Women farmer
-
అన్నీ తానై.. తానే నాన్నయి
తండ్రి ఉన్నప్పుడు అఖిలకు చదువే లోకం. ఎప్పుడో తప్ప పొలానికి వెళ్లేది కాదు. నాన్నకు మాత్రం వ్యవసాయమే లోకం. నాన్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిన తరువాత అఖిలకు దుఃఖం తప్ప బతుకు దారి కనిపించలేదు. ఆ విషాద సమయంలో ‘నాన్నా... నీకు నేను ఉన్నాను’ అంటూ పచ్చటి పొలం అఖిలకు అభయం ఇచ్చింది. కుటుంబ బాధ్యతలను తలకెత్తుకున్న అఖిల ఇప్పుడు రైతుగా మారింది. తన రెక్కల కష్టంతో కుటుంబానికి అండగా నిలుస్తోంది. ‘డిగ్రీ సదివి ఏందమ్మా ఈ కష్టం’ అంటారు చాలామంది సానుభూతిగా. కానీ వ్యవసాయం చేయడం తనకు కష్టంగా కంటే ఇష్టంగా మారింది. ఎందుకంటే... పొలం దగ్గరికి వెళితే నాన్న దగ్గరికి వెళ్లినట్లు అనిపిస్తుంది. నాన్న ఎక్కడి నుంచో తన కష్టాన్ని చూస్తున్నట్లు, సలహాలు ఇస్తున్నట్లు అనిపిస్తుంది.యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం నర్సాపురం గ్రామానికి చెందిన ఎల్మ శ్రీనివాస్ నాలుగు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. ‘చనిపోవాల్సిన వయసు కాదు’ అని తల్లడిల్లిన వాళ్లు.... ‘పిల్లల గతి ఏం కావాలి’ అని కన్నీళ్లు పెట్టుకున్న వాళ్లు ఎంతోమంది ఉన్నారు. ‘ఇంత అన్యాయం చేసి పోతవా కొడకా’ అంటూ వృద్ధాప్యంలో ఉన్న శ్రీనివాస్ తల్లి ఏడుస్తుంటే అక్కడ ఉన్నవారికి ఏడుపు ఆగలేదు.‘కాలం ఎంత బాధకు అయినా మందుగా పనిచేస్తుంది’ అంటారు. అయితే రోజులు గడిచినా, నెలలు గడిచినా శ్రీనివాస్ భార్య బాధ నుంచి తేరుకోలేదు. ఆ బాధతోనే ఆమె మంచం పట్టింది. శ్రీనివాస్‌కు ఇద్దరు కుమార్తెలు. గత ఏడాది పెద్దకుమార్తె వివాహం జరిగింది. ఇక కుటుంబ భారాన్ని మోయాల్సిన బాధ్యత చిన్న కుమార్తె అఖిలపై పడింది.‘ఎవుసాయం నీ వల్ల ఎక్కడ అవుతుంది బిడ్డా... పట్నంలో ఏదన్న ఉద్యోగం చూసుకో’ అన్నారు కొందరు. ‘వ్యవసాయం అంటే వంద సమస్యలుంటయి. నీ వల్ల కాదుగని పొలాన్ని కౌలుకు ఇయ్యండ్రీ’ అని సలహా ఇచ్చారు కొందరు. ‘వ్యవసాయం ఎందుకు చేయకూడదు. అఖిల చెయ్యగలదు’ అనే మాట ఏ నోటా వినిపించలేదు.పూరింట్లో మంచం పట్టిన అమ్మను, వృద్ధాప్యంలో ఉన్న నానమ్మను విడిచి పట్నంలో ఉద్యోగంలో చెయ్యలా? ‘చెయ్యను. వ్యవసాయమే చేస్తాను’ అని గట్టిగా నిశ్చయించుకుంది అఖిల. వ్యవసాయం అనేది కాలేజీని మించిన మహా విశ్వవిద్యాలయం. ఎప్పటికప్పుడు నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉంటాయి. కాలేజీలో చదివే వారికి సంవత్సరానికి ఒక సారే పరీక్ష ఉంటుంది. కాని రైతుకు ప్రతిరోజూ పరీక్షే.‘యస్... ఆ పరీక్షల్లో నేను పాస్ కాగలను’ అంటూ ధైర్యంగా పొలం బాట పట్టింది కాలేజి స్టూడెంట్ అఖిల. ‘వచ్చినవా బిడ్డా’ అంటూ నాన్న చల్లగా నవ్వినట్లు అనిపించింది. ఆ ఊహ తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ‘నేను పరాయి దేశానికి పోలేదు. నాన్నకు ఇష్టమైన చోటుకే వచ్చాను. నాకు భయమెందుకు!’ అనుకుంది.మొదట బైక్ రైడింగ్ నేర్చుకుంది. ఆ తరువాత ట్రాక్టర్ నడపడం నేర్చుకుంది. ఇప్పుడు తనకు మరింత ధైర్యం, ‘వ్యవసాయం చేయగలను’ అనే నమ్మకం వచ్చింది. పొలంలో రెండు బోర్ల సాయంతో రెండు ఎకరాల వరకు వరి సేద్యం చేస్తోంది. ఇప్పుడు అఖిలకు వ్యవసాయం మాత్రమే కాదు... ఏ పనులు చేసుకోలేక మంచానికే పరిమితమైన తల్లి ఆలనాపాలన, నానమ్మ ఆరోగ్యం గురించి పట్టించుకోవడంలాంటి ప్రధాన బాధ్యతలు ఉన్నాయి. ఒక్కముక్కలో చె΄్పాలంటే ఇప్పుడు అమ్మకు అమ్మ అయింది. నానమ్మకు కొడుకు అయింది అఖిల. నాన్న చెప్పిన మాట‘ఎందుకింత కష్టపడతవు నాన్నా’ అని పిల్లలు అన్నప్పుడు ‘రెక్కల కష్టం వుట్టిగ పోదురా’ అని నవ్వేవాడు నాన్న. ‘రెక్కల కష్టం’ విలువ గురించి చిన్న వయసులోనే నాన్న నోటి నుంచి విన్న అఖిల ఇప్పుడు ఆ కష్టాన్నే నమ్ముకుంది. ఒకవైపు వ్యవసాయం చేస్తూనే మరోవైపు పోటీ పరీక్షలపై దృష్టి పెట్టింది. కానిస్టేబుల్ కావాలనుకుంటోంది. అలా అని వ్యవసాయానికి దూరం కావాలనుకోవడం లేదు. ఎందుకంటే... తనకు వ్యవసాయం అంటే నాన్న! – బిర్రు బాలకిషన్,సాక్షి, రాజాపేట, యాదాద్రి భువనగిరి జిల్లా -
డ్రైవర్ గంగవ్వ!
పంచాయతీ ట్రాక్టర్‌ను నడుపుతుంది. లారీ మీద, బైక్ మీద సవారీ చేస్తుంది. పంటల సాగులోనూ అందెవేసిన చేయి కష్టాలను ఎదిరించి సొంత కాళ్ల మీద నిలబడింది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం సజ్జన్పల్లి గ్రామంలో గంగవ్వ గురించి అడిగితే ‘ఎవరు?’ అంటారేమో గానీ... డ్రైవర్ గంగవ్వ.. అంటే అందరికీ తెలుసు. ప్రతిరోజూ పంచాయతీ ట్రాక్టర్‌ను తీసుకుని గల్లీల్లో చెత్త సేకరణ తో పొద్దున్నే అందరినీ పలకరిస్తూ వెళుతుంది గంగవ్వ. ట్రాక్టర్ ఒక్కటే కాదు లారీ, ఆటో, కారు ఏదైనా నడపగలదు. బైక్ మీద సవారీ చేయగలదు. సొంత కాళ్ల మీద నిలబడిన గంగవ్వ ఎందరికో ఆదర్శంగా నిలిచింది. చదువుకుంటూనే డ్రైవర్‌గా! సజ్జన్పల్లి గ్రామానికి చెందిన పుట్టి నాగయ్య, సాలవ్వల కూతురు గంగవ్వ. శెట్పల్లి సంగారెడ్డిలో పదో తరగతి వరకు చదువుకుంది. లింగంపేట మండల కేంద్రానికి వెళ్లి ఇంటర్ చదివింది. దూరభారాలు అని చూడకుండా సైకిల్ మీద సవారీ చేస్తూ వేరే ఊళ్లలో చదువుకుంది. పేద కుటుంబం కావడంతో సెలవు దినాల్లో కూలి పనులకు వెళ్లేది. అమ్మానాన్నలకు చేదోడువాదోడుగా ఉండేది. ఈ క్రమంలోనే బైకు నేర్చుకుంది. తరువాత ట్రాక్టర్ నడపడం నేర్చుకుంది. లారీ డ్రైవర్‌గానూ పనిచేసింది. గ్రామ పంచాయితీ పనుల్లో... గంగవ్వకు తల్లిదండ్రులు పెళ్లి చేశారు. వారం రోజులు తిరక్కుండానే వెనుదిరిగి వచ్చేసి, తల్లిగారింట్లోనే ఉండిపోయింది. అప్పటి నుంచి ఇంటి దగ్గరే ఉంటూ వ్యవసాయ పనులకు వెళ్లేది. అలాగే ట్రాక్టర్, కారు, లారీ డ్రైవర్‌గా వెళ్లి వచ్చేది. నాలుగేళ్ల పాటు రైస్‌మిల్‌లో ఆపరేటర్‌గా కూడా పనిచేసింది. ఐదేళ్ల కిందట పంచాయతీలకు ప్రభుత్వం ట్రాక్టర్లు, ట్యాంకర్లు సరఫరా చేయడంతో గ్రామంలో డ్రైవింగ్ లైసెన్సు ఉన్న వాళ్లు దొరకలేదు. అప్పటికే భారీ వాహనాలు నడిపే సామర్థ్యంతో పాటు డ్రై వింగ్ లైసెన్స్ ఉండడంతో పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్‌గా నియమించారు. అప్పటì నుంచి పంచాయతీలో పనిచేస్తోంది. రోజూ చెత్త సేకరణ నుంచి రకరకాల పంచాయితీ పనుల్లో చురుగ్గా పాల్గొంటుంది. నిచ్చెన సాయంతో స్తంభం ఎక్కి విద్యుత్తు దీపాలను సరిచేస్తుంది. పంచాయతీలో ఏ పని ఉన్నా ఇట్టే చేసిపెడుతుంది. మొదట్లో ఆమెకు పంచాయతీ నుంచి రూ.2,500 వేతనం ఇచ్చేవారు. క్రమంగా పెరుగుతూ వచ్చి ఇప్పుడు రూ.8,500 వేతనం ఇస్తున్నారు. ట్రాక్టర్ అవసరం ఎప్పుడు ఏర్పడినా సరే గంగవ్వ పరుగున వెళ్లి ట్రాక్టర్ తీస్తుంది. నాలుగేళ్ల కిందట తండ్రి నాగయ్య చనిపోయాడు. తల్లి సాలమ్మతో కలిసి ఉంటుంది. అన్న కొడుకుని చదివించింది. అతను ఇప్పుడు ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. వ్యవసాయ పనులు గంగవ్వ డ్రైవర్‌గా పనిచేస్తూనే వ్యవసాయ పనులు చేస్తోంది. తనకు సొంత భూమి లేకపోవడంతో వేరేవాళ్ల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తోంది. వెళ్లి దున్నడం, నాటు వేయడం, కలుపుతీయడం వంటి పనులన్నీ సొంతంగా చేసుకుంటుంది. లింగంపేట మండల కేంద్రానికి వెళ్లాలన్నా, ఎల్లారెడ్డి పట్టణానికి వెళ్లాలన్నా గంగవ్వ బైకు మీదనే ప్రయాణం చేస్తుంది. ‘ఎవరిపైనా ఆధారపడకుండా బతకడంలో ఉన్న తృప్తి మరెందులోనూ లేద’నే గంగవ్వ మాటలు నేటి తరానికి స్ఫూర్తి కలిగిస్తాయి. నచ్చిన పనిని ఎంచుకున్నా! ఇంటర్మీడియెట్ పూర్తవుతూనే పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. అక్కడ వాతావరణం ఎందుకో నాకు సరిపడదు అనిపించింది. వారం రోజులు కూడా గడవకముందే ఇంటికి వచ్చేశాను. అమ్మనాన్నలకు భారం కాకూడదని నిర్ణయించుకున్నా. నాకు బాగా నచ్చిన పని మీద దృష్టి పెట్టాను. డ్రైవింగ్ సొంతంగానే నేర్చుకున్నాను. రైస్‌మిల్ ఆపరేటర్‌గా పనిచేస్తూనే ట్రాక్టర్, లారీ, కారు.. డ్రైవింగ్ నేర్చుకున్నాను. కొందరు విచిత్రంగా చూసేవారు. కొందరు మగరాయుడు అనేవారు. ఎవరు ఏమనుకున్నా నా కష్టం మీద నేను బతకాలనుకుని నచ్చిన పనిచేసుకుంటూ వెళుతున్నాను. – గంగవ్వ, సజ్జన్పల్లి, లింగంపేట మండలం, కామారెడ్డి జిల్లా – ఎస్.వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి -
వారెవ్వా.. ఎల్లవ్వ
ఆమె వయస్సు 65 ఏళ్లు. అయితేనేం వ్యవసాయ పనుల్లో తాను ఎవరికీ తక్కువకాదు అన్నట్లు పొలం పనులు చేస్తోంది. చిన్న వయసులోనే తల్లి దూరమైంది. అప్పటినుంచే కష్టాలతో సావాసం చేయడం నేర్చుకుంది. 15వ ఏటనే పెళ్లి జరిగింది. ఇద్దరు పిల్లలు పుట్టగానే తాగుబోతు భర్త విడిచిపెట్టేశాడు. దీంతో పిల్లలను తీసుకుని తండ్రి దగ్గరకు చేరింది. వృద్ధాప్యం లో తండ్రి కష్టం చూడలేక తాను వ్యవసాయం చేస్తూ కుటుంబ బాధ్యతలను మోస్తూ ఏటికి ఎదురీదుతోంది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్‌కు చెందిన మంచాల ఎల్లవ్వ. ఈ వయసులోనూ నెలకు రూ.8 వేల చొప్పున వ్యవసాయ పనులు చేయడానికి ఓ ఆసామి దగ్గర పాలేరుగా పని చేస్తూ మగవారికి సరితోడుగా పనులు చేస్తూ ఔరా అనిపిస్తోంది. ఏటికి ఏతం పెట్టి పంటల సాగు భర్త నుంచి విడిపోయిన తర్వాత అయ్య వ్యవసాయ భూమి పక్కనే రెండు ఎకరాల భూమిని బిడ్డకు ఇవ్వడంతో ఎల్లవ్వ చెరువుకు ఏతం పెట్టి రెండు ఎకరాల్లో వరి పంటను సాగు చేసి ధాన్యం పండించగా వచ్చిన వాటిని విక్రయించి ఒంటిచేత్తో పిల్లలను పోషించుకుంటూనే చదువులు కూడా చెప్పించింది. అయ్య నేర్పిన మోట తోలుడు అనుభవమో ఏతం వేసిన అనుభవమో ఆమెకు బతుకు బాటను చూపించాయి. 15 ఏళ్ల వరకు వ్యవసాయం చేసి పిల్లలను పెద్ద చేసి 25 ఏళ్ల క్రితమే కూతురుకు రూ.50వేల కట్నం ఇచ్చి పెళ్లి చేసింది. ఇప్పుడు బిడ్డ కూతురే డిగ్రీ చదువుతోంది. కొడుకు రమేశ్ పెద్దగా చదువుకోకపోవడంతో ఆటో కొనిచ్చి బతుకు చూపించిన తాను ఇంటి దగ్గర కూర్చోలేక తన వ్యవసాయ బావి దగ్గర ఓ ఆసామికి వ్యవసాయ పనులు చేయడానికి పసల్ అంటే ఒక సీజ¯Œ కు రూ.32వేలకు పాలేరుగా పనికి కుదిరి సాగు పనులు చేస్తోంది. ఎన్ని కష్టాలొచ్చినా అధైర్యపడకుండా మట్టిని నమ్ముకొని చెమటోడ్చి 45 ఏళ్లుగా కష్టాలతో కాపురం కొనసాగిస్తోంది. పిల్లలే నా ఆస్తి పేదరికంలో పుట్టిన ఎల్లవ్వకు చిన్నప్పటి నుంచి కష్టాలే ఎదురొచ్చినా ఎక్కడా రాజీపడకుండా మొండి ధైర్యంతో శ్రమను నమ్ముకొని సేద్యం చేసి పిల్లలను సాదుకుంది. పిల్లలే నాకు కోట్ల ఆస్తి అన్నట్లు మనుమలతో ముచ్చటిస్తూ మురిసిపోతోంది. చెరువు దగ్గర తండ్రి ఇచ్చిన రెండు ఎకరాల భూమి తప్ప ఎల్లవ్వకు ఎలాంటి ఆస్తులు లేవు. చెరువు నిండితే ఏతం ఏసుకొంటేనే పొలం పారుతుంది. 20 ఏళ్ల క్రితం కరువచ్చి ఎవుసం సాగకపోవడంతో ఎల్లవ్వ పొరుగువారికి వ్యవసాయ పనులు చేయడానికి పాలేరుగానే పని చేసి పిల్లలను పోషించుకుంది. ఇప్పుడు చెరువు నిండటంతో మళ్లీ తన పొలంలో వరి నాట్లు వేయడానికి సిద్ధమవుతోంది. ధైర్యం చెప్పే తండ్రి అసువులు బాసినా ఎల్లవ్వ గుండె చెదరలేదు. అయ్య నేర్పిన వ్యవసాయ పనులనే బతుకు బాటలుగా వేసుకొని ఇద్దరు పిల్లలకు పెళ్లి చేసి వృద్ధాప్యంలో సైతం వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబానికి బాసటగా నిలుస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. అస్తులు కూడబెట్టాలనే ఆశ ఎన్నడూ లేదు నా చిన్నప్పటి నుంచి అయ్యతోనే ఎవుసం పనులకు పోయేది. అయ్య మోట తోలితే సద్ది తినే యాళ్లకు వెళ్లి నేను మోట తోలి పొలానికి నీళ్లు పెట్టేదాన్ని. చెరువు మీది పొలానికి ఏరుకు ఏతం పెట్టి రెండు ఎకరాలకు నీళ్లు పారించేదాన్ని. ముసిముసి మబ్బులోనే పొలం కాడికి పోయి సాయంత్రం కనుమసుక అయ్యేదాకా ఏతం ఏసి ఇల్లు చేరుకోనేది. ఎనుక ముందు దిక్కు అసరా లేని దాన్ని. పిల్లలు, నేను బతికితే చాలనుకున్న. అస్తులు కూడబెట్టాలనే ఆశ ఎప్పుడు రాలేదు. ఇద్దరు మనుమలు, ఇద్దరు మనుమ రాళ్లే నేను సంపాదించిన అస్తి. – మంచాల ఎల్లవ్వ, మహిళా రైతు – దుండ్ర ఎల్లయ్య, సాక్షి, హుస్నాబాద్ రూరల్ -
వైరల్ : 'హెలికాప్టర్ కొనేందుకు లోన్ ఇప్పించండి'
భోపాల్ : హెలికాప్టర్ కొనేందుకు లోన్ ఇప్పించాలని ఓ మహిళా రైతు రాష్ట్రపతికి లేఖ రాసింది. అంతేకాకుండా ఫ్లయింగ్ పర్మిషన్ కూడా ఇప్పించాని విఙ్ఙప్తి చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించి లేఖ నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం..మధ్యప్రదేశ్‌లోని మాండ్సౌర్ జిల్లాకు చెందిన బసంతి బాయ్ అనే మహిళ చిన్న పూరి గుడిసెలో నివసించేది. పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. అయితే తనకున్న 2 బిగాల పొలంలోకి వెళ్లాలంటే పరమానంద్ అనే రైతుకి చెందిన పొలం దాటి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఆయన తన ఇద్దరు కుమారులు సైతం బసంతితో వాగ్వాదానికి దిగేవారు. కొన్నాళ్ల తర్వాత ఆ దారిని మూసి వేయించారు. ఈ విషయంపై పై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆమె రాష్ట్రపతికి లేఖ రాసింది. కాలినడకన వెళ్లేందుకు వీలు లేకపోవడంతో హెలికాప్టర్ కొనడానికి లోన్ ఇప్పించాలని లేఖలో కోరడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. దీంతో స్పందించిన ఈ ప్రాంతం ఎమ్మెల్యే ఈ సమస్యను తానే దగ్గరుండి పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు. చదవండి : (ఆమె కోసం ఇల్లు అమ్మేసి... ఆటోలోనే తిండి, నిద్ర) (మిస్ ఇండియా రన్నరప్‌గా ఆటో డ్రైవర్ కూతురు) Alleging denial of passage into her agricultural plot, woman in MP's Mandsaur district writes to President of India for loan and license to fly by helicopter into her plot. On spot official probe, however, finds clear passage to woman's plot. @NewIndianXpress@TheMornStandard pic.twitter.com/zEiWdN0MiM — Anuraag Singh (@anuraag_niebpl) February 12, 2021 -
కోవిడ్-19 : మహిళా రైతు ఔదార్యం
భువనేశ్వర్ : కరోనా కట్టడికి దేశవ్యాప్త లాక్డౌన్ అమలవుతుండటంతో పలువురు ఉపాధి కోల్పోగా ఒడిషాలోని భద్రక్ జిల్లాలో ఓ మహిళ తమ పొలంలో సాగైన కూరగాయలను పేదలకు ఉచితంగా పంచి ఔదార్యం చాటుకున్నారు. ఛాయారాణి సాహు(57) అనే మహిళా రైతు, తన భర్త సర్వేశ్వర్‌తో కలిసి కొందరు సామాజిక కార్యకర్తల సాయంతో పేద కుటుంబాలకు రెండు నుంచి మూడు కిలోల కూరగాయలను పంపిణీ చేశారు. ఐదు పంచాయితీల పరిధిలోని 15 గ్రామాల్లో 60 క్వింటాళ్లకు పైగా కూరగాయలను ఆమె పంపిణీ చేసి పలువురి ప్రశంసలు అందుకున్నారు. ఇక కోవిడ్-19 విధుల్లో ఉన్న పోలీసులు, సెక్యూరిటీ గార్డుల కోసం ఈ రైతు దంపతులు 20 లీటర్ల పాలను అందచేశారు. మే 17న మూడో విడత లాక్డౌన్ ముగిసే వరకూ ఈ సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆమె నిర్ణయించుకున్నారు. గత 20 ఏళ్లుగా తమకున్న ఏడెకరాల్లో ఛాయారాణి కూరగాయలను పండిస్తున్నారు. 22 ఆవులను పెంచుతూ డైరీని కూడా ఆమె నిర్వహిస్తున్నారు. దేశం కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న క్రమంలో తాను తన వంతుగా ఈ సాయం చేస్తున్నానని ఛాయారాణి చెప్పుకొచ్చారు. కాగా ఆమె ఔదార్యాన్ని ప్రశంసిస్తూ మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశారు. చదవండి : క్వారంటైన్లో టిక్‌టాక్ వీడియో.. కేసు నమోదు -
ఎకరంలో 8 రకాల కూరగాయలు
సేంద్రియ బహుళ పంటల పద్ధతిలో కూరగాయలను సాగు చేస్తూ ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇస్కిళ్ల గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ. సేంద్రియ ఎరువులు, జీవామృతంను ఉపయోగిస్తూ ఎకరం విస్తీర్ణంలో ఏడాదికి 3 లక్షల రూపాయల దిగుబడిని సాధిస్తూ ఆదర్శంగా నిలిచింది ఈశ్వరమ్మ. రామన్నపేట మండలం పల్లివాడ గ్రామానికి చెందిన కల్లెం భీమలింగం – ఈశ్వరమ్మ దంపతులు ఐదు సంవత్సరాల క్రితం అదే మండలంలోని ఇస్కిళ్ల గ్రామానికి వలస వెళ్లారు. డ్రిప్ డీలర్ అయిన భీమలింగం ఇస్కిళ్ల – ఉత్తటూరు గ్రామాల మధ్య 3.29 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. ఆ భూమిని సాగు చేసే బాధ్యతను భార్య ఈశ్వరమ్మకు అప్పగించాడు. నిరక్ష్యరాస్యులైన ఈశ్వరమ్మ భర్త ప్రోత్సాహంతో నాబార్డు వారు పంటల సాగుపై ఏర్పాటు చేసిన అవగాహనా సదస్సులకు హాజరై వ్యవసాయంపై మక్కువ పెంచుకున్నది. పంటల సాగుపై అవగాహన తరగతులు బోధించే రమేష్ ప్రోత్సాహంతో బహుళ పంటల విధానంలో కూరగాయలను సాగు చేయడం ప్రారంభించింది. తమ వ్యవసాయ భూమిలో ఎకరంలో కూరగాయలు సాగు చేస్తున్నారు. ఐదు ట్రాక్టర్ల పశువుల ఎరువును పొలంలో చల్లి మెత్తగా దున్నించి ట్రాక్టర్‌తోనే 4 అడుగుల ఎడంలో బోదెలు(మట్టి కట్టలు) పోయించారు. ఐదు వరుసలకు ఒక పంట చొప్పున మిర్చి, వంకాయ, కాకర, టమాట, బీర, సొర, దోస, బంతి వంటి ఎనిమిది రకాల కూరగాయలను సాగు చేశారు. హైదరాబాద్‌లోని నర్సరీల నుంచి తెచ్చిన నారు, విత్తనాలు విత్తారు. భూమిలో తేమ తొందరగా ఆవిరైపోకుండా, కూరగాయలు నేలను తాకి చెడిపోకుండా, మొక్కలకు వైరస్ సోకకుండా ఉండేందుకు బోదెలపై మల్చింగ్ షీట్‌ను పరిచారు. డ్రిప్‌ను అమర్చి మొక్కలకు నీరందించే ఏర్పాటు చేశారు. తీగ జాతి మొక్కలు ఏపుగా పెరగడంతోపాటు, కాయల బరువుకు మొక్కలు నేలను తాకకుండా ఉండేందుకు గాను వెదురు బొంగులను నాటి బైండింగ్ వైరుతోపాటు, సుతిలి తాడును అల్లారు. ప్రతీ ఐదు బోదెలకు ఒక వరుసతో పాటు, పొలం చుట్టూ బంతి పూల మొక్కలు పెట్టారు. కూరగాయల మొక్కలకు వచ్చే చీడపీడలను ముందుగానే బంతి మొక్కల ద్వారా గుర్తించి కషాయాలను పిచికారీ చేస్తూ సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు. కూరగాయల రకాన్ని బట్టి నాటిన నలభై ఐదు రోజుల నుంచి తొమ్మిది నెలల వరకు పంట దిగుబడి వస్తుంది. ఏదేని ఒక రకం పంట కాలం ముగియగానే.. చదును చేసి బోదెలు పోసి పంట మార్పిడి చేసి.. మరో రకం కూరగాయ మొక్కలు నాటుతున్నారు. పండించిన కూరగాయలను తమ టాటాఏస్ వాహనంలో తీసుకువెళ్లి పరిసర గ్రామాల్లో దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రజలకు అమ్ముతుండటం విశేషం. ఈ విధంగా సంవత్సరానికి రూ. 3 లక్షల ఆదాయం పొందుతున్నారు. పెట్టుబడి పోను రూ. రెండు లక్షల వరకు నికరాదాయాన్ని ఆర్జిస్తున్నట్లు ఈశ్వరమ్మ తెలిపారు. సేంద్రియ పద్దతుల్లో కూరగాయలను సాగు చేస్తూ నేరుగా ప్రజలకు విక్రయిస్తున్న ఈశ్వరమ్మ గత ఏడాది జిల్లా స్థాయిలో ఉత్తమ మహిళా రైతుగా ఎంపికై కలెక్టర్ చేతుల మీదుగా అవార్డును పొందింది. గత అక్టోబర్‌లో నాబార్డు హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో సేంద్రియ పంటల ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈశ్వరమ్మ ఒక్కరికే స్టాల్‌ను ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్ ఈశ్వరమ్మ సేంద్రియ కూరగాయల స్టాల్‌ను సందర్శించి, ఆమె కృషిని అభినందించారు. (ఈశ్వరమ్మ భర్త భీమలింగంను 96668 46907 నంబరులో సంప్రదించవచ్చు) – కనుతాల శశిధర్‌రెడ్డి, సాక్షి, రామన్నపేట, యాదాద్రి భువనగిరి జిల్లా -
అంతటితో ‘ఆగ’లేదు!
‘పత్తి పండే వరకు అదే పని. సంక్రాంతి వెళ్లిన తర్వాత కూరగాయలు, ఆకుకూరలు పండిస్తా. బండి (మోపెడ్) మీద ఇంటింటికీ తిరిగి అమ్ముకుంటా. ఇంకా ఖాళీ ఉంటే కూలి పనికి వెళ్తా. కాయకష్టంతో వ్యవసాయాన్నే నమ్ముకున్నా. ఏ పంట టైములో ఆ పని చేస్తా.. పిల్లలను పోషించుకోవాలి, పెళ్లిళ్లు చేయాలి కదా.. ఎవరికీ భయపడనవసరం లేదు. మనమేమీ తప్పు చేస్తలేం కదా అని మా ఆయన చెప్పిన మాటలను ప్రతి రోజూ గుర్తుచేసుకుంటున్నా..’ ఇదీ ఒంటరి మహిళా రైతు తనుగుల ఆగమ్మ మనసులో మాట. జీవితంలో కష్టాలు కట్టగట్టుకొని ఎదురొచ్చినా చెక్కు చెదరని మనోధైర్యంతో నిలబడి, దృఢచిత్తంతో ముందడుగు వేస్తోంది. ఆగమ్మ ములుగు జిల్లా బండారుపల్లిలో పేద వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగింది. చదువుకోలేదు. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరుకు చెందిన పేద రైతు తనుగుల కుమారస్వామితో 20 ఏళ్ల క్రితం పెళ్లయింది. వాళ్లకు ముగ్గురు ఆడ పిల్లలు.. ఆమని, కావ్య, శ్రావణి. వాళ్లకు చిన్న పెంకుటిల్లుతో పాటు ఎకరం 30 గుంటల (ఎకరం 75 సెంట్లు) భూమి ఉంది. వర్షాధార వ్యవసాయమే. భార్యా భర్తలిద్దరూ కలిసి వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ సంతోషంగా ఉన్న సమయంలో పెను విషాదం చోటు చేసుకుంది. మోపెడ్‌పై వెళ్తున్న కుమారస్వామిని రోడ్డు ప్రమాదం రూపంలో వచ్చిన మృత్యువు మింగేసింది. భర్త హఠాన్మరణం ఆగమ్మ ఆశలు చెదిరిపోయాయి. అయినా, పిల్లలను గుండెలకు హత్తుకొని దుఃఖాన్ని దిగమింగుకుంది. తనకు తానే ధైర్యం చెప్పుకొని మొక్కవోని ధైర్యంతో నిలబడింది. వ్యవసాయం కొనసాగిస్తూ కాయకష్టంతో పిల్లలను అన్నీ తానే అయి పోషించుకుంటున్నది. అన్నదమ్ములు లేకపోవడంతో.. వృద్ధులైన తల్లిదండ్రులను అవివాహితగా ఉండిపోయిన సోదరి పోషిస్తున్నది. దీంతో ఆగమ్మ పిల్లలతోపాటు మెట్టినింటిలోనే ఉండిపోయింది. సొంత భూమితో పాటు రెండెకరాలను కౌలుకు తీసుకొని మరీ పత్తి, కూరగాయలు, మొక్కజొన్న తదితర పంటలు శ్రద్ధగా సాగు చేస్తూ ఆదర్శంగా నిలిచింది. ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండదు. తన పొలంలో ఏ పనీ లేకపోతే కూలికి వెళ్తుంది. రూపాయికి రూపాయి కూడబెట్టి ఎవరిపైనా ఆధారపడకుండా గత ఏడాది పెద్ద కుమార్తె ఆమనికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసింది. రెండో బిడ్డ కావ్య ముల్కనూరు మోడల్ స్కూల్లో ఇంటర్ చదువుతోంది. చిన్న కుమార్తె శ్రావణి ఆత్మకూరు జెడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతోంది. తండ్రి లేకపోయినా ఆగమ్మ శ్రద్ధగా వ్యవసాయం చేస్తూ పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటున్నది. సొంత కష్టం.. సొంత మార్కెటింగ్.. కుటుంబ పెద్దగా, తల్లిగా, రైతుగా ఆగమ్మ విజయపథంలో పయనిస్తోంది అంటే అతిశయోక్తి కాదు. ఈ విజయం వెనుక మొక్కవోని దీక్ష, కఠోర శ్రమ, క్రమశిక్షణతోపాటు చక్కని వ్యవసాయ ప్రణాళిక కూడా ఉంది. తన వంటి చిన్న, సన్నకారు మెట్ట రైతులు చాలా మంది పత్తి, మొక్కజొన్న , పసుపు వంటి పంటలతో సరిపెట్టుకుంటూ ఉంటే.. ఆగమ్మ అంతటితో ఆగలేదు. ఆదాయం కోసం పత్తి, మొక్కజొన్నతో పాటు కుటుంబ పోషణ కోసం, అనుదిన ఆదాయం కోసం కూరగాయలు, ఆకుకూరలను సాగు చేస్తూ ఉన్నంతలో సంతోషంగా, ధీమాగా జీవిస్తోంది. ఈ ఏడాది కౌలు భూమి రెండెకరాల్లో పత్తిని వర్షాధారంగా సాగు చేసింది. రూ. 70 వేలు ఖర్చు చేసి 12 క్వింటాళ్ల దిగుబడి తీసింది. పత్తిని రూ. లక్షకు అమ్మింది. ఎకరంలో మొక్కజొన్న, 30 గుంటల్లో పసుపు సాగు చేస్తోంది. పత్తి పంట అయిపోయిన తర్వాత 10 గుంటల (25 సెంట్ల) భూమిలో టమాటోలు, పాలకూర, కొత్తిమీర బావి కింద సాగు చేస్తోంది. ఎరువులు వేయటం, పురుగుమందు కొట్టడం, కలుపు తీయటం.. వంటి అన్ని పనులూ తానే చేసుకుంటుంది. టమాటోలు 15 రోజుల్లో కాపు మొదలవుతుంది. నెల రోజుల్లో చేతికొచ్చే పాలకూర, కొత్తిమీరతో నిరంతర ఆదాయం పొందుతోంది. ఆకుకూరలు, కూరగాయలను పండించడం తానే స్వయంగా ఊళ్లు, ఇళ్ల వెంట తిరిగి అమ్ముకుంటుంది. ద్విచక్రవాహనం(మోపెడ్)ను నడుపుకుంటూ వెళ్లి ఏ పూటకు ఆ పూట తాజా ఆకుకూరలు అమ్ముతుంది. కిలో కొత్తిమీర విత్తనాలు (ధనియాలు) రూ. వందకు కొనితెచ్చి విత్తుకొని రూ. రెండు నుంచి మూడు వేలు ఆదాయం పొందుతున్నానని, తాము ఇంట్లో వండుకోవడానికీ కూరగాయల కొరత లేదని సంతోషంగా చెప్పింది ఆగమ్మ. దురదృష్టవశాత్తూ భర్తలను కోల్పోయిన మహిళా రైతులే ఇంటి పెద్దలై వ్యవసాయాన్ని, కుటుంబాన్నీ సమర్థవంతంగా నడుపుతున్న ఎందరో మహిళల గుండె ధైర్యానికి చక్కని ప్రతీకగా నిలిచిన ఆగమ్మ(90142 65379)కు మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి సాగుబడి’ జేజేలు! ఇటువంటి క్రమశిక్షణ గల రైతులకు ప్రకృతి వ్యవసాయం నేర్పితే వారి జీవితాలు మరింత జీవవంతమవుతాయి!! – పోలు రాజేష్‌కుమార్, సాక్షి, ఆత్మకూరు, వరంగల్ రూరల్ జిల్లా -
రైతు రాణులకు జేజేలు!
మన దేశంలోని రైతు కుటుంబాల్లో 80–85% వరకు ఎకరం, రెండెకరాల భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతు కుటుంబాలే. ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని జీవనం సాగించే ఈ వ్యవసాయ కుటుంబాల్లో పురుషుల కన్నా మహిళా రైతుల శ్రమే అధికం. దీక్షగా, క్రమశిక్షణగా వ్యవసాయం చేస్తూ అరకొర వనరులతోనే చక్కని ఫలితాలు సాధిస్తూ కుటుంబాల అభ్యున్నతికి అహరహం కృషి చేస్తున్న మహిళా రైతులెందరో ఉన్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మనోబలంతో నిలబడి వ్యవసాయాన్నే నమ్ముకొని కుటుంబాలకు బాసటగా నిలుస్తున్న ఈ ధీర వనితలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ ‘సాక్షి సాగుబడి’ జేజేలు పలుకుతోంది. ‘మీ మిరప పంటలో తాలు కూడా లేదమ్మా..’ మిర్చి పంటకు తెగుళ్లు, చీడపీడలు ఆశించటం సహజం. నారు వేసిన దగ్గర్నుంచి మిర్చి కోతలు కోస్తున్నంత వరకు దాడి చేస్తుంటాయి. ఒక పురుగుమందు పనిచేయకపోతే మరొకటి వాడుతూ రసాయన మందులతో రైతులు ఒక రకంగా యుద్ధమే చేస్తారు. అటువంటిది ఎలాంటి పురుగుమందులూ వాడకుండా కేవలం కషాయాలతోనే మిర్చిని పండించాలని చూసిన మహిళా రైతును, తోటి రైతులు ఎగతాళి చేశారు. మందులు కొట్టకుండా పంట ఎట్లా తీస్తావు? అంటూ ప్రశ్నించారు. ప్రకృతి వ్యవసాయాన్ని నమ్ముకొని ఆచరించిన ఆ రైతు చేలో మిరప విరగపండింది. అంతర పంటలతోనూ ఆదాయాన్ని తీశారు. నాడు నవ్విన రైతులే ఇప్పుడు ‘తాలు కూడా లేదమ్మా మీ పంటలో...’ అంటూ ప్రశంసిస్తున్నారు. అన్ని జిల్లాల వ్యవసాయ అధికారుల నుంచి ప్రపంచ బ్యాంకు బృందం సహా ఆ మిరప చేనును సందర్శించారు. శభాష్... అంటూ అభినందించారు. మిర్చి పంట సాగులో అద్భుత విజయం సాధించిన ఆ మహిళా రైతే పరమాత్ముల కోటేశ్వరమ్మ. గుంటూరు జిల్లా పెదనందిపాడు దగ్గర్లోని కొప్పర్రు. జిల్లాకు తలమానికమైన మిర్చిని కోటేశ్వరమ్మ, భర్త వెంకటేశ్వరరావుతో కలిసి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. ఒక అమ్మాయి, అబ్బాయి. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. ఈ నేపధ్యలలో రైతు దంపతులు పట్టుదలతో నూటికి నూరు శాతం రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఎకరంలో తొలి కోతకే 12 క్వింటాళ్లు దుక్కిన దున్ని ఘన జీవామృతం వేయడంతో ఆరంభించి, బీజామృతంతో శుద్ధిచేసిన నారును నాటిన దగ్గర్నుంచి ప్రతి దశలోనూ మిరప మొక్కలకు ద్రవ జీవామృతంతో సహా రోగ నిరోధక శక్తికి, దృఢంగా ఉండేందుకు సప్త ధాన్యాంకుర కషాయాన్ని వాడుతూ, వివిధ రకాల కషాయాలతో తెగుళ్లను నిరోధిస్తూ మిర్చిని పండించుకున్నారు. ఎకరం పొలంలో తొలి కోతకే 12 క్వింటాళ్ల మిరప పండ్ల దిగుబడిని తీశారు. చెట్టు నిండుగా కనిపిస్తున్న మిరపకాయ, మరో 13 క్వింటాళ్లు వస్తాయన్న ధీమానిస్తోంది. అందులో వేసిన రకరకాల అంతర పంటలతో మిర్చి చేతికొచ్చేలోగానే దఫాలుగా ఆదాయాన్నీ కళ్ల చూశారు. మిర్చి పంట సాగుకు పెట్టుబడులు రైతులందరికీ సమానమే అయినా, ఎరువులు, పురుగుమందులకే రసాయనిక వ్యవసాయం చేసే ఇతర రైతులందరూ ఎకరాకు రూ.75 వేలకు పైగా వ్యయం చేస్తే, ప్రకృతి వ్యవసాయాన్ని నమ్ముకున్న కోటేశ్వరమ్మకు కషాయాలు, జీవామృతాల తయారీకి రూ.4,800 మాత్రమే ఖర్చయింది. అయితే, ఆమె మిర్చిని అందరికన్నా ఎక్కువ ధరకే అమ్మారు. రసాయన రహిత పంట తీశామన్న సంతృప్తినీ పొందానని కోటేశ్వరమ్మ అన్నారు. ప్రకృతి వైపు మళ్లించిన పుల్లమజ్జిగ కొప్పర్రు గ్రామంలో మిరప, పత్తి పంటల సాగు అధికం. కోటేశ్వరమ్మ, వెంకటేశ్వరరావు దంపతులకున్న ఎకరం మెట్ట పొలానికి, మరో ఎకరం కౌలుకు తీసుకుని అవే పంటలు సాగు చేస్తుండేవారు. కొంత భూమిలో బెండకాయ, దోసకాయ వంటి కూరగాయలను పండించేవారు. కలుపు మందులు, పురుగు మందులు చల్లాల్సి వస్తుండేది. ఒక పంట తీసేసరికి రెండెకరాలకు కలిపి రూ.1.20 లక్షల వరకు వీటికే ఖర్చు చేసినట్టయ్యేది. పెట్టుబడికి, ఖర్చులకు పెద్దగా వ్యత్యాసం వుండేది కాదు. తాతలనాటి వ్యవసాయాన్ని వదులుకోలేక, అస్తుబిస్తు సంపాదనతో కొనసాగుతున్న కోటేశ్వరమ్మకు, ప్రభుత్వ ప్రకృతి వ్యవసాయ విభాగంలో పనిచేస్తుండే చిరుద్యోగి ఒకరు చెప్పిన చిట్కాతో తరుణోపాయం కనిపించింది. ఆ ఉత్సాహం ఆమెను ప్రకృతి వ్యవసాయం దిశగా నడిపించింది. నాలుగేళ్ల క్రితం చేలోని మిరపకు పండాకు తెగులు ఆశించింది. ఎప్పట్లాగే నివారణ రసాయనిక పురుగు మందుల కోసం చూస్తున్న కోటేశ్వరమ్మకు, ‘పుల్ల మజ్జిగ కొట్టి చూడండి’ అన్న సూచన ఆలోచింపజేసింది. పోయేదేముంది.. పాలు ఖర్చే కదా! అనుకున్నారు. ‘నాలుగు లీటర్ల పాలు తీసుకొచ్చి, కాచి తోడువేశాం.. 5 రోజులు మురగనిచ్చి, నీటితో కలిపి 15 ట్యాంకులు పిచికారీ చేశాం.. కంట్రోలు అయింది... ప్రకృతి వ్యవసాయంపై అలా గురి కుదిరింది’ అని చెప్పారు కోటేశ్వరమ్మ. అదే పురుగుమందులు చల్లితే రూ.1,200 వరకు ఖర్చు. పురుగుమందు చల్లటం వల్ల చేతులు, ఒళ్లు దురదలు, కళ్లు మంటలు ఉండేవన్నారు. ఆ అనుభవంతో ప్రకృతి వ్యవసాయం సత్తా ఏమిటో తెలిసింది. గత మూడేళ్లుగా రసాయన ఎరువులు/ పురుగుమందుల జోలికే వెళ్లకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ వస్తున్నారు. ‘మేం వేల రూపాయలు ఖర్చుపెట్టి మందులు వాడుతుంటేనే తెగుళ్లు పోవటం లేదు.. ఆకులు, ఎద్దుపేడ, ఆవు మూత్రంతోనే పోతాయా? అంటూ ఊళ్లోని రైతులు ఎకసెక్కంగా మాట్లాడారు.. ఎరువులు వేసిన చేలల్లోలా మొక్కలు గుబురుగా, కంటికి ఇంపుగా ఎదగలేదు. అది చూసి నవ్వారు. ఓపిగ్గా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ వచ్చాం. అధిక వర్షాలకు మొక్కలను కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించాం. మా కష్టం ఫలించింది. చేను అందంగా కనిపించకున్నా, మొక్క మొక్కకు నాణ్యమైన కాయ విరగ కాసింది. మొదట్లో ఎగతాళి చేసిన వారే ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. మీ చేలో తాలు కాయ ఒక్కటీ లేదంటూ మెచ్చుకోవటం సంతోషంగా ఉంది’’ అన్నారు కోటేశ్వరమ్మ. మిర్చిలో బంతి, జొన్న, ఉల్లి, ముల్లంగి... గత ఆగస్టు 28న ఎకరంలో మిర్చి నారుతో నాట్లు వేశారు. ఎకరాకు 12 వేల మొక్కలు. సరిహద్దు పంటగా మూడు వైపులా జొన్న, మరోవైపు కంది వేశారు. ఎర పంటగా 400 బంతి మొక్కలు పెంచారు. అంతర పంటలుగా ఒక్కోటి నాలుగు వేల మొక్కలు వచ్చేలా ముల్లంగి, ఉల్లి, కొత్తిమీర వేశారు. అనుసరించిన పద్ధతులను వివరిస్తూ, ముందుగా ఎనిమిది కిలోల బెల్లం, ఎనిమిది కిలోల శనగపిండి, నాలుగు గుప్పిళ్లు మట్టి, 40 లీటర్ల మూత్రం, 2500 కిలోల కంపోస్టు ఎరువుతో తయారుచేసిన 400 కిలోల ఘనజీవామృతాన్ని చల్లామని కోటేశ్వరమ్మ చెప్పారు. అయిదు కిలోల పేడ, అయిదు కిలోల ఆవు మూత్రం, 20 లీటర్ల నీరు, 15 గ్రాముల సున్నంతో చేసిన బీజామృతంతో నారు శుద్ధి చేసి నాటాం. అయిదు కిలోల వేపాకు, ఆవు పేడ, ఆవు మూత్రం కలిపి తయారుచేసిన 100 లీటర్ల నీమాస్త్రం పిచికారీ చేశాం. కిలో పండు మిర్చి రూ. వంద పచ్చళ్లకు అడుగుతున్నారని పండుకాయ వచ్చాక కోత మొదలుపెట్టారు. మార్కెట్లో పండుకాయ కిలో రూ.60 వుంటే కోటేశ్వరమ్మ పొలంలో పండు మిర్చి రూ.100 చొప్పున 1.60 క్వింటాళ్లు అమ్మకం చేశారు. మిగిలిన పంట కోసింది కోసినట్టుగా ఎండబెడుతున్నారు. మొత్తం మీద మరో 13 క్వింటాళ్లు వస్తాయని అంచనాతో ఉన్నారు. అంతర పంటల్లో ముందే పీకిన రూ.1000, బంతి పూలతో రూ.4,000, కొంతభాగం విక్రయించిన ఉల్లితో రూ.2,000, ముల్లంగితో మరో రూ.2,000 ఆదాయం సమకూరింది. ప్రకృతి వ్యవసాయం, అంతర పంటలు ఆదాయాన్నిస్తూ ఉంటే.. భూమిని నమ్ముకున్నందుకు నిశ్చింతగా అనిపిస్తోంది.. సమాజానికి ఆరోగ్యకర పంటలు అందిస్తున్నామన్న భావన తమకెంతో సంతృప్తినిస్తున్నదని కోటేశ్వరమ్మ సంతోషంగా చెప్పారు. కాకపోతే ప్రకృతి వ్యవసాయంలో చాకిరీ మాత్రం చేసుకోవాల్సిందేనన్నారు. భర్తతో కలిసి ప్రతి రోజూ ఆరింటికల్లా పొలంలో దిగి, సాయంత్రం ఆరు గంటల వరకూ ఉంటున్నానన్నారు. వళ్లు మంటలు.. కళ్లు మంటలు లేవు.. మూడేళ్ల నుంచి (రసాయనిక) మందుల్లేకుండా పట్టుదలగా పంటలు పండిస్తున్నాం. ఈ విషయం ఇప్పుడిప్పుడే చాలా మందికి తెలిసి వచ్చి చూసెళ్తున్నారు. ఇన్నాళ్లూ ఆ ఏముందిలే అన్న ఊహలో ఉన్నారు. ఇప్పుడు పొలంలోకి వచ్చి ఏమి వేస్తున్నారు, ఎలా పండిస్తున్నారో చూస్తున్నారు. మందుల్లేని పండు మిరప కాయలకు ఈ ఏడు చాలా గిరాకీ వచ్చింది. ఎండు మిరపకాయలకు కూడా ముందే ఆర్డర్లు వస్తున్నాయి. ఎకరం కౌలు రూ. 30–40 వేలు కావటంతో ఇతర రైతులు ప్రకృతి వ్యవసాయం చేయటానికి వెనకాడుతున్నారు. సొంత చేనే కదా అని మేం పట్టుదలతో చేస్తున్నాం. ఎకరానికి ఎరువులు, పురుగుమందులకే రూ. 60–70 వేలు ఖర్చు చేస్తున్నారు. మాకు గత ఏడాది జీవామృతానికి, కషాయాలకు 4 వేలు ఖర్చయింది. మందులు కొట్టే వాళ్లకు, నీళ్లు పోసే వాళ్లకు వళ్లు మంటలు, కళ్లు మంటలు వస్తుంటాయి. ఇప్పుడు ఆ బాధ లేదు. అయితే, కషాయాల తయారీలో వాసనలు, చాకిరీ గురించి కొందరు ఇబ్బంది పడుతున్నారు. మిషన్లు వస్తే సులభంగా ఉంటుంది. భూమి బాగు కోసం, ఆరోగ్యం కోసం ఒకరు అడుగేస్తే కదా.. పది మందీ నడిచేది.. అని మేం డీపీఎం రాజకుమారి ప్రోత్సాహంతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. పంటను అమ్ముకోవటంలో అంత ఇబ్బందేమీ లేదు. – పరమాత్ముల కోటేశ్వరమ్మ(63013 51363), మహిళా రైతు, కొప్పర్రు, గుంటూరు జిల్లా కల్లెం ఈశ్వరమ్మ తనుగుల ఆగమ్మ భర్త వేంకటేశ్వరరావుతో కలిసి కళ్లంలో మిరప పండ్లను ఎండబోస్తున్న కోటేశ్వరమ్మ – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి, గుంటూరు జిల్లా -
మహిళా రైతుపై వీఆర్వో దాడి
మంథని: పట్టా చేసేందుకు తీసుకున్న డబ్బు తిరిగి అడిగినందుకు ఓ మహిళా రైతులపై వీఆర్వో దాడి చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా మంథనిలో గురువారం జరిగింది. నాగెపల్లికి చెందిన తన తండ్రి కొయ్యల దుర్గయ్య పేరిట పట్టా చేస్తానంటే మంథని మండలం అడవిసోమన్‌పల్లి వీఆర్వో సహీరాభానుకు రూ.30 వేలు ఇచ్చినట్లు దుర్గయ్య కూతురు సమ్మక్క తెలిపింది. తన తండ్రి చనిపోయాక తల్లి పేరిట పట్టా చేస్తానని చెప్పడంతో ఏడాదిగా తిరుగుతున్నానని తెలిపింది. దీనిపై తహసీల్దార్‌కు ఫిర్యాదు చేస్తే.. ఆన్లైన్లో దరఖాస్తు చేయమని చెప్పినట్లు వివరించింది. వీఆర్వో ఇంటికి వెళ్లి డబ్బులు అడగ్గానే దాడి చేసిందని చెప్పింది. తాను డబ్బులు తీసుకున్నానన్న ఆరోపణల్లో నిజం లేదని వీఆర్వో తెలిపారు. కాగా, వీరిద్దరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
అపారం రైతుల జ్ఞానం!
ఏమిటి? :జహీరాబాద్ ప్రాంతంలో మహిళా రైతులు చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు తదితర వర్షాధార పంటలను సాగు చేసుకుంటూ సంక్షోభం లేని వ్యవసాయ పద్ధతిని గత 30 ఏళ్లుగా అనుసరిస్తున్నారు. ఈ సంగతి తెలియనిదేమీ కాదు. ఇప్పుడు కొత్త సంగతి ఏమిటంటే.. వీరు అనుసరిస్తున్న జీవవైవిధ్య సేంద్రియ వ్యవసాయ పద్ధతిపై వ్యవసాయ శాస్త్రవేత్తలు పనిగట్టుకొని ఏడాది పాటు అధ్యయనం చేసి సమగ్ర నివేదికను వెలువరించారు. తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అసోసియేట్ పరిశోధనా సంచాలకులు డా. ఆర్. ఉమారెడ్డి, హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ సోషల్ స్టడీస్(సెస్) అసోసియేట్ ప్రొఫెసర్ బి. సురేష్‌రెడ్డి, డీడీఎస్ డైరెక్టర్ పి.వి.సతీష్, చిన్న నరసమ్మ, దంతులూరి తేజస్వి కలిసి న్యూఫీల్డ్ ఫౌండేషన్(అమెరికా) తోడ్పాటుతో ఈ అధ్యయనం చేశారు. ‘ఇంటర్ఫేసింగ్ ఫార్మర్స్ సైన్స్ విత్ ఫార్మల్ సైన్స్’ పేరిట ఈ విలక్షణ అధ్యయన నివేదికను వెలువరించారు. ఎక్కడ? హైదరాబాద్ బేగంపేటలోని సెస్ ఆడిటోరియంలో జాతీయ గ్రామీణాభివృద్ధి–పంచాయతీరాజ్ సంస్థ డైరెక్టర్ జనరల్ డా. డబ్ల్యూ. ఆర్. రెడ్డి, జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ (మేనేజ్) డైరెక్టర్ జనరల్ డా.ఉషారాణి, సెస్ డైరెక్టర్ ప్రొ. రేవతి ఈ నివేదికను ఇటీవల ఆవిష్కరించారు. జహీరాబాద్ ప్రాంతంలో మహిళా రైతులు సాంప్రదాయ సేంద్రియ పద్ధతుల్లో వర్షాధారంగా ఒకటికి 20 పంటలను కలిపి పండిస్తున్నారు. అప్పుల్లేని, ఆత్మహత్యల్లేని జీవవైవిధ్య వ్యవసాయం వారిది. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వీరిని సంఘటితపరచి ముందుకు నడిపిస్తోంది. వారి వ్యవసాయ సంస్కృతిని, దాని చుట్టూ అల్లుకున్న సంప్రదాయ పర్యావరణ, జీవవైవిధ్య జ్ఞానాన్ని శ్రద్ధగా గమనిస్తే– వ్యవసాయ సంక్షోభం నుంచి మన దేశాన్ని బయటపడేసే మార్గం మనకు కనిపిస్తుంది. ప్రకృతికి అనుగుణమైన సేద్య జీవనాన్ని అనుసరిస్తున్న వారికి ఉన్న అవగాహనా శక్తి గొప్పది. చిన్న రైతులు ఇప్పుడు పెద్ద రైతులుగా ఎదిగారు. సంతోషదాయకమైన, ఆరోగ్యదాయకమైన జీవనాన్ని గడుపుతున్న మహిళా రైతులను మనసారా అభినందించారు. ఎవరేమన్నారు? ‘రైతుల సంప్రదాయ జ్ఞానం గత కొన్ని దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైంది. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చెప్పని ఎన్నో గొప్ప విషయాలు ఈ అధ్యయన కాలంలో రైతుల పొలాల్లో చూసి నేర్చుకున్నాను. వాళ్లు ఆరోగ్యంగా ఉన్నారు. పశువులు బాగున్నాయి. భూమి ఆరోగ్యంగా ఉంది. ఎకరానికి ఏటా రూ. 10 వేల వరకు నికరాదాయం పొందుతున్నారు. వర్షానికి, నేలకు తగిన విత్తనాల ఎంపిక, నిల్వ, వినియోగం తదితర అనేక విషయాల్లో వీరి జ్ఞానం అమోఘం. ఈ జ్ఞానాన్ని వ్యవసాయ శాస్త్రవేత్తలు గుర్తించాలి. రైతుల జ్ఞానం ఆధారంగా వ్యవసాయ విధానాల రూపకల్పన జరగాలి. మన దేశం ఎదుర్కొంటున్న వ్యవసాయ సంక్షోభానికి ఇదే పరిష్కారం..’ అన్నారు ‘సెస్’ అసోసియేట్ ప్రొఫెసర్ సురేష్‌రెడ్డి. ‘పొలంలో ఒకే పంట పెడితే పండొచ్చు, పండకపోవచ్చు. మేం గవర్నమెంటు ఎరువు, కరెంటు, బోర్లపైన ఆధారపడటం లేదు. ఒకే పొలంలో 25 పంటలు పెడుతున్నం. కొన్ని పంటలు రాకపోయినా కొన్ని వస్తయి. తిండి కొనుక్కోవాల్సిన పని లేదు. పత్తి పెట్టిన రైతులు అప్పులై చచ్చిపోతున్నరు. మాకు అప్పులు అవసరం లేదు. మేం చచ్చిపోవాల్సిన అవసరమే రాదు..’ అని రైతు మొగలమ్మ చెప్పింది. ‘ఈ నివేదిక చాలా బాగుంది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ ఇందులో సమాధానాలున్నాయి. డీడీఎస్ మహిళా రైతులకున్న ఆత్మస్థయిర్యం, సంతోషం చాలా గొప్పది. రైతులకేమీ తెలీదు మనకే తెలుసు అని శాస్త్రవేత్తలు అనుకోకూడదు..’ అన్నారు ‘మేనేజ్’ డీజీ డా. ఉషారాణి. ‘వాతావరణ మార్పులు, రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో ఆలోచించదగిన నివేదిక ఇది. 30 ఏళ్లుగా అనుసరిస్తున్న ఈ పద్ధతిలో గొప్ప గుణాలను ప్రాచుర్యంలోకి తేవటం హర్షణీయం. నేనూ కొర్రలూ, జొన్నలూ తింటూ ఆరోగ్యంగా ఉన్నాను. ఈ రైతుల జ్ఞానాన్ని రైతుల్లోకి తీసుకెళ్లాలి..’ అన్నారు ఎన్.ఐ.ఆర్.డి. డీజీ డా. డబ్ల్యూ.ఆర్.రెడ్డి. వారాంతాల్లో డీడీఎస్ మహిళా రైతుల పొలాల్లోనే శిక్షణ జహీరాబాద్ ప్రాంతంలో డీడీఎస్ సెంటర్ ఫర్ అగ్రోఎకాలజీ (పచ్చశాల) ఆధ్వర్యంలో మహిళా రైతులు చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, ప్రకృతి సిద్ధమైన ఆకుకూరలు, ఔషధ మొక్కల మిశ్రమ సేంద్రియ సాగు, పెరటి తోటల సాగు పద్ధతులపై రైతులు, నగరవాసులకు వారాంతాల్లో (శని, ఆదివారాల్లో) తమ పొలాల్లోనే శిక్షణ ఇవ్వనున్నారు. ఆగస్టు 17 నుంచి ప్రారంభమయ్యే ఈ కోర్సు 24 వారాల పాటు కొనసాగుతుంది. వసతి, మిల్లెట్ భోజనాలతో కలిపి బోధనా రుసుము 24 వారాలకు రూ. 12 వేలు, 12 వారాలకు రూ. 10 వేలు, 6 వారాలకు రూ. 6 వేలు. ఆసక్తి గల వారు ఆగస్టు 10 లోగా రిజిస్టర్ చేసుకోవాలి. https://forms.gle/Ca2eHv6SGLJ5y2JX7F మొబైల్:77992 21500 -
రెవెన్యూ కార్యాలయంలో మహిళా రైతు హల్చల్
సాక్షి, ములుగు: ములుగు మండలం పత్తిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చింతలపల్లికి చెందిన మహిళా రైతు కాశిరాజు రమ శనివారం ములుగు రెవెన్యూ కార్యాలయ ఆవరణలో హల్చల్ చేసింది. తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో బంధువులతో కలిసి చేతిలో కర్ర పట్టుకుని రెవెన్యూ అధికారులను ఉద్దేషిస్తూ అసభ్య పదజాలంతో దుర్భషలాడింది. నాలుగు సంవత్సరాలుగా తిరుగుతున్నా తనకు చెందిన భూమికి పట్టా ఇవ్వడం లేదని మండిపడింది. అనంతరం కర్రతో వీఆర్వో తిరుపతితో పాటు ఇతరుల ద్విచక్రవాహనాలను ధ్వంసం చేసింది, గమనించిన రెవెన్యూ అధికారులు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు రెవెన్యూ కార్యాలయాలనికి చేరుకుని నచ్చజెప్పడంతో ఆమెను బంధువులు తీసుకెళ్లారు. కాగా, ఈ విషయమై పత్తిపల్లి వీఆర్వో తిరుపతిని వివరణ కోరగా మహిళా రైతు చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారు. ఆమె చెబుతున్న సర్వే నెంబర్లో ఆ పేరుతో సెంటుభూమి లేదని, ఆమె తండ్రికి ఎకరం భూమి ఉన్నా అమ్ముకున్నారని పేర్కొన్నారు. -
కర్నూలు జిల్లాలో మహిళారైతు ఆత్మహత్యాయత్నం
-
పచ్చని బంగారం శ్రీగంధం!
కవిత మిశ్రా.. విలక్షణ మహిళా రైతు.. శ్రీగంధం వంటి విలువైన కలప పంటతోపాటు 10 రకాల పండ్ల చెట్లు, కూరగాయలు, ఆవులు, గొర్రెలు, పందెం కోళ్లతో పాటు మొక్కల నర్సరీ పెంచుతున్నారు. 8 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని దేశానికే అద్భుత నమూనా క్షేత్రంగా మార్చారు. సమీకృత ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఏటా రూ. 25 లక్షల వరకు ఆర్జిస్తున్నారు. జాతీయ మహిళా రైతు దినోత్సవం సందర్భంగా ఇటీవల కవితను కేంద్ర వ్యవసాయ శాఖ ‘ఆనర్ ఆఫ్ ఎక్సలెన్సీ’ పురస్కారంతో సత్కరించడం విశేషం. ఈ అవార్డును తన క్షేత్రంలో వ్యవసాయ కార్మికులకు అంకితం ఇచ్చిన ఉత్తమ రైతు కవిత.. స్ఫూర్తిదాయకమైన ఆమె వ్యవసాయాను భవాలు.. ‘సాగుబడి’ పాఠకులకు ప్రత్యేకం.. కర్ణాటకలోని రాయ్‌చూర్ జిల్లా మాన్వి తాలూకా కవితల్ గ్రామం ఆదర్శ మహిళా రైతు కవిత మిశ్రా స్వస్థలం. ఎమ్మెస్సీ, కంప్యూటర్ డిప్లొమా పూర్తిచేసి ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం పొందారు. నియామక లేఖను భర్తకు చూపిస్తే.. ‘ఉద్యోగం వద్దులే. మన భూమిలో వ్యవసాయం చెయ్యి’ అన్నారట. భర్త మాటలకు ఆమె కుంగిపోలేదు. సవాలుగా తీసుకున్నారు. ఏసీ గదిలో కంప్యూటర్ ముందు పనిచేయాలన్న అభిలాష ఉన్నప్పటికీ.. పెద్దగా సారం లేని, ఇంచున్నర నీరున్న బోరుతో కూడిన తమ 8 ఎకరాల మెట్ట భూమిలోకి అడుగుపెట్టారు. తొలుత రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో దానిమ్మ తోటను సాగు చేసి బ్యాక్టీరియా తెగుళ్లవల్ల లక్షలాది రూపాయల పెట్టుబడి నష్టపోయారు. ఆ చేదు అనుభవం నుంచి మెట్ట ప్రాంత రైతుగా రెండు గుణపాఠాలు నేర్చుకున్నారు. 1. ఒకే పంటను సాగు చేయకూడదు. ఒకే పొలంలో అనేక పంటలు, అంతర పంటలు సాగు చేయాలి. కేవలం పంటల మీదే ఆధారపడకూడదు. పశువులు, చిన్న జీవాలు, కోళ్లను సైతం పెంచుతూ.. అనేక విధాలుగా నిరంతరం ఆదాయం వచ్చేలా చూసుకోవాలి. 2. ప్రకృతికి ఎదురీదటం కాదు, ప్రకృతికి అనుగుణమైన సాగు పద్ధతి మేలు. ఈ గ్రహింపుతో రసాయనిక వ్యవసాయానికి స్వస్తి చెప్పి, పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించారు. శ్రీగంధం సాగుతోపాటు 10 రకాల సీజనల్ పండ్ల చెట్లు నాటి.. దేశం గర్వించదగిన ఆదర్శ మహిళా రైతుగా ఎదిగారు. ఆగ్రోఫారెస్ట్రీ, సమీకృత వ్యవసాయంలో అన్ని విషయాలపైనా ఆమెకు స్వీయానుభవంతోపాటు లోతైన అవగాహన ఉండటంతో.. ప్రాంతీయ, జాతీయ స్థాయి వర్క్‌షాపులలో రైతుగా తనకున్న అపారమైన జ్ఞానాన్ని పంచుతున్నారు. శ్రీగంధం+10 రకాల పండ్ల చెట్లు 2,100 శ్రీగంధం చెట్లతో పాటు వెయ్యి దానిమ్మ, 600 మామిడి, 300 జామ, 450 సీతాఫలం, 100 నేరేడు, 100 మునగ, 100 ఉసిరి, 200 నిమ్మ, 100 కొబ్బరి చెట్లను 8 ఎకరాల్లో కవిత పెంచుతున్నారు. పొలంలో ఒక్క చదరపు అడుగు కూడా ఖాళీగా వదలకుండా పంటలు సాగు చేయాలని ఆమె సూచించారు. ట్రాక్టర్ కాదుకదా ఎద్దుల నాగలితో కూడా దుక్కి చెయ్యరు. ప్రకృతి వ్యవసాయంలో సూక్ష్మజీవులు, వానపాములే భూమిని గుల్లపరిచి సారవంతం చేస్తాయంటారామె. డ్రిప్ మైక్రోట్యూబ్స్ ద్వారా ప్రతి పది రోజులకోసారి చెట్లకు జీవామృతం, పంచగవ్య, దశపర్ణికషాయం మార్చి మార్చి ఇస్తున్నారు. 15 రోజులకోసారి పిచికారీ చేస్తారు. ఆవులు.. గొర్రెలు.. పందెం కోళ్లు.. చెట్లు చిన్నగా ఉన్న దశలో కొన్ని ఏళ్ల పాటు కూరగాయలు, వేరుశనగ తదితర సీజనల్ అంతర పంటలు సాగు చేసుకునేవారు కవిత. 5 ఆవులు, 30 గొర్రెలు, 150 సేలం నుంచి తెచ్చిన డ్రాగన్ ఫైటర్స్ రకం పందెం కోళ్లను పెంచుతున్నారు. శ్రీగంధం, ఇతర పండ్ల విత్తనాలు సేకరించి, వాటితో మొక్కలు పెంచి అమ్ముతున్నారు. ఈ ఏడాది 6–7 క్వింటాళ్ల శ్రీగంధం విత్తనాలను సేకరించారు. కిలో విత్తనాలను రూ.వెయ్యికి విక్రయిస్తున్నారు. ఏడాది వయసున్న శ్రీగంధం మొక్కను రూ.30కి అమ్ముతున్నారు. అనేక రాష్ట్రాల రైతులు కవిత నర్సరీ నుంచి మొక్కలను కొనుగోలు చేస్తున్నారు. రైతుకు రోజూ, వారం, నెల, సీజన్, 15 ఏళ్లకు.. నిరంతరం ఏదో ఒక విధంగా ఆదాయం వచ్చేలా సమీకృత ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించడం వ్యవసాయంపై కవితకు ఉన్న అపారమైన అవగాహన, శ్రద్ధకు నిదర్శనం. తోటలోనే ఇల్లు నిర్మించుకొని కవిత కుటుంబం నివసిస్తోంది. 5 వ్యవసాయ కార్మికుల కుటుంబాలతో సహా తోటలోనే మకాం ఉంటున్నారు. దీంతో ఆమె తన తోటను అనుక్షణం కంటికిరెప్పలా కాపాడుకుంటూ మంచి దిగుబడులు పొందుతున్నారు. ప్రస్తుతం ఏడాదికి 8 ఎకరాల్లో రూ. 25 లక్షల వరకు ఆదాయం పొందుతున్నానని కవిత గర్వంగా చెబుతారు. మైక్రోచిప్‌తో శ్రీగంధం చెట్లకు రక్షణ శ్రీగంధం వంటి విలువైన జాతి చెట్లు పెరుగుతున్నాయంటే.. వాటితోపాటే అభద్రత కూడా పెరుగుతున్నట్లే. అయితే, ఏడేళ్లు పెరిగిన చెట్టుకు మైక్రో చిప్‌ను అమర్చడం ద్వారా అది దొంగల పాలు కాకుండా కాపాడుకోవచ్చని కవిత మిశ్రా తెలిపారు. తన తోటలో శ్రీగంధం చెట్లకు త్వరలో మైక్రోచిప్‌లను అమర్చుకోబోతున్నారు. ఒక్కో చెట్టుకు రూ. 2,500 ఖర్చవుతుంది. కర్నాటక ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ వుడ్‌సైన్స్ టెక్నాలజీలో సర్వర్‌తో అనుసంధానం అయి ఉండే ఈ చిప్ వల్ల.. ఎవరైనా చెట్టును తాకిన వెంటనే సర్వర్‌కు, రైతు మొబైల్‌కు, పోలీస్ స్టేషన్‌కు కూడా హెచ్చరిక సందేశం వస్తుంది. తద్వారా విలువైన శ్రీగంధం చెట్లను సులువుగా రక్షించుకోవచ్చని కవిత తెలిపారు. ప్రతి రైతూ ఒక ఎకరంలోనైనా శ్రీగంధం నాటాలి.. ఆత్మాభిమానం కలిగి ఉండే రైతులు అప్పుల్లో కూరుకుపోకుండా తెలివితో ప్రణాళికాబద్ధంగా సమీకృత ప్రకృతి సేద్యం చేయాలని కవిత సూచిస్తున్నారు. ప్రతి రైతూ తమకున్న మొత్తం పొలంలో కాకపోయినా.. కనీసం ఒక ఎకరంలోనైనా ఈ పద్ధతిలో శ్రీగంధం, పండ్ల మొక్కలు వేసుకోవాలని సూచిస్తున్నారు. శ్రీగంధం 15 ఏళ్లకు ఎకరానికి కోట్లలో ఆదాయం వస్తుంది. శ్రీగంధం చెట్ల మధ్య నాటిన సీజనల్ పండ్ల చెట్లు బోనస్‌గా రైతుకు అందుతాయని, రైతులు ఉద్యోగుల మాదిరిగా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఇది మేలైన సాగు పద్ధతి అని కవిత మిశ్రా(94487 77045) అనుభవపూర్వకంగా చెబుతున్నారు. అరుదైన విద్యాధిక ఆదర్శ మహిళా రైతు కవిత మిశ్రా. ఆమె దీక్ష, దక్షతలకు ‘సాగుబడి’ జేజేలు పలుకుతోంది. ఎకరానికి 300 శ్రీగంధం చెట్లు.. 2011లో కర్ణాటక ప్రభుత్వం శ్రీగంధం సాగుకు రైతులను అనుమితిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ కొత్తల్లోనే 12“12 అడుగుల దూరంలో ఎకరానికి 300 శ్రీగంధం మొక్కలు నాటారు. శ్రీగంధం తనంతట తాను పెరిగే చెట్టు కాదు. పక్కన ఉన్న చెట్ల వేర్లపై ఆధారపడి బతుకుతుంది. ప్రతి శ్రీగంధం మొక్కకు 6 అడుగుల దూరంలో మామిడి, జామ, చింత, నేరేడు, కరివేపాకు మొక్కలు విధిగా నాటాలన్నది కవిత అభిప్రాయం. నాటిన 15 ఏళ్లకు శ్రీగంధం కోతకు వస్తుంది. కాండంలో చేవ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ ధర లభిస్తుంది. చెట్టుకు 20 కిలోల చేవ వచ్చినా ఎకరానికి 6 వేల కిలోల చేవ కలప దిగుబడి వస్తుంది. కిలో రూ. 8 వేల చొప్పున ఎకరానికి రూ. 4 కోట్ల 80 లక్షల ఆదాయం వస్తుందని ఆమె ఆశిస్తున్నారు. ఆమె శ్రీగంధం తోట వయసు 6 ఏళ్ల 8 నెలల. మరో 8 ఏళ్లకు కోతకు వస్తుంది. చెట్టుకు 70 కిలోల శ్రీగంధం చావ వచ్చింది! 2002లో బత్తాయి తోట సాళ్ల మధ్యలో 20 శ్రీగంధం మొక్కలు నాటా. 10 సంవత్సరాల వరకు నీళ్లిచ్చా. ఆ తర్వాత వేసవిలో నీళ్లిచ్చి బతికించా. 14.5 ఏళ్లు పెరిగిన తర్వాత ఏడాదిన్నర క్రితం అటవీ శాఖ అధికారుల అనుమతి తీసుకొని చెట్లు నరికి అమ్మాను. చెట్టు కాండం లోపల చావ కలప (హార్డ్ ఉడ్) ఎంత ఎక్కువ వస్తే రైతుకు అంత ఎక్కువ ఆదాయం వస్తుంది. కొన్ని చెట్లకు 70 కిలోల వరకు వచ్చింది. కిలో రూ. 6 వేలకు అమ్మాను. ఆ చెట్టుకు 4,20,000 వచ్చింది. తాటి చెట్ల నీడ వల్ల కొన్ని చెట్లకు చావ 20–30 కిలోలు మాత్రమే వచ్చింది. ఈ చెట్ల గింజలు పడి మా భూముల్లో కొన్ని మొక్కలు మొలిచి, పెరుగుతున్నాయి. ఉద్యాన కమిషనర్ వెంకట్రామ్రెడ్డి చొరవతో ఇప్పుడు శ్రీగంధం మొక్కలతోపాటు డ్రిప్ కూడా రైతులకు ఇవ్వనున్నారు. శ్రీగంధం చెట్లు పెంచిన తర్వాత వాటిని నరకడానికి అటవీ శాఖ అనుమతుల కోసం తిరగాల్సి వస్తున్నది. అయితే, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సులభంగా అనుమతి ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్న చీఫ్ కన్సర్వేటర్ ఇటీవల చెప్పారు. ప్రతి రైతూ శ్రీగంధం చెట్లు వేసుకుంటే.. మున్ముందు మంచి ఆదాయం వస్తుంది. – విస్తారపు రెడ్డి (63043 91957), పసునూరు, నాంపల్లి మండలం, నల్లగొండ జిల్లా ఎర్ర నేలలు శ్రీగంధం సాగుకు అనువైనవి! కర్ణాటకలోని కవిత మిశ్రా ఆదర్శ రైతు. శ్రీగంధం చెట్లతో పాటు వివిధ రకాల పండ్ల చెట్లు, కూరగాయలు, కోళ్లు, ఆవులు పెంచుతున్నారు. నర్సరీని కూడా ఏర్పాటు చేశారు. రోజూ, ఆరు నెలలకు, 15 ఏళ్లకు ఆదాయం వచ్చేలా అనేక జాతుల చెట్లు, పంటలు సాగు చేస్తూ మంచి ఆదాయం గడిస్తున్నారు. ఆమె విజయగాథ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో శ్రీగంధం సాగును ప్రోత్సహిస్తున్నాం. నీటికొరత, ఎర్ర, గ్రావెల్ నేలలున్న తెలంగాణకు శ్రీగంధం సాగు చాలా అనువైనది. ఔషధ, సుగంధ మొక్కల బోర్డు ఎకరానికి 3 ఏళ్లలో 18 వేల నుంచి 20 వేల వరకు సబ్సిడీ ఇస్తున్నది. ప్రతి రైతూ శ్రీగంధం మొక్కలు కనీసం పదైనా వేసుకుంటే భవిష్యత్తులో మంచి ఆదాయం వస్తుంది. అంతేకాదు, కార్బన్‌డయాక్సయిడ్‌ను పీల్చుకోవడం ద్వారా పర్యావరణానికి ఈ చెట్లు ఎంతో మేలు చేస్తాయి. మన దేశం సహా 8 దేశాల్లోనే శ్రీగంధం పెరుగుతుంది. కాబట్టి గిరాకీ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. ములుగులోని ఉద్యాన సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌లో 18 లక్షల శ్రీగంధం మొక్కలు పెంచుతున్నాం. జూలై–ఆగస్టు నాటికి మొక్క రూ. 15–20 ధరకు రైతులకు అందిస్తాం. ముందుగా పేర్లు నమోదు చేయించుకున్న రైతులకే శ్రీగంధం మొక్కలు ఇస్తాం. ఆసక్తి ఉన్న రైతులు ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయ ప్రసాద్(83744 49007)ను సంప్రదించవచ్చు. – ఎల్. వెంకట్రామ్రెడ్డి, కమిషనర్, తెలంగాణ ఉద్యాన శాఖ కవిత తోటలో ఉద్యాన కమిషనర్ తదితరులు తన తోటలో బత్తాయిలు, సీతాఫలాలతో కవిత మిశ్రా -
ఏమ్మా.. ఈ డబ్బు ఏం చేస్తావ్?
నవాబుపేట(జడ్చర్ల) : ఏమ్మా.. ఈ డబ్బులు ఏం చేస్తావ్... అని బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసుకుని వెళ్తున్న మహిళను ఆరా తీసి వివరాలు తెలుసుకున్నారు కలెక్టర్ రొనాల్డ్‌రోస్. నవాబుపేట మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో బుధవారం రైతు బంధు చెక్కుల పంపిణీని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యాంకు నుంచి డబ్బు తీసుకుని వెళ్తున్న మహిళతో ఆయన మాట్లాడారు. లింగంపల్లికి చెందిన భారతమ్మ తనకు రూ.14వేలు వచ్చాయిని, ఈ డబ్బులను వ్యవసాయానికే ఉపయోగిస్తానని చెప్పడంతో అభినందించారు. ఈ మేరకు కలెక్టర్ తీగలపల్లి, రుద్రారం, సిద్దోటం గ్రామాల్లో చెక్కుల పంపిణీని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రెవెన్యూ, బ్యాంకు అధికారులకు పలు సూచనలు చేసిన ఆయన ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని రైతులను కోరారు. తహసీల్దార్ శ్రీనివాస్‌రావు, మండల స్పెషల్ అధికారి కొమురయ్య, మార్కెట్ చైర్మన్ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ నర్సింహులు, ఎంపీడీఓ సాయిలక్ష్మి, సర్పంచ్‌లు రుద్రారం లక్ష్మి, సిద్దోటం నర్సింహులు, వైస్ ఎంపీపీ నారాయణ, బాలకిష్టయ్య, మధు, యాదిరెడ్డి, కృష్ణ, సంతో‹ష్ పాల్గొన్నారు. అర్హులందరికీ చెక్కులు జడ్చర్ల : రైతుబంధు పథకం కింద అర్హులైన రైతులందరికీ చెక్కులు అందజేస్తామని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ పేర్కొన్నారు. మండల పరిధిలోని పోలేపల్లి గ్రామంలో జరిగిన రైతుబంధు చెక్కులు, పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో పాటు కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివాదస్పద భూములు మినహా రైతులకు వంద శాతం చెక్కులు అందించే విధంగా కృషి చేస్తామన్నారు. చెక్కుల పంపిణీ కార్యక్రమం అనంతరం ఈనెల 18 నుండి ప్రతీ గ్రామంలో తమ సిబ్బంది పర్యటించి కోర్టు కేసులు మినహాయించి వివాదాల్లో ఉన్న భూముల విషయమై విచారించి ఆయా రైతులకు కూడా చెక్కులు అందేలా చూస్తామన్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు జయప్రద, ఎంపీపీ లక్ష్మి, ఏడీఏ నిర్మల, సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జంగయ్య, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, సింగిల్ విండో చైర్మన్ బాల్‌రెడ్డి, మార్కెట్‌యార్డు డైరెక్టర్ గోవర్దన్‌రెడ్డి పాల్గొన్నారు. -
సేంద్రియ మారాణి!
