staff negligance
-
ఐసీఐసీఐ నిర్లక్ష్యంతో రూ.43 లక్షలు మాయం
పంజగుట్ట: సికింద్రాబాద్ లోని ఐసీఐసీఐ బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తాను ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన రూ.43,07,535 గళ్లంతయ్యిందని ఎన్నారై రాజా ఉత్తమ్‌కుమార్ అతని న్యాయవాది పీవీ కృష్ణమాచారి ఆరోపించారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ ..తనకు జరిగిన మోసంపై సచివాలయంలోని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (అడ్జుడికేటింగ్ అధికారి) ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశామని, దీనిపై విచారణ చేపట్టిన అధికారులు బ్యాంకుదే బాధ్యతగా నిర్ధారిస్తూ ఖాతానుంచి గళ్లంతైన సొమ్మును 9శాతం వడ్డీతో పాటు కోర్టు ఖర్చులకింద రూ.50వేలు, ఖాతాదారులను మానసికంగా ఇబ్బంది పెట్టినందుకు మరో రూ.5 లక్షలు అరవై రోజుల్లో చెల్లించాలని ఆదేశించారన్నారు. అయితే బ్యాంకు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బ్యాంకు ఆస్తులను జప్తు చేసుకోవాలని కోరుతూ సోమవారం అడ్జుడికేటింగ్ అధికారికి వినతిపత్రం అందజేశామన్నారు. 2015లో సికింద్రాబాద్ ఎస్డీ రోడ్డులోని ఐసీఐసీఐ బ్యాంకులో ఖాతా తెరిచిన తాను రూ.50 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) చేసి అమెరికా వెళ్లిపోయినట్లు తెలిపాడు. అదే ఏడాది డిసెంబర్లో ఖాతాను చెక్‌చేసుకోగా పాస్వర్డ్ మారినట్లు సమాచారం అందిందన్నారు. ఈ విషయమై ఐసీఐసీఐ బ్యాంకు విచారణ విభాగాన్ని సంప్రదించగా విచారణ చేసి చెబుతామని చెప్పారని, కొన్ని రోజుల తర్వాత పాస్వర్డ్ మార్చుకోవాలని సూచించినట్లు తెలిపారు. తీరా ఖాతాలో చూసుకోగా రూ.43,07,535 విత్‌డ్రా అయినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ విషయమై బ్యాంకు అధికారులను ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పకపోవడంతో 2016లో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు భాస్కర్ రాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రూ. 2 లక్షలు వసూలు చేశారన్నారు. నిందితుల్లో కొందరు విదేశాలకు వెళ్లడంతో పోలీసులు ఏమీ చేయలేకపోయారన్నారు. బ్యాంకు, పోలీసుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో ఖాతా వివరాలు భద్రంగా ఉంచాల్సిన బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మోసం జరిగిందని ఆరోపిస్తూ 2017లో డిసెంబర్లో రాష్ట్ర అడ్జుడికేటింగ్ అధికారికి ఫిర్యాదు చేశామన్నారు. వారు పూర్తిస్థాయిలో విచారించి ఖాతాదారుని డబ్బులు భద్రపర్చడంలో బ్యాంకు విఫలమైందని నిర్ధారిస్తూ గళ్లంతైన సొమ్ముకు 9 శాతం వడ్డీ, ఖర్చులకింద రూ.50వేలు, ఖాతాదారుడిని మానసికంగా బాధపెట్టినందుకు రూ. 5 లక్షలు 60 రోజుల్లో చెల్లించాలని 2019 అక్టోబర్‌లో తీర్పు ఇచ్చినట్లు తెలిపారు. ఈ గడువు ముగిసినా బ్యాంకు నుంచి ఎలాంటి స్పందన లేదని, ఈ నేపథ్యంలో బ్యాంకు ఆస్తులను జప్తు చేయాలని కోరుతూ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సమావేశంలో న్యాయవాది రజని, మునీష్ వాజ్‌పేయి పాల్గొన్నారు. -
అంతా వారిష్టం
విశాఖ సిటీ: పేదలకు వైద్యమందించడమంటే కేజీహెచ్‌లోని కొంత మంది సిబ్బందికి మా చెడ్డ చిరాకు. కొన్ని విభాగాలకు చెందిన సిబ్బంది 24 గంటలూ విధులు నిర్వర్తించాలని ఉత్తర్వులున్నా పట్టుమని పది గంటలు కూడా కనిపించడం లేదు. అడిగేవారు లేరనీ.. అడిగిన వారిని కాదనీ.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ విధులకు డుమ్మా కొడుతున్నారు. రేడియాలజీ విభాగం ఈ విషయంలో ముందుంది. సిబ్బంది లేక.. సేవలు కానరాక సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు సరైన సమయంలో పరీక్షలు జరగకపోవడంతో విలవిల్లాడుతున్నారు. ఉత్తర్వుల్లో స్పష్టం చేసినా... పారా మెడికల్ సిబ్బందిగా గుర్తించిన రేడియాలజీ సిబ్బంది ఏడాదిలో 35 రోజులు సాధారణ సెలవులు తీసుకుని మిగిలిన అన్ని రోజులూ రోగులకు అందుబాటులో ఉండాలని ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ జీవో నంబరు 784లో స్పష్టం చేసింది. కానీ నిబంధనలను తుంగలో తొక్కి వీరంతా అడ్మినిస్ట్రేటివ్, మినిస్టీరియల్ ఉద్యోగుల తరహాలో ప్రభుత్వ సెలవు దినాలను ఎంజాయ్ చేస్తూ ఏకంగా విభాగానికి తాళాలు వేసేస్తున్నారు. ఇదే విభాగంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తన పలుకుబడి వినియోగించి వైద్యాధికారులతో నోటిమాటగా చెప్పి సెలవులు ప్రకటించడం ఆస్పత్రి వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రేడియాలజీ సిబ్బందికి వారాంతపు సెలవుతోపాటు రేడియేషన్ ముప్పు కారణంగా ఆర్సీఎల్ పేరిట ఏడాదికి 30 రోజుల పాటు ప్రత్యేక సెలవులను ప్రభుత్వం అందిస్తోంది. వీరికి ఇచ్చిన సెలవులన్నీ సద్వినియోగపరచుకోవడంతోపాటు విధులు నిర్వర్తించాల్సిన రోజులైన ప్రభుత్వ సెలవుదినాలు, ఆదివారాలలోనూ విధులకు హాజరు కాకపోవడం అన్యాయమని పలువురు వైద్యులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇన్‌పేషెంట్లకు తీవ్ర ఇబ్బందులు ఆస్పత్రిలో ఇన్పేషెంట్లుగా చేరి వైద్య సేవలు పొందుతున్నవారు సుమారుగా 1600 మంది వరకూ ఉంటారు. ఈ రేడియాలజీ విభాగానికి చేరువలో ఉన్న భావనగర్, రాజేంద్రప్రసాద్, ఎముకల విభాగం, శస్త్రచికిత్స విభాగాలతో పాటు పిల్లల వార్డులలోని ఇన్‌పేషెంట్లకు అత్యవసరంగా ఎక్స్‌రే, స్కానింగ్ చేయాలంటే ఈ రేడియాలజీ విభాగానికి తీసుకొస్తారు. పండుగ సెలవులు, ఆదివారాలు ఈ విభాగాన్ని పూర్తిగా మూసివేయడంతో ఆయా రోగులను ఆస్పత్రి సిబ్బంది, రోగుల సహాయకులు వార్డులకు దూరంగా ఉన్న అత్యవసర విభాగానికి తీసుకెళ్లాల్సి రావడంతో సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇన్‌పేషెంట్లకు సెలవు రోజుల్లో అత్యవసరంగా పరీక్షలు నిర్వహించాల్సి వస్తే వారిని అత్యవసర వైద్య విభాగానికి పంపుతున్నామని వైద్యులు, నర్సింగ్ సిబ్బంది చెబుతున్నారు. ఆస్పత్రిలో ఎక్స్‌రే సేవల వివరాలివీ ఆస్పత్రి రేడియాలజీ విభాగం ఆధ్వర్యంలో సుమారు 13 ఎక్స్‌రే మిషన్లు పనిచేస్తున్నాయి. ఈ విభాగంలో సుమారుగా 10 మంది సిబ్బందితో పాటు డిప్లమో రేడియాలజీ వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు శిక్షణ పేరిట రోగులకు సేవలు అందిస్తుంటారు. అత్యవసరం కోసం ప్రైవేటుకు పరుగులు దేశంలో ఎక్కడైనా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే వైద్యులు, ఫార్మసిస్ట్‌లు, నర్సింగ్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు, ఎక్స్‌రే, స్కానింగ్‌లు చేసే సిబ్బంది ప్రభుత్వ సెలవు రోజులు, పండగ రోజులతో సహా అందుబాటులో ఉంటూ రోగులకు వైద్య సేవలు అందించాలి. తమకు ఇచ్చిన క్యాజువల్ లీవ్‌ను అవసరమైన రోజు వినియోగించుకుని మిగిలిన అన్ని రోజులు అందుబాటులో ఉండాలి. కానీ ఎవరూ అందుబాటులో ఉండకపోవడంతో తీవ్ర అనారోగ్యంతో వస్తున్న రోగులు ఎక్స్‌రే, స్కానింగ్‌లు అత్యవసరంగా తీయించాల్సి వస్తే ఆస్పత్రి వెలుపల ఉన్న ప్రైవేటు కేంద్రాలను అశ్రయించాల్సి వస్తోంది. ఇలా రేడియాలజీ విభాగం ఉద్యోగులు సెలవులు తీసుకునే విధానం రాష్ట్రంలోని బోధనాస్పత్రులున్న కాకినాడ, విజయవాడ, కర్నూలు, గుంటూరు తదితర ప్రాంతాల్లో ఎక్కడా లేదని, కేవలం కేజీహెచ్‌లోని రేడియాలజీ విభాగ సిబ్బంది మాత్రమే సెలవులు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజులో నాలుగు గంటలే సేవలు కేజీహెచ్‌లో వైద్యులతో పాటు పారా మెడికల్ విభాగానికి చెందిన నర్సింగ్, ఫార్మసీ, ల్యాబ్ టెక్నీషియన్స్, ఎక్స్‌రే, స్కానింగ్‌లలో పనిచేసే సిబ్బందికి షిఫ్ట్‌ల వారీగా ఏడాది పొడవునా రోజుకు ఇరవై నాలుగు గంటలూ సేవలు అందించాలని ప్రభుత్వ జీవోలు చెబుతున్నాయి. అయితే పెద్దాస్పత్రిలో పారా మెడికల్ సిబ్బందిగా ఉంటున్న రేడియాలజీ సిబ్బంది ప్రభుత్వ అనుమతులు లేకుండానే ఇష్టానుసారంగా సెలవులు తీసుకుంటున్నారని ఇతర సిబ్బందితో పాటు రోగులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ఇన్ పేషెంట్లు, ఔట్ పేషెంట్లుకు 24 గంటలూ అందుబాటులో ఉండి అత్యవసర పరిస్థితుల్లో ఎక్స్‌రే, స్కానింగ్ పరీక్షలు చేయాల్సి ఉంది. కానీ రోజులో కేవలం 3 నుంచి 4 గంటలు... మహా అయితే 6 గంటలు మాత్రమే రేడియాలజీ విభాగం సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. ఆ తర్వాత రోగులు వచ్చినా పరీక్షలు చేసేందుకు విముఖత చూపిస్తున్నారు. ఇక సెలవు దినాల్లో అయితే సరేసరి.. ప్రభుత్వ సెలవులు, ఆదివారాల్లో ఏకంగా విభాగానికి తాళాలు వేసేస్తున్నారు. సెలవులు మాకెందుకు వర్తించవు? పండగ సెలవులతోపాటు ఇతరత్రా సెలవులు మాకు వర్తించవా అంటూ కేజీహెచ్‌లోని మిగిలిన విభాగాల పారా మెడికల్ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. అస్పత్రిలో రక్తపరీక్షలు, ఫార్మశీ, నర్సింగ్ విభాగాలకు చెందిన పారా మెడకల్ సిబ్బంది మాత్రం 24 గంటలూ అందుబాటులో ఉంటున్నారు. ఆదివారంతో సహా పండుగ సెలవుల రోజున రేడియాలజీ విభాగంలోని ఎక్స్‌రే, స్కానింగ్ విభాగాలను మూసివేస్తున్న తరహాలోనే తమకు సెలవులు ప్రకటించాలని వీరంతా కోరుతున్నారు. ఇలా సెలవులు తీసుకోవడం తప్పుకాకుంటే దీనిని అన్ని విభాగాలకు వర్తింపజేసి అందరికీ సెలవులు ఇచ్చి సదరు డిపార్ట్మెంట్లకు తాళాలు వేయాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. -
కడుపులో కత్తెరకు మూల్యం రూ.3 లక్షలు
నెల్లూరు(బారకాసు): వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ రోగికి జరిగిన అన్యాయానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించనుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు శుక్రవారం జారీ అయ్యాయి. 2017 అక్టోబర్ 3న నారాయణరెడ్డిపేటకు చెందిన చలపతి కడుపునొప్పితో చికిత్సనిమిత్తం నెల్లూరు నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేరాడు. అక్కడి వైద్యులు అతనికి అవసరమైన పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్స చేశారు. అయితే శస్త్రచికిత్స పూర్తయిన తరువాత కడుపుకు కుట్లు వేసే సమయంలో అందులో ‘ఫోర్సెప్స్’ పరికరాన్ని వదిలేసి కుట్లు వేశారు. 20 రోజుల తరువాత ‘కడుపులో కత్తెర’ ఉన్న విషయం బయటకు పొక్కడంతో అప్పట్లో ఈ ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘం(హెచ్ఆర్సీ)కు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో స్పందించిన హెచ్ఆర్సీ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. జరిగిన ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ మేరకు ఉన్నతాధికారులు సంబంధిత వైద్యులు, సిబ్బందిపై విచారణ జరిపారు. నివేదికలను హెచ్ఆర్సీకి పంపారు. తప్పు ఎవరు చేశారనే విషయం బయటకు రానివ్వకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు. నిర్లక్ష్యం వహించిన వారెవరైనా గానీ నష్టం జరిగింది మాత్రం చలపతికి అని హెచ్ఆర్సీ నిర్ధారించింది. దీంతో ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చలపతికి తగిన మూల్యం చెల్లించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మానవ హక్కుల సంఘం ఆదేశించింది. హెచ్ఆర్సీ ఆదేశాల మేరకు బాధితుడైన చలపతికి నష్టపరిహారంగా రూ.3 లక్షలు చెల్లించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18న నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తాన్ని బాధితుడు చలపతికి చెల్లించాలంటూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య శుక్రవారం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ)కు ఉత్తర్వులు జారీ చేశారు. -
వైద్యసేవల్లో నిర్లక్ష్యంపై ఆగ్రహం
అనంతపురం న్యూసిటీ: వైద్య సేవల్లో సిబ్బంది నిర్లక్ష్యంపై డీఎంఈ కార్యాలయం డైరెక్టర్ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ డాక్టర్ సుబ్బారావు మండిపడ్డారు. మంగళవారం ఆయన ఎంసీహెచ్ బ్లాక్, కేన్సర్ ఆస్పత్రి, ఎంఆర్ఐ స్కాన్ ఏర్పాటును పరిశీలించేందుకు అనంతపురం వచ్చారు. ఈ సందర్భంగా సర్వజనాస్పత్రిలోని పోస్టునేటల్ వార్డులో ఇద్దరు బాలింతల పిల్లలకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐ) ట్యాగ్ పసికందులకు వేయకపోవడాన్ని గుర్తించారు. పొరపాటున పిల్లలు మారిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ స్టాఫ్‌నర్సులు, కంపెనీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీకిచ్చే డబ్బుల్లో కోత విధిస్తామని హెచ్చరించారు. ఇక నుంచైనా జాగ్రత్తగా ట్యాగ్లు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలు ఏకరువు సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ చాంబర్లో జరిగిన సమావేశంలో హెచ్ఓడీలు తమ సమస్యలను ఏకరువుపెట్టారు. సర్జరీ హెచ్ఓడీ ప్రొఫెసర్ డాక్టర్ రామస్వామినాయక్ మాట్లాడుతూ మెయిన్ ఆపరేషన్ థియేటర్లో టేబుళ్లు తక్కువగా ఉన్నాయన్నారు. ఆస్పత్రి యాజమాన్యం ప్రైవేట్ వ్యక్తులను ప్రోత్సహిస్తూ...తమకు ఆపరేషన్లు చేయడానికి అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్జరీలు తక్కువైతే పీజీలు రావన్నారు. ఓటీలో ఏసీలు పని చేయడం లేదని, లీకేజీలున్నాయని పేర్కొన్నారు. ♦ గైనిక్ వార్డులో మంచాల కొరత అధికంగా ఉందని హెచ్ఓడీ డాక్టర్ షంషాద్‌బేగం తెలిపారు. మెటర్నిటీ అసిస్టెంట్లు కూడా తగినంత మంది లేరన్నారు. ఎంసీహెచ్ బ్లాక్‌ను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. పలువురు ప్రొఫెసర్లు మాట్లాడుతూ రేడియాలజీ విభాగంలో ఒక్క రేడియాజిస్టు మాత్రమే ఉన్నారన్నారు. ప్రైవేట్‌గా ప్రతి నెలా రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షలు వెచ్చిస్తున్నారన్నారు. ఇద్దరు రేడియాలజిస్టులను ఏర్పాటు చేస్తే ఆ మొత్తం చెల్లించే పరిస్థితి ఉండదని డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ♦ ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోందని, నిర్వహణ కోసం రూ.కోట్లు ఖర్చు అవుతోందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ తెలిపారు. ప్రస్తుతం కోటి రూపాయలు మాత్రమే నిధులున్నాయన్నారు. ప్రత్యేక బడ్జెట్‌ను విడుదల చేయాలని డైరెక్టర్‌కు విన్నవించారు. సమావేశంలో డిప్యూటీ ఆర్ఎం ప్రొఫెసర్లు డాక్టర్ ఎండ్లూరి ప్రభాకర్, డాక్టర్ మైరెడ్డి నీరజ, డాక్టర్ మల్లీశ్వరి, డాక్టర్ జేసీ రెడ్డి, డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేన్సర్ ఆస్పత్రి అభివృద్ధికి ప్రతిపాదనలు ఉదయం డైరెక్టర్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వరరావు, సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్‌తో కలసి పాతూరు సీడీ ఆస్పత్రి, కేన్సర్ యూనిట్, బ్లడ్ బ్యాంకును పరిశీలించారు. సీడీ ఆస్పత్రి ఆవరణలో రూ.55 కోట్లతో ఎంసీహెచ్ బ్లాక్ ఏర్పాటుకు అనువైన స్థలమన్నారు. పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్షిప్ కింద కేన్సర్ ఆస్పత్రిని అభివృద్ధి చేసేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నామన్నారు. అపరిశుభ్రతపై ఆగ్రహం సర్జికల్ విభాగాలను పరిశీలించిన డాక్టర్ సుబ్బారావు శానిటేషన్ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వార్డుల్లో ఎక్కడపడితే అక్కడ వ్యర్థాలను వేయడాన్ని తప్పుబట్టారు. వార్డులు పరిశుభ్రంగా ఉంటేనే రోగులు త్వరగా కోలుకునేందుకు వీలుంటుందన్నారు. ఆర్ఎంఓ, మేనేజర్, వైద్యులు ఎప్పటికప్పుడు శానిటేషన్ నిర్వహణ చూసుకోవాలన్నారు. ఎంఆర్ఐ యూనిట్‌ను త్వరితగతిన ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రమోదిన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకులకు సూచించారు. -
108 ఉద్యోగి నిర్లక్ష్యం గాలిలో కలిసిన ప్రాణం
మదనపల్లె క్రైం: అత్యవసర సమయంలో ఆస్పత్రికి తరలించి వారి ప్రాణాన్ని నిలబెట్టాల్సిన 108 సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఓ నిండు గర్భిణి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ సంఘటన మదనపల్లెలో గురువారం జరిగింది. చత్తీస్‌ఘడ్‌కు చెందిన 10 కుటుంబాల వారు మూడేళ్ల క్రితం మదనపల్లె మండలం సీటీఎంలోని ఓ క్వారీలో పనిచేసేందుకు వచ్చారు. వారిలో రామ్‌సింగ్, శాంతి దంపతులు ఉన్నారు. వీరికి కొడుకు ధరమ్‌సింగ్ (4) ఉన్నాడు. శాంతి రెండోసారి గర్భం దాల్చింది. భర్త తాగి ఇంటికి వస్తున్నాడని బుధవారం సాయంత్రం మందలించింది. అతను పట్టించుకోకపోవడంతో భర్తను భయపెట్టేందుకు ఆమె పురుగుల మందుతాగింది. ఆమెను స్థానికులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన మదనపల్లె ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు. వారికి ఆర్థిక స్థోమత లేకపోవడంతో 108ను ఆశ్రయించారు. ఆ సమయంలో 108 వాహనాలు అందుబాటులో లేవని హైదరాబాద్ నుంచి ఆర్గనైజర్ సమాచారం అందించారు. అప్పటికే ఆస్పత్రిలో ఉన్న వాల్మీకిపురం 108 సిబ్బంది భార్గవాచారిని తిరుపతికి తీసుకెళ్లాలని బాధితులు, ఆస్పత్రి సిబ్బంది కోరారు. అందుకు అతను నిరాకరించి ఖాళీ వాహనంతోనే వాల్మీకిపురం వెళ్లిపోయాడు. కొంతసేపటికి ఆస్పత్రికి వచ్చిన మదనపల్లె 108 సిబ్బంది గర్భిణి శాంతిని తీసుకుని వాల్మీకిపురం 108 సిబ్బందికి అప్పగించారు. వారు తిరుపతికి తీసుకెళ్లారు. సుమారు 3 గంటలు ఆలస్యం కావడంతో శాంతి పరిస్థితి మరింత విషమించింది. రుయా వైద్యులు మెరుగైన వైద్య చికిత్సలు అందించినా ప్రయోజనం లేకుండా పోయింది. శాంతి మృతి చెం దింది. ఈ విషయమై 108 జిల్లా సూపర్వైజర్ లోకేష్‌ను వివరణ కోరగా సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. మరో సారి అలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. -
ఇదేనా శవ మర్యాద?
అన్నవరం (ప్రత్తిపాడు): అనాథ శవానికైనా నలుగురు ఖర్చులు భరించి అంత్యక్రియలు చేసే సంస్కృతి మనది. కానీ అన్నవరం దేవస్థానంలో మాత్రం సిబ్బంది నిర్లక్ష్యం మానవత్వానికి మాయని మచ్చగా నిలిచింది. సత్యదేవుని ఆలయానికి భక్తులను తీసుకువచ్చిన ఓ టూరిస్ట్ బస్ డ్రైవర్ గుండెనొప్పితో చనిపోతే ఆ శవాన్ని కొండదిగువన దేవస్థానం ఆసుపత్రిలో ఆరుబయట ఎండలో పడేశారు. ఉదయం ఎనిమిదిన్నర నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆ మృతదేహం ఎండకు ఎండుతూ ఉంది. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకుని ఇదేమి అన్యాయం? అని ప్రశ్నిస్తే అప్పుడు ప్రైవేట్ శానిటరీ సిబ్బంది ఆ శవాన్ని నీడకు తరలించారు. కొంత సేపటికి, మృతిచెందిన డైవర్ తరఫువారు అంబులెన్స్‌లో ఆ డ్రైవర్ స్వగ్రామం అనంతపురం జిల్లా ఉరవకొండకు తీసుకువెళ్లారు. దేవస్థానం శానిటరీ, ఆసుపత్రి సిబ్బంది వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. వివరాల్లోకి వెళితే కర్నూల్ జిల్లా నందవరం మండలం కనికివేడు పాడు, ఎమ్మిగనూర్ మండలానికి చెందిన 90 మంది భక్తులు రెండు టూరిస్ట్ బస్సులలో కాశీ తీర్థయాత్రకు బయల్దేరారు. మంగళవారం అర్ధరాత్రి అన్నవరం దేవస్థానానికి చేరుకున్నారు. వీరందరూ రాత్రి బస్సులతో నిద్రించారు. అయితే ఏపీ02 టీబీ 9799 బస్ డ్రైవర్ జి.కృష్ణ (60) మాత్రం ఆరుబయట నిద్రించాడు. తెల్లవార జాము ఐదు గంటలకు అందరూ లేచి స్నానాలు చేసి స్వామి దర్శనానికి వెళ్లేందుకు సమాయత్తమవుతుండగా డ్రైవర్ మాత్రం లేవలేదు. కొందరు అతడిని లేపడానికి ప్రయత్నించగా చలనం లేకపోవడం, నోటినుంచి, మెడ నుంచి రక్తం వస్తుండడం గమనించి మృతి చెందినట్టుగా అనుమానం వ్యక్తం చేసి వెంటనే దేవస్థానం సిబ్బందికి సమాచారం అందించారు. సెక్యూరిటీ, ప్రైవేట్ శానిటరీ సిబ్బంది ఒక వ్యాన్‌లో ఉదయం ఎనిమిదిన్నర గంటలకు కొండదిగువన దేవస్థానం ఆసుపత్రికి తరలించారు. అయితే మృతదేహాన్ని ఆసుపత్రి లోపలకు తీసుకురావద్దని, బయట ఉంచాలని ఆసుపత్రి నర్స్, అటెండర్ చెప్పడంతో ఆ మృతదేహాన్ని ఆసుపత్రి భవనం పక్కన గల ఖాళీస్థలంలో వదిలేసి వెళ్లిపోయారని అంటున్నారు. అయితే తమను అడగలేదని, వ్యాన్‌లో మొక్కలు తెచ్చారేమో అని అనుకుని దూరంగా దింపమని చెప్పానని నర్స్ సరోజినీ తెలిపారు. ఏమైందో తెలియదు కాని ఆ మృతదేహం మ«ధ్యాçహ్నం 12.30 గంటల వరకు అలాగే నిర్లక్ష్యంగా వదిలేశారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నించడంతో నీడలోకి ఆ శవాన్ని మార్చారు. కొంతసేపటికి మృతి చెందిన డ్రైవర్ తాలుకు వారు వచ్చి అంబులెన్స్‌లో ఆ శవాన్ని అనంతపురం జిల్లా ఉరవకొండ తీసుకువెళ్లారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లా : డాక్టర్ రామారావు ‘‘నేను ఉదయం 9.30 గంటలకు ఆసుపత్రికి వచ్చేటప్పటికే ఆ శవం అక్కడ ఉంది. అలా బయట ఉండకూడదని చెప్పి నేను, ఫార్మసీ సూపర్వైజర్ మా«ధవి కలసి దేవస్థానం అధికారులకు, ఈఓ పేషీకి ఫోన్ చేసి చెప్పాం. తరువాత ఈఓను కొండమీద కలిసి వివరించాం. ఈఓ కూడా వెంటనే ఆ డ్రైవర్ స్వగ్రామానికి దేవస్థానం ఖర్చుతో ఆ శవాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేయమని ఆదేశించారు. అదే విషయం శవాన్ని తీసుకువచ్చిన వారికి చెప్పగా పోలీస్ క్లియరెన్స్ వచ్చాక తీసుకుపోతామని చెప్పారు.’’ అని డాక్టర్ రామారావు ‘సాక్షి’కివివరించారు. -
రోగి ప్రాణంతో చెలగాటం
విశాఖసిటీ: పెట్టుబడుల పేరుతో ప్రగల్భాలు పలుకుతున్న ప్రభుత్వానికి సామాన్యుడి ప్రాణాలంటే లెక్కలేని తనం. వైఎస్ హయాంలో వెలుగొందిన 108 సేవలు.. నీరుగార్చేశారనడానికి నిదర్శనమైన ఘటన నగరంలో చోటు చేసుకుంది. చెంతనే అంబులెన్స్ ఉన్నా.. ఫోన్ చేస్తే లేదని చెప్పడంతో ప్రాణాలతో కొట్టుమిట్టాడిన వైనం ఆ కుటుంబాన్ని కలవరపాటుకు గురిచేసింది. రేసపువానిపాలెంలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం వెనుక నివాసముంటున్న బొదిరెడ్డి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇంట్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన బ్రహ్మానందం నివాసముంటున్నారు. ఆదివారం ఉదయం 5.20 నిమిషాలకు బ్రహ్మానందం ఆరోగ్యం క్షీణించడంతో శ్రీనివాసరెడ్డి 108 వాహనానికి ఫోన్ చేసి వివరాలు చెప్పారు. కొంత సమయం తర్వాత మీ చిరునామా సమీపంలో 108 వాహనం అందుబాటులో లేదని, వేరే ఏదైనా ప్రత్యామ్నాయం చూసుకోవాలని కేంద్రం నుంచి ఫోన్ వచ్చింది. అప్పటికే బ్రహ్మానందం పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో శ్రీనివాసరెడ్డి తన ద్విచక్రవాహనంపై ఆస్పత్రికి తీసుకెళ్లారు. బైక్‌పై వెళ్తున్నప్పుడు తన ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న ఇండోర్ స్టేడియంలోనే 108 వాహనం ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. బ్రహ్మానందాన్ని రామాటాకీస్ రోడ్డులో ఉన్న ప్రేమ ఆస్పత్రిలో చేర్పించి 108 వాహనం వద్దకు చేరుకున్నారు. అక్కడ వాహనంలో డ్రైవర్ నిద్రిస్తున్నారని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో 108 అంబులెన్స్‌ను కడుగుతున్న విషయాన్ని గమనించానన్నారు. రోజూ ఇండోర్ స్టేడియం వద్ద 108 వాహనం అందుబాటులో ఉంటుందనీ, అయితే.. ప్రజలకు అత్యవసర తరుణంలో ఇలా వ్యవహరించడం బాధాకరమైన అంశమని వ్యాఖ్యానించారు. సరైన సమయానికి బైక్‌పై తీసుకెళ్లడంతో ఆయన కోలుకున్నారనీ, ప్రాణాలు కాపాడాల్సిన ప్రభుత్వం ఇలా వ్యవహరించడం చూస్తుంటే ప్రజల ఆరోగ్యంపై 108 సిబ్బందికి ఎంతటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందన్నారు. -
రోగులతో ‘మెడాల్’ చెలగాటం
డెంగీ లేకున్నా ఉన్నట్లు రిపోర్ట్ చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన విద్యార్థి డిగ్రీ పరీక్షలు రాయలేకపోయిన వైనం పామిడి : డెంగీ లక్షణాలు లేకపోయినా ఉన్నట్టుగా మెడాల్ ల్యాబ్ నివేదిక ఇవ్వడంతో ఓ డిగ్రీ విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిగ్రీ పరీక్షలు రాయలేకపోయాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. పామిడికి చెందిన ఆంజనేయులు, అనసూయ దంపతుల కుమారుడు ఎం.అనిల్‌కుమార్ డిగ్రీ చదువుతున్నాడు. ఈ నెల 15న ఆరోగ్యం బాగలేకపోవడంతో అనిల్‌కుమార్‌ను తండ్రి స్థానిక పామిడి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ‘మెడాల్’ ఉద్యోగి రక్తపరీక్షలు చేశారు. 16వ తేదీన గుత్తిలో ఉన్న మెడాల్ ల్యాబ్ నివేదిక ప్రకారం డెంగీ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించి, అనంతపురం ఆస్పత్రికి సిఫార్సు చేశారు. తల్లిదండ్రులు ఆందోళనకు గురై వెంటనే అనంతపురం సర్వజనాస్పత్రిలో చేర్చారు. మరోసారి అక్కడ కూడా బ్లడ్ శ్యాంపిల్స్ సేకరించారు. మూడురోజుల పాటు డెంగీ చికిత్స చేయించారు. ఇదే సమయంలో డిగ్రీ ఫస్టియర్ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రిలోనే ఉండటం వల్ల రెండు పరీక్షలకు అనిల్‌కుమార్ గైర్హాజరయ్యాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యి వచ్చాక పామిడి మెడాల్ వారు డెంగీ నెగటివ్ అని మరో రిపోర్టు ఇచ్చారని విద్యార్థి తండ్రి ఆంజనేయులు మంగళవారం మీడియా ఎదుట వాపోయారు. తప్పుడు రిపోర్టుతో తన కుమారుని జీవితంతో చెలగాటం ఆడడమే కాకుండా...ఇంటిల్లిపాది అనారోగ్యం పాలవడానికి కారణమైన మెడాల్ నిర్వాకంపై విచారణ చేపట్టాలని ఆయన కోరారు. రిపోర్టు నివేదించింది మేము కాదు డెంగీ నిర్ధారణకు సంబంధించి రక్తాన్ని పరీక్షల నిమిత్తం గుత్తి ల్యాబ్‌కు పంపుతాం. అక్కడి నివేదిక ఆధారంగానే మొదట్లో డెంగీ అని నిర్ధారణయ్యింది. ఆపై తదుపరి రిపోర్టు మాత్రం నెగిటివ్ అని వచ్చింది. ఈ విషయాన్ని అప్పటికప్పుడే సంబంధిత మెడాల్ మేనేజ్మెంట్ నిర్వాహకులు శ్రీనివాసులు దృష్టికి తీసుకెళ్లాం. –పామిడి మెడాల్ ఉద్యోగి నిరంజన్