ఆరుబయట ఎండలో పడి ఉన్న డ్రైవర్ శవం
అన్నవరం (ప్రత్తిపాడు): అనాథ శవానికైనా నలుగురు ఖర్చులు భరించి అంత్యక్రియలు చేసే సంస్కృతి మనది. కానీ అన్నవరం దేవస్థానంలో మాత్రం సిబ్బంది నిర్లక్ష్యం మానవత్వానికి మాయని మచ్చగా నిలిచింది. సత్యదేవుని ఆలయానికి భక్తులను తీసుకువచ్చిన ఓ టూరిస్ట్ బస్ డ్రైవర్ గుండెనొప్పితో చనిపోతే ఆ శవాన్ని కొండదిగువన దేవస్థానం ఆసుపత్రిలో ఆరుబయట ఎండలో పడేశారు. ఉదయం ఎనిమిదిన్నర నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆ మృతదేహం ఎండకు ఎండుతూ ఉంది. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకుని ఇదేమి అన్యాయం? అని ప్రశ్నిస్తే అప్పుడు ప్రైవేట్ శానిటరీ సిబ్బంది ఆ శవాన్ని నీడకు తరలించారు. కొంత సేపటికి, మృతిచెందిన డైవర్ తరఫువారు అంబులెన్స్‌లో ఆ డ్రైవర్ స్వగ్రామం అనంతపురం జిల్లా ఉరవకొండకు తీసుకువెళ్లారు. దేవస్థానం శానిటరీ, ఆసుపత్రి సిబ్బంది వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
వివరాల్లోకి వెళితే కర్నూల్ జిల్లా నందవరం మండలం కనికివేడు పాడు, ఎమ్మిగనూర్ మండలానికి చెందిన 90 మంది భక్తులు రెండు టూరిస్ట్ బస్సులలో కాశీ తీర్థయాత్రకు బయల్దేరారు. మంగళవారం అర్ధరాత్రి అన్నవరం దేవస్థానానికి చేరుకున్నారు. వీరందరూ రాత్రి బస్సులతో నిద్రించారు. అయితే ఏపీ02 టీబీ 9799 బస్ డ్రైవర్ జి.కృష్ణ (60) మాత్రం ఆరుబయట నిద్రించాడు. తెల్లవార జాము ఐదు గంటలకు అందరూ లేచి స్నానాలు చేసి స్వామి దర్శనానికి వెళ్లేందుకు సమాయత్తమవుతుండగా డ్రైవర్ మాత్రం లేవలేదు. కొందరు అతడిని లేపడానికి ప్రయత్నించగా చలనం లేకపోవడం, నోటినుంచి, మెడ నుంచి రక్తం వస్తుండడం గమనించి మృతి చెందినట్టుగా అనుమానం వ్యక్తం చేసి వెంటనే దేవస్థానం సిబ్బందికి సమాచారం అందించారు. సెక్యూరిటీ, ప్రైవేట్ శానిటరీ సిబ్బంది ఒక వ్యాన్‌లో ఉదయం ఎనిమిదిన్నర గంటలకు కొండదిగువన దేవస్థానం ఆసుపత్రికి తరలించారు. అయితే మృతదేహాన్ని ఆసుపత్రి లోపలకు తీసుకురావద్దని, బయట ఉంచాలని ఆసుపత్రి నర్స్, అటెండర్ చెప్పడంతో ఆ మృతదేహాన్ని ఆసుపత్రి భవనం పక్కన గల ఖాళీస్థలంలో వదిలేసి వెళ్లిపోయారని అంటున్నారు. అయితే తమను అడగలేదని, వ్యాన్‌లో మొక్కలు తెచ్చారేమో అని అనుకుని దూరంగా దింపమని చెప్పానని నర్స్ సరోజినీ తెలిపారు. ఏమైందో తెలియదు కాని ఆ మృతదేహం మ«ధ్యాçహ్నం 12.30 గంటల వరకు అలాగే నిర్లక్ష్యంగా వదిలేశారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నించడంతో నీడలోకి ఆ శవాన్ని మార్చారు. కొంతసేపటికి మృతి చెందిన డ్రైవర్ తాలుకు వారు వచ్చి అంబులెన్స్‌లో ఆ శవాన్ని అనంతపురం జిల్లా ఉరవకొండ తీసుకువెళ్లారు.
అధికారుల దృష్టికి తీసుకువెళ్లా : డాక్టర్ రామారావు
‘‘నేను ఉదయం 9.30 గంటలకు ఆసుపత్రికి వచ్చేటప్పటికే ఆ శవం అక్కడ ఉంది. అలా బయట ఉండకూడదని చెప్పి నేను, ఫార్మసీ సూపర్‌వైజర్ మా«ధవి కలసి దేవస్థానం అధికారులకు, ఈఓ పేషీకి ఫోన్ చేసి చెప్పాం. తరువాత ఈఓను కొండమీద కలిసి వివరించాం. ఈఓ కూడా వెంటనే ఆ డ్రైవర్ స్వగ్రామానికి దేవస్థానం ఖర్చుతో ఆ శవాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేయమని ఆదేశించారు. అదే విషయం శవాన్ని తీసుకువచ్చిన వారికి చెప్పగా పోలీస్ క్లియరెన్స్ వచ్చాక తీసుకుపోతామని చెప్పారు.’’ అని డాక్టర్ రామారావు ‘సాక్షి’కివివరించారు.
Comments
Please login to add a commentAdd a comment