‘నా బిడ్డలు ఆరోగ్యంగా జీవించడానికి వారికి నేను ఇలాంటి భూగోళాన్ని ఇస్తున్నానా?’ అని ఆవేదన చెందుతోంది పూజా రాథోడ్.
ప్రకృతి మనకు అన్నీ ఇచ్చింది. సహజమైన వనరులతో ప్రకృతి సిద్ధంగా జీవించడానికి మనమెందుకు సిద్ధంగా ఉండడం లేదు... అని ప్రశ్నిస్తున్నారు డాక్టర్ చెన్నమనేని పద్మ.
ఇద్దరి ఆవేదనలోని ఆంతర్యం ఒక్కటే. భూమి చల్లగా ఉంటే మన జీవితాలు ఆనందంగా గడుస్తాయని. భూమాతకు ఎదురవుతున్న పరీక్షలకు సమాధానంగా ఇద్దరూ అనుసరిస్తున్న మార్గం ఒక్కటే. ఒకరిది రాజస్థాన్ రాష్ట్రం, మరొకరిది తెలంగాణ. పర్యావరణం పట్ల వారికి ఉన్న స్పృహ ఒకరితో మరొకరికి పరిచయం లేకపోయినా, ఆలోచనలను పంచుకోకపోయినా... వారిని ఒక దారిలో నడిపిస్తున్నది మాత్రం భూమాత గురించిన శ్రద్ధ, ఆరోగ్యకరమైన జీవనం పట్ల ఆసక్తి మాత్రమే.
పూజారాధోడ్ చిత్రకారిణి. పటం మీద బొమ్మలు చిత్రిస్తారు. డాక్టర్ పద్మ ఇంటి అలంకరణ వస్తువులు, బొమ్మలు చేస్తారు. ఇద్దరూ తమ కళకు ముడిసరుకుగా ఉపయోగిస్తున్నది ప్రకృతి ప్రసాదాలను మాత్రమే. ఎర్ర మట్టి, రంపపు పొట్టు, మొక్కజొన్న పీచు, బొగ్గు, గోరింటాకు, ఆవు పేడ, గులకరాళ్లు, పూలు, వంటల్లో ఉపయోగించే పిండి...వీటికి పూజ క్రియేటివిటీ తోడైతే అద్భుతమైన వాల్ పెయింటింగ్ తయారవుతుంది. పద్మచేతిలో ఆవు పేడ గణపతి, లక్ష్మీదేవి రూపాలవుతుంది.
పూజా రాథోడ్...జైపూర్‌లోని ఐఐఎస్‌యూలో విజువల్ ఆర్ట్స్‌లో కోర్సు చేసి, ‘స్టూడియో ద సాయిల్’ పేరుతో ఆర్ట్ స్టూడియో స్థాపించింది.
డాక్టర్ చెన్నమనేని పద్మ... హైదరాబాద్‌లోని వనిత మహావిద్యాలయలో తెలుగు ప్రొఫెసర్‌గా రిటైరయ్యారు. తన విద్యార్థులకు ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలను గమనించిన తర్వాత వాటి పరిష్కారం కోసం చేసిన అన్వేషణ ఇలా సహజ జీవనశైలి, జీవనశైలిలో ఆవు పాత్ర తెలిసి వచ్చాయంటున్నారు. ఒక మనిషి నిద్ర లేచిన తర్వాత పళ్లు తోముకోవడం నుంచి రాత్రి పడుకునే ముందు దోమలను పారదోలడానికి ఉపయోగించే మస్కిటో కాయిల్ వరకు రోజు మొత్తంలో ఉపయోగించే అనేక వస్తువులను గోమయం, గోమూత్రంతో తయారు చేసి చూపిస్తున్నారు. వాటి తయారీలో శిక్షణనిస్తున్నారు. ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్, హ్యాండ్ మేడ్ సోప్స్, కీ హోల్డర్స్, ధూప్ స్టిక్స్, జపమాల, వాకిలి తోరణాలు... ఇలా రకరకాల వస్తువులు తయారు చేస్తోందామె.
సస్టెయినబుల్ లైఫ్ స్టైల్ పట్ల సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి తన రిటైర్‌మెంట్ జీవితాన్ని అంకితం చేసినట్లు చెప్పారు పద్మ. ఆవును బతికించుకుంటే క్యాన్సర్ రహిత సమాజాన్ని సాధించవచ్చని నిరూపించాలనేది ఆమె ఆశయం. ఇందుకు ఆవును పెంచుకోమని బోధించడం వల్ల ప్రయోజనం లేదని గ్రహించిన తర్వాత స్వయంగా రెండు వందల గోవుల సంరక్షణ బాధ్యతను స్వీకరించారు. అందుకోసం హైదరాబాద్ నగరాన్ని వదిలి జగిత్యాల జిల్లాలోని సొంతూరు బోర్నపల్లికి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు పద్మ. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం తన గ్రామం నుంచే మొదలుపెట్టారు.
ఇదీ చదవండి: కళ్లు చెదిరే ఇన్‌స్టా రీల్ : 55.4 కోట్లతో రికార్డులు బద్దలు
సహజ సిద్ధంగా...
ఆవు తనకు చేతులెత్తి మొక్కమని చెప్పదు. తనను ఉపయోగించుకుని ఆరోగ్యంగా జీవించమని కోరుతుంది. అందుకే ఆవును అమ్మతో సమానం అని చెబుతారు. ఆవుతో వచ్చే ఆరోగ్యం గురించి చెప్పడానికి మాటలు చాలవు. ఆవును ఎన్ని రకాలుగా మన దైనందిన జీవితంలో భాగం చేసుకోవచ్చో తెలియచేయడానికి నెలకు ఐదువందల రూ΄ాయలకు ఒక కిట్ తయారు చేశాను. అందులో ఇంటిని శుభ్రం చేసుకునే క్లీనింగ్ మెటీరియల్ నుంచి దేహాన్ని శుభ్రం చేసుకునే వస్తువుల వరకు అన్నీ ఉన్నాయి. రసాయన రహితమైన, ప్రకృతి సహజమైన జీవన విధానాన్ని ప్రోత్సహించడం కోసం నా ప్రయత్నం కొనసాగుతోంది. క్యాన్సర్‌ను దూరంగా ఉంచాలంటే మనం ప్రకృతికి దగ్గరగా జీవించాలి. నేలను భద్రంగా ఉంచుకోవాలి. రసాయనాలతో నేల కాలుష్యం, నీరు కాలుష్యం కావడంతో మన దేహమూ కాలుష్య కాసారమవుతోంది. క్యాన్సర్‌కు ఆహ్వానం పలుకుతోంది. ఈ దుస్థితి నుంచి మనం బయటపడాలి. – డాక్టర్ చెన్నమనేని పద్మ, విశ్రాంత ఆచార్యులు, సామాజిక కార్యకర్త
ఇదీ చదవండి: మార్కెట్లో విరివిగా పచ్చి బఠాణీ : పిల్లలుమెచ్చే, ఆరోగ్యకరమైన వంటకాలు
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment