cow dung and urine
-
గోమయం, గోమూత్రంతో : సమాజ హితం కోసం, ప్రకృతికి దగ్గరగా!
‘నా బిడ్డలు ఆరోగ్యంగా జీవించడానికి వారికి నేను ఇలాంటి భూగోళాన్ని ఇస్తున్నానా?’ అని ఆవేదన చెందుతోంది పూజా రాథోడ్. ప్రకృతి మనకు అన్నీ ఇచ్చింది. సహజమైన వనరులతో ప్రకృతి సిద్ధంగా జీవించడానికి మనమెందుకు సిద్ధంగా ఉండడం లేదు... అని ప్రశ్నిస్తున్నారు డాక్టర్ చెన్నమనేని పద్మ. ఇద్దరి ఆవేదనలోని ఆంతర్యం ఒక్కటే. భూమి చల్లగా ఉంటే మన జీవితాలు ఆనందంగా గడుస్తాయని. భూమాతకు ఎదురవుతున్న పరీక్షలకు సమాధానంగా ఇద్దరూ అనుసరిస్తున్న మార్గం ఒక్కటే. ఒకరిది రాజస్థాన్ రాష్ట్రం, మరొకరిది తెలంగాణ. పర్యావరణం పట్ల వారికి ఉన్న స్పృహ ఒకరితో మరొకరికి పరిచయం లేకపోయినా, ఆలోచనలను పంచుకోకపోయినా... వారిని ఒక దారిలో నడిపిస్తున్నది మాత్రం భూమాత గురించిన శ్రద్ధ, ఆరోగ్యకరమైన జీవనం పట్ల ఆసక్తి మాత్రమే. పూజారాధోడ్ చిత్రకారిణి. పటం మీద బొమ్మలు చిత్రిస్తారు. డాక్టర్ పద్మ ఇంటి అలంకరణ వస్తువులు, బొమ్మలు చేస్తారు. ఇద్దరూ తమ కళకు ముడిసరుకుగా ఉపయోగిస్తున్నది ప్రకృతి ప్రసాదాలను మాత్రమే. ఎర్ర మట్టి, రంపపు పొట్టు, మొక్కజొన్న పీచు, బొగ్గు, గోరింటాకు, ఆవు పేడ, గులకరాళ్లు, పూలు, వంటల్లో ఉపయోగించే పిండి...వీటికి పూజ క్రియేటివిటీ తోడైతే అద్భుతమైన వాల్ పెయింటింగ్ తయారవుతుంది. పద్మచేతిలో ఆవు పేడ గణపతి, లక్ష్మీదేవి రూపాలవుతుంది.పూజా రాథోడ్...జైపూర్‌లోని ఐఐఎస్యూలో విజువల్ ఆర్ట్స్‌లో కోర్సు చేసి, ‘స్టూడియో ద సాయిల్’ పేరుతో ఆర్ట్ స్టూడియో స్థాపించింది.డాక్టర్ చెన్నమనేని పద్మ... హైదరాబాద్‌లోని వనిత మహావిద్యాలయలో తెలుగు ప్రొఫెసర్‌గా రిటైరయ్యారు. తన విద్యార్థులకు ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలను గమనించిన తర్వాత వాటి పరిష్కారం కోసం చేసిన అన్వేషణ ఇలా సహజ జీవనశైలి, జీవనశైలిలో ఆవు పాత్ర తెలిసి వచ్చాయంటున్నారు. ఒక మనిషి నిద్ర లేచిన తర్వాత పళ్లు తోముకోవడం నుంచి రాత్రి పడుకునే ముందు దోమలను పారదోలడానికి ఉపయోగించే మస్కిటో కాయిల్ వరకు రోజు మొత్తంలో ఉపయోగించే అనేక వస్తువులను గోమయం, గోమూత్రంతో తయారు చేసి చూపిస్తున్నారు. వాటి తయారీలో శిక్షణనిస్తున్నారు. ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్, హ్యాండ్ మేడ్ సోప్స్, కీ హోల్డర్స్, ధూప్ స్టిక్స్, జపమాల, వాకిలి తోరణాలు... ఇలా రకరకాల వస్తువులు తయారు చేస్తోందామె.సస్టెయినబుల్ లైఫ్ స్టైల్ పట్ల సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి తన రిటైర్మెంట్ జీవితాన్ని అంకితం చేసినట్లు చెప్పారు పద్మ. ఆవును బతికించుకుంటే క్యాన్సర్ రహిత సమాజాన్ని సాధించవచ్చని నిరూపించాలనేది ఆమె ఆశయం. ఇందుకు ఆవును పెంచుకోమని బోధించడం వల్ల ప్రయోజనం లేదని గ్రహించిన తర్వాత స్వయంగా రెండు వందల గోవుల సంరక్షణ బాధ్యతను స్వీకరించారు. అందుకోసం హైదరాబాద్ నగరాన్ని వదిలి జగిత్యాల జిల్లాలోని సొంతూరు బోర్నపల్లికి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు పద్మ. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం తన గ్రామం నుంచే మొదలుపెట్టారు. ఇదీ చదవండి: కళ్లు చెదిరే ఇన్‌స్టా రీల్ : 55.4 కోట్లతో రికార్డులు బద్దలుసహజ సిద్ధంగా...ఆవు తనకు చేతులెత్తి మొక్కమని చెప్పదు. తనను ఉపయోగించుకుని ఆరోగ్యంగా జీవించమని కోరుతుంది. అందుకే ఆవును అమ్మతో సమానం అని చెబుతారు. ఆవుతో వచ్చే ఆరోగ్యం గురించి చెప్పడానికి మాటలు చాలవు. ఆవును ఎన్ని రకాలుగా మన దైనందిన జీవితంలో భాగం చేసుకోవచ్చో తెలియచేయడానికి నెలకు ఐదువందల రూ΄ాయలకు ఒక కిట్ తయారు చేశాను. అందులో ఇంటిని శుభ్రం చేసుకునే క్లీనింగ్ మెటీరియల్ నుంచి దేహాన్ని శుభ్రం చేసుకునే వస్తువుల వరకు అన్నీ ఉన్నాయి. రసాయన రహితమైన, ప్రకృతి సహజమైన జీవన విధానాన్ని ప్రోత్సహించడం కోసం నా ప్రయత్నం కొనసాగుతోంది. క్యాన్సర్‌ను దూరంగా ఉంచాలంటే మనం ప్రకృతికి దగ్గరగా జీవించాలి. నేలను భద్రంగా ఉంచుకోవాలి. రసాయనాలతో నేల కాలుష్యం, నీరు కాలుష్యం కావడంతో మన దేహమూ కాలుష్య కాసారమవుతోంది. క్యాన్సర్‌కు ఆహ్వానం పలుకుతోంది. ఈ దుస్థితి నుంచి మనం బయటపడాలి. – డాక్టర్ చెన్నమనేని పద్మ, విశ్రాంత ఆచార్యులు, సామాజిక కార్యకర్త ఇదీ చదవండి: మార్కెట్లో విరివిగా పచ్చి బఠాణీ : పిల్లలుమెచ్చే, ఆరోగ్యకరమైన వంటకాలు – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఆవు పేడతో తగ్గుతున్న కరోనా, ఆందోళనలో డాక్టర్లు?
గాంధీ నగర్ : ఆవుపేడ ఒంటికి రాసుకుంటే కరోనా తగ్గుతుందని చాలా మంది నమ్ముతున్నారు. కానీ అలా చేస్తే మొదటికే మోసం వస్తుందని, కరోనాతో పాటు ఇతర వ్యాధులు సోకే ప్రమాదం ఉందని డాక్టర్లు ఆందోళన. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విలయం తాండవం చేస్తోంది. ఆస్పత్రుల్లో బెడ్లు లేక, ఆక్సిజన్ కొరత కారణంగా ఇప్పటి వరకు 2,26,62,575 మందికి కరోనా సోకగా 2,49,992 మరణించారు. అయితే ఈ మరణాల సంఖ్య ఐదు నుంచి 10 రెట్లు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే అహ్మదాబాద్ రాష్ట్ర ప్రజలు ఒంటికి ఆవు పేడ పూసుకుంటే కరోనా తగ్గిపోతుందని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని గోశాలలకు క్యూ కడుతున్నారు.ఈ ఆచారంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జెఎ జయలాల్ ఆవుపేడ తో వ్యాధినిరోధక శక్తి పెరిగిపోతుందని ఎలాంటి ఆధారాలు లేవన్నారు. 'నాకు గతేడాది కరోనా సోకింది. రుషులు నిర్వహిస్తున్న శ్రీస్వామినారాయాణ గురుకుల్ విశ్వవిద్యాలయంలో ఆవుపేడతో కరోనా తగ్గుతుందని నా సన్నిహితులు చెబితే నేనూ అదే చేశాను.నాకు కోవిడ్ తగ్గిపోయింది అంటూ ఫార్మా కంపెనీ అసోసియేట్ మేనేజర్ గౌతమ్ మనీలాల్ బోరిసా' తన అభిప్రాయం వ్యక్తం చేశారు. నేను ఇదే ఆశ్రమంలో చాలామంది డాక్టర్లును చూశాను. వాళ్లు కూడా ఆవుపేడతో కరోనా తగ్గుతుందని నమ్ముతున్నారని చెప్పారు. కరోనా బాధితులు శ్రీస్వామినారాయాణ గురుకుల్ విశ్వవిద్యాలయంలో దొరికే ఆవుపేడను ఒంటికి అప్లయ్ చేసుకుంటారు. ఆ పేడ ఎండిపోయే వరకు అలాగే ఉంటారు. కొంతమంది ఆవుల్ని కౌగిలించుకుంటారు. అలా కౌగిలించుకోవడం వల్ల ఇమ్యూనిటీ లెవల్స్ పెరుగుతాయని వారి నమ్మకం. ఆ తర్వాత ఆశ్రమంలో దొరికే పాలు, లేదంటే మజ్జిగతో శరీరాన్ని శుభ్రం చేసుకుంటారని మనీలాల్ బోరిసా తెలిపారు. చదవండి : చేతులెత్తేసిన కేంద్రం, వలస కార్మికులకు నో ఫ్రీ రేషన్ -
అమెజాన్‌లో ఆవు పేడ సబ్బులు, మోదీ కుర్తాలు
ఆగ్రా : ఆవు పేడ సబ్బులు, మోదీ, యోగి కుర్తాలు ఎవరికైనా కావాలా? అయితే అవి ఇక నుంచి ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో దొరుకుతాయట. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు చెందిన ఫార్మసీ, ఆవు పేడతో తయారు చేసిన డజన్ల కొద్దీ సహజ సౌందర్య, ఔషధ ఉత్పత్తులను అమెజాన్‌లోకి తీసుకొస్తుంది. ఆవు పేడ సబ్బుతో పాటు, మోదీ, యోగికి చెందిన కుర్తాలను కూడా వినియోగదారులకు అందిస్తుంది. దీన్ దయాల్ ధమ్ అనే సెంటర్‌ను ఆర్ఎస్ఎస్ మథురాలో నిర్వహిస్తోంది. ఇది తొలుత 30 వ్యక్తిగత సంరక్షణ ప్రొడక్ట్‌లను, థెరఫెటిక్ ఉత్పత్తులను విక్రయించనుంది. వాటితో పాటు 10 స్టయిల్స్‌లో దుస్తులను డిజైన్ చేసి ఆన్‌లైన్‌గా అందించనుంది. తమ ఉత్పత్తులను ఆన్‌లైన్‌గా అందించే ముఖ్య ఉద్దేశ్యం, స్థానికంగా ఎక్కువ ఉద్యోగులను సృష్టించడమని, వారిని ఆర్థికంగా స్వతంత్రులను చేయడమని ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధి అరుణ్ కుమార్ చెప్పారు. ఆన్‌లైన్‌గా విక్రయాలు ప్రారంభమైతే, ఉత్పత్తి, ఉద్యోగాలు పెరుగుతాయన్నారు. లక్షకు పైగా వ్యక్తిగత సంరక్షణ, మెడికల్ ఉత్పత్తులను, దుస్తులను దీన్ దయాల్ ధమ్ విక్రయించనుంది. వీటి విలువ ప్రతి నెల రూ.3 లక్షలకు పైననే ఉండనుంది. తమ కామధేను లైన్లో ఆవు మూత్రం, కుర్తాలను, ఇతర ఖాదీ ఉత్పత్తులను త్వరలోనే అమెజాన్‌లో అందుబాటులోకి తెస్తామని దీన్ దయాల్ ధమ్ డిప్యూటీ సెక్రటరీ మనీష్ గుప్తా చెప్పారు. గన్వటి, తులసి, ఉసిరి, మిరియాలు, మధుమేహం, ఊబకాయం కోసం కామధేను మధునాశక్ చుర్, హారతీలు, షాంపులు, బాత్ షోపులు, ఫేస్ ప్యాక్, టూత్‌పేస్ట్ వంటి ఉత్పత్తులను అందించబోతుంది. తమ సోపులకు, ఫేస్‌ప్యాక్‌లకు ఆవు మూత్రం, ఆవు పేడ ప్రధానమైన పదార్థాలుగా వాడినట్టు మనీష్ తెలిపారు. ప్రస్తుతం 10 మంది వర్కర్లతో, 90 ఆవులు, దూడలతో ఈ ఫార్మసీ పనిచేస్తుంది. ఇప్పటి వరకు తయారు చేసిన ఉత్పత్తులను దీన్ దయాల్ ధమ్ లేదా ఆర్ఎస్ఎస్ క్యాంపుల్లోనే విక్రయించేవారు. ఇక నుంచి వీటిని అమెజాన్ ద్వారా కూడా అందించబోతున్నారు. ఆన్లైన్ కస్టమర్లలో ఆవు మూత్ర ఉత్పత్తులకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని, ఇదే ఉత్పత్తిని పెంచుతుందని ధమ్ డైరెక్టర్ రాజేంద్ర చెప్పారు. ధమ్కు చెందిన అన్ని ఉత్పత్తులు 10 రూపాయల నుంచి 230 రూపాయల మధ్యలోనే అందించనున్నట్టు పేర్కొన్నారు. మోదీ, యోగి కుర్తాలు కూడా ఒక్క పీస్ రూ.220నేనని తెలిపారు. వైట్, గ్రే, పింక్ రంగుల్లో ఇవి అందుబాటులో ఉండనున్నాయి. వీటిని కూడా 50 మంది వర్కర్లే తయారు చేస్తున్నారు. వారిలో ఎక్కువగా మహిళలే ఉన్నారు. రెండు జతల ట్రౌజర్లు కుడితే రోజుకు రూ.120 ఆర్జించవచ్చు. -
గోమూత్రం, గోమయంతో నాగా సాధువుల హోలీ
హోలీని ఒక్కొక్కరు ఒక్కోలా జరుపుకొంటున్నారు. ఉజ్జయినిలోని అఖాడాలకు చెందిన నాగా సాధువులు గోమూత్రం, గోమయాలతో ఈ పండుగను జరుపుకొన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. శైవ, వైష్ణవ సాధువులు గో మూత్రాన్ని, గోమయాన్ని కలిపి వాటిని ఒకరిపై ఒకరు పోసుకున్నారు. ఆ సమయంలో ఆధ్యాత్మిక నినాదాలు చేసుకున్నట్లు ఆలిండియా అఖాడా పరిషత్ సభ్యులు తెలిపారు. ఏప్రిల్ 22 నుంచి సింహస్త ఉత్సవం ప్రారంభం కానుంది. దాంతో ఇప్పటికే భారీ సంఖ్యలో సాధువులు ఉజ్జయినికి చేరుకున్నారు. ఆవుపేడ అత్యంత పవిత్రమైనదని, అది కృష్ణుడికి కూడా ఇష్టమని అఖిల భారతీయ అఖాడా పరిషత్ (ఏబీఏపీ) అద్యక్షుడు మహంత్ నరేంద్రగిరి చెప్పారు. సాధువులు వివిధ కార్యక్రమాలలో గోమూత్రం, గోమయాలను ఉపయోగిస్తూనే ఉన్నారన్నారు. దేశంలోని 13 అఖాడాలతో కూడిన అఖాడా పరిషత్‌కు నిరంజనీ అఖాడాకు చెందిన మహంత్ నరేంద్రగిరి అధ్యక్షత వహిస్తున్నారు. కుంభమేళా సమయంలో కూడా సాధువులు గోమయాన్ని, మూత్రాన్ని ఉపయోగించి గణేశుడి ఆశీస్సులు తీసుకుంటారని జూనా అఖాడాకు చెందిన మహంత్ హరిగిరి చెప్పారు. అన్ని సందర్భాల్లోనూ దేవుడి విగ్రహాలను ఉపయోగించలేమని, అందువల్ల కొన్నిసార్లు గోమయాన్ని గణేశుడికి ప్రతిరూపంగా భావిస్తారని ఆయన తెలిపారు. ఇక గోమయంతో కలిసిన గోమూత్రం మంచి మందు అని, ఇది యాంటీసెప్టిక్‌గాను, ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి ఉపయోగపడుతుందని మహంత్ రాజేంద్ర దాస్ జీ అన్నారు.