సాక్షి, హైదరాబాద్: ఓ పోలీసాఫీసర్.. డ్యూటీలో ఉంటాడు.. తనపై ఏదో విష ప్రయోగం జరుగుతుంది.. ఛాతీలో నొప్పి మొదలై గుండెపోటు వస్తుంది. అది గుర్తించిన ఆయన మెల్లగా కారు దగ్గరికి వెళ్తాడు.. అందులో ఉన్న ఓ పరికరంతో ఛాతీపై షాక్ ఇచ్చుకుంటాడు. గుండెపోటు నుంచి బయటపడతాడు.. ఇదంతా ‘కాసినో రాయల్’జేమ్స్‌బాండ్ సినిమాలో ఓ సీన్. అందులో షాక్ ఇచ్చుకున్న పరికరం ‘ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్’. ఇదేదో సినిమా అని కాదు. నిజంగా పనిచేసే పరికరం. గుండెపోటు వచ్చినవారి ప్రాణాలను కాపాడే పరికరం. అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లో ఇలాంటి పరికరాలు విస్తృతంగా అందుబాటులో ఉంటాయి. పెద్ద బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలోనూ సిద్ధంగా ఉంచుతారు. కానీ మన దగ్గర మాత్రం ముఖ్యమంత్రుల కాన్వాయ్‌లో కూడా ఈ పరికరాలు లేని పరిస్థితి ఉందని నిపుణులు చెప్తున్నారు.
కోవిడ్ ప్రభావంతో గుండె సమస్యలు పెరిగి..
కరోనా మొదలైనప్పటి నుంచీ.. వైరస్ ప్రభావంతోపాటు పలు ఇతర కారణాలతో గుండె సమస్యలు పెరిగాయి. 25 ఏళ్లవారి నుంచి వృద్ధుల వరకు గుండెపోటు బారినపడుతున్నారు. ఆకస్మికంగా వచ్చే ఈ సమస్యకు తక్షణమే ప్రాథమిక చికిత్స అందించకుంటే పరిస్థితి చేయిదాటుతుంది. ఎవరైనా గుండెపోటుకు గురైతే ఐదారు నిమిషాల్లోగా కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) చేస్తూ, ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేషన్ (ఏఈడీ) పరికరంతో షాక్ ఇస్తే.. ప్రాణాపాయం నుంచి 70–80 శాతం వరకు కాపాడొచ్చు. కానీ మన దేశంలో ఇటువంటి వాటిపై తగిన అవగాహన లేదు. పాశ్చాత్య దేశాల్లో ప్రజలకు సీపీఆర్‌పై శిక్షణ ఇస్తారు. అమెరికా, పలు యూరప్ దేశాల్లో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలోనూ ఏఈడీలు అందుబాటులో ఉంటాయి. ఎవరికైనా గుండెపోటు వస్తే వెంటనే ప్రాథమిక చికిత్స అందుతుంది. ఈ పరికరం ధర లక్ష రూపాయలలోపే ఉంటుంది. ఇంత ప్రాధాన్యమున్న ఈ పరికరాన్ని మన దగ్గర సీఎం కాన్వాయ్‌లలోనూ పెట్టడం లేదని.. అంటే ఈ విషయంగా ఎంత వెనుకబడి ఉన్నామో అర్థం చేసుకోవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. మన దేశంలో కేవలం 2 శాతం మందికే సీపీఆర్ తదితర అంశాలపై అవగాహన, చైతన్యం ఉందని చెప్తున్నారు.
ప్రాణాలు కాపాడొచ్చు..
గుండెపోటుకు గురైనవారికి ఆస్పత్రికి తరలించే లోపు ప్రాథమిక చికిత్స అందించే ప్రక్రియను ‘బేసిక్ లైఫ్ సపోర్ట్ లేదా కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్)’అంటారు. ఛాతీపై తగిన విధంగా అదుముతూ ఉండటం, నోటిద్వారా ఊపిరి అందించడం వంటి పలు ప్రక్రియలు దీనిలో భాగంగా ఉంటాయి. డాక్టర్లు, నర్సులు వంటి వైద్య సిబ్బంది మాత్రమే కాకుండా సాధారణ ప్రజలకు కూడా వీటిపై అవగాహన కల్పిస్తే.. ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడొచ్చు. గుండెపోటు వచ్చిన తర్వాత ప్రతీ నిమిషం ఆలస్యానికి ఏడెనిమిది శాతం ప్రాణాపాయం పెరుగుతుంది. ఎంత త్వరగా సీపీఆర్ చేస్తే.. అంతగా కాపాడే అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.7 కోట్ల మంది గుండె జబ్బులతో మరణిస్తున్నారు. మన దేశంలోనూ గుండె జబ్బులతో చనిపోయేవారిలో 60 శాతం మంది సడన్ కార్డియాక్ షాక్ ద్వారానే మరణిస్తున్నారు. ఇందులో చాలా వరకు ఇళ్లలో, బయట ఇతర ప్రదేశాల్లో జరుగుతున్నవేనని.. సీపీఆర్ శిక్షణ, ఏఈడీ పరికరాలను అందుబాటులో ఉంచితే చాలా మందిని రక్షించవచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
సామాన్య ప్రజల్లో అవగాహన కల్పించాలి
గుండెపోటు వచ్చినప్పుడు ఎంత త్వరగా స్పందించి సీపీఆర్, ఏఈడీలతో ప్రాథమిక చికిత్స చేస్తే అంత బాగా ఫలితం ఉంటుంది. కోవిడ్‌తో గుండె సంబంధిత సమస్యలు, గుండెపోట్లు పెరుగుతున్నాయి. అందువల్ల సీపీఆర్, ఏఈడీ తదితర అంశాల్లో ప్రజల్లో విస్తృతంగా చైతన్యం కల్పించాలి. శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. కొన్ని నగరాల్లో సామాన్య ప్రజానీకానికి ఏఈడీ అందుబాటులో ఉంది. ఉదాహరణకు పాశ్చాత్య దేశాల్లో మాల్స్, మల్టీప్లెక్సులు, ఎయిర్‌పోర్టుల్లో అందుబాటులో ఉంటాయి.
– డాక్టర్ విజయ్‌రావు, ఎండీ (యూఎస్), రిససియేషన్ మెడిసిన్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment