Postel service
-
పోస్టాఫీసుల్లో మరో 600 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు
న్యూఢిల్లీ: తపాలా శాఖల్లో 2028–29 నాటికి మరో 600 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల ఏర్పాటుకు వీలుగా తపాలా శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ మధ్య ఒప్పందం కుదిరినట్టు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు. ‘భారత ఆర్థిక సదస్సు 2024’ కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు. తపాలా శాఖకు దేశవ్యాప్తంగా 6,40,000 విక్రయ కేంద్రాలున్నాయని, ప్రపంచంలో మరే సంస్థకు ఈ స్థాయి నెట్వర్క్ లేదన్నారు. పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు 2017తో ప్రారంభం కాగా.. 1.52 కోట్ల మందికి పైగా సేవలు అందించడంలో ఇవి కీలకంగా పనిచేస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 442 పోస్టాఫీసు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలున్నాయి. -
Paital Gagan: బట్టల తాత వచ్చాడోచ్
ఒరిస్సాలో ఏదో ఒక ఉదయం ఏదో ఒక మారుమూల పల్లెలో వ్యాన్ ఆగుతుంది. దానిని చూసిన వెంటనే పిల్లల కళ్లల్లో వెలుగు. కటిక దారిద్య్రం వల్ల చలికాలమైనా వానాకాలమైనా ఒంటి నిండా బట్టలు లేని వారికి గగన్ బట్టలు పంచుతాడు. రిటైర్డ్ ఉద్యోగి అయిన పెయిటల్ గగన్ తన భార్యతో కలిసి ఊరూరా తిరిగి బట్టలు సేకరించి పంచుతాడు. పిల్లల పసినవ్వును ఆశీర్వాదంగా పొందుతాడు. సంఘటనలు అందరికీ ఎదురవుతుంటాయి. కొందరు స్పందిస్తారు. కొందరు స్పందించరు. కొందరు ఆ సంఘటనలతో తమ లక్ష్యాన్ని, కర్తవ్యాన్ని తెలుసుకుంటారు. అలాంటి వారు ఆదర్శంగా నిలుస్తారు. పదేళ్ల క్రితం– భువనేశ్వర్‌లో చిన్న పోస్టల్ ఉద్యోగైన గగన్ పెయిటల్ ఇంటికి వెళుతున్నాడు. అతనికి వాణి విహార్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక దిక్కులేని మహిళ కనిపించింది. ఆమె చిరిగిన చీర కట్టుకుని ఉంది. గగన్ ఆమెను చూసి జాలిపడి హోటల్ నుంచి ఫుడ్ ప్యాకెట్ తెచ్చి ఇచ్చాడు. కాని ఆమె ‘అన్నం వద్దు. ముందు ఒక చీర ఇవ్వండి’ అని ప్రాధేయపడింది. స్త్రీగా ఆమె అవస్థ గమనించిన గగన్ వెంటనే ఇంటికి వెళ్లి తన తల్లి పాత చీర తెచ్చి ఇచ్చాడు. ‘దానిని అందుకుంటూ ఆమె ముఖంలో కనిపించిన సంతోషం అంతా ఇంతా కాదు. ఒంటికి తగిన బట్ట ఉంటేనే మనిషికి మర్యాద. అది లేని వారు ఈ దేశంలో ఎందరో ఉన్నారు. వారి కోసం ఏదైనా చేయాలి అని నిశ్చయించుకున్నాను’ అంటాడు గగన్. ఉద్యోగంలో ఉండగా మొదలుపెట్టిన ఈ పనిని రిటైరయ్యాక కూడా కొనసాగిస్తున్నాడు. చిన్న ఉద్యోగి అయినా పోస్టాఫీసులో చిరుద్యోగిగా పని చేసి రిటైరైన గగన్ భువనేశ్వర్‌లో చకైసియాని ప్రాంతంలో నివసిస్తాడు. కొడుకు మృత్యుంజయ బలిగూడ అనే ఊళ్లో క్యాబ్ డ్రైవర్. కోడలు టీచర్‌గా పని చేస్తున్నది. ఇతర బాదరబందీలు లేని గగన్ తన భార్య అన్నపూర్ణకు తన ఆలోచన చెప్పాడు. ‘మనం అందరికీ కొత్త బట్టలు ఇవ్వలేం. అలాగని అన్నేసి పాత బట్టలూ ఉండవు. కాబట్టి సేకరించి పంచుదాం’ అన్నాడు. అన్నపూర్ణ అతనికి సహరించడానికి అంగీకరించింది. ఆ రోజు నుంచి గగన్ తనకు ఖాళీ ఉన్నప్పుడల్లా భువనేశ్వర్‌లోని అపార్ట్మెంట్లకూ హౌసింగ్ కాలనీలకు తిరిగి వాడిన దుస్తులను సేకరిస్తాడు. అవసరమైతే కటక్ వంటి ఇతర పట్టణాలకు కూడా వెళతాడు. ‘పేదలకు పంచుతాం. మీరు ఉపయోగించక పడేసిన దుస్తులు ఇవ్వండి’ అంటే చాలామంది ఇస్తారు. వాటిని తీసుకొస్తాడు గగన్. సరి చేసి, ఇస్త్రీ చేసి ‘మనం బట్టలు పంచినా అవి సరిగ్గా ఉండాలి. మావారు తెచ్చిన బట్టలు ఏవైనా చిరిగి ఉంటే కుట్టి, ఇస్త్రీ చేసి, స్త్రీలవి, పురుషులవి, పిల్లలవి విడివిడిగా ప్యాక్ చేసి కొత్తవిగా కనిపించేలా చేస్తాను’ అంటుంది గగన్ భార్య అన్నపూర్ణ. వాళ్లుండేది చిన్న ఇల్లే అయినా ఒక గది ఖాళీ చేసి పూర్తిగా గోడౌన్‌గా వదిలారు. భార్యాభర్తలిద్దరూ డాబా మీదకు చేరి వాటిని విభజించి మూటలుగా కడతారు. ఆ తర్వాత గగన్ తీసుకెళ్లి పంచుతాడు. బట్టలు, బూట్లు, దోమతెరలు గగన్ ముఖ్యంగా చిన్నపిల్లల కోసం బట్టలు సేకరిస్తాడు. ఒడిసాలో గిరిజన పిల్లలకు సరైన బట్టలు ఉండవు. కొండ ప్రాంతాలకు వెళ్లి వారి బాగోగులు ఎవరూ చూడరు. గగన్ అలాంటి పిల్లల కోసం బట్టలు సేకరించి పంచుతాడు. గగన్ సేవా భావం గమనించిన దాతలు అతనికో వ్యాన్ ఏర్పాటు చేశారు. గగన్‌కు ఏనుగంత బలం వచ్చింది. తాను సేకరించిన బట్టలను వ్యాన్‌లో వేసుకుని మారుమూల పల్లెలకు వెళ్లి పిల్లలకు పంచుతాడు. దోమలు కుట్టి పసికందులు రోగాల బారిన పడకుండా దోమతెరలు పంచుతాడు. బొమ్మలు ఇస్తాడు. పిల్లలు ఎంతో సంతోషంగా వాటిని స్వీకరిస్తారు. బట్టల తాత అని పిలుస్తారు. పండుగల ముందు ఒడిసాలో చేసుకునే పండగల ముందు చాలా శ్రమించి బట్టలు సేకరిస్తాడు గగన్. పేదలు పండగ సమయంలో వీలైనంత మంచి బట్టలు వేసుకోవాలని ఆ సమయాలలో ప్రత్యేకంగా తీసుకెళ్లి పంచుతాడు. అంతేకాదు పూరి జగన్నాథ రథ యాత్ర సమయంలోనూ, కటక్ దుర్గా పూజకూ ఎక్కడెక్కడి పేదవారో వస్తారు. అక్కడ ప్రత్యేకంగా స్టాల్స్ పెట్టి మరీ పాత బట్టలు పంచుతాడు. ఈ దేశంలో ప్రతి పేదవాళ్లకి ఒంటినిండా బట్ట దొరికే దాకా గగన్ లాంటి వాళ్లు వందలుగా పని చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వారుగా ఎవరైనా ఉండొచ్చు. ప్రయత్నించాలి... కొద్దిగా మనసు పెట్టాలి అంతే. -
పోస్టల్ శాఖ ద్వారా సీఎంకు శుభాకాంక్షలు
అవనిగడ్డ: సీఎం వైఎస్ జగన్‌కి రూ.10తో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసే అవకాశం పోస్టల్ శాఖ కల్పిస్తోంది. ఈ నెల 21న సీఎం జగన్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయాలనుకునే వారు పోస్టాఫీస్‌లో రూ.10 చెల్లిస్తే వారి అడ్రస్‌తో సందేశం చేరుతుంది. రాష్ట్రంలోని అన్ని పోస్టాఫీస్‌ల నుంచి వచ్చే సందేశాలను మంగళగిరి ప్రధాన పోస్టాఫీస్ ద్వారా ముఖ్యమంత్రికి చేరవేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 20 లోపు ప్రధాన పోస్టాఫీస్‌కు వచ్చి రూ.10 చెల్లించి సీఎంకు జన్మదిన శుభాకాంక్షల సందేశం పంపవచ్చని కృష్ణా జిల్లా అవనిగడ్డ పోస్టుమాస్టర్ సింహాద్రి రామలింగేశ్వరరావు తెలిపారు. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు స్థానిక హెడ్‌పోస్టాఫీస్ ద్వారా సీఎంకు శుక్రవారం జన్మదిన శుభాకాంక్షల సందేశం పంపించారు. -
World Post Day 2021: జ్ఞాపకాల మూట
World Post Day 2021: నిన్న మొన్నటి వరకూ టెలిఫోన్ కలిగిన వారిదే. మధ్యతరగతిది ఉత్తరం. పేదవాడికి పోస్ట్‌కార్డ్. కనీసం ఐదు దశాబ్దాల భారతీయుల జీవన భావోద్వేగాలు లేఖలు, ఉత్తరాలు, ఇంటర్వ్యూ కార్డులు, మనీ ఆర్డర్ల చుట్టే తిరిగాయి. ఉత్తరం లేకపోతే... పోస్ట్‌మేన్ లేకపోతే ఆ జ్ఞాపకాలు ఉండేవా? అక్టోబర్ 9 ‘వరల్డ్ పోస్ట్ డే’ సందర్భంగా కొన్ని ఉద్వేగాల రీవిజిట్. ‘ఇద్దరం ఉద్యోగానికి అప్లై చేద్దాం. నా వంతు డబ్బులు నావి. ఏవీ... మీ డబ్బులు ఇవ్వండి’ అని నిస్సిగ్గుగా సావిత్రి దగ్గరి నుంచి అడిగి మరీ తీసుకుంటాడు ఎన్టీఆర్ ‘మిస్సమ్మ’లో. ఆ నిరుద్యోగ రోజులు అలాంటివి. వారి అప్లికేషన్ పోస్ట్‌లో అందుకున్న వెంటనే ఎస్.వి.రంగారావు ‘యూ ఆర్ సెలెక్టెడ్’ అని టెలిగ్రామ్ ఇమ్మంటాడు మేనల్లుడు ఏఎన్నార్‌ని. అంతేనా ఖర్చులకు 200 ఎం.ఓ కూడా చేయమంటాడు. చూడండి... ఒక్క సీనులో ఎన్ని పోస్టాఫీసు సేవలు అవసరమయ్యాయో. ఆ సేవలు లేకుంటే ఎన్టీఆర్, సావిత్రి ఉద్యోగంలో చేరేవారూ కాదు... ‘రావోయి చందమామ’ పాడేవారూ కాదు. గాంధీ గారికి ఉత్తరాలు రాయకుండా ఏ రోజూ గడవలేదు. నెహ్రూ జైలులో ఉండి తన కుమార్తె ఇందిరకు తెగ ఉత్తరాలు రాశారు. ఉత్తరం రాయడం ఒక మర్యాద. ఉత్తరం అందుకోవడం ఒక గౌరవం. ఉత్తరాలు ఒకరికొకరు రాసుకుంటూ ఉండటం స్నేహం. కాని ఉత్తరం కేవలం పెద్దవాళ్ల వ్యవహారంగా కొంతకాలమే ఉంది. పేదవాళ్లు, మధ్యతరగతి వారు ఉత్తరాలను మొదలెట్టారు. వీధి మొదలులో వేలాడదీసి ఉండే ఎర్రటి పోస్ట్ డబ్బాను గుర్తించారు. ఊళ్లో ఆ రోజుల్లో స్కూల్ మేష్టారు లేదంటే పోస్ట్మేస్టారే కదా గౌరవనీయులు. ‘పెళ్లి చేసి చూడు’లో ఏఎన్నార్ తండ్రి తెలుగు మేష్టారు రావికొండలరావు. కొడుకు పంపాల్సిన మనియార్డర్ ఏదిరా అని పోస్ట్మేన్ని దబాయిస్తాడు. ‘రాలేదు మేష్టారు’ అనంటే ‘వస్తే అందరూ ఇస్తారు. రాకపోయినా ఇవ్వడమే గొప్పదనం’ అంటాడు. 1970లు, 80లు కొడుకుల మనిఆర్డర్ల కోసం తల్లిదండ్రుల కళ్లు కాయలు కాచేలా చేశాయి. నిరుద్యోగ భారతంలో కొడుకు ఉద్యోగం సంపాదించి ఎంతో కొంత పంపితేనే జరుగుబాటైన ఇళ్లు. ఆ రోజుల్లో అకౌంట్లు ఎవరికీ ట్రాన్స్ఫర్లు ఎవరికీ ఫోన్‌పేలు ఎవరికీ? మని ఆర్డరే. పోస్ట్‌మేన్ మనీ ఆర్డర్ తెచ్చి ఇస్తే సంతోషించి ఆ ఇంటి ఇల్లాలు మజ్జిగ ఇచ్చేది. ఇంటి పెద్ద రూపాయో రెండ్రూపాయలో బక్షీసు ఇచ్చేవాడు. ఆ పూట ఆ ఇంట్లో గుండెల మీద కాకుండా వంటగదిలోనే కుంపటి వెలిగేది. సౌదీ, అమెరికా, రంగూన్... వలస వెళ్లిన వారి ఉత్తరాలు నెలల తరబడి వేచి చూస్తే తప్ప వచ్చేవి కావు. సైన్యంలో చేరిన వారి బాగోగులు ఉత్తరాలు చెప్తే తప్ప తెలిసేవి కావు. పట్నంలో చదువుకుంటున్న కొడుకు పరీక్ష ఫీజు కోసం రాసిన పోస్ట్‌కార్డు అతి బరువుగా అనిపించేది. కాపురానికి వెళ్లిన కూతురు నుంచి వచ్చిన ప్రతి ఉత్తరం ఉలికిపాటును తెచ్చేదే. ఆ కూతురు కూడా తక్కువ తిన్నదా? కష్టాలన్నీ తాను దిగమింగుతూ సంతోషంగా ఉన్నట్టు తెగ నటించదూ? ఇంటర్వూకు కాల్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్, స్టడీ మెటీరియల్, కలం స్నేహం కోసం మొదలెట్టిన జాబులు, పత్రికకు పంపిన కథకు జవాబు, తకరారులో చిక్కుకుంటే వచ్చే కోర్టు నోటీసు, వ్యాపార లావాదేవీల కరెస్పాండెన్సు, అభిమాన హీరోకు లేఖ రాస్తే పంపే ఫొటో, వశీకరణ ఉంగరం... ఎన్నని. అన్నీ ఆ ఖాకీ బట్టల పోస్ట్‌మేన్ చేతుల మీదుగా అందేవి. తెలిసేవి. సంతోషపెట్టేవి. బాధించేవి. గెలిపించేవి. ఓడించేవి. ఇక కథల్లో, నవలల్లో, సినిమాల్లో ఉత్తరాలు సృష్టించిన ‘డ్రామా’ అంతా ఇంతా కాదు. ‘పోస్ట్ అన్న కేకతో పడక్కుర్చీలోని పరంధామయ్యగారు ఉలిక్కిపడ్డారు’ అనే లైనుతో ఎన్నో కథలు మొదలయ్యేవి. ఉత్తరాలు అందక ఏర్పడిన అపార్థాలు, ఒకరి ఉత్తరం ఇంకొకరికి చేరి చేసే హంగామాలు, ఒకరి పేరుతో మరొకరు రాసే ప్రేమ లేఖలు.. వీటిలో పోస్ట్మేన్లది ఏ పాపమూ ఉండదు. కాని వారికి తెలియకనే వ్యవహారమంతా వారి చేతుల మీదుగా నడుస్తుంటుంది. ఉత్తరాలు బట్వాడా చేయాల్సింది వారే కదా. కొందరు పోస్ట్‌బాక్స్ నంబర్ తీసుకుని ఆ నంబర్ మీదే సవాలక్ష వ్యవహారాలు నడిపేవారు. బుక్పోస్ట్ను ఉపయోగించి పుస్తకాలు పంపని కవులు, రచయితలు లేరు. రిజిస్టర్డ్ పోస్ట్ విత్ డ్యూ అక్నాలెడ్జ్మెంట్ అయితే ఆ ధీమా వేరు. ‘టెలిగ్రామ్’కు పాజిటివ్ ఇమేజ్ లేదు. అది వచ్చిందంటే ఏదో కొంపలు మునిగే వ్యవహారమే. సంతవ్సరం పొడుగూతా సేవ చేసే పోస్ట్‌మేన్ మహా అయితే అడిగితే దసరా మామూలు. అది కూడా ఇవ్వక వారిని చిన్నబుచ్చేవారు కొందరు. చాలీ చాలని జీతంతో, ఎండనక వాననక సైకిల్ తొక్కుతూ ఇల్లిల్లు తిరిగి క్షేమ సమాచారాలు ఇచ్చి ఊరడింప చేసే ఆత్మీయుడు పోస్ట్‌మేన్ మధ్యతరగతి భారతదేశంలో కనిపించని పాత్ర పోషించాడు. ఇవాళ కథే మారిపోయి ఉండవచ్చు. ప్రతి ఒక్కరి సెల్ఫోన్లో ఒక పోస్టాఫీసు, బ్యాంకు, టెలిగ్రామ్ ఆఫీసు ఉండొచ్చు. కాని ఆ రోజుల్లో ఉండే మానవీయ అంశ ఈ కృత్రిమ మెషీన్లో ఎక్కడిది. చేతిరాతతో అందుకునే ఉత్తరం జాడ ఎక్కడిది. ఆ చెరగని గుర్తు ఎక్కడిది. దాచుకున్న ఉత్తరాలు జ్ఞాపకాల మూటగా మారడం ఇవాళ ఎవరికి తెలుసు. ఆ కాలానికి ధన్యవాదాలు. థ్యాంక్యూ పోస్ట్‌మేన్. ‘‘ఇప్పుడు ప్రతి ఒక్కరి సెల్ఫోన్లో ఒక పోస్టాఫీసు, బ్యాంకు, టెలిగ్రామ్ ఆఫీసు ఉండొచ్చు. కాని ఆ రోజుల్లో ఉండే మానవీయ అంశ ఈ కృత్రిమ మెషీన్లో ఎక్కడిది. దాచుకున్న ఉత్తరాలు జ్ఞాపకాల మూటగా మారడం ఇవాళ ఎవరికి తెలుసు.’’ -
పోస్టల్ బ్యాలెట్లో గుర్తులుండవ్..
సాక్షి, కాజీపేట: సాధారణంగా సర్పంచి నుంచి పార్లమెంటు ఎన్నికల వరకు జరిగే ఎన్నికల్లో అభ్యర్థులకు ఆయా పార్టీల గుర్తులు ఉంటాయి. స్వతంత్ర అభ్యర్థులకు సైతం ఎన్నికల కమిషన్ సూచించిన ఏదో ఒక గుర్తు కేటాయిస్తారు. కానీ పోస్టల్ బ్యాలెట్లో మాత్రం గుర్తులు ఉండవు. అభ్యర్థుల పేర్లు, పార్టీల పేర్లు మాత్రమే ఉంటాయి. గతంలో బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరిగినప్పుడు మామూలు ఓటర్లకిచ్చే బ్యాలెట్ పత్రాన్నే ఉద్యోగులకు ఇచ్చేవారు. ప్రస్తుతం ఈవీఎం యంత్రాలు రావడంతో వారికి యంత్రంలో ఓటేసే పరిస్థితి లేదు. దీంతో పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటుచేశారు. ఎన్నికల విధులకు వెళ్లే అధికారులు, ఉద్యోగులకు ఎన్నికల శిక్షణ సమయంలోనే పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. ఎన్నికల శిక్షణ ముగిసేలోపు వారంతా పోస్టల్ బ్యాలెట్ కోసం ఫాం–12 ద్వారా వారు తమ పూర్తి వివరాలు రాసి దరఖాస్తు చేసుకుంటారు. కౌంటింగ్‌లో మొదటగా పోస్టల్ బ్యాలెట్లనే అధికారులు లెక్కగడతారు. ఏ అభ్యర్థికి ఎన్ని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయని లెక్కచూసిన తర్వాతే ఈవీఎం యంత్రాల్లోని ఓట్లను లెక్కిస్తారు. రెండో ఈవీఎం ఎప్పుడు వినియోగిస్తారంటే... కాజీపేట: పెరిగిన సాంకేతికతను దృష్టిలో పెట్టుకుని కొద్ది కాలంగా ప్రతి ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సుల స్థానంలో ఈవీఎంలను వినియోగిస్తున్నారు. ఒక ఈవీఎంలో 64 మంది అభ్యర్థుల పేర్లను రికార్డు చేయవచ్చు. అంతకు మించి అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉంటే రెండో ఈవీఎంను వినియోగిస్తారు. ఒక ఈవీఎంలో 3,740 ఓట్లు మాత్రమే వేయడానికి అవకాశం ఉంటుంది. -
కొట్టేసిన పర్సులు @ పోస్ట్‌బాక్స్
చెన్నై: జేబు దొంగలు కొత్త పద్ధతి కనుగొన్నారు. కొట్టేసిన పర్సులను తెలివిగా వదిలించుకుంటున్నారు. ఐడీ కార్డులున్న పర్సులను వదిలించుకునేందుకు పోస్టు బాక్సులను స్వర్గధామంగా వాడుకుంటున్నారని చెన్నైలోని పోస్టల్ డిపార్ట్మెంట్ చెబుతోంది. గత ఆరు నెలలుగా ఇలాంటివి చాలా కేసులు తమ దృష్టికి వచ్చాయని తెలిపింది. పర్సుల నుంచి డబ్బులు తీసుకున్నాక వాటిని పోస్టు బాక్సుల్లో వేస్తున్నారని, అందులో ఐడీ కార్డులను మాత్రం ముట్టుకోకుండా అలాగే ఉంచేస్తున్నారని చెన్నై పోస్టల్ అధికారి ఒకరు తెలిపారు. గత ఆరు నెలల్లో చెన్నై సిటీ కార్పొరేషన్ పరిధిలో దాదాపు 70 కేసులు తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు. పర్సుల్లో ఆధార్, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్సుల వంటివి ఉంటున్నట్లు తమ సిబ్బంది గుర్తించిందని చెప్పారు. అందులో ఉన్న ఐడీ కార్డులు సరైన అడ్రస్‌కు చేరుకునేలా తమ సిబ్బంది చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని, అలా చేయడం వల్ల తమకేం ఆదాయం రాదని, అయినా ఇదో సేవలాగా తాము ఈ పనిచేస్తున్నామని వివరించారు. ఐడీ కార్డుల్లో ఫోన్ నంబర్ తదితర వివరాలుంటే వారిని సంప్రదించి సంబంధిత పోస్టాఫీసుల్లో తీసుకోవాలని సూచిస్తున్నారు.