అడ్మిషన్‌లో ఉన్న మనస్వి వేరొకరి నివేదికను మనస్వి కేస్ షీట్‌లో రాసిన దృశ్యం
అనంతపురం న్యూసిటీ: అనంతపురం సర్వజనాస్పత్రిలోని చిన్నపిల్లల విభాగంలో కొందరు వైద్యుల నిర్లక్ష్యంతో ఆరోగ్య వివరాలు తారుమారవుతున్నాయి. ఆస్పత్రిలో ఇటీవల ఓ బాలింతకు రక్తమార్పిడి జరిగి ప్రాణం కోల్పోయిన విషయం విదితమే. దీని ద్వారా ఇద్దరు వైద్యులు, ఇద్దరు స్టాఫ్‌నర్సులు, టెక్నీషియన్లను సస్పెండ్ చేసినా ఇంకా చాలామంది వైద్యుల్లో మార్పు రావడం లేదు. చిన్నారుల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అవాక్కు...
చిన్న పిల్లల వార్డులో ధర్మవరానికి చెందిన మూడేళ్ల పాప మనస్వి డెంగీ అనుమానిత కేసుగా ఈ నెల 9న అడ్మిట్ అయ్యింది. ఆస్పత్రిలో వైద్యులు ఈ నెల 11న చిన్నారికి ప్లేట్‌లెట్స్‌తో పాటు డెంగీ పరీక్షకు రెఫర్ చేశారు. కానీ హౌస్‌సర్జన్లు మౌనిక అనే పేషెంట్ ఆరోగ్య నివేదికను ఏకంగా మనస్వి కేస్ షీట్‌లో నమోదు చేశారు. కేస్ షీట్‌లో మనస్వికి సీఆర్‌పీ పాజిటివ్ అని నమోదు చేశారు. దీనిపై పాప తండ్రి రాము కేస్ షీటును నిశితంగా పరిశీలించారు. పాప డెంగీ సమస్యతో బాధపడుతుంటే సీఆర్‌పీ ఎందుకు వస్తుందని ఆరా తీశాడు.
దిద్దుబాటు చర్యలు
వాస్తవంగా ఇదే వార్డులో ఉన్న మౌనిక అనే చిన్నారికి చెందిన సీఆర్‌పీ రిపోర్టును మనస్వి కేస్ షీట్‌లో రాశారు. అప్పటికప్పుడు తేరుకున్న వైద్యులు మనస్వి కేస్ షీట్‌లోని రిపోర్టును కొట్టేశారు. పాప తల్లిదండ్రులు ఆరా తీయకపోతే సీఆర్‌పీ కిందే మందులిచ్చే పరిస్థితి ఉండేది. ఆస్పత్రిలో వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారడానికి ఇదొక నిలువెత్తు నిదర్శనం. చిన్నారుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులపై ఆస్పత్రి యాజమాన్యం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment