ఆర్‌ఎఫ్‌ఐ ట్యాగ్‌లు వేయకపోతే ఎలాగని ప్రశ్నిస్తున్న డైరెక్టర్ డాక్టర్ సుబ్బారావు, శానిటేషన్‌పై సూపరింటెండెంట్‌కు సూచనలిస్తున్న డైరెక్టర్
అనంతపురం న్యూసిటీ: వైద్య సేవల్లో సిబ్బంది నిర్లక్ష్యంపై డీఎంఈ కార్యాలయం డైరెక్టర్ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ డాక్టర్ సుబ్బారావు మండిపడ్డారు. మంగళవారం ఆయన ఎంసీహెచ్ బ్లాక్, కేన్సర్ ఆస్పత్రి, ఎంఆర్‌ఐ స్కాన్ ఏర్పాటును పరిశీలించేందుకు అనంతపురం వచ్చారు. ఈ సందర్భంగా సర్వజనాస్పత్రిలోని పోస్టునేటల్ వార్డులో ఇద్దరు బాలింతల పిల్లలకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌ఐ) ట్యాగ్ పసికందులకు వేయకపోవడాన్ని గుర్తించారు. పొరపాటున పిల్లలు మారిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ స్టాఫ్‌నర్సులు, కంపెనీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీకిచ్చే డబ్బుల్లో కోత విధిస్తామని హెచ్చరించారు. ఇక నుంచైనా జాగ్రత్తగా ట్యాగ్‌లు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
సమస్యలు ఏకరువు
సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ చాంబర్‌లో జరిగిన సమావేశంలో హెచ్‌ఓడీలు తమ సమస్యలను ఏకరువుపెట్టారు. సర్జరీ హెచ్‌ఓడీ ప్రొఫెసర్ డాక్టర్ రామస్వామినాయక్ మాట్లాడుతూ మెయిన్ ఆపరేషన్ థియేటర్‌లో టేబుళ్లు తక్కువగా ఉన్నాయన్నారు. ఆస్పత్రి యాజమాన్యం ప్రైవేట్ వ్యక్తులను ప్రోత్సహిస్తూ...తమకు ఆపరేషన్లు చేయడానికి అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్జరీలు తక్కువైతే పీజీలు రావన్నారు. ఓటీలో ఏసీలు పని చేయడం లేదని, లీకేజీలున్నాయని పేర్కొన్నారు.
♦ గైనిక్ వార్డులో మంచాల కొరత అధికంగా ఉందని హెచ్‌ఓడీ డాక్టర్ షంషాద్‌బేగం తెలిపారు. మెటర్నిటీ అసిస్టెంట్లు కూడా తగినంత మంది లేరన్నారు. ఎంసీహెచ్ బ్లాక్‌ను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. పలువురు ప్రొఫెసర్లు మాట్లాడుతూ రేడియాలజీ విభాగంలో ఒక్క రేడియాజిస్టు మాత్రమే ఉన్నారన్నారు. ప్రైవేట్‌గా ప్రతి నెలా రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షలు వెచ్చిస్తున్నారన్నారు. ఇద్దరు రేడియాలజిస్టులను ఏర్పాటు చేస్తే ఆ మొత్తం చెల్లించే పరిస్థితి ఉండదని డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
♦ ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోందని, నిర్వహణ కోసం రూ.కోట్లు ఖర్చు అవుతోందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ తెలిపారు. ప్రస్తుతం కోటి రూపాయలు మాత్రమే నిధులున్నాయన్నారు. ప్రత్యేక బడ్జెట్‌ను విడుదల చేయాలని డైరెక్టర్‌కు విన్నవించారు. సమావేశంలో డిప్యూటీ ఆర్‌ఎం ప్రొఫెసర్లు డాక్టర్ ఎండ్లూరి ప్రభాకర్, డాక్టర్ మైరెడ్డి నీరజ, డాక్టర్ మల్లీశ్వరి, డాక్టర్ జేసీ రెడ్డి, డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కేన్సర్ ఆస్పత్రి అభివృద్ధికి ప్రతిపాదనలు
ఉదయం డైరెక్టర్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వరరావు, సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్‌తో కలసి పాతూరు సీడీ ఆస్పత్రి, కేన్సర్ యూనిట్, బ్లడ్ బ్యాంకును పరిశీలించారు. సీడీ ఆస్పత్రి ఆవరణలో రూ.55 కోట్లతో ఎంసీహెచ్ బ్లాక్ ఏర్పాటుకు అనువైన స్థలమన్నారు. పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్‌షిప్ కింద కేన్సర్ ఆస్పత్రిని అభివృద్ధి చేసేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నామన్నారు.
అపరిశుభ్రతపై ఆగ్రహం
సర్జికల్ విభాగాలను పరిశీలించిన డాక్టర్ సుబ్బారావు శానిటేషన్ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వార్డుల్లో ఎక్కడపడితే అక్కడ వ్యర్థాలను వేయడాన్ని తప్పుబట్టారు. వార్డులు పరిశుభ్రంగా ఉంటేనే రోగులు త్వరగా కోలుకునేందుకు వీలుంటుందన్నారు. ఆర్‌ఎంఓ, మేనేజర్, వైద్యులు ఎప్పటికప్పుడు శానిటేషన్ నిర్వహణ చూసుకోవాలన్నారు. ఎంఆర్‌ఐ యూనిట్‌ను త్వరితగతిన ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రమోదిన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment