అంతా వారిష్టం | KGH Staff Leave Without Permission in Visakhapatnam | Sakshi
Sakshi News home page

అంతా వారిష్టం

Published Tue, Mar 5 2019 7:23 AM | Last Updated on Tue, Mar 5 2019 7:23 AM

KGH Staff Leave Without Permission in Visakhapatnam - Sakshi

తాళం వేసి ఉన్న ఎక్స్‌రే, స్కానింగ్‌ విభాగం

విశాఖ సిటీ: పేదలకు వైద్యమందించడమంటే కేజీహెచ్‌లోని కొంత మంది సిబ్బందికి మా చెడ్డ చిరాకు. కొన్ని విభాగాలకు చెందిన సిబ్బంది 24 గంటలూ విధులు నిర్వర్తించాలని ఉత్తర్వులున్నా పట్టుమని పది గంటలు కూడా కనిపించడం లేదు. అడిగేవారు లేరనీ.. అడిగిన వారిని కాదనీ.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ విధులకు డుమ్మా కొడుతున్నారు. రేడియాలజీ విభాగం ఈ విషయంలో ముందుంది. సిబ్బంది లేక.. సేవలు కానరాక సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు సరైన సమయంలో పరీక్షలు జరగకపోవడంతో విలవిల్లాడుతున్నారు.

ఉత్తర్వుల్లో స్పష్టం చేసినా...
పారా మెడికల్‌ సిబ్బందిగా గుర్తించిన రేడియాలజీ సిబ్బంది ఏడాదిలో 35 రోజులు సాధారణ సెలవులు తీసుకుని మిగిలిన అన్ని రోజులూ రోగులకు అందుబాటులో ఉండాలని ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ జీవో నంబరు 784లో స్పష్టం చేసింది. కానీ నిబంధనలను తుంగలో తొక్కి వీరంతా అడ్మినిస్ట్రేటివ్, మినిస్టీరియల్‌ ఉద్యోగుల తరహాలో ప్రభుత్వ సెలవు దినాలను ఎంజాయ్‌ చేస్తూ ఏకంగా విభాగానికి తాళాలు వేసేస్తున్నారు. ఇదే విభాగంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తన పలుకుబడి వినియోగించి వైద్యాధికారులతో నోటిమాటగా చెప్పి సెలవులు ప్రకటించడం ఆస్పత్రి వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రేడియాలజీ సిబ్బందికి వారాంతపు సెలవుతోపాటు రేడియేషన్‌ ముప్పు కారణంగా ఆర్‌సీఎల్‌ పేరిట ఏడాదికి 30 రోజుల పాటు ప్రత్యేక సెలవులను ప్రభుత్వం అందిస్తోంది. వీరికి ఇచ్చిన సెలవులన్నీ సద్వినియోగపరచుకోవడంతోపాటు విధులు నిర్వర్తించాల్సిన రోజులైన ప్రభుత్వ సెలవుదినాలు, ఆదివారాలలోనూ విధులకు హాజరు కాకపోవడం అన్యాయమని పలువురు వైద్యులు బాహాటంగానే విమర్శిస్తున్నారు.

ఇన్‌పేషెంట్లకు తీవ్ర ఇబ్బందులు
ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్లుగా చేరి వైద్య సేవలు పొందుతున్నవారు సుమారుగా 1600 మంది వరకూ ఉంటారు. ఈ రేడియాలజీ విభాగానికి చేరువలో ఉన్న భావనగర్, రాజేంద్రప్రసాద్, ఎముకల విభాగం, శస్త్రచికిత్స విభాగాలతో పాటు పిల్లల వార్డులలోని ఇన్‌పేషెంట్లకు అత్యవసరంగా ఎక్స్‌రే, స్కానింగ్‌ చేయాలంటే ఈ రేడియాలజీ విభాగానికి తీసుకొస్తారు. పండుగ సెలవులు, ఆదివారాలు ఈ విభాగాన్ని పూర్తిగా మూసివేయడంతో ఆయా రోగులను ఆస్పత్రి సిబ్బంది, రోగుల సహాయకులు వార్డులకు దూరంగా ఉన్న అత్యవసర విభాగానికి తీసుకెళ్లాల్సి రావడంతో సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇన్‌పేషెంట్లకు సెలవు రోజుల్లో అత్యవసరంగా పరీక్షలు నిర్వహించాల్సి వస్తే వారిని అత్యవసర వైద్య విభాగానికి పంపుతున్నామని వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది చెబుతున్నారు.

ఆస్పత్రిలో ఎక్స్‌రే సేవల వివరాలివీ
ఆస్పత్రి రేడియాలజీ విభాగం ఆధ్వర్యంలో సుమారు 13 ఎక్స్‌రే మిషన్లు పనిచేస్తున్నాయి. ఈ విభాగంలో సుమారుగా 10 మంది సిబ్బందితో పాటు డిప్లమో రేడియాలజీ వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు శిక్షణ పేరిట రోగులకు సేవలు అందిస్తుంటారు.

అత్యవసరం కోసం ప్రైవేటుకు పరుగులు
దేశంలో ఎక్కడైనా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే వైద్యులు, ఫార్మసిస్ట్‌లు, నర్సింగ్‌ సిబ్బంది, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఎక్స్‌రే, స్కానింగ్‌లు చేసే సిబ్బంది ప్రభుత్వ సెలవు రోజులు, పండగ రోజులతో సహా అందుబాటులో ఉంటూ రోగులకు వైద్య సేవలు అందించాలి. తమకు ఇచ్చిన క్యాజువల్‌ లీవ్‌ను అవసరమైన రోజు వినియోగించుకుని మిగిలిన అన్ని రోజులు అందుబాటులో ఉండాలి. కానీ ఎవరూ అందుబాటులో ఉండకపోవడంతో తీవ్ర అనారోగ్యంతో వస్తున్న రోగులు ఎక్స్‌రే, స్కానింగ్‌లు అత్యవసరంగా తీయించాల్సి వస్తే ఆస్పత్రి వెలుపల ఉన్న ప్రైవేటు కేంద్రాలను అశ్రయించాల్సి వస్తోంది. ఇలా రేడియాలజీ విభాగం ఉద్యోగులు సెలవులు తీసుకునే విధానం రాష్ట్రంలోని బోధనాస్పత్రులున్న కాకినాడ, విజయవాడ, కర్నూలు, గుంటూరు తదితర ప్రాంతాల్లో ఎక్కడా లేదని, కేవలం కేజీహెచ్‌లోని రేడియాలజీ విభాగ సిబ్బంది మాత్రమే సెలవులు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రోజులో నాలుగు గంటలే సేవలు
కేజీహెచ్‌లో వైద్యులతో పాటు పారా మెడికల్‌ విభాగానికి చెందిన నర్సింగ్, ఫార్మసీ, ల్యాబ్‌ టెక్నీషియన్స్, ఎక్స్‌రే, స్కానింగ్‌లలో పనిచేసే సిబ్బందికి షిఫ్ట్‌ల వారీగా ఏడాది పొడవునా రోజుకు ఇరవై నాలుగు గంటలూ సేవలు అందించాలని ప్రభుత్వ జీవోలు చెబుతున్నాయి. అయితే పెద్దాస్పత్రిలో పారా మెడికల్‌ సిబ్బందిగా ఉంటున్న రేడియాలజీ సిబ్బంది ప్రభుత్వ అనుమతులు లేకుండానే ఇష్టానుసారంగా సెలవులు తీసుకుంటున్నారని ఇతర సిబ్బందితో పాటు రోగులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ఇన్‌ పేషెంట్లు, ఔట్‌ పేషెంట్లుకు 24 గంటలూ అందుబాటులో ఉండి అత్యవసర పరిస్థితుల్లో ఎక్స్‌రే, స్కానింగ్‌ పరీక్షలు చేయాల్సి ఉంది. కానీ రోజులో కేవలం 3 నుంచి 4 గంటలు... మహా అయితే 6 గంటలు మాత్రమే రేడియాలజీ విభాగం సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. ఆ తర్వాత రోగులు వచ్చినా పరీక్షలు చేసేందుకు విముఖత చూపిస్తున్నారు. ఇక సెలవు దినాల్లో అయితే సరేసరి.. ప్రభుత్వ సెలవులు, ఆదివారాల్లో ఏకంగా విభాగానికి తాళాలు వేసేస్తున్నారు.

సెలవులు మాకెందుకు వర్తించవు?
పండగ సెలవులతోపాటు ఇతరత్రా సెలవులు మాకు వర్తించవా అంటూ కేజీహెచ్‌లోని మిగిలిన విభాగాల పారా మెడికల్‌ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. అస్పత్రిలో రక్తపరీక్షలు, ఫార్మశీ, నర్సింగ్‌ విభాగాలకు చెందిన పారా మెడకల్‌ సిబ్బంది మాత్రం 24 గంటలూ అందుబాటులో ఉంటున్నారు. ఆదివారంతో సహా పండుగ సెలవుల రోజున రేడియాలజీ విభాగంలోని ఎక్స్‌రే, స్కానింగ్‌ విభాగాలను మూసివేస్తున్న తరహాలోనే తమకు సెలవులు ప్రకటించాలని వీరంతా కోరుతున్నారు. ఇలా సెలవులు తీసుకోవడం తప్పుకాకుంటే దీనిని అన్ని విభాగాలకు వర్తింపజేసి అందరికీ సెలవులు ఇచ్చి సదరు డిపార్ట్‌మెంట్లకు తాళాలు వేయాలని సిబ్బంది డిమాండ్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement