tribal children
-
గిరిజన పిల్లలకు నాణ్యమైన విద్య
కన్నాయిగూడెం: దట్టమైన అడవుల్లో జీవిస్తూ విద్య కు దూరంగా ఉంటున్న గిరిజన పిల్లలకు నాణ్య మైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం కంతనపల్లి గ్రామ పంచాయతీ పరిధి బంగారుపల్లి గ్రామంలో రూ.13.50 లక్షలతో నిర్మించిన కంటైనర్ ప్రభుత్వ పాఠశాల భవనాన్ని మంగళవారం మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, కలెక్టర్ దివాకరతో కలిసి మంత్రి ప్రారంభించారు.అనంతరం సీతక్క మాట్లాడుతూ, అటవీ గ్రామాల్లో పాఠశాలలకు శాశ్వత భవనాలు ఏర్పాటు చేయడానికి కేంద్ర అటవీశాఖ అభ్యంతరాలతో విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కన్నాయిగూడెం మండలంలో కంటైనర్ భవనం నిర్మించినట్లు తెలిపారు. గత పదేళ్లకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యను నాశనం చేసిందని ఆమె ఆరోపించారు. -
Paital Gagan: బట్టల తాత వచ్చాడోచ్
ఒరిస్సాలో ఏదో ఒక ఉదయం ఏదో ఒక మారుమూల పల్లెలో వ్యాన్ ఆగుతుంది. దానిని చూసిన వెంటనే పిల్లల కళ్లల్లో వెలుగు. కటిక దారిద్య్రం వల్ల చలికాలమైనా వానాకాలమైనా ఒంటి నిండా బట్టలు లేని వారికి గగన్ బట్టలు పంచుతాడు. రిటైర్డ్ ఉద్యోగి అయిన పెయిటల్ గగన్ తన భార్యతో కలిసి ఊరూరా తిరిగి బట్టలు సేకరించి పంచుతాడు. పిల్లల పసినవ్వును ఆశీర్వాదంగా పొందుతాడు. సంఘటనలు అందరికీ ఎదురవుతుంటాయి. కొందరు స్పందిస్తారు. కొందరు స్పందించరు. కొందరు ఆ సంఘటనలతో తమ లక్ష్యాన్ని, కర్తవ్యాన్ని తెలుసుకుంటారు. అలాంటి వారు ఆదర్శంగా నిలుస్తారు. పదేళ్ల క్రితం– భువనేశ్వర్‌లో చిన్న పోస్టల్ ఉద్యోగైన గగన్ పెయిటల్ ఇంటికి వెళుతున్నాడు. అతనికి వాణి విహార్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక దిక్కులేని మహిళ కనిపించింది. ఆమె చిరిగిన చీర కట్టుకుని ఉంది. గగన్ ఆమెను చూసి జాలిపడి హోటల్ నుంచి ఫుడ్ ప్యాకెట్ తెచ్చి ఇచ్చాడు. కాని ఆమె ‘అన్నం వద్దు. ముందు ఒక చీర ఇవ్వండి’ అని ప్రాధేయపడింది. స్త్రీగా ఆమె అవస్థ గమనించిన గగన్ వెంటనే ఇంటికి వెళ్లి తన తల్లి పాత చీర తెచ్చి ఇచ్చాడు. ‘దానిని అందుకుంటూ ఆమె ముఖంలో కనిపించిన సంతోషం అంతా ఇంతా కాదు. ఒంటికి తగిన బట్ట ఉంటేనే మనిషికి మర్యాద. అది లేని వారు ఈ దేశంలో ఎందరో ఉన్నారు. వారి కోసం ఏదైనా చేయాలి అని నిశ్చయించుకున్నాను’ అంటాడు గగన్. ఉద్యోగంలో ఉండగా మొదలుపెట్టిన ఈ పనిని రిటైరయ్యాక కూడా కొనసాగిస్తున్నాడు. చిన్న ఉద్యోగి అయినా పోస్టాఫీసులో చిరుద్యోగిగా పని చేసి రిటైరైన గగన్ భువనేశ్వర్‌లో చకైసియాని ప్రాంతంలో నివసిస్తాడు. కొడుకు మృత్యుంజయ బలిగూడ అనే ఊళ్లో క్యాబ్ డ్రైవర్. కోడలు టీచర్‌గా పని చేస్తున్నది. ఇతర బాదరబందీలు లేని గగన్ తన భార్య అన్నపూర్ణకు తన ఆలోచన చెప్పాడు. ‘మనం అందరికీ కొత్త బట్టలు ఇవ్వలేం. అలాగని అన్నేసి పాత బట్టలూ ఉండవు. కాబట్టి సేకరించి పంచుదాం’ అన్నాడు. అన్నపూర్ణ అతనికి సహరించడానికి అంగీకరించింది. ఆ రోజు నుంచి గగన్ తనకు ఖాళీ ఉన్నప్పుడల్లా భువనేశ్వర్‌లోని అపార్ట్మెంట్లకూ హౌసింగ్ కాలనీలకు తిరిగి వాడిన దుస్తులను సేకరిస్తాడు. అవసరమైతే కటక్ వంటి ఇతర పట్టణాలకు కూడా వెళతాడు. ‘పేదలకు పంచుతాం. మీరు ఉపయోగించక పడేసిన దుస్తులు ఇవ్వండి’ అంటే చాలామంది ఇస్తారు. వాటిని తీసుకొస్తాడు గగన్. సరి చేసి, ఇస్త్రీ చేసి ‘మనం బట్టలు పంచినా అవి సరిగ్గా ఉండాలి. మావారు తెచ్చిన బట్టలు ఏవైనా చిరిగి ఉంటే కుట్టి, ఇస్త్రీ చేసి, స్త్రీలవి, పురుషులవి, పిల్లలవి విడివిడిగా ప్యాక్ చేసి కొత్తవిగా కనిపించేలా చేస్తాను’ అంటుంది గగన్ భార్య అన్నపూర్ణ. వాళ్లుండేది చిన్న ఇల్లే అయినా ఒక గది ఖాళీ చేసి పూర్తిగా గోడౌన్‌గా వదిలారు. భార్యాభర్తలిద్దరూ డాబా మీదకు చేరి వాటిని విభజించి మూటలుగా కడతారు. ఆ తర్వాత గగన్ తీసుకెళ్లి పంచుతాడు. బట్టలు, బూట్లు, దోమతెరలు గగన్ ముఖ్యంగా చిన్నపిల్లల కోసం బట్టలు సేకరిస్తాడు. ఒడిసాలో గిరిజన పిల్లలకు సరైన బట్టలు ఉండవు. కొండ ప్రాంతాలకు వెళ్లి వారి బాగోగులు ఎవరూ చూడరు. గగన్ అలాంటి పిల్లల కోసం బట్టలు సేకరించి పంచుతాడు. గగన్ సేవా భావం గమనించిన దాతలు అతనికో వ్యాన్ ఏర్పాటు చేశారు. గగన్‌కు ఏనుగంత బలం వచ్చింది. తాను సేకరించిన బట్టలను వ్యాన్‌లో వేసుకుని మారుమూల పల్లెలకు వెళ్లి పిల్లలకు పంచుతాడు. దోమలు కుట్టి పసికందులు రోగాల బారిన పడకుండా దోమతెరలు పంచుతాడు. బొమ్మలు ఇస్తాడు. పిల్లలు ఎంతో సంతోషంగా వాటిని స్వీకరిస్తారు. బట్టల తాత అని పిలుస్తారు. పండుగల ముందు ఒడిసాలో చేసుకునే పండగల ముందు చాలా శ్రమించి బట్టలు సేకరిస్తాడు గగన్. పేదలు పండగ సమయంలో వీలైనంత మంచి బట్టలు వేసుకోవాలని ఆ సమయాలలో ప్రత్యేకంగా తీసుకెళ్లి పంచుతాడు. అంతేకాదు పూరి జగన్నాథ రథ యాత్ర సమయంలోనూ, కటక్ దుర్గా పూజకూ ఎక్కడెక్కడి పేదవారో వస్తారు. అక్కడ ప్రత్యేకంగా స్టాల్స్ పెట్టి మరీ పాత బట్టలు పంచుతాడు. ఈ దేశంలో ప్రతి పేదవాళ్లకి ఒంటినిండా బట్ట దొరికే దాకా గగన్ లాంటి వాళ్లు వందలుగా పని చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వారుగా ఎవరైనా ఉండొచ్చు. ప్రయత్నించాలి... కొద్దిగా మనసు పెట్టాలి అంతే. -
అడవిని చేరిన అక్షరం
ఎస్ఎస్ తాడ్వాయి: ఆ యువకులిద్దరూ అడవిలోనే పుట్టారు. ఆ ప్రాంత పిల్లలకు చదువు ఎంత దూరమో, చదువుకోవాలంటే ఎన్ని కష్టాలు పడాలో వారికి తెలుసు. విద్యతోనే తమవారి జీవితాల్లో గణనీయమైన మార్పు వస్తుందని గట్టిగా నమ్మారు. గిరిజన గూడేల్లోనే పెరిగి ఇప్పుడు ఉన్నత చదువుల్లో ఉన్న ఆ ఇద్దరు.. తామే చదువును ఆ ప్రాంతానికి తీసుకెళ్లారు. గిరిజన గూడేలను దత్తత తీసుకుని సొంతంగా పాఠశాలలను నడిపిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి పదేళ్ల క్రితం వలస వచ్చి అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీ పిల్లలకు ఉచితంగా అక్షరాలు నేర్పిస్తున్నారు. వీరికి కొందరు దాతలు చేయూతనిస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామానికి చెందిన ఇస్రం సంతోష్ ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం చదువుతున్నాడు. అదే యూనివర్సిటీలో జర్నలిజం పూర్తిచేసిన రేగొండ మండలం చల్లగరిగే గ్రామానికి చెందిన దూడపాక నరేష్‌లు కలిసి గొత్తికోయగూడేల్లోని పిల్లల్లో అక్షరజ్ఞానం పెంపొందించేందుకు ముందడుగు వేశారు. చదువుతో పాటు ఆట పాటలు అటవీ ప్రాంతంలోని నీలంతోగు, ముసులమ్మపేట, సారలమ్మ గుంపు, కాల్వపల్లి గొత్తికోయ గూడేల్లో ‘భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్’ పేరుతో ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా వెంకటాపురం మండలం బడ్లపాడు గొత్తికోయగూడెంలో మరో పాఠశాల నడుపుతున్నారు. పిల్లలకు చదువు చెప్పేందుకు ప్రైవేటు టీచర్లతో పాటు వారి బాగోగులు చూసేందుకు ఆయాలను నియమించారు. ఒక్కో టీచర్‌కు నెలకు రూ.7 వేల వేతనంగా చెల్లిస్తుండగా, ఆయాలకు రూ.1,000 ఇస్తున్నారు. ఆరు పాఠశాలల్లో మొత్తం 170 మంది పిల్లలు చదువుకుంటున్నారు. పిల్లలకు చదువుతోపాటు ఆరోగ్య సూత్రాలను నేర్పిస్తున్నారు. పాఠశాలకు రాని ఆదివాసీ గొత్తికోయ పిల్లలను చదువు వైపు మళ్లించేందుకు తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. పిల్లలకు ఆటపాటలను కూడా నేర్పిస్తున్నారు. అండగా నిలుస్తున్న దాతలు ఆదివాసీ గూడేల్లో శుభ్రత ఉండదు. తరచూ రోగాలపాలవుతుంటారు. దీనికితోడు పోషకాహార లోపం. దీనిని దృష్టిలో పెట్టుకుని పిల్లల పరిశుభ్రత, ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నారు. పిల్లలకు చేతులు ఎలా కడుక్కోవాలో కూడా నేర్పిస్తున్నారు. పోషకాహార లోపం ఉండకూడదని ప్రతిరోజూ కోడిగుడ్డు, గ్లాస్ పాలు అందిస్తున్నారు. రెండు రోజులకోసారి పల్లీ పట్టీలను స్నాక్‌గా ఇస్తున్నారు. ఇవన్నీ వీరు ఉచితంగానే చేస్తుండటం గమనార్హం. ఇస్రం సంతోష్, నరేష్‌లు గొత్తికోయగూడేల్లో పాఠశాలలను నడుతుపుతున్న విషయం తెలుసుకుని ఇద్దరు దాతలు ముందుకు వచ్చి చేయూతనిస్తున్నారు. ఎస్సీఈ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ గోపాలకృష్ణ, అస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న తరుణ్‌లు ప్రతినెలా సాయం అందజేస్తున్నారు. విద్యతోనే జీవితాల్లో మార్పు విద్యతోనే జీవితాలు మారతాయి. ఎక్కడో అడవిలో ఉండే గూడేల్లో చదువు ఇప్పటికీ అందని ద్రాక్షే. మాలా ఇబ్బందులు పడకూడదని, ఆదివాసీ గొత్తికోయ పిల్లలకు గూడేల్లో విద్య నేర్పించాలనే లక్ష్యంతో అడుగులు ముందుకు వేశాం. తొలుత ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలోని గొత్తికోయగూడేల్ని సందర్శించి అధ్యయనం చేశాం. మొదట్లో ఒకటి, రెండు పాఠశాలలను నడిపించాం. ప్రస్తుతం ఆరు గూడేల్లో నడుపుతున్నాం. మారుతున్న సమాజంలో పోటీ ఇవ్వాలంటే చదువుతోనే సా«ధ్యమతుంది. టీచర్ల బృందం సమన్వయంతో పాఠశాలలను నడిపిస్తున్నాం. దాతలు ముందుకు వచ్చి సాయం అందిస్తే మరిన్ని పాఠశాలలతో మరింత మంది గొత్తికోయ పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దుతాం. – ఇస్రం సంతోష్ -
ఆదివాసీ బాలలకు ‘ఆధార్’ దొరికింది
జి.మాడుగుల: విశాఖ ఏజెన్సీలో మారుమూల ఆదివాసీ గిరిజన గ్రామాలు నిట్టమామిడి, బందులపనుకులోని బాలలకు ఎట్టకేలకు ఆధార్ కార్డు నమోదు కార్యక్రమం జరిగింది. ఆ గ్రామాలకు చెందిన పిల్లలకు బర్త్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు లేకపోవటంతో చదువుకు, ఇతర ప్రభుత్వ పథకాలకు ఇప్పటివరకు దూరంగా ఉన్నారు. ‘సాక్షి’ దినపత్రికలో ఇటీవల ఈ సమస్యపై కథనం వెలువడడంతో అధికార యంత్రాంగం స్పందించింది. ఆదివాసీ పిల్లలకు బర్త్ సర్టిఫికెట్లు, ఆధార్ నమోదుకు చర్యలు చేపట్టింది. పాడేరు ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు డిప్యూటీ తహసీల్దార్ అప్పలస్వామి, ఎంఆర్ఐ చిన్నారావు, సిబ్బంది 8 కి.మీ కాలినడకన ఆయా గ్రామాలను సందర్శించి పిల్లలకు బర్త్ సర్టిఫికెట్లు జారీ చేసి ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నిట్టమామిడి, బందులపనుకు గ్రామాల్లో గల 53 మంది పిల్లలకు ఆధార్ నమోదు చేశారు. దీంతో తమ పిల్లలు చదువుకోవడానికి ఒక ఆధారం దొరికిందని ఆదివాసీ గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు. -
నేరేడుబందకు మొబైల్ ఆధార్ టీం
పాడేరు: ఆ మారుమూల గిరిజన తండా ప్రజల చిరకాల కోరిక నెరవేరుతోంది. అసాధ్యమనుకున్నది సుసాధ్యమవుతోంది. విశాఖ జిల్లా జి.మాడుగుల, రావికమతం మండలాల సరిహద్దులోని నేరేడుబంద గ్రామంలో పిల్లలకు ఆధార్ కార్డులు అందనున్నాయి. ఈ గ్రామంలో జన్మించిన 18 మంది పిల్లలకు జనన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం, దీంతో వారు ఆధార్ కార్డులకు నోచుకోక చదువుకు దూరం కావడంపై ‘సార్.. మా ఊరే లేదంటున్నారు’ శీర్షికన సోమవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో వచ్చిన కథనానికి ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి స్పందించారు. ఐటీడీఏ పీవో ఆర్.గోపాలకృష్ణతో ఫోన్లో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో అధికార యంత్రాంగం ఆగమేఘాలపై కదిలింది. జి.మాడుగుల ఎంపీడీవో వెంకన్నబాబు, ఇతర అధికారులు సోమవారం నేరేడుబంద గ్రామాన్ని సందర్శించారు. వారిచ్చిన నివేదికతో పీవో వెంటనే మొబైల్ ఆధార్ టీంను పంపించారు. వారు సోమవారం రాత్రికే నేరేడుబంద చేరుకున్నారు. మంగళవారం ఆ గ్రామంలోని 18 మంది చిన్నారులకు ఆధార్ నమోదు చేయనున్నారు. ఆ గ్రామానికి సిగ్నల్స్ అందే అవకాశం లేకపోవడంతో ఆఫ్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకుని సమీపంలోని జోగుంపేట ఆధార్ కేంద్రంలో ఆన్లైన్ చేయనున్నారు. ‘సాక్షి’ కథనంతో ఎంతోకాలంగా ఉన్న తమ సమస్య పరిష్కారం అవుతోందని నేరేడుబంద గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
వైఎస్సార్ కంటి వెలుగు: ఆ ‘చూపు’ సూపర్
సాక్షి, అమరావతి: సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అంటారు.. అంటే అన్ని ఇంద్రియాల్లోకెల్లా నేత్రాలు చాలా ముఖ్యమైనవని అర్ధం. అలాంటి కంటిచూపుకు రాష్ట్రంలో తొలిసారిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. పిల్లల్లో కంటి లోపాలను ప్రాథమిక దశలోనే గుర్తించి వారి జీవితంలో వెలుగులు నింపాలనే లక్ష్యంతో 2019 అక్టోబర్ 10న వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే పిల్లలందరికీ ఉచితంగా కంటి పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గిరిజన పిల్లల్లో కంటి సమస్యలు తక్కువగా ఉన్నట్లు గుర్తించింది. 66.17 లక్షల మంది పిల్లలకు పరీక్షలు కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 60 వేలకు పైగా స్కూళ్లలోని 66.17 లక్షల మంది పిల్లలకు పరీక్షలు నిర్వహించారు. ఇందులో 4.38 లక్షల మందికి దృష్టి లోపాలున్నట్లు గుర్తించారు. బాలికల్లో 6.81 శాతం మందికి, బాలురుల్లో 6.46 శాతం మందికి చూపులో ఇబ్బందులు ఉన్నట్లు ఆ పరీక్షల్లో తేలింది. మొత్తం మీద రాష్ట్రంలో ప్రతీ 100 మంది పిల్లల్లో 6.6 శాతం మంది పిల్లలకు కంటి సమస్యలున్నట్లు స్పష్టమైంది. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ఈ పరీక్షల్లో మిగతా పిల్లలతో పోల్చి చూస్తే గిరిజన పిల్లల్లో దృష్టి లోపాలు చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. వారు నివశించే ప్రాంతాలతో పాటు ఆధునిక ఆహారపు అలవాట్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల ప్రభావం తక్కువగా ఉండటంతో వారిలో దృష్టి లోపాలు తక్కువగా ఉన్నాయి. వీరిలో అత్యల్పంగా 0.29 శాతమే సమస్యలున్నట్లు పరీక్షల్లో తేలింది. అలాగే.. ఎస్సీ పిల్లల్లో 1.09 శాతం దృష్టిలోపం ఉండగా ఓసీ పిల్లల్లో 1.77 శాతం ఉంది. అత్యధికంగా బీసీ పిల్లల్లో 3.46 శాతం కంటి సమస్యలు కనిపించాయి. రెండు దశల్లో కంటి పరీక్షలు పిల్లలందరికీ రెండు దశల్లో కంటి పరీక్షలు నిర్వహించారు. తొలి దశలో ప్రాథమికంగా కంటి స్క్రీనింగ్ నిర్వహించారు. వీరి వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన వెబ్ పోర్టల్‌లో నమోదు చేశారు. ఈ స్క్రీనింగ్‌లో కంటి సమస్యలున్నట్లు గుర్తించిన 4.38 లక్షల మంది పిల్లలకు రెండో దశలో నిపుణులతో పరీక్షలు చేయించారు. ఇందులో 2.41 లక్షల మందికి మందులు, వైద్యుల సలహాలు, సూచనలిచ్చారు. 1.58 లక్షల మందికి కళ్లజోళ్లను పంపిణీ చేశారు. మరో 42,542 మందికి నిపుణుల పరీక్షలకు సూచించారు. ఈ పరీక్షల ద్వారా 24,017 మంది పిల్లలకు కంటి సంరక్షణపై సూచనలు చేశారు. 2,612 మందికి శస్త్ర చికిత్సలు అవసరమని తేల్చగా వీరిలో 294 మందికి వాటిని పూర్తిచేశారు. మరో 145 మంది పిల్లలకు శుక్లాల ఆపరేషన్లు చేశారు. పిల్లలపై ‘ఎలక్ట్రానిక్స్’ ప్రభావం తీవ్రంగా ఉంది చిన్న పిల్లల కంటిచూపుపై ఎలక్ట్రానిక్ పరికరాల ప్రభావం తీవ్రంగా ఉంది. సెల్ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్‌లు వంటివి చిన్నతనం నుంచే అలవాటు చెయ్యొద్దు. టీవీల ప్రభావం కూడా తక్కువేం కాదు. వీటి ప్రభావం పట్టణ పిల్లల్లో ఎక్కువ. గిరిజన ప్రాంతాల్లో ఈ ఉపకరణాలు తక్కువగా వాడుతున్నారు కాబట్టి గిరిజన పిల్లల్లో కంటి సమస్యలు తక్కువగా ఉన్నాయి. – డా. హైమావతి, నోడల్ అధికారి, వైఎస్సార్ కంటి వెలుగు కంటి పరీక్షల వివరాలు జెండర్ పరీక్షలు దృష్టిలోపం లోపం శాతం బాలురు 34,44,818 2,22,676 6.46 శాతం బాలికలు 31,72,795 2,16,075 6.81 శాతం సామాజికవర్గాల వారీగా కంటి పరీక్షలు.. సామాజికవర్గం దృష్టిలోపం లోపం శాతం ఎస్సీ 72,771 1.09 శాతం ఎస్టీ 19,214 0.29 శాతం బీసీ 2,29,567 3.46 శాతం ఓసీ 1,17,109 1.77 శాతం -
మన్యంలో కొండెక్కని అక్షరం!
సాక్షి, విశాఖపట్నం : మన్యంలో బడి ముఖం చూడని చిన్నారులు వందల సంఖ్యలో దర్శనమిస్తున్నారు. అక్షరం అక్కడ మచ్చుకైనా కనిపించదు. చిట్టిచేతులతో అక్షరాలు దిద్దాల్సిన పిల్లలు అడవి బాటపడుతున్నారు. గత సర్కార్ పాలనలో కొత్త పాఠశాలలను ఏర్పాటు చేయకపోవడంతో పిల్లలు అక్షర జ్ఞానానికి నోచుకోలేదు. బడి ముఖం చూడని చిన్నారుల మాదిరిగానే మధ్యలో బడి మానేసినవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచేటప్పుడు, సెలవులకు ముందు మాత్రం డ్రాపౌట్లపై సిబ్బంది సర్వే చేసి అధికారులకు నివేదికలు ఇస్తారు. తరువాత ఆ విషయాన్ని మరచిపోతున్నారు. మళ్లీ అదే సర్వేలు.. అవే నివేదికలు. వారిని పాఠశాలకు తీసుకువచ్చే పరిస్థితి లేదు. ఇక పాఠశాలలు లేని గ్రామాలు కొన్నింటిని ఎంపిక చేసుకుని సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ఎన్‌ఆర్‌ఎస్‌టీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మార్చిలో మూసేస్తున్నారు. దీంతో పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో నేటికీ చాలామంది చదువుకు దూరంగానే ఉన్నారు. గత ప్రభుత్వం విద్యాశాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. మూడు సంవత్సరాల కిందట విద్యాశాఖ నిర్వహించిన సర్వేలో మన్యంలో అసలు బడిముఖం చూడని పిల్లలు ఏడు వేలు దాటి ఉన్నట్టు తేలింది. అయితే వారిని బడిలో చేర్పించడం ఎలా అనేది మాత్రం అధికారులు తేల్చలేకపోయారు. చిన్నపిల్లలను గ్రామాలకు దూరంగా ఉన్న పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు అంగీకరించడం లేదు. అడవిలో కట్టెలు ఏరుతున్న డ్రాపౌటు పిల్లలు దీంతో బడికి వెళ్లాల్సిన చిన్నారులు తల్లిదండ్రులతో అడవికి వెళ్లడం, వ్యవసాయం చేయడం, పశువుల కాపర్లుగా మారిపోతున్నారు. కొన్ని చిన్న గ్రామాలుగా ఉంటే మరికొన్ని పెద్ద గ్రామాలుగా ఉన్నాయి. పెద్ద గ్రామాల్లో బడి ఈడు కలిగిన పిల్లలు 15 మంది వరకు ఉంటున్నారు. వారిని దూరంగా ఉన్న ప్రాంతాలకు బడికి పంపడం లేదు. ఆశ్రమ పాఠశాలల్లో మూడో తరగతి నుంచి చేర్చుకుంటున్నారు. అయితే ఒకటి రెండు తరగతులు చదివేందుకు వీలులేకుండా పోయింది. ఆ ఒకటి రెండు తరగతులు చదివేందుకు ఉపాధ్యాయులను వేయాలని కోరుతోన్నా స్పందించడంలేదు. ఏటా ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆరు నెలల తరువాత వాటిని ఎత్తేస్తున్నారు. ఆ పాఠశాలలు నడిపే సమయంలో విద్యార్థులకు భోజనం పెట్టడం లేదు. విద్యార్థులపై వివక్ష మారుమూల ప్రాంతాల్లో అధికంగా జీపీఎస్ (టీడబ్ల్యూ) మండల పరిషత్ ప్రాథమికక పాఠశాలలుంటాయి. రెండింటిలోను చదివేది గిరిజన విద్యార్థులే. అయినా అధికారులు మండల పరిషత్ పాఠశాలపై వివక్షత చూపుతున్నారనే విమర్శలున్నాయి. జీపీఎస్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు బ్యాగ్‌లు, పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బూట్లు, అందజేస్తున్నారు. మండల పరిషత్ విద్యార్థులకు అలాంటివి ఏమి అందించడం లేదు. దీనిపై అధికారులు చెప్పే సమాధానం విచిత్రంగా ఉంటుంది. జీపీఎస్ పాఠశాలలు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నాయని, మండల పరిషత్ పాఠశాలలు వారికి సంబంధం లేదంటున్నారు. కాని చదివేది పేద విద్యార్థులన్న వాస్తవాన్ని విద్యాశాఖాధికారులు మరచిపోతున్నారు. గడచిన రెండేళ్లుగా ఈ వివక్ష కొనసాగుతోంది. -
బడిబయటే గిరి బాల్యం..!
చదువుకోవాలన్న ఆసక్తి ఉన్నా ఆర్థిక పరిస్థితులు వారికి చదువును దూరం చేస్తున్నాయి. వీటిని అధిగమించి బడికి వెళ్దామంటే కనుచూపు మేరలో బడి కనిపించదు. రాళ్లు, రప్పలు దాటుకుంటూ కిలోమీటర్ల దూరం నడిచి వెళ్తేతప్ప పాఠశాలలకు చేరుకోలేరు. ఆటలాడుతూ సరదాగా గడపాల్సిన సమయంలోనే బాలికలు తల్లులుగా మారుతున్నారు. బండెడు చాకిరీ భుజాన మోస్తున్నారు. బాలురు కుటుంబ పోషణకు కష్టపడుతున్నారు. గిరిశిఖర గ్రామాల్లో పిల్లల కష్టాల జీవనంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాలూరు రూరల్ : ఏళ్లు గడుస్తున్నాయి... కాలం పరుగులు తీస్తోంది.. సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది.. పదుల సంఖ్యలో ఉపగ్రహాలను ఒకేసారి పరీక్షించే సామర్థ్యం సొంతమైనా... గిరిపుత్రుల అభివృద్ధికి ఆధారమైన అక్షరాల ను నేర్పలేకపోతున్నాం. చదువు విలువ తెలియజేయలేని పరిస్థితి. గిరిశిఖర గ్రామాల ప్రజలకు ఇప్పటికీ చదువుకుంటే అభివృద్ధి చెందుతాం... పిల్లలు బాగుపడతారన్న విషయాలు తెలియవు. ఆటలాడుకునే వయసులోనే తల్లులుగా, పిల్లలను ఆడించే అమ్మలుగా మారుతున్నారు. బడికి దూరంగా ఉంటూ కుటుంబ బాధ్యతలను భుజా న మోస్తున్నారు. విద్యకోసం ఇంటింట ప్రచారం వారి దరి చేరడం లేదు. జ్ఞానధార... వారికి విజ్ఞానాన్ని అందించడం లేదు. అంగన్వాడీ చదువులు అక్కరకు రావడం లేదు. సంక్షేమ పథకాలు అం దని ద్రాక్షగా మారాయి. రాయితీలు అందుకునే తెలివి లేక పక్కదారి పడుతున్నాయి. ఫలితం... వారి జీవితాలు ఎక్కడవేసిన గొంగలి అక్కడే అన్నచందంగా మారాయి. దీనికి విజయనగరం జిల్లాలోని గిరిశిఖర గ్రామాల ప్రజల జీవన విధానాలు, బడి వయసులో బయట ఉన్న పిల్లలే నిలువెత్తు సాక్ష్యం. చిన్నతనంలోనే బాధ్యతలు... గిరిశిఖర గ్రామాల్లోని ప్రజలకు రెక్కాడితే కాని డొక్కాడని వైనం. తల్లిదండ్రులు పొద్దున్నే పనిలోకి వెళ్లిపోతారు. దీంతో పిల్లల్లోని పెద్దవారు చిన్నవారిని ఆడిస్తారు. వారి బాగోగులు చూసుకుంటారు. బడికి వెళ్లాలన్న ఆసక్తి ఉన్నా బాధ్యతలు బడికి దూరం చేస్తున్నాయి. ఓ వైపు చిన్నారులును ఆడిస్తూ మరోవైపు తల్లిదండ్రులు వచ్చే సమయానికి వారికి భోజనంను సిద్ధం చేస్తున్నారు. కూడు,గూడు, బట్టకు కరువే.... ఇప్పటికీ గిరిశిఖర గ్రామాల ప్రజలకు కనీస సదుపాయాలు అందవు. కూడు, గూడును పక్కన పెడితే కనీసం వేసుకునేందుకు సరైన దుస్తులు కూడా ఉండవు. పోషకాహారం లభించదు. మగ బిడ్డలు చాలా మంది బట్టలు లేకుండా గడుపుతుంటే.. ఆడ పిల్లలు తమ తల్లుల చీరలను ముక్కలు చేసి కట్టుకుని కనిపిస్తున్నారు. పెద్దలతో కలిసి పనిలోకి.... కొంచెం ఊహ తెలిసిన చిన్నారులు తమ తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూసి తమవంతు సాయంగా పనిలోకి వెళ్తున్నారు. గ్రామానికి సమీప అడవుల్లో లభ్యమయ్యే మామిడిపండ్లు, చింతపండు వంటి పలు అటవీ ఉత్పత్తులను సేకరించి వాటిని అమ్మకాలు జరుపుతున్నారు. ఈ సొమ్ముతో ఇంటికి తమ శక్తి కొలది సాయం చేస్తున్నారు. బడిబయట పిల్లలే అధికం... గ్రామాల్లో బడి బయట పిల్లల గుర్తింపునకు విద్యాశాఖ, వెలుగు శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యాశాఖ ఆద్వర్యంలో బడిపిలుస్తోందిలో భాగంగా విద్యాశాఖ అధికారులు, సీఆర్పీలు, ఉపాధ్యాయులు, సిబ్బంది గ్రామాల్లో పర్యటించి బడి బయట ఉన్న పిల్లలను గుర్తించారు. ఐటీడీఏ సబ్‌ప్లాన్ పరిధిలోని 8 మండలాలకు సంబందించి వెలుగు ఆధ్వర్యంలో సాధికార మిత్రలతో ప్రత్యేకంగా బడి బయట పిల్లలు సంఖ్యను గుర్తించారు. అందులో బడికి వెళ్లేవారికంటే బడిబయట ఉన్నవారే అధికంగా ఉండడం గమనార్హం. విద్యాభ్యాసన లేకపోవడంతో గిరిశిఖర గ్రామాల ప్రజల తలరాతలు మారడం లేదు. తమ ప్రభుత్వంలో అభివృద్ధి చేస్తున్నామన్నది మాటలకే పరిమితమవుతుండడం శోచనీయం. గిరిశిఖర గ్రామాల్లోనే బడి బయట పిల్లలు అధికం... గిరిశిఖర గ్రామాల్లోనే బడిబయట పిల్లలు అధికంగా ఉంటున్నారు. సర్వేల్లో ఇదే విషయం వెల్లడైంది. విద్య వల్ల కలిగే ప్రయోజనాలను పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సి ఉంది. దీని కోసం ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం కింద ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం. బడి ఈడు పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించేందుకు కృషి చేస్తున్నాం. – పల్లె జోగారావు, ఎంఈవో, పాచిపెంట మండలం -
మధ్యాహ్న భోజనం ఉడుతలు..ఎలుకలే!
♦ ఆకలిబాధ తట్టుకోలేక ఉడుతల్ని, ఎలుకల్ని తింటున్న జార్ఖండ్ గిరిజన బాలలు ♦ అధికారుల జేబుల్లోకి చేరుతున్న మధ్యాహ్న భోజనం నిధులు ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారి పేరు పింకి. మధ్యాహ్నం కాగానే ఉడతలు పట్టడం పింకి దినచర్య. దొరకకపోతే ఎలుకలు కూడా పడుతుంది. వాటితో ఆడుకోవడానికో.. సరదా కోసమో పింకి ఉడతలను, ఎలుకలను పట్టడంలేదు. కడుపు కాలి.. ఆకలి బాధను భరించలేక ఈ పనిచేస్తోంది. ఆమె మధ్యాహ్న భోజనం ఇదే అంటే ఆశ్చర్యమేస్తోంది కదూ! కానీ ఇది నిజం. మరి పింకి అలా.. ఉడుతలను, ఎలుకలనే ఎందుకు తింటోంది? ...ఎందుకంటే అధికారుల రూపంలో ఉన్న పందికొక్కులు పింకి నోటికాడి ముద్దను లాగేసుకుంటున్నాయి. మధ్యాహ్న భోజనానికి వందలు.. కాదు వేలు.. కాదు కాదు లక్షల కోట్ల రూపాయలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్నా అవేవీ దేశంలోని చాలామంది పిల్లల వద్దకు చేరడంలేదనేందుకు ఈ పింకే నిదర్శనం. వివరాల్లోకెళ్తే... జార్ఖండ్‌లోని సాహెబ్‌గంజ్ జిల్లా రాజ్‌మహల్ హిల్స్ ప్రాంతం చుహా పహర్ అనే ఓ కుగ్రామం ఉంది. ఇక్కడ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ పాఠశాల ఉంది. ఐదేళ్ల వయసున్నప్పుడే పింకిని పాఠశాలలో చేర్చారు. ఇప్పుడు పింకి వయసు తొమ్మిదేళ్లు. పింకి వయసు పెరుగుతోందే తప్ప.. తరగతి పెరగడంలేదు. కారణం.. పాఠశాల ఉంది పేరుకు మాత్రమే. ఆ ఊరిలో బడి ఈడు పిల్లలున్నా పాఠశాలలో మాత్రం ఒక్కరు కూడా ఉండరు. ఎందుకంటే చదువు చెప్పేందుకు అసలు టీచరే ఉండడు. ప్రభుత్వ లెక్కల్లో పక్కాగా.. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల్లో మాత్రం గత నాలుగు సంవత్సరాలుగా పింకి పేరుమీద నిధులు విడుదలవుతూనే ఉన్నాయి. స్కూల్ యూనిఫారంకు, పోషకాహారాలతో కూడిన మధ్యాహ్న భోజనానికి రూపాయి రూపాయి లెక్కగడుతూ నిధులు విడుదల చేస్తూనే ఉన్నారు. వీటితో పింకికి యూనిఫారం ఇచ్చినట్లు, ఆకుకూరలు, అన్నం, రోజుకో గుడ్డుతో భోజనం పెడుతున్నట్లు ప్రభుత్వానికి నివేదికలు కూడా అందుతున్నాయి. అయితే ఇక్కడ పింకి తింటోంది మాత్రం ఎలుకలు, ఉడతలు. ఎంత దారుణం!! పదివేల కోట్లు... ఈ ఏడాది బడ్జెట్లో పాఠశాల పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలను కేటాయించింది. వీటితో 10.03 కోట్ల మంది చిన్నారుల చదువు, పోషకాహారం అందించనున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూ.6కు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమవంతుగా మరో రూ.4 కలిపి మొత్తం రూ.10తో పిల్లలకు పోషకాహారం పెట్టాలి. నిధులైతే మంజూరవుతున్నాయి. అయినా పింకి మాత్రం పస్తూలుంటూనే ఉంది. జార్ఖండ్‌లోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి పింకిలు ఎంతోమంది కనిపిస్తారు. సొమ్మంతా అధికారుల జేబుల్లోకి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న వేలాది కోట్ల రూపాయల నిధులు ఏమవుతున్నాయంటే... సమాధానం సుస్పష్టం. అవన్నీ అధికారుల జేబుల్లోకి చేరుతున్నాయి. పిల్లల నోటికాడి ముద్దను మాత్రమే కాదు... వారి భవిష్యత్తునూ లాగేసుకుంటున్నారు విద్యాశాఖ అధికారులు. ఎందుకంటే... బడిలో భోజనం పెడతారనే ఆశతో పాఠశాలకు వచ్చే చిన్నారులు మనదేశంలో ఇప్పటికే కోట్లాదిమందే ఉన్నారు. ఆ భోజనం దొరకనప్పుడు వారు బడికి రారు. దీంతో వారి భవిష్యత్తు నాశనమైనట్లే కదా? –సాక్షి, స్కూల్ ఎడిషన్ -
ఇంకా బయటేనా..?
గిరి బాలలు బడి బయటే ఉండిపోతున్నారు. దశాబ్దాలుగా విద్యకు దూరంగా ఉంటున్నారు. అయినా ఇక్కడి అధికారులు పరిశీలన ఊసెత్తరు. టీచర్లు స్కూలు ముఖమే చూడరు. ఇప్పటికీ ఇక్కడి బాలలు పశువులు మేపుకుంటూ, కొండల్లో కట్టెలు కొట్టుకుంటూ రోజులు గడిపేస్తున్నారు. అక్షరాల వెలుగులు అందక అజ్ఞానపు చీకటిలో మిగిలిపోతున్నారు. పార్వతీపురం: పార్వతీపురం సబ్-ప్లాన్ గ్రామాల్లోని గిరిజన పిల్లలు బడి బయటే ఉండిపోతున్నారు. తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడం, చదు వు వల్ల కలిగే ప్రయోజనాలు తెలియకపోవడంతో పిల్లలు స్కూలు గడప తొక్కకుండానే బాల్యం గడిపేస్తున్నారు. పార్వతీపురం సబ్-ప్లాన్‌లోని మండలాల్లో కొన్ని గిరిజన గ్రామాలలోని టీచర్లు నెలల తరబడి బడి ముఖం చూడకపోవడంతో బడులు తెరచుకునే పరిస్థితులు లేవు. కొమరాడ, సాలూ రు, పాచిపెంట, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస తదితర మండలాల్లోని పలు గిరిశిఖర గ్రామాలకు టీచర్లు పబ్లిక్‌గా డుమ్మా కొడుతున్నారు. సంబంధిత ఉన్నతాధికారుల పర్యవేక్షణ, పనిష్మెంట్లు లేకపోవడంతో ఐటీడీఏ, ఎంపీపీ యాజమాన్యాల్లో పనిచేస్తున్న పాఠశాలలు కనీసం నెలకొకమారు కూడా తెరచుకున్న పాపాన పోలేదు. వేలల్లో జీతాలు తీసుకుంటున్న కొంత మంది టీచర్లు ఆయా గ్రామాల్లో యువకులకు *1000లు, *2000లు ఇచ్చి బడులు నడిపిస్తున్నారు. ఈ విషయం అందరికీ తెలిసినా... సంబంధిత ఉన్నతాధికారుల హస్తం కూడా ఉండడంతో గిరిశిఖర బడులు తెరచుకోకుండా ఉన్నాయి. దీంతో ఆయా గ్రామాల పిల్లలు బడికి దూరంగా పశువులు కాపర్లుగా, అడవిలో అటవీ సంపాదన సేకరించేందుకు పరిమితమవుతున్నారు. అంతంత మాత్రమే డ్రాపౌట్స్ చేరిక సీతానగరం మండలంలో 62 పాఠశాలలుండగా, ఏడుగురు బడి ఈడు పిల్లలున్నారని, ముగ్గురు బడిబయటే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే పార్వతీపురం మండలంలో 56 పాఠశాలలుండగా, 35 మంది బడి బయట ఉన్న పిల్లలున్నారు. గుమ్మలక్ష్మీపురం మండలంలో 188 పాఠశాలలుండగా దాదాపు 137 మంది వరకు బడిబయట పిల్లలున్నారు. ఇక గరుగుబిల్లి మండలంలో 35 మంది డ్రాపౌట్స్ ఉండగా, 9 మంది మాత్రమే చేరారు. అలాగే బలిజిపేట మండలంలోని 38 మంది డ్రాపౌట్స్ ఉండగా 9 మంది మాత్రమే పాఠశాలల్లో చేరారు. ఇలా కనీసం 50 శాతం కూడా బడిబయట ఉన్న పిల్లల్ని బడిలోకి చే రలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా నాయకులు, అధికారులు గిరి ప్రాంతంలోని పిల్లల భవిష్యత్‌పై దృష్టి పెట్టాలని, పిల్లలను బడికి పంపించేలా ఏర్పాట్లు చేయాలని పలువురు కోరుతున్నారు. -
ఆదివాసీ లిపిలో, భాషలో సంపూర్ణ అక్షరాస్య గ్రామంగా గుంజాల
ఇన్ బాక్స్: ప్రపంచవ్యాప్తంగా ప్రాథమిక విద్యా విధానం ఎన్నో సవాళ్లని ఎదుర్కొంటున్నది. ఈ విద్యా విధా నంలో ‘భాష’ ప్రధానమైనది. అడుగు వర్గాల పిల్ల లకి, ఆదివాసీ పిల్లలకు ఏ భాషలో విద్య ఉండాలి అనే సమస్య ప్రపంచంలోని చాలా దేశాలు, సమా జాలు ఎదుర్కొంటున్నవి. బహుళ భాషలు ఉన్న ప్రాంతాలలో ఏ భాష బడి భాషగా ఉండాలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్లే అక్షరాస్యత శాతం పెరగడం లేదని తెలుస్తోంది. ఈ విషయంలో యునెస్కో ప్రపంచవ్యాప్తంగా ఎంతో సమాచారం సేకరించింది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు ఏడు వేల భాష లు ఉన్నాయి. అందులో 370 మిలియన్ల మూలవాసీ ప్రజలలో మూడింట రెండో వంతు పసిఫిక్ తీర ఆసియా దేశాలైన థాయ్‌లాండ్, లావోస్, వియత్నాం, మయన్మార్ వంటి దేశాలలో ఉన్నారు. ఈ తెగల ఆర్థిక పరిస్థితి దినదినం దిగజారిపోతున్నది. అలాగే భారతదేశంలో కూడా ఈ సమస్య పెద్దదిగానే ఉంది. ఆదివాసుల నేల గాలి నీరు పరాయీకరణకు గురవుతున్నది. వారు నిర్వాసితులుగా చేయబడుతు న్నారు. ఈ క్రమంలో చరిత్రలోకి తొంగిచూస్తే ప్రతి దశలోనూ వారు నివసించే నేల నుండి తొలగిం పబడటం వాస్తవం. నేలని కోల్పో వడం తల్లిని కోల్పోవడమే. తల్లి భాషని, సంస్కృతిని కూడా కోల్పో వడమే. ఈ రెండూ పోయిన వాళ్లకి అస్తిత్వం కూడా మిగలదు. చిరు నామా, ఆత్మగౌరవం లేని నిర్జీవ శరీరాలుగా మిగిలి పోతారు. ఈ సమస్యకు ఒక పరిష్కారం చూడాలి. ఆరేళ్ల క్రితం ఆదిలాబాద్ జిల్లా, నార్నూరు మండలంలోని గుంజాల గ్రామంలో కోయతూర్ లిపి లభించింది. ఇది చాలా కాలం నుండి ఉన్నది. ఈ లిపిలో రాతప్రతులు ఉండటమే కాదు, వాటిని చదివే నలుగురు వృద్ధ పండితులు కూడా జీవించి ఉన్నారు. ఈ గుంజాల కోయతూర్ లిపి ఉపయోగిం చిన పలు చోట్ల ఎన్నో ప్రయత్నాలు చేశాం. చాలా వరకు సత్ఫలితాలు, సత్వర ఫలితాలు లభించాయి. ఉట్నూరులోని ఐటీడీయే సహకారంతో 15 ఏళ్లలో ఈ లిపిని ప్రవేశపెట్టిన కొద్ది మాసాలలోనే పిల్లలు సొంత లిపిలో, సొంత భాషలో గణనీయమైన ప్రగతి సాధించారు. ఇది ఎంతో ఆశ్చర్యం, ఆనందం కలిగించింది. అందుకే గుంజాల గ్రామాన్ని ఆదివాసీ లిపిలో, ఆదివాసీ భాషలో సంపూర్ణ అక్షరాస్య గ్రామంగా తయారుచేయాలని నిర్ణయించాం. నాలు గేళ్ల పిల్లవాడి మొదలు డెబ్బై ఏళ్ల వృద్ధుల వరకు ఈ లిపిలో రాసేట్లు, చదివేట్లు చేయడమే ప్రధాన లక్ష్యంతో ముందుకు పోతున్నాం. దేశంలోనే మొట్ట మొదటి ప్రయోగం ఇది. అలాంటి ఆ కార్యక్రమానికి 15 డిసెంబర్ నాడు ప్రారంభోత్సవం చేస్తున్నాం. ఆరు నెలల్లో గుంజాలలోని సుమారు పదిహేను వందల మంది తమ ఆదివాసీ లిపిలో సంతకం చేసి అధికారులకి అర్జీ పత్రాలు రాసే విధంగా అక్షరా స్యులుగా చేయాలని సంకల్పించాం. ఈ కార్యక్రమా నికి హితైషులను, మిత్రులను ఆహ్వానిస్తున్నాం. చరిత్రలో నిలిచిపోయే దినంగా దీనిని భావి స్తున్నాం. దేశంలో మొదటి ఆదివాసీ లిపిలో, గోండీ భాషలో పూర్తి అక్షరాస్యతని సాధించిన గ్రామంగా గుంజాల నిలిచిపోగలదని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మా వేదిక కన్వీనర్, తెలం గాణ రచయితల వేదిక అధ్యక్షులు జయధీర్ తిరు మలరావు మార్గదర్శకులుగా ఉన్నారు. వారు అధ్య క్షత వహించే ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ డా॥ జె.జగన్మోహన్, ఉట్నూరు ఐటీ డీఏ ఇన్ఛార్జీ పివో ప్రశాంత్ జె. పాటిల్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం సిడాస్ట్ కోఆర్డినేటర్ ఆచార్య ఎస్.ఆర్.సర్రాజు తదితరులు పాల్గొంటారు. అందరికీ ఆహ్వానం. డా॥ జి.మనోజ శాఖాధిపతి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లిష్, పాలమూరు విశ్వవిద్యాలయం, మహబూబ్‌నగర్ గుంజాల కోయతూర్ లిపి అధ్యయన వేదిక, ఉట్నూరు / ఆదిలాబాద్, ఫోన్: 9704643240 -
అ‘డ్రస్’ లేదాయే!
రంపచోడవరం : ఏటా గిరిజన విద్యకు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా, గిరిజన బాలలపై నిర్లక్ష్యం తప్పడం లేదు. పక్కాగా వారికి కల్పించాల్సిన సౌకర్యాలను అంతంతమాత్రంగా కల్పిస్తున్నారు. ఏటా ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో గిరిజన విద్యార్థులకు పాఠశాల ప్రారంభంలోనే దుస్తులు అందించాల్సి ఉండగా, పాఠశాలలు తెరిచి నెల రోజులైనా నేటికీ అందించలేదు. గత ఏడాదీ ఇవ్వలేదు ఐటీడీఏ పరిధిలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు 59, వసతి గృహలు 22 ఉన్నాయి. వీటిలో దాదాపు 14 వేల మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నారు. ఏటా వీరికి నాలుగు జతల దుస్తులు అందజేయాలి. దీనికిగాను ఆప్కో నుంచి క్లాత్ సరఫరా చేస్తారు. 2011-12 విద్య సంవత్సరంలో 20,084.50 మీటర్ల క్లాత్ ఉండగా, 2013-14 విద్య సంవత్సరానికి 1718.57 మీటర్ల క్లాత్ ఇండెంట్ పెట్టారు. 2014-15 విద్య సంవత్సరంలో 1,29,194 మీటర్ల క్లాత్ ఇండెంట్ పెట్టారు. అయితే 2013-14 విద్య సంవత్సరంలో విద్యార్థులకు పూర్తి స్థాయిలో సరఫరా చేయలేదు. దీంతో చొక్కాలకు క్లాత్ ఉంటే, ఫ్యాంట్లకు క్లాత్‌లు లేని పరిస్థితి నెలకొంది. అయితే 2013-14 విద్య సంవత్సరంలో కొత్తగా ఆశ్రమ పాఠశాలలో చేరిన విద్యార్థులకు దుస్తులు సరఫరా చేయలేదు. రంపచోడవరం మండలంలోని ఒక ఆశ్రమ పాఠశాలలో గత ఏడాది ఐదో తరగతిలో చేరిన విద్యార్థులకు విద్య సంవత్సరం ముగిసినా కనీసం ఒక జత దుస్తులు కూడా అందలేదు. దీంతో గిరిజన విద్యార్థులపై ఎంత నిర్లక్ష్యం చూపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే వీరు 2014-15 విద్య సంవత్సరంలోకి వచ్చినా నేటికీ ఒక జత దుస్తులు కూడా ఇవ్వలేక పోయారు. విద్యార్థుల దుస్తుల కోసం క్లాత్‌ను నేరుగా పాఠశాలలకు పంపితే దుర్వినియోగమవుతుందనే ఉద్దేశంతో ఐటీడీఏ రంపచోడవరంలోని ఫ్యాషన్ టెక్నాలజీ సెంటర్లో కుట్టించి పాఠశాలలకు సరఫరా చేసేది. అయితే ఈ ఏడాది మళ్లీ తిరిగి క్లాత్‌ను నేరుగా పాఠశాలలకు పంపి, సంబంధిత హెచ్ఎంలు దుస్తులు కుట్టించి విద్యార్థులకు అందించాలని గిరిజన సంక్షేమ విద్య విభాగం వారు తెలిపారు. అయితే మారుమూల ప్రాంతాల్లోని టైలర్ల సమస్య ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు దుస్తులు కుట్టించి, పాఠశాల ప్రారంభం నాటికి కనీసం రెండు జతలు అందిస్తే బాగుంటుంది. కానీ ఐటీడీఏ పట్టించుకోవడం లేదు. దుస్తులు ఇవ్వడానికి చర్యలు గిరిజన సంక్షేమ శాఖ డీడీ మణికుమార్ మాట్లాడుతూ ఈ ఏడాది పూర్తి స్థాయిలో విద్యార్థులకు దుస్తులు ఇవ్వడానికి చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే క్లాత్‌ను పాఠశాలలకు అందించాం.