బస్సు చక్రాలకింద పడి మృతి చెందిన తల్లీబిడ్డలు
ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్‌కు ఆర్టీసీ డ్రైవర్ దారి వదలకుండా బస్సు నడపడంతో బైక్ అదుపు తప్పింది. ఈ సంఘటనలో బైక్ వెనుక సీటులో కూర్చున్న తల్లీబిడ్డలు బస్సు వెనుక చక్రాల కిందపడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బైక్ నడుపున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన గురువారం మదనపల్లె మండలం బొమ్మనచెరువులో చోటుచేసుకుంది.
చిత్తూరు, మదనపల్లె టౌన్: రూరల్ పోలీసులు, స్థానికులు, మృతుల కుటుంబ సభ్యుల కథనం.. రామసముద్రం మండలం గుంతలపేటకు చెందిన నారాయణస్వామి (37) కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. రామసముద్రంలోని చెంబకూరు రోడ్డులో ఓ అద్దె ఇంటిలో నివసిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య శివమ్మ, పిల్లలు ప్రసన్న, బాబు ఉన్నారు. ఈ నేపథ్యంలో సొంతపనిపై మోటార్ సైకిల్‌లో మదనపల్లెకు భార్య, కుమారుడిని వెంట తీసుకుని బయలుదేరాడు. మార్గమధ్యంలోని బొమ్మనచెరువు వద్ద మదనపల్లె నుంచి రామసముద్రం వైపు వస్తున్న మదనపల్లె–2 డిపో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడుపుతూ బైక్‌ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో బైక్ నుంచి అదుపు తప్పి తల్లీబిడ్డలిద్దరూ బస్సు వెనుక చక్రాల కింద పడ్డారు. ఈ దుర్ఘటనలో బస్సు టైర్లు శివమ్మ, బాబు మీదుగా వెళ్లడంతో ఇద్దరూ అక్కడిక్కడే దుర్మరణం చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న నారాయణస్వామిని 108 సిబ్బంది గోపి, అమర హుటాహుటిన మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలికి రూరల్ సీఐ రమేష్, ఎస్‌ఐ దిలీప్ చేరుకుని పరిశీలించారు. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం వలనే ప్రమాదం జరిగిందని నిర్ధారించుకున్నారు. పంచనామా అనంతరం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మిన్నంటిన బంధువుల రోదన
ఆర్టీసీ బస్సు ఢీకొని మదనపల్లె సమీపంలో కోడలు శివమ్మ, మనవడు బాబు చనిపోయారని సమాచారం అందుకున్న హనుమన్న వారి కుటుంబ సభ్యులు ఉరుకులు పరుగులతో బొమ్మనచెరువుకు చేరుకున్నారు. మృతులను చూసి గుండెలవిసేలా రోదించారు. వారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. అక్కడికి వచ్చిన ఆర్టిసీ అధికారులపై స్థానికులు, మృతుల బంధువులు గొడవకు దిగారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఇద్దరి ప్రాణాలు పోయాయని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment