గాలిలో ప్రాణాలు | RTC Driver Died With Heart Stroke In Bus Chittoor | Sakshi
Sakshi News home page

గాలిలో ప్రాణాలు

Published Tue, Jun 5 2018 8:41 AM | Last Updated on Tue, Jun 5 2018 8:41 AM

RTC Driver Died With Heart Stroke In Bus Chittoor - Sakshi

ఆదివారం రాత్రి కూర్చున్న సీటులోనే ప్రాణాలు విడిచిన డ్రైవర్‌ అరుణాచలం

అరుణాచలం..వయసు 64ఏళ్లు..ఆర్టీసీ డ్రైవరు. ఆదివారం రాత్రి చెన్నై నుంచి 50మంది ప్రయాణికులున్న బస్సు నడుపుకుంటూ తిరుపతి వస్తున్నాడు. రెడ్‌ హిల్స్‌ వద్ద అనారోగ్యంగా అనిపించింది. బస్సుఆపి మాత్ర వేసుకున్నారు. పిచ్చాటూరు మండలం కీళపూడి వచ్చేసరికి గుండెలో నొప్పి తీవ్రమైంది. బస్టాండులో ఆపి మాత్ర వేసుకుని బస్సు నడిపేందుకు సన్నద్ధమవుతుండగా స్టీరింగ్‌పై కుప్పకూలిపోయాడు..ప్రాణాలు విడిచాడు. గడచిన ఆర్నెళ్ల కాలంలో జిల్లాలో ఆరుగురు విధి నిర్వహణలోనే ప్రాణాలు కోల్పోయారు. 10 మంది అనారోగ్యంతో చనిపోయారు.

తిరుపతి సిటీ: ఆర్టీసీలో డ్రైవర్లు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. విధినిర్వహణలో జరగరానిది జరిగితే ప్రయాణికుల ప్రాణాలకు కూడా ముప్పే. తరచూ జిల్లాలో ఎక్కడో చోట బస్సు నడుపుతూ అనా రోగ్యం పాలవుతున్న సంఘటనలు ఎక్కువవడం చర్చనీయాంశమైంది. జిల్లాలో 14 డిపోల్లో 3,600 మంది డ్రైవర్లు ఉన్నారు. అందులో తిరుమల–తిరుపతి 416 వన్‌మెన్‌ సర్వీసులతోపాటు మరో 200 వన్‌మెన్‌ సర్వీసులను బెంగళూరు, చెన్నై, శ్రీకాళహస్తి, పుత్తూరుకు నాన్‌ స్టాప్‌ పేరుతో నడుపుతున్నారు. ఎక్కువగా ఒత్తిళ్లకు లోనై మృత్యువాత పడుతున్నారు.

అధికారుల వేధింపులు..మానసిక ఒత్తిడికి గురై.....
డ్రైవర్లకు పనిభారమెక్కువవుతోంది. ‘కిలోమీటరు–ఇంధన వినియోగం’పై ఆంక్షలు పెడుతుండటంతో వీరు ఒత్తిడికి గురవుతున్నారు. ఎక్స్‌ప్రెస్‌లలో కండక్టరు ఉండరు. డ్రైవరే టిమ్‌ మిషన్లతో టికెట్‌ కొట్టి డబ్బులు తీసుకోవాలి. ‘చిల్లర’ సమస్యలతో ప్రశాంత చిత్తానికి దూరమవుతున్నారు. నాలుగేళ్ల కిందట స్పెషల్‌ ఆఫ్‌ డ్యూటీలకు 300–400 కిలోమీటర్ల నడిపేవారు. ఇప్పుడు 500–700 కిలోమీటర్ల వరకు బస్సులను తప్పనిసరిగా నడపాల్సిన పరిస్థితి. 10 గంటలకు పైగా పనిచేయిస్తున్నారని డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు.  ఎక్కువ ఆదాయం తీసుకు రావాలని బలవంతపెడుతున్నారని వాపోతున్నారు. లేనిపక్షంలో చార్జిషీట్‌ ఇప్పిస్తామని, సస్పెండ్‌ చేస్తామని భయపెడుతున్నారు. కలెక్షన్‌ తక్కువ తీసుకొస్తున్నారనే నెపంతో కండక్టర్లను, టిమ్‌ మిషన్ల డ్రైవర్లను టీఐ–3 స్థాయి అధికారులు మనోవేదనకు గురిచేస్తున్నారనే ఆరోపణ లున్నాయి.

ఇవిగో ఉదాహరణలు..
ఆదివారం తిరుమల డిపోకు చెందిన అరుణాచలం బస్సు డ్రైవర్‌ గుండె పోటుకు గురై స్టీరింగ్‌ మీదనే ప్రాణా లొదిలాడు.
పుత్తూరు డిపోకు చెందిన డీఎస్‌.రాజు, ఆయన కుమారుడు డి.ఉదయ్‌ భాస్కర్‌ గుండెపోటుకు గురై చనిపోయారు.
సదుంకు చెందిన వైఆర్‌.బాబు సత్యవేడు డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తూ గుండెపోటుకు గురై మృతి చెందాడు.
నగరికి చెందిన కృష్ణ మంగళం డిపోలో విధి నిర్వహణలో ప్రాణాలొదిలాడు.
ఇటీవల కాలంలో 10 మందికి పైగా ఆనారోగ్య సమస్యలతో మృతి చెందారు.

7,200 మందికి ఇద్దరే వైద్యులు..
చిత్తూరు, తిరుపతి డివిజన్లలోని 7,200 మంది ఆర్టీసీ కార్మికులకు ఇద్దరే వైద్యులున్నారు. చిత్తూరులోని డిస్పెన్సరీలో ఒక రు, తిరుపతిలో ఒకరు విధులు నిర్వహిస్తున్నారు. వారు కూడా స్పెషలిస్టులు కారు. 45 ఏళ్లకు పైబడిన డ్రైవర్లకు 3 ఏళ్లకు ఒక్కసారి వైద్య పరీక్షలు నిర్వహించి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాల్సి ఉంది. అనుభవం లేని వైద్యులతోనే కంటిచూపు పరీక్షలు చేయ డం, బరువు, ఎత్తు, పొడవు పరీక్షించి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. లేదంటే విజయవాడకు రెఫర్‌ చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఆనారోగ్యం బారినపడిన కార్మికులకు ‘సిక్‌’ సర్టిఫికెట్లను మంజూరు చేయరాదని ముందస్తుగానే ఆర్‌ఎం, డిపో మేనేజర్లు వైద్యులకు హుకుం జారీ చేస్తున్నారు. సెలవులు లేకపోవడం, పలు రకాల జబ్బులతో నిత్యం సతమతమవుతున్నారు.  కనీ సం చిత్తూరు, తిరుపతి లాంటి నగరాల్లో కార్పొరేట్‌ ఆసుపత్రులలో పరీక్షలు చేయించుకునేలా అధికారులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కార్మికులు చెబుతున్నారు.

2013 నుంచి భర్తీకి నోచుకోని పోస్టులు..
ఆర్టీసీలో 2013 నుంచి ఇప్పటివరకు డ్రై వర్ల పోస్టులు భర్తీ చేయలేదు. 2011లో ఎస్సీ,ఎస్టీ డ్రైవర్ల పోస్టులు 81 ఖాళీలకు గాను ఇటీవల 36 మందిని భర్తీ చేశారు. తిరుపతి డివిజన్‌ పరిధిలోని 7 డిపోల్లో డ్రై వర్ల కొరత తీవ్రంగా ఉంది. చిత్తూరు డివిజన్‌ పరిధిలోని డ్రైవర్లు ఉన్నప్పటికీ  విధులు నిర్వహిస్తున్న వారిలో ఎక్కువ మందిని తిరుపతి, అలిపిరి, తిరుమల, మంగళం డిపోలకు బదిలీ చేస్తున్నారు. దీంతో వారు అక్కడ్నుంచి వచ్చి ఇక్కడ డ్యూటీలు చేసుకుని తిరిగి వారి సొంత ఊళ్లకు వెళ్లాల్సి ఉంది.

కార్మికులకు పెరిగిన పనిభారం..         
క్రమంగా కండక్టర్లను తొలగిస్తూ వస్తున్నారు. డ్రైవర్ల చేతి వారి విధులు చేయిస్తున్నారు. వన్‌మ్యాన్‌ సర్వీసుల పేరుతో లాంగ్‌ సర్వీసులను నడుపుతున్నారు.   ఎక్స్‌ప్రెస్, లగ్జరీ, సూపర్‌ డీలక్స్‌ బస్సులకు 55 సంవత్సరాల్లో ఉన్నవారిని డ్రైవర్లుగా పంపిస్తున్నారు. డిమాండ్‌ పేరుతో కొన్నిసార్లు డ్రైవర్‌ చేతనే డబుల్‌ డ్యూటీలు చేయిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. విధి గంటలు కూడా పది దాటిపోతున్నాయి.

చార్టు ప్రకారమే డ్యూటీలు
సీనియర్‌ డ్రై వర్లకు కోరుకున్న విధంగా ఛార్టు ప్రకారం డ్యూటీలు వేస్తున్నాం. చెన్నయ్‌కు వెళ్లే రహదారిలో పుత్తూరు నుండి ఊతుకోట వరకు రో డ్డు పూర్తిగా పాడైంది. ఆనార్యోగ సమస్యలు తలెత్తినప్పుడు సెలవులు మంజూరు చేస్తున్నాం.. 45 ఏళ్లు పైబడి వారికి  వైద్య పరీక్షలు చేయిస్తున్నాం.- ఎం.భాస్కర్‌రెడ్డి, ఇన్‌చార్జ్‌ డిప్యూటీ సీటీఎం,  తిరుపతి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement