్నారు. అంతేకాదు.. ప్రకృతి వ్యవసాయోత్పత్తుల్లో అధిక పోషక విలువలు ఉంటాయని అనేక వేదికల్లో ఎలుగెత్తి చాటుతున్నారు. సాటి రైతులను, సాగుపై ఆసక్తి ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులనూ ఆ దిశగా ప్రోత్సహిస్తున్నారు. వరి, మామిడి, వేరుశనగ సాగులో రాణిస్తున్న చిత్తూరు జిల్లా రైతుప్రకృతి సేద్యంలో వరి సాగుతో ఎకరాకు రూ. 80 వేల నికరాదాయం మామిడిలో పెరిగిన పంటకాలం వేరుశనగ పండించి..గానుగ నూనె విక్రయిస్తూ అధిక ఆదాయార్జన ఉన్న కొద్దిపాటి బావి నీటినే పొదుపుగా వాడుకుంటూ 30 ఎకరాల్లో వరి, వేరుశనగ, మామిడి పంటలను పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు ఎనమల జగదీశ్ రెడ్డి. గిర్ ఆవులు, కుందేళ్లు, పెరటి కోళ్లను కూడా పెంచుతున్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం దండువారిపాళ్యం ఆయన స్వగ్రామం. 2012లో తిరుపతిలో పెట్టుబడి లేని ప్రకృతిసేద్యం పితామహుడు సుభాష్ పాలేకర్ శిక్షణా శిబిరానికి హాజరైనప్పటి నుంచి జగదీశ్‌రెడ్డి ప్రకృతి సేద్యం చేస్తున్నారు. పాలేకర్ శిక్షణ ఆయన సేద్య జీవితంలో గుణాత్మక మార్పునకు దోహదపడింది. తొలి పంటలో 25 బస్తాల ధాన్యం దిగుబడి జగదీశ్‌రెడ్డి పొలంలో వరి దిగుబడి ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన తొలి ఏడాది ఎకరాకు 25 బస్తాలు పండింది. ప్రస్తుతం 30కు పెరిగింది. ప్రస్తుతం ఐదెకరాల్లో అమన్ రకం వరిని సాగు చేస్తున్నారు. ముందుగా జనుము, జీలుగ వంటి పచ్చిరొట్ట పైర్ల గింజలు చల్లి.. నెల రోజులకు దమ్ములో కలియదున్నుతారు. విత్తనాన్ని బీజామృతంతో శుద్ధిచేస్తారు. సాళ్ల పద్ధతిలో నాట్లు వేస్తారు. కలుపును నివారించేందుకు సాళ్ల మధ్యలో కోనోవీడర్‌తో రెండు సార్లు దున్నుతారు. నెలకోసారి ఎకరాకు 200 లీటర్ల జీవామృతం నీటి ద్వారా అందించటంతో పాటు పైరుపై పిచికారీ చేస్తారు. నెలకోసారి నీమాస్త్రం పిచికారీ చేస్తారు. పంటను ఎలాంటి చీడపీడలు, తెగుళ్లు ఆశించకపోతే ఇతర కషాయాలు వాడాల్సిన అవసరం రాలేదని జగదీశ్ రెడ్డి చెప్పారు. ఎకరాకు రూ. 80 వేల నికరాదాయం! ధాన్యాన్ని నేరుగా విక్రయించకుండా బియ్యంగా మార్చి జగదీశ్‌రెడ్డి విక్రయిస్తున్నారు. రసాయన సేద్యంలో సాగు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే క్వింటాకు 60 కిలోల బియ్యం వస్తుండగా.. తన ధాన్యానికి క్వింటాకు 80–85 కిలోల బియ్యం వస్తున్నాయని ఆయన చెప్పారు. ఎకరాలో ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 16 క్వింటాళ్లకు పైగా బియ్యం దిగుబడి వస్తోందన్నారు. కిలో బియ్యాన్ని రూ. 55–70 చొప్పున సేంద్రియ ఉత్పత్తులు విక్రయించే షాపులు, ఉద్యోగులకు విక్రయిస్తున్నారు. ఎకరాకు రూ. 90 వేల వరకు ఆదాయం లభిస్తోంది. దమ్ము, నాట్లు, కూలీలకు, ఎకరా వరి సాగుకు రూ. 10 వేల వరకు ఖర్చవుతోంది. ఎకరాకు రూ. 80 వేల నికరాదాయం రైతుకు లభిస్తోంది. తమ ప్రాంతంలో రసాయన సేద్యం చేసిన రైతు ధాన్యాన్ని విక్రయిస్తే ఎకరాకు రూ. 45 వేలకు మించి ఆదాయం రావటంలేదన్నారు. వేరుశనగ నూనె విక్రయం... ఐదెకరాల్లో వేరుశనగను సాగు చేస్తున్నారు. నెలకోసారి జీవామృతం, నీమాస్త్రాలను పిచికారీ చేయటంతో పాటు సాగు నీటి ద్వారా అందిస్తారు. గింజ నాణ్యంగా ఉండి కాయలు తూకానికి వస్తున్నాయి. జగదీశ్‌రెడ్డి తాను పండించిన వేరుశనగ గింజల నుంచి నూనె తీసి విక్రయిస్తున్నారు. 20 కిలోల గింజలను గానుగ ఆడిస్తే 8 కిలోల నూనె లభిస్తుంది. నూనె లీటరు రూ. 250 చొప్పున విక్రయిస్తున్నారు. మామిడిలో పెరిగిన పంటకాలం జగదీశ్‌రెడ్డి 20 ఎకరాల్లో మామిడి తోటను సాగు చేస్తున్నారు. పంటకు పోషకాలను అందించేందుకు నెలకోసారి జీవామృతం... చీడపీడల నివారణకు దశపత్ర కషాయం, నీమాస్త్రాలను పిచికారీ చేస్తున్నారు. మామిడిలో సాధారణంగా జూన్ నెలతో కాపు పూర్తవుతుంది. కానీ జగదీశ్‌రెడ్డి మామిడి తోటలో మాత్రం జూన్ నెలమొత్తం కాపు కాయటం విశేషం. ప్రకృతిసేద్యంలో పండించిన బంగినపల్లి రకం కాయలను అమ్ముకోవటంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవటం లేదు కానీ తోతాపురి రకం మామిడి కాయలను విక్రయించటం కష్టమవుతున్నదన్నారు. తోటలో తోతాపురి రకం చెట్లను ఎక్కువగా సాగు చేయటం.. వాటిని మామిడి గుజ్జు పరిశ్రమలో ఉపయోగిస్తున్నారు. దీని వల్ల ప్రకృతిసేద్యంలో పండించినా మార్కెట్లో మాత్రం సాధారణ ధరకే విక్రయించాల్సి రావటంతో తాము నష్టపోతున్నామని దీన్ని నివారించేందుకు కుటీర పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సహించాలని జగదీశ్‌రెడ్డి కోరారు. ప్రకృతి వ్యవసాయం రైతుకు ఆర్థిక భద్రత కల్పించడం గురించి, ఈ ఆహారోత్పత్తుల పోషక విలువలను గురించి తెలియజెప్పేందుకు అటు రైతులు, ఇటు వినియోగదారులకు కూడా ఆయన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తన స్వగ్రామంలోని 30 మంది రైతులకు శిక్షణ ఇచ్చి ప్రకృతి సేద్యం చేపట్టే దిశగా ప్రోత్సíß స్తున్నారు. ఈ ఆహారోత్పత్తుల వినియోగంతో కలిగే ప్రయోజనాలపై హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబయి, న్యూఢిల్లీ నగరాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన కృషికి గుర్తింపుగా నేషనల్ న్యూట్రిషన్ అవార్డు.. ఏసియన్ అగ్రి ఫౌండేషన్ అవార్డులు వరించాయి. - గాండ్లపర్తి భరత్ రెడ్డి, సాక్షి, చిత్తూరు నా కొడుకును రైతుగా చూడాలనుకుంటున్నా! మన సాగు భూమికి మనం ధర్మకర్తలం మాత్రమే. పంటలు సాగు చేసుకొని జీవిస్తూనే.. భూమి సహజత్వాన్ని, సారాన్ని యథాతథంగా భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనదే. ఢిల్లీ తదితర నగరాల్లో పలువురు కేన్సర్ తదితర దీర్ఘ రోగులు నా ఆహారోత్పత్తులు వాడి ఉపశమనం పొందుతున్నారు. ఆరోగ్యకరమైన ప్రకృతి సేద్య ఆహారోత్పత్తులను ప్రజలకు అందిస్తున్నాననే సంతృప్తి ఉంది. నా కొడుకును కూడా ప్రకృతి వ్యవసాయదారుడిగానే చూడాలనుకుంటున్నా. – ఎనమల జగదీశ్‌రెడ్డి (94400 44279), ప్రకృతి వ్యవసాయదారు, దండువారి పాళ్యం,బంగారుపాళ్యం మండలం, చిత్తూరు జిల్లా -
ప్రకృతి వ్యవసాయ విప్లవం!
ప్రకృతికి అనుగుణమైన జీవన కళా నైపుణ్యాలను అందించడంలో ప్రసిద్ధిపొందిన బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రం ప్రకృతి వ్యవసాయంపై రెండు రోజుల శిఖరాగ్ర సభకు ఇటీవల వేదికైంది. తొలి జన్యుమార్పిడి ఆహార పంట జీఎం ఆవాలకు ఆమోద ముద్ర వేయడానికి భారత ప్రభుత్వం సన్నద్ధమవుతుండగా జరిగిన ఈ సభ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఆహార అభద్రతకు, పౌష్టికాహార లోపానికి, జన్యుమార్పిడి విత్తనాలకు, అన్నదాతల ఆత్మహత్యలకు తావు లేని సమాజం కోసం ప్రకృతి వ్యవసాయ విప్లవానికి త్రికరణశుద్ధితో నీర్వోసి నార్వెట్టాలని ‘ప్రకృతి వ్యవసాయంపై తొలి శిఖరాగ్రసభ’ పాలకులకు పిలుపునిచ్చింది. దేశవిదేశాల నుంచి తరలివచ్చిన ప్రకృతి వ్యవసాయదారులు, శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద కార్యకర్తలు, నిపుణులు, మార్కెటింగ్ నిపుణులు ఏకతాటిపైకి రావడం విశేషం. ఆ విశేషాలు కొన్ని ‘సాగుబడి’ పాఠకుల కోసం.. దేశంలో అనేక రాష్ట్రాల్లో స్వల్ప ఖర్చుతో, సొంత వనరులతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల సంఖ్య తామర తంపరగా విస్తరిస్తున్న కీలక దశలో ‘ప్రకృతి వ్యవసాయంపై తొలి శిఖరాగ్ర సభ’ జరగడం విశేషం. ప్రముఖులను ఆహ్వానించి ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వ్యవసాయ విభాగం ‘శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ట్రస్టు (ఎస్.ఎస్.ఐ.ఎ.ఎస్.టి.)’ ఈ శిఖరాగ్ర సభను నిర్వహించింది. ‘అన్నపూర్ణ’ నేలతల్లి ఆరోగ్యంతోపాటు మనుషుల ఆరోగ్యాన్నీ దుంప నాశనం చేస్తున్న రసాయనిక వ్యవసాయాన్ని వీలైనంత తొందరగా వదిలించుకొని.. దేశం యావత్తూ ప్రకృతి వ్యవసాయం వైపు దీక్షగా కదలాలని ‘ప్రకృతి వ్యవసాయంపై తొలి శిఖరాగ్రసభ’లో వక్తలు పిలుపునిచ్చారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రకృతి వ్యవసాయదారులు, పాలకులు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులు శిఖరాగ్రసభలో పాల్గొన్నారు. ఉక్రేనియా పార్లమెంటరీ ప్రతినిధివర్గంతోపాటు ఏడు దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు. మనోబలంతో ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టి సత్ఫలితాలు సాధిస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన 39 మంది రైతులు, రైతు శాస్త్రవేత్తలను ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు, ఆథ్యాత్మిక గురువు రవిశంకర్ సమక్షంలో ‘కృషి రత్న’ పురస్కారాలతో సత్కరించడం విశేషం. కర్నూల్ జిల్లాకు చెందిన యువ ప్రకృతి వ్యవసాయదారుడు మహమ్మద్ బాషా, ప్రకృతి వ్యవసాయ ప్రచారకర్తగా కేరళ ప్రభుత్వం ప్రకటించిన 20 ఏళ్ల యువ రైతు సూరజ్ సభికుల దృష్టిని అమితంగా ఆకర్షించారు. నాలుగేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా.. తనకు 4 ఎకరాల భూమి, ఏడు ఆవులున్నాయని, నాలుగేళ్లుగాప్రకృతి వ్యవసాయం చేస్తున్నానని కర్నూలు జిల్లాకు చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు మహమ్మద్ బాషా చెప్పారు. తమ ఇంట్లో అందరూ కలసి వ్యవసాయ పనులు చేసుకుంటామని, ఆవులు తెచ్చిన తర్వాత ఇంట్లో ఎవరూ ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం రాలేదన్నారు. ఒకటిన్నర ఎకరాల్లో 57 టన్నుల పచ్చి మిర్చి దిగుబడి పొందినట్టు చెప్పారు. రెండు రోజుల సభలో సుప్రసిద్ధ శాస్త్రవేత్త డా. వందనా శివ, ఇండోనేసియా ప్రతినిధి ఇబు హెలియంతి హిల్మన్ కీలకోపన్యాసాలు చేశారు. వసంతరావ్ నాయక్ మరట్వాడా కృషి విద్యాపీ (పర్బని) వైస్ ఛాన్సలర్ డా. బి. వెంకటేశ్వర్లు, తెలుగు మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఛత్తీస్‌గఢ్ మంత్రి మహేశ్ గగ్డ, సుస్థిర వ్యవసాయ కేంద్రం డైరెక్టర్ జనరల్ డా. జీవీ రామాంజనేయులు, ప్రకృతి సేద్యంపై ఆం.ప్ర. ప్రభుత్వానికి సలహాదారు టి. విజయకుమార్, హర్యానాకు చెందిన ఐఏఎస్ అధికారిణి రజని సిక్రి సిబల్, రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి, ప్రసిద్ధ ప్రకృతి వ్యవసాయదారుడు దీపక్ సచ్దే, ఎస్.ఎస్.ఐ.ఎ.ఎస్.టి. ట్రస్టీ డా. బి. ప్రభాకర్ రావు, సేంద్రియ సేద్యంపై జాతీయ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు కపిల్ షా తదితరులు వేర్వేరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చారు. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల వేదిక అధ్యక్షులు సంగెం చంద్రమౌళి, ఖేతీ విరాసిత్ మంచ్ సారధి ఉమేంద్ర దత్ తదితరులు పాల్గొన్నారు. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ప్రజలందరికీ ప్రకృతి ఆహారం అందాలి! ప్రకృతి వ్యవసాయం ఓ విప్లవం. ఇది ప్రపంచం అంతా విస్తరించాలి. ప్రకృతి వ్యవసాయంతోపాటు వాన నీటి సంరక్షణ, దేశీ గోజాతులు, దేశీ విత్తనాల పరిరక్షణ అవసరాన్ని ప్రజలు, పాలకులు గుర్తెరగాలి. ప్రకృతి వ్యవసాయం ద్వారా పోషకవిలువలతో కూడిన ఆహారాన్ని సమృద్ధిగా పండించడానికి ఉపకరించే సమగ్ర పద్ధతులు మన రైతుల వద్ద ఉన్నాయి. శిఖరాగ్రసభ తీర్మానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిస్తాం. ఆహారాన్ని పండించే రైతు, ఆహారాన్ని వండి వడ్డించే మహిళలు కూడా సంతోషంగా ఉండాలంటే అందరం కలసి ప్రకృతి సేద్యాన్ని ప్రాచుర్యంలోకి తేవాలి. రైతులకు రుషి కృషి పద్ధతులపై అనేక రాష్ట్రాల్లో విస్తృతంగా శిక్షణ ఇస్తున్నాం. మా వాలంటీర్ల కృషితో 12 నదులు పునరుజ్జీవం పొందాయి. రసాయనిక ఎరువులు, పురుగుమందులతో పండించే ఆహారంలో సత్తువ గానీ, ఖనిజాలు గానీ తక్కువేనని అందరూ గ్రహించాలి. అమృతాహారాన్ని ప్రజలకు అందించాలన్న సంకల్పంతో దళారుల్లేని మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటుపై ఆలోచన చేస్తున్నాం. దేశంలో ప్రకృతి వ్యవసాయం పూర్తిస్థాయిలో విస్తరిస్తే రసాయన రహిత ఆహారోత్పత్తుల ధర కూడా తగ్గుతుంది. – పండిట్ రవిశంకర్,ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు, బెంగళూరు జన్యుమార్పిడి ఆహారంతో ముప్పు! రసాయనాలతో పండించిన ఆహారంలో పోషకాల లోపం తీవ్రంగా ఉన్నందున సమాజం రోగగ్రస్తమవుతున్నదన్న సత్యాన్ని పాశ్చాత్య దేశాలు గుర్తించాయి. జన్యుమార్పిడి విత్తనాలతో పండించే ఆహారంతో పర్యావరణానికి, ప్రజారోగ్యానికి, పంటల జీవవైవిధ్యానికి ముప్పు పొంచి ఉంది. సుసంపన్నమైన సంప్రదాయ వ్యవసాయ సంస్కృతిని, పంటల జీవవైవిధ్య సేద్య రీతులను పరిరక్షించుకుంటూ పురోగమించడమే ఉత్తమం. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి, ఆహార భద్రతకు ఇదే మూలం. పండిట్ రవిశంకర్‌జీ ప్రారంభించిన ప్రకృతి వ్యవసాయోద్యమానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నా. – డా. వందనా శివ, సుప్రసిద్ధ శాస్త్రవేత్త, నవధాన్య, డెహ్రాడూన్ మన సంకల్పాన్ని మొక్కలూ గ్రహిస్తాయి! నేలతల్లి అన్నపూర్ణ. పోషకాంశాలన్నీ భూమిలో ఉన్నాయి. వాటిని పంటలకు అందుబాటులోకి తేవడానికి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తే చాలు. ఎటువంటి రసాయనిక ఎరువులు, పురుగుమందుల అవసరం లేదు. ‘అమృత్మిట్టి’ని పొలంలోనే తయారు చేసి వాడుకోవచ్చు. బయటి నుంచి సేంద్రియ ఎరువు తెచ్చి వేయాల్సిన అవసరం లేదు. రైతుకు తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. వాస్తవ సమాచారం ఇవ్వాలి. మనందరం కలిసి, గొప్ప చైతన్యంతో చేయాల్సిందల్లా ప్రకృతి వ్యవసాయం ప్రారంభించడం ఒక్కటే. మన ఉక్కు సంకల్పాన్ని మొక్కలూ గ్రహిస్తాయి. ప్రొ. ధబోల్కర్ ‘నేచుఎకో’ సేద్య పద్ధతి పాటిస్తున్న పొలంలో ‘హెక్టారుకు, ప్రతి నెలా రూ. లక్ష చొప్పున ఆదాయం’ వస్తున్నది. మా ప్రాంతంలో 8 వేల హెక్టార్లలో ఈ సాగు జరుగుతోంది. ఆసక్తి ఉన్న వాళ్లు వచ్చి చూడొచ్చు. – దీపక్ సచ్దే (093295 70960), మల్పని ట్రస్టు, బజ్‌వాడ, మధ్యప్రదేశ్ www.amrutkrushi.com జన్యుమార్పిడి పంటలను వ్యతిరేకించడం మన బాధ్యత! ప్రకృతి వ్యవసాయం విరాజిల్లాలంటే జన్యుమార్పిడి పంటలను అందరం కలసి అడ్డుకోవాలి. కలుపు మందులను తట్టుకునేలా రూపొందించిన జన్యుమార్పిడి (జీఎం) ఆవాలు పంట అవసరమే మనకు లేదు. దీన్ని అనుమతిస్తే.. మరో 72 జన్యుమార్పిడి ఆహార పంటలకు గేట్లు బార్లా తెరిచినట్టవుతుంది. జన్యుమార్పిడి పంటలను వ్యతిరేకించడం ప్రజాక్షేమం కోరే మనందరి బాధ్యత. కలుపుమందులను తట్టుకునే జీఎం పంటల వల్ల మనుషులకు కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని రెండేళ్ల క్రితమే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. – కపిల్ షా, సభ్యులు, రసాయన రహిత వ్యవసాయంపై జాతీయ టాస్క్‌ఫోర్స్ దేశీ విత్తనాలపై పరిశోధనలు! ప్రకృతి వ్యవసాయం వల్ల భూమి బాగవుతుంది. సూక్ష్మజీవులను భూమికి అందిస్తే చాలు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల అవసరం లేదు. రైతులు బజారుకెళ్లి తమ ఉత్పత్తులు అమ్ముకోవాలే గానీ, ఏమీ కొనుక్కోవాల్సిన అవసరం ఉండకూడదు. లండన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్, జర్మనీలోని మాక్స్ పాంక్ ఇన్స్టిట్యూట్తో కలసి ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ మన దేశంలో దేశీ విత్తనాలపై పరిశోధనలు చేపట్టబోతున్నది. ఈ మేరకు ఒప్పందం కుదిరింది. దేశీ విత్తనాల రక్షణకు చేపట్టాల్సిన చట్టాలు, విధానపరమైన చర్యలపై ప్రభుత్వానికి సూచనలివ్వడానికి ఈ పరిశోధనలు ఉపకరిస్తాయి. – డా. బి. ప్రభాకరరావు, ట్రస్టీ,ఎస్.ఎస్.ఐ.ఎ.ఎస్.టి., బెంగళూరు ఆహార, పౌష్టికాహార భద్రత ప్రకృతి సేద్యంతోనే సాధ్యం పౌష్టికాహార భద్రత, ఆహార భద్రత ప్రకృతి వ్యవసాయం ద్వారానే సాధ్యం. వాతావరణ మార్పులను, కరువును, కేన్సర్ వంటి మహమ్మారి వ్యాధులను దీటుగా ఎదుర్కోవడానికి ప్రకృతిlసేద్యం ఒక్కటే మార్గం. – పి. రామకృష్ణారెడ్డి, చైర్మన్, శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ టెక్నాలజీ ట్రస్టు -
చీడపీడలపై ‘ప్రకృతి’ అస్త్రం!
వృత్తిరీత్యా న్యాయవాదైనా భేషజాలు లేకుండా ప్రకృతికి ప్రణమిల్లి సాగు బాట పట్టారాయన. ప్రకృతి నియమాలకు తలొగ్గి జీవిస్తేనే మనుగడ సజావుగా సాగుతుందని నమ్మి ప్రకృతి సేద్యాన్ని ఆచరిస్తున్నారు. చీడపీడలు లేని పంటల సాగుతో సాటి రైతులకూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ప్రకృతి సేద్యం అనగానే అధిక శ్రమ చేయాల్సిందేనన్న అభిప్రాయం అవాస్తవమని ఆచరణ ద్వారా రుజువు చేస్తున్నారు. 15 ఏళ్లు న్యాయవాదిగా పనిచేశాక గడ్డం సత్యనారాయణ రెడ్డి మనసు వ్యవసాయం వైపు మళ్లింది. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని నాగారం ఆయన స్వగ్రామం. పెట్టుబడి లేని ప్రకృతి సేద్యం గురించి తెలుసుకొని 2002లో శిక్షణకు హాజరయ్యారు. అప్పటి నుంచి తన 16 ఎకరాల పొలాన్ని కౌలుకు ఇవ్వటం మానుకున్నారు. పత్తి, పసుపు, కంది, వరి పంటలను స్వయంగా తానే సాగు చేస్తున్నారు. ఏ పంటను సాగు చేసినా దుక్కిలో ఆముదం, వేపపిండి, వర్మీ కంపోస్టులను తప్పనిసరిగా వేసుకుంటారు. పంటకాలంలో ఒకే ఒక్కసారి జీవామృతం ఇస్తారు. గత ఐదారేళ్ల నుంచి చీడపీడలు ఆశించకపోవటం వల్ల కషాయాలు పిచికారీ చేయాల్సిన అవసరం రావడం లేదు. పత్తి పంటకీ చీడపీడల్లేవు! 2016 ఖరీఫ్‌లో ఎకరాలో సంకర జాతి రకం పత్తిని సాగు చేశారు. దుక్కిలో ఎకరాకు 5 క్వింటాళ్ల వర్మీ కంపోస్టు వేశారు. 10 లీటర్ల జీవామృతాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి 50 రోజుల దశలో పైరుపై పిచికారీ చేశారు. పత్తి పంటను ఎలాంటి చీడపీడలు ఆశించలేదు. ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కూలీలకు రూ. 7 వేలు ఖర్చయింది. రూ. 40 వేల నికరాదాయం లభించింది. చీడపీడలు లేని గ్రీన్ సూపర్ రైస్ సాగు 2016 ఖరీఫ్‌లో 4 ఎకరాల్లో గ్రీన్ సూపర్ రైస్ (ఎస్.ఎ.ఎల్.–10)ను సాగు చేశారు. వరి నాట్లకు ముందు జీలుగ, జనుము సాగు చేసి దమ్ములో కలియదున్నారు. దుక్కిలో ఎకరాకు 10 క్వింటాళ్ల వర్మీ కంపోస్టు వేశారు. 40 రోజుల దశలో ఎకరాకు 200 లీటర్ల జీవామృతం నీటి ద్వారా అందించారు. వేపనూనె ఎకరానికి లీటరు చొప్పున రెండు విడతలు పిచికారీ చేశారు. నీటిని నిలవ గట్టి కలుపు సమస్యను నివారించారు. పంటను ఎలాంటి చీడపీడలు ఆశించలేదు. ఎకరాకు 40 క్వింటాళ్లకు పైగా ధాన్యం దిగుబడి వచ్చింది. నాట్లు, నూర్పిడికి ఎకరాకు రూ. 12 వేలు ఖర్చయింది. విత్తనంగా రైతులకు అందించేందుకు ధాన్యాన్ని నిల్వ చేశారు. సేంద్రియ పసుపుతో ఎకరాకు రూ.3 లక్షలు ప్రకృతి సేద్య విధానంలో ఎకరాలో పసుపును సాగు చేశారు. దుక్కిలో 2 క్వింటాళ్లు వేపపిండి, 5 క్వింటాళ్లు వర్మికంపోస్టు వేశారు. 60 రోజులకు ఎకరాకు 200 లీటర్ల జీవామృతం నీటి ద్వారా అందించారు. పంటను ఎలాంటి చీడపీడలు ఆశించలేదు. ఎకరాకు 28 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పసుపు కొమ్ములను పొడిగా మార్చి అమ్ముతున్నారు. క్వింటా కొమ్ములకు 80 కిలోల పొడి వస్తుంది. కిలో రూ. 150 చొప్పున విక్రయిస్తున్నారు. ఎకరాకు రూ. 3 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నారు. ఇది మార్కెట్ ధరకు రెండింతలు. సేంద్రియ పసుపు పొడి కోసం అమెరికా నుంచి ఆర్డర్లు వస్తున్నట్టు ఆయన చెప్పారు. కంది నాటితే.. దిగుబడుల మోతే... నాట్లు వేసే పద్ధతిలో కందిని సాగు చేసి ఆయన మంచి దిగుబడి సాధించారు. గత ఖరీఫ్‌లో బీఎస్ఎంఆర్ –736 కంది రకాన్ని ఎకరాకు 2 కిలోల విత్తనం వాడారు. మేలో పాలిథిన్ సంచుల్లో ఎర్రమట్టి, కంపోస్టును కలిపి.. సంచికి రెండు విత్తనాలు చొప్పున విత్తారు. 45 రోజులకు కంది మొక్కలు రెండున్నర అడుగుల ఎత్తు పెరిగాయి. దుక్కిలో ఎకరాకు 5 క్వింటాళ్ల వర్మీ కంపోస్టు, 2 క్వింటాళ్ల వేపపిండి, 3 క్వింటాళ్లు ఆముదం పిండి వేశారు. మొక్కల మధ్య 3, సాళ్ల మధ్య 5 అడుగుల ఎడం ఉండేలా నాటారు. పూతదశలో జీవామృతాన్ని నీటి ద్వారా ఇచ్చారు. కాయ దశలో వేపనూనె చల్లారు. పంటను ఎలాంటి చీడపీడలు ఆశించలేదు. ఫిబ్రవరిలో నూర్చితే ఎకరాకు 11 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాల్ రూ. 5,500 చొప్పున అమ్మారు. రూ. 50 వేల నికరాదాయం లభించింది. హైదరాబాద్‌లోని జాతీయ వృక్షారోగ్య యాజమాన్య సంస్థ(ఎన్.ఐ.పి.హెచ్.ఎం.) వారు సత్యనారాయణ రెడ్డిని సేంద్రియ రైతుగా గుర్తించి ప్రోత్సహించారు. బోరు మోటారును స్విచ్ ఆన్, ఆఫ్ చేయడానికి ‘కిసాన్ రాజా’ పరికరాలను మొబైల్ ద్వారా ఆయన వాడుతున్నారు. సత్యనారాయణరెడ్డి స్ఫూర్తితో పరిసర గ్రామాలకు చెందిన సుమారు 50 మంది రైతులు రసాయన సేద్యాన్ని వదిలి ప్రకృతి సేద్యాన్ని చేపట్టడం విశేషం. వెలిగిన దీపమే మరికొన్ని దీపాలను వెలిగిస్తుందనే సూక్తిని నిజం చేసిన సేంద్రియ వ్యవసాయ దీప్తి సత్యనారాయణ రెడ్డి. – పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి అగ్రికల్చర్, జగిత్యాల జిల్లా ఫొటోలు: ఏలేటి శైలేందర్‌రెడ్డి, సాక్షి ఫొటో జర్నలిస్టు ప్రతి రైతూ ప్రకృతి వ్యవసాయం చేయాలి పొలం ఉన్న ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడే రైతులు బాగుపడతారు. పదిహేనేళ్ల నుంచి ప్రకృతి సేద్యం చేస్తున్నా. 68 ఏళ్ల వయసులోనూ నా పనులన్నీ నేనే చేసుకుంటున్నా. రసాయన ఎరువులు వేయకుండా పండించిన సహజ ఆహారం తీసుకోవటం వల్లనే ఇది సాధ్యమయింది. బీపీ, షుగర్ లాంటి రోగాలు లేవ#. ఆదాయం కోసం కాకపోయినా కుటుంబం కోసం కొంత విస్తీర్ణంలోనయినా రైతులు ప్రకృతి సేద్యం చేయాలి. – గడ్డం సత్యనారాయణ రెడ్డి (88973 29237), నాగారం, ధర్మపురి మండలం, జగిత్యాల జిల్లా -
ప్రకృతి వ్యవసాయంతో లాభాలు
అనంతపురం అగ్రికల్చర్ : మితిమీరిన పెట్టుబడుల కారణంగా రైతులకు నష్టాలు తెచ్చిపెడుతున్న వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలంటే ప్రకతి వ్యవసాయాన్ని భారీగా విస్తరించాలని నాచురల్ ఫార్మింగ్ మేనేజ్మెంట్ (ఎన్‌పీఎం) రాయలసీమ జిల్లాల ఇన్చార్జి పుల్లారావు అన్నారు. గురువారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో జిల్లాలో ఉన్న 10 ఎన్‌పీఎం క్లస్టర్ రిసోర్స్ పర్సన్లతో ఆయన సమావేశం నిర్వహించారు. విచ్చలవిడిగా రసాయన ఎరువులు, పురుగు మందుల వాడటం వల్ల వ్యవసాయం రైతులను కష్టాల్లోకి నెట్టేస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో పురుగు మందులు లేని, పెట్టుబడి లేని వ్యవసాయ పద్ధతులపై రైతుల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. కేవలం ఆవుపేడ, మూత్రం ద్వారా తయారు చేసిన జీవామతం, ఇతరత్రా కషాయాలు వాడేలా రైతుల దష్టిని మళ్లించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 8 మండలాల పరిధిలో 10 క్లస్టర్ల కింద 53 గ్రామాల్లో 4,150 మంది రైతుల ద్వారా ఈ ఏడాది ఎన్‌పీఎం పద్ధతులు అమలు చేస్తున్నట్లు డీపీఎం రవీంద్రారెడ్డి, టెక్నికల్ ఏఓ లక్ష్మానాయక్ తెలిపారు. కస్టర్ల పరిధిలో 10 కస్టమ్ హైయరింగ్ సెంటర్లు (సీహెచ్‌సీలు), 50 వరకు కషాయాల విక్రయ కేంద్రాలు, అలాగే కషాయాల తయారీకి ఉపయోగపడే దేశీయ ఆవులు రాయితీతో పంపిణీ చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు.