వస్త్ర వ్యాపారంలో రెండో ముంబయిగా ‘పామిడి’
నాణ్యమైన దుస్తులకు కేరాఫ్
పామిడి: రాయలసీమ జిల్లాల్లోనే నాణ్యమైన వస్త్రాలకు ఖ్యాతి గాంచింది అనంతపురం జిల్లా పామిడి. 65 వేల మంది జనాభా ఉన్న పామిడిలో 85 శాతం మంది వస్త్ర వ్యాపారంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఏ వీధికెళ్లినా వస్త్ర దుకాణాలే కనిపిస్తాయి. కేవలం టెక్స్‌టైల్‌లోనే కాకుండా రెడీమేడ్ దుస్తుల తయారీలోనూ రెండో ముంబయిగా ఖ్యాతిగాంచింది.
గ్రామం ఆవిర్భావం నుంచే...
శతాబ్దాల క్రితం ఆవిర్భవించిన పామిడి గ్రామానికి పెద్ద చరిత్రనే ఉంది. పూర్వం పరుశురాముడి స్వైరవిహారం నుంచి తప్పించుకుని కుటుంబాలతో వలస వచ్చిన క్షత్రియులు పామిడి పెన్నానది ఒడ్డున సింగిరప్ప కొండపై స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు పూర్వీకులు చెబుతున్నారు. అనంతరం ప్రస్తుతమున్న గ్రామానికి తమ మకాం మార్చి జీవనోపాధి కింద దుస్తులకు రంగుల అద్దకం పనిని చేపట్టారు.
దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం వరకూ పామిడిలో కుటీర పరిశ్రమగా రంగుల అద్దకం పని కొనసాగింది. ఈ నైపుణ్యం వారిని రాయల్ టైలర్స్‌గా, డ్రెస్ డిజైనర్లుగా ఎదగడానికి దోహదపడింది. గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతం నుంచి వలస రావడంతో వీరిని భావసార క్షత్రియులుగా పిలిచేవారు.
రెడీమేడ్‌కు పెట్టింది పేరు
దాదాపు ఐదు దశాబ్దాల క్రితం వరకూ పామిడి వాసులు ర్యాగ్స్ (ఒక సెం.మీ. వెడల్పు ఉన్న వస్త్రం)తో చిన్నారుల ఫ్యాన్సీ డ్రెస్‌లు కుట్టి అతి తక్కువ ధరకు విక్రయించేవారు. ఈ క్రమంలో పరిశ్రమల నుంచి బేళ్ల కొద్దీ సరుకును దిగుమతి చేసుకునేవారు. చేతి నిండా పని దొరకడంతో ప్రతి ఇంట్లోనూ రెండు, మూడు కుట్టుమిషన్లపై ఉదయం నుంచి రాత్రి వరకూ డ్రెస్‌లు కుట్టేవారు.
ప్రస్తుతం నైటీలు, నైట్ ప్యాంట్లను కుడుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలను కరువు రక్కసి పీడించిన రోజుల్లోనూ పామిడిలో ఉపాధికి ఢోకా ఉండేది కాదు. తర్వాతి కాలంలో మిల్లుల నుంచి కట్‌పీస్‌లు తెప్పించి కిలోల లెక్కన అమ్మడం మొదలు పెట్టారు. వీటితోనే ప్రస్తుతం నైట్ ప్యాంట్లు తయారవుతున్నాయి.
జైపూర్ కాటన్‌తో నైటీలను పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడి ఉత్పత్తులకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. నైటీలకు సంబంధించి 70కి పైగా, నైట్ ప్యాంట్‌లకు సంబంధించి 50 దాకా కుటీర పరిశ్రమలు ఇక్కడ వెలిశాయి. అన్ని కులాలకు చెందిన వారు ఈ వ్యాపారంలో రాణిస్తున్నారు.
ధర తక్కువ.. నాణ్యత ఎక్కువ
వస్త్ర వ్యాపారంలో పామిడి వాసుల ప్రత్యేకతే వేరు. కేవలం వస్త్ర వ్యాపారం సాగించే వీధినే ప్రత్యేకంగా ఉంది. ఈ వీధిలో 130కు పైగా వస్త్ర దుకాణాలు ఉన్నాయి. ఏ వస్త్రం నాణ్యత ఏపాటిదో కంటితో చూస్తే చెప్పే నైపుణ్యం ఇక్కడి వారి సొంతం. వస్త్ర పరిశ్రమలు విస్తారంగా ఉన్న గుజరాత్, మహారాష్ట్ర నుంచి తమకు అవసరమైన ముడిసరుకును దిగుమతి చేసుకుని వ్యాపారం సాగిస్తూ వచ్చారు.
నేరుగా పరిశ్రమల నుంచి వస్త్రాలను దిగుమతి చేసుకోవడంతో వినియోగదారులకు చాలా తక్కువ ధరకే లభ్యమయ్యేవి. నాణ్యమైన వస్త్రాలను మాత్రమే విక్రయిస్తూ పామిడి ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపజేశారు. ఇక్కడి వస్త్రాలు కొనుగోలు చేసి ధరిస్తే ఏళ్ల తరబడి రంగు వెలిసిపోవని వినియోగదారుల నమ్మకం.
దీంతో మూడు దశాబ్దాల వరకూ రాయలసీమ జిల్లాల్లో ఎవరింట శుభకార్యం జరిగినా పామిడికి చేరుకుని వస్త్రాలు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం ఎక్కడికక్కడ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ రావడంతో పామిడి వైపు ఎక్కువగా దృష్టి సారించలేకపోతున్నారు.
మన్నిక భేష్
పామిడి వ్రస్తాల మన్నిక చాలా బాగుంటుంది. ధర కూడా తక్కువే. ప్రత్యేకించి ఎక్కువ మొత్తంలో వస్త్రాలు కొనుగోలు చేయాలనుకునేవారు తప్పనిసరిగా పామిడికి వస్తుంటారు. ఇక ఇళ్ల వద్ద చీరలు, ఇతర వస్త్రాలు విక్రయించాలనుకునే మహిళలు సైతం పామిడిలోనే కొనుగోలు చేస్తుండడం విశేషం.
– డి.హొన్నూరుసాహెబ్, కల్లూరు
నాణ్యతగా ఉంటాయి
మా గ్రామం గొప్పతనం చెప్పడం కాదు కానీ, ఇక్కడ ఒక్కసారి వస్త్రాలు కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరూ నాణ్యమైన సరుకు కావాలంటే పామిడికే వెళ్లాలని చెబుతుంటారు. ప్రస్తుతమున్న ధర ప్రకారం ఇతర ప్రాంతాల్లో రూ.900 చెల్లించి కొనుగోలు చేసిన ఓ ప్యాంట్ పీస్ నాణ్యతకు అదే ధరతో పామిడిలో కొనుగోలు చేసే ప్యాంట్ పీస్ నాణ్యతకు చాలా తేడా ఉంటుంది.
ఇక్కడ కొనుగోలు చేసిన వస్త్రాలు చాలా కాలం పాటు మన్నిక వస్తాయి. రంగు వెలిసిపోదు. దీంతో నాణ్యత కావాలనుకునే వారు పామిడికే వచ్చి వస్త్రాలు కొనుగోలు చేస్తుంటారు.
– పి.శివకుమార్, పామిడి
Comments
Please login to add a commentAdd a comment