
లిస్సిమోల్ జె. వడక్కూట్.. దేశవ్యాప్తంగా విశిష్ట గుర్తింపు పొందిన డైనమిక్ వ్యవసాయ అధికారిణి. కేరళ వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖలో సహాయ సంచాలకురాలిగా గత 8 ఏళ్లుగా పనిచేస్తున్నారు. కొచ్చిన్ నగరానికి సమీపంలో అలువి అనే చోట వందేళ్లకు ముందే ఏర్పాటైన ప్రభుత్వ వరి విత్తనోత్పత్తి క్షేత్రం ఉంది. ఎనిమిదేళ్ల క్రితం లిస్సిమోల్ ఈ క్షేత్రం బాధ్యతలు తీసుకునేటప్పటికి దేశంలో ఎవరికీ దీని గురించి తెలీదు.
అయితే, ఆమె అకుంఠిత దీక్షతో పనిచేసి ఈ క్షేత్రానికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టారు. దేశంలోనే తొలి ‘కార్బన్ న్యూట్రల్’ వరి క్షేత్రంగా అలువి సీడ్ ఫామ్‌కు గుర్తింపు దక్కింది. 5.32 హెక్టార్ల ఈ క్షేత్రంలో పూర్తిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటిస్తున్నారు. వరి (ఇక్కడ పండించే వరి రకాల్లో అత్యధికం దేశీ రకాలే)తో పాటు అనేక ఇతర పంటలను సాగుచేస్తూ.. ఒక ఆదర్శ సమీకృత వ్యవసాయ క్షేత్రంగా లిస్సిమోల్ ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దారు.
‘కార్బన్ న్యూట్రల్’ అంటే?
నీటిని నిల్వ గట్టి వరి పంటను సాగు చేస్తే కర్బన ఉద్గారాలు భారీగానే వాతావరణంలోకి విడుదల అవుతున్నాయి. రసాయనిక ఎరువులు, పురుగుమందుల ఉద్గారాలతో పాటు... నీటిని నిల్వగట్టడం వల్ల మిథేన్ వాయువు వాతావరణంలోకి వెలువడుతుంటుంది. అటువంటి పొలం నుంచి విడుదలయ్యే ఉద్గారాలను అనేక పర్యావరణహిత సాగు పద్ధతులను అనుసరించటం ద్వారా అతి తక్కువ స్థాయికి తగ్గించటం మాత్రమే కాకుండా.. అంతకన్నా ఎక్కువ కర్బనాన్ని వాతావరణం నుంచి గ్రహించి భూమిలో స్థిరీకరించే స్థాయికి ఈ ఫామ్‌ను అభివృద్ధి చేయటంలో లిస్సిమోల్ విజయం సాధించారు. 2022 డిసెంబర్‌లో అలువ ఫామ్‌ను ప్రభుత్వం కార్బన్ న్యూట్రల్ ఫామ్‌గా ప్రకటించింది.
170 టన్నుల కర్బనం మిగులు!
కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ‘కాలేజ్ ఆఫ్ క్లైమెట్ ఛేంజ్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్’ (ఇలాంటి కాలేజీ ఒకటి దేశంలో ఇతర రాష్ట్రాల్లో మాటేమో గానీ తెలుగు రాష్ట్రాల్లో అయితే లేదు) ప్రయోగాలు చేసి ఉద్గారాలను శాస్త్రీయంగా లెక్కగట్టింది. తురుత్ ద్వీప ప్రాంతంలో గల ఈ ఫామ్ 43 టన్నుల కర్బనాన్ని వాతావరణంలోకి విడుదల చేస్తుండగా, 213 టన్నుల కర్బనాన్ని వాతావరణం నుంచి గ్రహించి భూమిలో స్థిరీకరిస్తోందని ఈ ప్రయోగాల్లో తేలింది. అంటే.. ఈ క్షేత్రం 170 టన్నుల కార్బన్ క్రెడిట్లను సంపాయించిందన్న మాట. ఇది నిజానికి ‘కార్బన్ పాజిటివ్’ క్షేత్రం!
కేరళ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 13 విత్తనోత్పత్తి క్షేత్రాలు నడుస్తున్నాయి. వీటన్నిటినీ కార్బన్ న్యూట్రల్ ఫామ్స్‌గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యం చేరుకోవటంలో లిస్సిమోల్ విజయం సాధించారు. అంతేకాదు, రాష్ట్రంలోని 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి కార్బన్ న్యూట్రల్ ప్రదర్శనా క్షేత్రాలను నిర్మించే ప్రయత్నమూ జరుగుతోంది.
ఇదీ సమీకృత సేంద్రియ సేద్యం
5.32 హెక్టార్ల ఈ క్షేత్రంలో 3 హెక్టార్లలో వరితో పాటు.. ఒక హెక్టారులో చిరుధాన్యాలు, చియా గింజలు, కొబ్బరి, అరటి, దుంప పంటలు, జాపత్రి, కూరగాయలు, ΄్యాషన్ ఫ్రూట్ తదితర పంటలను సాగు చేస్తున్నారు. 2012 నాటికే ఎన్‌పిఓపి ఆర్గానిక్ సర్టిఫికేషన్ వచ్చింది. 15 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కాసర్‌గోడ్ కల్లన్ రకం దేశీ ఆవులు 9, మలబార్ మేకలు 16, కుట్టనాడన్ బాతులు వంద, నాటు కోళ్లు, గిన్నె కోళ్లు కలిపి 50తో పాటు బ్యాచ్‌కి 5 వేల గిఫ్ట్ తిలాపియా చేపలను సైతం ఈ సమీకృత క్షేత్రంలో పెంచుతున్నారు.
దేశీ వరి రకాలు (జపాన్ వైలెట్, రక్తశాలి, గోల్డెన్ నవార, వెల్లతొండి, వదక్కన్ వెల్లారి కైమ, జైవ, మనురత్న..), అధికోత్పత్తినిచ్చే వరి వంగడాల విత్తనోత్పత్తిని చేపట్టడంతో పాటు లైవ్ రైస్ మ్యూజియంగా ఈ క్షేత్రాన్ని తీర్చిదిద్దారు. పంచగవ్య, జీవామృతం వంటి ఆర్గానిక్ గ్రోత్ ప్రమోటర్ ద్రావణాలతో పాటు చీడపీడలను అరికట్టే కషాయాలను తయారు చేసుకొని పంటలకు వాడటమే కాకుండా రైతులకు విక్రయిస్తున్నారు. వామ్, వర్మీ కం΄ోస్టు, వర్మీవాష్‌ను తయారు చేస్తున్నారు. రెడువీద్ వంటి మిత్రపురుగులను సైతం పెంచుతున్నారు.
తేనెటీగల పెంపకం కూడా ఉంది. పర్యాటకులను సైతం ఆకర్షిస్తున్న ఈ క్షేత్రం నిజంగా విలక్షణమైనదే. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. వరి పొలంలో అనేక సమస్యల పరిష్కారానికి బాతులను ఉపయోగించటం. కలుపు నివారణ, చీడపీడల నియంత్రణతో పాటు భూసారం పెంపొందించడానికి కూడా బాతులు ఉపయోగపడుతున్నాయని లెస్సిమోల్ తెలిపారు. ఇక్కడ అనుసరించే ప్రతి పనినీ శాస్త్రీయంగా రికార్డు చేసి, అధ్యయనం చేసి గణాంకాలను రూపొందించారు. సమీకృత సేంద్రియ వ్యవసాయాన్ని అన్ని హంగులతో సక్రమంగా చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో ఈ క్షేత్రం కళ్లకు కడుతున్నదనటంలో అతిశయోక్తి లేదు!
దేశం నేర్చుకోదగ్గ పాఠాలు
2012 నుంచి సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ఈ క్షేత్రంలో అనుసరిస్తూ పదేళ్లలో ఈ మైలురాయిని దాటాం. హరిత గృహ వాయువుల ఉద్గారాలను తగ్గించే విధంగా వ్యవసాయ పనులను సమూలంగా మార్చాం. ఇలా చేయాల్సిన అవసరం ఏమిటో రైతులు, స్థానిక ప్రజలకు అవగాహన కలిగించేందుకు కృషి చేస్తున్నాం. దేశం యావత్తూ నేర్చుకోదగిన పర్యావరణ హిత సేద్య పాఠాలకు మా క్షేత్రం కేంద్ర బిందువైంది.
– లిస్సిమోల్ జె. వడక్కూట్, సహాయ సంచాలకురాలు, స్టేట్ సీడ్ ఫామ్ అలువి,
ఎర్నాకులం జిల్లా పంచాయత్, కేరళ
Comments
Please login to add a commentAdd a comment