వాంకుడోతు మారోణి.. తెలంగాణ రాష్ట్రంలో ఓ మారుమూల గిరిజన తండా ఆమె ఊరు. చదువు లేదు. అయినా, గుండెల నిండా చైతన్యం నింపుకున్న రైతు. సేంద్రియ వ్యవసాయం చేస్తుంది. మెరుగైన వ్యవసాయ పద్ధతులు నేర్చుకుంటూ పాటిస్తుంది. తాను, తన కుటుంబం పచ్చగా ఉండటంతోపాటు.. తోటి రైతులు కూడా చల్లగుండాలనుకుంటుంది. అందుకోసం తమ తండాలో రైతు సంఘాన్ని ఏర్పాటు చేసింది. శక్తి మేరకు కష్టపడటంతో పాటు దేవుడి దయ కూడా కావాలనుకొంటుంది. అందుకే వాళ్ల రైతు సంఘానికి బాలాజీ పేరు పెట్టుకుంది. రోజుకు ముప్పూటా ఇంటిల్లిపాదీ తినే పచ్చజొన్న, కొర్ర, శ్రీవరితోపాటు ఒకటికి నాలుగు తిండి పంటలతో పాటు కొంత మేరకు పత్తి వేస్తుంటుంది. పోయిన సీజన్లో ఎకరం పత్తి పెట్టి.. నానా బాధలు పడి ఖర్చులు రాబట్టుకుంది. కానీ, తన కష్టం వృథా పోయిందని, రూ. 20 వేల వరకు నష్టం వచ్చిందని అంటుంది. అందుకే, ఈసారి మాత్రం పత్తి పెట్టనని తెగేసి చెబుతోంది.. చిన్నపాటి మహిళా రైతు మరోణి! వాంకుడోతు మారోణిది దయ్యబండ అనే తండా. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో ఉంది ఆ తండా. చిన్న రైతు కుటుంబం ఆమెది. భర్త పేరు చిన్న రాములు. ఇద్దరు కుమారులు. ఓ కూతురు. ముగ్గురికీ పెళ్లిళ్లు అయిపోయాయి. పెద్ద కొడుకు, కోడులు వేరు కాపురం ఉంటున్నారు. చిన్న కొడుకు, కోడలితో పాటు కలిసి ఉంటూ మారోణి ఒడుపుగా వ్యవసాయం చేస్తున్నది. మొదట్లో ఎడ్లబండిపై భర్తతో కలిసి ఊరూరూ తిరిగి చెరకు నరకడం, కొన్నాళ్లు ఊళ్లకు వెళ్లి సీతాఫలాలు, ఉప్పు అమ్మటం అలవాటుగా ఉండేది. భర్తకు కంటి చూపు మందగించటంతో గత కొద్ది ఏళ్లుగా తండాలోనే స్థిరంగా ఉంటూ.. వ్యవసాయం చేస్తున్నారు. దయ్యబండ తండా మహిళా గిరిజన రైతులు పిలుపు స్వచ్ఛంద సంస్థ సహకారంతో సేంద్రియ, శ్రీవరి సాగు పద్ధతులను అలవరచుకొని ముందడుగు వేస్తున్నారు. పచ్చజొన్న రొట్టె.. గటక.. మారోణి కుటుంబానికి సొంతం రెండెకరాల కుష్కి(మెట్ట), ఒక ఎకరం తరి(మాగాణి) పొలం ఉంది. మరో 3 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. మారోణి ఈ సంవత్సరం పది క్వింటాళ్ల మొక్కజొన్నలు, క్వింటన్నర కందులు, 4 క్వింటాళ్ల పచ్చజొన్నలు పండించింది. ఎన్ని పండినా పచ్చజొన్నలు మాత్రం అమ్మరు. ఇంట్లో పిల్లా పెద్దా అందరూ మూడు పూటలా జొన్న రొట్టె తింటారు. గటక తాగుతారు. ఆరోగ్యంగా ఉంటారు. పొలం పనులు చాలా వరకు సొంతంగానే చేసుకుంటారు. 3 ఎకరాలను కౌలుకు తీసుకున్నారు. ఎకరానికి ఏటా రూ. 10 వేలు కౌలు. బోరులో నీరు తక్కువ ఉండటంతో ఎకరంన్నరలో శ్రీవరి సాగు చేసింది. పంట చేతికి రాబోతుండగా రాళ్లవాన, గాలిదుమారం వచ్చి.. 40 బస్తాల ధాన్యం రాలటంతో.. 30 బస్తాల ధాన్యమే చేతికొచ్చింది. ‘ఎకరంలో పత్తి పెడితే.. పెట్టుబడి తిరిగి రావడమే కష్టమైంది. తమ కష్టం వృథా అయ్యింది. ఆ మేరకు రూ. 20 వేలు నష్టం వచ్చింది. ఈసారి మొక్కజొన్న, కందులు, కొర్రలు, సజ్జలు, శ్రీవరి పెడతా. పత్తి పెట్టేది లేద’ని మారోణి తేల్చి చెప్పారు. రైతు సంఘాలు.. విత్తన బ్యాంకు.. తండాలో రైతులు 20 మంది చొప్పున రెండు సంఘాలు పెట్టుకున్నారు. బాలాజీ రైతు సంఘం పెట్టుకొని నాలుగేళ్లు అయింది. వీటిల్లో సభ్యులు చాలా వరకు గిరిజన మహిళా రైతులే. మొదట్లో నెలకు తలకు రూ.50 మదుపు చేసేవారు. ఇప్పుడు రూ. 100 జమ చేస్తున్నారు. తొలకరికి రైతుకు రూ. 10 – 20 వేల వరకు అప్పు ఇస్తున్నారు. వందకు నెలకు రూ.1 వడ్డీ. నెలకు రూ.వెయ్యి/రెండు వేలు తిరిగి కట్టేస్తున్నారు. తోటి మహిళా రైతులతో సంఘం సమావేశం నిర్వహిస్తున్న మారోణి కాలం సరిగ్గా లేకపోవటమో, పంటలు సరిగ్గా పండకపోయినప్పుడు అప్పు ఎలా కడతారు? అనడిగితే.. ‘అట్లేం లేదు సారూ. ఏదో కష్టం చేస్తం. ఇంటికాడ ఉంటమా. సంఘం పెట్టుకున్న తర్వాత తెలివి వచ్చింది. అటూ ఇటూ మీటింగులకు వెళ్లి రావటం వల్ల విత్తనాలు వచ్చినై. విత్తన బ్యాంకు పెట్టినం. ఇప్పుడు మా దగ్గర తైదలు, కొర్రలు, సజ్జలు, పచ్చజొన్నలు, ఎర్రకందులు, తెల్లకందులు, అన్ని రకాల కూరగాయల విత్తనాలు ఉన్నయి. సంఘం సభ్యులకు కిలో విత్తనాలు ఇస్తే వచ్చే సంవత్సరం రెండు కిలోలు తిరిగి ఇస్తరు. వేరే ఊరోళ్లకైతే జొన్న విత్తనాలు కిలో రూ. 60కి, కందులు రూ.150కి.. అమ్ముతున్నం.. సంఘం వచ్చినంక జర మంచిగనే ఉంది..’ అంటున్నారు మారోణి. మేలైన, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అలవాటు చేసుకుంటూ అధిక దిగుబడులు సాధించేలా ప్రోత్సహిస్తున్న మారోణిని మా మంచి రాణిగా తోటి రైతులు ప్రశంసిస్తున్నారు. స్వయంగా కౌలు రైతు కూడా అయిన మారోణి కౌలు రైతుల హక్కుల సాధన కోసం పోరాడుతున్నారు. ఇందిరాగాంధీ శ్రమ శక్తి అవార్డును గత ఏడాది మారోణి స్వంతం చే సుకోవడం ఎంతైనా సముచితం. కౌలు రైతులకు న్యాయం ఎక్కడ? వరి సాగులో శ్రీ పద్ధతిని అనుసరించడం, అదేవిధంగా అధిక లాభాలు అందించే చిరుధాన్యాలు, కంది వేస్తున్నాను. పంట మార్పిడితో మంచి దిగుబడులు సాధించాను. రసాయన ఎరువుల వాడకం పూర్తిగా తగ్గించి సేంద్రియ వ్యవసాయానికి మొగ్గు చూపడం వల్ల చీడపీడల నుంచి రక్షణతో పాటుగా పంట దిగుబడి నూటికి నూరు శాతం పెరిగింది. వ్యవసాయం, పాడి గేదెల పెంపకం రెండూ లాభసాటిగా ఉన్నాయి. మహిళా రైతులు కూడా మంచి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ ఒకటికి నాలుగు రకాల పంటలు పండిస్తే వ్యవసాయంలో మంచి దిగుబడులు సాధించవచ్చు. అయితే, పంట నష్టపోయినా పరిహారం రావటం లేదు. మా వరి ధాన్యం సగానికి పైగా రాలిపోయింది. అధికారులు వచ్చి రాసుకున్నారు. అయినా రూపాయి రాలేదు. కౌలు రైతులకు గుర్తింపు కార్డు ఇవ్వటం లేదు. ఎకరానికి రూ. 4 వేల పెట్టుబడి సహాయం కూడా ప్రభుత్వం భూమి యజమానికే ఇస్తున్నది. కౌలు రైతులకు న్యాయం జరగటం లేదు. వాంకుడోతు మారోణి (95530 35321), దయ్యబండ తండా,తుర్కపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా – టీవీ రమణాకర్, సాక్షి,తుర్కపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా -
ఎవుసం అంటే ప్రాణం
కాలం కలిసి రాక.. పంట దిగుబడి లేక, మార్కెట్లో గిట్టుబాటు ధరలు లభించక.. వ్యవసాయాన్ని వదిలి ఎంతో మంది రైతులు పట్టణాల వైపు చూస్తున్నారు. అప్పుల పాలై తనువుచాలిస్తున్నవారు కొందరైతే, నగరాలకు వలసపోతున్నవారు మరికొందరు. ఇలాంటి వారికి భిన్నంగా.. భూమిని నమ్ముకుంటే అద్భుతాలు సాధించవచ్చని నిరూపిస్తోంది ఓ మహిళ. వ్యవసాయాన్ని ప్రాణంగా భావించి సాగులో ఆధునిక పద్ధతులను అనుసరిస్తూ అధిక దిగుబడులు సాధిస్తోంది. పురుషులకు ఏమాత్రం తీసిపోని విధంగా వ్యవసాయంలో అన్ని పనులూ చేస్తూ ఏటా రూ. 3 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది మానుకోట మండలంలోని అమనగల్ గ్రామానికి చెందిన కోట యాకమ్మ. సేంద్రియ సాగుతో ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న స్త్రీమూర్తిపై ప్రత్యేక కథనం.. మహబూబాబాద్: పంటను కంటికి రెప్పలా చూసుకుంటూ నిత్యం వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతుంది. జాతీయ ఆహార భద్రత పథకం సభ్యురాలిగా ఉంటూ ఎక్కడ అవగాహన సదస్సులు జరిగినా అక్కడికి వెళ్లి మెళుకువలు నేర్చుకుని ఆచరణలో పెట్టి రైతులకు ఆదర్శంగా నిలుస్తోంది. కోట యాకమ్మ–ఐలయ్య దంపతులకు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరి వివాహాలయ్యాయి. కుమారులు వేర్వేరు పనులు చేస్తున్నారు. కాగా యాకమ్మ మాత్రం తనకున్న నాలుగు ఎకరాల్లో అధిక దిగుబడులు సాధించి క్రమంగా సాగును 10 ఎకరాలకు విస్తరింపజేసింది. అన్నీ తానై .. పొలంలో దుక్కి దున్నడం, కలుపు తీయడం, పురుగుల మందులు చల్లడంతో పాటు ఇతర వ్యవసాయ పనులన్నీ తానే స్వయంగా చూసుకుంటోంది. రసాయన ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువుల వాడకంపైనే మొగ్గు చూపి అధిక దిగుబడులు సాధిస్తూ జిల్లాలోనే చెప్పుకోదగిన రైతుగా పేరు సంపాదించింది. తనకున్న నాలుగు ఎకరాలను 10 ఎకరాలు చేసింది. తనకు తోడుగా భర్త కూడా సాయపడుతున్నాడు. మరోవైపు కార్యాలయాలకు వెళ్లి, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పురుగుల మందులు, ఎరువులను ఉపయోగిస్తూ.. ఆధునిక పద్ధతులను అవలంబిస్తోంది. ప్రతి సంవత్సరం రూ.3 లక్షల ఆదాయాన్ని సంపాదిస్తోంది. ప్రస్తుతం 10 ఎకరాల్లో మూడు ఎకరాల్లో మామిడి తోట, ఎకరంలో వేరుశనగ, రెండున్నర ఎకరాల్లో పత్తి పంటను సాగు చేసింది. వ్యవసాయ అధికారులు యాకమ్మను ఉత్తమ రైతుగా గుర్తించి సమావేశాలకు ఆహ్వానిస్తున్నారు. ప్రముఖుల సన్మానం.. మల్యాల కేవీకే అధికారులు యాకమ్మను ఉత్తమ మహిళా రైతుగా గుర్తించి రెండుసార్లు సన్మానించారు. పంటలు బాగా పండించినందుకు పలు సంస్థలు, కంపెనీల ప్రతినిధులచే ప్రశంసలు, సత్కారాలు అందుకుంది. వ్యవసాయ కార్యాలయాలు, మరెక్కడైనా సదస్సులు జరిగినా యాకమ్మ అక్కడికి వెళ్లి అధికారుల సూచనలు విని పాటిస్తోంది. కాగా ప్రస్తుతం జాతీయ ఆహార భద్రత పథకంలో సభ్యురాలిగా పనిచేస్తోంది. చిన్నతనం నుంచే.. చిన్నతనం నుంచే వ్యవసాయ పనులంటే ఇష్టం. ప్రతిరోజూ పొలం వద్దకు వెళ్లకుంటే ఏదో పోగొట్టుకుంటున్నట్లు ఉంటుంది. వారానికి ఒకసారి వ్యవసాయ కార్యాలయాలకు వెళ్లి పంటలకు సంబంధించి నూతన పద్ధతుల గురించి తెలుసుకుని వాటిని పాటిస్తా. ప్రతి సంవత్సరం రూ. 3 లక్షల ఆదాయం వస్తుంది. ఉత్తమ రైతు అవార్డు కోసం చాలాసార్లు ఇక్కడి అధికారులు పేరును పంపారు. నాకు ఇవ్వకపోయినా నాలాగా పనిచేసే రైతులకు ఇచ్చినా బాగుంటుంది. వ్యవసాయ పనుల్లోనే నాకు సంతృప్తి ఉంది. – కోట యాకమ్మ, అమనగల్, మనుకోట -
మహిళా రైతు ఆత్మహత్య
కాళేశ్వరం : కరీంనగర్ జిల్లా మహదేవపూర్ మండలం సూరారం గ్రామానికి చెందిన చల్లా స్వరూప(38) అనే మహిళా రైతు అప్పులబాధతో ఆత్మహత్య చేసుకుంది. గత రెండేళ్లగా తమకున్న ఐదెకరాల భూమిలో స్వరూప, శ్రీనివాస్ దంపతులు పత్తిపంటను సాగుచేస్తున్నారు. ఆశించిన దిగుబడి రాకపోవడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు కూడా కట్టలేకపోయారు. ఇదే క్రమంలో గురువారం స్వరూప, శ్రీనివాస్ తమ పత్తి చేనులో కలుపు తీస్తుండగా మేడిగడ్డ బ్యారేజీ సర్వే అధికారులు వచ్చి మీ భూమి మొత్తం పోతుందని తెలిపారు. ఇప్పటికే రూ.5లక్షల అప్పు ఉన్నామని, భూమి కూడా పోతే ఎలా బతకాలని మనస్తాపం చెందింది. ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి క్రిమిసంహారకమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. దీనికితోడు కుమార్తె మానస వికలాంగురాలు కావడంతో ఆమెపై మనోవేదనకు గురైనట్లు బంధువులు తెలిపారు. మృతురాలి కుటుంబానికి రూ.25లక్షల పరిహారం చెల్లించాలని కాంగ్రెస్, టీడీపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వరూప భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పులబాధతో ఆత్మహత్యగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీలో భూమి కోల్పోతున్నందున ఆత్మహత్యకు పాల్పడిందనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తామన్నారు. -
మహిళా రైతు ఆత్మహత్య
మహదేవ్పూర్ : కరీంనగర్ జిల్లా మహదేవ్పూర్ మండలం సూరారంలో చల్లా స్వరూప(38) అనే మహిళా రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. గత ఏడాది పత్తి పంటతో రూ.3 లక్షలు నష్టం వచ్చింది. అదే విధంగా మేడిగడ్డ బ్యారేజీ కింద భూమిని కోల్పోనుండటంతో నేపథ్యంలో మనస్తాపానికి గురైన స్వరూప ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నేల తల్లిని నమ్ముకుని బతుకు బండి లాగిస్తోంది..
వేలేరుపాడు : ఈమె పేరు సోడే సాయమ్మ. వయసు ఆరు పదుల పైమాటే. వేలేరుపాడు మండలం జిన్నెలగూడెంకు చెందిన ఆమె పుట్టు మూగ. వివాహం చేసుకోలేదు. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. వారసత్వంగా సంక్రమించిన 6 ఎకరాల భూమి ఆమెకు జీవనాధారం. గిరిజన కుటుంబానికి చెందిన ఈమె 40 ఏళ్లుగా వ్యవసాయం చేస్తూ మహిళా రైతుగా రాణిస్తోంది. ఎవరి ఆసరా లేకుండా.. నేల తల్లిని నమ్ముకుని ఒంటరిగా బతుకు బండి లాగిస్తోంది. ఇదీ నేపథ్యం.. సోడే మల్లయ్య, కన్నమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె పేరు మాలక్ష్మి, రెండో కుమార్తె దూపమ్మ కాగా, సాయమ్మ మూడో సంతానం. తల్లిదండ్రులు సాయమ్మ చిన్నప్పుడే మరణించారు. రెండో కుమార్తె దూపమ్మ కూడా చనిపోయింది. తండ్రి మల్లయ్యకు బండలబోరు గ్రామంలో 12 ఎకరాల పట్టా భూమి ఉంది. ఆ భూమిని సాయమ్మ, ఆమె పెద్దక్క మాలక్ష్మికి 6 ఎకరాల చొప్పున గ్రామ పెద్దలు పంచారు. సాయమ్మ తన వాటాగా వచ్చిన ఆరెకరాల బీడు భూమిని ఒంటరిగానే బాగుచేసుకుంది. బండరాళ్లు, రుప్పలను తొలగించి సేద్యానికి అనుకూలంగా మలుచుకుంది. అందులో వరిసాగు చేస్తోంది. రెండు ఎడ్లను పెంచుతోంది. వాటి సాయంతో అరకు కట్టి దున్నుతోంది. సొంతంగా ఎడ్లబండిని సమకూర్చుకుంది. నారు పోయడం, నాట్లు వేయడం, కుప్ప నూర్చడం వంటి పనులను అవలీలగా చేస్తోంది. ఈ బీడు భూమిలో ఏ పంట పండాలన్నా సాగునీటి సౌకర్యం లేదు. దీంతో వర్షాధారంగా ఏటా ఒక పంట మాత్రమే సాయమ్మ పండిస్తోంది. నేలపై పశువుల పెంటవేసి, ఎరువులు వాడకుండా ఎకరాకు 15 బస్తాల చొప్పున ఏటా 90 బస్తాలకు తగ్గకుండా ధాన్యం దిగుబడి వస్తోంది. ఏడాదంతా తాను తినడానికి అవసరమైన ధాన్యాన్ని గాదెలో నిల్వ చేసుకుంటోంది. మిగతా ధాన్యాన్ని విక్రయించగా వచ్చే సొమ్ముతో నిత్యావసర సరుకులు, ఇతర అవసరాలకు వినియోగించుకుంటోంది. వ్యవసాయ పనులు లేనప్పుడు ఖాళీగా ఉండకుండా పత్తి తీత పనులకు వెళుతోంది. ఇలా రోజుకు రూ.100 వరకు సంపాదిస్తోంది. మాటలు రాకపోయినా సైగల ద్వారా విషయాలు చెబుతుంది. ఆమె ఏం చెబుతోందనేది గ్రామంలోని వారందరికీ ఇట్టే అర్థమవుతాయి. సాయమ్మకు వేలేరుపాడులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో అకౌంట్ ఉంది. ఖర్చులు పోగా మిగిలిన సొమ్మును ఆ ఆకౌంట్లో దాస్తోంది. కాయకష్టం చేస్తూ తన అక్క మాలక్ష్మి, బావ బజారుకు సహకరిస్తుంటుంది. మాటలు రాకపోయినా.. మహిళ అయినా సాయమ్మ వ్యవసాయం చేస్తూ నలుగురికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఆమె బావ బజారు మాట్లాడుతూ.. ‘మా ఇంట్లో ఉండమన్నా ఉండదండి. ఆమెకు కాలనీలో ఇల్లు వచ్చింది. అందులో ఒంటరిగానే ఉంటోంది. తన వంట తానే వండుకుంటుంది. ఎప్పుడూ ఎవరినీ నొప్పించదు. పెళ్లి చేద్దామనుకున్నాం. చాలాసార్లు పెళ్లి మాటెత్తితే ఒప్పుకోలేదు. ఒంటరిగానే ఉంటానంది. అందుకే పెళ్లి చేయలేదు’ అని చెప్పాడు. -
మహిళా రైతు ఆత్మహత్య
చివ్వెమ్ల మండలం పాండ్యానాయక్ తండాలో దారావత్ బోడి(35) అనే మహిళా రైతు ఆత్మహత్య చేసుకుంది. అప్పులవాళ్ల ఒత్తిడి తట్టుకోలేక బుధవారం రాత్రి చీరతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మహిళా రైతుకు సుమారు రూ.2 లక్షల అప్పులు ఉన్నట్లు తెలిసింది. -
మహిళా రైతు ఆత్మహత్య
కరీంనగర్: కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం నర్సక్కపేటలో జోగు పోచవ్వ(47) అనే మహిళా రైతు ఆత్మహత్య చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పోచవ్వ ఇటీవల తనకున్న ఐదు ఎకరాలలో పత్తిపంట వేసింది. వేసిన పంట సరైన వర్షాలు లేకపోవడంతో ఎండిపోయింది. చేసిన అప్పులు తీర్చడానికి ఇటీవల ఒకటిన్నర ఎకరం పొలాన్ని అమ్మింది. అయినా అప్పులు తీరకపోవడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కొండమల్లేపల్లిలో మహిళా రైతు ఆత్మహత్య
నల్గొండ: నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొండమల్లేపల్లి పంచాయతీ గిరిజానగర్ తండాలో ఓ మహిళ రైతు ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం ఉదయం నేనావత్ కమ్లి(40) అనే మహిళా రైతు అప్పులు తీర్చే మార్గం లేక పురుగుల మందు తాగింది. కుటుంబసభ్యులు హుటాహుటిన దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించగా..చికిత్సపొందుతూ ఆమె మృతి చెందింది. -
మహిళా రైతు ఆత్మహత్య
అప్పుల బాధ తాళలేక.. ఓ మహిళా రైతు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా రాయకల్ మండలం వడ్డెలింగాపూర్ గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మహిళా రైతు మాలోవత్ సునిత(38) తనకున్న రెండెకరాల భూమితో పాటు గ్రామానికి చెందిన మరో రైతుకు చెందిన మూడున్నర ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో రెండేళ్లుగా పంటలు సరిగ్గా పండక అప్పులు ఎక్కువవడంతో.. వాటిని తీర్చేదారి కానరాక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళా రైతు బలవన్మరణం
ఇటిక్యాల: అప్పుల భారం, కుటుంబ సమస్యలతో ఓ మహిళా రైతు ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల మండలం ఉద్దండాపురం గ్రామానికి చెందిన పోలీసు శరత్‌కుమార్‌రెడ్డి, జయంతి(30) దంపతులు తమకున్న నాలుగున్నర ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే, శరత్‌కుమార్ రెడ్డి మద్యానికి బానిసై కుటుంబ వ్యవహారాలు పట్టించుకోకపోవటంతో జయంతి వ్యవసాయ పనులు చూసుకుంటోంది. ఈ ఏడాది సాగు చేసిన పత్తి, మిర్చి ఆశాజనకంగా లేకపోవటంతోపాటు అప్పులు రూ.10 లక్షలకు పెరిగిపోవటంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆమె సోమవారం ఉదయం పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. -
అన్నదాత మెడకు అప్పు ఉరి
పది మంది ఆత్మహత్య * అందులో ఒకరు మహిళా రైతు * ఇద్దరికి గుండెపోటు సాక్షి నెట్వర్క్: వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతు మెడకు అప్పుల ఉరి చుట్టుకుంటోంది. కాలం కలసి రాక.. సరైన గిట్టుబాటు ధర లేక దిగాలు పడుతున్న అన్నదాతపై అప్పుల భారం పెరుగుతుండడంతో ఆత్మహత్య చేసుకుంటున్నాడు. తెలంగాణ జిల్లాల్లో సోమవా రం పది మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా, అందులో ఒకరు మహిళా రైతు. మరో ఇద్దరు గుండెపోటుతో మరణించారు. మహబూబ్‌నగర్ జిల్లా తలకొండపల్లి మండలం చౌదర్‌పల్లికి చెందిన సప్పిడి మాసయ్య(38) పదకొండు ఎకరాల్లో పంటలు వేయడానికి సుమారు రూ. 10 లక్షల అప్పు చేశాడు. వర్షాభావ పరిస్థితుల్లో పంటల దిగుబడి తగ్గింది. దీంతో అప్పులు తీరే మార్గం కనిపించక పురుగుల మందు తాగాడు. ఇదే జిల్లా మిడ్జిల్ మండల కేంద్రానికి చెందిన సాకలి జంగయ్య(46) తనకున్న ఎకరం 20 గుంటలతోపాటు మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. పంట ఎండి పోవడం, రూ. 3 లక్షల అప్పుల పాలవడంతో ఉరేసుకున్నాడు. బల్మూర్ మండలం చెన్నారంలో సంకెళ్ల చిన్నయ్య (60) ఐదు బోర్లులు వేసి అప్పులపాలై ఉరేసుకున్నాడు. మానవపాడు మండలం ఉండవెల్లికి చెందిన రైతు సుధాకర్ గౌడ్ మూడేళ్లుగా కందులు, పొగాకు పంటలు వేసి నష్టపోయాడు. అప్పులపాలయ్యాడు. దీంతో ఈ నెల 17న తన పొలంలో గుళికల మందు మింగాడు. మెదక్ జిల్లా కేంద్రానికి చెందిన చింతల సత్యనారాయణ(44) తన రెండు ఎకరాల్లో గతేడాది నాలుగు బోర్లు వేసినా చుక్కనీరు పడలేదు. సాగు, కూతురు వివాహానికి కలిపి మొత్తం రూ. 7 లక్షల వరకు అప్పు చేశాడు. పంట ఎండిపోయింది. అప్పులు తీర్చలేక తన పొలం వద్ద ఉరేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పొద్దుటూరుకు చెందిన తలారి మల్లేశ్(40) వ్యవసాయం కోసం ప్రైవేటుగా రూ. లక్ష, బ్యాంకులో రూ. 50 వేలు రుణం తీసుకున్నాడు. అప్పు తీరే మార్గం కనిపించక ఆది వారం రాత్రి క్రిమిసంహారక మందు తాగాడు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం తాడిహత్నూర్‌కు చెందిన రాథోడ్ దేవు(60) పత్తిపంట వర్షపు నీటిలో మునిగి పోయింది. దీంతో మన స్తాపం చెంది పురుగుల మందు తాగాడు. ఇదే జిల్లా సిర్పూర్(యూ) మండలం రాగాపూర్కు చెందిన చిక్రం నాగోరావు(55) పత్తి పంట వర్షాలకు నాశనం కావడంతో మనోవేదనకు గురై గుండెపోటుతో మరణించాడు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లికి చెం దిన రైతు లింగురాం(60) ఇంట్లో ఉరివేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు హన్మాల శివరాజయ్య(55) అప్పులు తీర్చలేక గుండెపోటుతో మృత్యువాత పడ్డాడు. విద్యుత్ తీగలు పట్టుకొని.. మెదక్ జిల్లా మనూరు మండలం తుమ్నూర్‌కు చెందిన రైతు పంచగామ విఠల్(35) అప్పులు పెరుగుతుండడంతో దిక్కుతోచని స్థితిలో విద్యుత్ తీగలు పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విఠల్‌కు తనకున్న మూడు ఎకరాల్లో ఆరు బోర్లు వేయించాడు. అందులో ఐదు బోర్లు ఫెయిలయ్యాయి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొటాల్పల్లి రైతు మల్యాల సురేశ్(31) రూ. 3 లక్షల అప్పు తీరే మార్గం కనిపించక ట్రాన్ఫార్మర్ ఎక్కి విద్యుత్ తీగలను పట్టుకున్నాడు. షాక్‌కు గురైన సురేష్‌ను హైదరాబాద్‌కు తరలించారు. అమ్మా.. పిల్లల్ని ఎవరికైనా దత్తత ఇవ్వు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేటకు చెం దిన మహిళా కౌలు రైతు మాడ సాగరిక(24) మూడేళ్లుగా ఏడు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తోంది. ఆమె భర్త నారాయణరెడ్డి ఇటుకబట్టీలో కూలికి వెళ్తున్నాడు. వర్షాభావ పరిస్థితుల్లో ఏనాడూ పంట సరిగా చేతికి రాలేదు. పెట్టుబడులు, కుటుంబ అవసరాల కోసం రూ. 5.50 లక్షల వరకు అప్పులయ్యాయి. ఈ ఏడాది పత్తి ఎర్రబొమ్మిడి రోగంతో పూర్తిగా దెబ్బతింది. దీంతో మనస్తాపం చెంది సోమవారం క్రిమిసంహారక మందు తాగింది. ‘అమ్మా ఏమీ అనుకోవద్దు.. పత్తి అమ్మగా వచ్చిన డబ్బులు అప్పులోళ్లకు ఇవ్వు. విన్ను, విక్కు(కొడుకుల ముద్దుపేర్లు)లను ఎవరికైనా దత్తత ఇవ్వు.. లేదా అనాథ ఆశ్రమంలో చేర్పించు.. ఇంకా ఉన్న అప్పుల వివరాలు బీరువాలో ఉన్నాయి..’ అని సూసైడ్ నోట్ రాసి పెట్టింది.