ఇంటింటికీ తిరుగుతున్నారు.. అకౌంట్లు తెరిపిస్తున్నారు | The postal department was followed by people | Sakshi
Sakshi News home page

ఇంటింటికీ తిరుగుతున్నారు.. అకౌంట్లు తెరిపిస్తున్నారు

Published Thu, Mar 16 2023 3:24 AM | Last Updated on Thu, Mar 16 2023 3:33 PM

The postal department was followed by people - Sakshi

సాక్షి, హైదరాబాద్‌  : పూర్వ వైభవాన్ని సాధించే క్రమంలో తపాలా శాఖ ఎప్పటికప్పుడు కొత్త పథకాలను, సేవలను ప్రవేశపెట్టడం ప్రారంభించింది. అయితే వీటి గురించిన ప్రచారం పెద్దగా లేకపోవడంతో, రెగ్యులర్‌గా పోస్టాఫీసులకు వెళ్లేవారికి తప్ప మిగతా వారికి అవగాహన ఉండటం లేదు. ఈ నేపథ్యంలోనే శాఖ సిబ్బంది ప్రజలకు చేరువగా వెళుతున్నారు. బ్యానర్లు, కరపత్రాలు పట్టుకుని ఊరూరా, ఇంటింటా తిరుగుతున్నారు.

పోస్టాఫీసును, వాటి ద్వారా అందుబాటులో ఉన్న సేవలను గుర్తు చేస్తున్నారు. తపాలాఫీసును ఉత్తరాల బట్వాడా కార్యాలయంగానే చూడకుండా.. వివిధ ప్రజోపయోగ సేవలకు కేంద్రంగా గుర్తించాలంటూ కరపత్రాల ద్వారా ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం మంచి ఫలితాన్ని ఇవ్వడం, ప్రజల నుంచి అనూహ్య స్పందన వ్యక్తం కావడం విశేషం. 

తోక లేని పిట్ట 90 ఆమడలు తిరిగిందట ..ఏంటది..?
అంటూ..ఒకప్పుడు పోస్టు కార్డు గురించిన పొడుపు కథ విప్పమని అడిగేవారు.ఇప్పటితరానికి పోస్టు కార్డు తెలియదు.. పొడుపు కథ అంతకన్నా తెలియదు. కొందరికి తపాలా కార్యాలయం (పోస్టాఫీసు) గురించి కూడా తెలియదంటే అతిశయోక్తి కాదు.

ప్రైవేటు కొరియర్‌ సంస్థలు, బ్యాంకులుపుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన తర్వాత తపాలా శాఖ ఒకప్పటి వైభవం క్రమంగా తగ్గుతూ వచ్చింది.ఇక జనం తపాలా సేవలను మరిచిపోతున్నారా? అన్నట్టుగా పరిస్థితి తయారయ్యింది. దీంతో పోస్టల్‌డిపార్ట్‌మెంట్‌ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తానే జనం బాట పట్టి మంచి ఫలితాలు సాధిస్తోంది. 

గ్రామీణ ప్రాంతాలపై దృష్టి
వివిధ పథకాలకు సంబంధించిన ప్రత్యేక మేళాలు నిర్వహించడంతో పాటు కరపత్రాలు, బ్యానర్లతో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. బ్యాంకులు, ఏటీఎంలు అంతగా అందుబాటులో ఉండనందున, గ్రామాల్లో ప్రచారం చేస్తూ మైక్రో ఏటీఎంల ద్వారా తమ సిబ్బందే ఫోన్‌ చేస్తే ఇంటికి డబ్బు తెచ్చి అందిస్తారని, పోస్టాఫీసులకు వెళ్లినా డబ్బు చెల్లిస్తారని, రైతు బంధు లాంటివి కూడా ఇంటికే వచ్చి ఇస్తారంటూ ప్రచారం చేస్తున్నారు.

ఈ విధంగా ఇటీవల వారం రోజుల్లోనే 1,52,833 పొదుపు ఖాతాలను తెరిపించిన తెలంగాణ సర్కిల్‌ జాతీయ స్థాయిలో ఐదో స్థానంలో నిలిచింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలోని పొదుపు ఖాతాల సంఖ్య 42,55,352కు చేరుకుంది. వీటిల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 6,76,975 ఖాతాలు తెరవడం గమనార్హం.  

ఆకర్షిస్తున్న వడ్డీ శాతాలు 
వృద్ధుల పేరుతో ఖాతాలు తెరిస్తే గరిష్టంగా 8 శాతం వడ్డీ చెల్లిస్తుండటం జనం తపాలా ఖాతాల వైపు మళ్లేందుకు కారణమవుతోంది. ఆడపిల్లల పేరుతో చేసే పొదుపు మొత్తంపై 7.6 వడ్డీ చెల్లిస్తున్న కారణంగా సుకన్య సమృద్ధి యోజన ఖాతాలకు డిమాండ్‌ పెరిగింది.

ఇటీవల మేళాలు ఏర్పాటు చేసి ప్రచారం చేసిన కేవలం మూడు రోజుల్లోనే కొత్తగా 34,384 ఖాతాలు తెరుచుకున్నాయి. దీంతో మొత్తం ఖాతాల సంఖ్య 5,71,659కి చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఈ తరహాలో 92,509 ఖాతాలు తెరుచుకోవడం విశేషం. 

 ‘సుకన్య సమృద్ధి యోజన పథకం కింద బాలికల పేరిట పొదుపు ఖాతా తెరిస్తే 7.6 శాతం వడ్డీతో ఆ మొత్తం చూస్తుండగానే పెరుగుతూ పోతుంది. వారి చదువులకు, పెళ్లిళ్లకు ఎంతో ఉపయోగపడుతుంది..’అంటూ తపాలా శాఖ ప్రజల్లోకి వెళ్లింది. సిబ్బంది చేసిన కృషి ఫలించింది. తల్లిదండ్రులు కేవలం 3 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 34 వేల ఖాతాలు తెరిచారు. 
   ‘తపాలా కార్యాలయాల్లో పొదుపు ఖాతాలు తెరిస్తే మంచి వడ్డీతో పాటు మైక్రో ఏటీఎం ద్వారా పోస్ట్‌మాన్‌ ఇంటికి డబ్బు పట్టుకొస్తారు. ఏటీఎంకు దూరంగా ఉన్నామన్న బెంగ అవసరం లేదు..’అంటూ తపాలా శాఖ సిబ్బంది మహా మేళాల ద్వారా చేసిన ప్రచారానికి మంచి స్పందన లభించింది. కేవలం వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 1.53 లక్షల కొత్త పొదుపు ఖాతాలు తెరుచుకున్నాయి. 

తపాలా శాఖ ద్వారా 150 రకాల సేవలు అందిస్తున్నాం. వీటిల్లో చాలావరకు పోస్టాఫీసు వరకు రాకుండా పోస్ట్‌మాన్‌ ద్వారానే పొందవచ్చు. జనవరి నుంచి ఖాతాలపై వడ్డీని కూడా పెంచాం. కానీ ప్రజల్లో వీటిపై పెద్దగా అవగాహన లేదు. అందుకే మేమే వారి వద్దకు వెళ్తున్నాం. మా ప్రయత్నం మంచి ఫలితాన్నిస్తోంది.  

 –పీవీఎస్‌ రెడ్డి, పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement