డెంగీ లేకున్నా ఉన్నట్లు రిపోర్ట్
చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన విద్యార్థి
డిగ్రీ పరీక్షలు రాయలేకపోయిన వైనం
పామిడి : డెంగీ లక్షణాలు లేకపోయినా ఉన్నట్టుగా మెడాల్ ల్యాబ్ నివేదిక ఇవ్వడంతో ఓ డిగ్రీ విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిగ్రీ పరీక్షలు రాయలేకపోయాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. పామిడికి చెందిన ఆంజనేయులు, అనసూయ దంపతుల కుమారుడు ఎం.అనిల్‌కుమార్ డిగ్రీ చదువుతున్నాడు. ఈ నెల 15న ఆరోగ్యం బాగలేకపోవడంతో అనిల్‌కుమార్‌ను తండ్రి స్థానిక పామిడి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ‘మెడాల్’ ఉద్యోగి రక్తపరీక్షలు చేశారు. 16వ తేదీన గుత్తిలో ఉన్న మెడాల్ ల్యాబ్ నివేదిక ప్రకారం డెంగీ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించి, అనంతపురం ఆస్పత్రికి సిఫార్సు చేశారు. తల్లిదండ్రులు ఆందోళనకు గురై వెంటనే అనంతపురం సర్వజనాస్పత్రిలో చేర్చారు. మరోసారి అక్కడ కూడా బ్లడ్ శ్యాంపిల్స్ సేకరించారు. మూడురోజుల పాటు డెంగీ చికిత్స చేయించారు. ఇదే సమయంలో డిగ్రీ ఫస్టియర్ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రిలోనే ఉండటం వల్ల రెండు పరీక్షలకు అనిల్‌కుమార్ గైర్హాజరయ్యాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యి వచ్చాక పామిడి మెడాల్ వారు డెంగీ నెగటివ్ అని మరో రిపోర్టు ఇచ్చారని విద్యార్థి తండ్రి ఆంజనేయులు మంగళవారం మీడియా ఎదుట వాపోయారు. తప్పుడు రిపోర్టుతో తన కుమారుని జీవితంతో చెలగాటం ఆడడమే కాకుండా...ఇంటిల్లిపాది అనారోగ్యం పాలవడానికి కారణమైన మెడాల్ నిర్వాకంపై విచారణ చేపట్టాలని ఆయన కోరారు.
రిపోర్టు నివేదించింది మేము కాదు
డెంగీ నిర్ధారణకు సంబంధించి రక్తాన్ని పరీక్షల నిమిత్తం గుత్తి ల్యాబ్‌కు పంపుతాం. అక్కడి నివేదిక ఆధారంగానే మొదట్లో డెంగీ అని నిర్ధారణయ్యింది. ఆపై తదుపరి రిపోర్టు మాత్రం నెగిటివ్ అని వచ్చింది. ఈ విషయాన్ని అప్పటికప్పుడే సంబంధిత మెడాల్ మేనేజ్‌మెంట్ నిర్వాహకులు శ్రీనివాసులు దృష్టికి తీసుకెళ్లాం.
–పామిడి మెడాల్ ఉద్యోగి నిరంజన్
రోగులతో ‘మెడాల్’ చెలగాటం
Published Tue, Jan 17 2017 11:33 PM | Last Updated on Tue, Sep 5 2017 1:26 AM
Advertisement
Advertisement