World Post Day 2021: జ్ఞాపకాల మూట | World Post Day 2021: Special story on letters History | Sakshi
Sakshi News home page

World Post Day: జ్ఞాపకాల మూట

Published Sat, Oct 9 2021 5:47 AM | Last Updated on Sat, Oct 9 2021 4:26 PM

World Post Day 2021: Special story on letters History - Sakshi

World Post Day 2021: నిన్న మొన్నటి వరకూ టెలిఫోన్‌ కలిగిన వారిదే. మధ్యతరగతిది ఉత్తరం. పేదవాడికి పోస్ట్‌కార్డ్‌. కనీసం ఐదు దశాబ్దాల భారతీయుల జీవన భావోద్వేగాలు లేఖలు, ఉత్తరాలు, ఇంటర్వ్యూ కార్డులు, మనీ ఆర్డర్‌ల చుట్టే తిరిగాయి. ఉత్తరం లేకపోతే... పోస్ట్‌మేన్‌ లేకపోతే ఆ జ్ఞాపకాలు ఉండేవా? అక్టోబర్‌ 9 ‘వరల్డ్‌ పోస్ట్‌ డే’ సందర్భంగా కొన్ని ఉద్వేగాల రీవిజిట్‌.

‘ఇద్దరం ఉద్యోగానికి అప్లై చేద్దాం. నా వంతు డబ్బులు నావి. ఏవీ... మీ డబ్బులు ఇవ్వండి’ అని నిస్సిగ్గుగా సావిత్రి దగ్గరి నుంచి అడిగి మరీ తీసుకుంటాడు ఎన్టీఆర్‌ ‘మిస్సమ్మ’లో. ఆ నిరుద్యోగ రోజులు అలాంటివి. వారి అప్లికేషన్‌ పోస్ట్‌లో అందుకున్న వెంటనే ఎస్‌.వి.రంగారావు ‘యూ ఆర్‌ సెలెక్టెడ్‌’ అని టెలిగ్రామ్‌ ఇమ్మంటాడు మేనల్లుడు ఏఎన్నార్‌ని. అంతేనా ఖర్చులకు 200 ఎం.ఓ కూడా చేయమంటాడు.


చూడండి... ఒక్క సీనులో ఎన్ని పోస్టాఫీసు సేవలు అవసరమయ్యాయో. ఆ సేవలు లేకుంటే ఎన్టీఆర్, సావిత్రి ఉద్యోగంలో చేరేవారూ కాదు... ‘రావోయి చందమామ’ పాడేవారూ కాదు.

గాంధీ గారికి ఉత్తరాలు రాయకుండా ఏ రోజూ గడవలేదు. నెహ్రూ జైలులో ఉండి తన కుమార్తె ఇందిరకు తెగ ఉత్తరాలు రాశారు. ఉత్తరం రాయడం ఒక మర్యాద. ఉత్తరం అందుకోవడం ఒక గౌరవం. ఉత్తరాలు ఒకరికొకరు రాసుకుంటూ ఉండటం స్నేహం. కాని ఉత్తరం కేవలం పెద్దవాళ్ల వ్యవహారంగా కొంతకాలమే ఉంది. పేదవాళ్లు, మధ్యతరగతి వారు ఉత్తరాలను మొదలెట్టారు. వీధి మొదలులో వేలాడదీసి ఉండే ఎర్రటి పోస్ట్‌ డబ్బాను గుర్తించారు. ఊళ్లో ఆ రోజుల్లో స్కూల్‌ మేష్టారు లేదంటే పోస్ట్‌మేస్టారే కదా గౌరవనీయులు.

‘పెళ్లి చేసి చూడు’లో ఏఎన్నార్‌ తండ్రి తెలుగు మేష్టారు రావికొండలరావు. కొడుకు పంపాల్సిన మనియార్డర్‌ ఏదిరా అని పోస్ట్‌మేన్‌ని దబాయిస్తాడు. ‘రాలేదు మేష్టారు’ అనంటే ‘వస్తే అందరూ ఇస్తారు. రాకపోయినా ఇవ్వడమే గొప్పదనం’ అంటాడు.


1970లు, 80లు కొడుకుల మనిఆర్డర్‌ల కోసం తల్లిదండ్రుల కళ్లు కాయలు కాచేలా చేశాయి. నిరుద్యోగ భారతంలో కొడుకు ఉద్యోగం సంపాదించి ఎంతో కొంత పంపితేనే జరుగుబాటైన ఇళ్లు. ఆ రోజుల్లో అకౌంట్లు ఎవరికీ ట్రాన్స్‌ఫర్లు ఎవరికీ ఫోన్‌పేలు ఎవరికీ? మని ఆర్డరే. పోస్ట్‌మేన్‌ మనీ ఆర్డర్‌ తెచ్చి ఇస్తే సంతోషించి ఆ ఇంటి ఇల్లాలు మజ్జిగ ఇచ్చేది. ఇంటి పెద్ద రూపాయో రెండ్రూపాయలో బక్షీసు ఇచ్చేవాడు. ఆ పూట ఆ ఇంట్లో గుండెల మీద కాకుండా వంటగదిలోనే కుంపటి వెలిగేది.

సౌదీ, అమెరికా, రంగూన్‌... వలస వెళ్లిన వారి ఉత్తరాలు నెలల తరబడి వేచి చూస్తే తప్ప వచ్చేవి కావు. సైన్యంలో చేరిన వారి బాగోగులు ఉత్తరాలు చెప్తే తప్ప తెలిసేవి కావు. పట్నంలో చదువుకుంటున్న కొడుకు పరీక్ష ఫీజు కోసం రాసిన పోస్ట్‌కార్డు అతి బరువుగా అనిపించేది. కాపురానికి వెళ్లిన కూతురు నుంచి వచ్చిన ప్రతి ఉత్తరం ఉలికిపాటును తెచ్చేదే. ఆ కూతురు కూడా తక్కువ తిన్నదా? కష్టాలన్నీ తాను దిగమింగుతూ సంతోషంగా ఉన్నట్టు తెగ నటించదూ?

ఇంటర్వూకు కాల్‌ లెటర్, అపాయింట్‌మెంట్‌ లెటర్, స్టడీ మెటీరియల్, కలం స్నేహం కోసం మొదలెట్టిన జాబులు, పత్రికకు పంపిన కథకు జవాబు, తకరారులో చిక్కుకుంటే వచ్చే కోర్టు నోటీసు, వ్యాపార లావాదేవీల కరెస్పాండెన్సు, అభిమాన హీరోకు లేఖ రాస్తే పంపే ఫొటో, వశీకరణ ఉంగరం... ఎన్నని. అన్నీ ఆ ఖాకీ బట్టల పోస్ట్‌మేన్‌ చేతుల మీదుగా అందేవి. తెలిసేవి. సంతోషపెట్టేవి. బాధించేవి. గెలిపించేవి. ఓడించేవి.

ఇక కథల్లో, నవలల్లో, సినిమాల్లో ఉత్తరాలు సృష్టించిన ‘డ్రామా’ అంతా ఇంతా కాదు. ‘పోస్ట్‌ అన్న కేకతో పడక్కుర్చీలోని పరంధామయ్యగారు ఉలిక్కిపడ్డారు’ అనే లైనుతో ఎన్నో కథలు మొదలయ్యేవి. ఉత్తరాలు అందక ఏర్పడిన అపార్థాలు, ఒకరి ఉత్తరం ఇంకొకరికి చేరి చేసే హంగామాలు, ఒకరి పేరుతో మరొకరు రాసే ప్రేమ లేఖలు.. వీటిలో పోస్ట్‌మేన్‌లది ఏ పాపమూ ఉండదు. కాని వారికి తెలియకనే వ్యవహారమంతా వారి చేతుల మీదుగా నడుస్తుంటుంది. ఉత్తరాలు బట్వాడా చేయాల్సింది వారే కదా.

కొందరు పోస్ట్‌బాక్స్‌ నంబర్‌ తీసుకుని ఆ నంబర్‌ మీదే సవాలక్ష వ్యవహారాలు నడిపేవారు. బుక్‌పోస్ట్‌ను ఉపయోగించి పుస్తకాలు పంపని కవులు, రచయితలు లేరు. రిజిస్టర్డ్‌ పోస్ట్‌ విత్‌ డ్యూ అక్నాలెడ్జ్‌మెంట్‌ అయితే ఆ ధీమా వేరు. ‘టెలిగ్రామ్‌’కు పాజిటివ్‌ ఇమేజ్‌ లేదు. అది వచ్చిందంటే ఏదో కొంపలు మునిగే వ్యవహారమే.

సంతవ్సరం పొడుగూతా సేవ చేసే పోస్ట్‌మేన్‌ మహా అయితే అడిగితే దసరా మామూలు. అది కూడా ఇవ్వక వారిని చిన్నబుచ్చేవారు కొందరు. చాలీ చాలని జీతంతో, ఎండనక వాననక సైకిల్‌ తొక్కుతూ ఇల్లిల్లు తిరిగి క్షేమ సమాచారాలు ఇచ్చి ఊరడింప చేసే ఆత్మీయుడు పోస్ట్‌మేన్‌ మధ్యతరగతి భారతదేశంలో కనిపించని పాత్ర పోషించాడు.

ఇవాళ కథే మారిపోయి ఉండవచ్చు. ప్రతి ఒక్కరి సెల్‌ఫోన్‌లో ఒక పోస్టాఫీసు, బ్యాంకు, టెలిగ్రామ్‌ ఆఫీసు ఉండొచ్చు. కాని ఆ రోజుల్లో ఉండే మానవీయ అంశ ఈ కృత్రిమ మెషీన్‌లో ఎక్కడిది. చేతిరాతతో అందుకునే ఉత్తరం జాడ ఎక్కడిది. ఆ చెరగని గుర్తు ఎక్కడిది. దాచుకున్న ఉత్తరాలు జ్ఞాపకాల మూటగా మారడం ఇవాళ ఎవరికి తెలుసు. ఆ కాలానికి ధన్యవాదాలు. థ్యాంక్యూ పోస్ట్‌మేన్‌.
 
‘‘ఇప్పుడు ప్రతి ఒక్కరి సెల్‌ఫోన్‌లో ఒక పోస్టాఫీసు, బ్యాంకు, టెలిగ్రామ్‌ ఆఫీసు ఉండొచ్చు. కాని ఆ రోజుల్లో ఉండే మానవీయ అంశ ఈ కృత్రిమ మెషీన్‌లో ఎక్కడిది.  దాచుకున్న ఉత్తరాలు జ్ఞాపకాల మూటగా మారడం ఇవాళ ఎవరికి తెలుసు.’’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement