పచ్చజొన్న విత్తనాలను ఈత బుట్టల్లో సంప్రదాయబద్ధంగా భద్రపరుస్తున్న మారోణి, తదితరులు
వాంకుడోతు మారోణి.. తెలంగాణ రాష్ట్రంలో ఓ మారుమూల గిరిజన తండా ఆమె ఊరు. చదువు లేదు. అయినా, గుండెల నిండా చైతన్యం నింపుకున్న రైతు. సేంద్రియ వ్యవసాయం చేస్తుంది. మెరుగైన వ్యవసాయ పద్ధతులు నేర్చుకుంటూ పాటిస్తుంది. తాను, తన కుటుంబం పచ్చగా ఉండటంతోపాటు.. తోటి రైతులు కూడా చల్లగుండాలనుకుంటుంది. అందుకోసం తమ తండాలో రైతు సంఘాన్ని ఏర్పాటు చేసింది. శక్తి మేరకు కష్టపడటంతో పాటు దేవుడి దయ కూడా కావాలనుకొంటుంది. అందుకే వాళ్ల రైతు సంఘానికి బాలాజీ పేరు పెట్టుకుంది. రోజుకు ముప్పూటా ఇంటిల్లిపాదీ తినే పచ్చజొన్న, కొర్ర, శ్రీవరితోపాటు ఒకటికి నాలుగు తిండి పంటలతో పాటు కొంత మేరకు పత్తి వేస్తుంటుంది. పోయిన సీజన్‌లో ఎకరం పత్తి పెట్టి.. నానా బాధలు పడి ఖర్చులు రాబట్టుకుంది. కానీ, తన కష్టం వృథా పోయిందని, రూ. 20 వేల వరకు నష్టం వచ్చిందని అంటుంది. అందుకే, ఈసారి మాత్రం పత్తి పెట్టనని తెగేసి చెబుతోంది.. చిన్నపాటి మహిళా రైతు మరోణి!
వాంకుడోతు మారోణిది దయ్యబండ అనే తండా. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో ఉంది ఆ తండా. చిన్న రైతు కుటుంబం ఆమెది. భర్త పేరు చిన్న రాములు. ఇద్దరు కుమారులు. ఓ కూతురు. ముగ్గురికీ పెళ్లిళ్లు అయిపోయాయి. పెద్ద కొడుకు, కోడులు వేరు కాపురం ఉంటున్నారు. చిన్న కొడుకు, కోడలితో పాటు కలిసి ఉంటూ మారోణి ఒడుపుగా వ్యవసాయం చేస్తున్నది.
మొదట్లో ఎడ్లబండిపై భర్తతో కలిసి ఊరూరూ తిరిగి చెరకు నరకడం, కొన్నాళ్లు ఊళ్లకు వెళ్లి సీతాఫలాలు, ఉప్పు అమ్మటం అలవాటుగా ఉండేది. భర్తకు కంటి చూపు మందగించటంతో గత కొద్ది ఏళ్లుగా తండాలోనే స్థిరంగా ఉంటూ.. వ్యవసాయం చేస్తున్నారు. దయ్యబండ తండా మహిళా గిరిజన రైతులు పిలుపు స్వచ్ఛంద సంస్థ సహకారంతో సేంద్రియ, శ్రీవరి సాగు పద్ధతులను అలవరచుకొని ముందడుగు వేస్తున్నారు.
పచ్చజొన్న రొట్టె.. గటక..
మారోణి కుటుంబానికి సొంతం రెండెకరాల కుష్కి(మెట్ట), ఒక ఎకరం తరి(మాగాణి) పొలం ఉంది. మరో 3 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. మారోణి ఈ సంవత్సరం పది క్వింటాళ్ల మొక్కజొన్నలు, క్వింటన్నర కందులు, 4 క్వింటాళ్ల పచ్చజొన్నలు పండించింది. ఎన్ని పండినా పచ్చజొన్నలు మాత్రం అమ్మరు. ఇంట్లో పిల్లా పెద్దా అందరూ మూడు పూటలా జొన్న రొట్టె తింటారు. గటక తాగుతారు. ఆరోగ్యంగా ఉంటారు. పొలం పనులు చాలా వరకు సొంతంగానే చేసుకుంటారు.
3 ఎకరాలను కౌలుకు తీసుకున్నారు. ఎకరానికి ఏటా రూ. 10 వేలు కౌలు. బోరులో నీరు తక్కువ ఉండటంతో ఎకరంన్నరలో శ్రీవరి సాగు చేసింది. పంట చేతికి రాబోతుండగా రాళ్లవాన, గాలిదుమారం వచ్చి.. 40 బస్తాల ధాన్యం రాలటంతో.. 30 బస్తాల ధాన్యమే చేతికొచ్చింది. ‘ఎకరంలో పత్తి పెడితే.. పెట్టుబడి తిరిగి రావడమే కష్టమైంది. తమ కష్టం వృథా అయ్యింది. ఆ మేరకు రూ. 20 వేలు నష్టం వచ్చింది. ఈసారి మొక్కజొన్న, కందులు, కొర్రలు, సజ్జలు, శ్రీవరి పెడతా. పత్తి పెట్టేది లేద’ని మారోణి తేల్చి చెప్పారు.
రైతు సంఘాలు.. విత్తన బ్యాంకు..
తండాలో రైతులు 20 మంది చొప్పున రెండు సంఘాలు పెట్టుకున్నారు. బాలాజీ రైతు సంఘం పెట్టుకొని నాలుగేళ్లు అయింది. వీటిల్లో సభ్యులు చాలా వరకు గిరిజన మహిళా రైతులే. మొదట్లో నెలకు తలకు రూ.50 మదుపు చేసేవారు. ఇప్పుడు రూ. 100 జమ చేస్తున్నారు. తొలకరికి రైతుకు రూ. 10 – 20 వేల వరకు అప్పు ఇస్తున్నారు. వందకు నెలకు రూ.1 వడ్డీ. నెలకు రూ.వెయ్యి/రెండు వేలు తిరిగి కట్టేస్తున్నారు.
తోటి మహిళా రైతులతో సంఘం సమావేశం నిర్వహిస్తున్న మారోణి
కాలం సరిగ్గా లేకపోవటమో, పంటలు సరిగ్గా పండకపోయినప్పుడు అప్పు ఎలా కడతారు? అనడిగితే.. ‘అట్లేం లేదు సారూ. ఏదో కష్టం చేస్తం. ఇంటికాడ ఉంటమా. సంఘం పెట్టుకున్న తర్వాత తెలివి వచ్చింది. అటూ ఇటూ మీటింగులకు వెళ్లి రావటం వల్ల విత్తనాలు వచ్చినై. విత్తన బ్యాంకు పెట్టినం. ఇప్పుడు మా దగ్గర తైదలు, కొర్రలు, సజ్జలు, పచ్చజొన్నలు, ఎర్రకందులు, తెల్లకందులు, అన్ని రకాల కూరగాయల విత్తనాలు ఉన్నయి. సంఘం సభ్యులకు కిలో విత్తనాలు ఇస్తే వచ్చే సంవత్సరం రెండు కిలోలు తిరిగి ఇస్తరు.
వేరే ఊరోళ్లకైతే జొన్న విత్తనాలు కిలో రూ. 60కి, కందులు రూ.150కి.. అమ్ముతున్నం.. సంఘం వచ్చినంక జర మంచిగనే ఉంది..’ అంటున్నారు మారోణి. మేలైన, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అలవాటు చేసుకుంటూ అధిక దిగుబడులు సాధించేలా ప్రోత్సహిస్తున్న మారోణిని మా మంచి రాణిగా తోటి రైతులు ప్రశంసిస్తున్నారు. స్వయంగా కౌలు రైతు కూడా అయిన మారోణి కౌలు రైతుల హక్కుల సాధన కోసం పోరాడుతున్నారు. ఇందిరాగాంధీ శ్రమ శక్తి అవార్డును గత ఏడాది మారోణి స్వంతం చే సుకోవడం ఎంతైనా సముచితం.
కౌలు రైతులకు న్యాయం ఎక్కడ?
వరి సాగులో శ్రీ పద్ధతిని అనుసరించడం, అదేవిధంగా అధిక లాభాలు అందించే చిరుధాన్యాలు, కంది వేస్తున్నాను. పంట మార్పిడితో మంచి దిగుబడులు సాధించాను. రసాయన ఎరువుల వాడకం పూర్తిగా తగ్గించి సేంద్రియ వ్యవసాయానికి మొగ్గు చూపడం వల్ల చీడపీడల నుంచి రక్షణతో పాటుగా పంట దిగుబడి నూటికి నూరు శాతం పెరిగింది. వ్యవసాయం, పాడి గేదెల పెంపకం రెండూ లాభసాటిగా ఉన్నాయి. మహిళా రైతులు కూడా మంచి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ ఒకటికి నాలుగు రకాల పంటలు పండిస్తే వ్యవసాయంలో మంచి దిగుబడులు సాధించవచ్చు. అయితే, పంట నష్టపోయినా పరిహారం రావటం లేదు. మా వరి ధాన్యం సగానికి పైగా రాలిపోయింది. అధికారులు వచ్చి రాసుకున్నారు. అయినా రూపాయి రాలేదు. కౌలు రైతులకు గుర్తింపు కార్డు ఇవ్వటం లేదు. ఎకరానికి రూ. 4 వేల పెట్టుబడి సహాయం కూడా ప్రభుత్వం భూమి యజమానికే ఇస్తున్నది. కౌలు రైతులకు న్యాయం జరగటం లేదు.
వాంకుడోతు మారోణి (95530 35321), దయ్యబండ తండా,తుర్కపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా
– టీవీ రమణాకర్, సాక్షి,తుర్కపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment