heart stroke
-
రక్తపోటు.. గుర్తించకపోతే స్ట్రోక్ ముప్పు
రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి జీవన శైలి జబ్బులు ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారాయి. ఈ సమస్యలు కిడ్నీ, మెదడు, గుండె సంబంధిత పెద్ద జబ్బులకు ప్రధాన కారణమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం మన దేశంలో 4.58 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధ పడుతున్నారు. వీరిలో 1.17 కోట్ల మంది రాష్ట్రాల ఆరోగ్య శాఖ ద్వారా వైద్యుల పర్యవేక్షణలో మందులు, చికిత్సలు అందుకుంటున్నారు. రక్తపోటు.. హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతోందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనంలో తేలింది. అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు అమెరికాలోని 27,310 మంది పెద్దల ఆరోగ్య రికార్డులను 12 ఏళ్లకు పైగా పరిశీలించారు. అధ్యయనంలో పాల్గొన్న వ్యక్తుల సగటు వయస్సు 65 ఏళ్లుగా ఉంది. – సాక్షి, అమరావతి10 కంటే ఎక్కువైతే 20% ప్రమాదం రక్తపోటు సగటు కంటే ఎక్కువయ్యే కొద్దీ స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుందని మిచిగాన్ యూనివర్సిటీ న్యూరాలజీ విభాగం గతంలో ఓ అధ్యయనంలో వెల్లడించింది. రక్తపోటు సగటు కంటే 10 ఎంఎం హెచ్‌జీ ఎక్కువగా ఉన్న వారిలో ఇస్కీమిక్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం 20 శాతం, ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్ ప్రమాదం 31 శాతం ఎక్కువగా ఉంటుందని కనుగొన్నారు. 31 నుంచి 67 శాతం ఎక్కువ ప్రమాదం సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఐదేళ్లు అధిక రక్తపోటు సమస్యతో బాధపడిన వ్యక్తులు స్ట్రోక్ బారిన పడేందుకు 31 శాతం ఎక్కువ అవకాశాలు ఉంటాయని గుర్తించారు. ఆరు నుంచి 20 ఏళ్ల పాటు రక్తపోటు సమస్య ఉన్న వ్యక్తుల్లో 50 శాతం, రెండు దశాబ్ధాలుపైగానే సమస్యతో బాధపడే వ్యక్తుల్లో 67 శాతం ఎక్కువగా స్ట్రోక్‌కు గురయ్యే ప్రమాదం ఉందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు రక్తపోటు సంబంధిత లక్షణాలను ముందే గుర్తించి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇందుకోసం ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహార అలవాట్లు అలవరుచుకోవాలన్నారు. ముందస్తు జాగ్రత్తలు, చికిత్సల ద్వారా రక్తపోటు నియంత్రణలో ఉంచుకుంటే జీవితకాల వైకల్యం ముప్పు తప్పుతుందన్నారు. ప్రస్తుతం ఎటువంటి లక్షణాలు లేకుండానే కొందరిలో రక్తపోటు చాప కింద నీరులా వృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో తరచూ రక్త పోటు పరీక్షలు చేయించుకుంటూ, ఉండాల్సినదాని కంటే ఎక్కువ రికార్డు అయితే వెంటనే అప్రమత్తం అవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. జీవన శైలిలో మార్పు రావాలి ఆహారం, నిద్ర, జీవన శైలిపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వ్యాయామాన్ని రోజువారి దినచర్యలో ఓ భాగం చేసుకోవాలి. రోజుకు 30 నిమిషాలు వాకింగ్, జాగింగ్ తప్పనిసరిగా చేయాలి. ఒత్తిడిని దరి చేరనివ్వకుండా చూసుకోవాలి. ప్రస్తుతం స్కూల్ పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ చిన్న చిన్న విషయాలకే తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. రక్తపోటు, మధుమేహం ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. వైద్య పరీక్షలు చేయించుకుంటూ సమస్యలను అదుపులో ఉంచుకోవాలి. – డాక్టర్ బి.విజయ చైతన్య, కార్డియాలజిస్ట్, విజయవాడ -
జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తల్లి బీబీజాన్‌కు గుండెపోటు వచ్చింది. జానీ జైలుపాలవడంతో అతడిపై బెంగ పెట్టుకున్న ఆమెకు శనివారం ఒక్కసారిగా ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను నెల్లూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న జానీ మాస్టర్ భార్య ఆయేషా ఆస్పత్రికి వెళ్లి అత్తమ్మ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసింది.జైల్లో ఖైదీగా..మహిళా కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం, బెదిరింపుల కేసులో షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్ అరెస్టయ్యాడు. లైంగికదాడి ఆరోపణల నేపథ్యంలో అతడికి రావాల్సిన జాతీయ అవార్డు (బెస్ట్ కొరియోగ్రఫీ) సైతం రద్దయింది. ప్రస్తుతం ఇతడు చంచల్‌గూడ కేంద్రకారాగారంలో విచారణ ఖైదీగా ఉన్నాడు.చదవండి: జిగ్రా చూద్దామని వెళ్లా.. థియేటర్ మొత్తం ఖాళీ.. అయినా..! -
తెలంగాణ విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ హఠాన్మరణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో పండుగ వేళ తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ కన్నుమూశారు. గుండెపోటుతో ఓ ప్రైవేట్ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందారు. రాజీవ్ రతన్ 1991 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన ఆఫీసర్. గతంలో కరీంనగర్ ఎస్పీగా పనిచేశారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. కిందటి ఏడాది మహేందర్‌రెడ్డి డీజీపీగా పదవీ విరమణ చేసిన టైంలో.. కొత్త పోలీస్ బాస్ రేసులో ఈయన పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. ఆ తర్వాత ఆయన విజిలెన్స్ డీజీగా ప్రమోషన్ పొందారు. .. కాళేశ్వరం అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ డీజీ హోదాలో రాజీవ్ రతన్ విచారణ జరిపారు. ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగానే ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. అంతేకాదు మేడిగడ్డ వ్యవహారంపై ఇటీవలె సీఎం రేవంత్‌రెడ్డి రాజీవ్ రతన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇచ్చారు. మరోవైపు రాజీవ్ రతన్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి తెలంగాణ విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ హఠాన్మరణంపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు రాజీవే సారధ్యం వహించారు. సుదీర్ఘ కాలంగా రాష్ట్రంలో పోలీసు విభాగానికి ఆయన విశిష్టమైన సేవలందించారు. సమర్థవంతంగా, నిజాయితీగా విధులు నిర్వహించిన అధికారులను తెలంగాణ సమాజం ఎన్నటికీ మరిచిపోదు. రాజీవ్ రతన్ మృతి పట్ల నా సంతాపం వ్యక్తం చేస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా అని సీఎం రేవంత్ సంతాప ప్రకటన విడుదల చేశారు. సీనియర్ #IPS అధికారి రాజీవ్ రతన్ హఠాన్మరణంపై ముఖ్యమంత్రి @revanth_anumula దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలంగా రాష్ట్రంలో పోలీసు విభాగానికి ఆయన అందించిన విశిష్టమైన సేవలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సమర్థవంతంగా, నిజాయితీగా విధులు నిర్వహించిన అధికారులను… — Telangana CMO (@TelanganaCMO) April 9, 2024 -
సీపీఎం తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు
సాక్షి, హైదరాబాద్: సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గుండె పోటుకు గురయ్యారు. దీంతో, మెరుగైన వైద్యం కోసం తమ్మినేనిని వెంటనే హైదరాబాద్‌కు తరలించారు. ఇక, గతంలోనే తమ్మినేని స్ట్రోక్ రావడంతో స్టంట్ కూడా పడింది. వివరాల ప్రకారం.. సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం గుండె పోటు కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తన స్వగ్రామం తెల్దారపల్లిలో ఉన్న సమయంలోనే తమ్మినేని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో లంగ్స్ ఇన్ఫ్‌క్షన్‌తో పాటు మైల్డ్ హార్ట్ స్ట్రోక్ లక్షణాలను వైద్యులు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. ఈ నేపథ్యంలో అంబులెన్స్‌లో తమ్మినేనిని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. గతంలో తమ్మినేనికి స్ట్రోక్ వచ్చిన నేపథ్యంలో అప్పుడు ఆయనకు వైద్యులు స్టంట్ వేశారు. తాజాగా మరోసారి మైల్డ్ స్ట్రోక్ రావడంతో పరిస్థితి కొంచెం విషమంగా మారింది. -
ఎలాగ్జింతో గుండె ధైర్యం
పీలేరు: ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా ఏ వయస్సు వారికై నా గుండెపోటు (హార్ట్ స్ట్రోక్)రావడం సర్వసాధారణంగా మారింది. సమయానికి వైద్యం అందకపోతే నిండు ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో గుండెపోటు వచ్చిన వారికి తక్షణ ఉపశమనం కల్పించి పెద్ద ఆస్పత్రికి వెళ్లేంతవరకు ప్రాణాలను కాపాడటానికి ప్రభుత్వం ఎలాగ్జిం ఇంజెక్షన్‌ను ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో తెచ్చింది. గతంలో కేంద్ర ప్రభుత్వం ఐసీఎంఆర్ ప్రాజెక్టు కింద కొన్ని కొన్ని ఆస్పత్రులకు మాత్రమే ఇంజెక్షన్ అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవతో గుండెపోటుతో ఎవరూ మరణించరాదని, పేదలను సైతం ఆదుకోవాలని భావించి అన్ని ఏరియా ఆస్పత్రుల్లో ఎలాగ్జిం ఇంజెక్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మొదట్లోపైలట్ ప్రాజెక్టుగా ఉమ్మడి చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో అమలు చేశారు. అనంతరం గుంటూరు, వైజాగ్ జిల్లాల్లో అమలు చేశారు. క్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి చర్యలు చేపట్టారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 24 ఏరియా ఆస్పత్రుల్లో ఎలాగ్జిం ఇంజెక్షన్ అందుబాటులో ఉంది. ఒక్క పీలేరు ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఏడాది కాలంలో తొమ్మిది మందికి ఎలాగ్జిం ఇంజెక్షన్‌తో ప్రాణాలు కాపాడారు. విలువైన ఇంజెక్షన్ ఉచితంగా అందించారు గుండెపోటెకు గురైన నన్ను స్నేహితులు పీలేరు ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. పరిశీలించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండడంతో తక్షణ ఉపశమనం కోసం రూ. 51,669 విలువైన ఇంజెక్షన్ ఉచితంగా అందించారు. నా ప్రాణాలు కాపాడిన వైద్యులకు, ముఖ్యమంత్రికి రుణపడి ఉంటా. – సురేంద్ర, పీలేరు ఎలాగ్జింతో గంటసేపు ప్రాణాలు కాపాడవచ్చు గుండెపోటు గురైన వారు సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి చేరాలి. ప్రభుత్వాస్పత్రిలో ఎలాగ్జిం ఇంజెక్షన్ ఇవ్వ డం ద్వారా తక్షణం ప్రాణాలు కాపాడటంతోపాటు గంట సమయంలో ఉన్నతాసుపత్రికి వెళ్లడానికి రక్షణగా పని చేస్తుంది. రెండో సారి గుండెపోటు రాకుండా ప్రాణాలను కాపాడుకోవచ్చు. అత్యవసర సమయంలో ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ డేవిడ్ సుకుమార్, డీసీహెచ్ఎస్, రాయచోటి జగనన్నకు రుణపడి ఉంటాం నాకు గుండెపోటు రావడంతో తక్షణం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఎలాగ్జిం ఇంజెక్షన్ ఇచ్చారు. పెద్ద ఆస్పత్రికి వెళ్లే వరకు నా ప్రాణాలు కాపాడింది. ఆస్పత్రిలో ఎలాగ్జిం ఇంజెక్షన్ అందుబాటులో ఉంచిన ముఖ్యమంత్రి జగనన్నకు రుణపడి ఉంటాం. – మమత, పీలేరు అవసరమనిపిస్తేనే ఇంజెక్షన్ వాడతాం గుండెపోటుతో ప్రభుత్వాస్పత్రికి వచ్చిన రోగిని పరీక్షించిన అనంతరం వారి కండీషన్‌ను బట్టి ఎలాగ్జిం ఇంజెక్షన్ ఇస్తాం. విలువైన ఇంజెక్షన్ కావడంతో వృథా చేయకుండా తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఎలాగ్జిం వాడడం జరుగుతుంది. – డాక్టర్ చంద్రశేఖర్, పీలేరు ప్రభుత్వాస్పత్రి సూపరింటిండెంట్ -
భారత సంతతి వ్యక్తికి ఆరుసార్లు ఆగిన గుండె.. ఆ తర్వాత ఏమైందంటే?
లండన్: బ్రిటన్‌లో లండన్ నగరంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. లండన్ ఆసుపత్రి డాక్టర్లు ఎంతో శ్రమించి భారతీయ-అమెరికన్ విద్యార్థి ప్రాణాలు కాపాడారు. ఏకంగా ఆరుస్లార్లు ఆగిపోయిన గుండెకు ఆపరేషన్ చేసి అతడి ప్రాణాలు నిలబెట్టారు. ఈ ఘటన బ్రిటన్ సహా భారత్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల ప్రకారం.. అమెరికాలోని సీటెల్‌కు చెందిన అతుల్ రావ్, ఈ ఏడాది జూలై 27న లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో చదువుతున్నప్పుడు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి విద్యార్థులు వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అది వచ్చే వరకు సెక్యూరిటీ గార్డు సీపీఆర్ కొనసాగించాడు. వెంటనే అంబులెన్స్‌లో హామర్స్మిత్ హాస్పిటల్‌కు తరలించారు.కాగా, అతుల్ రావ్ ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం వల్ల గుండె నుంచి రక్త ప్రవాహాన్ని అడ్డుకున్నట్లు వైద్య పరీక్షల్లో డాక్టర్లు నిర్దారించారు. పల్మనరీ ఎంబోలిజం అని పిలిచే ఈ పరిస్థితిలో అతడి గుండె ఆరు స్లార్లు ఆగినట్లు వైద్యులు తెలిపారు. #IndianAmerican student chooses career in medicine after #UK #NHS medics save his life after his heart stopped 6 times due to blood clots.#CardiacArrest #PulmonaryEmbolism #hearthealth https://t.co/R3NJZipmuQ — National Herald (@NH_India) October 5, 2023 ఈ నేపథ్యంలో ఆ ఆసుపత్రి డాక్టర్లు రాత్రంగా శ్రమించి అతడి ప్రాణాలు కాపాడారు. మరుసటి రోజున సెయింట్ థామస్ హాస్పిటల్‌కు తరలించి ఎక్మోపై చికిత్స అందించారు. కోలుకున్న తర్వాత అతడు అమెరికా వెళ్లిపోయాడు. ప్రస్తుతం టెక్సాస్‌లోని బేలర్ యూనివర్సిటీలో ప్రీ మెడికల్ డిగ్రీ చివరి ఏడాది చదువుతున్నాడు. మరోవైపు, భారతీయ-అమెరికన్ విద్యార్థి అతుల్ రావ్ తాజాగా తన తల్లిదండ్రులతో కలిసి లండన్ వెళ్లాడు. ఈ సందర్భంగా తన ప్రాణాలు కాపాడిన వ్యక్తులు, ఆసుపత్రిని సందర్శించాడు. తల్లిదండ్రులతో కలిసి అక్కడి డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపాడు. -
సంగారెడ్డి: గుండెపోటుతో 12 ఏళ్ల బాలుడి మృతి
సాక్షి, సంగారెడ్డి: చిన్నవయసులోనే గుండెపోటుతో కన్నుమూస్తున్న వరుస ఘటనలు చూస్తున్నాం. తాజాగా సంగారెడ్డిలోనూ అలాంటి విషాద ఘటనే నెలకొంది. 12 ఏళ్ల బాలుడు నిద్రలోనే గుండెపోటుతో కన్నుమూసిన ఘటన స్థానికులతో కంటతడి పెట్టిస్తోంది. కంగ్టి మండలం తడ్కల్‌కు చెందిన ఖలీల్(12) ఒంట్లో బాగోలేదని తల్లిదండ్రులకు చెప్పాడు. గతరాత్రి నిద్రలో అపస్మారక స్థితికి గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గం మధ్యలోనే అతను కన్నుమూశాడు. ఖలీల్‌ను పరిశీలించిన వైద్యులు గుండెపోటుతోనే కన్నుమూసినట్లు ధృవీకరించారు. దీంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. నిన్నటిదాకా తమ కళ్ల ముందు ఆడిపాడిన చిన్నారి లేడనే విషయాన్ని వాడ ప్రజలు తట్టుకోలేక కంటతడి పెడుతున్నారు. -
వీడియో: విధిని ఎవరూ ఎదురించలేరు.. ఇదే ఉదాహరణ..
ఘజియాబాద్: ఇటీవలి కాలంలో గుండెపోటు కారణంగా ఎంతో మంది అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ, జిమ్‌లో వర్కవుట్ చేస్తూ సడెన్‌గా కిందపడిపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో చూశాం. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఓ కాలేజీ యువకుడు జిమ్‌లో అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. గజియాబాద్‌కు చెందిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సిద్దార్థ్ కుమార్ సింగ్(19) అనే యువకుడు శనివారం జిమ్‌కు వెళ్లి వర్క్ అవుట్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఉదయం 10 గంటల ప్రాంతంలో జిమ్‌లోని ట్రెడ్‌మిల్‌పై నడుస్తుండగా.. సడెన్‌గా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో, అక్కడే ఉన్న జిమ్‌లో మరో ఇద్దరు వ్యక్తులు సింగ్ దగ్గరకు వచ్చి అతడిని పైకి లేపే ప్రయత్నం చేశారు. అనంతరం, వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. సింగ్ పరిశీలించిన వైద్యులు.. సిద్ధార్థ్ అప్పటికే మృతిచెందినట్టు తెలిపారు. A 19 years old boy died while running on trademill in the gym at #Ghaziabad #gym #Running pic.twitter.com/jsOa0aA3C3 — Gulshan Nandaa (@Gulshann_nandaa) September 16, 2023 ఇక, జిమ్‌లో సిద్దార్థ్ మృతిచెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సింగ్ మృతితో పేరెంట్స్ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక, సిద్ధార్ధ్ వారి పేరెంట్స్‌కు ఒక్కడే కుమారుడు. సిద్ధార్థ్ తన తండ్రితో ఘజియాబాద్‌లో ఉంటుండగా.. అతని తల్లి బీహార్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. సింగ్ మృతికి 10 నిమిషాల ముందే తన తల్లితో మాట్లాడాడు. ఇంతలోనే ఇలా జరగడంతో వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇది కూడా చదవండి: భిక్షమెత్తుకొని పొట్టనింపుకునేది.. ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్‌గా సూపర్ క్రేజ్ -
కళ్లల్లో ఎర్రటి మచ్చలు కనిపిస్తున్నాయా? బీపీ చెక్ చేసుకున్నారా?
హై బీపీ లేదా హైపర్ టెన్షన్... ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న ముఖ్య ఆరోగ్య సమస్య. ఒకరకంగా చెప్పాలంటే ఇది సైలెంట్ కిల్లర్ కూడా. ఎందుకంటే బీపీ అదుపులో లేకపోతే నేరుగా గుండెపైనే ప్రభావం పడుతుంది. గుండెపోటు, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బీపీని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం, హెచ్చు తగ్గులుంటే తగిన మందులు వాడటం అవసరం. ఎందుకంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా, ఇది చాప కింది నీరులా అంతర్గత అవయవాలపై తీవ్ర దుష్ప్రభావాన్ని కలిగిస్తుంది. రక్తపోటు ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉప్పు తగ్గించడం వాటిలో ముఖ్యమైనది. అధిక రక్తపోటును గుర్తించడానికి ఉత్తమ మార్గం క్రమం తప్పకుండా బీపీ చెక్ చేయించుకోవడం. రక్తపోటు ఎక్కువగా ఉంటే కొన్ని లక్షణాలు బయటపడతాయి. కళ్ళల్లో కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఎలాంటి లక్షణాలు? రక్తపోటు అధికమైతే మీ కళ్ళల్లో ఎర్రటి మచ్చలు కనిపిస్తాయి. ఇది రక్తనాళాల విచ్ఛిన్నం వల్ల జరుగుతుంది. కళ్ళు ఎర్రగా కనిపిస్తే బీపీ చెక్ చేసుకోవడం చాలా అవసరం. అధిక రక్తపోటు వల్ల దృష్టి సమస్యలు కూడా వస్తాయి. అందువల్ల కళ్లు ఎర్రగా కనిపిస్తుంటే ఓసారి బీపీ చెక్ చేయించుకోవాలని గుర్తుంచుకోండి. కళ్ళల్లో కనిపించే ఈ సంకేతాలు కాకుండా బీపీ అధికమైనప్పుడు మరికొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి ఏమిటంటే ... ►ఛాతీలో నొప్పి పెట్టడం ► శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడం ► మూత్రంలో రక్తం కనిపించడం ►ఛాతీ, మెడ, చెవుల్లో ఇబ్బందిగా అనిపించడం ► తలనొప్పి తీవ్రంగా రావడం ► చిన్న చిన్న పనులు చేసినా తీవ్రమైన అలసట. -
ఖమ్మం: గుండెపోటుతో 9వ తరగతి విద్యార్థి మృతి
క్రైమ్, ఖమ్మం: హఠాన్మరణాలు.. అందులో గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ మరణాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. మరోవైపు ఈ మరణాలపై వైద్య నిపుణులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. మరణించిన వాళ్లలో గుండె సంబంధిత సమస్యలూ ఉంటున్నాయని, వాటిని గుర్తించకపోవడం కూడా ఒక కారణమేనని చెబుతున్నారు. తాజాగా.. ఖమ్మంలో తొమ్మిదో క్లాస్ చదివే విద్యార్థి మరణం.. స్థానికంగా విషాదం నింపింది. ఎన్ఎస్పీ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు మాదాసి రాజేష్. బుధవారం స్కూల్‌కు వెళ్లిన రాజేష్ ఆకస్మాత్తుగా కళ్లు తిరిగి కిందపడిపోయాడు. తోటి విద్యార్థులు అది గమనించి టీచర్లకు చెప్పడంతో.. వాళ్లు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రాజేష్ మరణించాడని, రాజేష్ మృతికి గుండెపోటు కారణమని వైద్యులు వెల్లడించినట్లు తెలుస్తోంది. రాజేష్‌కు పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఉంది. పైగా గత కొద్దిరోజులుగా నీరసంగా కూడా ఉంటున్నాడు. మూడు రోజుల నుంచి సరిగ్గా బడికి వెళ్లలేదు. అయితే.. బుధవారం స్కూల్లో విద్యార్థులకు అవగాహనా సినిమా ప్రదర్శించాడు. అందుకోసం వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో.. బడికి వెళ్లిన కాసేపటికే సొమ్మసిల్లి పడిపోయి కన్నుమూశాడు. ఈ ఘటనతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఇదీ చదవండి: తమ్ముడి పెద్దకర్మ ఆ అన్నకి ఆఖరిరోజు! -
కారు డ్రైవ్ చేస్తుండగా గుండెపోటు.. సీపీఆర్ చేసిన సీఐ.. కానీ..
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో గుండెపోటుల కారణంగా ఎంతో మంది చూస్తుండగానే కుప్పకూలి చనిపోయిన ఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. కారు డ్రైవ్ చేస్తుండగా డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. అక్కడే విధుల్లో ఉన్న సీఐ.. అది గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు. వివరాల ప్రకారం.. పెద్ద అంబర్‌పేట వద్ద ఓ వ్యక్తి కారు డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి గుండెపోటు రావడంతో విలవిల్లాడిపోయాడు. అయితే, అక్కడే విధుల్లో ఉన్న సీఐ.. వెంటనే అతడి దగ్గరికి వెళ్లి సీపీఆర్ చేశారు. దీంతో, బాధితుడు స్పృహాలోకి వచ్చాడు. అనంతరం, బాధితుడిని స్థానిక వైద్యం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆసుపత్రికి చేరుకునేలోపే అతడు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. -
Heart Attack: టీచర్ గుండె ఆగింది
చీరాల: రోజు మాదిరిగానే ఉదయం పాఠశాల ప్రారంభమైంది. ప్రార్థనా గీతం అనంతరం తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠం మొదలు పెట్టాడు. ఇంతలోనే తరగతి గది నుంచి ఒక్కసారిగా విద్యార్థుల కేకలు వినబడ్డాయి. సహ ఉపాధ్యాయులు ఏం జరిగిందోనని ఆందోళనతో ఆ తరగతి గదిలోకి వెళ్లగా కుర్చీలో ఉపాధ్యాయుడు అచేతనంగా ఒరిగిపోయి ఉన్నాడు. ఆందోళనతో.. 108కు సమాచారం అందించగా వారు పరీక్షించి ఉపాధ్యాయుడు మృతి చెందినట్లు చెప్పారు. ఈ విషాద ఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం వాకావారిపాలెం ప్రాథమిక పాఠశాలలో శనివారం జరిగింది. వాకావారిపాలెంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జె.పంగులూరుకు చెందిన పాల వీరబాబు (45) ఉపాధ్యాయుడు. అతడి భార్య కూడా ఇదే మండలంలోని కొండమూరులో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలు. శనివారం యథావిధిగా పాఠశాలకు వచ్చిన వీరబాబు విద్యార్థులకు పాఠాలు చెబుతూ ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుర్చీలోనే మృతి చెందాడు. అప్పటివరకు తమతో మాట్లాడిన తోటి ఉపాధ్యాయుడు ఇకలేరని తెలియడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు కన్నీటిపర్యంతమయ్యారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. -
Healthy Heart: మీ గుండె ఆగిపోకూడదనుకుంటే..
గుండె.. ఉండేది మనిషి గుప్పెడంత. కానీ, నిలువెత్తు మనిషి ప్రాణం దాని మీదే ఆధారపడి ఉంటుంది. అయితే మారుతున్న లైఫ్‌స్టైల్.. ఆహారపు అలవాట్లు మనిషిని నిలబెట్టే ఆ బలాన్ని.. బలహీనపరుస్తోంది. అందుకే గుండె సమస్యలతోపాటు కార్డియాక్ అరెస్ట్ సమస్యలతో.. వయసుతో సంబంధం లేకుండా ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు. అప్పటికప్పుడే ప్రాణం విడుస్తున్నారు. మీడియా.. సోషల్ మీడియా వల్ల ప్రతీ ఒక్కరికీ అలాంటి ఘటనలు నిత్యం కనిపిస్తున్నాయి. ఇవేవీ లేకుండా ఆగిపోయే గుండె మీది కాకూదదనుకుంటే.. దానికి బలం అవసరం. మరి ఆ బలం ఎలా అందించాలో వైద్య నిపుణుల సూచనల మేరకు ఈ కథనం. హార్ట్ స్ట్రోక్, కార్డియాక్ అరెస్ట్.. ఈ రెండూ వేర్వేరు. గుండె పోటు.. ఉబకాయం, ఆహారపు అలవాట్లు, జీవనశైలి, ఇతర అనారోగ్య సమస్యల మీద ఆధారపడి ఉంటుంది. గుండె రక్తనాళాలు అకస్మాత్తుగా మూసుకుపోడం, రక్తం గడ్డలు ఏర్పడటం వల్ల గుండె పోటు వస్తుంది. ఇక సడెన్ కార్డియాక్ అరెస్ట్ అనేది గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు ఎదురయ్యే స్థితి. దీనికి వయసుతో సంబంధం ఉండదు. పైగా దీనిని అంచనా వేయడమూ కష్టం. అందుకే.. ఈ పరిస్థితులను ఎదుర్కొగలిగే గుండె ఉంటే.. సమస్యనేది ఉత్పన్నం కాదు కదా!. ► కాబట్టి, గుండె ఆరోగ్యంగా ఉంటే.. ప్రాణాల మీదకు రాదు. ఆ ఆరోగ్యం కోసం గుండెకూ ఎక్సర్సైజులు అవసరం!. అయితే మనిషి జీవితం ఇప్పుడు యాంత్రికమైపోయింది. దానికి తగ్గట్లే శారీరక శ్రమకు దూరమైపోతున్నాం. కాబట్టి.. రోజులో కాసేపైనా అలసిపోవడం అవసరం అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా.. వాహనాలు, లిఫ్ట్‌లు వచ్చిన తరువాత శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. అందుకే వీలుచిక్కినప్పుడల్లా నడవడం, మెట్లు ఎక్కడం లాంటి వాటి ద్వారా గుండెను పదిలంగా చూసుకోవచ్చు. ఇక.. అధిక బరువు అనే ప్రధాన సమస్య, గుండె ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. దానివల్ల గుండె కొట్టుకోవడానికి మరింత కష్టపడాల్సి వస్తుంది. కనుక ఆహార, వ్యాయామంతో బరువు పెరగకుండా చూసుకోవాలి. ► అనారోగ్యమే కాదు.. అలసట, ఒత్తిడిల వల్ల కూడా గుండె పనితీరు దెబ్బతింటోంది. కాబట్టి, మనసుకు విశ్రాంతి అవసరం. అది ప్రశాంతతతోనే లభిస్తుంది కూడా. ఈరోజుల్లో ఒత్తిడి.. దాని నుంచి ఏర్పడే ఆందోళన, ఉద్వేగం లాంటివి ప్రతీ ఒక్కరికీ సాధారణం అయ్యాయి. ప్రశాంతత అనేది మనసుకు రిలీఫ్ ఇస్తుంది. అందుకోసం రోజుకు కనీసం 20 నిమిషాల పాటు ధ్యానం చేస్తే.. ఉపశమనం కలగొచ్చు. నవ్వడం వలన రక్తనాళాలు విప్పారి, రక్తపోటు తగ్గుతుంది. అందువలన సమయం దొరికినప్పుడల్లా జోక్స్ చదవండి. నవ్వు తెప్పించే కంటెంట్‌వైపు మళ్లండి. ఇక కార్టిజోల్ వంటి హార్మోన్స్ గుండె ఆరోగ్యం దెబ్బతినేలా చేస్తాయి. అందువలన వ్యాయామం చేసి ఇలాంటి హార్మోన్స్ స్థాయిలు ఉద్ధృతం కాకుండా చేసుకోవచ్చు. ► నిద్రలేమి కారణంగా కూడా రక్తపోటు ప్రమాదం ఉంది. ఇది గుండె జబ్బుకు దారితీస్తుంది. కనుక రాత్రివేళ నిద్ర.. అదీ 7-8 గంటలు హాయిగా నిద్రపోతే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ► ఫలానా వాటికి ఫలానాది ఓ గుండెకాయ.. అని అనేక సందర్భాల్లో వర్ణిస్తాం. మరి అంతటి ముఖ్యమైన అవయవానికి సరైన ఆహారం అందాల్సిందే కదా!. గుండెకు మంచి ఆహారం అవసరం. అదీ వైద్యనిపుణులను, నిపుణులైన డైటీషియన్లను సంప్రదించి తీసుకోవడం ఇంకా ఉత్తమం. ► గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలనేది వైద్యులు మొదటి మాట. రెండో మాటగా.. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలంటారు. అలాగే.. ఈరోజుల్లో మూడో మాటగా మాంసాహారం ఎక్కువగా తీసుకునేవాళ్లు.. దానిని తగ్గించి తీసుకోవడం మంచిదని చెప్తున్నారు. ► మనం రెగ్యులర్‌గా తీసుకునే ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్లు ఉంటాయి. అవి గుండె ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి. కొవ్వులు తక్కువగా ఉండే వేరుశెనగ, బాదం, పిస్తా.. వంటి నట్స్‌ను రోజూ తీసుకునే ఆహారంలో భాగం చేసుకోవాలి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ► అవిసె గింజలు, ఆలీవ్ ఆయిల్, అవకాడో,చియా గింజలు, గుమ్మడి విత్తనాలు, బాదంపప్పు, కోడిగుడ్డు, వాల్నట్స్, బ్రొకోలి, కొత్తిమీర, పిస్తా వంటి వాటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. బ్రెడ్ తదితర మైదా ఉత్పత్తులకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలంటారు. ► తక్కువ ఉప్పు, ట్రాన్స్ ఫ్యాట్ తక్కువ ఉండే వాటితో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఏమీ ఉండవని వైద్యులు అంటున్నారు. అతిగా వేపుళ్లు, మసాలాలు-కారం దట్టించిన ఫుడ్ కూడా అస్సలు మంచిది కాదు. ► మితంగా తింటే ఏదైనా ఆరోగ్యమే. ఇష్టమొచ్చింది తింటే అధిక చెడు కొలెస్ట్రాల్, అధిక బరువుకు దారితీస్తుంది. గుండెకే కాదు.. ఇతర అవయవాలనూ ప్రభావితం చేసి ఇతరత్ర జబ్బులు పలకరించే ప్రమాదం ఉంటుంది. ► ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గుండె కొట్టుకునే తీరు ప్రభావితమవుతుంది. అంటే గతితప్పుతుంది. కార్డియో మయోపతి అంటే గుండె రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం తగ్గడం. ఆల్కహాల్ తీసుకున్న సమయంలో ట్ల్యాబ్లెట్లు వేసుకోకూడదు. ► స్మోకింగ్ చేసేవారికి గుండెజబ్బు వచ్చే అవకాశం 70% ఎక్కువ. మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి స్మోకింగ్‌కు దూరంగా ఉండటం మంచిది. ► అట్రియల్ ఫిబ్రిల్లేషన్ (గుండె అతి వేగంగా కొట్టుకోవడం) రిస్క్ ను పెంచుతుంది. దీనికి నిద్ర తగ్గితే మరింత ముప్పు ఎదురవుతుంది. నిద్ర తగ్గి, గుండె అతి వేగంగా కొట్టుకుంటే అతి హార్ట్ ఫెయిల్యూర్ లేదా స్ట్రోక్ కు దారితీయవచ్చు. ► మంచి గాఢ నిద్ర, సరిపడా ఉండేలా చూసుకుంటే రోగ నిరోధక శక్తి పునరుజ్జీవం అవుతుంది. అలాగే, గుండె ఆరోగ్యం కూడా పటిష్టమవుతుంది. అర్ధరాత్రి తర్వాత కూడా మేల్కొని ఉంటే అది అనారోగ్య సమస్యలకు దగ్గరి దారి అవుతుంది. ఇది ఇప్పటి యువతరం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కూడా. సెల్ఫోన్లు, ఇతర అలవాట్లతో చేజేతులారా ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నారు. ► గుండె సమస్యల్ని గుర్తించడం చాలా కష్టం. రెగ్యులర్ చెకప్‌ల ద్వారానే సమస్యలను నిర్ధారించుకోవచ్చు. అయితే కొన్ని సంకేతాలు మాత్రం రాబోయే ముప్పును అంచనా వేయొచ్చని చెప్తున్నారు వైద్య నిపుణులు. కడుపులో తీవ్రమైన నొప్పి. పొత్తి కడుపు ఉబ్బినట్లుగా అనిపించడం. కడుపులో గ్యాస్ పెరిగినట్లు అసిడిటీగా అనిపించడం, గొంతులో ఏదో ఇరుక్కున్నట్లు అనిపించడం, పుల్లటి తేన్పులు.. ఛాతీలో నొప్పి.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. వైద్యులు దగ్గరికి వెళ్లాలి. ఆలస్యం చేయకపోవడం ఉత్తమం. కార్డియాక్ అరెస్ట్‌ను అంచనా వేయడం వీలుకాని పని. అందుకే.. గుండెను బలంగా ఉంచుకోవడం మరీ ముఖ్యం. ఇంటి వైద్యం-సొంత వైద్యం కాదు.. గుండెను కాపాడుకోవాలంటే ఆస్పత్రులకు, వైద్యుల వద్దకు వెళ్లాల్సిందే!. Sitting in some position Chewing ginger garlic dhaniya Mirch Coughing sneezing laughing None of these will help in heart attack Reach a hospital with Cardiac facilities as soon as possible to get appropriate treatment in #Heartattack to save life https://t.co/3Aa6cT0cCS pic.twitter.com/ELjEyAW6ne — Dr Deepak Krishnamurthy (@DrDeepakKrishn1) February 24, 2023 -
తారకరత్నకు మెలెనా? ఈ వ్యాధి గురించి తెలుసా..
సాక్షి, బెంగళూరు: తీవ్ర గుండెపోటుతో నారాయణ హృదయాల ఆసుపత్రిలో చేరి ప్రాణాంతక పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న. అయితే తాజాగా ఆయన ఆరోగ్య స్థితిపై మరో ఆప్డేట్ అందింది. అరుదైన వ్యాధి అయిన మెలెనాతో తారకరత్న బాధపడుతున్నారని అక్కడి వైద్య బృందం ప్రకటించినట్లు తెలుస్తోంది. జీర్ణశయాంతర రక్తస్రావాన్ని మెలెనా స్థితిగా పేర్కొంటారు. సాధారణంగా మెలెనా వల్ల ఎగువ జీర్ణశయాంతర (GI) మార్గంతో పాటు నోరు, అన్నవాహిక, కడుపు, చిన్న ప్రేగు మొదటి భాగం బ్లీడింగ్ సంభవిస్తుంది. కొన్ని సందర్భాల్లో.. ఎగువ జీర్ణాశయాంతరం దిగువ భాగంలో ఉండే.. పెద్ద ప్రేగు ఆరోహణ భాగంలో కూడా రక్తస్రావం జరగవచ్చు. కారణాలు.. ఎగువ జీర్ణశయాంతర మార్గం దెబ్బ తినడం. కడుపులో యాసిడ్ అధికంగా ఉత్పత్తి కావడం, కడుపులో పుండు, రక్త నాణాలు వాపు, లేదంటే రక్తస్రావం, రక్తసంబంధిత జబ్బుల వల్ల మెలెనా సంభవిస్తుంది. మెలెనా లక్షణాలు.. మెలెనా వల్ల మలం నల్లగా, బంక మాదిరి స్థితిలో బయటకు వస్తుంది. విపరీతమైన దుర్వాసన వస్తుంది. హెమటోచెజియా స్థితికి.. మెలెనాకు ఎలాంటి సంబంధం ఉండదు. మెలెనా వల్ల శరీరంలో రక్త స్థాయి తగ్గిపోతుంది. అనీమియాతో పాటు బలహీనంగా మారిపోతారు. ఒక్కోసారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శరీరం లేత రంగులోకి మారిపోవడం, అలసట, విపరీతమైన చెమటలు, ఉన్నట్లుండి కుప్పకూలిపోవడం, గందరగోళం నెలకొనడం, గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి పరిస్థితులు ఎదురవుతాయి. రక్తం తక్కువగా పోయే స్థితిలో.. చిన్నపేగులో రక్తస్రావం, పొత్తి కడుపు నొప్పి, నోటి నుంచి రక్తం పడడం, బలవంతగా మింగడం, అజీర్తి, రక్తపు వాంతుల లక్షణాలు కనిపిస్తాయి. చికిత్సలు పెప్టిక్ అల్సర్ ట్రీట్మెంట్తో పాటు ఎండోస్కోపీ థెరపీలు, ఆంజియోగ్రాఫిక్ ఎంబలైజేషన్, సర్జికల్ థెరపీలు, రక్త మార్పిడి లాంటి చికిత్సలు అందిస్తారు. అయితే.. మెలెనా వల్ల కొన్నిసార్లు విపరీతమైన రక్తస్రావ స్థితి నెలకొంటుంది. ముక్కు, చెవులతో సహా అనేక చోట్ల నుండి రక్తస్రావం జరుగుతుంది. కొన్నిసార్లు తీవ్రమైన గుండెపోటు తర్వాత.. రక్త నాళాలలో రక్తస్రావం జరుగుతుంది. రక్తస్రావం కారణంగానే.. గుండెకు వైద్యం అందించడంలో సవాళ్లు ఎదురవుతుంటాయి. అందువల్ల కృత్రిమ గుండె కదలిక కోసం ఎక్మో మెషిన్ ఇంప్లాంటేషన్ చేస్తారు. మెలెనా.. రక్తపోటు కూడా నేపథ్యాన్ని తగ్గిస్తుంది. అందుకే రక్తపోటు సమతుల్యత కోసం ప్రత్యేక మిషన్ యొక్క అప్లికేషన్ ఉపయోగిస్తారు. ప్రస్తుతం తారకరత్న విషయంలో ఇదే జరుగుతోంది. ఆయన గుండెనాళాల్లోకి రక్తప్రసరణ కావడం కష్టతరంగా మారడంతో.. బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపిణీ చేసేందుకు యత్నిస్తున్నారు. తారకరత్న ఆరోగ్యం క్షణక్షణం క్షీణిస్తోందని, అయినప్పటికీ నైపుణ్యం కలిగిన వైద్య బృందంచే అధునాతన చికిత్స అందిస్తోందని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. -
యువతకు గుండె పోటు.. అనర్థాలు ఇవే..
లబ్బీపేట(విజయవాడతూర్పు): యువత గుండె లయతప్పుతోంది. మూడు పదుల వయస్సులోనే గుండెపోటుకు గురవుతోంది. విజయవాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్)కి వారంలో ఇద్దరు ముగ్గురు యుతీయువకులు వస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు సైతం పలువురు వెళ్తున్నారు. కోవిడ్ తర్వాత యువతలో గుండె సమస్యలు ఎక్కువయ్యాయి. వారిలో కొందరు మృత్యువాత పడుతున్నారు. చిన్న వయస్సులో గుండెపోటు రావడానికి కారణం విపరీతమైన ఒత్తిడి (స్ట్రెస్), ధూమపానం, మద్యపానం ప్రధాన కారణాలు. కలుషిత గాలి, ఆహారపు అలవాట్లు కూడా కారణాలుగా నిలుస్తున్నాయి. యువతలో గుండెపోటును నివారించాలంటే చిన్నప్పటి నుంచి ఆరోగ్యకరమైన అలవాట్లు అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ఇవే నిదర్శనం విజయవాడ లబ్బీపేటకు చెందిన 25 ఏళ్ల యువకుడు ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. ఉదయం తొమ్మిది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూ విధుల్లోనే ఉంటాడు. ఇటీవల ఛాతీ నొప్పికి గురవడంతో కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆ యువకుడిని పరీక్షించి గుండెపోటుగు గురయ్యాడని నిర్ధారించారు. సకాలంలో ఆస్పత్రికి వెళ్లడంతో అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. విద్యాధరపురానికి చెందిన 30 ఏళ్ల యువకుడు ప్రైవేటు సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి సిగరెట్, మద్యం అలవాటు ఉంది. ఇటీవల డ్యూటీకి బయలుదేరుతూ ఛాతీలో నొప్పి అనడంతో కుటుంబ సభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లే సరికే అతను ప్రాణాలు కోల్పోయాడు. వీరిద్దరే కాదు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ఇటీవల 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు వారు గుండెపోటుతో వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఎక్కువగా 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు వారు గుండెపోటుకు గురవుతున్నారు. వారిలో కొందరు ఆస్పత్రికి చేరటప్పటికే మృత్యువాడ పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కారణాలివే.. - చిన్న వయస్సులోనే గుండెపోటుకు గురవడానికి వైద్యులు అనేక కారణాలు చెబుతున్నారు. - చదువులో, విధుల్లో తీవ్రమైన ఒత్తిడికి (స్ట్రెస్) గురవడం. - స్మోకింగ్, ఆల్కహాల్ సేవనం ప్రధాన కారణం. - ఫాస్ట్‌ఫుడ్, రక్తంలో చెడు కొలస్ట్రాల్ ఎక్కువగా ఉండటం కూడా కారణమే. - రెండు పదుల వయస్సులోనే మధుమేహం వ్యాధి వచ్చినా గుర్తించక పోవడం. - తల్లిదండ్రులు ఇద్దరికీ గుండె జబ్బులు ఉంటే, వారి పిల్లలు చిన్న వయస్సులోనే గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఉంది. - వాతావరణ కాలుష్యం కూడా గుండెజబ్బులకు దారితీస్తోంది. - కోవిడ్ బారిన పడిన వారి సన్నని రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడి ఇరవై ఏళ్ల వారికి కూడా గుండెపోటు వస్తోంది. ఆరోగ్య రక్షణకు ఏంచేయాలంటే.. - గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే జీవనశైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. - పనిలో ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. యోగా, ధ్యానం వంటి వాటిపై దృష్టి సారించాలి. - శారీరక శ్రమ కలిగేలా రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్, వ్యాయామం చేయాలి. - తల్లిదండ్రులకు గుండె జబ్బులు ఉన్న వారు వయస్సు 30 ఏళ్లు దాటిన తర్వాత హార్ట్ చెకప్ తరచూ చేయించుకోవాలి. - ఆరోగ్యకమైన ఆహారం తీసుకోవాలి. ఫాస్ట్‌ఫుడ్, నూనె ఎక్కువగా వినియోగించిన ఆహారం తీసుకోరాదు. అప్రమత్తంగా ఉండాలి గుండెపోటుకు గురవుతున్న యువతను ఇటీవల తరచుగా చూస్తున్నాం. ప్రభుత్వాస్పత్రికి సైతం అలాంటి వారు వారంలో ఇద్దరు, ముగ్గురు వస్తున్నారు. గుండెపోటుకు గురవుతున్న యువతలో 80 శాతం మందికి స్మోకింగ్, ఆల్కహాల్, స్ట్రెస్ కారణాలుగా ఉంటున్నాయి. రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడిన వారిని గుర్తించి స్టెంట్స్ వేస్తున్నాం. రక్తనాళాల్లో పూడికలకు స్టెంట్స్ వేయాలా లేక బైపాస్ సర్జరీ అవసరం అవుతుందా, మందులు సరిపోతాయా అనేది నిర్ణయించేందుకు ఎఫ్ఎఫ్ఆర్ పరీక్ష చేస్తాం. ఇటీవల యువతకు ఎక్కువగా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీలు నిర్వహిస్తున్నాం. – డాక్టర్ బి.విజయచైతన్య. -
Health: బ్లాక్ సాల్ట్‌ను నిమ్మరసం నీళ్లలో కలిపి పరగడుపునే తీసుకుంటే..
Black Salt- Health Benefits: బీపీ సమస్య ఉన్నవారు రెగ్యులర్ ఉప్పుకు బదులుగా నల్ల ఉప్పును వాడాలి. దీంతో వంటల రుచి మారదు. పైగా ఉప్పు తిన్న ఫీలింగ్ కలుగుతుంది. అలాగే బీపీ కూడా తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారు నల్ల ఉప్పును వాడితే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే రక్తం పలుచగా కూడా మారుతుంది. దీంతో రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టదు. ఫలితంగా హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. అలాగే నల్ల ఉప్పును తినడం వల్ల ఐరన్ బాగా లభిస్తుంది. దీంతో రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. దీంతో పాటు సైనస్, దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ ఉప్పును వాడడం వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ►డయాబెటిస్‌ను నియంత్రించవచ్చు. ►కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ►ఎముకలు దృఢంగా మారుతాయి. ►నిద్ర చక్కగా పడుతుంది. ►మానసిక ప్రశాంతత లభిస్తుంది. ►అధిక బరువు తగ్గుతారు. ►కొవ్వు కరిగి పోతుంది. ►కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి. ►అలాగే శిరోజాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ►చర్మం కాంతివంతంగా మారుతుంది. ►కనుక సాధారణ ఉప్పుకు బదులుగా నల్ల ఉప్పును వాడడం అలవాటు చేసుకోవాలి. ఇక దీన్ని సాధారణ ఉప్పులాగే వాడుకోవచ్చు. లేదా రోజూ ఉదయం నిమ్మరసం నీళ్లలో కలిపి పరగడుపునే తీసుకోవచ్చు. లేదా తేనె నీళ్లతోనూ కలిపి తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా సరే బ్లాక్ సాల్ట్ మనకు మేలు చేస్తుంది. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యలకు సరైన పరిష్కారం పొందే ఆస్కారం ఉంటుంది. చదవండి: Health: మేనరికపు పెళ్లి.. నాలుగు సార్లు అబార్షన్.. సమస్య ఏమిటి? పరిష్కారం ఉందా? -
యువత ‘హృదయ’ వేదన
నంద్యాల జిల్లా ఆత్మకూరుకు చెందిన 20 ఏళ్ల ఏసురత్నం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతను తీవ్రమైన ఛాతినొప్పితో నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరాడు. ఈసీజీ, 2డీఎకో పరీక్షల అనంతరం అతనికి యాంజియోగ్రామ్ పరీక్షలు చేశారు. అతని గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో బ్లాక్‌లు ఏర్పడినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా స్టెంట్ వేసి అతని ప్రాణాలను వైద్యులు కాపాడారు. లద్దగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్ సతీష్(45) గత నెలలో గుండెపోటుకు గురై మరణించారు. కోడుమూరులో జరిగిన సమావేశానికి హాజరైన ఆయన ప్రసంగం చేసి కూర్చుని అలాగే గుండెపోటుకు గురికావడంతో సహ ఉద్యోగులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు. .. వీరిద్దరే కాదు ఇటీవల కాలంలో మధ్యవయస్సు వారు గుండెపోటుతో ఎక్కువగా మరణిస్తున్నారు. చిన్న వయస్సులోనే దురలవాట్లకు లోనుకావడం, శారీరక వ్యాయామం లేకపోవడం, మితం లేని ఆహారం వల్ల గుండెపోటుకు గురవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కర్నూలు(హాస్పిటల్): ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వచ్చే గుండెజబ్బులు నేడు 20 ఏళ్లకే పలకరిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రికి గుండెచేతబట్టుకుని వస్తున్న వారిలో 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు వారే అధికంగా ఉంటున్నారు. అంతేగాకుండా వంశపారంపర్యం, జన్యులోపాలు, మేనరికపు వివాహం వంటి కారణాలతో గుండెజబ్బులతో జన్మించే పిల్లలూ ఇటీవల అధికమయ్యారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కార్డియాలజీ విభాగానికి వారానికి రెండు రోజుల ఓపీ ఉంటుంది. ప్రతి ఓపీ రోజున రోగుల సంఖ్య 250 నుంచి 300 వరకు ఉంటోంది. నెలలో 400 మంది వార్డులో చేరి చికిత్స పొందుతున్నారు. నగరంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ పలువురు చికిత్స పొందుతున్నారు. ఏటా ఐదువేల మందికి గుండె సమస్యలతో ఆసుపత్రులకు వస్తున్నారు. వీరిలో యువకులు ఎక్కువగా ఉండడం ఆందోళనకరం. లక్షణాలు ఇవీ.. కొద్దిదూరం నడవగానే ఆయాసం, ఛాతిలో పట్టేసినట్లుగా ఉండటం, చెమట ఎక్కువగా పడుతుండటం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటం ఉంటే గుండెజబ్బుగా అనుమానించాల్సి ఉంటుంది. సమీప ఆసుపత్రికి వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకుని, అవసరమైన చికిత్స తీసుకోవాలి. గుండెపోటు వచి్చన మొదటి కొద్దినిమిషాలు కీలకమైనవి. గుండెపోటు రావడానికి కారణాలివీ.. ధూమపానం, నెయ్యి వాడకం, పరగడుపున రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉండటం, అధిక కొల్రస్టాల్, రక్తపోటు, శారీరక వ్యాయామం బాగా తగ్గడం, తల్లిదండ్రుల్లో గానీ, తోబుట్టువలలో గానీ ఎవ్వరికైనా గుండెపోటు వచి్చనా కానీ ముందుగానే ఈ సమస్య ఉండటం, లిపోప్రోటీన్–ఎ, హైపర్ హోమోసిస్టెమియా, హైపర్ కాగ్యులబుల్ పరిస్థితి, కొకైన్ వాడకం లాంటివి ఉంటే ఈ సమస్యలు వస్తాయి. ధూమపానం ఉంటే 72శాతం, అధిక కొలె్రస్టాల్ ఉంటే 52శాతం, కుటుంబంలో ఎవ్వరికైనా హార్ట్ ఎటాక్ చరిత్ర ఉంటే 35శాతం గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. హైపర్ హోమోసిస్టీనిమియా పెరగడమే కారణం రక్తంలో హైపర్ హోమోసిస్టీనిమియా పెరగడం వల్లే ఇటీవల కాలంలో యుక్త వయస్సులోనూ గుండెపోట్లు కేసులు పెరుగుతున్నాయి. పాశ్చాత్యులు కూరగాయలను పచి్చగానే తింటారు. కానీ మన దేశంలో మాత్రం ఎక్కువగా ఉడికించడమో, ఫ్రై చే యడమో చేసి తింటారు. దీనివల్లే హైపర్ హోమోసిస్టీనిమియా లెవెల్స్ పెరుగుతున్నాయి. గతంలో గుండెపోటు కేసుల్లో 5శాతంలోపు మాత్రమే యువకులు ఉండేవారు. ఇప్పుడది 14 నుంచి 15శాతానికి పెరిగింది. ఇది ప్రమాదకర పరిణామం. గుండెజబ్బులపై ప్రజలకు అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. –డాక్టర్ పి.చంద్రశేఖర్, కార్డియాలజి హెచ్‌వోడీ, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల జీవనశైలిలో మార్పుల వల్లే... శారీరక శ్రమలేని వ్యక్తుల రక్తంలో కొలె్రస్టాల్ శాతం పెరిగి గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అధిక బరువు ఉన్నవారిలో కూడా ఈ జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. మధుమేహవ్యాధి గుండె రక్తనాళాలను దెబ్బతినేటట్లు చేయడం వల్ల కూడా గుండెజబ్బులు రావచ్చు. అధిక చక్కెర, మాంసాహారం, వెన్న, నూనెలు వంటివి కొవ్వు పదార్థాలు గుండెజబ్బులు రావడానికి ముఖ్యపాత్ర వహిస్తాయి. ముఖ్యంగా కోవిడ్ అనంతరం ఈ కేసులు మరింత పెరిగాయి. కోవిడ్ సమయంలో చాలా మంది రక్తనాళాల్లో బ్లాక్‌లు ఏర్పడ్డాయి. గుండెజబ్బులు రాకుండా ఉండాలంటే... - మద్యపానం, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. ప్రతిరోజూ వాకింగ్, యోగా, ధ్యానం చేయాలి. - శాస్త్రీయ సంగీతం వినాలి. పాత పాటల్లోని సాహిత్యం మనస్సుకు ఎంతో హాయినిస్తుంది. - లిఫ్ట్‌లో వెళ్లడం కంటే మెట్లు ఎక్కడమే మేలు. సమతుల ఆహారం వల్ల గుండెకు బలం చేకూరుతుంది. - నూనెలో వేయించిన ఆహారాన్ని తగ్గించుకోవాలి. బయట లభించే ఫాస్ట్ఫుడ్స్, బేకరీ ఫుడ్స్‌కు, దిగుమతి చేసుకున్న చికెన్ లెగ్స్‌కు దూరంగా ఉండాలి. - బజ్జీలు తినాల్సి వస్తే ఇంట్లోనే చేసుకోవాలి. - బీపీ, షుగర్‌ను నియంత్రణలో ఉంచుకోవాలి. స్థూలకాయం తగ్గించుకోవాలి. - వయస్సుకు తగినట్లు నిద్రపోవాలి. నిద్రతగ్గితే శరీరం రోగాలను ఆహా్వనిస్తుంది. -
సర్వేలో చేదు నిజాలు.. యువతలో గుండె సమస్యలు తీవ్రం
ఆరోగ్య రాజధాని బెంగళూరులో యువత గుండె ఒత్తిడితో సమతమవుతోంది. మంచి చదువులు, ఉద్యోగం, ఇంకా రకరకాల లక్ష్యాలతో విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల వయసుకు మించిన ఒత్తిడిని హృదయం అనుభవిస్తుంది. దీనికి తోడు అధిక కొవ్వు, చక్కెరలతో కూడిన ఆహారం వల్ల ఆరోగ్యం ఆస్పత్రి పాలయ్యే ప్రమాదం పెరిగింది. నగరంలోని ప్రముఖ గుండె వైద్య ఆస్పత్రులకు పెరిగిన రోగుల తాకిడే దీనికి నిదర్శనమంటున్నారు. బనశంకరి: ఐటీ బీటీ సిటీలో ఉద్యోగాలంటేనే ఉరుకులు, పరుగులు లాంటి యాంత్రిక జీవనానికి సరి సమానం. ఎంతో ఒత్తిడితో కూడుకున్న జీవనశైలితో రాజధాని నగర ప్రజలను తీవ్రమైన గుండె సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రముఖ హృద్రోగ ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య కూడా గణనీయ ప్రమాణంలో పెరగడం దీనికి నిదర్శనంగా భావించాలి. అందులోనూ యువత, మధ్య వయసువారే ఎక్కువగా గుండె పోటుకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. గ్రామీణుల కంటే 30 శాతం అధికం బెంగళూరు మహానగర వాసులు గ్రామీణ ప్రాంతాలవారి కంటే 30 శాతానికి పైగా గుండె సమస్యలతో బాధపడుతున్నారు. దేశంలోని మహానగరాల్లో ఒకటైన బెంగళూరు నగరంలో హెచ్చుమీరిన వాయు కాలుష్యం, ట్రాఫిక్, ఒత్తిడితో కూడుకున్న జీవితంతో చిన్ని గుండె త్వరగా అలసిపోతోంది. దీంతో పాటు వందలో 50 శాతం మంది శారీరక కదలికలు లేని ఉద్యోగాలు, వ్యాయామం చేయకపోవడం వల్ల గుండె బలహీనానికి లోనవుతోందని వైద్య నిపుణులు తెలిపారు. కరోనా తరువాత మరింత ఎక్కువ నగరంలోని ప్రముఖ హృద్రోగ ఆసుపత్రి నారాయణమల్టీ స్పెషాలిటిలో కరోనా అనంతరం 55 ఏళ్లు వయసు కంటే తక్కువ వయసు ఉన్నవారు గుండె సమస్యలతో రావడం 30 శాతం పెరిగింది. గత ఒక ఏడాదిలో నమోదైన మొత్తం రోగుల్లో 70 శాతం మంది 25–55 వయసు మధ్యవారేనని తెలిపారు. జయదేవ హృద్రోగ ఆసుపత్రిలో ఏడాదికి సరాసరి 6 లక్షల మందికి పైగా ఆసుపత్రికి వైద్యం కోసం వస్తున్నారు. యాంజియోగ్రాం, యాంజియోప్లాస్టితో పాటు 40 వేల శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చే ప్రతి 100 మందిలో 30 మంది 40 ఏళ్లు లోపు వయసు వారు సగం మంది ఉన్నారు. 40 ఏళ్లు దాటితే స్కాన్ చేయించాలి గుండెపోటు ఒకేసారి రాదు కనీసం 10 ఏళ్లకు ముందుగానే గుండెరక్తనాళాల్లో రక్తప్రసరణ తలెత్తుతుంది. 40 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ 10 ఏళ్లకు ఒకసారి గుండె కు సీటీ స్కాన్ తీయించుకోవాలి. ఈ పరీక్షతో 5 శాతం రక్తనాళాలు బ్లాక్ అయి ఉంటే తెలుస్తుంది. దీంతో ప్రారంభ సమయంలోనే చికిత్స తీసుకుంటే గుండె జబ్బుల నుంచి దూరంగా ఉండవచ్చునని ప్రముఖ గుండెవైద్య నిపుణుడు డాక్టర్ దేవీ శెట్టి సలహా ఇచ్చారు. ఒత్తిడి జీవన విధానమే కారణం ప్రస్తుతం ప్రజలు అత్యంత ఒత్తిడితో కూడుకున్న జీవనశైలితో జీవనం గడుపుతున్నారు. ఒక ఏడాది పని ఒక నెలలో పూర్తిచేయాలనే మానసిక స్థితిని కలిగి ఉన్నారు. విద్యార్థి దశ నుంచి ఒకేసారి రెండు మూడు కోర్సులు ప్రారంభించి, మంచి ఉద్యోగం, మరింత డబ్బు సంపాదించాలనే ఆరాటానికి గురవుతున్నారని జయదేవ హృద్రోగ సంస్థ డైరెక్టర్ డాక్టర్ సీఎన్. మంజునాథ్ తెలిపారు. ఓ సర్వేలో చేదు నిజాలు సమగ్ర ఆరోగ్య కేంద్ర సంస్థ ప్రాక్టో దేశంలోని ప్రముఖ మహానగరాల్లో జరిపిన పరిశోధనల్లో మూడునెలల్లో బెంగళూరులో గుండెపోటుకు సంబంధించిన ఆరోగ్య పరీక్షలు, చికిత్సలు 200 శాతం పెరిగినట్లు తెలిపింది. గత రెండేళ్లలో గుండె జబ్బులతో అనేక మంది ప్రముఖులు మృత్యవాత పడ్డారు. దీంతో ప్రజల్లో జాగ్రత్త పెరిగి గత మూడునెలల్లో గుండె పరీక్షల కోసం ఆస్పత్రులకు వచ్చేవారి సంఖ్య అత్యధికంగా పెరిగింది. ఇందులో 56 శాతం మంది 30–39 ఏళ్లులోపు వారు ఉన్నారు. -
విధి ఆడిన వింత నాటకం.. అప్పటి వరకు ఎంజాయ్ చేసి ఒక్కసారిగా..
మనిషి జీవితం ఎంత విచిత్రమైనదో ఇప్పటికే ఎన్నో ఘటనల్లో చూసే ఉంటాము. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా కనిపించిన వ్యక్తి క్షణకాలంలో కుప్పకూలి ప్రాణాలు విడిచిన ఘటనలు షాక్‌కు గురిచేస్తున్నాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రుల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో గర్బా డ్యాన్స్‌లు చేస్తూ భక్తులు వేడుకలు జరుపుకుంటున్నారు. కాగా, వేడుకల్లో గుజరాత్‌కు చెందిన ఓ యువకుడు గర్బా డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మరణించాడు. ఆనంద్ జిల్లాలోని తారాపూర్‌లో ఉన్న ఆతీ శివశక్తి సొసైటీలో ఆదివారం సాయంత్రం గర్బా నిర్వహించారు. ఈ సందర్భంగా యువతీ, యువకులు చుట్టూ తిరుగుతూ పాటలకు డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో.. వీరేంద్ర సింగ్ రమేష్ భాయ్ రాజ్‌పుత్(21) అందరితో కలిసి గర్బా డ్యాన్స్ చేశాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా డ్యాన్స్ చేస్తూ ముందుకు వచ్చి కింద కుప్పుకూలిపోయాడు. దీంతో, అక్కడున్న వారంతా సడెన్‌గా ఆందోళనకు గురయ్యారు. బంధువులు, స్నేహితులు అతడిని పైకి లేపడానికి ఎంత ప్రయత్నించినా అతడు కదలలేదు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆ యువకుడు గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో, పండుగ పూట వారి కుటుంబంలో విషాదఛాయలు అములుకున్నాయి. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోంది. Anand : गरबा खेलते खेलते एक शख्स की मौत। तारापुर में आती शिवशक्ति सोसायटी में गरबा आयोजित किया गया था। युवक को अस्पताल ले जाया गया लेकिन तब तक देरी हो चुकी थी। वजह दिल का दौरा पड़ने से मौत बताई जा रही है। pic.twitter.com/GlUA1irveA — Janak Dave (@dave_janak) October 2, 2022 -
పెరిగిన గుండెపోటు కేసులు.. నాలుగేళ్లలో అక్కడ 80 వేలకుపైగా మృతి
సాక్షి, ముంబై: కోవిడ్–19 మహమ్మారి తర్వాత ముంబైకర్లలో గుండెపోటు కేసులు, గుండెపోటుతో మరణాల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. దీంతో బీఎంసీ, ప్రభుత్వ ఆరోగ్య శాఖలు ఆందోళనలో పడిపోయాయి. ప్రస్తుతం కరోనా వైరస్ దాదాపు నియంత్రణలోకి రావడంతో పరిస్ధితులు యథాతధంగా మారాయి. కానీ గడచిన నాలుగేళ్లలో ముంబైలో 80 వేలకుపైగా గుండెపోటుతో మృతి చెందినట్లు నమోదైన కేసులను బట్టి తెలిసింది. అందులో కోవిడ్ కాలం అంటే ఒక్క 2020లోనే 25,378 మంది మృతి చెందారు. ఈ సంఖ్యను బట్టి ముంబైలో ప్రతీరోజు సగటున 70 మంది గుండెపోటుతో మృతి చెందినట్లు స్పష్టమైతోంది. దీంతో సెప్టెంబర్ 29న ‘వరల్డ్ హార్ట్ డే’ సందర్భంగా ముంబైకర్లు తమ గుండెను భద్రంగా కాపాడుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ కారణంగా నరాలలో రక్తం గడ్డ కట్టడం, గుండె మండటం, వేగంగా కొట్టుకోవడం లాంటి సమస్యలు పెరిగాయి. అందుకు కారణం వ్యసనాలు, తరుచూ అనారోగ్యానికి గురికావడం, అనోబాలిక్ స్టెరాయిడ్ లాంటి పదార్ధాలను విచ్చలవిడిగా వినియోగం పెరిగిపోవడంవల్ల గుండెపోటు, మరణాలు పెరిగిపోయి ఉండవచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. కోవిడ్ సోకి, వ్యాధి నయం అయిన వ్యక్తుల్లో గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే అవకాశాలు 21 రెట్లు అధికంగా ఉంటుంది. ఒక వ్యక్తికి గుండెపోటు రావడం వెనక గుండె దిశగా వెళ్లే నరాల్లో ఎదురవుతున్న ఇబ్బందులే ప్రధాన కారణం కావచ్చని ఫోర్టీస్ ఆస్పత్రికి చెందిన డా.మనీష్ హిందుజా పేర్కొన్నారు. గుండెపోటు నుంచి తమను తాము కాపాడుకోవాలంటే ప్రతీరోజు తినే ఆహరాన్ని నియంత్రణలో ఉంచాలి. ప్రతిరోజూ 30 నిమిషాలపాటు నడవాలి. తమ శరీర తత్వాన్ని, తట్టుకునే సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అంతే సమయం వ్యాయామం చేయాలని కేం ఆస్పత్రిలోని డి.ఎం.కార్డియాలాజీ విభాగం యూనిట్ చీఫ్, ప్రొఫెసర్ డా.చరణ్ లాంజేవార్ పేర్కొన్నారు. ఇందులో ఏదో ఒక దాంట్లో నియంత్రణ కోల్పోయినా లేదా పాటించకపోయినా గుండెపోటు రావడం, ఆ తర్వాత సకాలంలో చికిత్స అందకపోవడంతో మరణించడం లాంటివి చోటుచేసుకుంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. -
25 ఏళ్లకే గుండె సమస్యలు..గోల్డెన్ అవర్‌లో ఇలా చేస్తే ప్రాణాలు కాపాడొచ్చు
సాక్షి, భీమవరం(ప్రకాశం చౌక్): ఈ బిజీ జీవితంలో ఒత్తిడులు, శారీరక శ్రమ లేకపోవడం మన గుండెను ప్రమాదంలోకి నెడుతోంది. మారిన ఆహార అలవాట్లు గుండె నాళాలను దెబ్బతీస్తున్నాయి. ఈ రోజు వరల్డ్ హార్ట్ డే.. అందువల్ల మన గుండెను మనం ఎంత ప్రమాదంలోకి నెడుతున్నామో తెలుసుకోవాల్సిన అవసరముంది. మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏటా 10 నుంచి 20 శాతం గుండె వ్యాధుల కేసులు పెరుగుతున్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మందు, సిగరెట్లు, కల్తీ ఆహారం, అధిక నూనెలతో కూడిన ఆహారం గుండెకు ప్రమాదకరం. ఒకసారి గుండెపోటు వచ్చిన వాళ్లు తప్పనిసరిగా అలవాట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. గతంలో 45 ఏళ్లు దాటాక గుండెపోటు వచ్చేది. ఇప్పుడు 25 ఏళ్లకే వస్తుంది. ఈ నేపథ్యంలో ఏటా సెప్టెంబర్ 29న వర్డల్ హార్ట్‌డే నిర్వహిస్తూ గుండెను ఎలా రక్షించుకోవాలో చెబుతున్నారు. ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ పీఆర్కే వర్మ గుండెను ఎలా కాపాడుకోవాలో వివరించారు. గోల్డెన్ అవర్‌లో చికిత్స ముఖ్యం గుండెపోటు వచ్చిన వక్తికి అత్యవసరంగా వాడే రెండు రకాల మాత్రాలున్నాయి. అవి ASPIRIN 325 mg, Sorbitrate 5 mg.. గోల్డెన్ అవర్(మొదటి ఆరు గంటలు)లో ఆస్పత్రిలో చేరితో గుండెపోటు వచ్చిన వ్యక్తికి అత్యవసర ఇంజెక్షన్లు ఇచ్చి ప్రాణాలను కాపాడుకోవచ్చు. తర్వాత పేషేంట్ గుండెకు సంబంధించి ఈసీజీ, ఈకో, యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించి గుండె పరిస్థితి తెలుసుకుని సరైన వైద్యం అందించవచ్చు. కరోనా తర్వాత గుండె సమస్యలు పెరుగుతున్నాయి. కోవిడ్ వల్ల రక్తం గడ్డకట్టే అవకాశం ఉంది. దాంతో గుండెపోట్లు పెరుగుతున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గత ఐదేళ్లుగా గుండె వ్యాధుల కేసులు ఏటా 10 నుంచి 20 శాతం పెరుగుతున్నాయి. ప్రతి ఏడాది జిల్లాలో 10 వేల నుంచి 20 వేల కేసులు ఉంటున్నాయి. ఆదుకుంటున్న ఆరోగ్యశ్రీ గుండె వైద్యం అంటే లక్షల్లో ఖర్చు చేయాల్సి వచ్చేది. వైఎస్సార్ పుణ్యమా అని ఇప్పుడు పైసా ఖర్చు లేకుండా ఆరోగ్య శ్రీలో గుండెకు ఉచిత వైద్యం అందుతోంది. నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆరోగ్యశ్రీను అద్భుతంగా అమలు చేయడంతో గుండెకు సంబంధించి అన్ని రకాల వ్యాధులకు ఆరోగ్యశ్రీలో ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో నాలుగు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రిల్లో గుండెకు సంబంధించి ఉచిత వైద్యాన్ని అందిస్తున్నారు. భీమవరం వర్మ ఆస్పత్రి, తణుకు యాపిల్ ఆస్పత్రి, ఏలూరు ఆశ్రమం ఆస్పత్రి, ఏలూరు విజయ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీలో గుండె వ్యాధులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. జన్యుపరంగానూ గుండెపోటు గుండె పోటు ఇప్పుడు 20 ఏళ్లు దాటిన వారిలోనూ వస్తుంది. కొందరికి జన్యుపరంగా వస్తుంది. ఇక ముఖ్యంగా మద్యపానం, ధూమపానం చేయడం, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం, బీపీ, సుగర్, ఊబకాయం వల్ల గుండెపోటు వచ్చే అవకాశముంది. అధిక ఒత్తిడి వల్ల బీపీ పెరిగి గుండెపోటుకు దారితీయవచ్చు. ఆందోళన వల్ల కూడా గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. గుండెపోటు ఎలా గుర్తించాలి గుండెపోటు వచ్చినప్పుడు ఛాతి మధ్య భాగంలో బరువుగా ఉంటుంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. చెమటలు పడతాయి, నడిచినా, మెట్లు ఎక్కినా ఆయాసం వస్తుంది. ఈ లక్షణాలు ఉంటే వెంటనే గుండె వైద్య నిపుణులు ఉన్న ఆస్పత్రికి వెళ్లాలి. చాలా మంది గుండెపోటును గ్యాస్ నొప్పిగా తీసుకుని సొంత వైద్యం లేదా స్థానికంగా ఉండే క్లినిక్‌ల్లో వైద్యం చేయించడానికి ప్రయత్నిస్తారు. గుండెపోటు రాకుండా ఉండాలంటే.. మద్యపానం, ధుమపానం మానాలి. ప్రతి రోజూ వ్యాయమం చేయాలి. పాస్ట్‌ఫుడ్, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహరం తీసుకోరాదు. కనీసం 45 నిమిషాలు నడవాలి. రోజుకు కనీసం 6 నుంచి 7 గంటలు నిద్రపోవాలి. బీపీ, సుగర్ నియంత్రణలో ఉంచుకోవాలి. ఒత్తిడికి గురికాకుండా ఉల్లాసంగా ఉండాలి. -
50లక్షల ప్యాకేజీతో ఉద్యోగం.. జాబ్‌లో చేరేలోపే గుండెపోటుతో మృతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి కుమారుడు అభిజిత్ రెడ్డి (22) గుండెపోటుతో కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి నిద్రలోనే అభిజిత్‌కు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు దగ్గర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అభిజిత్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు తెలిపారు. కాగా, కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభిజిత్ ఇటీవలే సౌదీ అరేబియాకు చెందని ఓ ఆయిల్ కంపెనీలో 50లక్షలకు పైన ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించాడు. వచ్చే నెలలోనే ఉద్యోగంలో చేరాల్సి ఉంది. ఈ క్రమంలో అభిజిత్ ఉన్నట్టుండి మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. చదవండి: (గుట్టుచప్పుడుగా ‘గుండెపోటు’.. ఇలా గుర్తుపట్టొచ్చు) -
'భీమిలి కబడ్డీ జట్టు'ను గుర్తుచేస్తూ మృత్యు ఒడిలోకి.. వీడియో వైరల్
తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు ఏరియాలో నిర్వహించిన కబడ్డీ పోటీలు విషాదం నింపాయి. పోటీల్లో పాల్గొన్న విమల్‌రాజ్ అనే యువకుడు లైవ్ మ్యాచ్‌లోనే ప్రాణాలు వదిలాడు. విషయంలోకి వెళితే.. మ్యాచ్ మధ్యలో విమల్‌రాజ్ కూతకి వెళ్లాడు. ప్రత్యర్థి ప్లేయర్లపై నుంచి ఎగిరి గీత దగ్గరికి వచ్చిన విమల్‌రాజ్‌ను ప్రత్యర్థి ప్లేయర్ మీద పడి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో ఆ ప్లేయర్ మోకాలు, విమల్‌రాజ్ ఛాతిపై బలంగా తగిలింది. విమల్‌రాజ్ గీత దాటడం, అతన్ని అడ్డుకునే ప్రయత్నంలో సదరు ప్లేయర్ కూడా లైన్ బయట చేతులు పెట్టడంతో విమల్‌రాజ్‌కే పాయింట్ ఇస్తూ రిఫరీ విజిల్ విసిరాయి. ప్రత్యర్థి ప్లేయర్ తనపై నుంచి లేవగానే పైకి లేచేందుకు ప్రయత్నించిన విమల్‌రాజ్, లేస్తూనే కుప్పకూలిపోయాడు. వెంటనే మిగిలిన ఆటగాళ్లు, రిఫరీ వచ్చి లేపేందుకు ప్రయత్నించినా ఉలుకూ పలుకూ లేకపోవడంతో వెంటనే అప్రమత్తమైన తోటి ప్లేయర్లు, ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆసుపత్రికి చేరే సమయానికే విమల్‌రాజ్ ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు తెలిపారు. కబడ్డీ ఆడుతున్న సమయంలో గుండెపోటు రావడం వల్లే అతను చనిపోయి ఉండాడని ప్రాథమిక అంచనాకి వచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా నేచురల్ స్టార్ నాని నటించిన 'భీమిలీ కబడ్డీ జట్టు' సినిమా తరహాలోనే ఇక్కడ విమల్‌రాజ్ ప్రాణాలు వదలడం అందరిని కలిచివేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: భారత్‌కు భారీ షాక్.. కామన్వెల్త్ గేమ్స్ నుంచి నీరజ్ చోప్రా ఔట్! -
విషాదం.. క్రికెట్ ఆడుతూ కన్నుమూత
పుణేలో విషాదం నెలకొంది. స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతూ 22 ఏళ్ల యువకుడు గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. కాగా మృతి చెందిన యువకుడి పేరు శ్రీతేజ్ సచిన్ గులే అని తెలిసింది. ఆదివారం కావడంతో స్నేహితులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడడానికి వచ్చాడు. మ్యాచ్ మధ్యలో శ్రీతేజ్ ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో భయపడిన అతని స్పేహితులు పరిగెత్తుకొచ్చినప్పటికి అప్పటికి శ్రీతేజ్ సృహలో లేడు. వెంటనే పక్కనే ఉన్న ఆసుపత్రికి తరలించగా.. గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ద్రువీకరించారు. దీంతో షాక్ తిన్న అతని స్నేహితులు శ్రీతేజ్ సచిన్ మరణవార్తను అతని కుటుంబసభ్యులకు తెలియజేశారు. కాగా శ్రీతేజ్ పుణేలోని హదప్సార్ ఏరియాలో నివసిస్తున్నారు. చదవండి: మాజీ క్రికెటర్లకు, అంపైర్లకు గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ.. -
చిన్నవయసులోనే గుండెపోట్లు.. కారణాలేంటి..? జాగ్రత్తలేంటి..?
►సంజామల మండలం ముచ్చలపురి గ్రామానికి చెందిన కాశీంబీ(55) గత నెల 24వ తేదీన పూడికతీత పనులు చేస్తూ గుండెపోటుకు గురై మరణించింది. ►ఓర్వకల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న విశ్వప్రసాద్(46) గుండెపోటుకు గురై గత నెల 21వ తేదీన ప్రాణాలొదిలాడు. ►పెద్దకడబూరు మండలం చిన్నతుంబళం గ్రామానికి చెందిన అబ్దుల్ అనీఫ్(23) అనే యువకుడు గత నెల 22న హార్ట్‌స్ట్రోక్‌తో మృతి చెందాడు. ►ఇటీవలే కర్నూలు కొత్తబస్టాండ్ ప్రాంతంలో ఎరువుల వ్యాపారం చేస్తున్న 40 ఏళ్ల యువకుడు గుండెపోటుకు గురై హఠాన్మరణం పొందారు. వీరే కాదు ప్రతిరోజూ జిల్లాలో ఏదో ఒకచోట పట్టుమని 50 ఏళ్లు కూడా నిండని వారు అధికంగా గుండెపోటుకు గురై మరణిస్తున్నారు. ఒకప్పుడు హృద్రోగ సమస్యలు 70 ఏళ్లు పైబడిన వారికి వచ్చేవి. ఇప్పుడు పాతికేళ్ల యువకులను సైతం ఈ సమస్య వేధిస్తోంది. ఫాస్ట్‌ఫుడ్, జంక్‌ఫుడ్, బేకరీల్లో లభించే తినుబండారాలు, వారంలో నాలుగైదుసార్లు చికెన్, మటన్ లాగించేయడం, ఒకేచోట కూర్చుని పనిచేయడం, వ్యాయామం లేని జీవితాన్ని గడపడం, మానసిక ఒత్తిడి తదితర కారణాలతో నేటి యువతరం గుండె బలహీనమైపోతోంది. కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో 20 ఏళ్ల క్రితం ఒకరు మాత్రమే కార్డియాలజిస్టు ఉండేవారు. అప్పట్లో గుండె సమస్యలకు సైతం జనరల్ ఫిజీషియన్లు చికిత్స చేసేవారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోనూ పాతికేళ్ల క్రితం జనరల్ ఫిజీషియన్లే గుండె జబ్బుల విభాగాన్ని నిర్వహించారు. ఆ తర్వాత కార్డియాలజిస్టు రావడంతో దాదాపు 15 ఏళ్ల పాటు ఆయన ఒక్కరే విభాగాన్ని పర్యవేక్షించారు. మధ్యలో ఒకరిద్దరు కార్డియాలజిస్టులు, సీనియర్ రెసిడెంట్లు వచ్చినా కొన్నాళ్లకే వెళ్లిపోయారు. ప్రస్తుతం ఐదుగురు కార్డియాలజిస్టులు ఈ విభాగంలో వైద్యసేవలు అందిస్తున్నారు. ఇందులో ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఓపీ నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ ఓపీకి 200 నుంచి 250 మంది చికిత్స కోసం వస్తుండగా, ఇన్ పేషంట్లుగా నెలకు 350 నుంచి 400 మంది వరకు చేరి చికిత్స పొందుతున్నారు. రోజూ 400కి పైగా ఈసీజీ, 40 నుంచి 50 వరకు 2డీ ఎకో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 11వేల దాకా యాంజియోగ్రామ్‌లు, 2వేలకు పైగా స్టెంట్స్, 60 పేస్మేకర్లు వేశారు. దీంతో పాటు కార్డియోథొరాసిక్ విభాగంలో సైతం గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్సలు కార్పొరేట్ స్థాయిలో కొనసాగుతున్నాయి. ఈ విభాగంలో ఇప్పటి వరకు 480కి పైగా ఆపరేషన్లు నిర్వహించారు. గుండె పోటు వచ్చిన వారికి సత్వర వైద్యం అందించేందుకు కర్నూలు పెద్దాసుపత్రితో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలు ప్రైవేటు ఆసుపత్రులు ఏర్పాటయ్యాయి. గుండెపోటుకు కారణాలు ►మానసిక ఒత్తిడి, జీవనశైలిలో మార్పులు ►చిన్న వయస్సులోనే ఊబకాయంతో పాటు బీపీ, షుగర్లు రావడం ►ఈ జబ్బులు వచ్చినా వాటిని నియంత్రణలో ఉంచుకోకపోవడం ►ఒకేచోట గంటలకొద్దీ సమయం కూర్చుని పనిచేయడం ►ధూమ, మద్యపానాలతో మరింత చేటు ►విపరీతంగా ఫాస్ట్‌ఫుడ్, మాంసాహారం తినడం ►రాత్రివేళల్లో తగినంత నిద్రలేకపోవడం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ►బీపీ, షుగర్ నియంత్రణలో ఉంచుకోవాలి. ఊబకాయం తగ్గించుకోవాలి. ►రోజూ తగినంత వ్యాయామం చేయాలి. ►ధూమ, మద్యపానాలు మానేయాలి. ►ఒత్తిడి లేని జీవితం కోసం ప్రణాళికతో రోజును ప్రారంభించాలి. ►స్థూలకాయాన్ని తగ్గించుకోవాలి. ►అధిక కొవ్వు, నూనెలు, ఉప్పు, చక్కెరలకు దూరంగా ఉండాలి. ►రాత్రి త్వరగా నిద్రపోవాలి. తగినంత నిద్రతో గుండెకు అదనపు శక్తి. యువతలో హృద్రోగ సమస్యలు పెరిగాయి ఇటీవల కాలంలో 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు సైతం గుండెపోటుతో మరణించడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి పలు రకాల మానసిక ఒత్తిళ్లు, నిద్రలేమితో పాటు దురలవాట్లు, నియంత్రణలేని ఆహారం, కుటుంబ సమస్యలు, వాతావరణ కాలుష్యం కారణాలుగా భావిస్తున్నాము. జీవనశైలిలో మార్పులు తెచ్చుకుని రోజూ తగినంత వ్యాయామం చేయడం, పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవడం మేలు. బీపీ, షుగర్లు ఉంటే వాటిని నియంత్రించుకోవాలి. –డాక్టర్ చైతన్యకుమార్, కార్డియాలజిస్టు, కర్నూలు ఉద్గీత ధ్యాన యోగ ఉపకరిస్తుంది గుండెపోటు ప్రధానంగా మానసిక ఒత్తిడి అధికం కావడం, నిద్రలేకపోవడంతో వస్తోంది. దీనికితోడు శరీరం సైతం అంతరశుద్ధి లేకపోవడం వల్ల లోపల వాయువులు ఏర్పడి గుండెపై ఒత్తిడి పెరుగుతోంది. ఇందుకు గాను ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే లీటర్ నీటిని తాగి శరీరాన్ని అంతరశుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత ఉద్గీత ధ్యానయోగ(గట్టిగా ఓంకారం పలకడం)ను 20 సార్లు చేయాలి. –జి. మురళీకృష్ణ, యోగామాస్టర్, కర్నూలు -
Health Tips: గుండె ఆరోగ్యం.. ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే..
Best Diet For Heart Health And Weight Loss: ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బుల బారిన పడటం, కొందరు ఆకస్మాత్తుగా మృత్యువాత పడటాన్నీ చూస్తున్నాం, వింటున్నాం. గుండె ఆరోగ్యాన్ని పదికాలాలు పదిలంగా ఉంచుకోవాలంటే నిత్యం వ్యాయామం చేయడంతోపాటు సరైన పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. కొన్నిరకాల ఆహారాలు గుండె జబ్బులు వచ్చే అవకాశాలను పెంచుతాయి. కానీ కొన్ని మాత్రం గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. ఈ క్రమంలోనే గుండె ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన ఆహారం ఏమిటో, దానిని ఎందుకు, ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. ఫైబర్ ఎక్కువగా ఉండాలి.. ►నిత్యం మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. దీంతో గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. ►ఫైబర్ హైబీపీని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. దీంతో హార్ట్ స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి. ►ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి.ఇవి ఉన్న ఆహారాన్ని నిత్యం తీసుకోవాలి. ►దీంతో శరీరంలో వాపులు తగ్గుతాయి. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. ►చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి కనుక వాటిని తరచూ తినడం వల్ల గుండె వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. వెజిటేరియన్లు ఎలా? ►ఇక వెజిటేరియన్లు నట్స్, సీడ్స్ తినడం ద్వారా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి. ►బాదంపప్పు, వాల్నట్స్ వంటి వాటిని నిత్యం గుప్పెడు మోతాదులో తింటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ►వీటిల్లో ఉండే పోషకాలు గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి. ►నట్స్‌ను తినడం వల్ల అధిక బరువు తగ్గుతారు. అధిక బరువు తగ్గించుకుంటేనే.. ►అధికంగా బరువు ఉండడం వల్ల కూడా గుండె వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక బరువును ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి. అధికంగా బరువు ఉన్నవారు బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. దీనివల్ల గుండె వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ప్రొటీన్ ఫుడ్ ►ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవటం మంచిది. ►చికెన్, ఫిష్ పప్పులు, ఫ్యాట్ తక్కువ ఉన్న పాలూ, పాల పదార్ధాలూ, ఎగ్స్‌లో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. ►అదే విధంగా కూరగాయలూ, పండ్లలో విటమిన్స్, న్యూట్రియెంట్స్ లభిస్తాయి. వీటిలో కాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. కూరగాయలూ, పండ్లూ వంటివి శాకాహరం లో ఉండే కొన్ని గుణాలు కార్డియో వాస్క్యులర్ డిసీజెస్ రాకుండా చేస్తాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించుకునేందుకు.. ►సాల్మన్ ఫిష్, ట్యూనా, హెర్రింగ్ లాంటి చేపలు గుండెకు ఆరోగ్యకరం. ►వీటిలో గుండె కొట్టుకోవడంలో తేడానీ, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడాన్నీ, ట్రై గ్లిజరైడ్స్‌నూ తగ్గించే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ వీటిలో ఎక్కువుంటాయి. వారానికి కనీసం రెండు సార్లయినా ఈ చేపలు తింటే బెటరని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు చేసింది. ►ఓట్ మీల్ తింటే మంచిది. పీచు పదార్థం ఉండే ఈ ఓట్ మీల్ ఒంట్లో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ►జీర్ణకోశ మార్గంలో ఇది ఒక స్పాంజ్‌లా పనిచేసి, కొలెస్ట్రాల్‌ను నానిపోయేలా చేసి, రక్తంలో ఇంకిపోకుండా ఒంట్లో నుంచి తొలగిస్తుంది. హోల్ వీట్ బ్రెడ్ లాంటి తృణధాన్యాలతో చేసినవి తిన్నా మంచిదే. ►స్ట్రాబెర్రీలు, బ్లూ బెర్రీల లాంటివి తింటే, ఆ పండ్లలో ఉండే ఫైటోన్యూట్రియెంట్స్, పీచుపదార్థాలు రక్తనాళాల్ని వెడల్పు చేసి, గుండె పోటు వచ్చే అవకాశాలు తగ్గిస్తాయని ఒక పరిశోధనలో వెల్లడైంది. చాక్లెట్లు కూడా.. ►డార్క్ చాక్లెట్లు, అంటే కనీసం 60 నుంచి 70 శాతం కోకోతో తయారైన చాక్లెట్లు తింటే, అధిక రక్తపోటు, రక్తం ఊరిగే గట్టకట్టుకుపోవడం లాంటివి తగ్గుతాయి. ►అయితే, మామూలు మిల్క్ చాక్లెట్లు, క్యాండీ బార్ల వల్ల ఉపయోగం లేదు. అయితే వీటిని కూడా చాలా పరిమితంగా తీసుకోవాలి. వీటిని తీసుకుంటే.. ►విటమిన్ ‘సి’ ఎక్కువగా ఉండే బత్తాయిలు, కమలా పండ్ల లాంటి నిమ్మజాతి పండ్లు తినాలి. అయితే, ఈ పండ్ల రసాల్లో మళ్ళీ అతిగా పంచదార కలుపుకోకూడదు. ►సోయా పాలు, సోయా జున్ను (తోఫూ) తింటే ఒంటికి కావాల్సిన ప్రొటీన్లు వస్తాయి. ►అనారోగ్యకరమైన కొవ్వు, కొలెస్ట్రాల్ ఒంట్లో చేరవు. సోయా ప్రొటీన్లు ఒంట్లో చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఈ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో.. ►బంగాళదుంపలు అనగానే అతిగా పిండిపదార్థమని చాలామంది పక్కనపెడుతుంటారు. కానీ, అతిగా వేయించనంత వరకు బంగాళదుంపలు గుండెకు ప్రమాదకరం కావు. ►పొటాషియం ఎక్కువగా ఉండే వీటిలో ఫైబర్ ఉంటుంది. ►టొమాటోలలో కూడా గుండెకు ఆరోగ్యమిచ్చే పొటాషియం ఉంటుంది. ఇందులోని విటమిన్లు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ►గుప్పెడన్ని నట్స్ అంటే బాదంపప్పు, అక్రోటు కాయలు (వాల్నట్స్), వేరుసెనగ లాంటివి తగు మోతాదులో తినాలి. వాటిలో చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గించే విటమిన్ ‘ఇ’ ఉంటుంది. ►బచ్చలి కూర లాంటి ఆకుకూరలు గుండెకు అదనపు బలం ఇస్తాయి. ►దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. రోజూ నిర్ణీత మోతాదులో కనీసం మూడు నెలల పైగా దానిమ్మ రసం తాగితే, గుండెకు రక్తప్రసారం బాగా మెరుగవుతుంది. ►దానిమ్మ పండు గుండె రక్తనాళాల్లో పేరుకుపోయే అడ్డంకులు (ప్లాక్స్)నూ శుభ్రం చేస్తాయి. యాపిల్ పండ్లు కూడా. ►అవిశె గింజలలో (ఫ్లాక్ సీడ్స్) పీచు, ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వాటిని రోజుకు 20 గ్రాములు తింటే మేలు. చదవండి👉🏾Vitamin C Deficiency: విటమిన్ ‘సి’ లోపిస్తే అంతే సంగతులు.. ఇవి తింటే మేలు! చదవండి👉🏾Hair Fall Control Tips: జుట్టు రాలకుండా ఉండాలంటే..? -
షేన్ వార్న్ హఠాన్మరణం వెనుక విస్తుపోయే నిజాలు..!
Shane Warne Had Been On Extreme Liquid Diet Before Death: స్పిన్ మాంత్రికుడు, ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్(52) హఠాన్మరణంపై థాయ్ పోలీసులు జరిపిన విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూసాయి. తొందరగా బరువు తగ్గాలనే ఆలోచనలో వార్న్ 14 రోజుల కఠినమైన లిక్విడ్ డైట్ (ద్రవ రూపంలో ఉన్న ఆహారం) ఫాలో అయ్యాడని, ఇదే అతని మరణానికి పరోక్షంగా కారణమైందని అటాప్సి నివేదికలో వెల్లడైనట్లు తెలుస్తోంది. మృతి చెందడానికి ఒక్క రోజు ముందే వార్న్ తన డైట్ షెడ్యూల్‌ను పూర్తి చేశాడని, గతంలో కూడా అతను ఇలాంటి అర్థం పర్థం లేని డైట్లు ఫాలో అయ్యేవాడని వార్న్ మేనేజర్ జేమ్స్ ఎర్స్కిన్ తెలిపాడు. థాయ్‌లాండ్ వెకేషన్‌కు బయల్దేరే ముందు ఛాతీలో నొప్పి వస్తుందని, విపరీతంగా చమటలు పడుతున్నాయని వార్న్ తనతో చెప్పాడని ఎర్స్కిన్ వెల్లడించాడు. ఇటీవలే హార్ట్ చెకప్ కోసం డాక్టర్‌ను కూడా కలిశాడని ఆయన పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే, వార్న్ గుండెపోటుతోనే మరణించాడని అటాప్సి నివేదికలో వెల్లడైనట్లు థాయ్ పోలీసులు సోమవారం వెల్లడించారు. వార్న్ విల్లా గదిలో ఫ్లోర్‌తో పాటు టవల్స్‌పై రక్తపు మరకల్ని గుర్తించిన మాట వాస్తవమేనని, సీపీఆర్ చేసే క్రమంలో వార్న్ రక్తపు వాంతులు చేసుకున్నాడని వారు పేర్కొన్నారు. వార్న్ మరణానికి ముందు మద్యం తీసుకోలేదని, గత కొంతకాలంగా అతను మద్యం తీసుకున్నట్లు రుజువులు లేవని స్పష్టం చేశారు. Operation shred has started (10 days in) & the goal by July is to get back to this shape from a few years ago ! Let’s go 💪🏻👏🏻 #heathy #fitness #feelgoodfriday pic.twitter.com/EokgT2Hyhz — Shane Warne (@ShaneWarne) February 28, 2022 వార్న్‌కు గుండెపోటు రావడానికి కఠినమైన డైట్‌తో పాటు తీవ్రమైన వర్కౌట్స్ కారణమయ్యాయని, ఫిబ్రవరి 28 వార్న్ చేసిన ట్వీట్ ఇందుకు బలం చేకూరుస్తుందని వెల్లడించారు. వార్న్ చేసిన ట్వీట్లో తన ఫోటోను షేర్ చేసి మరికొద్ది రోజుల్లో ఇలా తయారవుతానని, ఆపరేషన్ ష్రెడ్ ప్రారంభమై 10 రోజులు అవుతుందని, జూలై కంతా ఫిట్‌గా తయారవ్వడమే లక్ష్యమని పేర్కొన్నాడు. కాగా, వెకేషన్ ఎంజాయ్ చేయడానికి థాయ్‌లాండ్‌కు వెళ్లిన వార్న్ శుక్రవారం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. వార్న్ అకాల మరణంపై యావత్ క్రీడా ప్రపంచం దిగ్బ్రాంతికి గురైంది. చదవండి: షేన్ వార్న్ మృతిపై అనుమానాలు.. గదిలో రక్తపు మరకలు..! -
ఆ ఆలోచనతో 30 శాతం మరణం ముప్పు తగ్గుతుంది: హార్వర్డ్ పరిశోధన
‘‘సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా...’’ అన్నాడో కవి. సంతోషం సగం బలమే కాదు.. పూర్తి మనోబలం అంటున్నారు శాస్త్రవేత్తలు. పొద్దునలేస్తే వాట్సాప్‌లో ‘పాజిటివ్ థింకింగ్’కోట్స్... యూట్యూబ్, షేర్‌చాట్ అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ ‘బీ పాజిటివ్’అంటూ వీడియోస్. చుట్టూ ఇన్ని సమస్యలు పెట్టుకుని ఈ పాజిటివ్ గోలేంట్రా!? అని అనుకోని వారుండరు. ‘ఎవరెన్నైనా అనుకోనివ్వండి ఆలోచన అనేది మానసికంగానే కాదు.. శారీరక ఆరోగ్యంపైనా ప్రభావం చూపిస్తుంది. ఆలోచన బాగుంటే చాలు... అంతా బాగుంటుంద’న్నది శాస్త్రవేత్తల మాట. అందులో నిజానిజాలేంటో నేడు ‘వరల్డ్ థింకింగ్ డే’ సందర్భంగా తెలుసుకుందాం. ‘ఆశ... క్యాన్సర్ ఉన్నవాడినైనా బతికిస్తుంది. భయం.. అల్సర్ ఉన్నవాడినైనా చంపేస్తుంది’అని ఓ సినిమాలో డైలాగ్. అది నిజమేనంటున్నారు శాస్త్రవేత్తలు. పెట్టుకునే ఆశ అయినా... పెంచుకునే భయం అయినా... ప్రభావితం చేసేది బ్రెయిన్. మనం ఏది చెప్తే అదే స్వీకరించే బ్రెయిన్.. శరీర భాగాలు అలాగే స్పందించేలా చేస్తుంది. ఏదైనా జబ్బుతో డాక్టర్ దగ్గరకు వెళ్తే.. ఆయన మిమ్మల్ని రిసీవ్ చేసుకున్న తీరు, ట్రీట్ చేసిన విధానం నచ్చకపోతే ఫలితం ఒకలా ఉంటుంది. చికిత్స ఇద్దరిదీ ఒకటే అయినా... డాక్టర్ రిసీవ్ చేసుకున్న విధానం, మీతో మాట్లాడిన తీరు, మీకిచ్చిన భరోసా బాగుంటే... అదే సగం జబ్బును తగ్గిస్తుంది. డాక్టర్ నుంచి వచ్చిన స్పందన, దాంతో వచ్చిన సంతృప్తి తాలూకు ఫలితం అది. ఇదే చాలా విషయాలకూ వర్తిస్తుందని సైంటిస్టులు అంటున్నారు. మరణం ముప్పు తగ్గుతుంది... సంతోషంగా సానుకూల దృక్పథంతో ఉంటే.. క్యాన్సర్ ముప్పును 16 శాతం తగ్గించుకోవచ్చు. హృద్రోగాలతో మరణించే రిస్క్‌ను 38 శాతం తగ్గించొచ్చు. శ్వాస సంబంధిత జబ్బుల మర ణాలనుంచీ 38% బయటపడొచ్చు. గుండెపోటుతో మరణించే రిస్క్‌ను 38% తగ్గించొచ్చు. ఇతర ఇన్ఫెక్షన్ల బారి నుంచి 52 శాతం తప్పించుకోవచ్చని అధ్యయనం వెల్లడించింది. సానుకూల ఆలోచనకు సంతోషానికి, ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉందని హార్వర్డ్ బృందం తెలిపింది. ఈ సానుకూల ధోరణి శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించి, యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలను పెంచుతుందట. అలాగే రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇవన్నీ కలిపి.. వివిధ జబ్బుల రిస్క్ నుంచి కాపాడతాయి. అవుట్‌కమ్ మీద ఆలోచనల ప్రభావం... కీడెంచి మేలెంచాలని సామెత. ఎప్పుడూ మేలే ఎంచాలనేది పాజిటివ్ థింకింగ్ థియరీ. ‘ఏదైనా చేయగలననుకుంటే.. మెదడు అటువైపు నడిపిస్తుంది. చేయలేననుకుంటే.. నీరుగారుస్తుంది’ అని న్యూజిలాండ్ విక్టోరియా యూనివర్సిటీకి చెందిన సైకాలజిస్టులు చెబుతున్నారు. ఇదేమీ మ్యాజిక్కాదు... ఆలోచనలే ఆచరణమీద ప్రభా వం చూపి అవుట్‌కమ్‌ను ప్రభావితం చేస్తాయట. యవ్వనం, ఫిట్నెస్కూడా మైండ్ గేమే అంటున్నారు. అయితే ప్రతీదానికి పాజిటివ్ ఉండమంటూ... మనిషిలో ప్రశ్నించే తత్వాన్ని దూరం చేస్తున్నారనే మరో వాదనా ఉంది. ఎనిమిదేళ్ల ఆయుష్షు... ఆలోచనలు సానుకూల దృక్పథంతో ఉంటే... అంత ఎక్కువ కాలం బతుకుతారని ఓ అధ్య య నం తేల్చి చెప్పింది. ఆలోచనా విధానం బాగుంటే చావును ఎనిమిదేళ్లు వాయిదా వేయొచ్చట. ఆలోచనా దృక్పథం ఆయుష్షును ఎనిమిదేళ్లు పెంచుతుందని శాస్త్రవేత్తల బృందం తెలిపింది. అం దులోనూ మహిళల్లో ఈ ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయని తేల్చి చెప్పింది. అందుకే... రోగులకు మంచి ఆహారం తీసుకోమని, వ్యాయామం చేయమని చెప్పడమే కాదు.. వారిని సానుకూల ఆలోచనలను వైపు నడిపించా లని పరిశోధక బృందానికి నాయ కత్వం వహించిన డాక్టర్ ఎరిక్కిమ్ వైద్యులకు సూచిస్తున్నారు. వాటివల్ల అనేక ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు. హార్వర్డ్ ఈ పరిశోధనను 70వేల మంది మహిళల మీదే జరిపినా... పురుషులకూ ఇదే వర్తిస్తుందని అంటున్నారు. వివిధ జబ్బులతో బాధపడుతున్న మహిళలను కొన్నేళ్లపాటు పరీక్షించగా.. సానుకూల దృక్పథంతో ఉన్నవారిలో మరణం ముప్పు 30% తగ్గిందట. -
మొదటిసారే తీవ్రమైన గుండెపోటు.. మరణానికి దారితీసే పరిస్థితి, ఎందుకిలా?
గుండెపోటు వచ్చినప్పుడు కొందరిలో మూడు సార్లు వస్తుందని కొందరిలో ఓ అభిప్రాయం ఉంది. కానీ మరికొందరు మాత్రం మొదటిసారి స్ట్రోక్కే చనిపోతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం. అన్ని కండరాల్లాగే గుండె కండరానికీ రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన రక్తనాళాలు ఉంటాయి. వాటి ద్వారానే గుండెకు అందాల్సిన ఆక్సిజన్, పోషకాలు అందుతుంటాయి. ఒకవేళ కొవ్వు పేరుకోవడం వంటి కారణాలతో రక్తనాళాలు ఆ పూడుకుపోతే గుండె కండరం చచ్చుబడిపోవడం మొదలవుతుంది. ఇదే ‘గుండెపోటు’ రూపంలో కనిపిస్తుంది. ఇలాంటి సమయాల్లో ఎంత వేగంగా గుండెకు అందాల్సిన రక్తాన్ని మళ్లీ పునరుద్ధరించగలిగితే అంతగా గుండెపోటు ప్రభావాన్ని తగ్గించవచ్చు. గుండెపోటుకు గురైన వ్యక్తిని వీలైనంత త్వరగా హాస్పిటల్‌కు తీసుకురావాలంటూ వైద్యులు చెప్పేది ఇందుకే. అయితే కొందరిలో గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన రక్తనాళాలన్నీ పూడుకుపోయి... హాస్పిటల్‌కు చేరేలోపే గుండె కండరం పూర్తిగా చచ్చుబడిపోతే.... గుండెకే కాదు... గుండెనుంచి మన దేహంలోని ఏ అవయవానికీ రక్తం సరఫరా కాదు. పైగా రక్తనాళాలు పూడుకుపోవడం క్రమంగా జరుగుతున్న కొద్దీ... రక్తసరఫరా సాఫీగా కొనసాగేందుకు పక్కనుంచి రక్తనాళాలు వృద్ధి చెందుతుంటాయి. (చదవండి: ఇకపై నిర్ణయించేది మేమే!) వాటినే కొల్లేటరల్స్ అంటారు. కానీ మొదటిసారే పూర్తిగా పూడుకుపోయిన పరిస్థితి ఉన్నప్పుడు కొల్లేటరల్స్ కూడా వృద్ధిచెందవు కాబట్టి గుండెకు రక్తం అందించేందుకు పక్కనాళాలూ ఉండవు. ఇలాంటి సమయాల్లోనే మొదటిసారే గుండెపోటు తీవ్రంగా వచ్చిందచి చెబుతుంటారు. రోగి మరణానికి దారితీసే ప్రమాదకరమైన స్థితి ఇది. అందుకే ముందునుంచీ జాగ్రత్తలు తీసుకుంటూ పూడిక ఉన్నప్పుడు స్టెంట్ వేయించడం, రక్తాన్ని పలుచబార్చే మందులు వాడటం, అన్ని ప్రధాన రక్తనాళాలూ పూడుకుపోయినప్పుడు అవసరాన్ని బట్టి గుండె శస్త్రచికిత్స చేయించడం వంటివి అవసరమవుతాయి. (చదవండి: మీరు బాగా అరుస్తున్నారా? అయితే, అరవండి ఇంకా అరవండి.. కానీ ఓ కండిషన్) -
టీ, కాఫీతో మతిమరుపుకు చెక్ పెట్టొచ్చిలా..! పక్షవాతం, స్ట్రోక్ కూడా..
Are You Drinking More Coffee And Tea A Day Must Know These Shocking Health Benefits: ప్రతి రోజూ రెండు కప్పుల టీ, అలాగే రెండు కప్పుల కాఫీ తాగేవారికి మతిమరపు సమస్య అంత తేలిగ్గా రాదని అంటున్నారు చైనా పరిశోధకులు. రోజూ రెండు కప్పుల చొప్పున టీ, కాఫీ తాగేవారిలో మతిమరుపు రావడం అన్నది... అలా తాగని వారితో పోల్చినప్పుడు దాదాపు 28 శాతం తక్కువని పేర్కొంటున్నారు డాక్టర్ యువాన్ ఝాంగ్, అతని బృందం. ఒక్కరూ ఇద్దరూ కాదు... దాదాపు అయిదు లక్షల మందిపై పదేళ్ల పాటు బ్రిటన్‌లో సుదీర్ఘ పరిశోధన చేశారు. చాలా పరిమితంగా అంటే రోజూ రెండు కప్పులకు మించకుండా కాఫీ, టీ తాగేవారిలో కేవలం మతిమరపు (డిమెన్షియా) మాత్రమే కాదు... పక్షవాతం వచ్చే అవకాశాలూ తక్కువే అంటున్నారు ఈ పరిశోధన నిర్వహించిన టియాంజిన్ మెడికల్ యూనివర్సిటీ అధ్యయనవేత్తలు. ఈ పరిశోధన పలితాలు ప్రముఖ జర్నల్ ‘ప్లాస్ మెడిసిన్’ (PLoS Medicine)లో ప్రచురితమయ్యాయి. అయితే ఇలా కాఫీ, టీల మీద పరిశోధనలు జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటివే చాలా సాగాయి. దాంతో ఈ ఫలితాల మీద కొంత ఎదురుదాడి కూడా జరుగుతోంది. రీడింగ్ యూనివర్సిటీకి చెందిన ప్రయుఖ న్యూట్రిషనల్ సైన్సెస్ నిపుణురాలు డాక్టర్ కార్లోట్ మిల్స్ మాట్లాడుతూ... ఇలాంటి పరిశోధనలు గతంలోనూ జరిగిన మాట వాస్తవమేననీ, అయితే మతిమరపు నివారణకు కేవలం కాఫీ, టీలు మాత్రమే దోహద పడి ఉండకపోవచ్చనీ, ఇతర అంశాలూ కారణమయ్యే అవకాశాలూ లేకపోలేదని అన్నారు. ఈ నేపథ్యంలో మరికొందరు సైతం ఈ పరిశోధన ఫలితాల వెల్లడిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాఫీ, టీలలో మెదడు, నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచే పదార్థాలుండే మాట వాస్తవమే. అయినప్పటికీ వాటిని పరిమితికి మించి తీసుకుంటూ ఉంటే కలిగే ప్రమాదాల గురించి హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు గతంలో ఆస్ట్రేలియాలో నిర్వహించిన ఒక అధ్యయనంలో రోజుకు ఆరు కప్పులకు మించి కాఫీ/టీ తాగేవారిలో 53%మందికి డిమెన్షియా వస్తుందని తేలిన ఫలితాలను వారు ఉటంకిస్తున్నారు. అందుకే ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ‘‘రెండంటే రెండే’’ అన్న పరిమితికి కట్టుబడాలంటూ గట్టిగా చెబుతున్నారు. చదవండి: Worlds Most Dangerous Foods: అత్యంత విషపూరితమైన వంటకాలు.. ప్రాణాలను పణంగా పెట్టి మరీ తింటారట!! -
సరదాగా గడిపేందుకు వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కుటుంబంలో విషాదం
సెలవు రోజు సరదాగా గడిపేందుకు వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కుటుంబం విషాదంలో మునిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగికి గుండెపోటు రావడంతో కారు అదుపుతప్పింది. ఆయన మృతి చెందగా, భార్య తీవ్రంగా గాయపడింది. చిన్నారులిద్దరూ ప్రాణాలతో బయటపడిన సంఘటన వరదయ్యపాళెం మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. తాగిన మైకంలో నడి రోడ్డుపై పడిపోయిన కుమారుడిని తండ్రి పక్కకు లాగుతుండగా కారు ఢీ కొనడంతో ఆ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శ్రీరంగరాజపురం మండలంలో జరిగింది. సాక్షి, వరదయ్యపాళెం (చిత్తూరు): సరదా కోసం ఉబ్బలమడుగు పర్యాటక కేంద్రానికి వెళ్లిన కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి వరదయ్యపాళెం పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సత్యవేడు మండలం చిగురుపాళెం గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. సెలవులకు తన స్వగ్రామమైన చిగురుపాళెంకు వచ్చిన ప్రభాకర్ రెడ్డి ఆదివారం ఉదయం తన భార్య, ఇద్దరు పిల్లలతో కలసి ఉబ్బలమడుగు పర్యాటక కేంద్రం సందర్శనకు వెళ్లారు. అక్కడ జలపాతాల వద్ద సరదాగా గడిపారు. మధ్యాహ్నం ప్రభాకర్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురవడంతో ఆయనే కారు నడుపుతూ తిరుగు పయనమయ్యారు. దరఖాస్తు గ్రామం వద్ద ప్రభాకర్ రెడ్డి గుండపోటుకు గురవడంతో, కారు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రభాకర్ రెడ్డి అపస్మారక స్థితిలోకి చేరుకోగా, భార్య రజితకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి 108లో బాధితులను సత్యవేడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రభాకర్ రెడ్డి మార్గమధ్యంలోనే మృతి చెందారు. భార్య రజిత ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇద్దరు పిల్లలు బోరున విలపించడం స్థానికులను కలచివేసింది. ఎస్ఐ పురుషోత్తం రెడ్డి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కన్నుమూత
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ ఎండీ కరీమున్నిసా గుండెపోటుతో శుక్రవారం అర్థరాత్రి మృతి చెందారు. శాసనమండలి సమావేశానంతరం ఇంటికి వచ్చిన ఆమె రాత్రి 11.30 గంటల సమయంలో ఛాతిలో నొప్పి వస్తోందని చెప్పడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రెండు హాస్పటల్స్‌కు తరలించినా ఫలితం లేకపోయింది. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి కరీమున్నీసా పార్టీకోసం నిరంతరం శ్రమించారు. ఈ ఏడాది ఎమ్మెల్సీగా ఆమెకు సీఎం జగన్ అవకాశం కల్పించారు. శుక్రవారం ఉదయం శాసనమండలిలో ఆమె సీఎం జగన్, శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజును కలిశారు. కరీమున్నీసాకు భర్త, ఐదుగురు కుమారులు ఉన్నారు. సీఎం వైఎస్ జగన్ సంతాపం ► ఎమ్మెల్సీ కరీమున్నీసా హఠాన్మరణం పట్ల సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘ నా సోదరి మహ్మద్ కరీమున్నీసా ఆకస్మిక మరణం తీవ్రంగా కలిచివేసింది. నిన్న శాసనమండలికి హాజరై రాత్రి అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించడం బాధాకరం. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. వారికి నాతో సహా పార్టీ అండగా ఉంటుంది’ అని ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. నా సోదరి మహ్మద్ కరీమున్నీసా ఆకస్మిక మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. నిన్న శాసనమండలికి హాజరై రాత్రి అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించడం చాలా బాధాకరం. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. వారికి నాతో సహా పార్టీ అండగా ఉంటుంది. — YS Jagan Mohan Reddy (@ysjagan) November 20, 2021 -
ఎంతటి విషాదం.. స్కూటీపై వెళ్తుండగానే గుండెపోటు.. వీడియో వైరల్
సాక్షి, మహబూబ్ నగర్: జడ్చర్ల పట్టణానికి చెందిన రాజు అనే ఓ యువకుడు వాహనంపై వెళుతుండగానే గుండెపోటు రావడంతో.. అక్కడికక్కడే మృతిచెందాడు. పట్టణంలోని పాత బజార్‌కు చెందిన ఇరవై ఆరేళ్ల రాజు ప్రైవేట్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ సాయంత్రం తనకు గుండెల్లో నొప్పిగా ఉందని మిత్రులతో చెప్పగా.. ఓ మిత్రుడు తన స్కూటీపై రాజును తీసుకొని ఆసుపత్రికి బయలుదేరాడు. కాగా మార్గమధ్యంలోనే గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడం.. వాటిని సోషల్ మీడియా ద్వారా చూసిన ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. చదవండి: (ExtraMarital Affair: మామా నీ కూతుర్ని చంపేశా..) -
పది రోజుల్లో వివాహ నిశ్చితార్థం.. యువ వైద్యుడి మృతి
సాక్షి, హైదరాబాద్: స్నేహితుడి నిశ్చితార్థానికి అతని సొంతూరుకు వెళ్దామని ఆనందంతో ఉన్న మిత్రులు.. ఆ స్నేహితుడి మృతదేహాన్నే తీసుకువెళ్లాల్సి రావడం కలలో కూడా అనుకోలేదని కన్నీటిపర్యంతమవుతున్నారు. 29 ఏళ్లకే నిండు నూరేళ్లు నిండాయని భోరున విలపిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో యువ వైద్యుడు పూర్ణచంద్ర బుధవారం గుండెపోటుతో కన్నుమూశారు. ► ఏపీలోని గుంటూరు జిల్లా నిజాంపట్నంకు చెందిన తునుగుంట్ల పూర్ణచంద్ర గుప్తా (29) చినకాకాని ఎన్ఆర్ఐ కాలేజీలో ఎంబీబీఎస్, గాంధీ మెడికల్ కాలేజీ జనరల్ సర్జరీ విభాగంలో ఎండీ ఎంఎస్ చదువుకున్నారు. ► గాంధీలోనే సీనియర్ రెసిడెంట్ (ఎస్ఆర్)గా విధులు నిర్వర్తించి ఈ ఏడాది జూలైలో పూర్తి చేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యవిద్య ప్రవేశ పరీక్షల ప్రిపరేషన్ కోసం స్నేహితులతో కలిసి పద్మారావునగర్‌లో ఉంటున్నారు. వారం రోజుల క్రితం ఆయనకు గుండెలో స్వల్పంగా నొప్పి రావడంతో గాంధీలో వైద్యపరీక్షలు చేయించుకున్నారు. నివేదికలన్నీ నార్మల్‌గానే వచ్చాయి. ► బుధవారం ఉదయం 5 గంటలకు మరోసారి ఛాతిలో నొప్పి రావడంతో ఎసిడిటీ అనుకుని గాంధీ ఆస్పత్రికి వచ్చి ఇంజక్షన్ తీసుకున్నారు. పద్మారావునగర్‌లోని గదికి వెళ్లవద్దని, అత్యవసర విభాగ భవనం పైనున్న పీజీ హాస్టల్లో ఉండాలని సహచర వైద్యుల సూచన మేరకు మెట్ల మార్గంలో వెళ్తున్న క్రమంలో తీవ్రస్థాయిలో హార్ట్ ఎటాక్ రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. వైద్యులు అతడిని ఐసీయూలో అడ్మిట్ చేసి తీ వ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది. పది రోజుల్లో నిశ్చితార్థం.. పూర్ణచంద్ర గుప్తాకు మరో పది రోజుల్లో వివాహ నిశ్చితార్థం జరగాల్సి ఉంది. గతంలోనే ఆయన తల్లి చనిపోయింది. వెన్నెముక ఆపరేషన్ చేయించుకుని బెడ్‌కే పరిమితమైన తండ్రి బాగోగుల్ని సోదరుడు చూస్తున్నాడు. పూర్ణచంద్ర కోరిక మేరకు నిశ్చితార్థానికి వైద్య మిత్రులంతా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇంతలోనే మృత్యువు కబళించడంతో అంత్యక్రియలకు స్నేహితుని మృతదేహాన్ని తీసుకుని ఆయన సొంతూరుకు వెళ్తున్నామని భోరుమన్నారు. పూర్ణచంద్ర గుప్తా మృతదేహానికి గాంధీ ప్రిన్సిపాల్ ప్రకాశరావు, సూపరింటెండెంట్ రాజారావు, వైద్యులు నివాళులర్పించారు. -
గుండెపోటుతో మాజీ ఉపాధ్యక్షుడి మృతి
సాక్షి, రాయచూరు(కర్ణాటక): రాయచూరు నగరసభ మాజీ ఉపాధ్యక్షుడు, బీజేపీ నేత దొడ్డమల్లేశ్ (50) గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం ఉదయం వాకింగ్ వెళ్లే సమయంలో ఆకస్మికంగా గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. రెండుసార్లు నగరసభ సభ్యుడిగా, బీజేపీ నగర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన మృతి పట్ల నగరసభ అధ్యక్షుడు వినయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి, పలువురు సంతాపం వ్యక్తం చేశారు. -
పునీత్ మరణం: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం
బెంగళూరు(కర్ణాటక): కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ మరణం అనంతరం ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా కర్ణాటక ఆరోగ్య మంత్రి కె సుధాకర్ మాట్లాడుతూ.. ఇక నుంచి జిమ్‌లు, ఫిట్నెస్ సెంటర్లలలో ట్రైనర్లకు ప్రథమ చికిత్స, ప్రత్యేక శిక్షణపై మార్గదర్శకాలను జారీచేస్తామని తెలిపారు. జిమ్‌లో వర్కవుట్స్ సమయంలో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తామని తెలిపారు. అదే విధంగా, ట్రైనర్ పర్యవేక్షణ లేకుండా అధిక బరువులు ఎత్తకుండా జిమ్ నిర్వాహకులు చూడాలన్నారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కె సుధాకర్, పలువురు కార్డియాలజిస్ట్‌లతో సమస్యను చర్చించి మరిన్ని మార్గదర్శకాలను జారీచేస్తామని పేర్కొన్నారు. కాగా, గత ఆదివారం 46 ఏళ్ల వయసులో జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ గుండెపోటుతో.. కన్నడ నటుడు పునీత్‌రాజ్ కుమార్ మృతి చెందిన విషయం తెలిసిందే. -
అమెరికాలో నిజామాబాద్ యువకుడి మృతి
సాక్షి, నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని మారుతినగర్‌కు చెందిన సాయి సుశాంత్(30) అనే యువకుడు గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబీకులు సోమవారం తెలిపారు. అమెరికాలోని బీచిగాన్ రాష్ట్రంలో పవర్ ఇండస్ట్రీలో స్టాఫ్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సుశాంత్ ఈనెల 12న ఆకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. నేడు జిల్లాకు మృతదేహం రానున్నట్లు కుటుంబీకులు తెలిపారు. కాగా తండ్రి సుధాకర్‌నాయక్ గతంలో బీసీ సంక్షేమశాఖ అధికారిగా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. -
భార్య కళ్లముందే గుండెపోటుతో భర్త మృతి
కొత్తవలస: ఆయన రైల్వే విశ్రాంత ఉద్యోగి. ఇంటి ఖర్చులకు డబ్బులు అవసరం కావడంతో భార్యతో కలిసి బయలుదేరారు. ఇద్దరూ ఒకరికి ఒకరు తోడుగా.. కష్టసుఖాలు చెప్పుకుంటూ బ్యాంకు వద్దకు చేరుకున్నారు. బ్యాంకు మెట్లు ఎక్కనేలేదు. అక్కడ ఉన్న ఏటీఎం వద్ద ఒక్కసారిగా వృద్ధుడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందో వృద్ధురాలైన భార్య తెలుసుకునేలోపే ప్రాణం విడిచిన హృదయవిదారక ఘటన కొత్తవలస స్టేట్‌బ్యాంకు వద్ద గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఎల్.కోట మండలం మల్లివీడు గ్రామానికి చెందిన బోదం తాతాలు(75) రైల్వేలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఈయన ఇద్దరు పిల్లలకు వివాహాలు కావడంతో హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ మల్లివీడులో ఉంటున్నారు. పెన్షన్ డబ్బుల డ్రా చేసేందుకు భార్య రాములమ్మతో కలిసి బ్యాంకుకు బయలుదేరారు. బ్యాంకులోకి వెళ్లక ముందే తాతాలు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. స్థానికులు వచ్చి సపర్యలు చేసినా ఫలితం లేకపోయింది. భర్త మృతితో రాములమ్మ కన్నీటిపర్యంతమైంది. బంధువులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన చేరుకుని మృతుడిని ఆటోలో స్వగ్రామానికి తరలించారు. చదవండి: (భార్యపై కోపంతో కారు, 4 బైకులకు నిప్పు పెట్టిన ఐటీ ఉద్యోగి) -
గుండెపోటు వస్తే.. ఇలా ప్రాణాలు కాపాడొచ్చు
సాక్షి, హైదరాబాద్: ఓ పోలీసాఫీసర్.. డ్యూటీలో ఉంటాడు.. తనపై ఏదో విష ప్రయోగం జరుగుతుంది.. ఛాతీలో నొప్పి మొదలై గుండెపోటు వస్తుంది. అది గుర్తించిన ఆయన మెల్లగా కారు దగ్గరికి వెళ్తాడు.. అందులో ఉన్న ఓ పరికరంతో ఛాతీపై షాక్ ఇచ్చుకుంటాడు. గుండెపోటు నుంచి బయటపడతాడు.. ఇదంతా ‘కాసినో రాయల్’జేమ్స్‌బాండ్ సినిమాలో ఓ సీన్. అందులో షాక్ ఇచ్చుకున్న పరికరం ‘ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్’. ఇదేదో సినిమా అని కాదు. నిజంగా పనిచేసే పరికరం. గుండెపోటు వచ్చినవారి ప్రాణాలను కాపాడే పరికరం. అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లో ఇలాంటి పరికరాలు విస్తృతంగా అందుబాటులో ఉంటాయి. పెద్ద బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలోనూ సిద్ధంగా ఉంచుతారు. కానీ మన దగ్గర మాత్రం ముఖ్యమంత్రుల కాన్వాయ్‌లో కూడా ఈ పరికరాలు లేని పరిస్థితి ఉందని నిపుణులు చెప్తున్నారు. కోవిడ్ ప్రభావంతో గుండె సమస్యలు పెరిగి.. కరోనా మొదలైనప్పటి నుంచీ.. వైరస్ ప్రభావంతోపాటు పలు ఇతర కారణాలతో గుండె సమస్యలు పెరిగాయి. 25 ఏళ్లవారి నుంచి వృద్ధుల వరకు గుండెపోటు బారినపడుతున్నారు. ఆకస్మికంగా వచ్చే ఈ సమస్యకు తక్షణమే ప్రాథమిక చికిత్స అందించకుంటే పరిస్థితి చేయిదాటుతుంది. ఎవరైనా గుండెపోటుకు గురైతే ఐదారు నిమిషాల్లోగా కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) చేస్తూ, ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేషన్ (ఏఈడీ) పరికరంతో షాక్ ఇస్తే.. ప్రాణాపాయం నుంచి 70–80 శాతం వరకు కాపాడొచ్చు. కానీ మన దేశంలో ఇటువంటి వాటిపై తగిన అవగాహన లేదు. పాశ్చాత్య దేశాల్లో ప్రజలకు సీపీఆర్‌పై శిక్షణ ఇస్తారు. అమెరికా, పలు యూరప్ దేశాల్లో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలోనూ ఏఈడీలు అందుబాటులో ఉంటాయి. ఎవరికైనా గుండెపోటు వస్తే వెంటనే ప్రాథమిక చికిత్స అందుతుంది. ఈ పరికరం ధర లక్ష రూపాయలలోపే ఉంటుంది. ఇంత ప్రాధాన్యమున్న ఈ పరికరాన్ని మన దగ్గర సీఎం కాన్వాయ్‌లలోనూ పెట్టడం లేదని.. అంటే ఈ విషయంగా ఎంత వెనుకబడి ఉన్నామో అర్థం చేసుకోవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. మన దేశంలో కేవలం 2 శాతం మందికే సీపీఆర్ తదితర అంశాలపై అవగాహన, చైతన్యం ఉందని చెప్తున్నారు. ప్రాణాలు కాపాడొచ్చు.. గుండెపోటుకు గురైనవారికి ఆస్పత్రికి తరలించే లోపు ప్రాథమిక చికిత్స అందించే ప్రక్రియను ‘బేసిక్ లైఫ్ సపోర్ట్ లేదా కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్)’అంటారు. ఛాతీపై తగిన విధంగా అదుముతూ ఉండటం, నోటిద్వారా ఊపిరి అందించడం వంటి పలు ప్రక్రియలు దీనిలో భాగంగా ఉంటాయి. డాక్టర్లు, నర్సులు వంటి వైద్య సిబ్బంది మాత్రమే కాకుండా సాధారణ ప్రజలకు కూడా వీటిపై అవగాహన కల్పిస్తే.. ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడొచ్చు. గుండెపోటు వచ్చిన తర్వాత ప్రతీ నిమిషం ఆలస్యానికి ఏడెనిమిది శాతం ప్రాణాపాయం పెరుగుతుంది. ఎంత త్వరగా సీపీఆర్ చేస్తే.. అంతగా కాపాడే అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.7 కోట్ల మంది గుండె జబ్బులతో మరణిస్తున్నారు. మన దేశంలోనూ గుండె జబ్బులతో చనిపోయేవారిలో 60 శాతం మంది సడన్ కార్డియాక్ షాక్ ద్వారానే మరణిస్తున్నారు. ఇందులో చాలా వరకు ఇళ్లలో, బయట ఇతర ప్రదేశాల్లో జరుగుతున్నవేనని.. సీపీఆర్ శిక్షణ, ఏఈడీ పరికరాలను అందుబాటులో ఉంచితే చాలా మందిని రక్షించవచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సామాన్య ప్రజల్లో అవగాహన కల్పించాలి గుండెపోటు వచ్చినప్పుడు ఎంత త్వరగా స్పందించి సీపీఆర్, ఏఈడీలతో ప్రాథమిక చికిత్స చేస్తే అంత బాగా ఫలితం ఉంటుంది. కోవిడ్‌తో గుండె సంబంధిత సమస్యలు, గుండెపోట్లు పెరుగుతున్నాయి. అందువల్ల సీపీఆర్, ఏఈడీ తదితర అంశాల్లో ప్రజల్లో విస్తృతంగా చైతన్యం కల్పించాలి. శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. కొన్ని నగరాల్లో సామాన్య ప్రజానీకానికి ఏఈడీ అందుబాటులో ఉంది. ఉదాహరణకు పాశ్చాత్య దేశాల్లో మాల్స్, మల్టీప్లెక్సులు, ఎయిర్‌పోర్టుల్లో అందుబాటులో ఉంటాయి. – డాక్టర్ విజయ్‌రావు, ఎండీ (యూఎస్), రిససియేషన్ మెడిసిన్, హైదరాబాద్ -
ఘంటసాల కుమారుడు కన్నుమూత
చెన్నై: సుప్రసిద్ధ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు రెండో కుమారుడు రత్న కుమార్ కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని కావేరి హాస్పిటల్లో చేరిన ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇంతకుముందే ఆయనకు కరోనా సోకగా, రెండు రోజుల క్రితమే కోవిడ్ నెగిటివ్ వచ్చింది. అయితే చాలాకాలంగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతూ డయాలసిస్‌పై ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన నేడు మరణించారు. రత్నకుమార్ ఆకస్మిక మరణంతో ఘంటసాల కుటుంబంలో విషాదం నెలకొంది. రత్నకుమార్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఘంటసాల, సావిత్రి దంపతుల రెండో కుమారుడే రత్న కుమార్. ఈయన ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. ఒకానొక సందర్భంలో ఏకధాటిగా ఎనిమిది గంటల పాటు డబ్బింగ్ చెప్పి రత్నకుమార్ రికార్డు సృష్టించారు. తెలుగు, తమిళ, మలయాళ సహా వివిధ భాషల్లో కొన్ని వేల సినిమాలకు, సీరియల్స్‌కు రత్నకుమార్ డబ్బింగ్ చెప్పారు. చదవండి : ఎవరింట్లోనైనా నాన్న అలాగే ఉంటాడు! 'తొమ్మిదో ఏట వివాహం.. అప్పుడు నా భార్యకు మూడేళ్లు' -
మాయమాటలతో మభ్యపెట్టి అత్యాచారం.. షాక్‌కు గురై గుండెపోటు
మరిపెడ రూరల్: ఓ యువకుడు మాయమాటలతో మభ్యపెట్టి గిరిజన బాలికపై అత్యాచారం చేశాడు. అయితే.. ఊహించని షాక్‌కు గురైన ఆమె గుండెపోటుతో మృతిచెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటన శనివారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సీతారాం తండాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన మోడు లక్పతి, వసంత దంపతుల కుమార్తె ఉష (17) ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తండ్రి లక్పతికి మహబూబాబాద్ జాతీయ రహదారిపై పెట్రోల్ బంక్ వద్ద కిరాణ దుకాణం ఉంది. ఇటీవల ఆయన కాలు విరగడంతో షాపులో ఉన్న సరుకులు తీసుకురావాలని శనివారం కూతురు ఉషను పంపించాడు. అదే సమయంలో ధర్మారం గ్రామానికి చెందిన ధరంసోత్ రాజేశ్ దుకాణం వద్దకు వచ్చాడు. ఉషకు మాయమాటలు చెప్పి సమీపంలోని గుట్టల ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. తర్వాత ఏమీ తెలియనట్లు తన స్నేహితుడు, సీతారాం తండాకు చెందిన శ్రీనుకు ఫోన్ చేసి నీళ్లు తీసుకురావాలని సూచించాడు. అతను తన స్నేహితుడైన శంకర్‌తో కలసి వచ్చే సరికి ఉష స్పృహ తప్పి ఉంది. దీంతో ముగ్గురు కలసి ఆమెను పురుషోత్తమాయగూడెంలోని ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా.. అతను మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించాడు. ఈలోపు విషయం తెలిసి కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చారు. వెంటనే మహబూబాబాద్ ఆస్పత్రికి తరలించగా.. ఉష అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మా బిడ్డను పొట్టన పెట్టుకున్నారు అమాయకురాలైన తమ బిడ్డకు మాయమాటలు చెప్పి అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని ఉష తల్లిదండ్రులు లక్పతి, వసంత బోరున విలపించారు. ఈ ఘటనలో రాజేశ్‌తో పాటు మరికొందరి ప్రమేయం ఉందని వారు ఆరోపించారు. కాగా, ఉషపై రాజేశ్ ఒక్కడే అఘాయిత్యానికి పాల్పడ్డాడా..?, మరెవరైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఉష మృతదేహాన్ని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పరిశీలించారు. అనంతరం తొర్రూరు డీఎస్పీ వెంకటరమణతో కలసి ఘటనా స్థలం వద్ద విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రాజేశ్, ఉష ఇద్దరూ గుట్టల వైపు వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారన్నారు. నిందితుడిపై పోక్సోతో పాటు 376, 302 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. కాగా, నిందితుడిని కఠినంగా శిక్షించాలని మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. కలెక్టర్ గౌతం కూడామృతురాలి బంధువులను ఓదార్చారు. అయితే, మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించే క్రమంలో ఆమె బంధువులు ఆందోళనకు దిగగా, పోలీసులు నచ్చచెప్పి పంపించారు. కాగా, ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విచారణ జరపండి.. ఎస్పీకి మహిళా కమిషన్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా మర్రిపెడ మండలం సీతారాం తండాకు చెందిన బాలికపై అత్యాచారం, హత్య ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక సమరి్పంచాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ సునితాలక్ష్మారెడ్డి ఆదేశించారు. బాధితురాలి కుటుంబాన్ని ప్రభుత్వం తరపున ఆదుకుంటామని ఆమె భరోసా ఇచ్చారు. -
గుండెపోటుతో క్రికెట్ కోచ్ కన్నుమూత.. విషాదంలో కోహ్లి
ఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చిన్ననాటి కోచ్ సురేశ్ బాత్రా శనివారం గుండెపోటుతో మరణించారు. 53 ఏళ్ల సురేశ్ ప్రస్తుతం ఢిల్లీ క్రికెట్ అకాడమీలో అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. కోహ్లి టీనేజ్ వయసులో ఉన్నప్పుడు సురేశ్ బాత్రా అతనికి బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించారు. కోహ్లి బ్యాటింగ్ స్టైల్లో మార్పు రావడంలో సురేశ్ కీలకపాత్ర పోషించారు. కాగా ఢిల్లీ క్రికెట్ అకాడమీలో హెడ్ కోచ్‌గా ఉన్న రాజ్‌కుమార్ శర్మ ట్విటర్లో స్పందించారు. ' నేను ఈరోజు నా తమ్ముడిని కోల్పోయాను. సురేశ్‌బాత్రాతో నాకు 1985 నుంచి ప్రత్యేక అనుబంధం ఉంది. ఎందరో క్రికెటర్లను తయారు చేసిన సురేశ్ కోహ్లికి కూడా కోచ్‌గా వ్యవహరించాడు. అతని మృతి మాకు తీరని లోటు అంటూ ట్వీట్ చేశారు. కాగా కోహ్లి ప్రస్తుతం డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేందుకు టీమిండియాతో కలిసి జూన్ 2న ఇంగ్లండ్ బయల్దేరనున్నాడు. కివీస్‌తో టెస్టు చాంపియన్‌షిప్ ముగిసిన అనంతరం టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. చదవండి: 'కోహ్లిని ఉదాహరణగా తీసుకోమని చెప్పా' Suresh Batra (striped t-shirt), who coached @imVkohli when he was a teenager, passed away on Thursday. He had finished his daily morning puja and collapsed. He was 53. "I lost my younger brother. Knew him since 1985," said Rajkumar Sharma. May his soul Rest in Peace.... pic.twitter.com/pW3avt6NpP — Vijay Lokapally (@vijaylokapally) May 21, 2021 -
గుండె స్పందనల వేగం పెరిగిందా?
సాధారణంగా మన గుండె మామూలుగా నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకోవాలి. అలా కాకుండా 60 కన్నా తగ్గినా లేదా 100 కన్నా పెరిగినా ఆ కండిషన్‌ను అరిథ్మియా అంటారు. కానీ ఎవరైనా తీవ్ర భయాందోళనలకు గురైనప్పుడు, వ్యాయామం చేసినప్పుడు గుండె వేగం 100 నుంచి 160 మధ్యన ఉంటుంది. ఇలా గుండె వేగం పెరిగిన కండిషన్‌ను సైనస్ టాకికార్డియా అంటారు. ఇలా కాకుండానే గుండె వేగం దానంతట అదే ఇంకా పెరిగితే అది జబ్బువల్ల కావచ్చు. ఈ లక్షణంతో మరికొన్ని రకాల గుండెజబ్బులు ఉండవచ్చు. సమస్య ఏదైనా గుండె వేగం మరింత పెరిగినా లేదా తగ్గినా స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. ఇలాంటి వారు కార్డియాలజిస్ట్‌ని కలిసి ఈసీజీ, ఎకో, హోల్టర్ పరీక్షలల్లాంటివి చేయించాలి. ఓ వ్యక్తి అలా స్పృహ కోల్పోడానికి గుండె జబ్బే కారణమా, మరి ఇంకేదైనా సమస్య వల్ల ఇలా జరిగిందా తెలుసుకొని దానికి తగిన విధంగా చికిత్స తీసుకోవడం అవసరం. -
నిలకడగా ‘దాదా’ ఆరోగ్యం
కోల్‌కతా: భారత మాజీ కెప్టెన్, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్వల్ప స్థాయి గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబసభ్యులు వెంటనే నగరంలోని వుడ్‌ల్యాండ్ ఆసుపత్రికి తరలించారు. వైద్యపరీక్షల అనంతరం యాంజియోప్లాస్టీ చేశారు. ఇందులో మూడు పూడికల్ని (బ్లాకులు) గుర్తించారు. ప్రస్తుతం గంగూలీని ఇంటెన్సివ్ క్రిటికల్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచిన నిపుణులైన వైద్యబృందం ఎప్పటికప్పుడు అతని ఆరోగ్యస్థితిని పరిశీలిస్తోంది. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. టీమిండియా విజయవంతమైన మాజీ కెప్టెన్ గంగూలీ అనారోగ్యం అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. గంగూలీ భార్య డోనా, కూతురు సనా విషయం తెలుసుకున్న బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, గవర్నర్ జగదీప్ ధన్కర్, రాష్ట్ర బీజేపీ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రతాప్ బెనర్జీ, బెంగాల్ క్రికెట్ సంఘం (సీఏబీ) అధ్యక్షుడు అవిశేక్ దాల్మియా ఆసుపత్రికి వెళ్లి గంగూలీని పరామర్శించి అతను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 48 ఏళ్ల గంగూలీ 1992లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తన 16 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో 113 టెస్టుల్లో, 311 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. గంగూలీ కెప్టెన్సీలో భారత్ 49 టెస్టులు ఆడి 21 విజయాలు సాధించింది. 13 టెస్టుల్లో ఓడి, 15 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. వన్డేల్లో గంగూలీ నాయకత్వంలో టీమిండియా 146 మ్యాచ్‌లు ఆడింది. 76 మ్యాచ్‌ల్లో గెలిచి, 65 మ్యాచ్‌ల్లో ఓడింది. మరో ఐదు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. 2015 నుంచి 2019 వరకు బెంగాల్ క్రికెట్ సంఘం (సీఏబీ) అధ్యక్షుడిగా వ్యవహరించిన గంగూలీ 2019 అక్టోబర్‌లో బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఆసుపత్రిలో గంగూలీని పరామర్శించిన బెంగాల్ సీఎం మమత బెనర్జీ ట్రెడ్‌మిల్‌పై నడుస్తుండగా... నిజానికి శుక్రవారం రాత్రే గంగూలీకి ఛాతీలో కాస్త అసౌకర్యంగా అనిపించింది. అయినాసరే ఉదయం తన రోజువారీ దైనందిన పనులకు ఉపక్రమించాడు. ఈ క్రమంలోనే సాధారణ వర్కౌట్లు చేశాడు. ట్రెడ్‌మిల్‌పై నడుస్తుండగా అతనికి ఛాతీనొప్పి వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆలస్యం చేయకుండా స్థానిక వుడ్‌ల్యాండ్ ఆస్పత్రిలో చేర్పించారు. ముందుగా హృదయ సంబంధిత పరీక్షలన్నీ చేసిన వైద్య బృందం ఈసీజీ, ఎకో టెస్టుల తేడాల్ని పరీశిలించింది. డాక్టర్ సరోజ్ మండల్ నేతృత్వంలోని వైద్యబృందం గంగూలీ స్వల్ప గుండెపోటుకు గురైనట్లు నిర్ధారించింది. అలాగే అతని కుటుంబీకుల్లో హృద్రోగుల చరిత్ర ఉండటంతో వెంటనే కరోనరీ యాంజియోప్లాస్టీ నిర్వహించింది. ‘దాదాకు స్వల్ప గుండెపోటు వచ్చింది. పరీక్షల్లో గుండె మూడు రక్తనాళాలు బ్లాక్ అయినట్లు గుర్తించాం. దీంతో యాంజియోప్లాస్టీ చేసి అత్యవసరమైన చోట ఒక స్టంట్ వేశాం. ఇప్పుడైతే అతను స్పృహలోనే ఉన్నాడు. అతని ఆరోగ్యం కూడా నిలకడగానే ఉంది. అయితే మూణ్నాలుగు రోజుల పాటు అత్యవసర విభాగంలోని వైద్యనిపుణుల పర్యవేక్షణలోనే ఉంచుతాం. ఆరోగ్యస్థితిని అంచనా వేస్తాం. ఇంకా స్టంట్ల అవసరం ఉంటే పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. ఇది మినహా అతని బీపీ, షుగర్ ఇతరత్రా అన్ని పరీక్షల ఫలితాలు సాధారణ స్థితిలోనే ఉన్నాయి’ అని డాక్టర్ సరోజ్ మండల్ వివరించారు. త్వరగా కోలుకోవాలని... ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీసీసీఐ చీఫ్ గంగూలీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ క్రికెటర్లు, అతని అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు చేశారు. ‘సౌరవ్ గుండెపోటుకు గురవడం విచారకరం. త్వరితగతిన కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. అతను సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావాలి. కుటుంబసభ్యులు ధైర్యంగా ఉండాలి’ అని బెంగాల్ సీఎం మమత బెనర్జీ స్పందించారు. ►గెట్ వెల్ సూన్ గంగూలీ. త్వరగా కోలుకోవాలని నా ప్రార్థన. –భారత కెప్టెన్ కోహ్లి ►‘దాదా’ వేగంగా కోలుకొని ఆరోగ్యంగా ఇంటికి రావాలి. అదే నేను కోరేది... ప్రార్థించేది. –బీసీసీఐ కార్యదర్శి జై షా ►‘దాదా’... మీరు త్వరలోనే కోలుకుంటారు. మీకు పూర్తి స్వస్థత చేకూరాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నా. – వీరేంద్ర సెహ్వాగ్ ►సౌరవ్ నీ అనారోగ్యం గురించి తెలిసింది. ఇకపై గడిచే ప్రతి రోజు నిన్ను పూర్తి ఆరోగ్యవంతుడిగా తయారు చేయాలని కోరుకుంటున్నా. – సచిన్ టెండూల్కర్ ►భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ గుండెపోటుకు గురయ్యాడు. అతని ఆరోగ్యం నిలకడగా ఉంది. మేమంతా అతను సాధ్యమైనంత తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం. –ఐసీసీ -
విషమంగా వ్యవసాయశాఖ మంత్రి ఆరోగ్యం
సాక్షి, చెన్నై: వ్యవసాయ మంత్రి దురైకన్ను(72) ఆరోగ్యం క్షీణించింది. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనకు తీవ్రచికిత్స అందిస్తున్నారు. సీఎం పళనిస్వామి, మంత్రులు సోమవారం పరామర్శించారు. దురైకన్ను ఈ నెల 13న కారులో సేలంకు వెళుతుండగా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో విల్లుపురం ముండియంబాక్కం ఆస్పత్రిలో చేరారు. పరీక్షించిన వైద్యులు గుండెపోటుగా తేల్చారు. క్రమంగా పల్స్ తగ్గడంతో హుటాహుటిన చెన్నైకు తరలించారు. (ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్) ప్రైవేటు ఆస్పత్రిలో రెండు వారాలుగా చికిత్స అందిస్తున్నారు. సోమవారం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. సీఎం పళనిస్వామి, మంత్రులు జయకుమార్, విజయభాస్కర్, తంగమణి, వేలుమణి, సీవీ షణ్ముగం వేర్వేరుగా ఆస్పత్రికి వెళ్లి దురైకన్నును పరామర్శించారు. వైద్య బృందాలతో సీఎం పళనిస్వామి మాట్లాడారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఎక్మో చికిత్స అందిస్తున్నామని.. పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. -
కరోనాతో కొత్తముప్పు !
సాక్షి, విజయవాడ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాతో రోజుకో కొత్త సమస్యలు వెలుగు చూస్తోంది. ఇప్పటి వరకూ కరోనాతో పలువురిలో మధుమేహం స్థాయిలు పెరగడంతో పాటు, లంగ్ ఇన్ఫెక్షన్స్కు గురవడం, లివర్, కిడ్నీలపై ప్రభావం చూపుతున్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు. తాజాగా కరోనాకు గురైన వారిలో కొందరిలో రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటంతో గుండెపోటు, బ్రెయిన్‌స్ట్రోక్‌లకు గురవుతున్నట్లు వెల్లడైంది. ఆస్పత్రిలో చికిత్స పొంది, డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లిన రోగుల్లో 7 నుంచి 8 శాతం మంది రోగులు నాలుగు నుంచి ఆరు వారాల్లో గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా వెంటిలేటర్ దాకా వెళ్లొచ్చిన రోగుల్లో ఈ సమస్య కనిపిస్తుంది. దీంతో కరోనా తగ్గినా మూడు నెలల పాటు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ గుండె పరీక్షలు... కరోనాతో కోవిడ్ స్టేట్ ఆస్పత్రిలో చేరిన ప్రతి ఒక్కరికీ గుండె పరీక్షలు చేస్తున్నారు. ముఖ్యంగా సివియర్ కండీషన్లో ఐసీయూలో చికిత్స పొందుతున్న వారికి అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారు. కోవిడ్ రోగుల్లో గుండె సమస్యలను గుర్తించడంతో ఇటీవల కోవిడ్ స్టేట్ ఆస్పత్రిలో గుండె వైద్య విభాగాన్ని సైతం ఆఘమేఘాలపై ప్రారంభించారు. ఆ విభాగంలో ప్రతి రోగికి ఈసీజీ, ఎకో కార్డియాలజీ పరీక్ష చేస్తున్నారు. అవసరమైతే యాంజియోగ్రామ్ నిర్వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పుడు కరోనా రోగులకు గుండె వైద్య పరీక్షలు తప్పనిసరి చేస్తున్నారు. (ఫిబ్రవరికల్లా సగం జనాభాకు కరోనా!) వెలుగు చూస్తున్న సమస్యలివే... కరోనాతో చికిత్స పొందుతున్న రోగులు కొందరు పల్మనరీ ఎంబోలిజయ్(ఊపిరితిత్తులకు వెళ్లే రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటం)కు ఎక్కువుగా గురవుతున్నారు. కరోనా మరణాల్లో ఎక్కువ మందిలో ఇదే కారణంగా చెపుతున్నారు. కొందరిలో గుండె రక్తనాళాల్లో, మెదడుకు వెళ్లే రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడి, పూడికలు రావడం, కాళ్ల రక్తనాళాల్లో సైతం గడ్డలు ఏర్పడి రక్తప్రసరణ తగ్గుతున్న వారిని గుర్తిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 2 నుంచి 3 శాతం మందిలో రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడి మరణాలు సంభవిస్తుండగా, డిశ్చార్జి అయిన వారిలో 7 నుంచి 8 శాతం మందిలో గుండె, మెదడు సమస్యలు వస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ►ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత ఖచ్చితంగా మూడు నెలల పాటు యాంటి కో ఆగ్యులేషన్ మందులు వాడాలి. అలా వాడిన వారిలో రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడిన సందర్భాలు లేవు. ►ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్కు స్టెరాయిడ్స్ వాడిన వారు, ఆ తర్వాత ఫాలోఅప్ మందులు కూడా వాడాలి. ►యోగా, మెడిటేషన్, వ్యాయామం చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ►పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలి. ►తరచూ రక్తంలో ఆక్సిజన్శాతాన్ని పరీక్షించుకోవాలి. ఏ మా త్రం తగ్గినట్లు గుర్తించినా వెంటనే వైద్య చికిత్స తీసుకోవాలి. రక్తంలో గడ్డలు ఏర్పడుతున్నాయి కోవిడ్ సివియర్ స్టేజ్‌కు వెళ్లిన కొందరిలో యాంజియోగ్రామ్ చేసినప్పుడు రక్తంలో విపరీతమైన గడ్డలు ఏర్పడటం గుర్తిస్తున్నాం. గుండె రక్తనాళాలతో పాటు, మెదడు, కాళ్ల రక్తనాళాల్లో కూడా గడ్డలు ఉంటున్నాయి. ఒక వ్యక్తి పదిరోజుల పాటు మంచంపైనే పడుకుంటే సాధారణంగా పల్మనరీ ఎంబోలిజమ్కు గురయ్యే అవకాశం ఉంది. అలాంటిది ఐసీయూలో కదలకుండా రోజుల తరబడి ఉంటున్న వారికి పల్మనరీ ఎంబోలియజ్, కరోనాతో ఏర్పడే గడ్డలతో ప్రాణాపాయం ఏర్పడుతుంది. అలాంటి వారికి యాంటి కో ఆగ్యులేషన్ థెరపీ అందిస్తారు. కరోనా చికిత్స పొందిన వారిలో పదిహేను ఇరవై రోజుల్లో కొందరిలో, నాలుగు నుంచి ఎనిమిది వారాల్లో మరికొందరిలో గుండె సమస్యలు, గుండెపోటు, బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురవుతున్న వారిని గుర్తిస్తున్నాం. విజయవాడ కోవిడ్ ఆస్పత్రిలో ఈసమస్యలకు అత్యాధునిక చికిత్స అందిస్తున్నాం. – డాక్టర్ విజయ్ చైతన్య, కార్డియాలజిస్ట్ -
గుండెపోటు మరణాలే ఎక్కువ!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో భాగంగా విధించిన లాక్డౌన్ ఆంక్షల వల్ల వైద్య సేవలు అందక బ్రిటన్‌లో 65 ఏళ్ల లోపు వృద్ధుల్లో ఎక్కువ మంది గుండెపోటుతో మరణించారు. కరోనాతోపాటు అత్యవసర ఆపరేషన్లను మినహా మిగతా వైద్య సేవలను నిలిపి వేయడం వల్ల ఇళ్లకే పరిమితమైన వీరు గుండెపోటుకు గురయ్యారు. గత మార్చి, ఏప్రిల్ రెండు నెలల కాలంలోనే బ్రిటన్‌లో 2,800 మంది 65 ఏళ్ల లోపు వృద్ధులు గుండెపోటుతో మరణించారు. సాధారణ సమయాల్లో గుండెపోటుతో మరణించే వారి సంఖ్యకన్నా ఇది 420 ఎక్కువ. జూలై నెల వరకు 800 మంది వృద్ధులు ఎక్కువగా గుండెపోటుతో మరణించారు. అంటే కోవిడ్ లాక్డౌన్ ఆంక్షల కారణంగా గుండెపోటుతో మరణించిన వారి సంఖ్య దాదాపు 13 శాతం పెరిగిందని ‘బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్’ వెల్లడించింది. లాక్డౌన్ సందర్భంగా పింఛనుదారుల మృతుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని ఫౌండేషన్ అంచనా వేసింది. సాధారణ పరిస్థితుల్లోకన్నా ఆంక్షల సమయంలో 976 మంది పింఛనుదారులు మరణించారని, సాధారణ సమయాల్లోకన్నా ఈ మరణాలు ఆరు శాతం ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. కరోనా మినహా వైద్య సేవలపై ఇప్పటికీ ఆంక్షలు కొనసాగించినట్లయితే భవిష్యత్‌లో గుండెపోటు మరణాలు, పింఛనుదారుల అకాల మృతి పెరగుతుందని బ్రిటన్ హార్ట్ ఫౌండేషన్ అసోసియేట్ మెడికల్ డైరెక్టర్ సోన్యా బాబు–నారాయణ్ హెచ్చరించారు. గత మార్చి నెల నుంచి జూన్ వరకు నాలుగు నెలల కాలంలో ఆస్పత్రుల్లో సాధారణ అడ్మిషన్లు 1,73,000 తగ్గగా, లక్షా పదివేల మంది అనారోగ్యం వల్ల ఆస్పత్రుల్లో అడ్మిషన్ల కోసం ఎదురు చూస్నున్నట్లు నారాయణ్ పేర్కొన్నారు. -
కూతురి మరణ వార్తతో తండ్రికి గుండెపోటు
వైఎస్ఆర్ జిల్లా,గాలివీడు: కూతురు చనిపోయిందనే వార్త తెలియగానే గుండె పోటుతో తండ్రి మృతి చెందిన సంఘటన ఆదివారం మండలంలోని గొట్టివీడు గ్రామంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన రిటైర్డ్ వీఆర్వో సుభహాన్వలి అల్లారు ముద్దుగా పెంచుకున్న తన ఏకైక కుమార్తె మొదీనా (27)ను రాయచోటి సమీపంలోని మాసాపేటకు ఇచ్చి వివాహం చేశాడు. ఆదివారం ఉదయాన్నే మొదీనా గుండె పోటుతో మృతిచెందిందని అల్లుడి కుటుంబీకులు ఆయనకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేశారు. కూతురి మరణ వార్త చెవిన పడగానే సుబహాన్వలి కుప్పకూలి పడిపోయి వెంటనే ప్రాణం వదిలాడు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మృతుడి కుటుంబీకులను ఫోన్లో పలుకరించి ధైర్యం చెప్పారు. -
అస్తమించిన భాస్కరుడు
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శ్రీపైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల్లో కీలక ఘట్టమైన సిరిమానును అధిరోహించే సిరిమాను పూజారి తాళ్లపూడి భాస్కరరావు(68) హుకుంపేటలో ఉన్న స్వగృహంలో శుక్రవారం కన్ను మూశారు. గురువారం రాత్రి గుండె నొప్పితో తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య ఉమామహేశ్వరి, కుమారుడు ధనుంజయ్, కుమార్తెలు అరుణ, వాసవి ఉన్నారు. ఈయన 2009 నుంచి 2016 వరకు సిరిమానును అధిరోహించారు. అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషించేవారు. భాస్కరరావు మృతి పట్ల పలువురు తమ సంతాపాన్ని తెలిపారు. ఈయన మృతిపై కస్పా హైస్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధి వేలమూరి నాగేశ్వరరావు, గోపీనాథం సాంస్కృతిక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు నాడిశెట్టి శాంతారావు, పైడితల్లి అమ్మవారి ఆలయ అభవృద్ధి కమిటీ ప్రతినిధి ఎంబీ సత్యనారాయణ, పైడిమాంబ దీక్షాపీఠం వ్యవస్థాపకుడు, గురుస్వాములు ఆర్ఎస్ పాత్రో, ఎస్.అచ్చిరెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
కొడుకు మృతి.. ఇంట్లోకి రావొద్దన్న ఇంటి యజమాని
తంగళ్లపల్లి(సిరిసిల్ల): సభ్యసమాజం తలదించుకునేలా మానవత్వం మంటకలిసింది. ఈ సంఘటన తంగళ్లపల్లి మండలకేంద్రంలో చోటుచేసుకుంది. తంగళ్లపల్లిలోని రెడ్డివాడలో అద్దె ఇంట్లో నివాసముంటున్న మ్యాన అమిత్ (27) గురువారం ఉదయం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో గుండెపోటుతో మృతిచెందాడు. మృతదేహాన్ని ఇంటికి తీసుకువస్తే ఇళ్లు శుద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంటి యజమాని అనుమతించలేదు. గత్యంతరం లేక అమిత్ కుటుంబసభ్యులు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నేరుగా తంగళ్లపల్లి ఊరి చివరికి శ్మశానం వద్దకు మృతదేహాన్ని తరలించారు. బాధిత కుటుంబసభ్యుల వివరాల ప్రకారం మ్యాన అమిత్ తండ్రి సుదర్శన్ గతంలో మృతిచెందగా తల్లి సువర్ణతోపాటు తన సోదరులతో కలిసి మండలకేంద్రంలో ఓ ఇంట్లో పదినెలలుగా అద్దెకు ఉంటున్నారు. టెక్స్టైల్ పార్కులో మరమగ్గాల కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. తల్లి మ్యాన సువర్ణ బీడీల పనిచేస్తోంది. గురువారం తెల్లవారుజామున అమిత్ ఉన్నట్టుండి అస్వస్థతకు గురికావడంతో ఆరోగ్యం అతడిని హుటాహుటిన సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగానే అమిత్ గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచాడు. కన్నీరుమున్నీరైన కుటుంబసభ్యులు దహనసంస్కారాలు నిర్వహించేందుకు తంగళ్లపల్లి అద్దె ఇంటికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తుండగా ఇంటి యజమాని ఇంట్లోకి తీసుకురావడానికి అనుమతించలేదు. ఎంత ప్రధేయపడినా ఒప్పుకోలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఆటోలో తంగళ్లపల్లి ఊరిచివర శ్మశానవాటిక వద్దకు తీసుకువచ్చారు. అక్కడి నుంచే అమిత్‌కు అంతిమయాత్ర నిర్వహించాల్సి వచ్చింది. గూడు లేని పక్షులవలే వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మనసున్న చాలా మందిని కంటతడి పెట్టించింది. అమిత్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున చేయూత అందించాలని అంతేకాకుండా ఉండడానికి గూడు కల్పించాలని తంగళ్లపల్లివాసులు కోరుతున్నారు. చలించిపోయిన పోలీసులు అక్కడే మానేరు వాగు ఒడ్డున పికెటింగ్ నిర్వహిస్తున్న సీఐ సర్వర్, పోలీస్ సిబ్బంది అమిత్ కుటుంబసభ్యుల పరిస్థితి చూసి చలించిపోయారు. సీఐ సర్వర్ రూ.10 వేలు, పోలీస్ సిబ్బంది అందరూ కలిసి మరో రూ.5 వేలు ఆర్థికసాయం అందించారు. -
మూగబోయిన ప్రభోదాశ్రమం
అనంతపురం, తాడిపత్రి రూరల్: ఆధ్యాత్మిక గురువు, త్రైత సిద్ధాంతకర్త, బహుగ్రంథకర్త ప్రభోదానంద స్వామి ఇక లేరు. రెండు రోజుల క్రితం గుండెపోటు గురైన ఆయనను చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో కన్ను మూశారు. ఆయన పార్థివ దేహాన్ని గురువారం తాడిపత్రి సమీపంలోని చిన్నపొలమడ గ్రామంలో ఉన్న ఆశ్రమానికి తీసుకువచ్చారు. శ్రీకృష్ణ మందిరం వద్ద భక్తుల సందర్శనార్థం ఉంచారు. ఈ నెల 7న ఆస్పత్రికి తరలిస్తుండగా.. గతంలో గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ ప్రభోదానంద స్వామి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ నెల 7న తిరిగి ఆయన గుండెలో నొప్పిగా ఉందంటూ బాధపడుతుంటే చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మృతి చెందినట్లు కుమారుడు గుత్తా యోగానంద చౌదరి తెలిపారు. 1950లో జన్మించిన ప్రభోదానంద పూర్తి పేరు గుత్తా పెద్దన్న చౌదరి. స్వగ్రామం పెద్దపప్పూరు మండలం అమ్మళ్ళదిన్నె కొత్తపల్లి గ్రామం. భారత సైన్యంలో వైర్లెస్ ఆపరేటర్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే దైవజ్ఞానాన్ని ఇతరులకు పంచాలన్న ఉద్దేశ్యంతో ఉద్యోగాన్ని వదిలి, తాడిపత్రి ప్రాంతానికి వచ్చారు. కొంత కాలం ఆర్ఎంపీగా పలువురికి వైద్య సేవలు అందించారు. ఆధ్యాత్మిక జీవితంతో పేరు మార్పు కులాంతర వివాహం చేసుకున్న పెద్దన్న చౌదరి.. కాలక్రమంలో ఆయుర్వేద వైద్యంపై కొన్ని పుస్తకాలు వెలువరించారు. అదే సమయంలో ఆధ్యాత్మికత వైపు ఆయన దృష్టి మళ్లింది. ఆధ్యాత్మిక అంశాలపై పరిశోధనాత్మక రచనలు కొనసాగించారు. దైవజ్ఞానాన్ని అందరికీ పంచాలన్న తపనతో ‘ఇందూ జ్ఞానవేదిక’ను స్థాపించి దేవుడు ఒక్కడేనని చాటిచెబుతూ వచ్చారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్లలో ఉన్న దైవజ్ఞానం అందరికీ ఒక్కటేటని బోధిస్తూ త్రైత సిద్దాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ సిద్ధాంతాన్ని అనుసరిస్తూ అనేక గ్రంథాలను రచించి 1980న ప్రభోదానందస్వామిగా తన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంబించారు. వివాదాలకూ కేంద్రబిందువు త్రైత సిద్ధాంత బోధనలతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకోగలిగిన ప్రభోదానంద స్వామి.. ఆ తర్వాత పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. 1990లో ఓ సారి ఆశ్రమంపై దాడులు జరిగాయి. అలాగే 2018 సెప్టెంబర్ 16న ప్రభోధానంద ఆశ్రమంపై జరిగిన దాడులు దేశ వ్యాప్తంగా సంచనలమయ్యాయి. ముస్లింల మనోభావాలను దెబ్బతిసే విధంగా ఆయన రాసిన ఓ పుస్తకంపై 2017లో తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అనంతర పరిణామాలు, రాజకీయ కక్షలు కారణంగా ఆయన భక్తులకు ఆశ్రమంలో అందుబాటులో లేకుండా పోయారు. అయినా సామాజిక మాధ్యమాల ద్వారా తన బోధనలను భక్తులకు వినిపిస్తూ వచ్చారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ప్రభోదానంద స్వామి కన్నుమూశారన్న సమాచారం తెలుసుకున్న ఆయన భక్తులు గురువారం ఉదయం నుంచి చిన్నపొడమల గ్రామంలోని ఆశ్రమానికి పెద్ద సంఖ్యలో చేరుకోసాగారు. భక్తుల రాకను గమనించిన పోలీసులు అప్రమత్తమై కోవిడ్–19 నేపథ్యంలో వారికి అనుమతులు నిరాకరిస్తూ ఎక్కడికక్డ రహదారులపై పికెట్లు ఏర్పాటు చేశారు. మార్గ మధ్యలో నుంచే భక్తులను వెనక్కు పంపిస్తూ వచ్చారు. ఆశ్రమంలోని భక్తులకు ఆయన పార్థివ దేహాన్ని చూసేందుకు అక్కడి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. తాడిపత్రి రూరల్, పట్టణ సీఐలు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. ప్రభోదానంద పార్థివ దేహం సందర్శనకు బీజేపీ నాయకులు అంకాల్‌రెడ్డి, ప్రతాపరెడ్డి ఆశ్రమానికి వచ్చారు. వారికి ఆయన కుమారుడు గుత్తా యోగానంద చౌదరి వివరాలు తెలిపారు. తహసీల్దార్ నయాజ్ అహమ్మద్, ఎంపీడీఓ రంగారావు అక్కడే ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తూ వచ్చారు. గురువారం రాత్రి ప్రభోదానంద అంత్యక్రియలను ఆశ్రమంలోనే నిర్వహించారు. -
పెళ్లింట చావు మేళం!
కర్నూలు, డోన్ టౌన్: పెళ్లి వాయిద్యాలు మోగాల్సిన ఆ ఇంట్లో చావు మేళం మోగింది. రోజు గడిస్తే వివాహ వేడుక మొదలుకావాల్సి ఉండగా.. పెళ్లికుమార్తె తండ్రి అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోయారు. దీంతో ఆ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి. డోన్ పట్టణంలోని పాతపేట రాముల దేవాలయం ఎదుట నివాసం ఉండే రాజా కుళ్లాయప్ప(49) గత 15 ఏళ్లుగా ఎల్ఐసీ, అగ్రిగోల్డ్ ఏజెంటుగా ఉంటూ కుటుంబాన్ని పోషించేవారు. ఈయన కుమార్తెకు మండలంలోని సీతంగుంతలకుచెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. వాస్తవానికి ఏప్రిల్ 9,10 తేదీల్లో పెళ్లి జరగాల్సి ఉండేది. లాక్డౌన్ వల్ల వాయిదా వేశారు. ప్రస్తుతం లాక్డౌన్ సడలింపులు ఇవ్వడంతో ఈ నెల 11,12 తేదీల్లో ముహూర్తం నిర్ణయించారు. ఇప్పటికే పెళ్లి పత్రికలు సైతం పెంచిపెట్టారు. కాగా.. బుధవారం తెల్లవారుజామున రాజా కుళ్లాయప్పకు గుండెపోటు వచ్చింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన కర్నూలులోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న బంధువులు, కాలనీవాసులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పెళ్లికి హాజరు కావాల్సిన తాము చావుకు రావాల్సి వస్తుందని కలలోనూ ఊహించలేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
మీ సాయం.. నిలుపుతుంది ప్రాణం!
కోవెలకుంట్ల: ముక్కుపచ్చలారని చిన్నారికి పెద్ద కష్టం వచ్చింది. వందేళ్లపాటు జీవించాల్సిన చిన్నారి ఐదేళ్ల వయసులోనే గుండెకు రంధ్రం పడి మృత్యువుతో పోరాడుతున్నాడు. రెండు నెలల్లో ఆపరేషన్ చేయకుంటే ప్రాణాపాయం కలుగుతుందని డాక్టర్లు చెప్పడంతో రెక్కాడితే గాని డొక్కాడని తల్లిదండ్రులు తమ బిడ్డను బతికించాలంటూ వేడుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు.. కోవెలకుంట్ల పట్టణంలోని సీతారాం నగర్లో నివాసం ఉంటున్న రామాంజనేయులు, గురుదేవి దంపతులకు రాంచరణ్, అఖిల్ సంతానం. రామాంజనేయులు గౌండా పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పెద్దకుమారుడు రాంచరణకు ఐదేళ్ల వయసు రావడంతో పూర్వ ప్రాథమిక విద్య కోసం అంగన్వాడీ కేంద్రంలో చేర్చించారు. ఆనందంగా సాగుతున్న ఆ కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది. చిన్నారి గుండెకు రంధ్రం:అంగన్వాడీ కేంద్రం చిన్నారులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో డాక్టర్లు రాంచరణ్ అనారోగ్య పరిస్థితిని గుర్తించి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో పది రోజుల క్రితం చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు చిన్నారి గుండెకు రంధ్రం పడినట్లు నిర్ధారించారు. తల్లిదండ్రులు చిన్నారిని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ కూడా అదే సమస్య చెప్పి వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలో వైద్యం అందుబాటులో లేకపోవడంతో ఆపరేషన్‌కు దాదాపు రూ. 2 లక్షలు ఖర్చు అవుతుందని సూచించారు. దీంతో చేతిలో చిల్లిగవ్వ లేని తల్లిదండ్రులు చిన్నారిని తీసుకుని ఇంటికి చేరుకున్నారు. ఆపరేషన్ చేయకుంటే ప్రాణాపాయం : రెండు నెలల్లో చిన్నారి గుండెకు ఆపరేషన్ చేయకపోతే ప్రాణాపాయ పరిస్థితులు తప్పవని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బిడ్డను బతికించుకోవడానికి గత వారం రోజుల నుంచి ఎక్కడైనా అప్పు దొరుకుతుందేమోనని తిరిగినా ఫలితం లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాతలు ఆపన్న హస్తం అందించి తమ కొడుకుని బతికించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. దాతలు సాయం చేయాల్సిన చిరునామా: గురుదేవి: ఆంధ్రాబ్యాంకు అకౌంట్ నంబర్ 080510100186893 ఐఎఫ్‌సీ కోడ్: ANDB0000805 కోవెలకుంట్ల ఫోన్: 9550066686, 9391026170 -
నాన్నా.. అమ్మ ఏది?
చంపాపేట: తల్లి ఈ లోకాన్ని విడిచిపోయిందని తెలియని ఆ చిన్నారి.. తన తండ్రి దగ్గరకు వెళ్లి.. నాన్నా.. అమ్మ మాట్లాడట్లేదు.. నాన్నా.. అమ్మను లేపు నాన్నా.. అమ్మ కావాలి.. నాన్నా.. అంటూ గుక్కపెట్టి ఏడుస్తుంటే.. ఆ చిన్నారిని ఓదార్చలేక.. భార్య దహన సంస్కారాలు జరపలేక.. నిస్సాయ స్థితిలో ఉండిపోయి.. ఏం చేయాలో తెలియక బాధను దిగమింగుకుంటూ రోజంతా గడిపేశాడు.. నట్టింట్లో భార్య మృతదేహాన్ని చూస్తూ కనీసం సాయం కూడా అడగలేక పోయాడు. అతడి దుస్థితిని చూసి ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆర్థిక చేయూత అందించడంతో మృతదేహం ఇంటి నుంచి కదిలింది. వివరాల్లోకెళితే.. చంపాపేట డివిజన్ మారుతీనగర్ కాలనీకి చెందిన ఇషాంత్, రేఖ దంపతులు. వీరికి ఆరుషీ(5) కూతురు. (అయ్యో ! కరోనా ఎంత పని చేసింది) ఇషాంత్ చార్మినార్‌లోని ఓ మందుల షాప్‌లో గుమస్తాగా విధులు నిర్వర్తిస్తూ చాలీచాలని జీతంతో కుటుంబ భారాన్ని నెట్టుకొస్తున్నాడు. మూడు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇషాంత్ కుడి కాలు పూర్తిగా విరగటంతో మంచానికే పరిమితమయ్యాడు. భర్త చికిత్స ఖర్చుల కోసం రేఖ ఎక్కని గడప, మొక్కని దేవుడు లేడు. మూడునెలల పాటు అందిన కాడికి అప్పులు చేసి కుటుంబ భారాన్ని నెట్టుకొస్తూనే తన భర్తకు చికిత్స అందించింది. ఇషాంత్ కొద్దిగా కోలుకుని ఒంటి కాలితో అయినా సరే విధులకు వెళ్దామనుకునే సమయంలో కరోనా.. లాక్డౌన్ వార్త పిడుగులా పడింది. ఇక చేసేది ఏమీలేక ఇషాంత్ మళ్లీ ఇంటికే పరిమితమయ్యాడు. తెల్ల రేషన్‌కార్డు లేదు.. దాతల వద్దకు వెళ్లి చేయిచాచేందుకు ఆత్మాభిమానం అడ్డుతో తన కుటుంబ సభ్యులతో అర్దాకలితోనే గడిపాడు. పెరిగిన అప్పులు.. పూట గడవని పరిస్థితి, భర్త అచేతన పరిస్థితిని తలుచుకుని రేఖ కొన్ని రోజులుగా మానసిక ఆందోళనకు గురయ్యింది. సోమవారం సాయంత్రం ఆమె గుండెపోటుతో మృతి చెందింది. నాన్నా.. అమ్మను లేపు అని కూతురు గుక్కపెట్టి ఏడవటంతో స్థానికులు కంచన్‌బాగ్ పోలీసులకు సమాచారం అందించారు. కానిస్టేబుల్ పి.శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరి తన సొంత ఖర్చులతో రేఖ అంత్యక్రియలు చేయించాడు. స్థానికులు, దాతలు కొంత డబ్బును ఇషాంత్‌కు అందజేశారు. మూడు నెలలకు సరిపోయే నిత్యావసర సరుకులను అందచేసి చిన్నారి ఆరుషీ ఆలనా పాలన తన బాధ్యత అంటూ భరోసా ఇచ్చిన పోలీసు శ్రీనన్న ఔదార్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఇషాంత్ కుటుంబ సభ్యులను ఆదకోవాలనుకునేవారు సంప్రదించాల్సిన ఫోన్ నెం: 9390225976. -
హోం క్వారంటైన్లో ఉన్న వ్యక్తి మృతి
మోపాల్(నిజామాబాద్‌రూరల్): హోం క్వారంటైన్లో ఉన్న ఓ వ్యక్తి (48) శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు. మోపాల్ మండలంలోని కంజర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు, వైద్యాధికారుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వ్యక్తి ఉపాధి కో సం గతంలో గల్ఫ్‌కు వెళ్లాడు. మార్చి 23వ తేదీన స్వగ్రామమైన కంజర్‌కు తిరిగి వచ్చాడు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అతడు గ్రామానికి చేరుకున్నాడన్న విషయం తెలుసుకున్న వైద్యాధికారులు 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. ప్రతి రోజు వైద్య సిబ్బంది, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు వచ్చి అతడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం తనకు ఛాతిలో నొప్పి వస్తుందని ఇంటికి వచ్చిన వైద్య సిబ్బందితో చెప్పగా, వారు మాత్రలను అందజేశారు. అదేరోజు అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. వాస్తవానికి ఆదివారంతో ఆయనకు విధించిన 14 రోజుల హోం క్వారంటైన్ గడువు ముగియనుంది. అయితే చివరి రోజు మరణించడంతో కరోనా సోకి మృతి చెంది ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు కరోనా సోకిన వారి మాదిరిగానే మృతదేహాన్ని కవర్లతో చుట్టేసి, రసాయనాలు చల్లి అంత్యక్రియలు నిర్వహించడం వారి అనుమానాలకు బలం చేకూర్చింది. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గుండెపోటుతోనే మృతి.. హోం క్వారంటైన్లో ఉన్న వ్యక్తి గుండెపోటుతోనే మృతి చెందినట్లు వైద్యాధికారి డాక్టర్ నవీన్ తెలిపారు. ప్రతిరోజు వైద్య సిబ్బంది ఆయన ఆరోగ్య పరిస్థితిని పరీక్షించే వారని, ఎలాంటి కరోనా లక్షణాలు కన్పించలేవని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాలనుసారం హోం క్వారంటైన్లో ఉండటం వల్ల కరోనా సోకిన వారికి ఎలాగైతే అంత్యక్రియలు నిర్వహిస్తారో అలాగే పూర్తి చేశామని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల రక్త నమూనాలు సేకరించాలని ఉన్నతాధికారులు ఆదేశించారని తెలిపారు. -
గుండెకు ప్లాస్టిక్ పట్టీ...
గుండెజబ్బు వచ్చిన తరువాత గుండెపై ఉండే కణజాలం కొంత దెబ్బతింటుందని... ఫలితంగా ఆ భాగం గుండె లబ్డబ్లలో భాగం కాదని తెలుసు. దీనివల్ల గుండె పనితీరు దెబ్బతింటుంది. దాని ప్రభావం కాస్తా మన ఆరోగ్యంపైనా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఐర్లాండ్‌లోని డబ్లిన్‌కు చెందిన ట్రినిటీ కాలేజీ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఓ ప్లాస్టిక్ పట్టీ అందరి దష్టిని ఆకర్షిస్తోంది. ఈ పట్టీని చెడిపోయిన గుండె కణజాలంపై అతికిస్తే చాలు.. పరిసరాల్లోని గుండె కణాల విద్యుత్ ప్రచోదనాలను గుర్తించి అందుకు అనుగుణంగా స్పందిస్తుంది. ఇందుకు తగ్గట్టుగా ఈ పట్టీలో విద్యుత్ ప్రచోదనాలను ప్రసారం చేసే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇంకోలా చెప్పాలంటే సాధారణ గుండె కణజాల సంకోచ వ్యాకోచాలను ఈ పట్టీ ద్వారా అనుకరించవచ్చునన్నమాట. ప్రస్తుతానికి ఈ పట్టీని తాము పరిశోధన శాలలోని కణజాలంపై ఉపయోగించి చూశామని, త్వరలోనే జంతు ప్రయోగాలు చేపడతామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ప్రొఫెసర్ మైకేల్ మోనగన్ తెలిపారు. గతంలోనూ ఇలాంటి పట్టీలు కొన్ని అభివృద్ధి చేసినా వాటిల్లో సజీవ గుండెకణజాల కణాలనే ఉపయోగించే వారు కాగా.. తాము తయారు చేసింది పూర్తిగా ప్రత్యేక పదార్థాంతోనని ఆయన వివరించారు. సజీవ కణాలను చేరిస్తే పనితీరు మరింత పెరుగుతుందని తెలిపారు. పరిశోధన వివరాలు అడ్వాన్స్డ్ ఫంక్షనల్ మెటీరియల్స్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
కేసీపీ గ్రూపు అధినేత వీఎల్ దత్ కన్నుమూత
కొరుక్కుపేట (చెన్నై, సాక్షి): తెలుగు వ్యక్తి, ప్రముఖ పారిశ్రామికవేత్త, కేసీపీ గ్రూపు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ వీఎల్ దత్ (82) గుండె పోటు కారణంగా మంగళవారం చెన్నైలో కన్నుమూశారు. ఆయనకు సతీమణి డాక్టర్ వీఎల్ ఇందిరాదత్, కుమార్తె కవితా దత్ ఉన్నారు. 1937 డిసెంబర్ 27న జన్మించిన వెలగపూడి లక్ష్మణదత్ (వీఎల్‌దత్) లండన్‌లోని బిజినెస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఉన్నత విద్యనభ్యసించారు. కేసీపీ గ్రూపు సిమెంట్, చక్కెర తదితర రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ‘‘డాక్టర్ వీఎల్ దత్ అకాల మరణానికి సంతాపం తెలియజేస్తున్నాము. పరిశ్రమలకు, దేశానికి ఆయన అందించిన సేవలను ఫిక్కీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది’’ అని ఫిక్కీ ప్రెసిడెంట్ సంగీతా రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వీఎల్ దత్ 1991–92 వరకు ఫిక్కీ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. సీఎం జగన్ సంతాపం వీఎల్ దత్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. పారిశ్రామిక రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా దత్ కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు. -
మరణంలోనూ వీడని బంధం
ప్రకాశం, గిద్దలూరు: ముప్పై మూడేళ్ల వైవాహిక జీవితంలో ఆ ఆలూమగలు ఎంతో అన్యోన్యంగా మెలిగారు. అకస్మాత్తుగా భర్త మరణించడంతో దాన్ని జీర్ణించుకోలేని భార్యా గుండెలవిసేలా రోదిస్తూ..చివరకు తుదిశ్వాస విడిచింది. గిద్దలూరు పట్టణంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని కొప్పువారి వీధిలో నివాసం ఉంటున్న మునగనూరి బాలసత్యనారాయణ (58) కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. గురువారం ఉదయం వీరన్నబావి వద్ద షటిల్ కోర్టులో షటిల్ ఆడుతూ కుప్పకూలాడు. దీంతో సహచరులు స్థానిక ప్రైవేటు వైద్యశాలకు తరలించగా..అక్కడ చికిత్స పొందుతూ ఉదయం 11 గంటల సమయంలో మృతిచెందాడు. ఆయన మృతదేహాన్ని సాయంత్రం ఇంటికి తీసుకెళ్లారు. భర్త మృతిని తట్టుకోలేని భార్య మహాలక్ష్మి (55) కన్నీరుమున్నీరుగా రోదిస్తూ అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో కన్నుమూసింది. గంటల వ్యవధిలోనే భార్య, భర్తలు ఇద్దరూ మృతిచెందారు. మెడికల్ షాపు నిర్వహిస్తున్న బాలసత్యనారాయణకు అతని భార్య మహాలక్ష్మి దుకాణంలోనూ సహాయంగా ఉండేది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె లక్ష్మికి కొన్నేళ్ల క్రితం వివాహం చేయగా..కుమారుడు రవితేజకు ఇటీవల వివాహం చేశారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతున్న సమయంలో ఇలా తల్లిదండ్రులు ఇద్దరూ ఒక రోజు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. భార్యా, భర్తలబంధానికి అర్థం చెప్పిన బాలసత్యనారాయణ, మహాలక్ష్మిల జీవితాన్ని బంధువులు కొనియాడుతూ కుటుంబ సభ్యులను ఓదార్చుతున్నారు. పట్టణానికి చెందిన పలువురు ఆర్యవైశ్యులు వారి మృతహాలను సందర్శించి, కు టుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. శుక్రవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. భర్త మృతదేహంతో వస్తున్నభార్య కూడా మృతి హనుమంతునిపాడు: భర్త మృతదేహంతో వస్తూ వృద్ధురాలైన భార్య కూడా మృతి చెందింది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి నందనవనంలో వెలుగు చూసింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుర్రం లింగయ్య (78) కుటుంబం కొన్నేళ్ల నుంచి విజయవాడలో ఉంటోంది. కుటుంబ సభ్యులు స్వగ్రామానికి అప్పుడప్పుడూ వచ్చి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో విజయవాడలో లింగయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. స్వగ్రామం నందనవనంలో అంత్యక్రియలు చేసేందుకు బయల్దేరారు. ఈ తరుణంలో మార్గంమధ్యలో మృతుడి భార్య లింగమ్మ ఉన్నట్టుండి çస్పృహ కోల్పోయింది. చిలకలూరిపేట వద్ద ఆస్పత్రికి తరలిస్తుండగా ఆమె మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. దంపతుల మృతదేహాలను స్వగ్రామం తీసుకొచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. జీవితాంతం కలిసి జీవించిన దంపతులు ఒకేసారి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగారు. -
విడ'తీయని'బంధం!
50 ఏళ్ల వైవాహిక జీవితంఒడిదొడుకుల ప్రయాణంచలించని మనోధైర్యంప్రేమానురాగాలు అనంతంఆగెను ఓ హృదయంవిలవిల్లాడెను మరో ప్రాణంఆ హృదయాన్నే అనుసరించిన వైనంఓడి గెలిచిన మూడుముళ్ల బంధం చెన్నై,టీ.నగర్: నిద్రలో భార్య ప్రాణాలు కోల్పోవడంతో దిగ్భ్రాంతికి గురైన భర్త గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన శనివారం విషాదాన్ని నింపింది. వివరాలు.. చెన్నై వాషర్‌మెన్‌పేట సంజీవిరాయన్‌కోవిల్ వీధికి చెందిన లోకనారాయణన్ (65) చెన్నై కార్పొరేషన్ రిప్పన్ బిల్డింగ్‌లో పనిచేసి రిటైర్ అయ్యారు. ఇతని భార్య రాజేశ్వరి (60). వీరికి పెళ్లై దాదాపు 50 ఏళ్లు అవుతోంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం కావడంతో విడిగా ఉంటోంది. గత 14వ తేదీన తీవ్రమైన గుండెనొప్పితో బాధపడిన రాజేశ్వరిని స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆమె చికిత్సలు ముగించుకుని ఇంటికి చేరుకుంది. శనివారం ఉదయం కాఫీ తయారుచేసేందుకు రాజేశ్వరిని లేపగా ఆమె నిద్రలోనే మృతిచెందినట్లు తెలిసింది. దిగ్భ్రాంతి చెందిన లోకనారాయణన్ స్ఫ్రహతప్పి పడిపోయాడు. కొంతసేపటికే భార్య మృతదేహం వద్దే కన్నుమూశాడు. ఆదివారం దంపతులు ఇంటి నుంచి వెలుపలికి రాకపోవడంతో అనుమానించిన ఇరుగుపొరుగు వారి ఇంట్లోకి వెళ్లి చూడగా ఇరువురూ మృతిచెంది ఉండడం చూసి నివ్వెరపోయారు. దీనిపై సమాచారం అందుకున్న వారి బంధువులు ఇంటికి చేరుకున్నారు. కుమారుడు జగదీశన్, కుటుంబీకుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. తండయార్‌పేట పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు విచారణలో ఉంది. -
ప్రాణం మీదకు తెచ్చిన పాప్‌కార్న్..!
లండన్: బ్రిటన్‌కు చెందిన 41 ఏళ్ల ఆడమ్ మార్టిన్ పంటిలో సెప్టెంబర్‌లో పాప్‌కార్న్ ఇరుక్కుంది. దీంతో దానిని బయటకి తీయడానికి పెన్, టూత్‌పిక్, వైరు ముక్క, నెయిల్ కట్టర్ ఇలా అనేక సామగ్రిని పాప్‌కార్న్‌పై ప్రయోగించాడు. దీంతో మార్టిన్ చిగుళ్లకి ఇన్ఫెక్షన్ సోకింది. అదీ కాస్తా పెరిగి పెరిగి ఎడోకార్డిటిస్ అనే గుండె వ్యాధికి దారి తీసింది. రాత్రిళ్లు నిద్రలో బాగా ఇబ్బందిగా ఉండటంతో వైద్యుడి వద్దకు వెళ్లగా గుండె దెబ్బతిందని చెప్పారు. చిగుళ్ల ఇన్ఫెక్షన్ రక్త నాళాల ద్వారా గుండెకు చేరి రక్తం గడ్డకట్టిందని వివరించారు. సరైన సమయానికే గుర్తించడంతో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి ఇన్ఫెక్షన్ను తొలగించారు. నరకానికి చాలా దగ్గరగా వెళ్లి అదృష్టం కొద్ది బయటపడ్డానని, ఇకపై పాప్‌కార్న్ జోలికి మాత్రం పోనని మార్టిన్ అంటున్నాడు -
హైటెక్ నగరి.. రోగాల దాడి!
సాక్షి, సిటీబ్యూరో: హైటెక్ నగరం రోగాల మయంగా మారుతోంది. నగరంలో చక్కెర వ్యాధితో పాటు గుండె జబ్బులు, బీపీ సహా వివిధ రకాల కేన్సర్లు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ నగరంలో తాజాగా నిర్వహించిన అధ్యయనంలోఈ విషయం తెలిసింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కేన్సర్ వ్యాధిగ్రస్తుల్లో మూడోవంతు రోగులు హైదరాబాద్ నగరంలోనే ఉండడం గమనార్హం. పెరుగుతున్న భూ, జల, వాయు కాలుష్యం, మారుతున్న జీవన శైలి కారణంగా వివిధ రకాల కేన్సర్లు ప్రబలుతున్నాయి. మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మరో వైపు పాత నగరంలో టీబీ వ్యాధిగ్రస్తులు సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ప్రతి నెలా ఆరు వందల నుంచి 700 వరకు టీబీ కేసులు నూతనంగా నమోదవుతున్నట్లు ఈ అధ్యయనంవెల్లడించింది. పాత నగరంలో జీవనశైలి జబ్బులు తో పాటు తీవ్రమైన రోగాలతో బాధపడుతున్న వారు 25 శాతంగా ఉన్నట్లు ఈ సంస్థ అధ్యయనం తెలిపింది. వీరిలో చాలామంది వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. తీవ్రమైన జబ్బులు రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలను మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతీస్తున్నాయి. ఆయా వ్యాధుల చికిత్స కోసం చేసే ఖర్చులు వారిని ఆర్థికంగా చితికిపోయేలా చేస్తున్నాయి. కాగా ఐదేళ్లలోపు చిన్నారుల్లో రక్త కేన్సర్లు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. అవగాహన లేమితో ముప్పు జీవనశైలి జబ్బులు, తీవ్రమైన రోగాలపై ప్రధానంగా నిరుపేదలు, అల్పాదాయ, మధ్య ఆదాయ వర్గాలకు అవగాహన లేకపోవడం, ఆయా వ్యాధులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మందులపై కనీసఅవగాహన లోపించడం శాపంగాపరిణమిస్తోంది. తరచూ వైద్య పరీక్షలు, వైద్యుల సలహాలు తీసుకునే విషయంలోనూ పలువురు వెనుకంజ వేస్తున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహించే ఉచిత వైద్య పరీక్షలునిర్వహించినప్పుడు ఆయా టెస్టులుచేసుకునేందుకు కొందరు ముందుకురావడం గుడ్డిలో మెల్ల. వయో గ్రూపులవారీగా రోగాల జాడ ఇలా.. ఈ అధ్యయనం ప్రకారం నగరంలో 30 ఏళ్లు ఆపై వయసున్న వారిలో 20 శాతం మంది బీపీ సమస్యతో బాధపడుతున్నారు. 35 ఏళ్ల పైబడిన వారిలో 12 శాతం మందికి చక్కెర వ్యాధి ముప్పు పొంచి ఉంది. 25 నుంచి యాభయ్యేళ్ల లోపు వయసున్న వారిలో 11 శాతం మంది నోటి కేన్సర్‌తో బాధపడుతున్నారు. 35 ఏళ్లు పైబడిన మహిళల్లో 8 శాతం మంది బ్రెస్ట్ కేన్సర్ బారిన పడుతున్నారు. ఇక 40 నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న మహిళలు, పురుషుల్లో ఐదు శాతం మంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు. పదిహేనేళ్ల లోపు చిన్నారుల్లో ఐదు శాతం మందికి రక్త కేన్సర్ల ముప్పు పొంచి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. జీవన శైలి వ్యాధులు, తీవ్రమైన జబ్బులు రావడానికి గల కారణాలు, చికిత్స, నివారణ పద్ధతులపై ఇటు ప్రభుత్వం, అటు వైద్య ఆరోగ్య శాఖ, స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ఈ అధ్యయనం స్పష్టం చేయడం విశేషం. -
గుండెపోటుతో తాత్కాలిక డ్రైవర్ మృతి
అఫ్జల్‌గంజ్: బస్సు నడుపుతూ గుండె పోటుతో తాత్కాలిక డ్రైవర్ మృతి చెందిన సంఘటన అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ జ్ఞానేశ్వర్ రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దేవరకొండకు చెందిన యాదయ్య (45) ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేసేవాడు. ఆర్టీసీ కార్మికులు సమ్మె నేపథ్యంలో అతను హైదరాబాద్ డిపో1లో తాత్కాలిక డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం డ్యూటీలో ఉన్న అతను చాదర్‌ఘాట్ సాయిబాబా గుడి ప్రాంతంలో గుండెపోటు రావడంతో కుప్పకూలాడు. దీనిని గుర్తించి కండక్టర్ 108కి సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది అతడిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సోమవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. -
శబ్ద కాలుష్యం వల్ల గుండెపోట్లు ఎక్కువ!
సాక్షి, న్యూఢిల్లీ : పచ్చని చెట్లుగల ప్రశాంత వాతావరణంలో జీవించే వారికన్నా ఎప్పుడు రణగొణ ధ్వనులతో రద్దీగా ఉండే పట్టణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. రణగొణ ధ్వనుల మధ్య జీవించే వారికి రక్తపోటు వచ్చే అవకాశం కూడా ఎక్కువని బార్సిలోనాలోని ‘హాస్పిటల్ డెల్మార్ మెడికల్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్’కు చెందిన పరిశోధక బందం 2,761 మంది ప్రజల ఆరోగ్య పరిస్థితిని దాదాపు 9 ఏళ్ల పాటు అధ్యయనం చేయడం ద్వారా తేల్చింది. ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్న వారికన్నా ఈ రణగొణ ధ్వనుల మధ్య జీవిస్తున్న వారిలో గుండెపోటు వచ్చే అవకాశం 30 శాతం ఎక్కువని కనుగొన్నది. కేవలం శబ్ద కాలుష్యం వల్లనే వారిలో గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందా? సహజంగా పట్టణ ప్రాంతాల్లో ఫ్యాక్టరీల నుంచి వాహనాల నుంచి వెలువడే కాలుష్య ప్రభావం తోడవడం వల్ల కూడా ప్రజలకు గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతుందా ? అన్నది స్పష్టంగా ఈ అధ్యయనం తేల్చలేదు. పైగా పట్టణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు వ్యాయామం అలవాటు కూడా తక్కువ, అందువల్ల కూడా గుండెపోటు వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. శబ్ద కాలుష్యం గురించి తప్పా మరో కాలుష్యం గురించి పేర్కొనక పోయినప్పటికీ ఈ అన్ని కాలుష్యాల వల్ల గుండెపోటు వచ్చే అవకాశం 30 శాతం పెరుగుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. బ్రిటన్‌లో ఏడాదికి దాదాపు లక్ష మంది గుండెపోటులకు గురవుతున్నారని, వారిలో ఎక్కువ మంది శబ్ద కాలుష్యం వల్లనే మరణిస్తున్నారని పరిశోధకులు తేల్చారు. గుండెపోటు వచ్చి ప్రస్తుతం ప్రాణాలతో ఉన్న వారు దాదాపు 12 లక్షల మంది ఉన్నారని, వారిలో కూడా ఎక్కువ మంది శబ్ద కాలుష్యం వల్ల గుండెపోటుకు గురయిన వారేనని తెలిపారు. గుండెపోటులో రెండు రకాలు ఉంటాయని, గుండె రక్తనాళాల్లో రక్తం గడ్డడం వల్ల 80 శాతం గుండెపోట్లు వస్తాయని, రక్త నాళాలు చిట్లడం ద్వారా కూడా గుండెపోట్లు వస్తాయని, అలాంటి గుండెపోట్లు మొత్తంలో 20 శాతం ఉంటాయని పరిశోధకులు తెలిపారు. -
మాంసాహారుల్లోనే ‘స్ట్రోక్’లు తక్కువ!
సాక్షి, న్యూఢిల్లీ : మెదడులో రక్తనాళాలు చిట్లి చనిపోవడం (బ్రెయిన్ స్ట్రోక్) మాంసాహారుల్లో ఎక్కువగా జరుగుతుందని, శాకాహారుల్లో తక్కువగా ఉంటుందని ప్రజలు గత కొంత కాలంగా నమ్ముతూ వస్తున్నారు. పర్యవసానంగా బ్రిటన్‌లో శాకాహారుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం వారి సంఖ్య 17 లక్షలకు చేరుకుంది. వాస్తవానికి మాంసాహారుల కన్నా శాకాహారుల్లోనే ఈ స్ట్రోక్స్ ఎక్కువగా వస్తాయని ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు జరిపిన ఓ సుదీర్ఘ అధ్యయనంలో తేలింది. వారు 50 వేల మందిపై 18 ఏళ్లపాటు అధ్యయనం జరిపి ఈ విషయాన్ని తేల్చారు. మాంసాహారులకన్నా శాకాహారుల్లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం 20 శాతం అధికమని పరిశోధకులు తెలిపారు. శాకాహారుల్లో మెదడు రక్తనాళాల గుండా తక్కువ కొలస్ట్రాల్, బీ12 లాంటి విటమిన్లు తక్కువగా ప్రవహించడం వల్ల రక్తనాళాలు చీలిపోయే అవకాశం ఎక్కువగా ఉందని వారు చెప్పారు. అయితే మాంసాహారుల్లో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు చెప్పారు. మాంసం తినేవారికన్నా శాకాహారులు, చేపలు తినే వారిలో గుండెపోటు వచ్చే అవకాశం తక్కువ ఉంటుందని వారు తెలిపారు. మాంసహారులతో పోలిస్తే శాకాహారుల్లో గుండెపోటు వచ్చే అవకాశం 22 శాతం తక్కువని చెప్పారు. వారు తమ అధ్యయన వివరాలను బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించారు. సగటున 45 ఏళ్ల ప్రాయంగల 50వేల మందిని ఎంపిక చేసుకొని వారిపై పరిశోధకులు తమ అధ్యయనం చేశారు. వారిలో సగం మంది మాంసహారులుకాగా, మూడో వంతు మంది శాకాహారులుకాగా, ఐదో వంతు మంది చేపలు తినేవారు. వారిపై 18 ఏళ్లపాటు అధ్యయనం కొనసాగించగా వారిలో 2,820 మంది గుండె జబ్బులకు గురికాగా, 1,072 మంది బ్రెయిన్ స్ట్రోక్‌లకు గురయ్యారు. మాంసహారులపైన అధ్యయనం జరపడం చాలా సులువుగానీ శాకాహారులపై అధ్యయనం జరపడం కష్టమని వివిధ యూనివర్శిటీలకు చెందిన ప్రొఫెసర్లు అభిప్రాయపడ్డారు. శాకాహారుల్లో సాధారణ ఆకుకూరలు, కూయగారలు తినే వాళ్లు ఎక్కువగా ఉంటారని, దుంపలు, గింజలు, పప్పు దినుసులు, పండ్లు తినేవారు తక్కువగా ఉంటారని, శాకాహారుల మెదడు రక్తనాళాల్లో కొలస్ట్రాల్ శాతం తక్కువ ఉన్నవాళ్లు వీటిని తిన్నట్లయితే కచ్చితంగా కొలస్ట్రాల్ శాతం పెరుగుతుందని ‘బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్’ సీనియర్ డైటిస్ట్ ట్రేసి పార్కర్ చెప్పారు. నేటి పరిస్థితుల్లో బ్రెయిన్ స్ట్రోక్ కన్నా గుండెపోటు వల్లనే ఎక్కువ మంది మరణిస్తున్నందున శాకాహారమే ఒక విధంగా మేలని ఆయన వ్యాఖ్యానించారు. (చదవండి: ఇదీ శాకాహార చరిత్ర) -
కార్డియోమయోపతి అంటే ఏమిటి...?
నా వయసు 42 ఏళ్లు. ఈ మధ్య కొంతకాలం నుంచి తరచూ శ్వాస అందని పరిస్థితి ఏర్పడుతోంది. విపరీతమైన అలసటతో పాటు కాళ్లవాపు కూడా కనిపిస్తోంది. నెల కిందట స్పృహతప్పి పడిపోయాను. మాకు తెలిసిన డాక్టర్‌కు చూపించుకుంటే ఆయన కార్డియాలజిస్ట్ వద్దకు పంపారు. నా కండిషన్ ‘కార్డియోమయోపతి’ కావచ్చని కార్డియాలజిస్ట్ అంటున్నారు. ఈ వ్యాధి ఏమిటి? దీనికి చికిత్స అందుబాటులో ఉందా? దయచేసి వివరించండి. – ఎమ్. శ్రీకాంత్‌రావు,కరీంనగర్ కార్డియోమయోపతీ గుండె కండరాలకు సంబంధించిన వ్యాధి. ప్రారంభంలో ఎలాంటి ప్రత్యేక లక్షణాలూ వ్యక్తం కావు. మీరు వివరిస్తున్న లక్షణాలు కార్డియోమయోపతినే సూచిస్తున్నాయి. దీన్ని గుర్తించి చికిత్స చేయడంలో జాప్యం జరిగితే అది అకాలమరణానికి దారితీయవచ్చు. చాలా కారణాల వల్ల డయలేటెడ్ కార్డియోమయోపతి రావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని కుటుంబాలలో ఈ వ్యాధి వంశపారంపర్యంగా వస్తుంటుంది. కార్డియోమయోపతిలో మూడు ప్రధాన రకాలు కనిపిస్తాయి. అవి డయలేటెడ్ కార్డియోమయోపతి, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, రెస్ట్రిక్టెడ్ కార్డియోమయోపతి. వైరస్‌లతో ఇన్ఫెక్షన్, అదుపుతప్పిన అధిక రక్తపోటు (హైబీపీ), గుండె కవాటాలకు సంబంధించిన సమస్యలు, మితిమీరి మద్యపానం ఈ వ్యాధికి దారితీసే ప్రధాన కారణాలు. కొన్ని కుటుంబాలలో జన్యువుల మార్పు లేదా మ్యూటేషన్ కారణంగా వంశపారంపర్యంగా డయలేటెడ్ కార్డియోమయోపతి కనిపిస్తుంది. తల్లిదండ్రుల్లో ఒకరికి డయలేటెడ్ కార్డియోమయోపతి ఉంటే పిల్లల్లో సగం మందికి ఈ వ్యాధి సంక్రమిస్తుంది. చాలా సందర్భాల్లో డయలేటెడ్ కార్డియోమయోపతి నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. కానీ కొంతమందిలో వ్యాధి నిర్ధారణ కావడానికి ముందే తీవ్రమైన లక్షణాలు వ్యక్తమవుతుంటాయి. శ్వాస తీసుకోవడం కష్టం ఉండటం, పొట్ట – చీలమండ వాపు, విపరీతమైన అలసట, గుండెదడ డయలేటెడ్ కార్డియోమయోపతిలో కనిపించే తొలి లక్షణాలు. కార్డియోమయోపతి కారణంగా గుండె కొట్టుకోవడంలో తీవ్రమైన హెచ్చుతగ్గులు (అరిథ్మియాసిస్), ఛాతీలో నొప్పి, రక్తం గడ్డకట్టడం వంటి మరికొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున వాటి తీవ్రతను బట్టి చికిత్స చేస్తారు. అధిక రక్తపోటు, గుండెస్పందనల్లో విపరీతమైన హెచ్చుతగ్గులను మందులతో అదుపు చేస్తారు. గుండెకొట్టుకోవడంలో అసాధారణ మార్పును అదుపుచేయడానికి అవసరమైతే పేస్‌మేకర్ అమర్చుతారు. ఇక కార్డియోమయోపతిలోని మిగతా రెండు రకాలు పూర్తిగా వంశపారంపర్యంగా సంక్రమించే వ్యాధులు. హైపర్ట్రోఫిక్ రకంలో గుండెకండరాలు, గుండెగోడలు మందంగా తయారవుతాయి. రెస్ట్రిక్టివ్ రకంలో గుండెగదుల్లో రక్తం భర్తీ అయ్యేందుకు అవసరమైన ఒత్తిడికి సంబంధించిన లోటు ఏర్పడుతుంది. హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి వ్యాధిగ్రస్తుల్లో గుండె కండరాలు, గోడలు మందంగా మారడం అందరిలో ఒకేలా ఉండదు. మొత్తం కార్డియోమయోపతి కేసుల్లో హైపర్ట్రోఫిక్ రకానికి చెందినవి 4 శాతం ఉంటాయి. రెస్ట్రిక్టెడ్ కార్డియోమయోపతి కేసులు 1 శాతం ఉంటాయి. హైపోట్రోఫిక్, రెస్ట్రిక్టివ్ రకాల కార్డియోమయోపతీలో చికిత్స ప్రధానంగా వ్యాధిలక్షణాలను అదుపు చేయడం, పరిస్థితి విషమించకుండా అదుపు చేయడం లక్ష్యంగా జరుగుతుంది. గుండె ఏ మేరకు నష్టపోయింది, ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయన్న అంశాల ఆధారంగా డాక్టర్లు చికిత్సను నిర్ణయిస్తారు. అధికరక్తపోటు, గుండెకొట్టుకోవడంలో అసాధారణ పరిస్థితి వంటి లక్షణాలను అదుపు చేయడానికి డాక్టర్లు మందులు ఇస్తారు. హృదయస్పందనలు నిరంతరం సక్రమంగా జరిగేలా చూడటానికి అవసరాన్ని బట్టి పేస్‌మేకర్‌ను అమర్చుతారు. గుండెకొట్టుకోవడంలోని లోటుపాట్లు ప్రాణాపాయానికి దారితీసేలా కనిపిస్తే దాన్ని సరిచేయడానికి ఐసీడీ (ఇంప్లాంటబుల్ కార్డియాక్ డిఫిబ్రిలేటర్) పరికరాన్ని అమర్చుతారు.డాక్టర్ పంకజ్ జరీవాలా,సీనియర్ ఇంటర్వెన్షనల్కార్డియాలజిస్ట్,యశోద హాస్పిటల్స్, సోమాజిగూడహైదరాబాద్ -
పాల ఉత్పత్తులతో సమస్య లేదు!
పాలు ఆరోగ్యానికి మంచిది కావని మీకు ఇటీవలి కాలంలో ఎవరైనా చెప్పారా? వాళ్ల మాటల్లో నిజం లేదని అంటున్నారు హార్వర్డ్, టఫ్ట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. గుండెజబ్బులతోపాటు, మధుమేహానికి, పాలకు సంబంధం లేదని తాము అధ్యయన పూర్వకంగా తెలుసుకున్నామని వీరు చెబుతున్నారు. ఆహారంలో పాల ఉత్పత్తులను భాగంగా చేసుకున్న దాదాపు మూడు వేల మందిపై తాము అధ్యయనం చేశామని.. వీరికి మధుమేహం వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తేలిందని ఓ శాస్త్రవేత్త తెలిపారు. అలాగే సుమారు రెండు లక్షల మందిని దశాబ్దాల పాటు పరిశీలించిన తరువాత తాము పాలతో గుండెజబ్బుల సమస్య ఎక్కువ కాదన్న అంచనాకు వచ్చామని వివరించారు. పాల ఉత్పత్తులతో అందే కొవ్వులకు బదులు మొక్కలతో లభించే కొవ్వులు, గింజలను వాడినప్పుడు గుండెజబ్బుల ప్రమాదం ఇంకో 24 శాతం తగ్గిందని వీరు అంటున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. మాంస ఉత్పత్తులతో సమస్య ఆరు శాతం వరకూ ఎక్కువ కావడం. మొక్కల ద్వారా లభించే కొవ్వులు, పాలతో వచ్చే వెన్నలోని కొవ్వులను పోల్చి చూసినప్పుడు మొదటి రకం కొవ్వులు ఆరోగ్యకరంగా ఉంటే.. రెండో రకం కొవ్వులను మితంగా వాడితే పెద్ద ప్రమాదమేమీ లేదని ఇంకో అధ్యయనం స్పష్టం చేసింది. మొత్తమ్మీద చూస్తే ఏ రకమైన కొవ్వులనైనా మితంగా వాడటం మేలని అర్థమవుతుంది. -
గుండెకు ఆపరేషన్..మెదడువాపుతో చనిపోయాడన్నారు
రాంగోపాల్‌పేట్: గుండె జబ్బుతో బాధపడుతున్న ఓ బాలుడిని చికిత్స నిమిత్తం కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పిస్తే శస్త్ర చికిత్స చేసి మెదడు వాపుతో చనిపోయాడని చెప్పారు. శస్త్ర చికిత్స బాగానే జరిగిందని చెప్పిన వైద్యులు తెల్ల వారే సరికి అతను మృతి చెందినట్లు చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బాబు చనిపోయాడని ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టడమేగాక రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, జలాల్‌పూర్‌కు చెందిన అయ్యలమ్ కుమారుడు రవి (13) స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. గత నెలలో అతను అస్వస్థతకు గురికావడంతో స్థానిక వైద్యులకు చూపించారు. అయితే అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగు పడకపోవడంతో ఈ నెల 5న సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తీసుకుచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టుర్లు బాలుడి గుండెలో రంద్రాలు ఉన్నాయని ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద అతడికి చికిత్స అందించేందుకుగాను ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. ఈ నెల 10న బాలుడికి ఆపరేషన్ చేసిన వైద్యులు శస్త్ర చికిత్స విజయవంతం అయిందని తెలిపారు. 11న బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. సోమవారం అర్ధరాత్రి రవి మెదడు వాపు వ్యాధితో మృతి చెందినట్లు తెలిపారు. దీంతో ఆగ్రహానికి లోనైన మృతుని బంధువులు మంగళవారం ఆస్పత్రి ఎదుట ఆందోళనకు చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బాబు మృతి చెందాడని ఆరోపిస్తూ రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్యసేవల్లో లోపం లేదు:ఎండీ భాస్కర్‌రావు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రవికి శస్త్ర చికిత్సకు ముందు, అనంతరం వైద్యులు పూర్తి స్థాయి వైద్యసేవలు అందించారు. ఎక్కడ ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదు. శస్త్ర చికిత్స తర్వాత ఎంఆర్ఐ స్కాన్ చేయగా మెదడు పనితీరు సక్రమంగా లేదని గుర్తించి, అదే రోజు కుటుంబ సభ్యులకు చెప్పాం. గుండె ఆగిపోవడంతో రోగి మృతి చెందాడు. -
గుండె మరమ్మతులకు కొత్త పద్ధతి...
గుండెపోటు కారణంగా నష్టపోయిన కండరాలకు చికిత్స కల్పించేందుకు మూలకణాల ద్వారా అభివృద్ధి చేసిన గుండె కండరకణాలు ఉపయోగపడతాయని గుర్తించారు అలబామా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. గుండెపోటు వల్ల కండరంలోని కొంతభాగం చచ్చుబడిపోతుందన్న విషయం తెలిసిందే. తగిన చికిత్స లేని పక్షంలో ఈ కండర భాగం కారణంగా గుండె మొత్తం ఉబ్బిపోయి సమస్య జటిలం కావచ్చు. ఈ నేపథ్యంలో అలబామా యూనివర్శిటీకి చెందిన బయో మెడికల్ ఇంజినీర్లు కొన్ని ప్రయోగాలు చేశారు. కార్డియో మయోసైట్స్ నుంచి సేకరించిన మూలకణాలను గుండె గాయం వద్ద ఇంజెక్ట్ చేసినప్పుడు రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం కొంచెం పెరిగినట్లు తెలిసింది. అయితే కార్డియో మయోసైట్స్లో తాము అత్యంత చురుకైన, పూర్తి డీఎన్ఏ ఉన్న కణాలను సేకరించి వాటిద్వారా మూలకణాలను సిద్ధం చేశామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త రామస్వామి కన్నప్పన్ తెలిపారు. కణాలను వేగంగా పెంచే క్రమంలో డీఎన్ఏ దెబ్బతింటుందని, వీటిని గుండెపై వాడటం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని వివరించారు. ఇలాంటి కణాలను వదిలేసేందుకు తాము ఒక పద్ధతిని ఆవిష్కరించామని చెప్పారు. గుండెపోటుకు గురైన ఎలుకలకు సుమారు తొమ్మిది లక్షల మూలకణాలను అందించినప్పుడు నాలుగు వారాల తరువాత గుండె సామర్థ్యం పెరిగిందని తెలిపారు. -
గుండెజబ్బును సూచించే రక్తపోటు అంకెలు!
అధిక రక్తపోటు గుండెజబ్బులకు దారితీస్తుందని మనం చాలాకాలంగా వింటూనే ఉన్నాం. రక్తపోటును కొలిచేందుకు ఉపయోగించే రెండు అంకెలు (డయాస్టోలిక్, సిస్టోలిక్ ) ద్వారా కూడా గుండెపోటు, జబ్బులను ముందుగానే గుర్తించవచ్చునని కైసర్ పర్మనెంటే అనే సంస్థ జరిపిన తాజా అధ్యయనం చెబుతోంది. గుండె ఎంత శక్తితో రక్తాన్ని ధమనుల్లోకి పంపుతుందో తెలిపేది సిస్టోలిక్ రీడింగ్ కాగా... లబ్ డబ్ల మధ్య గుండె విశ్రాంతి తీసుకునేటప్పుడు ధమనులపై ఉన్న ఒత్తిడిని డయాస్టోలిక్ రీడింగ్ సూచిస్తుంది. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. గుండెపోటు ప్రమాదాన్ని అంచనా వేసేటప్పుడు వైద్యులు దశాబ్దాలుగా సిస్టోలిక్ అంకెపైనే ఎక్కువ ఆధారపడుతున్నారని.. డయాస్టోలిక్ అంకెను పరిగణించాల్సిన అవసరం లేదని కూడా చెబుతారని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త అలెగ్జాండర్ సి ఫ్లింట్ తెలిపారు. తాజా అధ్యయనం మాత్రం రెండింటినీ పరిగణనలోకి తీసుకోవాలని చెబుతోందని చెప్పారు. తాము దాదాపు మూడు కోట్ల అరవై లక్షల మంది తాలూకూ రక్తపోటు వివరాలను పరిశీలించి ఈ అంచనాకు వచ్చామని.. 20007 –16 మధ్యకాలంలో ఈ వివరాలను తీసుకోగా డయాస్టోలిక్ అంకెకూ గుండెపోటు, జబ్బులను అంచనా వేయడంలో తగిన ప్రాధాన్యమున్నట్లు తెలిసిందని చెప్పారు. -
గుండె గాయం మాన్పేందుకు కొత్త పరికరం!
గుండెపోటు కారణంగా దెబ్బతిన్న గుండె కణజాలానికి వేగంగా స్వస్తత చేకూర్చేందుకు బెర్లిన్ హీల్స్ అనే జర్మనీ సంస్థ ఓ కొత్త పరికరాన్ని అభివృద్ధి చేసింది. శరీర గాయాలు తొందరగా మానేందుకు చిన్న స్థాయి విద్యుత్తు షాక్‌లు ఉపయోగపడతాయన్న అంశం ఆధారంగా తాము ఈ పరికరాన్ని అభివృద్ధి చేశామని వియన్నా మెడికల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తెలిపారు డయలేటివ్ కార్డియోమయపతి అనే ఆరోగ్య సమస్య కారణంగా గుండె కణజాలం క్రమేపీ బలహీనపడుతూంటుందని... చివరిదశలో సక్రమంగా సంకోచ వ్యాకోచాలూ నిర్వహించలేని పరిస్థితి ఏర్పడుతుందని డొమినిక్ వీడెమాన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. మందులు ఇవ్వడం లేదంటే పేస్‌మేకర్ వంటివి అమర్చడం మాత్రమే ప్రస్తుతం ఈ సమస్యకు ఉన్న పరిష్కార మార్గాలు. చాలా సందర్భాల్లో గుండెమార్పిడి చేయించుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో కార్డియాక్ మైక్రోకరెంట్ పేరుతో తాము ఉత్పత్తి చేసిన పరికరం ఎంతో ఉపయోగపడుతుందని డొమినిక్ వీడెమాన్ తెలిపారు. రెండు చిన్న గాట్లు పెట్టడం ద్వారా ఈ పరికరాన్ని గుండెపైన అమర్చవచ్చునని సూక్ష్మస్థాయి విద్యుత్తు షాక్‌లు ఇచ్చినప్పుడు కణజాలం చైతన్యవంతమై సమస్య రాకుండా ఉంటుందని వివరించారు. -
ఉన్నత చదువులకోసం అమెరికా వెళ్లి..
చింతల్: ఉన్నత చదువులకోసం అమెరికా వెళ్లి గుండెపోటుతో మృతి చెందడంతో కుత్బుల్లాపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. కుత్బుల్లాపూర్ సర్కిల్ రంగారెడ్డినగర్ డివిజన్ గుబురుగుట్టకు చెందిన మహ్మద్ జహంగీర్ కుమారుడు మహమ్మద్ అమీర్(27) నాలుగున్నరేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. చదువుకుంటూనే పార్ట్‌టైం ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 17న గుండెపోటుతో మరణించాడు. దీంతో గుబురుగుట్టలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా అమీర్ తల్లి ఏడాది క్రితమే మరణించినా స్వదేశానికి తిరిగి రాలేదని ఇంతలోనే ఘోరం జరిగిందని కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. ఎమ్మెల్యే పరామర్శ.. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, కార్పొరేటర్లు విజయ్‌శేఖర్‌గౌడ్, రావుల శేషగిరిలు ఆదివారం అమీర్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మృతదేహన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించే ప్రయత్నాయలు చేశామని, ఎంబసీ అధికారులతో కేటీఆర్ మాట్లాడినట్లు తెలిపారు. -
21 మంది విద్యార్థులను రక్షించి డ్రైవర్‌మృతి
అన్నానగర్: విద్యార్థులను పాఠశాలకు తీసుకెళుతుండగా గుండెపోటుకు గురై వ్యాన్ డ్రైవర్ మృతిచెందాడు. ఆరుముగనేరిలో బుధవారం విద్యార్థులను పాఠశాలకు తీసుకెళుతుండగా వ్యాన్ డ్రైవర్‌కు అకస్మాత్తుగా గుండెపోటు ఏర్పడింది.అతడు వ్యాన్ వేగాన్ని తగ్గించడంతో అక్కడున్న ఇంటి ప్రహరీ గోడను ఢీకొని వ్యాన్ ఆగింది. వ్యాన్‌లో ఉన్న 21 మంది విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. అనంతరం వ్యాన్ డ్రైవర్ మృతిచెందాడు. తూత్తుక్కుడి జిల్లా ఆత్తూర్–పున్నక్కాయల్ రోడ్డు ప్రాంతానికి చెందిన మోహన్‌రాజ్ (45). ఇతను ఆరుముగనేరిలో ప్రైవేట్ పాఠశాలలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బుధవారం పాఠశాల వ్యాన్‌లో విద్యార్థులను ఎక్కించుకుని పాఠశాలకు వెళుతున్నాడు. వ్యాన్‌లో 21 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. ఆరుముగనేరి బజార్ దాటి రామరాజపురం ప్రాంతంలో వెళుతుండగా హఠాత్తుగా మోహన్‌రాజ్‌కి గుండెపోటు ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన మోహన్‌రాజ్ వ్యాన్ పేగాన్ని తగ్గించి, ఎడమ వైపుగా వ్యాన్ని తిప్పిన స్థితిలో స్టేరింగ్‌పై కుప్పకూలిపోయాడు. వ్యాన్ నేరుగా రోడ్డు పక్కనున్న ఇంటి ప్రహరీ గోడను ఢీకొని ఆగింది. వ్యాన్‌లో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు అదృష్టవశాత్తు క్షేమంగా బయటపడ్డారు. స్పృహతప్పిన మోహన్‌రాజ్‌ను స్థానికులు తిరుచెందూరు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మోహన్‌రాజ్ అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
కంటి దీపం ఆరిపోయింది..
దారి చూపిన దేవత వెళ్లిపోయింది.. కంటి వెలుగై ఇంటి దీపమై కాంతులీనిన సహచరి హఠాత్తుగా కనుమరుగైపోయింది. ఇక నా బతుకంతా కటిక చీకటేనంటూ హృదయవిదారకంగా సాగిన అతని రోదన చూపరులకు సైతం కన్నీరు తెప్పించింది. ఓ అంధ ఉపాధ్యాయుడితో విధి ఆడిన విషాద నాటకమిది. అన్నీ తానై నిలిచి పెద్ద దిక్కుగా ఉన్న సతీమణి గుండెపోటుతో క్షణాల్లోనే కన్నుమూయడం ఆ అభాగ్యుడి గుండెల్లో గునపాలు దింపింది. శ్రీకాకుళం, ఆమదాలవలస: కనుచూపు దూరం చేసి భగవంతుడు ఓసారి అన్యాయం చేశాడు.. దీపంలాంటి భార్యనిచ్చి ఆ లోటును భర్తీ చేశాడు.. వారికి రత్నాల్లాంటి ఇద్దరు కుమార్తెలు.. సజావుగా సాగుతున్న వారి జీవితంలో ఎందుకో హఠాత్తుగా విషాదం నింపాడు. భర్తను బంధువుల ఇంటికి ద్విచక్రవాహనంపై తీసుకువెళుతుండగా.. హృద్రోగానికి గురై అంధ ఉపాధ్యాయుడి భార్య క్షణాల్లో ప్రాణాలు కోల్పోయారు. బుధవారం జరిగిన ఈ ఘటన ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని వెంకయ్యపేట గ్రామంలో విషాదం నింపింది. ఈ మండలంలోని చిన్న జొన్నవలస గ్రామంలోని ఎంపీఈపీ స్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న బగాన వెంకటరమణమూర్తి.. పదో తరగతి చదువుతున్న సమయంలోనే చూపునుకోల్పోయారు. శస్త్ర చికిత్సలు చేసినా ఫలితం లేకపోవడంతో ఆత్మస్థైర్యంతో చదువును కొనసాగించారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ (హిస్టరీ) చదివి, అనంతరం మచిలీ పట్నంలోగల బీఈడీ కళాశాలలో స్కూల్ అసిస్టెంట్ ట్రైయినింగ్ తీసుకొని బీఈడీ పూర్తి చేశారు. డీఎస్సీలో ర్యాంకు సాధించి ఉపాధ్యాయుడిగా నియమితులయ్యారు. పొందూరు మండలం కింతలి గ్రామానికి చెందిన పద్మావతి తనను ఆదర్శ వివాహం చేసుకోవడంతో ఆయన జీవితంలో కొత్త వెలుగు వచ్చింది. ఉదయం లేచిన వెంటనే బ్రష్ అందించడం దగ్గర నుంచీ ద్విచక్ర వాహనంపై స్కూలుకు తీసుకువెళ్లి ఇంటికి తెచ్చే వరకు అన్నీ తానే అయి ఆమె కంటికి రెప్పలా చూసుకునేవారు. వీరికి డిల్లేశ్వరి, లావణ్య అనే ఇద్దరు కుమార్తెలున్నారు. మృత్యువు కమ్ముకొచ్చిందిలా... రోజూలాగే పద్మావతి (40) బుధవారం ఉదయం భర్తను పాఠశాలకు విధులకు తీసుకు వెళ్లి అక్కడే ఉండి మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. శ్రీకాకుళం రూరల్ మండలం నవనంబాబు, పొన్నాం గ్రామాల్లో ఉన్న తమ బంధువులు, స్నేహితులు గ్రామదేవత పండగకు పిలవడంతో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ద్విచక్రవాహనంపై తన భర్తను తీసుకొని బయల్దేరారు. మార్గమధ్యంలో గేదెలవానిపేట కాలనీ వద్ద ఆమెకు హఠాత్తుగా గుండె నొప్పి వచ్చింది. తనకు బాగులేదని చెబుతూ ద్విచక్రవాహనం నడపలేక పక్కనే ఉన్న పొలాల్లో బండి ఆపారు. స్థానికులు గమనించి ఆమెను రోడ్డు పైకి తీసుకువచ్చి 108కు ఫోన్ చేశారు. వెంటనే వచ్చిన 108 వాహనం సిబ్బంది అప్పటికే ఆమె ప్రాణాలు విడిచినట్లు చెప్పారు. దీంతో ఆ అంధ ఉపాధ్యాయుడి రోదన అక్కడి వారిని కలచివేసింది. ఇక తనకు దిక్కెవరంటూ ఆయన గొంతులోంచి తన్నుకొస్తున్న విషాదం చూసి కంట తడి పెట్టని వారు లేరు. పద్మావతి భౌతిక కాయానికి వెంకయ్యపేట గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. -
గుండెపోటుతో బావ మృతి.. ఆగిన మరదలు గుండె
బావ హఠాన్మరణాన్ని తట్టుకోలేక ఓ మరదలు గుండె పగిలింది. గుండెపోటుకు గురైన బావ ఆస్పత్రి నుంచి విగత జీవిగా రావడం చూసి గుండెలవిసేలా ఏడ్చిన ఆమె అలాగే కుప్పకూలింది. అంతే! ఆమె గుండెచప్పుడూ ఆగిపోయింది. గంట వ్యవధిలో ఒకే ఇంట ఇద్దరి హఠాన్మరణాలు ఆ గ్రామాన్ని విషాదసంద్రంలో ముంచింది. చిత్తూరు, సత్యవేడు : మండలంలోని బాలకృష్ణాపురం గ్రామానికి చెందిన ఆశీర్వాదం(38), అతని తమ్ముడు కార్తీక్ వ్యవసాయ కూలీలు. ఆశీర్వాదానికి భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. కార్తీక్‌కు భార్య రేఖ (24), ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒకే ఇంట ఉమ్మడి కుటుంబంగా ఉన్న వీరంతా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఎవరి ఏ కష్టమొచ్చినా పంచుకునేవారు. ఏడాది క్రితం ఆస్తిపంపకాలతో కుటుంబాలు వేరయ్యాయి. ఒకే ఇంట మధ్యలో గోడ వెలిసింది. అయినా వారి అనుబంధాలు చెరగిపోలేదు. ఎప్పటిలాగే రెండు కుటుంబాలు కష్టసుఖాలు పంచుకునేవి. ఈ నేపథ్యంలో, గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆశీర్వాదం గుండెపోటుకు గురయ్యారు. ఆయన్ను హుటాహుటిన ఆటోలో తమ్ముడు కార్తీక్ తన వదిన, మరికొందరితో కలిసి సత్యవేడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. కొన్ని నిమిషాలకే ఆశీర్వదం మరణించారు. దీంతో అక్కడి నుంచే కార్తీక్ తన భార్య, కుటుంబ సభ్యులు, గ్రామస్తులకు సమాచారం చేరవేశాడు. బావ హఠాన్మరణం చెందడంతో రేఖ దిగ్భ్రాంతికి గురైంది. కన్నీరుమున్నీరై విలపించింది. ఇంతలో ఆశీర్వాదం మృతదేహం ఇంటికి చేరుకుంది. విగతజీవిగా ఉన్న బావను చూడగానే ఆమెలో దుఃఖం కట్టలు తెంచుకుంది. ఉన్నపళాన అలాగే కుప్పకూలింది. సొమ్మసిల్లి పడిపోయిందేమోనని భావించిన కుటుంబ సభ్యులు నీటిని ఆమె ముఖంపై చిలకరించారు. నిమిషాలు గడుస్తున్నా ఆమె ఉలుకూ పలుకూ లేకుండా అచేతనంగా ఉండిపోయింది.కార్తీక్ ఆమెను తట్టి..తట్టి లేపేందుకు యత్నించాడు. శరీరం చల్లబడుతూ ఉండటం, ముక్కు వద్ద చేయి పెట్టినా శ్వాస తీసుకుంటున్న ఆనవాళ్లు లేకపోవడం అనుమానించాడు. తన భార్య కూడా హఠాన్మరణం చెందిందని గ్రహించేందుకు అట్టే సమయం పట్టలేదు. అటు సోదరుడు, ఇటు భార్య మృతదేహాల నడుమ అతని కళ్లు కట్టలు తెగిన చెరువే అయ్యింది. ఒకే ఇంట గంట వ్యవధిలో ఇద్దరి మృతి గ్రామాన్ని విషాదంలో ముంచింది. రెండు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
జ్యోతి కుటుంబంలో మరో విషాదం
గుంటూరు, తాడేపల్లి రూరల్(మంగళగిరి): తన కుమార్తెను దారుణంగా హత్యచేశారన్న బాధను జీర్ణించుకోలేక అనారోగ్యం పాలైన తండ్రి గోవిందయ్య చికిత్స పొందుతూ మరణించాడు. ఫిబ్రవరి 15 నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. బిడ్డ హత్యను తట్టుకోలేకే తండ్రి కూడా మరణించడంతో కుటుంబ సభ్యులు, బంధువుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. మూకుమ్మడిగా హత్యకేసులో నిందితుడి ఇంటిపై దాడి చేసిన ఘటన తాడేపల్లి పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. రాజధాని ప్రాంతంలో ఫిబ్రవరి 11వ తేదీ ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైన అంగడి జ్యోతి తండ్రి జ్యోతి మరణాన్ని జీర్ణించుకోలేక ఆమె తండ్రి గోవిందయ్య అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు గత నెల 15న ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆయన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. (పెళ్లి ప్రస్తావన రాగానే చంపేశాడు) శ్రీను బంధువులపై దాడి బుధవారం సీతానగరంలోని జ్యోతి ఇంటి నుంచి గోవిందయ్య అంత్యక్రియలను నిర్వహించేందుకు శ్మశానవాటికకు తీసుకువెళ్లారు. గోవిందయ్య, జ్యోతి మధ్య అనుబంధాన్ని బంధువులు చర్చించుకున్నారు. అంత్యక్రియలు పూర్తిచేసి తిరిగి ఇంటికి వస్తుండగా దారిలో ఉన్న చుంచు శ్రీను ఇంటిని చూసిన బంధువులు జ్యోతి, గోవిందయ్యల మృతికి కారణమైన వాడి ఇల్లు ఇదేనంటూ ఆ ఇంటి తాళాలు పగలగొట్టి, తలుపులు విరగ్గొట్టి దాడికి పాల్పడి, ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు. పక్కనే ఉన్న చుంచు శ్రీను బాబాయి లక్ష్మీనారాయణ, పిన్ని, నాయనమ్మపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని స్థానికులు చూసి 100కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో జ్యోతి బంధువులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. చుంచు శ్రీను బంధువులు సైతం పోలీసులకు 100 ద్వారా ఫిర్యాదు చేశారు కానీ, పోలీస్‌స్టేషన్‌లో రాత్రి 8 గంటల వరకు ఫిర్యాదు చేయలేదు. (కేసు ముగించే కుట్ర ) -
‘పోటె’త్తిస్తున్న పని ఒత్తిడి
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో ఆర్టీసీ డ్రైవర్లపై జీవన శైలి వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియని తీవ్ర ఒత్తిళ్ల నడుమ డ్రైవర్లు విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బంది కొరత, డబుల్ డ్యూటీలు, సకాలంలో సెలవులు లభించకపోవడం, నగరంలోని ట్రాఫిక్ రద్దీలో గంటల తరబడి బస్సులు నడపడం తదితర కారణాలతో డ్రైవర్లు చిన్న వయస్సులోనే అనారోగ్యం బారిన పడుతున్నారు. రాణిగంజ్ డిపోకు చెందిన మల్లారెడ్డి 42 ఏళ్ల వయస్సులోనే తీవ్రమైన గుండెపోటు కారణంగా మంగళవారం చందానగర్‌లో మృతి చెందిన ఉదంతం ఆర్టీసీ కార్మికులను కలవరానికి గురిచేస్తోంది. కేవలం పని ఒత్తిడి వల్లనే డ్రైవర్ల ఆరోగ్యం దెబ్బతింటుందని, అధిక రక్తపోటు, షుగర్, పైల్స్ వంటి జీవన శైలి వ్యాధులతో పాటు గుండె జబ్బులు కూడా కబలిస్తున్నాయని కార్మికసంఘాలు పేర్కొంటున్నాయి. ఇటీవలి కాలంలో తరచూ ఎక్కడో ఒక చోట డ్రైవర్లు గుండెపోటుతో మృతి చెందుతున్నారని తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధానకార్యదర్శి రాజారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్లకు సకాలంలో సరైన వైద్య పరీక్షలు నిర్వహించకపోవడం, వ్యాధులను ముందస్తుగా గుర్తించి చికిత్సలను అందజేసే సదుపాయం ఆర్టీసీ ఆసుపత్రిలో లేకపోవడంతో పాటు డిపోల్లో సిబ్బంది కొరత, విధుల్లో ఉన్న వారే అదనపు పని గంటలు పని చేయాల్సి రావడం వంటి అంశాల కారణంగా చిన్నవయస్సులోనే తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. ‘గతంలో 50 ఏళ్లు దాటిన డ్రైవర్లు మాత్రమే గుం డెపోటు వంటి సమస్యలను ఎదుర్కొనేవారని, ప్రస్తుతం పని ఒత్తిడి కారణంగా 40 ఏళ్లకే వ్యాధుల భారిన పడుతున్నారన్నారు. సకాలంలో వ్యాధులను గుర్తించకపోవడం, సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల డ్రైవర్లు తీవ్రమైన ఆరోగ్యం బారిన పడుతున్నారు’ అని తార్నాక ఆర్టీసీ ఆసుపత్రికి చెందిన సీనియర్ వైద్య నిపుణులు ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఏటా పెరుగుతున్న డ్రైవర్ల కొరత... గ్రేటర్లో మొత్తం 29 డిపోల నుంచి 3850 బస్సులను నడుపుతున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, శ్రామిక్‌లు, తదితర సిబ్బంది అంతా కలిసి సుమారు 18000 మందికి పైగా ఉన్నారు. వీరిలో 8000 మందికి పైగా డ్రైవర్లు ఉన్నట్లు అంచనా. అయితే ఏటా వందలాది మంది పదవీ విరమణ చేస్తున్నారు. వారి స్థానంలో కొత్త వారిని నియమించకుండా డిపోల్లో ఉన్న డ్రైవర్లకే అదనపు విధులను అప్పగిస్తున్నారు. ఇప్పటికిప్పుడు కనీసం 1000 మంది డ్రైవర్లను భర్తీ చేయాల్సి ఉంది. సిబ్బంది కొరత కారణంగా ఏడున్నర గంటలు పని చేసే కార్మికుడు డబుల్ డ్యూటీ పేరిట 15 గంటల నుంచి 16 గంటల వరకు పని చేయాల్సి వస్తుంది. సాయంత్రం విధుల్లో చేరిన వారు తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ కారణంగా గంటల తరబడి రోడ్లపైనే ఉండాల్సి రావడంతో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు.‘‘ సిటీలో ఏడున్నర గంటల డ్యూటీ మాత్రమే అంటారు. కానీ ఏ డ్రైవర్ కూడా ఏ ఒక్క రోజు ఏడున్నర గంటల్లో డ్యూటీ ముగించుకొని డిపోకు చేరుకోవడం సాధ్యం కాదు. డబుల్ డ్యూటీ చేసినప్పుడు కచ్చితంగా ఉదయం నుంచి రాత్రి వరకు, లేదా మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు బస్సు నడపాల్సిందే..’’ అని ఉప్పల్ డిపోకు చెందిన డ్రైవర్ ఒకరు తెలిపారు. డబుల్ డ్యూటీకి అంగీకరించకపోయినా, సెలవులు తీసుకొన్నా అధికారులు చార్జీషీట్లతో వేధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. అరకొర వైద్య సదుపాయాలు... ⇔ గుండెపోటు ముప్పును గుర్తించడంలో ట్రెడ్మిల్ టెస్ట్ (టీఎంటీ) ఎంతో ముఖ్యమైంది. అప్పటి వరకు ఉన్న బలహీనతను గుర్తించడంతో పాటు రాబోయే ముప్పును కూడా ఈ పరీక్ష ద్వారా వైద్యులు గుర్తిస్తారు. ⇔ 50 వేల మందికి పైగా ఆర్టీసీ కార్మికులకు వైద్య సదుపాయాలను అందజేసే తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో ఈ సదుపాయం లేదు. ఇదొక్కటే కాదు. చాలా పరీక్షల కొరకు కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ⇔ డ్రైవర్లకు ప్రతి మూడేళ్లకు ఒకసారి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించాల్సి ఉంది. 45 ఏళ్లు దాటిన వారికి ఏటా వైద్య పరీక్షలు నిర్వహించాలి. కొంతకాలంగా పెరిగిన గుండె జబ్బుల ముప్పు ను పరిగణనలోకి తీసుకొని 40 ఏళ్లు దాటిని ప్రతి ఒక్కరికీ ఏటా అన్ని రకాల వైద్య పరీక్షలు (టీఎంటీతో సహా) చేయాలని నిర్ణయించారు. అయితే ఏడాది దాటినా ఇది అమలుకు నోచుకోలేదు. ⇔ టీఎంటీ సదుపాయం లేకపోవడంతో ప్రసు ్తతం ఈసీజీ వంటి సాధారణ పరీక్షలకే పరిమితమవుతున్నారు. దీంతో వ్యాధుల ముప్పును సకాలంలో పసిగట్టలేకపోతున్నట్లు వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ⇔ తార్నాక ఆసుపత్రిలో 40 మంది పారామెడికల్ సిబ్బందికి గాను కేవలం 20 మందే ఉన్నారు. 45 మంది వార్డుబాయ్‌లు పనిచేయాల్సి ఉండగా 18 మంది మాత్రమే ఉన్నారు. 45 మంది వైద్య నిపుణులకు గాను ప్రస్తుతం 28 మంది మాత్రమే పని చేస్తున్నారు. ⇔ వైద్యులు, సిబ్బంది కొరత, సరైన లాబొరేటరీ సదుపాయాలు లేకపోవడం వేలాది మంది కార్మికుల పాలిట శాపంగా మారాయి. -
భర్తే లోకమని..
‘మూడుముళ్లు’ ఏకం చేశాయి..‘అగ్నిసాక్షి’గా ఏడడుగులు నడిచారు.. ఎన్నికష్టాలొచ్చినా ఒకరికొకరం తోడూనీడగా ఉందామనుకున్నారు. దర్జాగా బతకలేకున్నా ఉన్నంతలో ఆదర్శంగా బతుకుతున్నారు. అన్యోన్య దాంపత్యానికి ప్రతి‘రూపాలు’ను బాగా చదివించి ప్రయోజకులను చేయాలనుకున్నారు.. ఆ దాంపత్యాన్ని చూసి విధి ఓర్వలేకపోయింది. అంతలోనే అనారోగ్యమనే మిత్తి.. గుండెను నులిమింది. భార్య నుంచి భర్తను వేరు చేసింది. భర్తలేని లోకం శూన్యమని ఆమె భావించింది.. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ విషాద ఘటనతో అభంశుభం తెలియని చిన్నారులు దిక్కులేని వారయ్యారని అందరి కళ్లు చెమర్చగా.. గార్లదిన్నె శోకసంద్రమైంది. అనంతపురం , గార్లదిన్నె: జ్వరంతో బాధపడుతున్న భర్త గుండెపోటుకు గురై మృత్యువాత పడ్డాడు. భర్త లేని జీవితం శూన్యమని భార్య ఆత్మహత్య చేసింది. వివరాల్లోకెళ్తే.. మండల కేంద్రం గార్లదిన్నెలో కిరాణా అంగడి నిర్వహిస్తున్న నాగరాజు (45) మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున ఉన్నపళంగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే నాగరాజు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకురాగానే భర్త లేని ఈ లోకంలో తాను జీవించలేనని భార్య పద్మావతి ఇంట్లోకెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేసింది. కుటుంబ సభ్యులు 108లో ఆమెను అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కొద్దిసేపటికే ఆమె కూడా మృతి చెందింది. ఇదిలా ఉండగా నాగరాజు నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. అయోమయంలో పిల్లలు.. నాగరాజు, పద్మావతి దంపతులకు ఆరో తరగతి చదువుతున్న గౌతమ్, తొమ్మిదో తరగతి చదువుతున్న చైతన్య కుమారులు. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో పిల్లలు బోరున విలపించారు. వారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. -
మంటగలిసిన మానవత్వం
తమిళనాడు, వేలూరు: కాట్పాడి సమీపంలో బస్సులో ప్రయాణిస్తుండగా గుండెపోటుకు గురై వృద్ధురాలు మృతి చెందింది. దీంతో మృతదేహాన్ని బస్‌స్టాప్‌లో వదిలివెళ్లిన సంఘటన పలువురిని కలచివేసింది. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా సెయ్యారుకు చెందిన భూషణం (60). ఈమె బెంగళూరులోని బంధువుల ఇంటికి వెళ్లి ఆదివారం సాయంత్రం రైలు ద్వారా కాట్పాడికి తిరిగి వచ్చారు. కాట్పాడి రైల్వేస్టేషన్లో దిగిన ఆమె వేలూరు కొత్త బస్టాండ్‌కు వెళ్లేందుకు బస్సులో ప్రయాణం చేశారు. కాట్పాడి చిత్తూరు బస్టాండ్ వద్ద వస్తున్న సమయంలో బస్సులోనే గుండెపోటుతో కుప్పకూలిపోయారు. దీన్ని గమనించిన బస్సు కండెక్టర్ వెంటనే ఆమెను కిందకు దింపారు. బస్సు నుంచి కింద దిగిన భూషణం కొద్ది క్షణాల్లోనే మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని బస్‌స్టాప్‌లోనే వదిలిపెట్టి బస్సు బయలుదేరి వెళ్లింది. విషయం తెలుసుకున్న కాట్పాడి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతురాలి బ్యాగులో తనిఖీ చేయగా ఆమె కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్ తెలుసుకొని వారికి సమాచారం అందించారు. అనంతరం కుటుంబసభ్యులు అక్కడికి రావడంతో మృతదేహాన్ని వారికి అప్పగించారు. గుండెపోటుకు గురైన వృద్ధురాలిని కిందకు దింపి వెళ్లిపోయిన బస్సు కండక్టర్, డ్రైవర్ ఎవరు, ఏ బస్సు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. వృద్ధురాలికి గుండెపోటు వచ్చిన వెంటనే అంబులెన్స్‌ను రప్పించి ఆస్పత్రిలో చేర్పించాల్సిన బస్సు డ్రైవర్, కండెక్టర్లు బస్‌స్టాప్‌లో వదిలి పెట్టి వెళ్లిన సంఘటన పలువురిని కలచివేసింది. -
అమ్మా...గుండెనొప్పి...!
మారుతున్న కాలంతో పాటు ఆహారపు అలవాట్లు మారిపోయాయి. ఫలితంగా చిన్న వయసులోనే గుండె పోటుకు గురయ్యే ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతున్నాయి. అప్రమత్తమయ్యేలోపే చాలా వరకు ప్రాణాలు పోతున్నాయి. విజయనగరం ఫోర్ట్: గతంలో 50, 60 ఏళ్లు దాటిని వారు గుండె నొప్పి బారిన పడేవారు. ఇప్పుడు 40 ఏళ్లు, 50 ఏళ్లులోపు వారు కూడా గుండె జబ్బులు బారిన పడుతున్నారు. గతంలో పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తినేవారు. ఇప్పుడు పిల్లలు దగ్గర నుంచి పెద్దలు వరకు అందరు ఫాస్ట్ఫుడ్స్, జంక్ ఫుడ్స్‌కు అలవాటు పడ్డారు. ఫలితంగా శరీరంలో కొవ్వు పెరిగి గుండె జబ్బులు బారిన పడుతున్నారు. జిల్లాలో సుమారుగా 10 శాతం మంది వరకు గుండె జబ్బులతో బాధపడుతున్నారు. వైద్య పరీక్షల్లో భాగంగా చేసే లిపిడ్ ప్రోఫైల్ పరీక్షల్లో 35 శాతం మందికి ట్రైగిజరైడ్స్ ఎక్కువుగా ఉన్నాయని, ఇవి గుండెకు అంత మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీరే గాక వంశపారంపర్యం, జన్యు లోపాలు, మేనరికపు వివాహం వంటి కారణాలతో పుట్టుకతోనే గుండె జబ్బులతో జన్మించే పిల్లలు ఇటీవల ఎక్కువ అయ్యారు. గుండె చేతి పట్టుకుని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకి ఇటీవల కాలంలో 40 ఏళ్లు లోపు వారే అధికంగా వస్తున్నారు. జిల్లాలో నెలకు పది వేల మంది వరకు ఈసీజీలు, వెయ్యి మందికి పైగా 2డీ ఎకో పరీక్షలు, 100 మంది వరకు యాంజియోగ్రామ్ పరీక్షలు చేస్తున్నారు. గుండె నొప్పి లక్షణాలు... గుండె పోటు లక్షణాలు వచ్చినప్పుడు ఛాతిలో నొప్పి విపరీతంగా కలిగి మెలి పెట్టినట్టు ఉంటుంది. ఈ సమయంలో విపరీతమైన చెమట పడుతుంది. వాంతి వచ్చే భావన ఉంటుంది. ఒక్కోసారి వాంతి కూడా అవుతుంది. కళ్లు బైర్లు కమ్ముతాయి. కాళ్లు, చేతులు చల్లబడతాయి. గుండె ఆగి ఆగి కొట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఛాతిలో అసౌకర్యంగా ఉన్నా, ఏదో బరువుగా ఛాతిపై పెట్టినట్టు అనిపిస్తున్నా శ్వాస ఆడడానికి ఇబ్బందిగా ఉన్నా అది గుండె పోటు సూచనగా భావించాలి. చాతిలో నొప్పి వచ్చి అది ఎడమ చేయి భుజంలోకి పాకుతున్నా విపరీతంగా చెమటలు పడుతూ ఇబ్బంది పడుతున్నా గుండె పోటుగా అనుమానించాలి. కింద దవడ నుంచి బొడ్డు వరకు ఎక్కడ నొప్పి అనిపించినా అనుమానంతో వైద్యులను సంప్రదించడం మంచిది. విపరీతంగా అలసిపోవడం ఒళ్లంతా నొప్పిగా ఉండటం వంటి లక్షణాలు తరుచు కనిపిస్తున్నా వాటిని అశ్రద్ధ చేయకూడదు. గుండెను ఇలా కాపాడుకుందాం... పిల్లలకు జంక్ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్‌కు దూరంగా ఉంచాలి. పాఠశాలల్లో తప్పనిసరిగా యోగాను ప్రవేశ పెట్టి అమలు చేయాలి. ప్రతీ ఒక్కరికి వ్యాయామంపై అవగాహన పెంచాలి. చికెన్ లెగ్స్, అధిక కొలెస్ట్రాల్ ఉండే ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలి. పాఠశాలలు, కళాశాలలు వద్ద పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు చేయకూడదు. బీపీ, షుగర్లను నియంత్రణలో ఉంచుకోవాలి. వైద్యులు సూచించిన వ్యాయామం చేయాలి. అధిక బరువును తగ్గించుకోవాలి. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. ఒత్తిడి లేని జీవితాన్ని గడిపేందుకు ప్రయత్నించాలి. ఇందుకోసం ప్రశాంత జీవితాన్ని కొనసాగించాలి. మనసు ప్రశాంతంగా ఉంచేందుకు ప్రకృతితో మమేకం కావాలి. తగినంత నిద్రపోవాలి. ఇది గుండెకు అదనపు శక్తినిస్తుంది. లిఫ్టులో వెళ్లే కంటే మెట్లు ఎక్కడం మంచిది. రక్తం చిక్కబడితే ప్రమాదం.. ఇటీవల కాలంలో గుండె పోటు కేసుల్లో ఎక్కువుగా 40 ఏళ్లు లోపు వారు 15 శాతం మంది వరకు ఉంటున్నారు. ధూమపానం, కోకైన్, డ్రగ్స్, ఖైనీ వంటివి తీసుకోవడం, ఆహారపు అలవాట్లు మారడం, వ్యాయామం లేక పోవడం, విపరీతమైన మానసిక ఒత్తిడి వంటి కారణాలతో యువకుల్లో గుండె పోటు వస్తుంది. రక్తం చిక్కగా ఉండడం వల్ల సడన్‌గా గుండె పోటు వస్తుంది. గుండె పోటు లక్షణాలు ఏమాత్రం కనిపించినా వైద్యులను సంప్రదించాలి.– డాక్టర్ ప్రకాష్ చంద్ రాణా,కార్డియాలజిస్టు -
అందని పరిహారం..ఆగిన రైతు గుండె!
ప్రభుత్వం తీరుతో ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. తిత్లీ తుపాను నష్టపరిహారం అందక రైతు గుండె బద్దలైంది. మందస మండలం అంబుగాం పంచాయతీ లింబుగాం గ్రామానికి చెందిన రైతు బదకల శ్రీనివాసరావు (33) వివిధ పంటలను సాగు చేస్తుండేవాడు. తిత్లీ తుపానుతో పది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. అయితే రూపాయి కూడా పరిహారం రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. గురువారం గుండె పోటుతో చనిపోయాడు. కుమార్తె పుట్టిన రోజునే ఈ విషాదం చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మందస: తిత్లీ తుపాను సమయంలో అనర్హులకు లక్షలాది రూపాయలను చెల్లించిన ప్రభుత్వం నిజంగా నష్టపోయిన వారిని మాత్రం విస్మరించింది. దీంతో అలాంటి వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అనారోగ్యంతో మంచం పడుతున్నారు. మందస మండలంలోని భేతాళపురంలో ఇప్పటికే ఒకరు చనిపోగా.. గురువారం ఓ రైతు గుండె ఆగిపోవడం చర్చనీయాంశవైంది. గత ఏడాది అక్టోబర్ 10, 11 తేదీల్లో సంభవించిన తిత్లీ తుపానుతో లింబుగాం గ్రామానికి చెందిన రైతు బదకల శ్రీనివాసరావు (33)కు తీవ్ర నష్టం వాటిల్లింది. ఏడు ఎకరాల్లో కొబ్బరి, మరో మూడు ఎకరాల్లో జీడి, మామిడి తోటలు, వరి పంట పూర్తిగా ధ్వంసమయ్యాయి. అప్పటి నుంచి శ్రీనివాసరావు తీవ్ర ఆవేదనకు గురవుతున్నాడు. సుమారు 10 ఎకరాల పంట నష్టం జరగడంతో పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం 5 ఎకరాలకు మాత్రమే నష్టపరిహారం మంజూరైనట్టు ఆన్లైన్లో చూపెడుతోంది. కొబ్బరి, జీడి, మామిడి పంటలకు మొత్తం రూ.3.87 లక్షలు మంజూరైనట్టు అధికారులు అతనికి తెలియజేశారు. అయితే ఆ డబ్బులు కూడా రైతు బ్యాంకు ఖాతాలో జమకాలేదు. గ్రామానికి చెందిన చాలామందికి పరిహారం డబ్బులు వచ్చినప్పటికీ తమకు ఎందుకు రాలేదోనని భార్య గీతాంజలి వద్ద శ్రీనివాసరావు రోజూ బాధపడుతుండేవాడు. తల్లిదండ్రులు సీతయ్య, ఇళ్లమ్మలకు శ్రీనివాసరావు ఒక్కగానొక్క కుమారుడు కాగా, వారసత్వంగా వచ్చిన తోట ఫలసాయంతో కుటుంబాన్నిపోషిస్తున్నాడు. కొంతమంది వ్యాపారుల వద్ద కూడా శ్రీనివాసరావు కొంతమొత్తాన్ని అప్పుగా తెచ్చాడు. అయితే ఇటీవల వీరి నుంచి డబ్బులను తిరిగి ఇవ్వాలని ఒత్తిడి రావడం, తిత్లీ తుపాను పరిహారం రూపాయి కూడా రాకపోవడంతో మనోవేనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే గురువారం గుండె ఆగి శ్రీనివాసరావు చనిపోయాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి కుమార్తె లాస్య (8), కుమారుడు లోహిత్ (6) ఉన్నారు. కుమార్తె పుట్టిన రోజునే తండ్రికన్నుమూత! కుమార్తె లాస్య 8వ పుట్టినరోజు గురువారమే. ఇదే రోజున తండ్రి మరణించడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు స్థానికులను కలచివేసింది. భార్య గీతాంజలిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. సీదిరి పరామర్శ గుండెపోటుతో చనిపోయిన శ్రీనివాసరావు కుటుంబాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలాస నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ సీదిరి అప్పలరాజు పరామర్శించి ఓదార్చారు. మృతదేహంపై పూలదండను ఉంచినివాళులు అర్పించారు. ఆయనతో పాటు పార్టీ జిల్లా కార్యదర్శి డొక్కరి దానయ్య, పార్టీ నాయకులు బదకల జానకిరావు, మద్దిల బాలకృష్ణలు కూడా ఉన్నారు. యాదవకుల సంక్షేమ సంఘం సంతాపం పంట నష్టపరిహారం అందక మరణించిన శ్రీనివాసరావు కుటుంబాన్ని యాదవ కుల సంక్షేమ సంఘం నాయకులు రాపాక చిన్నారావు, మామిడి మాధవరావులు పరామర్శించి తీవ్ర సంతాపం తెలియజేశారు. తిత్లీ తుపాను ప్రభావం ఉద్దానంపై ఎలా ఉంటుందో ప్రభుత్వానికి, జిల్లా అధికారులకు వివరించామని, అయినా వారిలో స్పందనలేదన్నారు. బాధితులకు నష్టపరిహారం అందకపోతే మరిన్ని ప్రాణాలు పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.