చిన్నారులకు దుస్తులు పంచుతూ... ; భార్యతో కలిసి సేకరించిన దుస్తులను ప్యాక్ చేస్తూ...
ఒరిస్సాలో ఏదో ఒక ఉదయం ఏదో ఒక మారుమూల పల్లెలో వ్యాన్ ఆగుతుంది. దానిని చూసిన వెంటనే పిల్లల కళ్లల్లో వెలుగు. కటిక దారిద్య్రం వల్ల చలికాలమైనా వానాకాలమైనా ఒంటి నిండా బట్టలు లేని వారికి గగన్ బట్టలు పంచుతాడు. రిటైర్డ్ ఉద్యోగి అయిన పెయిటల్ గగన్ తన భార్యతో కలిసి ఊరూరా తిరిగి బట్టలు సేకరించి పంచుతాడు. పిల్లల పసినవ్వును ఆశీర్వాదంగా పొందుతాడు.
సంఘటనలు అందరికీ ఎదురవుతుంటాయి. కొందరు స్పందిస్తారు. కొందరు స్పందించరు. కొందరు ఆ సంఘటనలతో తమ లక్ష్యాన్ని, కర్తవ్యాన్ని తెలుసుకుంటారు. అలాంటి వారు ఆదర్శంగా నిలుస్తారు.
పదేళ్ల క్రితం– భువనేశ్వర్‌లో చిన్న పోస్టల్ ఉద్యోగైన గగన్ పెయిటల్ ఇంటికి వెళుతున్నాడు. అతనికి వాణి విహార్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక దిక్కులేని మహిళ కనిపించింది. ఆమె చిరిగిన చీర కట్టుకుని ఉంది. గగన్ ఆమెను చూసి జాలిపడి హోటల్ నుంచి ఫుడ్ ప్యాకెట్ తెచ్చి ఇచ్చాడు. కాని ఆమె ‘అన్నం వద్దు.
ముందు ఒక చీర ఇవ్వండి’ అని ప్రాధేయపడింది. స్త్రీగా ఆమె అవస్థ గమనించిన గగన్ వెంటనే ఇంటికి వెళ్లి తన తల్లి పాత చీర తెచ్చి ఇచ్చాడు. ‘దానిని అందుకుంటూ ఆమె ముఖంలో కనిపించిన సంతోషం అంతా ఇంతా కాదు. ఒంటికి తగిన బట్ట ఉంటేనే మనిషికి మర్యాద. అది లేని వారు ఈ దేశంలో ఎందరో ఉన్నారు. వారి కోసం ఏదైనా చేయాలి అని నిశ్చయించుకున్నాను’ అంటాడు గగన్. ఉద్యోగంలో ఉండగా మొదలుపెట్టిన ఈ పనిని రిటైరయ్యాక కూడా కొనసాగిస్తున్నాడు.
చిన్న ఉద్యోగి అయినా
పోస్టాఫీసులో చిరుద్యోగిగా పని చేసి రిటైరైన గగన్ భువనేశ్వర్‌లో చకైసియాని ప్రాంతంలో నివసిస్తాడు. కొడుకు మృత్యుంజయ బలిగూడ అనే ఊళ్లో క్యాబ్ డ్రైవర్. కోడలు టీచర్‌గా పని చేస్తున్నది. ఇతర బాదరబందీలు లేని గగన్ తన భార్య అన్నపూర్ణకు తన ఆలోచన చెప్పాడు. ‘మనం అందరికీ కొత్త బట్టలు ఇవ్వలేం. అలాగని అన్నేసి పాత బట్టలూ ఉండవు. కాబట్టి సేకరించి పంచుదాం’ అన్నాడు. అన్నపూర్ణ అతనికి సహరించడానికి అంగీకరించింది. ఆ రోజు నుంచి గగన్ తనకు ఖాళీ ఉన్నప్పుడల్లా భువనేశ్వర్‌లోని అపార్ట్‌మెంట్లకూ హౌసింగ్ కాలనీలకు తిరిగి వాడిన దుస్తులను సేకరిస్తాడు. అవసరమైతే కటక్ వంటి ఇతర పట్టణాలకు కూడా వెళతాడు. ‘పేదలకు పంచుతాం. మీరు ఉపయోగించక పడేసిన దుస్తులు ఇవ్వండి’ అంటే చాలామంది ఇస్తారు. వాటిని తీసుకొస్తాడు గగన్.
సరి చేసి, ఇస్త్రీ చేసి
‘మనం బట్టలు పంచినా అవి సరిగ్గా ఉండాలి. మావారు తెచ్చిన బట్టలు ఏవైనా చిరిగి ఉంటే కుట్టి, ఇస్త్రీ చేసి, స్త్రీలవి, పురుషులవి, పిల్లలవి విడివిడిగా ప్యాక్ చేసి కొత్తవిగా కనిపించేలా చేస్తాను’ అంటుంది గగన్ భార్య అన్నపూర్ణ. వాళ్లుండేది చిన్న ఇల్లే అయినా ఒక గది ఖాళీ చేసి పూర్తిగా గోడౌన్‌గా వదిలారు. భార్యాభర్తలిద్దరూ డాబా మీదకు చేరి వాటిని విభజించి మూటలుగా కడతారు. ఆ తర్వాత గగన్ తీసుకెళ్లి పంచుతాడు.
బట్టలు, బూట్లు, దోమతెరలు
గగన్ ముఖ్యంగా చిన్నపిల్లల కోసం బట్టలు సేకరిస్తాడు. ఒడిసాలో గిరిజన పిల్లలకు సరైన బట్టలు ఉండవు. కొండ ప్రాంతాలకు వెళ్లి వారి బాగోగులు ఎవరూ చూడరు. గగన్ అలాంటి పిల్లల కోసం బట్టలు సేకరించి పంచుతాడు. గగన్ సేవా భావం గమనించిన దాతలు అతనికో వ్యాన్ ఏర్పాటు చేశారు. గగన్‌కు ఏనుగంత బలం వచ్చింది. తాను సేకరించిన బట్టలను వ్యాన్‌లో వేసుకుని మారుమూల పల్లెలకు వెళ్లి పిల్లలకు పంచుతాడు. దోమలు కుట్టి పసికందులు రోగాల బారిన పడకుండా దోమతెరలు పంచుతాడు. బొమ్మలు ఇస్తాడు. పిల్లలు ఎంతో సంతోషంగా వాటిని స్వీకరిస్తారు. బట్టల తాత అని పిలుస్తారు.
పండుగల ముందు
ఒడిసాలో చేసుకునే పండగల ముందు చాలా శ్రమించి బట్టలు సేకరిస్తాడు గగన్. పేదలు పండగ సమయంలో వీలైనంత మంచి బట్టలు వేసుకోవాలని ఆ సమయాలలో ప్రత్యేకంగా తీసుకెళ్లి పంచుతాడు. అంతేకాదు పూరి జగన్నాథ రథ యాత్ర సమయంలోనూ, కటక్ దుర్గా పూజకూ ఎక్కడెక్కడి పేదవారో వస్తారు. అక్కడ ప్రత్యేకంగా స్టాల్స్ పెట్టి మరీ పాత బట్టలు పంచుతాడు.
ఈ దేశంలో ప్రతి పేదవాళ్లకి ఒంటినిండా బట్ట దొరికే దాకా గగన్ లాంటి వాళ్లు వందలుగా పని చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వారుగా ఎవరైనా ఉండొచ్చు. ప్రయత్నించాలి... కొద్దిగా మనసు పెట్టాలి అంతే.
Comments
Please login to add a commentAdd a comment