పచ్చని బంగారం శ్రీగంధం! | sri gandham plants benefits | Sakshi
Sakshi News home page

పచ్చని బంగారం శ్రీగంధం!

Published Tue, Oct 23 2018 12:17 AM | Last Updated on Tue, Oct 23 2018 12:17 AM

sri gandham plants benefits - Sakshi

రాయ్‌చూర్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో కవిత మిశ్రా

కవిత మిశ్రా.. విలక్షణ మహిళా రైతు.. శ్రీగంధం వంటి విలువైన కలప పంటతోపాటు 10 రకాల పండ్ల చెట్లు, కూరగాయలు, ఆవులు, గొర్రెలు, పందెం కోళ్లతో పాటు మొక్కల నర్సరీ పెంచుతున్నారు. 8 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని దేశానికే అద్భుత నమూనా క్షేత్రంగా మార్చారు. సమీకృత ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఏటా రూ. 25 లక్షల వరకు ఆర్జిస్తున్నారు. జాతీయ మహిళా రైతు దినోత్సవం సందర్భంగా ఇటీవల కవితను కేంద్ర వ్యవసాయ శాఖ ‘ఆనర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ’ పురస్కారంతో సత్కరించడం విశేషం. ఈ అవార్డును తన క్షేత్రంలో వ్యవసాయ కార్మికులకు అంకితం ఇచ్చిన ఉత్తమ రైతు కవిత.. స్ఫూర్తిదాయకమైన ఆమె వ్యవసాయాను భవాలు.. ‘సాగుబడి’ పాఠకులకు ప్రత్యేకం..

కర్ణాటకలోని రాయ్‌చూర్‌ జిల్లా మాన్వి తాలూకా కవితల్‌ గ్రామం ఆదర్శ మహిళా రైతు కవిత మిశ్రా స్వస్థలం. ఎమ్మెస్సీ, కంప్యూటర్‌ డిప్లొమా పూర్తిచేసి ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం పొందారు. నియామక లేఖను భర్తకు చూపిస్తే.. ‘ఉద్యోగం వద్దులే. మన భూమిలో వ్యవసాయం చెయ్యి’ అన్నారట. భర్త మాటలకు ఆమె కుంగిపోలేదు. సవాలుగా తీసుకున్నారు. ఏసీ గదిలో కంప్యూటర్‌ ముందు పనిచేయాలన్న అభిలాష ఉన్నప్పటికీ.. పెద్దగా సారం లేని, ఇంచున్నర నీరున్న బోరుతో కూడిన తమ 8 ఎకరాల మెట్ట భూమిలోకి అడుగుపెట్టారు. తొలుత రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో దానిమ్మ తోటను సాగు చేసి బ్యాక్టీరియా తెగుళ్లవల్ల లక్షలాది రూపాయల పెట్టుబడి నష్టపోయారు. ఆ చేదు అనుభవం నుంచి మెట్ట ప్రాంత రైతుగా రెండు గుణపాఠాలు నేర్చుకున్నారు.

1. ఒకే పంటను సాగు చేయకూడదు. ఒకే పొలంలో అనేక పంటలు, అంతర పంటలు సాగు చేయాలి. కేవలం పంటల మీదే ఆధారపడకూడదు. పశువులు, చిన్న జీవాలు, కోళ్లను సైతం పెంచుతూ.. అనేక విధాలుగా నిరంతరం ఆదాయం వచ్చేలా చూసుకోవాలి.  

2. ప్రకృతికి ఎదురీదటం కాదు, ప్రకృతికి అనుగుణమైన సాగు పద్ధతి మేలు. ఈ గ్రహింపుతో రసాయనిక వ్యవసాయానికి స్వస్తి చెప్పి, పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించారు. శ్రీగంధం సాగుతోపాటు 10 రకాల సీజనల్‌ పండ్ల చెట్లు నాటి.. దేశం గర్వించదగిన ఆదర్శ మహిళా రైతుగా ఎదిగారు. ఆగ్రోఫారెస్ట్రీ, సమీకృత వ్యవసాయంలో అన్ని విషయాలపైనా ఆమెకు స్వీయానుభవంతోపాటు లోతైన అవగాహన ఉండటంతో.. ప్రాంతీయ, జాతీయ స్థాయి వర్క్‌షాపులలో రైతుగా తనకున్న అపారమైన జ్ఞానాన్ని పంచుతున్నారు.

శ్రీగంధం+10 రకాల పండ్ల చెట్లు
2,100 శ్రీగంధం చెట్లతో పాటు వెయ్యి దానిమ్మ, 600 మామిడి, 300 జామ, 450 సీతాఫలం, 100 నేరేడు, 100 మునగ, 100 ఉసిరి, 200 నిమ్మ, 100 కొబ్బరి చెట్లను 8 ఎకరాల్లో కవిత పెంచుతున్నారు. పొలంలో ఒక్క చదరపు అడుగు కూడా ఖాళీగా వదలకుండా పంటలు సాగు చేయాలని ఆమె సూచించారు. ట్రాక్టర్‌ కాదుకదా ఎద్దుల నాగలితో కూడా దుక్కి చెయ్యరు. ప్రకృతి వ్యవసాయంలో సూక్ష్మజీవులు, వానపాములే భూమిని గుల్లపరిచి సారవంతం చేస్తాయంటారామె. డ్రిప్‌ మైక్రోట్యూబ్స్‌ ద్వారా ప్రతి పది రోజులకోసారి చెట్లకు జీవామృతం, పంచగవ్య, దశపర్ణికషాయం మార్చి మార్చి ఇస్తున్నారు. 15 రోజులకోసారి పిచికారీ చేస్తారు.

ఆవులు.. గొర్రెలు.. పందెం కోళ్లు..
చెట్లు చిన్నగా ఉన్న దశలో కొన్ని ఏళ్ల పాటు కూరగాయలు, వేరుశనగ తదితర సీజనల్‌ అంతర పంటలు సాగు చేసుకునేవారు కవిత. 5 ఆవులు, 30 గొర్రెలు, 150 సేలం నుంచి తెచ్చిన డ్రాగన్‌ ఫైటర్స్‌ రకం పందెం కోళ్లను పెంచుతున్నారు. శ్రీగంధం, ఇతర పండ్ల విత్తనాలు సేకరించి, వాటితో మొక్కలు పెంచి అమ్ముతున్నారు. ఈ ఏడాది 6–7 క్వింటాళ్ల శ్రీగంధం విత్తనాలను సేకరించారు. కిలో విత్తనాలను రూ.వెయ్యికి విక్రయిస్తున్నారు. ఏడాది వయసున్న శ్రీగంధం మొక్కను రూ.30కి అమ్ముతున్నారు. అనేక రాష్ట్రాల రైతులు కవిత నర్సరీ నుంచి మొక్కలను కొనుగోలు చేస్తున్నారు. రైతుకు రోజూ, వారం, నెల, సీజన్, 15 ఏళ్లకు.. నిరంతరం ఏదో ఒక విధంగా ఆదాయం వచ్చేలా సమీకృత ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించడం వ్యవసాయంపై కవితకు ఉన్న అపారమైన అవగాహన, శ్రద్ధకు నిదర్శనం. తోటలోనే ఇల్లు నిర్మించుకొని కవిత కుటుంబం నివసిస్తోంది. 5 వ్యవసాయ కార్మికుల కుటుంబాలతో సహా తోటలోనే మకాం ఉంటున్నారు. దీంతో ఆమె తన తోటను అనుక్షణం కంటికిరెప్పలా కాపాడుకుంటూ మంచి దిగుబడులు పొందుతున్నారు. ప్రస్తుతం ఏడాదికి 8 ఎకరాల్లో రూ. 25 లక్షల వరకు ఆదాయం పొందుతున్నానని కవిత గర్వంగా చెబుతారు.

మైక్రోచిప్‌తో శ్రీగంధం చెట్లకు రక్షణ
శ్రీగంధం వంటి విలువైన జాతి చెట్లు పెరుగుతున్నాయంటే.. వాటితోపాటే అభద్రత కూడా పెరుగుతున్నట్లే. అయితే, ఏడేళ్లు పెరిగిన చెట్టుకు మైక్రో చిప్‌ను అమర్చడం ద్వారా అది దొంగల పాలు కాకుండా కాపాడుకోవచ్చని కవిత మిశ్రా తెలిపారు. తన తోటలో శ్రీగంధం చెట్లకు త్వరలో మైక్రోచిప్‌లను అమర్చుకోబోతున్నారు. ఒక్కో చెట్టుకు రూ. 2,500 ఖర్చవుతుంది. కర్నాటక ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్‌ వుడ్‌సైన్స్‌ టెక్నాలజీలో సర్వర్‌తో అనుసంధానం అయి ఉండే ఈ చిప్‌ వల్ల.. ఎవరైనా చెట్టును తాకిన వెంటనే సర్వర్‌కు, రైతు మొబైల్‌కు, పోలీస్‌ స్టేషన్‌కు కూడా హెచ్చరిక సందేశం వస్తుంది. తద్వారా విలువైన శ్రీగంధం చెట్లను సులువుగా రక్షించుకోవచ్చని కవిత తెలిపారు.

ప్రతి రైతూ ఒక ఎకరంలోనైనా శ్రీగంధం నాటాలి..
ఆత్మాభిమానం కలిగి ఉండే రైతులు అప్పుల్లో కూరుకుపోకుండా తెలివితో ప్రణాళికాబద్ధంగా సమీకృత ప్రకృతి సేద్యం చేయాలని కవిత సూచిస్తున్నారు. ప్రతి రైతూ తమకున్న మొత్తం పొలంలో కాకపోయినా.. కనీసం ఒక ఎకరంలోనైనా ఈ పద్ధతిలో శ్రీగంధం, పండ్ల మొక్కలు వేసుకోవాలని సూచిస్తున్నారు. శ్రీగంధం 15 ఏళ్లకు ఎకరానికి కోట్లలో ఆదాయం వస్తుంది. శ్రీగంధం చెట్ల మధ్య నాటిన సీజనల్‌ పండ్ల చెట్లు బోనస్‌గా రైతుకు అందుతాయని, రైతులు ఉద్యోగుల మాదిరిగా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఇది మేలైన సాగు పద్ధతి అని కవిత మిశ్రా(94487 77045) అనుభవపూర్వకంగా చెబుతున్నారు. అరుదైన విద్యాధిక ఆదర్శ మహిళా రైతు కవిత మిశ్రా. ఆమె దీక్ష, దక్షతలకు ‘సాగుబడి’ జేజేలు పలుకుతోంది.

ఎకరానికి 300 శ్రీగంధం చెట్లు..
2011లో కర్ణాటక ప్రభుత్వం శ్రీగంధం సాగుకు రైతులను అనుమితిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ కొత్తల్లోనే 12“12 అడుగుల దూరంలో ఎకరానికి 300 శ్రీగంధం మొక్కలు నాటారు. శ్రీగంధం తనంతట తాను పెరిగే చెట్టు కాదు. పక్కన ఉన్న చెట్ల వేర్లపై ఆధారపడి బతుకుతుంది. ప్రతి శ్రీగంధం మొక్కకు 6 అడుగుల దూరంలో మామిడి, జామ, చింత, నేరేడు, కరివేపాకు మొక్కలు విధిగా నాటాలన్నది కవిత అభిప్రాయం. నాటిన 15 ఏళ్లకు శ్రీగంధం కోతకు వస్తుంది. కాండంలో చేవ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ ధర లభిస్తుంది. చెట్టుకు 20 కిలోల చేవ వచ్చినా ఎకరానికి 6 వేల కిలోల చేవ కలప దిగుబడి వస్తుంది. కిలో రూ. 8 వేల చొప్పున ఎకరానికి రూ. 4 కోట్ల 80 లక్షల ఆదాయం వస్తుందని ఆమె ఆశిస్తున్నారు. ఆమె శ్రీగంధం తోట వయసు 6 ఏళ్ల 8 నెలల. మరో 8 ఏళ్లకు కోతకు వస్తుంది.

చెట్టుకు 70 కిలోల శ్రీగంధం చావ వచ్చింది!
2002లో బత్తాయి తోట సాళ్ల మధ్యలో 20 శ్రీగంధం మొక్కలు నాటా. 10 సంవత్సరాల వరకు నీళ్లిచ్చా. ఆ తర్వాత వేసవిలో నీళ్లిచ్చి బతికించా. 14.5 ఏళ్లు పెరిగిన తర్వాత ఏడాదిన్నర క్రితం అటవీ శాఖ అధికారుల అనుమతి తీసుకొని చెట్లు నరికి అమ్మాను. చెట్టు కాండం లోపల చావ కలప (హార్డ్‌ ఉడ్‌) ఎంత ఎక్కువ వస్తే రైతుకు అంత ఎక్కువ ఆదాయం వస్తుంది. కొన్ని చెట్లకు 70 కిలోల వరకు వచ్చింది. కిలో రూ. 6 వేలకు అమ్మాను. ఆ చెట్టుకు 4,20,000 వచ్చింది. తాటి చెట్ల నీడ వల్ల కొన్ని చెట్లకు చావ 20–30 కిలోలు మాత్రమే వచ్చింది. ఈ చెట్ల గింజలు పడి మా భూముల్లో కొన్ని మొక్కలు మొలిచి, పెరుగుతున్నాయి. ఉద్యాన కమిషనర్‌ వెంకట్రామ్‌రెడ్డి చొరవతో ఇప్పుడు శ్రీగంధం మొక్కలతోపాటు డ్రిప్‌ కూడా రైతులకు ఇవ్వనున్నారు. శ్రీగంధం చెట్లు పెంచిన తర్వాత వాటిని నరకడానికి అటవీ శాఖ అనుమతుల కోసం తిరగాల్సి వస్తున్నది. అయితే, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే సులభంగా అనుమతి ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్న చీఫ్‌ కన్సర్వేటర్‌ ఇటీవల చెప్పారు.  ప్రతి రైతూ శ్రీగంధం చెట్లు వేసుకుంటే.. మున్ముందు మంచి ఆదాయం వస్తుంది.


– విస్తారపు రెడ్డి (63043 91957), పసునూరు, నాంపల్లి మండలం, నల్లగొండ జిల్లా

ఎర్ర నేలలు శ్రీగంధం సాగుకు అనువైనవి!
కర్ణాటకలోని కవిత మిశ్రా ఆదర్శ రైతు. శ్రీగంధం చెట్లతో పాటు వివిధ రకాల పండ్ల చెట్లు, కూరగాయలు, కోళ్లు, ఆవులు పెంచుతున్నారు. నర్సరీని కూడా ఏర్పాటు చేశారు. రోజూ, ఆరు నెలలకు, 15 ఏళ్లకు ఆదాయం వచ్చేలా అనేక జాతుల చెట్లు, పంటలు సాగు చేస్తూ మంచి ఆదాయం గడిస్తున్నారు. ఆమె విజయగాథ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో శ్రీగంధం సాగును ప్రోత్సహిస్తున్నాం. నీటికొరత, ఎర్ర, గ్రావెల్‌ నేలలున్న తెలంగాణకు శ్రీగంధం సాగు చాలా అనువైనది. ఔషధ, సుగంధ మొక్కల బోర్డు ఎకరానికి 3 ఏళ్లలో 18 వేల నుంచి 20 వేల వరకు సబ్సిడీ ఇస్తున్నది. ప్రతి రైతూ శ్రీగంధం మొక్కలు కనీసం పదైనా వేసుకుంటే భవిష్యత్తులో మంచి ఆదాయం వస్తుంది. అంతేకాదు, కార్బన్‌డయాక్సయిడ్‌ను పీల్చుకోవడం ద్వారా పర్యావరణానికి ఈ చెట్లు ఎంతో మేలు చేస్తాయి. మన దేశం సహా 8 దేశాల్లోనే శ్రీగంధం పెరుగుతుంది. కాబట్టి గిరాకీ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. ములుగులోని ఉద్యాన సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌లో 18 లక్షల శ్రీగంధం మొక్కలు పెంచుతున్నాం. జూలై–ఆగస్టు నాటికి మొక్క రూ. 15–20 ధరకు రైతులకు అందిస్తాం. ముందుగా పేర్లు నమోదు చేయించుకున్న రైతులకే శ్రీగంధం మొక్కలు ఇస్తాం. ఆసక్తి ఉన్న రైతులు ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ విజయ ప్రసాద్‌(83744 49007)ను సంప్రదించవచ్చు.  
 

– ఎల్‌. వెంకట్రామ్‌రెడ్డి, కమిషనర్, తెలంగాణ ఉద్యాన శాఖ


కవిత తోటలో ఉద్యాన కమిషనర్‌ తదితరులు


 తన తోటలో బత్తాయిలు, సీతాఫలాలతో కవిత మిశ్రా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement