చికిత్సపొందుతున్న బాధితుడు చలపతి(ఫైల్)
నెల్లూరు(బారకాసు): వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ రోగికి జరిగిన అన్యాయానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించనుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు శుక్రవారం జారీ అయ్యాయి. 2017 అక్టోబర్ 3న నారాయణరెడ్డిపేటకు చెందిన చలపతి కడుపునొప్పితో చికిత్సనిమిత్తం నెల్లూరు నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేరాడు. అక్కడి వైద్యులు అతనికి అవసరమైన పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్స చేశారు. అయితే శస్త్రచికిత్స పూర్తయిన తరువాత కడుపుకు కుట్లు వేసే సమయంలో అందులో ‘ఫోర్‌సెప్స్’ పరికరాన్ని వదిలేసి కుట్లు వేశారు. 20 రోజుల తరువాత ‘కడుపులో కత్తెర’ ఉన్న విషయం బయటకు పొక్కడంతో అప్పట్లో ఈ ఘటన సంచలనం రేపింది.
ఈ ఘటనపై మానవ హక్కుల సంఘం(హెచ్‌ఆర్సీ)కు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో స్పందించిన హెచ్‌ఆర్సీ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. జరిగిన ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ మేరకు ఉన్నతాధికారులు సంబంధిత వైద్యులు, సిబ్బందిపై విచారణ జరిపారు. నివేదికలను హెచ్‌ఆర్సీకి పంపారు. తప్పు ఎవరు చేశారనే విషయం బయటకు రానివ్వకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు. నిర్లక్ష్యం వహించిన వారెవరైనా గానీ నష్టం జరిగింది మాత్రం చలపతికి అని హెచ్‌ఆర్సీ నిర్ధారించింది. దీంతో ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చలపతికి తగిన మూల్యం చెల్లించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మానవ హక్కుల సంఘం ఆదేశించింది. హెచ్‌ఆర్సీ ఆదేశాల మేరకు బాధితుడైన చలపతికి నష్టపరిహారంగా రూ.3 లక్షలు చెల్లించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18న నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తాన్ని బాధితుడు చలపతికి చెల్లించాలంటూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య శుక్రవారం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ)కు ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment