గోకృపామృత సేద్యం, మెరుగైన ఫలితాలు | Organic Farming Gokrupamruta cultivation better results | Sakshi
Sakshi News home page

గోకృపామృత సేద్యం, మెరుగైన ఫలితాలు

Published Wed, Feb 5 2025 10:24 AM | Last Updated on Wed, Feb 5 2025 10:47 AM

Organic Farming Gokrupamruta cultivation better results

8.5 ఎకరాల్లో పదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు పాపారావు

 గోకృపామృతం, జీవామృతం, కషాయాలతో సేద్యం

ఏడాది మాగిన ధాన్యంతో ఆడించిన బియ్యం, పచ్చి కొమ్ముల పసుపు తదితర ఉత్పత్తుల విక్రయం 

ఇరవై ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్న ఉత్తమ రైతు కరుటూరి  పాపారావు. నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం జైతాపూర్‌ ఆయన స్వగ్రామం. 8 ఎకరాల్లో పదేళ్లుగా పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరి సాగు చేస్తున్నారు. అరెకరంలో వివిధ రకాల పసుపు, పండ్ల మొక్కలు, కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. 2012లో బాసరలో సుభాష్‌  పాలేకర్‌ శిక్షణా శిబిరంలో పాల్గొని స్ఫూర్తి  పొందిన పాపారావు 2015 నుంచి 8.5 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. 

పంట వ్యర్థాలను కాలబెట్టకుండా జనుము, జీలుగతో కలిపి కుళ్లబెట్టి భూమిని సారవంతం చేస్తున్నారు ΄ పాపారావు. తన వ్యవసాయ క్షేత్రంలో 5వేల లీటర్ల ట్యాంకును ఏర్పాటు చేసి బెల్లం, మజ్జిగ, మదర్‌ కల్చర్‌ కలిపి గోకృపామృతం.. దేశీ ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లం, శనగపిండి, పుట్టమట్టి కలిపి జీవామృతం తయారు చేస్తున్నారు. ఈ రెండింటినీ కలిపి పైప్‌లైన్ల ద్వారా పంటలకు అందిస్తున్నారు. పురుగుల నియంత్రణ కోసం వేప కషాయం, పుల్లటి మజ్జిగ, బ్రహ్మాస్త్రం, అగ్ని అస్త్రం, దశపర్ణి కషాయం అవసరాన్ని బట్టి పిచికారీ చేస్తున్నారు.

ఏడాది పాత బియ్యం..
పంట నూర్పిడి అనంతరం నిల్వ,  ప్రాసెసింగ్‌ అంతా సంప్రదాయ పద్ధతులను పాటిస్తూ  పోషక సంపన్న ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెస్తుండటం రైతు  పాపారావు మరో ప్రత్యేకత. వరి పొలం గట్ల మీద కందిని కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే సాగు చేస్తున్నారు. కందులను ఇసుర్రాయితో ఆడించి సహజ విధానంలో పప్పుగా మార్చుతున్నారు. ధాన్యం దిగుబడి రసాయన సాగుతో పోలిస్తే సగమే వస్తోంది. కూలీల అవసరమూ ఎక్కువే. ధాన్యాన్ని బాగా ఆరబెట్టి గన్నీ బ్యాగుల్లో నింపి ఏడాది పాటు నిల్వ చేస్తున్నారు. నిల్వ సమయంలో పురుగు పట్టకుండా ఉండేందుకు వావిలాకు, గానుగ ఆకు, సీతాఫలం ఆకు ధాన్యం బస్తాల వద్ద ఉంచుతున్నారు. ఏడాది దాటిన తరువాత ధాన్యాన్ని ముడి బియ్యం ఆడించి 10 కిలోల సంచుల ద్వారా ప్రజలకు ట్రాన్స్‌పోర్ట్‌ ద్వారా పంపుతున్నారు.

పచ్చి పసుపు ముక్కలు..
పసుపు తవ్విన తరువాత ఉడకబెట్టి, పాలిష్‌ చేసి అమ్మటం సాధారణ పద్ధతి. అలాకాకుండా, పచ్చిగా ఉన్నప్పుడే శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు చేసి, నీడలో ఎండబెట్టి పసుపు పొడిని తయారు చేయిస్తున్నారు. ఉడకబెడితే పోషకాలు తగిపోతాయని ఇలా చేస్తున్నానని అంటున్నారు పాపారావు. నల్ల పసుపు, సేలం, కృష్ణ సేలం రకాల పసుపును సాగు చేస్తున్నారు. మునగాకును నీడలో ఆరబెట్టి ప్యాక్‌ చేసి విక్రయిస్తున్నారు. 

ఆయన 50 రకాలకు పైగా కూరగాయలు, సుగంధ, ఔషధ, పండ్ల రకాలను సేంద్రియ పద్ధతిలో పండిస్తు న్నారు. తాను పండించే పంటలతో  పాటు పప్పులు, బెల్లం, పల్లీలు ఇతర జిల్లాలు, రాష్ట్రాల సేంద్రియ రైతుల నుంచి సేకరించి వాట్సప్‌ ద్వారా విక్రయిస్తున్నారు. పలువురు ప్రకృతి వ్యవసాయదారులను కలుపుకొని వాట్సప్‌లో‘నేచురల్‌ ప్రొడక్ట్స్‌ కన్జ్యూమర్స్‌ గ్రూపు’ ఏర్పాటు చేసుకొని ఆరోగ్యదాయక ఉత్పత్తులను నేరుగా ప్రజలకు అందిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న పాపారావును ప్రభుత్వం నుంచి ఉత్తమ రైతు పురస్కారంతో అనేక ఇతర పురస్కారాలు కూడా అందుకున్నారు. 

ప్రకృతి సాగుకు మరింత తోడ్పాటునివ్వాలి 
అన్ని రకాల పంటలను రైతు పండించి, సంప్రదాయ పద్ధతుల్లో ప్రాసెస్‌ చేసి వినియోగదారుడికి నాణ్యమైన సేంద్రియ ఉత్పత్తులను అందించాలనే లక్ష్యంతో సుభాష్‌ పాలేకర్‌ స్ఫూర్తితో నా వంతు కృషి చేస్తున్నాను. రైతులు అన్ని రకాల పంటలు పండించాలి. అన్ని పనులూ వ్యక్తిగత శ్రద్ధతో చేసుకోవాలి. ప్రతి రైతూ ఈ లక్ష్యంతోనే ముందుకెళ్లాలి. ప్రకృతి సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం మరింత తోడ్పాటు ఇవ్వాలి. 
– కరుటూరి  పాపారావు (96188 11894), 
జైతాపూర్, ఎడపల్లి మండలం, నిజామాబాద్‌ జిల్లా

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement