మరణించినా మరొకరికి జీవనం.. అవయవ దానంపై ఎందుకింత నిర్లక్ష్యం? | Why India Still Lags Behind In Organ Donation | Sakshi
Sakshi News home page

మరణించినా మరొకరికి జీవనం.. అవయవ దానంపై ఎందుకింత నిర్లక్ష్యం?

Published Wed, Mar 6 2024 7:36 PM | Last Updated on Wed, Mar 6 2024 8:08 PM

Why India Still Lags Behind In Organ Donation - Sakshi

దానాలన్నిట్లోకెల్లా ఫలానా దానమే గొప్పదని తరచూ అంటుంటాం. సందర్భాన్ని బట్టి ఒక్కోసారి విద్యాదానమనీ, అన్నదానమనీ, ఇలా ఆ పేరు మారుతుంటుందంతే. కానీ ఎప్పటికీ మారని గొప్పదానం ప్రాణదానం. దానికి దోహదపడేదే అవయవదానం. ప్రస్తుతం అవయవాల అవసరం ఉన్నవారు ఎక్కువగానూ, వాటిని దానం చేసే వారి సంఖ్య తక్కువగానూ ఉంది. 

మన సమాజంలో ఎన్నో అపోహలు రాజ్యమేలుతున్నాయి. అవగాహన లేకపోవడం వల్ల ఇందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. అయితే మరణించిన వ్యక్తికి ఏమాత్రం పనికిరాని అవయవాలు మరెందరి ప్రాణాలనో నిలబెడతాయనే విషయాన్ని చాలావరకు గుర్తించడం లేదు.  మట్టిలో కలవడం కంటే.. కట్టెలో కాలడం కంటే ఇతరులకు ప్రాణదానం చేయడం ఎంతో మేలని ప్రతివారిలోనూ అవగాహన కలగాలి.

అప్పుడే మరెందరో అవయవార్థులు జీవం పుంజుకొని సమాజంలో తమవంతు బాధ్యతలను పోషిస్తారు. ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు కొద్దిగా చైతన్యం వచ్చినా అవయవాల కోసం ప్రస్తుతం ఉన్న డిమాండ్‌తో పోలిస్తే లభ్యత తక్కువే. అపోహలు తొలగి మరింత మంది అవయవదానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది.

భారత్‌లో అవయవ దానం పరిస్థితి ఎలా ఉంది?
దేశంలో అవయవ దానం గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి.  అవయవాలు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రతి సంవత్సరం సుమారు 5 లక్షల మంది మరణిస్తున్నారు. దీనివల్ల తమ వారి ప్రాణాలను నిలుపుకోవడం కోసం వారి బంధువులు పడుతున్న వేదన ఎంత వర్ణనాతీతంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కేవలం మూత్రపిండాల  కొరతతోనే దేశంలో ప్రతి 5 నిమిషాలకు ఒక ప్రాణం బలవుతోంది. ఫలితంగా ప్రతి ఏటా 1,00,000 మరణాలు సంభవిస్తున్నాయి

మూత్రపిండాలు: దేశంలో దాదాపు 2,00,000 మూత్రపిండాలు అవసరం ఉండగా.. కేవలం 4,000 మార్పిడి (2 శాతం) మాత్రమే జరుగుతుంది.
కాలేయం: లక్షమందికి కాలేయం అవసరం ఉండగా..500 (0.5%) మాత్రమే లభిస్తున్నాయి.
గుండె: 50,000 మందికి గుండె అవసరం ఉంది.కానీ 50 మార్పిడులు (0.1%). మాత్రమే జరుగుతున్నాయి.
కార్నియా: 1,00,000 ప్రజలకు కార్నియా అవసరం. అయితే 25,000 మాత్రమే (25 శాతం) అందుబాటులో ఉంది.   

అవయవ దానం విషయంలో భారత్‌ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. వీటిలో ముఖ్యమైనవి
అవగాహన లేకపోవడం:  చాలా మందికి అవయవ దానం గురించి తెలియదు.
అపోహలు, మూఢనమ్మకాలు, మత విశ్వాసాలు: అవయవ దానానికి ఆటంకాలుగా మారాయి.
కఠినమైన చట్టాలు: కూడా దీనిని ప్రభావితం చేస్తాయి. ఎక్కువ మంది మహిళలు దానం చేస్తారు. కానీ తక్కువ మంది అవయవాలను అందుకుంటారు.
ఆసుపత్రుల కొరత: దేశంలో కేవలం 301 ఆసుపత్రులు మాత్రమే ట్రాన్స్ ప్లాంటేషన్  చేస్తున్నాయి. 
జనాభా పెరుగుదల: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సౌకర్యాలు లేకపోవడం.. పై కారణాలతో భారత్‌లో అవయవ దానాల రేటు కేవలం 0.34శాతం మాత్రమే ఉంది.

ఇక పోతే మరణించిన వారి అవయవాలను దానం చేసేందుకు ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం 2019లో రూ.149.5 కోట్ల బడ్జెట్‌తో జాతీయ అవయవ మార్పిడి కార్యక్రమం ప్రారంభించింది. అవయవ దాన రేటులో తమిళనాడు వంటి రాష్ట్రాలు ముందున్నాయి. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి అవగాహన ప్రచారాలు, విద్య, సమాజ ప్రమేయం చాలా అవసరం.

మానవ అవయవాలు, కణజాలాల మార్పిడి చట్టం, 1994 ప్రకారం అవయవ దానం జీవించి ఉన్న దాత ను చి లేదా బ్రెయిన్‌ డెడ్‌ అయిన దాత చేయవచ్చు. బ్రెయిన్‌ డెత్‌ అనేది రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయం కావడం వల్ల లేదా మరే కారణం చేతనైనా మెదడులో రక్తనాళం చిట్లడం వల్ల సంభవిస్తుంది. శాశ్వతంగా మెదడు పని చేయకపోవడాన్ని బ్రెయిన్‌డెత్‌గా నిర్ధారిస్తారు. జీవించి ఉన్న వారు కిడ్నీలు, ప్యాంక్రియాస్‌లోని భాగాలు, కాలేయంలోని భాగాలను దానం చేయవచ్చు. మరణం తర్వాత మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, ప్యాంక్రియాస్ పేగులను దానం చేయవచ్చు . 

అవయవ దానం అవశ్యకత ను దాని ప్రాముఖ్యతను విరివి గా ప్రచారం చేయాల్సిన అవస రం ఉన్నది. దాతగా మారాలనే నిర్ణయం ఎనిమిది మంది జీవితాలను కాపాడుతుంది. అవయవ దానం చేయడం వల్ల ఇతరులకు ఆనందాన్ని, చిరునవ్వులను అందించవచ్చు. కేవలం ఒక అవయవాన్ని దానం చేయడం ద్వారా మరణించిన వారు సైతం శాశ్వతంగా జీవించవచ్చు.

చివరగా.. అవయవదానంపై అవగాహనను పెంచి అపోహాలను దూరం చేద్దాం.  అవయవ దానాన్ని ప్రోత్సహించి,  అవసరమైన వారికి జీవితాన్ని బహుమతిగా ఇద్దాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement