pamidi
-
ఊరంతా దుస్తులే!
పామిడి: రాయలసీమ జిల్లాల్లోనే నాణ్యమైన వస్త్రాలకు ఖ్యాతి గాంచింది అనంతపురం జిల్లా పామిడి. 65 వేల మంది జనాభా ఉన్న పామిడిలో 85 శాతం మంది వస్త్ర వ్యాపారంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఏ వీధికెళ్లినా వస్త్ర దుకాణాలే కనిపిస్తాయి. కేవలం టెక్స్టైల్లోనే కాకుండా రెడీమేడ్ దుస్తుల తయారీలోనూ రెండో ముంబయిగా ఖ్యాతిగాంచింది. గ్రామం ఆవిర్భావం నుంచే... శతాబ్దాల క్రితం ఆవిర్భవించిన పామిడి గ్రామానికి పెద్ద చరిత్రనే ఉంది. పూర్వం పరుశురాముడి స్వైరవిహారం నుంచి తప్పించుకుని కుటుంబాలతో వలస వచ్చిన క్షత్రియులు పామిడి పెన్నానది ఒడ్డున సింగిరప్ప కొండపై స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు పూర్వీకులు చెబుతున్నారు. అనంతరం ప్రస్తుతమున్న గ్రామానికి తమ మకాం మార్చి జీవనోపాధి కింద దుస్తులకు రంగుల అద్దకం పనిని చేపట్టారు.దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం వరకూ పామిడిలో కుటీర పరిశ్రమగా రంగుల అద్దకం పని కొనసాగింది. ఈ నైపుణ్యం వారిని రాయల్ టైలర్స్గా, డ్రెస్ డిజైనర్లుగా ఎదగడానికి దోహదపడింది. గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతం నుంచి వలస రావడంతో వీరిని భావసార క్షత్రియులుగా పిలిచేవారు. రెడీమేడ్కు పెట్టింది పేరు దాదాపు ఐదు దశాబ్దాల క్రితం వరకూ పామిడి వాసులు ర్యాగ్స్ (ఒక సెం.మీ. వెడల్పు ఉన్న వస్త్రం)తో చిన్నారుల ఫ్యాన్సీ డ్రెస్‌లు కుట్టి అతి తక్కువ ధరకు విక్రయించేవారు. ఈ క్రమంలో పరిశ్రమల నుంచి బేళ్ల కొద్దీ సరుకును దిగుమతి చేసుకునేవారు. చేతి నిండా పని దొరకడంతో ప్రతి ఇంట్లోనూ రెండు, మూడు కుట్టుమిషన్లపై ఉదయం నుంచి రాత్రి వరకూ డ్రెస్‌లు కుట్టేవారు. ప్రస్తుతం నైటీలు, నైట్ ప్యాంట్లను కుడుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలను కరువు రక్కసి పీడించిన రోజుల్లోనూ పామిడిలో ఉపాధికి ఢోకా ఉండేది కాదు. తర్వాతి కాలంలో మిల్లుల నుంచి కట్పీస్లు తెప్పించి కిలోల లెక్కన అమ్మడం మొదలు పెట్టారు. వీటితోనే ప్రస్తుతం నైట్ ప్యాంట్లు తయారవుతున్నాయి. జైపూర్ కాటన్‌తో నైటీలను పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడి ఉత్పత్తులకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. నైటీలకు సంబంధించి 70కి పైగా, నైట్ ప్యాంట్లకు సంబంధించి 50 దాకా కుటీర పరిశ్రమలు ఇక్కడ వెలిశాయి. అన్ని కులాలకు చెందిన వారు ఈ వ్యాపారంలో రాణిస్తున్నారు. ధర తక్కువ.. నాణ్యత ఎక్కువ వస్త్ర వ్యాపారంలో పామిడి వాసుల ప్రత్యేకతే వేరు. కేవలం వస్త్ర వ్యాపారం సాగించే వీధినే ప్రత్యేకంగా ఉంది. ఈ వీధిలో 130కు పైగా వస్త్ర దుకాణాలు ఉన్నాయి. ఏ వస్త్రం నాణ్యత ఏపాటిదో కంటితో చూస్తే చెప్పే నైపుణ్యం ఇక్కడి వారి సొంతం. వస్త్ర పరిశ్రమలు విస్తారంగా ఉన్న గుజరాత్, మహారాష్ట్ర నుంచి తమకు అవసరమైన ముడిసరుకును దిగుమతి చేసుకుని వ్యాపారం సాగిస్తూ వచ్చారు. నేరుగా పరిశ్రమల నుంచి వస్త్రాలను దిగుమతి చేసుకోవడంతో వినియోగదారులకు చాలా తక్కువ ధరకే లభ్యమయ్యేవి. నాణ్యమైన వస్త్రాలను మాత్రమే విక్రయిస్తూ పామిడి ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపజేశారు. ఇక్కడి వస్త్రాలు కొనుగోలు చేసి ధరిస్తే ఏళ్ల తరబడి రంగు వెలిసిపోవని వినియోగదారుల నమ్మకం. దీంతో మూడు దశాబ్దాల వరకూ రాయలసీమ జిల్లాల్లో ఎవరింట శుభకార్యం జరిగినా పామిడికి చేరుకుని వస్త్రాలు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం ఎక్కడికక్కడ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ రావడంతో పామిడి వైపు ఎక్కువగా దృష్టి సారించలేకపోతున్నారు. మన్నిక భేష్ పామిడి వ్రస్తాల మన్నిక చాలా బాగుంటుంది. ధర కూడా తక్కువే. ప్రత్యేకించి ఎక్కువ మొత్తంలో వస్త్రాలు కొనుగోలు చేయాలనుకునేవారు తప్పనిసరిగా పామిడికి వస్తుంటారు. ఇక ఇళ్ల వద్ద చీరలు, ఇతర వస్త్రాలు విక్రయించాలనుకునే మహిళలు సైతం పామిడిలోనే కొనుగోలు చేస్తుండడం విశేషం. – డి.హొన్నూరుసాహెబ్, కల్లూరు నాణ్యతగా ఉంటాయిమా గ్రామం గొప్పతనం చెప్పడం కాదు కానీ, ఇక్కడ ఒక్కసారి వస్త్రాలు కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరూ నాణ్యమైన సరుకు కావాలంటే పామిడికే వెళ్లాలని చెబుతుంటారు. ప్రస్తుతమున్న ధర ప్రకారం ఇతర ప్రాంతాల్లో రూ.900 చెల్లించి కొనుగోలు చేసిన ఓ ప్యాంట్ పీస్ నాణ్యతకు అదే ధరతో పామిడిలో కొనుగోలు చేసే ప్యాంట్ పీస్ నాణ్యతకు చాలా తేడా ఉంటుంది. ఇక్కడ కొనుగోలు చేసిన వస్త్రాలు చాలా కాలం పాటు మన్నిక వస్తాయి. రంగు వెలిసిపోదు. దీంతో నాణ్యత కావాలనుకునే వారు పామిడికే వచ్చి వస్త్రాలు కొనుగోలు చేస్తుంటారు. – పి.శివకుమార్, పామిడి -
టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కీలక నేత రాజీనామా
జిల్లాలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే గ్రూపు తగాదాలు.. అన్నదమ్ముల కొట్లాటలు.. పార్టీ పెద్దల తీరుతో ద్వితీయశ్రేణి నేతల తీవ్ర అసంతృప్తులతో సతమతమవుతున్న ఆ పార్టీకి మరో షాక్ తగిలింది. పార్టీ కీలక నాయకుడు, దర్శి టీడీపీ ఇన్చార్జి పమిడి రమేష్ అధిష్టానంపై తిరుగుబావుటా ఎగురవేశారు. పార్టీ కోసం తాను ఎంత కష్టపడినా అధినేత గుర్తించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. అంతేకాదు నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని మూసివేసి తాళాలు వేసేశారు. ఇందుకు సంబంధించిన వీడియో జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: దర్శి టీడీపీలో ముసలం మొదలైంది. ఇప్పటికే దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో పూర్తిగా తుడిచి పెట్టుకు పోయిన ఆ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ ఇన్చార్జిగా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు పమిడి రమేష్ పరోక్షంగా ప్రకటించడంతోపాటు, అధిష్టానం తాను కష్టపడి పనిచేస్తున్నా గుర్తింపు లేదనే వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇటీవల ఒంగోలు నగర శివారులో జరిగిన మహానాడుతో రాష్ట్రవ్యాప్తంగా పారీ్టలో ఉత్సాహం నింపాలనే టీడీపీ అధినేత చంద్రబాబు విపరీతమైన ప్రచారాలు చేసినా ఫలితాలు ఇవ్వడం లేదన్నది ఈ సంఘటనతో రుజువైంది. జిల్లాలో ఇప్పటికే పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న విషయం తెలిసిందే. ప్రతి నియోజకవర్గంలో గ్రూపుల గోల టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తోంది. అసలే పార్టీని ప్రజలు విశ్వసించని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో పార్టీ అధినేత నుంచి ఇన్చార్జి వరకు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, ఆందోళనలు చేయకుండా పర్సనల్ విషయాలను తెరపైకి తెచ్చి రాజకీయాలు చేయడం పట్ల ఆ పార్టీలోనే తీవ్ర అసంతృప్తి మొదలైంది. 2020 నవంబరు నుంచి దర్శి నియోజకవర్గ ఇన్చార్జిగా పమిడి రమేష్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తిరిగి పార్టీ పటిష్టతకు కృషి చేశారు. పార్టీ కార్యక్రమాలకు సొంత డబ్బును ఖర్చు చేస్తూ వచ్చారు. ఇంత చేస్తున్నా పార్టీ అధిష్టానం తనను గుర్తించడం లేదని సన్నిహితుల వద్ద పలు మార్లు వాపోయినట్టు సమాచారం. ఇదిలా ఉండగా మహానాడు తరువాత పారీ్టలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలపై ఆయన తీవ్ర మనస్తాపం చెందారు. పార్టీ అధినేత సైతం పట్టించుకోకపోవడంతో బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన వర్గీయులు బహిరంగంగానే చెబుతున్నారు. అంతేకాకుండా ఇప్పటికే నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని మూసివేసి తాళాలు వేయడంతో ఇక దర్శి నియోజకవర్గంలో టీడీపీ క్లోజ్ అనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనతో టీడీపీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. మరో రెండేళ్లలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ బాధ్యతలు మోసేవారు కరువడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 75 నియోజకవర్గాల్లో టీడీపీకి ఇన్చార్జిలు లేరని స్వయంగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా చెప్పుకునే నారా లోకేష్ ప్రకటించిన నేపథ్యంలో దర్శికి కూడా ఇన్చార్జి లేకుండా పోవడం ఆపార్టీ దీన స్థితికి నిలువుటద్దంగా నిలుస్తోంది. ఇప్పటికే వైఎస్సార్ సీపీలోకి మాజీ ఎమ్మెల్యేలు: దర్శి నియోజకవర్గం నుంచి 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావుతోపాటు, 2012లో దర్శి టీడీపీ ఎమ్మెల్యే అభ్యరి్థగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు సైతం వైఎస్సార్సీపీలో చేరిపోయారు. దీంతో దర్శిలో టీడీపీకి నాయకత్వం వహించే దిక్కే లేకుండా పోయింది. 2020 నవంబరులో పమిడి రమేష్ టీడీపీ ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ నియోజకవర్గంలో గ్రూపుల గోలతో నెట్టుకుంటూ వచ్చారు. అయితే టీడీపీ అధిష్టానం తీరుతో ఆవేదన చెంది ఇన్చార్జి పదవి నుంచి తప్పుకుంటున్నట్లుగా ఆపార్టీ వర్గాల్లో చర్చ నెలకొంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు, చీరాల, దర్శి, సంతనూతలపాడు, యర్రగొండపాలెం, గిద్దలూరు వంటి నియోజకవర్గాల్లో టీడీపీకి ఇన్చార్జిలు ఉన్నారా.. లేరా అన్నట్లుగా పరిస్థితి నెలకొని ఉంది. మహానాడు సూపర్ హిట్ అంటూ జబ్బలు చరుచుకుంటున్న ఆ పార్టీ.. మహానాడు నిర్వహించిన జిల్లాలోనే కనీస బలం కూడా పెంచుకోకపోవడం గమనార్హం. జిల్లాలో రోజురోజుకూ పార్టీ పరిస్థితి దిగజారిపోతోందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్శి టీడీపీకి దిక్కెవరు..? దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పమిడి రమేష్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ బాధ్యతలు స్వీకరించేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ద్వితీయ శ్రేణి నేతల్లో ఎవరో ఒకరికి బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం ప్రయత్నాలు చేస్తున్నా గ్రూపు రాజకీయాలకు భయపడి ఎవరూ ముందుకు రావడం లేదనే వాదన కూడా వినిపిస్తోంది. దర్శి టీడీపీలో చెలరేగిన జ్వాలను చల్లార్చాలని ద్వితీయ శ్రేణి నేతలు పార్టీ అధిష్టానానికి మొరపెట్టుకుంటున్నట్లు సమాచారం. పార్టీ పెద్దల తీరుమారకపోతే సొంతపార్టీ నేతలు, కార్యకర్తలే కాకుండా ప్రజలు సైతం ఛీత్కరించుకుంటున్న పరిస్థితి నెలకొంది. -
కటకటాల్లోకి ఎస్ఐ విజయ్‌కుమార్
పామిడి/అనంతపురం క్రైం: అనంతపురం జిల్లా పామిడి మండలం గురుమాంజనేయ కొట్టాలకు చెందిన సభావత్ తిరుపాల్‌నాయక్, సీతమ్మ దంపతుల కుమార్తె ఎస్.సరస్వతి (21) ఆత్మహత్యకు కారణమైన తిరుపతి జిల్లా చంద్రగిరి ఎస్ఐ రమావత్ విజయ్‌కుమార్ నాయక్‌ను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. పామిడి పోలీస్‌స్టేషన్‌లో తాడిపత్రి డీఎస్పీ వీఎన్కే చైతన్య కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. గురుమాంజనేయ కొట్టాల గ్రామానికే చెందిన రమావత్ విజయ్‌కుమార్ నాయక్ 2018లో ఎస్ఐగా ఎంపికయ్యాడు. ప్రస్తుతం చంద్రగిరిలో పనిచేస్తున్నాడు. వరుసకు మామ కూతురైన సరస్వతిని రెండేళ్లుగా ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబర్చుకున్నాడు. అనంతపురానికి చెందిన భారతితోనూ ప్రేమాయణం నడిపాడు. ఆమె అనంతపురం దిశ పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కడంతో భారతిని పెళ్లి చేసుకున్నాడు. కానీ విజయ్‌కుమార్ తనను వంచించడంతో సరస్వతి మనస్తాపానికి గురై బుధవారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్ఐ విజయ్‌కుమార్‌పై 420, 376, 306 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పామిడిలో శనివారం అతన్ని అరెస్టు చేశారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకు సాగండి.. రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
కూలీలను కబళించిన మృత్యువు
పామిడి (అనంతపురం): సద్ది కట్టుకుని ఆటోలో బయల్దేరిన పత్తి కూలీలను లారీ రూపంలో మృత్యువు కబళించింది. అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని జాతీయ రహదారిపైకి వెళ్లే మలుపు వద్ద ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. గార్లదిన్నె మండలం కొప్పలకొండకు చెందిన దాదాపు వంద కుటుంబాలు వ్యవసాయ పనులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. వీరంతా సమీపంలోని పామిడి, పెద్దవడుగూరు మండలాల్లో పత్తి తొలగింపు పనులకు వెళ్తుంటారు. శుక్రవారం వేకువజామున పెద్దవడుగూరు మండలం కొట్టాలపల్లి పొలాల్లో పత్తి తీసేందుకు కొప్పలకొండ నుంచి 14 మంది కూలీలు తమ గ్రామానికే చెందిన డ్రైవర్ నల్లబోతుల లక్ష్మీనారాయణ ఆటోలో బయలుదేరారు. ఆటో పామిడి పట్టణం మీదుగా జాతీయ రహదారిపైకి చేరుకుంటుండగా.. హైదరాబాద్ వైపు నుంచి లారీ ఎదురుగా దూసుకొచ్చి ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో కూలీలు గూడు చౌడమ్మ (32), గోసుల సుబ్బమ్మ (47), గోసుల సావిత్రి (37), మీనుగ నాగవేణి (47), గోసుల శంకరమ్మ (43) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కూలీలు రామలక్ష్మి, సుబ్బరాయుడు, లక్ష్మీదేవి, ఆదిలక్ష్మి, రమాదేవి, నాగవేణి, రేవంత్, జయమ్మతోపాటు ఆటో డ్రైవర్ లక్ష్మీనారాయణ గాయాల పాలయ్యారు. స్పందించిన స్థానికులు క్షతగాత్రులను వెంటనే అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో నల్లబోతుల నాగవేణి (23) మృతి చెందింది. ఆటో డ్రైవర్ లక్ష్మీనారాయణ భార్య జయమ్మ (40) పరిస్థితి విషమంగా ఉంది. పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సీఈవో ఆలూరి సాంబశివారెడ్డి, ఆర్డీవో మధుసూదన్‌లు ఘటనా స్థలంలో సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. -
ఎంపీ గోరంట్ల మాధవ్ ఔదార్యం
సాక్షి, పామిడి: హిందూపురం పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్ తన ఔదార్యం చాటుకున్నారు. గాయపడ్డ క్షతగాత్రుడిని దగ్గరుండిమరీ తన వాహనంలోనే ఆస్పత్రికి తరలించడమే కాకుండా దగ్గరుండి వైద్య చికిత్స చేయించారు. ఆస్పత్రి ఖర్చుంతా తానే భరిస్తానని తెలిపారు. వివరాల్లోకెళితే... మండలంలోని పొగరూరు కెనాల్ గ్రామ క్రాస్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంపీ గోరంట్ల మాధవ్ వాహనాన్ని ద్విచక్ర వాహనం ఢీ కొంది. ఈ ఘటనలో మండలంలోని గజరాంపల్లి గ్రామానికి చెందిన బుచ్చమ్మ గారి వెంకటేశ్వర్‌రెడ్డి (36) గాయాలపాలైనట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అత్యవసర పనినిమిత్తం తన కారులో బయలుదేరారు. మరోవైపు పొగరూరు గ్రామ కెనాల్ క్రాస్ వద్ద ఉన్న తన పొలానికి నీరుగట్టేందుకు వెంకటేశ్వర్‌రెడ్డి వెళ్ళారు. పని ముగించుకొని తన ద్విచక్ర వాహనంలో వెంకటేశ్వర్‌రెడ్డి ఇంటిముఖం పట్టాడు. ఈ క్రమంలో రాంగ్ రూట్లో వెళ్తూ అటుగా వస్తున్న ఎంపీ వాహనాన్ని గమనించకుండా ఢీ కొన్నాడు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వరరెడ్డిని ఎంపీ గోరంట్ల మాధవ్ స్వయంగా పామిడి ప్రభుత్వాస్పత్రికి తన వాహనంలో తరలించి వైద్యం చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రుడిని అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వెంకటేశ్వరరెడ్డి వైద్యానికి అయ్యే ఖర్చుంతా తానే భరిస్తానని ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యానికి ఫోన్ చేసి చెప్పారు. పామిడి ఆస్పత్రిలో క్షతగాత్రునికి దగ్గరుండి వైద్యం చేయిస్తున్న ఎంపీ -
పెన్నా 'కాలవ'
మంత్రి కాలవ శ్రీనివాసులు.. రాయదుర్గం నియోజవర్గానికి ఎమ్మెల్యే. ఆ ప్రాంతంలోని నదీ పరీవాహక ప్రాంతాల్లో ఈ ఐదేళ్లూ ఇసుక అక్రమ రవాణాతో రూ.కోట్లకు పడగలెత్తారనే చర్చ ఉంది. ఇప్పటికే అక్కడి వేదవతి హగరి నది రూపు రేఖలు కోల్పోయింది. ప్రస్తుతం పామిడిలోని పెన్నానది పరిస్థితీ ఇదేవిధంగా ఉంది. ఎన్టీఆర్ గృహ నిర్మాణాల పేరుతో ఈ ప్రాంతం నుంచి ఇసుకను భారీ స్థాయిలో పెద్ద పెద్ద నగరాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మంత్రి అండ చూసుకుని స్థానిక టీడీపీ నేతలు చెలరేగిపోతున్నారు. అడ్డగోలుగా ఇసుక అక్రమ రవాణాతో స్థానిక నేతలే రూ.కోట్లు వెనకేసుకుంటుంటే.. ఇక మంత్రిగారి అక్రమార్జన ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అనంతపురం, పామిడి :పామిడి పెన్నానది ఒకప్పుడు జీవకళతో గలగలపారేది. నిండైన ఇసుక మేటలు.. పాయలుపాయలుగా పారుతున్న నీటితో చూడ ముచ్చటేసేది. 30 సంవత్సరాల క్రితం వరకూ పామిడి చుట్టుపక్కల దాదాపు 20 కిలోమీటర్ల మేర ఎక్కడ తవ్వినా 15 అడుగుల్లోపు సమృద్ధిగా నీరు లభ్యమయ్యేది. బంగారు పంటలు పండేవి. ఏనాడూ ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడింది లేదు. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. టీడీపీ నేతలు అడ్డగోలుగా ఇసుక తరలిస్తుండటంతో పామిడి పెన్నానది నామరూపాల్లేకుండా పోయింది. దురాక్రమణలతో నది కాస్త కాలవగా మారిపోయింది. ఐఓసీ పేరుతో కొంత కాలం.. గతంలో పామిడి పెన్నానది నుంచి గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌తో పాటు స్థానిక టీడీపీ నాయకులు ఇసుకను భారీగా తరలించారు. ఐఓసీ పేరుతో అక్రమ రవాణా కొనసాగించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు తెలంగాణ, కర్ణాటక ప్రాంతాలకూ ఇక్కడి నుంచి ఇసుక ఎగుమతులు చేసి రూ.కోట్లలో లబ్ధి పొందారు. ఇసుక తవ్వకాలతో పామిడి బైపాస్, రైల్వే వంతెనలకు ముప్పు పొంచి ఉంది. వంతెనలకు దిగువన ఇసుక కోసం జేసీబీలతో తోడేయడం వల్ల పెద్దపెద్ద గోతులు ఏర్పడ్డాయి. దీంతో వంతెనలు కూలిపోయే ప్రమాదముందంటూ స్థానికులు, భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయంటూ రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. తాత్కాలికంగా ఇసుక తరలింపులకు అప్పట్లో టీడీపీ నేతలు స్వస్తి పలికారు. కాలవ కన్ను పడి.. తాజాగా పామిడి పెన్నానది నుంచి భారీగా ఇసుక తరలింపులు మొదలయ్యాయి. జేసీబీలను ఏర్పాటు చేసుకుని రేయింబవళ్లూ టిప్పర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారు. రోజూ వందకు పైగా టిప్పర్లలో ఇసుక తరలిపోతోంది. గుంతకల్లు పరిధిలో టిడ్నో కంపెనీ చేపట్టిన ఎన్టీఆర్ గృహ నిర్మాణాలకు ఇసుకతరలించుకునేందుకు సాక్షాత్తూ మంత్రి కాలవ శ్రీనివాసులు అనుమతులు మంజూరు చేశారు. ఈ మేరకు ఓ సిఫారసు పత్రాన్ని రవాణాదారులు చూపిస్తూ అక్రమంగా ఇసుకను హైదరాబాద్, బెంగళూరు, బళ్లారి ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ అక్రమ సంపాదనలో సింహభాగం మంత్రి వాటాగా తెలుస్తోంది. నిర్మాణాలు చేపట్టకనే.. గుంతకల్లు మున్సిపాలిటీ పరిధిలో ఎన్టీఆర్ గృహ నిర్మాణాలు అంటూ తరలిస్తున్న ఇసుక వాస్తవానికి అక్కడకు చేరడం లేదు. గుంతకల్లు నుంచి 15 కిలోమీటర్లు దాటగానే జిల్లా సరిహద్దులు దాటించేసి సొమ్ము చేసుకుంటున్నారు. తొమ్మిది టిప్పర్లకు అనుమతులు ఉన్నాయంటూ 40 టిప్పర్లతో రేయింబవళ్లూ వందకు పైగా ట్రిప్పుల ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. పైగా నిబంధనలకు వ్యతిరేకంగా పెన్నానదిలో జేసీబీలను ఉంచి ఇసుకను తోడేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, బళ్లారి వంటి నగరాలకు ఇసుకను తరలిస్తే టిప్పర్‌కు రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకూ వసూలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ లెక్కన ఒక రోజుకు వంద టిప్పర్లకు రూ.కోటి వరకు దోపిడీ చేస్తున్నారు. పోలీసులకూ వాటా ఇసుక అక్రమ రవాణాను స్థానికులు అడ్డుకోకుండా ఉండేందుకు పోలీసులను తెలుగు తమ్ముళ్లు ప్రభావితం చేశారు. భారీ మొత్తంలో పోలీసులకు మామూళ్లు ముట్టజెబుతూ తమ అక్రమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఇందులో విజిలెన్స్ శాఖకూ వాటాలు ఉన్నట్లు సమాచారం. పట్టపగలే పోలీస్ స్టేషన్ ఎదురుగా ఇసుక లోడుతో టిప్పర్లు వెళుతున్నా.. పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం. సబ్‌సర్ఫేస్ డ్యామ్ నిర్మించాలి ఇసుక అక్రమ రవాణా, ఆక్రమణలతో ప్రస్తుతం పెన్నానది ఉనికి కోల్పోయింది. 200 అడుగుల లోతున తవ్వినా నీరు లభ్యం కావడం లేదు. దీంతో పామిడిలోనే నీటి ఎద్దడి మొదలైంది. నాలుగు రోజులకొకసారి కొళాయిల ద్వారా నీరు అందితే గొప్ప విషయమే. ఇసుక అక్రమ రవాణా, ఆక్రమణలు అరికట్టాలంటే పామిడి వద్ద పెన్నానదిపై సబ్‌సర్ఫేస్ డ్యామ్ నిర్మించాలి. – బసవరెడ్డి, పామిడి -
సీపీఎస్ విధానంపై ‘ఛలో అసెంబ్లీ’ ఉద్రిక్తం
సాక్షి, విజయవాడ: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్‌తో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు గురువారం ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు 13 జిల్లాల నుంచి అమరావతి తరలి వస్తున్న ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. విజయవాడలోని యూటిఎఫ్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఉపాధ్యాయ, ఉద్యోగులు ఛలో అసెంబ్లీకి వెళ్లేందుకు బయటకు వస్తే అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు హెచ్చరికలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు ఛలో అసెంబ్లీకి అనుమతి లేదంటూ... విజయవాడ రైల్వే స్టేషన్, బస్టాండ్లలో పలువురిని అరెస్ట్ చేశారు. అలాగే ఉద్యోగుల ‘ఛలో అసెంబ్లీ’ పిలుపు నేపథ్యంలో గుంటూరు, విజయవాడ, మంగళగిరి నుంచి అసెంబ్లీకి వచ్చే ప్రతి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేస్తున్నారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అసెంబ్లీ, సచివాలయం వద్ద మూడెంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఐడీ కార్డు ఉంటేనే వాహనాలను అటువైపు అనుమతిస్తున్నారు. అలాగే ప్యాఫ్టో యూనియన్ నాయకులను, ఉపాధ్యాయులను అనంతపురం జిల్లా పామిడి పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 25 మందిని ఆరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌లో నిర్భందించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, ప్యాఫ్టో నేతల నినాదాలతో పోలీస్‌స్టేషన్ హోరెత్తింది. (సీపీఎస్ రద్దు కోరుతూ... కదం తొక్కిన ఉద్యోగులు) సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని మూకుమ్మడిగా నినదించారు. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. హక్కుల కోసం పోరాడుతుంటే అరెస్టులు చేయడం దారుణమన్నారు. ఇదిలాఉండగా.. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో సీపీఎస్ రద్దు తీర్మానం చేయాలని, ఎన్ఎస్డీఎల్ రికవరీలను ఆపాలని, 653, 654, 655 జీవోలను రద్దు చేయాలన్న డిమాండ్లతో ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక
పామిడి : జీ కొట్టాల గ్రామంలో 12 దళిత కుటుంబాలకు సంబంధించి 50 మంది వైఎస్సార్సీపీ నియో జకవర్గ సమన్వయకర్త వై వెంక టరామిరెడ్డి సమక్షంలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ కం డువాలతో వారిని వైవీఆర్ పార్టీ లోకి ఆహ్వానించారు. పార్టీలో చేరినవారి లో ఈశ్వరయ్య, హనుమంతు, ఓబులేసు, ఆదినారాయణ, ఉలింద, లక్ష్మీదేవి, రమాదేవి, రాధమ్మ, తదితర కుటుం బాలవారున్నారు. ప్రజాసంకల్పయాత్ర చేస్తూ నిరంతరం ప్రజలకో సం శ్రమిస్తూ , ప్రత్యేకహోదా సాధన కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న జగన్ పట్ల ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు వారు చెప్పారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టన చంద్రబాబు పీకి ప్రత్యేకహోదా విషయంలో పూటకో మాట, రోజుకో యూటర్న్‌లతో ఐదుకోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కేంద్రం వద్ద చంద్రబాబు తాకట్టు పెట్టారని వైవీఆర్ విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయలబ్ధి కోసం తిరిగి ప్రత్యేకహోదాను తెరపైకి తెచ్చి రంగులేని డ్రామాలతో దొంగదీక్ష, సైకిల్‌యాత్రతో ఐదుకోట్ల ఆంధ్రుల చెవుల్లో పూలు పెడుతున్న సీఎం బాబును ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. మొదటి నుం చి ప్రత్యేకహోదా కోసం అలుపెరుగని పోరాటాలు చేస్తూ విలువలతో కూడిన రాజకీయ పోరాటం చేస్తున్న జగన్‌కు రోజురోజుకూ ప్రజాదరణ అధికమవుతోందన్నారు. ప్రత్యేకహోదా సాధన, రాష్ట్రాభివృద్ధి జగన్‌తోనే సాధ్యమన్నది జనం అభిమతమన్నారు. బాధితులకు రూ.50 వేలు అందజేత ఇటీవల దాడిలో గాయపడి మృతి చెందిన దళిత ప్రసాద్ కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై వెంకటరామిరెడ్డి ఆదివారం పరామర్శించారు.జీ కొట్టాల గ్రామంలోని బాధిత కుటుం బ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ పోషణకు రూ.50 వేలను వారికి అందజేశారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే అన్ని విధాల ఆదుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. -
పెన్నా గర్భశోకం
►పామిడిలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా ►పోలీసుల అండతో రెచ్చిపోతున్న ఇసుకాసురులు ►గుంతలమయమైన పెన్నాతీరం ►కన్నెత్తి చూడని రెవెన్యూ, మైనింగ్ అధికారులు అక్రమార్కులు పెన్నానదిని తోడేస్తున్నారు. అనుమతులు లేకండానే ఇసుకను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పామిడిలో ఈ ఇసుకదందా తీవ్రం కావడంతో ఈ ప్రాంతంలోని పెన్నాతీరం గుంతలమయమై కనిపిస్తోంది. ఆక్రమణలు కూడా ఎక్కువ కావడంతో నది కుంచించుకుపోతోంది. ఇంత జరుగుతున్నా ఇటు మైనింగ్ అధికారులు గానీ, ఇటు పోలీసులు గాని కన్నెత్తి చూడడం లేదు. - పామిడి: మూడు దశాబ్దాల క్రితం పెన్నానదిలో ఎక్కడ చూసినా ఇసుక దిబ్బలు కనిపించేవి. అప్పట్లో 15 అడుగుల లోతులోనే నీరు పుష్కలంగా లభించేది. రాను రాను అక్రమ ఇసుక రవాణా ఊపందుకోవడంతో ఇసుక తిన్నెలు కనుమరుగయ్యాయి. ప్రస్తుతం పామిడిలో 150 అడుగుల్లో కూడా నీరు లభ్యంకాని పరిస్థితి. దీంతో పట్టణంలో ఎన్నడూలేని విధంగా నీటిఎద్దడి తీవ్రతరమైంది. మరోవైపు పామిడి సమీపంలో పెన్నానదిలో ఆక్రమణలు ఎక్కువ కావడంతో మైదానాన్ని తలపిస్తోంది. కొందరు ఏకంగా నదిలోనే తోటలు సాగు చేస్తున్నారు. రోజుకు రూ.4 లక్షలు విలువ గల ఇసుక తరలింపు గతంలో శింగనమల మండలంలో ఉల్లికల్లు, పెద్దవడుగూరు మండలంలో ఈరన్నపల్లి గ్రామాల వద్ద ఇసుకరీచ్‌లు ఉండేవి. గతంలో అక్కడి నుంచి మాత్రమే ఇనుక తరలించేలా నిబంధనలు ఉండేవి. ఏడాది క్రితం ఇసుక రీచ్‌లు ఎత్తివేశారు. దీంతో అధికారపార్టీ నేతలు ఇసుక అక్రమ రవాణా దందాకు పామిడిని కేంద్రంగా చేసుకున్నారు. పామిడి సమీపంలోని పెన్నానది నుంచి రోజుకు రూ.4 లక్షలు విలువ చేసే ఇసుకను అక్రమంగా రవాణ చేస్తూ కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టర్లు, ట్రిప్పర్లు, లారీల్లో రోజుకు వంద ట్రిప్పులు చొప్పున ఇసుకను బెంగుళూరు, అనంతపురం, గుంతకల్లు, ఉరవకొండ, వజ్రకరూరు ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముఖ్య పట్టణాల్లో అపార్ట్మెంట్ల నిర్మాణానికి, గుంతకల్లు పరిధిలోని రైల్వే డబ్లింగ్ పనులకు ఈ అక్రమ ఇసుకను తరలిస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి ధర గుంతకల్లు, వజ్రకరూరు ప్రాంతాలకు ఒక ట్రాక్టర్ ధర రూ.3 వేలు పలుకుతోంది. అదే అనంతపురానికి అయితే రూ.4 వేలు. ట్రిప్పర్ ఇసుక అయితే రూ.18 వేలు పలుకుతోంది. బెంగుళూరు వంటి ముఖ్య పట్టణాలకు టెన్‌వీలర్ లారీ ఇసుక రూ.1.30 లక్షలు పలుకుతుండడంతో ఇసుకాసురుల అక్రమార్జన మూడు పువ్వులు... ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఈక్రమంలోనే అక్రమ రవాణాను అఽడ్డు రాకుండా పోలీసులకు మామూళ్లు సమర్పిస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. అయితే జిల్లా ఎస్పీగా అశోక్‌కుమార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పోలీసులు అడపా...దడపా...దాడులు నిర్వహిస్తున్నా...పూర్తి స్థాయిలో అడ్డుకోలేకపోతున్నారు. ఈ అక్రమ ఇసుక రవాణాను అరికట్టకపోతే పెన్నాతీరం మైదానంలా మారిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైదానంగా మారింది నదిలోని ఇసుక యథేచ్ఛగా తరలించడంతో దిన్నెలు కరిగిపోయాయి. నది మైదాన ప్రాంతంగా మారింది. ఇసుక అక్రమ రవాణాతో భూగర్భజలాలు అడుగంటాయి. దీంతో పట్టణంలో నీటిఎద్దడి నెలకొంది. –ఎస్ రఘునాథ్ దత్తు, పామిడి. కంపచెట్లమయం పెన్నానదిలో కంపచెట్లు దట్టంగా పెరిగాయి. ఆక్రమణలు, తోటలు, అక్రమ కట్టడాలతో నది కుచించుకుపోతోంది. దీంతో భవిష్యత్‌లో నది మాయమయ్యే పరిస్థితి నెలకొంది. –ఎం రంగనాయకులు, పామిడి కొండాపురం. అక్రమ రవాణను అడ్డుకుంటాం పెన్నానది నుంచి ఇసుక అక్రమ రవాణాను అరికట్టి సహజసంపదను కాపాడతాం. ఇసుకను రవాణా చేసే వారెవరైనా, ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు. పోలీసులకు మామూళ్లు అందుతున్నాయన్న మాటల్లో వాస్తవం లేదు. ఒకటిన్నర నెల వ్యవధిలో 13 ట్రాక్టర్లు, 2 ట్రిప్పర్లు సీజ్ చేసి, రూ.3.15 లక్షల జరిమానా వసూలు చేశాం. పోలీసుల పనితీరుకు ఇదే నిదర్శనం. - రవిశంకర్‌రెడ్డి, ఎస్ఐ, పామిడి -
నీట మునిగిన పంటలు
పామిడి: పామిడిలో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం వరకూ కురిసిన భారీ వర్షానికి పంటలు నీటమునిగాయి. లోతట్టు కాలనీలు, ప్రభుత్వ జూనియర్‌కళాశాల ద్వీపకల్పంగా మారాయి. కేవలం మండలంలోని ఒక నీలూరులోనే 19.62 ఎకరాల పత్తి, వేరుశనగ పంటలు నీట మునిగాయి. అలాగే స్థానిక వైజంక్షన్ వద్ద గల ఓ డిగార్డిగేటర్‌లో 12వేల కేజీల వేరుశనగ పప్పు, వేరుశనగకాయల బస్తాలు తడిసిముద్దాయి. నీలూరులో నీట మునిగిన పంటలను, డీ గార్డిగేటర్‌లో తడిసిముద్ద అయిన వేరుశనగ బస్తాలను ఇన్చార్జ్ తహసీల్దార్ ఆర్.బాలాజీరాజు పరిశీలించారు. నష్టంపై రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. -
పామిడిలో వీధులు జలమయం
ఇళ్లలో చేరిన నీరు నీటమునిగిన పంటలు దంచేసిన వాన పామిడి: ఇన్నాళ్లూ ఊరిస్తూ వచ్చిన వరుణుడు ఒక్కసారిగా తన ఉగ్రరూపం చూపాఽడు. జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరుగా వర్షం కురిసినా...పామిడి మండలంలో మాత్రం దంచేసింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం 10 గంటల వరకూ ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో 70 మిల్లీ మీటర్ల వర్షంపాతం నమోదైంది. దీంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలైన వెంగమనాయుడుకాలనీ, చైతన్యకాలనీ, వీకే ఆదినారాయణరెడ్డి కాలనీ, సీఎస్ఐ చర్చీవీధి జలమయమయ్యాయి. వెంగమనాయుడుకాలనీలోని ఇళ్లలోకి వర్షపునీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీకే ఆదినారాయణరెడ్డి కాలనీ ప్రధాన రోడ్డులో వర్షం నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే స్థానిక టీసీ హైస్కూల్ ఆవరణలో వర్షపు నీరు చేరడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. నేలకూలిన ఇళ్లు మండలంలో కురిసిన భారీ వర్షానికి ఖాదర్‌పేట, పి.కొత్తపల్లి గ్రామాల్లో మూడు ఇళ్లు నేలకూలాయి. కాలువలు, కుంటలు పొంగిపొర్లాయి. ప్రధానవీధులు జలమయం కావడంతో వాహన చోదకులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నీట మునిగిన పంటలు భారీ వర్షానికి పంటలు నీటమునిగాయి. మండలంలోని నీలూరులోనే 19.62 ఎకరాల పత్తి, వేరుశనగ పంటలు నీట మునిగాయి. అలాగే స్థానిక వైజంక్షన్ వద్ద గల ఓ డిగార్డిగేటర్‌లో 12వేల కేజీల వేరుశనగ పప్పు, వేరుశనగకాయల బస్తాలు తడిసిముద్దాయి. నీలూరులో నీట మునిగిన పంటలను, డీ గార్డిగేటర్‌లో తడిసిముద్ద అయిన వేరుశనగ బస్తాలను ఇన్చార్జ్ తహసీల్దార్ ఆర్.బాలాజీరాజు పరిశీలించారు. -
పామిడిలో చోరీ
పామిడి (గుంతకల్లు) : పామిడి బ్రహ్మణవీధిలోని నెట్టికంటి అనే వ్యక్తి ఇంట్లో శనివారం తెల్లవారుజామున చోరీ జరిగిందని ఎస్ఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. బాధితుడు తన కుటుంబ సభ్యులతో కలసి శుక్రవారం రాత్రి మిద్దెపై నిద్రించారన్నారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలోని రూ.20 వేల నగదు, 2 జతల బంగారు కమ్మలు, 15 తులాల వెండి చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కల్లూరుకు చేరిన పర్యావరణ రైలు
పామిడి : పర్యావరణ అంశాలతో కూడిన ఎగ్జిబిషన్ ట్రైన్ గుల్బర్గా నుంచి శనివారం ఉదయం 9 గంటలకు గార్లదిన్నె మండలం కల్లూరు రైల్వేస్టేషన్‌కు చేరింది. ఈ సందర్భంగా 10 గంటలకు గుంతకల్ అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ సుబ్బరాయుడు రిబ్బన్ కట్‌చేసి ట్రైన్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. రైల్వే ఫ్యాకల్టీలు ట్రైన్‌లోని పర్యావరణ అంశాలతో కూడిన సైన్స్ ఎగ్జిబిషన్‌పై అవగాహన కల్పించారు. వాతావరణంలోని మార్పులు, వాతావరణ కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పలు అంశాలపై వారు డెమో ఇచ్చారు. రెండురోజులపాటు కల్లూరులో ఈ ట్రైన్ ఎగ్జిబిషన్ ఉంటుందని స్టేషన్ మాస్టర్ రాజేంద్రనాయుడు తెలిపారు. -
నేనింతే !
– ‘అనంత’ అంటే వల్లమాలిన అభిమానమంటూ పదేపదే వల్లె వేస్తున్న చంద్రబాబు – అవసరమైతే ప్రతి పుట్టినరోజునూ ఇక్కడే చేసుకుంటానని ప్రకటన – టీడీపీని ఆదరిస్తోన్న ‘అనంత’వాసులు.. వంచిస్తోన్న చంద్రబాబు – ‘అనంత’ అభివృద్ధికి మూడేళ్లలో ఎలాంటి చర్యలకూ ఉపక్రమించని వైనం – సాగునీరు, పంట నష్టపరిహారం, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో తీరని అన్యాయం – సీఎం తీరుపై మండిపడుతున్న విపక్షాలు (సాక్షి ప్రతినిధి, అనంతపురం) - ‘అనంత అంటే నాకు అమితమైన ఇష్టం. మొన్న చైనాకు వెళుతుంటే ఫ్లైట్‌లో కలలోనూ నాకు అనంతపురం గుర్తొచ్చింది. ఏ విషయంలోనైనా ఈ జిల్లాకే మొదటి ప్రాధాన్యం.’ – గత ఏడాది పుట్టినరోజున గొల్లపల్లి రిజర్వాయర్‌లో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు మాటలివి. - ‘పోయిన బర్త్‌డే గొల్లపల్లిలో జరుపుకున్నా. ఇప్పుడు పామిడిలో చేసుకుంటున్నా. ఈ జిల్లా అంటే నాకు చాలా ఇష్టం. అవసరమైతే కరువు రహిత జిల్లాగా మార్చే వరకూ ‘అనంత’లోనే బర్త్‌డే చేసుకుంటా.’ – ఈ నెల 20న పామిడి సభలో సీఎం ప్రకటన . చంద్రబాబు మాటలు వింటే ఆయన ఈ జిల్లాపై ఎంత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారోనని అనిపిస్తుంది. నిజానికి ఆయన మాటలకు, చేతలకు ఏమాత్రమూ పొంతన ఉండటం లేదు. ‘నోరు ఒకటి చెబుతుంది..చెయ్యి ఇంకోటి చేస్తుంది.. దేనిదోవ దానిదే!’ అన్నట్లుంది సీఎం వైఖరి! ‘అనంత’ అంటే ఎంతో ఇష్టమని తరచూ చెప్పే చంద్రబాబు మూడేళ్లలో ఈ జిల్లాకు తానేం చేశానని ఆత్మపరిశీలన చేసుకున్నా... చంద్రబాబు ఏం చేశారని జిల్లావాసులు నిశితంగా పరిశీలించినా తేలేది ఒకే సత్యం! అందరితో పాటు పింఛన్ల పెంపు తప్ప అంతకు మించి ఏమీ చేయలేదని! మూడేళ్లలో ఒక్క పరిశ్రమ లేదా విద్యాసంస్థను జిల్లాలో ఏర్పాటు చేయలేదు. హంద్రీ–నీవా ద్వారా ఐదేళ్లుగా జిల్లాకు కృష్ణాజలాలు వస్తుంటే కనీసం ఒక్క ఎకరాకూ అందివ్వలేదు. మూడేళ్లలో ఒక్క పేదవాడికీ ఇళ్లు నిర్మించలేదు. మంజూరైన వాటినీ తరలించారు! రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లాలో ఎలాంటి సంస్థలనూ నెలకొల్పే చర్యలకు ఉక్రమించకపోగా.. కేంద్రప్రభుత్వం ప్రకటించిన వాటినీ దూరం చేశారు. ‘అనంత’లో ఎయిమ్స్(ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) అనుబంధ కేంద్రాన్ని స్థాపిస్తామని కేంద్రం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు–2014లో పొందుపరిచింది. అయితే.. దీన్ని చంద్రబాబు విజయవాడకు తరలించారు. సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని కూడా బిల్లులో పొందుపరిచారు. రెండేళ్లుగా అదిగో వస్తోంది.. ఇదిగో వస్తోందని చెప్పడం మినహా ఇప్పటి వరకూ ఆమోదముద్ర పడలేదు. రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి స్థల నిర్ధారణ పత్రాలు పంపకపోవడంతో వర్సిటీ ఏర్పాటులో జాప్యం జరుగుతోందని సమాచారం. 21 వరాల్లో ఒక్కటైనా... రాజధాని ప్రకటన సమయంలో చంద్రబాబు అసెంబ్లీలో ప్రతి జిల్లాపై వరాల జల్లు కురిపించారు. అందులో భాగంగా ‘అనంత’కు 21 వరాలిచ్చారు. అనంతను హార్టికల్చర్ హబ్ చేస్తానన్నారు. కనీసం ధరల స్థిరీకరణకు కూడా చర్యలు తీసుకోలేదు. సబ్బుల ఫ్యాక్టరీ స్థాపిస్తామని.. అతీగతీ లేదు. నూతన పారిశ్రామిక నగరం, ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్ క్లస్టర్, పెనుకొండలో ఇస్కాన్ ప్రాజెక్టు, పుట్టపర్తిలో విమానాల నిర్వహణ, మరమ్మతుల తయారీ కేంద్రంతో పాటు పలు హామీలిచ్చారు. ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. ఐదేళ్ల పాలనకు గాను మూడేళ్లు ముగిసిపోయింది. మరో రెండేళ్లలో ఏం చేస్తారో ఆయనకే తెలియాలి! కరువు రైతుపై కనికరమేదీ? కరువుతో జిల్లా రైతులు కుదేలవుతున్నారు. తాగు, సాగునీటి కోసం ప్రజలు అవస్థ పడుతున్నారు. 2014లో అధికారం చేపట్టిన తర్వాత ఏడాదిలో హంద్రీ–నీవాను పూర్తి చేసి ఆయకట్టుకు నీరందిస్తామని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పలుమార్లు ప్రకటించారు. అయితే.. 2015 ఫిబ్రవరిలో జీవో-22 జారీ చేసి డిస్ట్రిబ్యూటరీలు చేయొద్దని ఉత్తర్వులిచ్చారు. అప్పటినుంచి ఇప్పటి వరకూ ఆయకట్టు గురించి ఆలోచించలేదు. నిజంగా చంద్రబాబుకు జిల్లాపై అంత ప్రేమ ఉంటే మూడేళ్లుగా డిస్ట్రిబ్యూటరీలు ఎందుకు పూర్తి చేయలేదో? ఈ ఏడాది 28 టీఎంసీల నీరొచ్చినా ఒక్క ఎకరాకూ ఎందుకివ్వలేదో చెప్పాలని జిల్లావాసులు డిమాండ్ చేస్తున్నారు. కుప్పం వరకూ ప్రధాన కాలువ పూర్తయ్యే వరకూ డిస్ట్రిబ్యూటరీలు చేయబోమని చంద్రబాబు ‘అనంత’లోనే బాహాటంగా చెప్పారు. అప్పుడు తమ జిల్లాకు నీళ్లివ్వండి.. తర్వాత మీ జిల్లాకూ తీసుకెళ్లండని ఒక్క మంత్రి, ఎమ్మెల్యే కూడా సీఎంకు చెప్పలేకపోయారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తమ రాజకీయ అవసరాల కోసం జిల్లా ప్రజల సంక్షేమాన్ని ఫణంగా పెడుతున్నారు. జిల్లా వాసులు గత ఎన్నికల్లో 12 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీని గెలిపించారు. ఇంత అభిమానం చూపించిన జిల్లాకు చంద్రబాబు ఏమీ చేయకుండా కల్లబొల్లి మాటలు చెబుతున్నారు. ఆయన వైఖరిపై ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాల్సిన అవసరముంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా తమ అధినేత ‘అలవిమాలిన ప్రేమ’లో ఎంత నిజాయితీ ఉందో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుని జిల్లా అభివృద్ధికి పాటుపడాల్సి ఉంది. -
కారు ఢీకొని స్కూటరిస్ట్ దుర్మరణం
పామిడి (గుంతకల్లు) : జాతీయ రహదారిలోని పామిడి సమీపాన గల ఖల్సా డాబా వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు, స్కూటర్ ఢీ కొన్నాయి. ప్రమాదంలో పామిడికి చెందిన చిన్నాజీరావు(76) మృతి చెందగా, శంకరయ్య(65) తీవ్రంగా గాయపడ్డారని పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ నాగేంద్ర తెలిపారు. ఆయన కథనం ప్రకారం... పొలం చూసేందుకు పైన పేర్కొన్న ఇద్దరూ స్కూటర్లో బయలుదేరారు. మార్గమధ్యంలో డాబా వద్దకు రాగానే వెనుక వైపు నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో శంకరయ్య తలకు తీవ్ర గాయాలు కాగా, చిన్నాజీరావు కాళ్లు, చేతులు విరిగాయి. శంకరయ్యను బెంగళూరుకు, చిన్నాజీరావును అనంతపురం పెద్దాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నాజీరావు మృతి చెందారు. శంకరయ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మంత్రి కాలవ దిష్టిబొమ్మ దహనం
పామిడి (గుంతకల్లు) : అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని అంబేడ్కర్సర్కిల్లో శనివారం సాయంత్రం దళితసంఘాల ఆధ్వర్యంలో మంత్రి కాలవ శ్రీనివాసులు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు టి.మల్లికార్జున, వెంకటేష్ మాట్లాడారు. మంత్రి కాలవ శ్రీనివాసులు బూటుకాళ్లతోనే ఐలాండ్‌పైకి వెళ్లి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు నివాళులర్పించడం శోచనీయమన్నారు. మంత్రిగా ఉన్న ఆయన భారత రాజ్యాంగ నిర్మాతను అవమానించడం దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని స్పష్టం చేశారు. మంత్రి తన తప్పిదాన్ని తెలుసుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అలాగే కాలవకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో దళిత సంఘం నేతలు రామాంజనేయులు, మల్లి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
పామిడిలో 43.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో మండుతున్న ఎండలతో జనం ఇబ్బందిపడుతున్నారు. బుధవారం పామిడిలో 43.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, తాడిమర్రి 42.5 డిగ్రీలు, యల్లనూరు 42.2 డిగ్రీలు, ఉరవకొండ 42.2 డిగ్రీలు, గుంతకల్లు, కూడేరు 42.1 డిగ్రీలు, పుట్లూరు 41.7 డిగ్రీలు, రాయదుర్గం 41.6 డిగ్రీలు, బత్తలపల్లి 41.5 డిగ్రీలు, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం 41.4 డిగ్రీలు, యాడికి 41.3 డిగ్రీలు, శింగనమల 41.2 డిగ్రీలు, పెద్దవడుగూరు, ధర్మవరం 41 డిగ్రీలు ఉండగా మిగతా మండలాల్లో 39, 40 డిగ్రీలు కొనసాగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 22 నుంచి 28 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. గాలిలో తేమశాతం ఉదయం 55 నుంచి 75, మధ్యాహ్నం 16 నుంచి 26 శాతం మధ్య రికార్డయింది. గంటకు 5 నుంచి 16 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. -
కొనసాగుతున్న గ్రీష్మతాపం
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా అంతటా ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీంతో గ్రీష్మతాపం కొనసాగుతోంది. ఉక్కపోత, వడగాల్పులతో చిన్నాపెద్ద అందరూ సతమతమవుతున్నారు. పామిడిలో 43.5 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, శింగనమల మండలం తరిమెల 43.3 డిగ్రీలు, యల్లనూరు 42.5 డిగ్రీలు, యాడికి 42.4 డిగ్రీలు, బెళుగుప్ప 42.3 డిగ్రీలు, వజ్రకరూరు 42.3 డిగ్రీలు, చెన్నేకొత్తపల్లి 42.2 డిగ్రీలు, తనకల్లు, రాయదుర్గం 42 డిగ్రీలు, తాడిమర్రి 41.9 డిగ్రీలు, పుట్టపర్తి 40.8 డిగ్రీలు, కదిరి 40.6 డిగ్రీలు, గుత్తి 40.6 డిగ్రీలు, ధర్మవరం, ఉరవకొండ 40.4 డిగ్రీలు, పెనుకొండ 40.3 డిగ్రీలు, గుంతకల్లు 40.2 డిగ్రీలు, కళ్యాణదుర్గం 40 డిగ్రీలు.. ఇలా చాలా మండలాల్లో 40 డిగ్రీలకు పైగా నమోదు కాగా మిగతా మండలాల్లో 38, 39 డిగ్రీలు కొనసాగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 22 నుంచి 26 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. గాలిలో తేమశాతం ఉదయం 52 నుంచి 77, మధ్యాహ్నం 14 నుంచి 24 శాతం మధ్య రికార్డయ్యింది. గంటకు 6 నుంచి 15 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి. -
పామిడిలో భగభగ
అనంతపురం అగ్రికల్చర్ : భానుడు రోజురోజుకూ ఉగ్రరూపం దాల్చుతున్నాడు. శనివారం పామిడి మండల కేంద్రంలో 43.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రతకు ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇళ్లలోనూ ఉక్కపోత తప్పలేదు. అలాగే శింగనమల మండలం తరిమెలలో 42.4 డిగ్రీలు, యల్లనూరు 41.8, కనగానపల్లి 41.8, చెన్నేకొత్తపల్లి 41.4, పుట్లూరు 41.3, పుట్టపర్తి 41.2, తాడిమర్రి 41, యాడికి 40.8, కదిరి 40.7, గుత్తి 40.4, గుంతకల్లు 40, అనంతపురం 39.4, ధర్మవరంలో 39.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా మండలాల్లో 37 నుంచి 39 డిగ్రీల మధ్య కొనసాగింది. -
కొనసాగుతున్న సూర్యప్రతాపం
– పామిడి, శింగనమల, బీకేఎస్‌లో 42 డిగ్రీలు అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా అంతటా సూర్యప్రతాపం కొనసాగుతోంది. పామిడి, శింగనమల, బుక్కరాయసముద్రం మండలాల్లో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కూడేరు, గుంతకల్లు, తనకల్లు, కనగానపల్లి, గుడిబండ, కంబదూరు, యల్లనూరు, చెన్నేకొత్తపల్లిలో 41 డిగ్రీలు, వజ్రకరూరు, యాడికి, పెద్దవడుగూరు, బుక్కపట్టణం, పుట్లూరు, తాడిపత్రి, కొత్తచెరువులో 40 డిగ్రీలు నమోదు కాగా మిగతా మండలాల్లో 37 నుంచి 39 డిగ్రీల మధ్య కొనసాగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 22 నుంచి 26 డిగ్రీల మధ్య నమోదైంది. గాలిలో తేమశాతం ఉదయం 57 నుంచి 77, మధ్యాహ్నం 17 నుంచి 27 శాతం మధ్య రికార్డయింది. గాలులు గంటకు 5 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో వీచాయి. ఉక్కపోత, వేసవిగాలులతో జనం ఇబ్బంది పడుతున్నారు. -
వేధింపులపై కేసు నమోదు
పామిడి : వితంతువు మంజులను వేధించిన కేసులో ఆమె అత్తింటివారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎస్ఐ రవిశంకర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. పావగడకు చెందిన మంజులను పామిడి టీచర్స్ కాలనీకి చెందిన మారుతీ ప్రసాద్‌తో వివాహమైంది. మారుతీప్రసాద్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. తమ ఆస్తి తన కోడలికి చెందకూడదన్న ఉద్దేశంతో అత్త నాగరత్నమ్మ, ఆడపడుచు లలిత, మామ ఆదినారాయణ, మంజులను తరచూ వేధించేవారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వేధింపుల కేసు ( 498–ఏ) నమోదు చేశారు. -
స్వల్పంగా తగ్గిన ఉష్ణోగ్రతలు
అనంతపురం అగ్రికల్చర్ : ఉష్ణోగ్రతలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. పామిడిలో అత్యధికంగా 39 డిగ్రీలు నమోదు కాగా మిగతా మండలాల్లో 35 నుంచి 38 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. రాత్రి ఉష్ణోగ్రతలు 22 నుంచి 25 డిగ్రీల వరకు ఉన్నాయి. గాలిలో తేమశాతం ఉదయం 55 నుంచి 80, మధ్యాహ్నం 22 నుంచి 32 శాతం మధ్య ఉంది. గంటకు 6 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. అయితే తాడిపత్రి, పుట్లూరు, కొత్తచెరువు, ఓడీ చెరువు, కళ్యాణదుర్గం, బెళుగుప్ప, రొద్దం, శింగనమల, పెనుకొండ, గుమ్మగట్ట, ఆత్మకూరు, కనేకల్లు, బొమ్మనమాల్, పెద్దవడుగూరు, విడపనకల్, బత్తలపల్లి, రాప్తాడు, కంబదూరు, లేపాక్షి, హిందూపురం, అమడగూరు, అమరాపురం మండలాల్లో గాలివేగం ఎక్కువగా ఉంది. మంగళవారం 20 మండలాల్లో సగటున 2.3 మిల్లీమీటర్ల మేర అకాల వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. మొత్తమ్మీద గత జూన్ నుంచి ఇప్పటివరకు 497.6 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి గానూ 42.3 శాతం తక్కువగా 287.3 మిల్లీమీటర్లు నమోదైంది. -
స్థిరంగా పగటి ఉష్ణోగ్రతలు
అనంతపురం అగ్రికల్చర్ : పగటి ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదవుతుండటంతో జిల్లాలో వేసవితాపం కొనసాగుతోంది. శుక్రవారం పామిడి, పుట్టపర్తి, శింగనమల, చెన్నేకొత్తపల్లి మండలాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొత్తచెరువు, రాయదుర్గం, కనగానపల్లి, తనకల్లు, కంబదూరు మండలాల్లో 39 డిగ్రీలు ఉండగా మిగతా మండలాల్లో 36 నుంచి 38 డిగ్రీలుగా కొనసాగింది. జిల్లా అంతటా 16 నుంచి 21 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమశాతం ఉదయం 66 నుంచి 82, మధ్యాహ్నం 10 నుంచి 18 శాతం మధ్య రికార్డయింది. గంటకు 6 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. -
పామిడి, గార్లదిన్నెలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో గరిష్ణ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉంటున్నాయి. గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో పామిడి, గార్లదిన్నె మండలాల్లో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గుంతకల్లు, శింగనమల, కొత్తచెరువు, ముదిగుబ్బ, పుట్టపర్తి, కంబదూరు మండలాల్లో కూడా 38 నుంచి 39 డిగ్రీలు నమోదు కాగా మిగతా మండలాల్లో 36 నుంచి 38 డిగ్రీల మధ్య కొనసాగాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 17 నుంచి 22 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. గాలిలో తేమశాతం ఉదయం 65 నుంచి 80, మధ్యాహ్నం 12 నుంచి 22 శాతం మధ్య రికార్డయ్యింది. గంటకు 6 నుంచి 14 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి. బత్తలపల్లి, కనేకల్లు, ఆత్మకూరు, పుట్లూరు, బుక్కరాయసముద్రం, చెన్నేకొత్తపల్లి, యాడికి, కదిరి, బొమ్మనహాల్, తాడిపత్రి, బెళుగుప్ప, పామిడి, ఓడీ చెరువు, కంబదూరు, కుందుర్పి మండలాల్లో గాలి వేగం 14 నుంచి 20 కిలో మీటర్ల వరకు నమోదైంది. -
పామిడిలో చోరీ
పామిడి : పామిడి దత్తాత్రేయ కాలనీలో కాపురముంటున్న నబీసాబ్ అనే వ్యాపారి ఇంట్లో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారని ఎస్ఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. పెద్దవడుగూరు మండలం మల్లేలపల్లిలోని తమ బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి నబీసాబ్ కుటుంబం వెళ్లింది. దీన్ని పసిగట్టిన దొంగలు ఇంట్లోకి ప్రవేశించి రూ.45 వేల నగదు సహా రెండు తులాల బంగారు నగలను ఎత్తుకెళ్లారు. ఇంటికొచ్చిన నబీసాబ్‌కు తలుపుల బీగాలు ధ్వంసమై ఉండగా, ఇంట్లోని బీరువాలో దాచి ఉంచిన దుస్తులు, వస్తువులు చెల్లాచెదరుగా పడి ఉండడాన్ని గమనించారు. చోరీ జరిగినట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
పామిడిలో 42.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత
అనంతపురం అగ్రికల్చర్ : శనివారం పామిడిలో 42.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. శింగనమల 40.3 డిగ్రీలు, గుంతకల్లు, తాడిమర్రిలో 39.7 డిగ్రీలు, యల్లనూరు 39.4 డిగ్రీలు, పుట్లూరు, విడపనకల్ 39.3 డిగ్రీలు, బుక్కరాయసముద్రం 39.2 డిగ్రీలు, కనగానపల్లి 39.1 డిగ్రీ నమోదు కాగా మిగతా మండలాల్లో 36 నుంచి 39 డిగ్రీల వరకు కొనసాగాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 17 నుంచి 22 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. గాలిలో తేమశాతం ఉదయం 58 నుంచి 78, మధ్యాహ్న సమయంలో 12 నుంచి 22 శాతం మధ్య రికార్డయింది. గంటకు 6 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. మొత్తంమ్మీద జిల్లా అంతటా వేసవి తీవ్రత కొనసాగుతుండటంతో జనం ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. -
రోగులతో ‘మెడాల్’ చెలగాటం
డెంగీ లేకున్నా ఉన్నట్లు రిపోర్ట్ చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన విద్యార్థి డిగ్రీ పరీక్షలు రాయలేకపోయిన వైనం పామిడి : డెంగీ లక్షణాలు లేకపోయినా ఉన్నట్టుగా మెడాల్ ల్యాబ్ నివేదిక ఇవ్వడంతో ఓ డిగ్రీ విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిగ్రీ పరీక్షలు రాయలేకపోయాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. పామిడికి చెందిన ఆంజనేయులు, అనసూయ దంపతుల కుమారుడు ఎం.అనిల్‌కుమార్ డిగ్రీ చదువుతున్నాడు. ఈ నెల 15న ఆరోగ్యం బాగలేకపోవడంతో అనిల్‌కుమార్‌ను తండ్రి స్థానిక పామిడి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ‘మెడాల్’ ఉద్యోగి రక్తపరీక్షలు చేశారు. 16వ తేదీన గుత్తిలో ఉన్న మెడాల్ ల్యాబ్ నివేదిక ప్రకారం డెంగీ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించి, అనంతపురం ఆస్పత్రికి సిఫార్సు చేశారు. తల్లిదండ్రులు ఆందోళనకు గురై వెంటనే అనంతపురం సర్వజనాస్పత్రిలో చేర్చారు. మరోసారి అక్కడ కూడా బ్లడ్ శ్యాంపిల్స్ సేకరించారు. మూడురోజుల పాటు డెంగీ చికిత్స చేయించారు. ఇదే సమయంలో డిగ్రీ ఫస్టియర్ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రిలోనే ఉండటం వల్ల రెండు పరీక్షలకు అనిల్‌కుమార్ గైర్హాజరయ్యాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యి వచ్చాక పామిడి మెడాల్ వారు డెంగీ నెగటివ్ అని మరో రిపోర్టు ఇచ్చారని విద్యార్థి తండ్రి ఆంజనేయులు మంగళవారం మీడియా ఎదుట వాపోయారు. తప్పుడు రిపోర్టుతో తన కుమారుని జీవితంతో చెలగాటం ఆడడమే కాకుండా...ఇంటిల్లిపాది అనారోగ్యం పాలవడానికి కారణమైన మెడాల్ నిర్వాకంపై విచారణ చేపట్టాలని ఆయన కోరారు. రిపోర్టు నివేదించింది మేము కాదు డెంగీ నిర్ధారణకు సంబంధించి రక్తాన్ని పరీక్షల నిమిత్తం గుత్తి ల్యాబ్‌కు పంపుతాం. అక్కడి నివేదిక ఆధారంగానే మొదట్లో డెంగీ అని నిర్ధారణయ్యింది. ఆపై తదుపరి రిపోర్టు మాత్రం నెగిటివ్ అని వచ్చింది. ఈ విషయాన్ని అప్పటికప్పుడే సంబంధిత మెడాల్ మేనేజ్మెంట్ నిర్వాహకులు శ్రీనివాసులు దృష్టికి తీసుకెళ్లాం. –పామిడి మెడాల్ ఉద్యోగి నిరంజన్ -
హోరాహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు
పామిడి (గుంతకల్లు) : పామిడిలో కొడ్డూరు రోడ్డులో ఉన్న అంకాలమ్మ, కుంటెమ్మ దేవతల తొమ్మిదో జాతరను పురస్కరించుకుని ఆలయ కమిటీ, గ్రామస్తుల ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర స్థాయి ఎద్దుల రాతిదూలం లాగుడు పోటీలు అట్టహాసంగా ప్రారంభించారు. తొలిసారిగా ఈపోటీలను ఫ్లడ్‌లైట్ల వెలుతురులో నిర్వహిస్తుండటం విశేషం. తొలిరోజు పాలపళ్ళ విభాగానికి సంబంధించి నిర్వహించిన ఈపోటీలో అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన 19గాన్ల ఎద్దులు పాల్గొన్నాయి. ఈ పోటీలను వైఎస్సార్ సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎం.వీరాంజనేయులు లాంఛనంగా ప్రారంభించారు. ఈ పోటీల్లో విజేత వృషభాలకు మొదటి, రెండవ, మూడవ, నాల్గొవ, ఐదవ బహుమతిగా వరుసగా రూ.20వేలు, రూ.15వేలు, రూ.10వేలు, రూ.5వేలు, రూ.3వేలు చొప్పున ఇవ్వనున్నట్లు నిర్వాహకులు ఆర్ఆర్ రమేష్ తెలిపారు. అలాగే న్యూ కేటగిరి విభాగంలో విజేత వృషభాలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ బహుమతి వరుసగా రూ.40వేలు, రూ.30వేలు, రూ.20వేలు, రూ.10వేలు, రూ.5వేలు చొప్పున కేటాయించామన్నారు. తొలిరోజు వృషభాల రాతిదూలం లాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. కార్యక్రమంలో కౌన్సిలర్ వైయూ రామాంజనేయులు, వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ బొల్లు వెంకట్రామిరెడ్డి, పార్టీ బీసీ సేవాదళ్ పట్టణ కన్వీనర్ చీమల నగేష్, పసుల నాగరాజు, సామ్యూల్, నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
వరంగల్ అమ్మాయి పామిడిలో ప్రత్యక్షం
పామిడి : అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని అంబేడ్కర్ కాలనీ బైపాస్‌లో రెండు రోజులుగా తిరుగుతున్న అమ్మాయి(16)ని శుక్రవారం స్థానికులు గుర్తించారు. ఆ కాలనీవాసి, అబ్దుల్ కలామ్ స్వచ్ఛంద సంస్థ సభ్యుడు పీటర్ విజయ్ ఆ అమ్మాయిని పలకరించారు. తనది తెలంగాణలోని వరంగల్ అని, పేరు ఉష, తండ్రి పేరు మల్లయ్య అని తెలిపింది. తననెవరో ఇక్కడికి తెచ్చి వదిలారని చెప్పింది. ఈ సమాచారాన్ని చైల్డ్‌లైన్ 1098 సంస్థ సభ్యురాలు మల్లీశ్వరికి స్థానికులు అందజేశారు. దీంతో ఆమె ఈ అమ్మాయిని పామిడి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. -
అన్యోన్య బంధం ఆవిరైంది
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య తమ్ముడి మరణం జీర్ణించుకోలేకే.. తనయుల మృతితో తల్లడిల్లిన తల్లి వారిద్దరూ అన్నదమ్ములు.. వయసు తేడా ఉన్నా స్నేహితుల్లా కలిసి మెలిసి ఉండేవారు. ఆడుకోవాలన్నా.. అన్నం తినాలన్నా ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత అనుబంధం వారిది. ఎక్కడికెళ్లినా కలిసే వెళ్లేవారు.. ఏది చేసినా తోడుగా ఉండేవారు.. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న అన్నదమ్ముల జీవితాన్ని విధి వెక్కిరించింది. ఉన్నత విద్యలో సరైన ‘మార్గదర్శకులు’ లేక మానసిక వేదనకు గురై నాలుగునెలల క్రితం తమ్ముడు రైలు కింద పడి బలవన్మరణం చెందాడు. నీడలా ఉండే తమ్ముడు తన వెంట లేకపోవడం శూన్యంలా అనిపించడంతో అన్న కూడా అదే మార్గాన్ని ఎంచుకున్నాడు. శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘దేవుడా కన్నకొడుకులిద్దరినీ కళ్లముందు లేకుండా తీసుకుపోతివా?’ అంటూ గుండెలవిసేలా ఏడుస్తున్న ఆ తల్లి రోదన చూపరులను కంటతడి పెట్టించింది. - పామిడి పి.కొండాపురం రైల్వేగేట్ పెద్దమ్మ గుడి సమీపాన శనివారం రాత్రి బీటెక్ విద్యార్థి ఎన్.రవికుమార్ రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. పామిడిలోని ఎద్దులపల్లిరోడ్డులో నివాసమున్న నల్లబోతుల రామాంజనేయులు, నాగరత్నమ్మ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు ఎన్.రవికుమార్ (19), ఎన్.పవన్‌కుమార్ (16) సంతానం. రామాంజనేయులు బోర్వెల్ పనులకు కూలికెళ్తుంటాడు. భార్య నాగరత్నమ్మ మినీ అంగన్వాడీ కేంద్రం కార్యకర్త. చిన్నకుమారుడు ఎన్.పవన్‌కుమార్ పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రతిభా పురస్కారం అందుకున్నాడు. అయితే పది తర్వాత ఏ కోర్సులో చేరాలన్న విషయంలో సరైన స్పష్టత లేకపోవడంతో అనంతపురంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఆటో మొబైల్ కోర్సులో చేరాడు. ఇది సరైనది కాదని అనుకున్నాడో ఏమో గత ఏడాది సెప్టెంబర్ 25న ఎద్దులపల్లిరోడ్డులోని టంగుటూరి చిన్నప్పశ్రేష్టి తోట సమీపాన రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తమ్ముడి మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఎన్.రవికుమార్ అప్పట్లోనే బలవన్మరణానికి యత్నించగా కుటుంబ సభ్యులు అడ్డుకుని వారించారు. ప్రస్తుతం రవికుమార్ గుత్తి గేట్స్కాలేజ్లో బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కళాశాల నుంచి శనివారం సాయంత్రం ఇంటికి చేరాడు. రాత్రి కలిసి భోజనం చేయాలని తల్లిదండ్రులు రవికుమార్‌తో అన్నారు. అంతలోనే బయటకు వెళ్లొస్తానంటూ బయల్దేరాడు. అలా వెళ్లిన అతను రాత్రికి రాత్రే రైలుకిందపడి ప్రాణాలు తీసుకున్నాడు. ఉన్న ఇద్దరు కుమారులు అర్ధంతరంగా తనువు చాలించడంతో ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. ఆమెను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గుత్తి రైల్వేపోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
తెల్లారిన బతుకు
- కూలి పనులకు సైకిల్‌పై బయలుదేరిన దంపతులు - వేగంగా వచ్చి ఢీకొన్న బస్సు - రోడ్డుపైనే మాంసపు ముద్దలా మిగిలిన భార్య - భర్తకు తీవ్ర గాయాలు ------------------------------------------------------------------- రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. ఒక రోజు కూలి పనులకు వెళ్లకపోతే పూట గడవని పరిస్థితి.. వచ్చే అరకొర సంపాదనతోనే పిల్లలను చదివించుకుంటున్నారు. తెలవారక ముందే కూలి పనులకు వెళ్లడం ఆ దంపతులకు అలవాటు. రోజులాగే గురువారం తెల్లవారుజామున సైకిల్‌పై దంపతులిద్దరూ బయలుదేరారు. మార్గమధ్యంలో వేగంగా ఎదురొచ్చిన ఓ బస్సు ఢీకొనడంతో సైకిల్ నుజ్జునుజ్జైంది. ప్రమాదంలో భార్య అక్కడికక్కడే రోడ్డుపై మాంసపు ముద్దలా మిగలగా, భర్త త్రుటిలో తప్పించుకున్నాడు. - పామిడి ----------------------------------------------------------- పామిడిలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన దళిత రంగమ్మ(36) రోడ్డు ప్రమాదంలో అకాల మృత్యువాతపడగా, ఆమె భర్త మేకల పెద్దసుంకన్న తీవ్రంగా గాయపడ్డారని ఎస్ఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. వారిద్దరూ గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు సైకిల్‌పై ఇటుకల బట్టీ వద్ద పనుల కోసం బయలుదేరారు. బైపాస్‌లోని హనుమాన్ లింకురోడ్డు జంక్షన్ వద్దకు రాగానే సైకిల్‌ను బట్టీల వైపునకు తిప్పారు. దూసుకొచ్చిన మృత్యువు అంతలోనే ఊహించని రీతిలో అనంతపురం నుంచి గుత్తి వైపునుక విపరీతమైన వేగంతో వచ్చిన ఓ బస్సు బలంగా ఢీకొనడంతో సైకిల్ తునాతునకలు కాగా, వెనకాల కూర్చున్న రంగమ్మ బస్సు చక్రాల కింద పడి నలిగిపోయింది. ఆమె భర్త పెద్దసుంకన్న డివైడర్‌పై ఎగిరిపడి సృహ కోల్పోయాడు. ప్రమాదంలో అతని ఎడమకాలుకూ గాయమైంది. క్షతగాత్రుని హుటాహుటిన స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రంగమ్మ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. బంధువుల రోదనలతో ఆస్పత్రి పరిసరాలు మిన్నంటాయి. మృతురాలికి కుమార్తె దస్తగిరమ్మ(డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది), కుమారుడు వసంతకుమార్(పామిడిలోని టీసీ హైస్కూల్లో ఆరో తరగతి చదవుతున్నాడు) ఉన్నారు. కాగా రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. -
పోలీసుల సంక్షేమమే ధ్యేయం
పామిడి : విద్య, వైద్య, ఆరోగ్య, ఆర్థిక చేయూత పరంగా పోలీసుల సంక్షేమమే పోలీస్ వెల్ఫేర్ ధ్యేయమని ఎస్పీ రాజశేఖర్‌బాబు పేర్కొన్నారు. బుధవారం పామిడిలోని పోలీస్ కాంప్లెక్స్ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ఆయన సీఐ ఛాంబర్లో విలేకరులతో మాట్లాడారు. సుమారు రూ.40 లక్షల నిధులతో కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా పామిడిలో అస్తవ్యస్తంగా మారిన ట్రాఫిక్, అక్రమ ఇసుక రవాణాపై పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు ఎస్పీ సానుకూలంగా స్పందించారు. ట్రాఫిక్ నియంత్రణ, ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎస్ఐ రవిశంకర్‌రెడ్డికి ఆదేశించారు. అంతకుముందు ఆయన కాంపెక్స్ నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంప్లెక్స్ నిర్మాణంపై సంబంధిత సీఐ నరేంద్రరెడ్డి, ఎస్ఐ రవిశంకర్‌రెడ్డితో సమీక్షించారు. ఎస్పీ వెంట తాడిపత్రి డీఎస్పీ చిదానందరెడ్డి, సీఐ నరేంద్రరెడ్డి, ఎస్ఐ రవిశంకర్‌రెడ్డి ఉన్నారు. -
చిన్నారి మృతి
పామిడి : తల్లి అనారోగ్యానికి సంబంధించిన మాత్రలు మింగి సుస్మిత(3) అనే చిన్నారి మృతి చెందిన సంఘటన మండలంలోని రామగిరిలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. సుస్మిత లేపాక్షి, భాగ్యమ్మ దంపతుల కుమార్తె. ఇటీవల తీవ్ర జ్వరం, తలనొప్పికి గురైన భాగ్యమ్మ ఆరోగ్యకార్యకర్తలతో మాత్రలు తీసుకుని ఇంట్లో పెట్టింది. ఆమె ఇంటి బయట పొరుగింటి వారితో మాట్లాడుతుండగా, ఆ మాత్రలను సుస్మిత మింగేసింది. అపస్మారక స్థితిలో ఉన్న పాపను చూసిన తల్లి హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించింది. అయితే అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. పని నిమిత్తం వేరే ఊరెళ్లిన పాప తండ్రి లేపాక్షి హుటాహుటినా పామిడికి చేరుకున్నాడు. పాప మృతి చెందిన విషయాన్ని జీర్ణించుకోలేక సొమ్మసిల్లిపడిపోయాడు. అభం శుభం తెలియని చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఓ గుండె వ్యధ..
పూటగడవని స్థితిలో అభాగ్యుడు గుండె మార్పిడికి రూ. 30 లక్షలు ఆపన్న హస్తం కోసం ఎదురు చూపు రెండు ఎకరాల పొలం... వరుస కరువులు.. పంట నష్టాలు... ఓ రైతును కుదేలు చేశాయి. కుటుంబ పోషణ కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నాడు. పంట పెట్టుబడుల కోసం చేసిన అప్పులు ఒక్కొక్కటిగా తీరుతున్నాయి. పిల్లాపాపలతో సాఫీగా సాగిపోతున్న ఆ కుటుంబంపై విధి చిన్న చూపు చూసింది. గుండె జబ్బు చేసి ఆస్పత్రుల పాలయ్యాడు. వైద్య పరీక్షల అనంతరం గుండె మార్పిడి తప్పనిసరి అని తేలింది. రూ. లక్షల వ్యయంతో కూడుకున్న ఈ శస్త్రచికిత్సకు డబ్బు సమకూర్చుకోవడం అతనికి తలకు మించిన భారమైంది. కళ్లముందు కట్టుకున్న భార్య, లోకం తెలియని ఇద్దరు చిన్నారులు కనిపించారు. తాను ఈ లోకం వీడిపోతే వారి పరిస్థితి ఏమిటనేది అతన్ని మరింత కుంగదీసింది. తనకు పునర్జన్మను ప్రసాదించే ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. పామిడి మండలం, గజరాంపల్లి గ్రామానికి చెందిన డి.రమేష్‌రెడ్డి.. రెండు ఎకరాల సన్నకారు రైతు. ఇతనికి భార్య రమాదేవి, కుమార్తె డి.హారిక (6వ తరగతి), కుమారుడు లిఖిత్‌రెడ్డి (3వ తరగతి) ఉన్నారు. కుటుంబ పోషణ కోసం వ్యవసాయంపైనే ఆధారపడిన రమేష్‌రెడ్డి.. వరుస కరువులతో అప్పుల పాలయ్యాడు. ఇక పంట సాగుతో లాభం లేదనుకున్న అతను ఐషర్ వాహనం డ్రైవర్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. కుటుంబం సాఫీగా సాగిపోతున్న తరుణంలో అతని ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. మూడేళ్ల క్రితం... మూడేళ్ల క్రితం ఐషర్ వాహనంలో లోడు తీసుకుని బయలుదేరుతుండగా రమేష్‌రెడ్డి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో పరీక్షలు చేయిస్తే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. దీంతో చికిత్సలు మొదలు పెట్టించాడు. ఫలితం లేకుండా పోయింది. వైద్యుల సూచన మేరకు కర్నూలులోని వైద్య నిపుణులను సంప్రదించి చికిత్సలు మొదలు పెట్టించాడు. వారాలు.. నెలలు గడుస్తున్నా ఆరోగ్యం మెరుగు పడలేదు. అప్పటికే కుటుంబ పోషణ భారమైంది. ఏనాడూ గడప దాటి ఎరుగని ఇల్లాలు.. చివరకు కుటుంబ పోషణ కోసం వ్యవసాయ కూలీగా మారారు. అరకొర పనులతో వస్తున్న కూలీ డబ్బుతో కుటుంబ పోషణ భారమైంది. ఉన్న ఇద్దరు పిల్లల్లో అమ్మాయిని పామిడి వద్ద ఉన్న మోడల్ స్కూల్లో చేర్పించారు. కుమారుడిని యాడికిలోని తన అక్కబావ నాగేంద్రమ్మ, సూర్యనారాయణరెడ్డి వద్దకు రమాదేవి వదిలారు. సజావుగా సాగిపోతున్న రమేష్‌రెడ్డి కుటుంబంలో గుండె సంబంధిత వ్యాధి తీవ్ర కల్లోలాన్ని సష్టించింది. ఆస్తులు అమ్ముకున్నా... తీవ్ర అనారోగ్యంతో బలహీన పడుతున్న రమేష్‌రెడ్డి చివరకు హైదరాబాద్‌లోని కిమ్స్ వైద్యశాలకు చేరుకున్నాడు. అక్కడ పలు రకాల పరీక్షలు నిర్వహించిన అనంతరం అతని గుండె బలహీన పడుతోందని వైద్యులు గుర్తించారు. గుండె మార్పిడి చికిత్స ఒక్కటే మార్గమని అందుకు రూ. 30 లక్షల వరకు ఖర్చు అవుతుందని తేల్చి చెప్పారు. ఈ విషయం రైతు కుటుంబాన్ని కుదేలు చేసింది. ఇప్పటికే చికిత్సల కోసం ఉన్న రెండు ఎకరాల పొలాన్ని కూడా అమ్ముకున్నారు. శస్త్రచికిత్స కోసం రూ. 30 లక్షలు సమకూర్చుకోవడం ఆ కుటుంబానికి తలకు మించిన భారమైంది. ప్రస్తుతం రమేష్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. తీవ్ర ఆయాసంతో బాధపడుతూ కనీసం రెండు అడుగులు కూడా వేయలేకపోతున్నాడు. ఓ రేకుల షెడ్లో ఉంటూ భార్య కూలీ పనుల ద్వారా తీసుకువచ్చే అరకొర సొమ్ముతో బతుకునీడుస్తున్నారు. కనీసం మందుల కొనుగోలు చేసేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. తన శస్త్రచికిత్సకు అవసరమైన సొమ్మును దాతలు సమకూర్చాలంటూ వేడుకుంటున్నాడు. సాయం చేయదలిస్తే... రమేష్‌రెడ్డి, గజరాంపల్లి, పామిడి మండలం బ్యాంక్ ఖాతా నంబర్ ః 04221 001 1080 154 బ్యాంక్ ః ఆంధ్రాబ్యాంక్, పామిడి ఐఎఫ్ఎస్సీ కోడ్–అNఈఆ 0000 422 (ఇంగ్లీష్ అక్షరాలున్నాయి) సెల్ నంబర్ ః 94916 80909 -
వరకట్న వేధింపుల కేసులో ఏడాది జైలు
గుత్తి : అదనపు వరకట్నం తీసుకురావాలని భార్యను వేధించిన భర్తకు యేడాది జైలు శిక్షతో పాటు వెయ్యి రుపాయల జరిమానా విధిస్తూ గుత్తి జేఎఫ్‌సీఎం( జూనియర్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్) వెంకటేశ్వర నాయక్ మంగళవారం తీర్పు చెప్పారు. కేసు పూర్వ పరాలు ఇలా ఉన్నాయి. గుత్తి కోట వీధికి చెందిన అరుణకు, పామిడి మండలం ఎద్దుల పల్లికి చెందిన గడ్డం మోహన్‌గౌడ్‌తో 2010 లో వివాహమైంది. వివాహ సమయంలో రూ.లక్ష , 8 తులాల బంగారు కట్నంగా ఇచ్చారు. పెళ్లైన తర్వాత యేడాదికే అదనపు కట్నం కావాలని మోహన్ గౌడ్ భార్యను వేధించడం ప్రారంభించాడు. విసిగిపోయిన అరుణ పామిడి పోలీసు స్టేషన్లో భర్తపై కేసు పెట్టింది. ఈ కేసు గుత్తి జేఎఫ్‌సీఎం కోర్టులో తుది విచారణకు వచ్చింది. మోహన్‌గౌడ్ నేరం చేశాడని తేలడంతో జడ్జి అతనికి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ తరుపున ఏపీపీ సంగీత వాదించారు. ఆటో డ్రైవర్‌కు రెండున్నరేళ్లు.. కళ్యాణదుర్గం: రోడ్డు ప్రమాదంలో ఐదు మంది మృతికి కారకుడైన ఆటో డ్రైవర్ ఎర్రిస్వామికి రెండన్నర ఏళ్ల జైలు శిక్ష, రూ.6 వేల జరిమానా విధిస్తూ స్థానిక జూనియర్ సివిల్ జడ్జి నాగరాజ మంగళవారం తీర్పునిచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను టౌన్ ఎస్ఐ శంకర్‌రెడ్డి విలేకరులకు తెలియజేశారు. 2012 జూన్ నెల 16వ తేదిన ఆటోడ్రైవర్ ఎర్రిస్వామి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టాడు. ఆటో బస్సును ఢీకొనడంతో ఐదుమంది మృతి చెందారు. అప్పట్లో కళ్యాణదుర్గం పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆటో డ్రైవర్ ఎర్రిస్వామి నిర్లక్ష్యమే ఐదుమందిని బలిగొందని ఆధారాలు రుజువు కావడంతో నిందితుడికి శిక్ష విధిస్తూ జడ్జి తీర్పునిచ్చారు. -
ఉత్సాహంగా ఇరుసు పోటీలు
పామిడి: పట్టణంలో మంగళవారం పామిడమ్మ తేరును పురస్కరించుకొని గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఇరుసు ఎత్తే పోటీలు ఉత్సాహంగా సాగాయి. వివిధ ప్రాంతాలకు చెందిన యువకులు పోటాపోటీగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. విజేతలుగా కూడేరు మండలం అరవకూరు గ్రామస్తుడు నారాయణ, నార్పల మండలం కేకే అగ్రహారం గ్రామానికి చెందిన రాజు ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచారు. వారికి ప్రథమ బహుమతిగా 5 తులాల వెండి, ద్వితీయ బహుమతిగా 3 తులాల వెండిని నిర్వాహకులు మంటిమడుగు శీనా, రవి, తొండపాడు రంగనాయకులు, శీనా అందజేశారు. -
స్కూల్లో విద్యార్థినులతో అసభ్యకర నృత్యాలు
పామిడి: ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ నిర్వాకం అనంతపురం జిల్లా పామిడిలో గత కొన్ని రోజులుగా జరుగుతోందని తెలుస్తోంది. వివరాలిలా ఉన్నాయి... పామిడిలోని ఓ ప్రైవేట్ స్కూలు యాజమాన్యం, ఉపాధ్యాయులు విద్యార్థినులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తమతో అసభ్యకర నృత్యాలు చేయిస్తున్నారని, ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ బాధిత విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాలపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండా స్కూలు యాజమాన్యం అడ్డుపడుతోందని కూడా విద్యార్థినులు వాపోయారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. -
అండగా ఉంటా.. ఆందోళన వద్దు..
- ఇగ్గుడ వన్నూరప్ప కుటుంబానికి వైఎస్ జగన్ భరోసా పామిడి: ‘మీకు అండగా నేనుంటాను. ఆత్మహత్య చేసుకున్న ప్రతీ రైతు కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలి. లేదంటే కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. మీరెవ్వరూ ఆందోళన పడవద్దు’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. రైతు భరోసా యాత్రలో భాగంగా నాలుగో రోజు బుధవారం ఆయన అనంతపురం జిల్లా పామిడి మండలం ఎద్దులపల్లిలో ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు ఇగ్గుడ వన్నూరప్ప కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వన్నూరప్ప భార్య లక్ష్మీదేవితో జరిపిన సంభాషణ ఇలా... జగన్: ఎందుకమ్మా.. మీ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు? అప్పులు ఎంతయ్యాయి తల్లీ? లక్ష్మీదేవి: వర్షాలు కురవక పంట మొత్తం ఊడ్చిపెట్టుకుపోయింది. దీంతో అప్పులపాలయ్యాం. అప్పులు ఎలా తీర్చాలో తెలియని నా భర్త వన్నూరప్ప పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మొత్తం రూ.3 లక్షల 9 వేల అప్పు ఉంది. అందులో ఎద్దులపల్లి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో రూ.9 వేల క్రాప్‌లోన్‌తో పాటు ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ.3 లక్షల అప్పు ఉంది సార్. జగన్: ప్రభుత్వ సాయం అందిందామ్మా? వితంతు పింఛన్ అయినా ఇచ్చారా? లక్ష్మీదేవి: ప్రభుత్వ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు, ఫించన్ ఇవ్వలేదు సార్ అనంతరం జగన్ వన్నూరప్ప కుమారుడు ఎర్రిస్వామి, కుమార్తె పావనిలతో మాట్లాడి చక్కగా చదువుకోవాలని సూచించారు. లక్ష్మీదేవి తన ఆర్ధిక స్థితి సహకరించడం లేదని చెప్పింది. ఈ సందర్భంగా అక్కడ చేరిన డ్వాక్రా మహిళలతో వైఎస్ జగన్.. మాట్లాడారు. అక్కడే ఉన్న కేన్సర్ బాధితురాలు భాగ్యలక్ష్మి మాట్లాడుతూ..కేన్సర్ చికిత్స కోసం రూ.6 లక్షల దాకా అప్పు చేశానని తనను ఆదుకోవాలని జగన్‌కు విన్నవించింది. జగన్ స్పందిస్తూ వన్నూరప్ప పిల్లల పై చదువులకు, కేన్సర్ బాధితురాలు భాగ్యలక్ష్మినీ ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ గుంతకల్లు నియోజకవర్గం సమన్వయకర్త వెంకట్రామిరెడ్డికి సూచించారు. -
‘సువర్ణ యుగం’ జగన్‌తోనే సాధ్యం
పామిడి,న్యూస్‌లైన్: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న వైఎస్సార్సీపీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సువర్ణయుగం సాధ్యమని పార్టీ అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక వీరా ఫంక్షన్‌హాలులో పార్టీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ అధ్యక్షతన గుంతకల్ నియోజకవర్గ విస్త్రృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానేత వైఎస్ హయాంలో పార్టీలకు అతీతంగా ప్రజలందరూ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందారన్నారు. ఆయన మరణానంతరం రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచిందన్నారు. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో 50 ఏళ్లు వెనక్కు వెళ్లిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సిన ప్రతిపక్ష నేత చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీకి వంతపాడడం ఆయన చేతకాని తనానికి నిదర్శనమన్నారు. సమైక్యాంధ్ర ముసుగులో ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేతతో పాటు అశోక్‌బాబు ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. రాహుల్‌ను ప్రధానిని చేయడంలో భాగంగా వారు రాష్ట్ర విభజనకు పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపించారు. జననేత జగన్ మాత్రమే సమైక్యాంధ్రకోసం పోరాడుతున్నారన్నారు. ఆయనను సీఎం చేయాలన్నది జనం అభిమతమన్నారు. అధిష్టానికి తల్గొగి ప్రజావ్యతిరేకతను కూడగట్టుకున్న కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, మంత్రులతోపాటు, వారికి వంతపాడుతున్న చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు. వైఎస్ పాలన మళ్లీ చూడాలంటే వైఎస్ జగన్ సీఎం కావాలని, వైఎస్సార్ సీపీ అభ్యర్థులనందరినీ ఎన్నికల్లో గెలిపించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని వైఎస్సార్సీపీ గుంతకల్ నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి, జిల్లా కన్వీనర్ శంకరనారాయణ, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఎం.వీరాంజనేయులు, బోయ తిప్పేస్వామి, లింగాల రమేష్ తదితరులు కోరారు.జగన్ సీఎం అయ్యాకేసమస్యలన్నీ పరిష్కారమవుతాయని తెలిపారు. సమావేశంలో అనంత, కడప జిల్లాల సభ్యత్వ నమోదు సమన్వయకర్త చుక్కలూరు దిలీప్ రెడ్డి, పట్టణ, రూరల్ కన్వీనర్లు బొల్లు వెంకట్రామిరెడ్డి, చుక్కలూరు రామచంద్రారెడ్డి, సింగిల్ విండో ప్రెసిడెంట్ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పామిడిలో షర్మిలకు ఘన స్వాగతం
అనంతపురం: సమైక్య శంఖారావం పూరించిన షర్మిలకు అనంతపురం ప్రజల అడుగడుగునా నీరాజనం పడుతున్నారు. గురువారం ఉదయం నాలుగో రోజు ఆమె కల్లూరు, పామిడిలో బస్సుయాత్ర చేశారు. ఈ సందర్భంగా రెండు గ్రామాల ప్రజలు షర్మిలకు ఘన స్వాగతం పలికారు. గత రాత్రి అనంతపురంలో బస చేసిన షర్మిల గుత్తి మీదగా డోన్ చేరుకుని, అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం బస్సుయాత్ర కర్నూలు చేరుకుంటుంది. సాయంత్రం ఆరు గంటలకు అక్కడ జరిగే బహిరంగ సభలో షర్మిల సమైక్య శంఖారావం పూరిస్తారు. మరోవైపు విద్యార్థులు కేసులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల జీతాల విషయంలో అండగా ఉంటామని షర్మిల భరోసా ఇవ్వటం పట్ల ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్, ఆప్టా సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి.