
‘ఎవరైనా సరే బతకడానికి ఉద్యోగం చేస్తారు. చావడానికి కాదు’ అని ఎంతోమంది అన్నలక్ష్మితో అనేవారు. ఇంతకీ ఆమె చేస్తున్న ఉద్యోగం ఏమిటి? కేరళలోని చిన్నార్ అభయారణ్యంలో ఉన్న మారుమూల గిరిజన గ్రామం తయ్యన్నన్‌కుడిలోని ఏకైక అంగన్‌వాడీలో ఆమె ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది.
అన్నలక్ష్మి ఉద్యోగ జీవితం రిస్క్, సాహసంతో కూడుకున్నది. వారం రోజుల క్రితం అటవీమార్గంలో జనావాసాలకు వచ్చిన అడవి ఏనుగు నుంచి తృటిలో తప్పించుకుంది. కొన్ని రోజుల క్రితం అదే ఏనుగు ఒక గిరిజనుడిని తొక్కి చంపేసింది. అయినప్పటికీ అన్నలక్ష్మి ఎప్పుడూ భయపడలేదు.
విద్యార్థుల దగ్గరికి వెళ్లడానికి గత పదిహేడు సంవత్సరాలుగా మొబైల్ నెట్వర్క్ కనెక్టివిటీ లేని అడవి మార్గం గుండా ప్రయాణం చేస్తూనే ఉంది. ప్రయాణ మార్గంలో జంతువుల అడుగు జాడలు కనిపిస్తే తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అడవి ఏనుగులు వెంబడించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సమయంలో పెద్ద పెద్ద రాళ్లు, చెట్ల వెనుక దాక్కొని తప్పించుకుంది.
38 ఏళ్ల అన్నలక్ష్మి జీవితంలో అరణ్యం, గిరిజన తెగలు భాగం అయ్యాయి. స్థానిక ముత్తువన్ భాషను అనర్గళంగా మాట్లాడే అన్నలక్ష్మి గిరిజన ప్రజలకు ప్రియమైన ఉపాధ్యాయురాలు.
‘పిల్లలు ఇంట్లో కంటే టీచర్ దగ్గర ఉండడానికే ఇష్టపడతారు’ అంటుంది ఒక గిరిజన తల్లి.
‘ఉద్యోగ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా పిల్లల అమాయక ముఖాలను గుర్తు తెచ్చుకుంటే ఎంతో శక్తి వస్తుంది. నా వృత్తి జీవితానికి వారే వెలుగు’ అంటుంది అన్నలక్ష్మి.