brain dead
-
మరణిస్తూ మరికొందరికి ప్రాణం పోసి..
మల్కాపురం/సింహాచలం/తిరుపతి తుడా: రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన జర్నలిస్ట్ అవయవాలను దానం చేసి, వారి కుటుంబ సభ్యులు ఆదర్శంగా నిలిచారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో మల్కాపురం గొల్లవీధికి చెందిన ఉరుకూటి మురళీకృష్ణయాదవ్(52) ఓ పత్రికలో రిపోర్టర్‌గా పనిచేస్తూ సింహాచలం దరి అడవివరంలో మెడికల్ షాపు నిర్వహిస్తూ అక్కడే నివసిస్తున్నాడు. అతనికి భార్య శిరీష, బీటెక్ చదువుతున్న కుమారుడు, బీటెక్ పూర్తిచేసిన కుమార్తె ఉన్నారు. ఈ నెల 14న బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడటంతో తలకు గాయమై స్పృహ కోల్పోయాడు. చికిత్సకు స్పందించకపోవడంతో మంగళవారం వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు జీవన్‌దాన్ అధికారులకు సమాచారం అందించారు. జీవన్‌దాన్ కో ఆర్డినేటర్ డాక్టర్ రాంబాబు ఆస్పత్రికి వచ్చి, మృతుడి నుంచి రెండు కిడ్నీలు, కాలేయం, గుండె, కళ్లు సేకరించారు. 22 ఏళ్ల యువకుడికి గుండె మార్పిడిప్రకాశం జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువకుడికి మురళీకృష్ణ యాదవ్ గుండెను తిరుపతిలోని శ్రీ పద్మావతీ కార్డియాక్ కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా అమర్చారు. -
మాతృ స్పర్శను ఆస్వాదించకుండానే..
కాజీపేట: ‘ఒక దీపం వెలిగించును వేలకొలది జ్యోతులు. ఒక దీపం చూపించును ప్రగతికి రహదారులు’ అన్నాడో కవి. ఓ యువతి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి అచేతనావస్థకు చేరుకోవడంతో జీవచ్ఛవంలా మారింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఎంత ఖరీదైన వైద్యం చేసినా బతికే అవకాశం లేదని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యుల అంగీకారంతో అవయవదానం చేసి నలుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. కానీ ఆ యువతి మాతృ స్పర్శను ఆస్వాదించకుండానే కన్నుమూసింది. ఈ విషాద ఘటన కాజీపేటలో శనివారం జరిగింది. బాపూజీనగర్ కాలనీకి చెందిన వశాపాక శ్రీనిత (23) పదిరోజుల కింద ఆడశిశువుకు జన్మనిచ్చి తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శ్రీనిత ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే శ్రీనిత బ్రెయిన్ వాపు వచ్చి కోమాలోకి వెళ్లింది. చికిత్సకు ఆమె స్పందించకపోవడంతో బతికే అవకాశం లేదని, బ్రెయిన్ డెడ్ అని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. పుట్టిన బిడ్డ కనీసం తల్లి స్పర్శకు నోచుకోలేదు. ఇక.. ఎప్పటికీ తిరిగిరాని తమ బిడ్డ మరో నలుగురి జీవితాల్లో వెలుగులు నింపితే చాలని కన్నవాళ్లు, భర్త అవయవదానానికి అంగీకరించారు. శ్రీనిత కళ్లు, గుండె, కిడ్నీలు, లివర్లను వైద్యులు శస్త్ర చికిత్స చేసి మరో నలుగురికి అమర్చారు. బిడ్డ పుట్టిందనే విషయం తెల్సి మురిసిపోయిన శ్రీనిత.. ఆ బిడ్డ ఆత్మీయ స్పర్శను ఆస్వాదించకుండానే కన్నుమూసింది. బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య శనివారం రాత్రి బాపూజీనగర్‌లో అంత్యక్రియలు పూర్తి చేశారు. -
పుట్టెడు దుఃఖంలోనూ అవయవదానం
విజయనగరం ఫోర్ట్: పుట్టెడు దుఃఖంలోనూ ఆ తల్లిదండ్రులు గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు అనంతలోకాలకు వెళ్లిపోతుందని తెలిసి అవయవదానానికి అంగీకరించి ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం మురపాక గ్రామానికి చెందిన గండి వెంకటరమణ ఈ నెల 20న భార్య దేవి, కుమార్తె పల్లవి (11)తో కలిసి ద్విచక్రవాహనంపై మండలంలోని ఎగువ కొండపర్తిలోని వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా అనంతగిరి మండలం ఎన్.ఆర్.పురం వద్ద బ్రేక్ ఫెయిల్ కావడంతో రోడ్డు పక్కన ఉన్న తుప్పల్లో పడిపోయారు. తుప్పల్లో ఉన్న రాళ్లపై పడడంతో పల్లవి తలకు తీవ్ర గాయమైంది. వెంకటరమణ కాలుకు, భార్య దేవి చేతికి గాయాలయ్యాయి. ప్రమాద బాధితులను వెంటనే గ్రామస్తులు ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పల్లవి పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరంలోని తిరుమల మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు పల్లవికి బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. పాప అవయవాలు దానం చేస్తే మరికొందరికి పునర్జన్మనిచ్చినట్లు అవుతుందని మెడికవర్ వైద్యులు పల్లవి తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. దీంతో వారు అవయవదానానికి అంగీకరించారు. తిరుమల మెడికవర్ ఆస్పత్రిలో పల్లవి శరీరం నుంచి శుక్రవారం రెండు కిడ్నీలు, కళ్లలోని కార్నియాలను సేకరించారు. కిడ్నీలను గ్రీన్ చానల్ ద్వారా అంబులెన్సులో విశాఖపట్నం మెడికవర్ ఆస్పత్రికి ఒకటి, కిమ్స్ ఐకాన్‌కు మరొకటి తరలించారు. నేత్రాలను విశాఖపట్నం ఎల్.వి.ప్రసాద్ ఐ ఆస్పత్రికి తరలించారు. అవయవదానానికి ముందుకొచి్చన పల్లవి తల్లిదండ్రులకు ఆస్పత్రి వైద్య సిబ్బంది, గ్రామస్తులు అభినందనలు తెలిపారు. -
ఆ ఇద్దరిపై చర్యలేవీ!?
తెనాలి రూరల్: రౌడీషీటర్ రాగి నవీన్ చేసిన అమానుష దాడిలో బ్రెయిన్ డెడ్ అయి మరణించిన సహానా కేసు విచారణలో మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. పోలీసులు అరెస్టు చేసిన నిందితుడితోపాటు అతని స్నేహితులపై చర్యలు తీసుకోకపోవడం వీరి అనుమానాలకు ప్రధాన కారణం. ఈనెల 19న సాయంత్రం 6.20 గంటల ప్రాంతంలో సహానాను నవీన్ తన కారులో తీసుకెళ్లి తెనాలి మండలం కఠెవరం నుంచి ఎరుకలపూడి వెళ్లే మార్గంలో ఆమైపె దాడిచేశాడు.సహానా వాంతులు చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆమెను తెనాలి ఆర్టీసీ బస్టాండ్ వెనుకనున్న ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులు అందుబాటులో లేరని చెప్పడంతో సహానా తల్లి అరుణకుమారికి ఫోన్‌చేసి విషయం చెప్పి ప్రకాశం రోడ్డులోని మరో వైద్యశాలకు తన ఇద్దరు స్నేహితులతో కలిసి తీసుకెళ్లాడు. అక్కడకు సహానా తల్లి వెళ్లగానే ముగ్గురూ జారుకున్నారు. ఇక పోలీసులకు అరుణకుమారి ఇచ్చిన ఫిర్యాదులో నవీన్, అతని స్నేహితుల ప్రస్తావన ఉంది కానీ, 22వ తేదీ సాయంత్రం మీడియాకు నవీన్ అరెస్టు విషయాన్ని పోలీసులు వెల్లడించిన సందర్భంలో నిందితుడి స్నేహితుల ప్రస్తావనలేదు.దర్యాప్తు ‘సాగు..తోందంట’!సహానా హత్య కేసులో రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరపడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామానికి చెందిన మార్కెట్ యార్డు మాజీ చైర్మన్, టీడీపీ నాయకుడు వంగా సాంబిరెడ్డికి నవీన్ ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు. చంద్రబాబు సమక్షంలోనే టీడీపీలో చేరాడు. కేంద్రమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అనుచరుడిగా మొన్నటి ఎన్నికల్లో చురుగ్గా పనిచేశాడు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే కేసు దర్యాప్తు సరిగ్గా జరగడంలేదని సహానా కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. నవీన్‌తో పాటు ఉన్న ఇద్దరు స్నేహితులను దత్తు, సుమంత్లుగా పోలీసులు గుర్తించినా వారిపై చర్యల్లేవు. కేసు పురోగతిపై టూటౌన్ సీఐ నిసార్ బాషాను వివరణ కోరగా.. ఇంకా పూర్తిస్థాయిలో విచారించాల్సి ఉందని పేర్కొన్నారు. -
‘చచ్చి’ బతికాడు!
అమెరికాలోని కెంటకీలో థామస్ హోవర్ అనే 36 ఏళ్ల వ్యక్తి డ్రగ్ ఓవర్‌డోస్ వల్ల గుండెపోటుకు గురయ్యాడు. హుటాహుటిన బాప్టిస్ట్ హెల్త్ రిచ్మండ్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అతనిక బతికి బట్ట కట్టడం కల్లేనని వైద్యులు తేల్చారు. అవయవ దానం చేసి ఉండటంతో ముందుగా గుండెను సేకరించాలని నిర్ణయించారు. ఆపరేషన్ టేబుల్‌పైకి తీసుకెళ్లి సరిగ్గా కత్తులూ, కటార్లకు పని చెప్పబోయే సమయానికి మనవాడు ఉన్నట్టుండి కళ్లు తెరిచాడు! కాళ్లూ చేతులూ కదిలించేందుకు ప్రయతి్నంచాడు. తన పరిస్థితి అర్థమై కన్నీరు పెట్టుకున్నాడు. ఇదంతా చూసి డాక్టర్లంతా దిమ్మెరపోయారు. దాంతో అవయవ సేకరణ ప్రయత్నాలకు స్వస్తి చెప్పారు. ఇది 2021 అక్టోబర్‌లో జరిగితే ఆస్పత్రి వర్గాలు మాత్రం వెలుగులోకి రానివ్వలేదు. కనీసం హూవర్ కుటుంబీకులకు కూడా సమాచరమివ్వలేదు. పైగా అతనిలో కనిపిస్తున్న ప్రాణ లక్షణాలను పట్టించుకోకుండా అవయవాలను సేకరించాల్సిందిగా డాక్టర్లపై ఒత్తిడి తెచ్చాయి. వారు నిరాకరించడంతో వేరే వైద్యులను నియోగిస్తే వాళ్లు కూడా చేతులెత్తేశారు. దీనికి ప్రత్యక్ష సాక్షి అయిన ఆస్పత్రి మాజీ ఉద్యోగి ఒకరు గత జనవరిలో హూవర్ సోదరి డోనాకు విషయం చేరవేయడంతో ఇదంతా వెలుగులోకి వచ్చింది. చివరికి వైద్యుల సలహా మేరకు అతన్ని ఇంటికి తీసుకెళ్లిందామె. హూవర్ బ హుశా ఇంకెంతో కాలం బతక్కపోవచ్చన్న డాక్టర్ల అంచనాలను వమ్ము చేస్తూ సోదరి సంరక్షణలో అతను చాలావరకు కోలుకున్నాడు. ఈ ఉదంతం ఇప్పుడు కెంటకీలో టా కాఫ్ ద టౌన్‌గా మారింది. కెంటకీ అటార్నీ జనరల్ కార్యాలయం దీనిపై విచారణ కూడా జరుపుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప.గో... పుట్టెడు దుఃఖంలోనూ పెద్దమనసు!
యలమంచిలి: పుట్టెడు దుఃఖంలోనూ ఉన్నతంగా ఆలోచించారు. ఇక కుమారుడు తమకు దక్కకపోయినా... ఆయన అవయవాలతో మరికొందరికి జీవితం కల్పించవచ్చని భావించారు. వెంటనే సొంత ఖర్చులతో బ్రెయిన్ డెడ్ అయిన కుమారుడిని విశాఖ తరలించి అవయవాలను దానం చేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం ఇలపకుర్రు పంచాయతీ కుమ్మరిపాలేనికి చెందిన ఎలక్ట్రీషియన్ కాండ్రేకుల శ్రీనివాసరావు(బుల్లియ్య) కుమారుడు పవన్ ఐటీఐ పూర్తి చేసి సౌండ్ సిస్టం కొనుక్కుని ఫంక్షన్స్‌కి అద్దె ప్రాతిపదికన ఏర్పాటు చేస్తూ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఈ నెల ఒకటోతేదీన కుమ్మరపాలెంలోని కోదండ రామాలయ వార్షికోత్సవం సందర్భంగా ఏకాహ భజన ఏర్పాటు చేశారు.దానికి పవన్‌కుమార్ తన స్నేహితుడు కుడక అజయ్‌తో కలసి సౌండ్ బాక్సులను ఏర్పాటుచేశాడు. వారిద్దరూ సౌండ్ బాక్సుల వద్ద ఉండగా ఒక్కసారిగా కొబ్బరి చెట్టు విరిగి ఇద్దరిపైనా పడింది. పవన్ తలకు, భుజానికి బలమైన గాయాలు కాగా, అజయ్ స్వల్పంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే ఆలయ కమిటీ సభ్యులు ఇద్దరినీ పాలకొల్లు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పవన్ తలలో రక్తస్రావం కావడంతో ప్రథమ చికిత్స చేసిన అనంతరం ఉన్నత వైద్యం కోసం భీమవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆరోగ్యశ్రీలో వైద్యం చేసినా... 13వ తేదీన పరిస్థితి విషమించడంతో ఇక బతికే అవకాశం లేదని ఇంటికి తీసుకెళ్లిపోవాలని వైద్యులు చెప్పారు. చేసేది లేక భీమవరంలోనే మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి బ్రెయిన్‌డెడ్ అయ్యిందని, బతకడని చెప్పడంతో వారంతా హతాశులయ్యారు. పుట్టెడు దుఃఖంలోనూ తమ కుమారుడి అవయవాలు దానం చేయాలని నిర్ణయించుకుని సొంత ఖర్చులతో వైజాగ్ కిమ్స్ హైకాన్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పవన్ శరీరం నుంచి గుండె, కాళ్ల నరాలు, కాలేయం, కిడ్నీలు దానం చేశారు. అనంతరం శనివారం సాయంత్రానికి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ పాలకొల్లు ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి), పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిలువూరి కుమార దత్తాత్రేయవర్మతో కలసి అక్కడకు వెళ్లి మృతదేహానికి నివాళులరి్పంచారు. అవయవ దానం చేసిన తల్లిదండ్రులను అభినందించారు. -
టీడీపీ దాడిలో గాయపడిన వెంకటరెడ్డి కన్నుమూత
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్సీపీ నాయకుడు, జేసీఎస్ కన్వినర్ మేకా వెంకటరెడ్డి కన్నుమూశారు. తొలుత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, బ్రెయిన్ డెడ్ అయిందని మణిపాల్ వైద్యులు శుక్రవారం తెలిపారు. ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారని పేర్కొన్నారు. వెంకటరెడ్డి కన్నుమూసినట్లు శుక్రవారం రాత్రి 10.30 గంటలకు ప్రకటించారు. ఈ వార్త తెలియడంతో వెంకటరెడ్డి భార్య సునీత, కుమార్తె, కుమారుడు, కుటుంబసభ్యులు ఆస్పత్రి వద్దే కుప్పకూలారు. తమకు దిక్కెవరంటూ సునీత కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తాడేపల్లి రూరల్ మండలం కుంచనపల్లిలో గురువారం రాత్రి ఎన్నికల ప్రచారం చేస్తున్న వైఎస్సార్సీపీ వర్గీయులను టీడీపీకి చెందినవారు దుర్భాషలాడటమేగాక ద్విచక్ర వాహనాలతో ఢీకొట్టిన విషయం తెలిసిందే. కిందపడిపోయి తలకు తీవ్రగాయమైన మేకా వెంకటరెడ్డి తొలుత బ్రెయిన్ డెడ్ అయ్యారు. చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. పార్టీ అండగా ఉంటుందన్న ఎంపీ ఆళ్ల అంతకుముందు చికిత్స పొందుతున్న మేకా వెంకటరెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి శుక్రవారం మణిపాల్ ఆస్పత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వెంకటరెడ్డికి బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు తెలపడంతో ఎంత ఖర్చయినా ఆయనకు వైద్యం చేయాలని ఎంపీ సూచించారు. వెంకటరెడ్డి భార్య సునీత, కుమారుడు హేమంత్, కుమార్తెలను పరామర్శించారు. ఆ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ జిల్లా జేసీఎస్ కో–ఆర్డినేటర్ ఈదులమూడి డేవిడ్‌రాజు, పట్టణ అధ్యక్షుడు బుర్రముక్కు వేణుగోపాలసోమిరెడ్డి, జేసీఎస్ నియోజకవర్గ కనీ్వనర్ మున్నంగి వివేకానందరెడ్డి, పార్టీ నాయకులు రాజారెడ్డి, భూపతి కిషోర్‌నాయుడు తదితరులు ఆస్పత్రికి వెళ్లారు. పోలీసుల అదుపులో నిందితులు కుంచనపల్లిలో గురువారం రాత్రి ఈ దాడులకు తెగబడిన నిందితులు టీడీపీ తాడేపల్లి పట్టణ కార్యాలయంలో తలదాచుకున్నట్లు తెలిసింది. వెంకటరెడ్డి చికిత్స పొందుతున్న ఆస్పత్రి వద్ద పరిస్థితిని గమనించేందుకు శుక్రవారం తెల్లవారుజామున మహానాడుకు చెందిన ఓ మాజీ రౌడీషీటర్ తన కొడుకైన రౌడీషీటర్‌ను, కొందరు యువకులను తీసుకుని వచ్చారు. ఇదే క్రమంలో వెంకటరెడ్డిని ఢీకొట్టిన ద్విచక్ర వాహనంపై అక్కడికి వచ్చారు. ఆ వాహనంపైన వెనుక కూర్చున్న ప్రకాశం జిల్లా పొదిలి మండలం బచ్చలకుర్రపాడుకు చెందిన యువకుడు, ప్రస్తుతం మహానాడులో నివాసముంటున్న మాదల గురువర్ధన్‌ను వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు గుర్తుపట్టారు. ఆ వాహనాన్ని, గురువర్ధన్‌ను పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. గురువర్ధన్‌ను, ద్విచక్ర వాహనాన్ని పట్టుకున్నారని తెలియడంతో దాడిలో పాల్గొన్న యువకుల తల్లిదండ్రులతో టీడీపీ నాయకులు పార్టీ కార్యాలయంలో మంతనాలు జరిపారు. పోలీసుల నుంచి ఒత్తిడి రావడంతో వెంకటరెడ్డిని ద్విచక్ర వాహనంతో ఢీకొట్టిన బొమ్మలబోయిన ఈశ్వర్‌ను పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. తరువాత తమ అనుకూల మీడియాలో వైఎస్సార్సీపీకి, వెంకటరెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. వారు తమ కార్యకర్తలే కాదంటూనే.. ద్విచక్ర వాహనంపై వేగంగా వెళుతున్న వారిని వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుకున్నారని, బైక్ బ్రేక్ ఫెయిలవడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రచారం చేయసాగారు. వెంకటరెడ్డిని వెనుక నుంచి బైక్‌తో ఢీ కొట్టడంతో ఈ ఘటన జరిగిందని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. -
‘అయ్యో గీతాంజలి’.. అమెరికాలో రెండ్రోజుల వ్యవధిలో తల్లీకూతుళ్ల మృతి
కొణకంచి(పెనుగంచిప్రోలు): అమెరికాలోని పోర్టుల్యాండ్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన కొణకంచికి చెందిన మహిళ కమతం గీతాంజలి(32) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గీతాంజలి పుట్టినరోజు సందర్భంగా గుడికి వెళ్లి వస్తుండగా వీరి కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకువెళ్లింది. ప్రమాదంలో గీతాంజలి కుమార్తె హానిక అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన గీతాంజలిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా సోమవారం మృతి చెందింది. ఈ ఘటనలో భర్త నరేష్, కుమారుడు బ్రమణ్‌కు గాయాలవ్వగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో తల్లీ, కుమార్తెల మృతితో వారి బంధువుల కుటుంబాల్లో విషాదం అలముకుంది. వారి మృతదేహాలను స్వగ్రామం ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలోని కొణకంచి తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బంధువులు తెలిపారు. -
మరణించినా మరొకరికి జీవనం.. అవయవ దానంపై ఎందుకింత నిర్లక్ష్యం?
దానాలన్నిట్లోకెల్లా ఫలానా దానమే గొప్పదని తరచూ అంటుంటాం. సందర్భాన్ని బట్టి ఒక్కోసారి విద్యాదానమనీ, అన్నదానమనీ, ఇలా ఆ పేరు మారుతుంటుందంతే. కానీ ఎప్పటికీ మారని గొప్పదానం ప్రాణదానం. దానికి దోహదపడేదే అవయవదానం. ప్రస్తుతం అవయవాల అవసరం ఉన్నవారు ఎక్కువగానూ, వాటిని దానం చేసే వారి సంఖ్య తక్కువగానూ ఉంది. మన సమాజంలో ఎన్నో అపోహలు రాజ్యమేలుతున్నాయి. అవగాహన లేకపోవడం వల్ల ఇందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. అయితే మరణించిన వ్యక్తికి ఏమాత్రం పనికిరాని అవయవాలు మరెందరి ప్రాణాలనో నిలబెడతాయనే విషయాన్ని చాలావరకు గుర్తించడం లేదు. మట్టిలో కలవడం కంటే.. కట్టెలో కాలడం కంటే ఇతరులకు ప్రాణదానం చేయడం ఎంతో మేలని ప్రతివారిలోనూ అవగాహన కలగాలి. అప్పుడే మరెందరో అవయవార్థులు జీవం పుంజుకొని సమాజంలో తమవంతు బాధ్యతలను పోషిస్తారు. ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు కొద్దిగా చైతన్యం వచ్చినా అవయవాల కోసం ప్రస్తుతం ఉన్న డిమాండ్‌తో పోలిస్తే లభ్యత తక్కువే. అపోహలు తొలగి మరింత మంది అవయవదానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. భారత్‌లో అవయవ దానం పరిస్థితి ఎలా ఉంది? దేశంలో అవయవ దానం గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అవయవాలు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రతి సంవత్సరం సుమారు 5 లక్షల మంది మరణిస్తున్నారు. దీనివల్ల తమ వారి ప్రాణాలను నిలుపుకోవడం కోసం వారి బంధువులు పడుతున్న వేదన ఎంత వర్ణనాతీతంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కేవలం మూత్రపిండాల కొరతతోనే దేశంలో ప్రతి 5 నిమిషాలకు ఒక ప్రాణం బలవుతోంది. ఫలితంగా ప్రతి ఏటా 1,00,000 మరణాలు సంభవిస్తున్నాయి మూత్రపిండాలు: దేశంలో దాదాపు 2,00,000 మూత్రపిండాలు అవసరం ఉండగా.. కేవలం 4,000 మార్పిడి (2 శాతం) మాత్రమే జరుగుతుంది. కాలేయం: లక్షమందికి కాలేయం అవసరం ఉండగా..500 (0.5%) మాత్రమే లభిస్తున్నాయి. గుండె: 50,000 మందికి గుండె అవసరం ఉంది.కానీ 50 మార్పిడులు (0.1%). మాత్రమే జరుగుతున్నాయి. కార్నియా: 1,00,000 ప్రజలకు కార్నియా అవసరం. అయితే 25,000 మాత్రమే (25 శాతం) అందుబాటులో ఉంది. అవయవ దానం విషయంలో భారత్ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. వీటిలో ముఖ్యమైనవి అవగాహన లేకపోవడం: చాలా మందికి అవయవ దానం గురించి తెలియదు. అపోహలు, మూఢనమ్మకాలు, మత విశ్వాసాలు: అవయవ దానానికి ఆటంకాలుగా మారాయి. కఠినమైన చట్టాలు: కూడా దీనిని ప్రభావితం చేస్తాయి. ఎక్కువ మంది మహిళలు దానం చేస్తారు. కానీ తక్కువ మంది అవయవాలను అందుకుంటారు. ఆసుపత్రుల కొరత: దేశంలో కేవలం 301 ఆసుపత్రులు మాత్రమే ట్రాన్స్ ప్లాంటేషన్ చేస్తున్నాయి. జనాభా పెరుగుదల: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సౌకర్యాలు లేకపోవడం.. పై కారణాలతో భారత్‌లో అవయవ దానాల రేటు కేవలం 0.34శాతం మాత్రమే ఉంది. ఇక పోతే మరణించిన వారి అవయవాలను దానం చేసేందుకు ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం 2019లో రూ.149.5 కోట్ల బడ్జెట్‌తో జాతీయ అవయవ మార్పిడి కార్యక్రమం ప్రారంభించింది. అవయవ దాన రేటులో తమిళనాడు వంటి రాష్ట్రాలు ముందున్నాయి. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి అవగాహన ప్రచారాలు, విద్య, సమాజ ప్రమేయం చాలా అవసరం. మానవ అవయవాలు, కణజాలాల మార్పిడి చట్టం, 1994 ప్రకారం అవయవ దానం జీవించి ఉన్న దాత ను చి లేదా బ్రెయిన్ డెడ్ అయిన దాత చేయవచ్చు. బ్రెయిన్ డెత్ అనేది రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయం కావడం వల్ల లేదా మరే కారణం చేతనైనా మెదడులో రక్తనాళం చిట్లడం వల్ల సంభవిస్తుంది. శాశ్వతంగా మెదడు పని చేయకపోవడాన్ని బ్రెయిన్‌డెత్‌గా నిర్ధారిస్తారు. జీవించి ఉన్న వారు కిడ్నీలు, ప్యాంక్రియాస్‌లోని భాగాలు, కాలేయంలోని భాగాలను దానం చేయవచ్చు. మరణం తర్వాత మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, ప్యాంక్రియాస్ పేగులను దానం చేయవచ్చు . అవయవ దానం అవశ్యకత ను దాని ప్రాముఖ్యతను విరివి గా ప్రచారం చేయాల్సిన అవస రం ఉన్నది. దాతగా మారాలనే నిర్ణయం ఎనిమిది మంది జీవితాలను కాపాడుతుంది. అవయవ దానం చేయడం వల్ల ఇతరులకు ఆనందాన్ని, చిరునవ్వులను అందించవచ్చు. కేవలం ఒక అవయవాన్ని దానం చేయడం ద్వారా మరణించిన వారు సైతం శాశ్వతంగా జీవించవచ్చు. చివరగా.. అవయవదానంపై అవగాహనను పెంచి అపోహాలను దూరం చేద్దాం. అవయవ దానాన్ని ప్రోత్సహించి, అవసరమైన వారికి జీవితాన్ని బహుమతిగా ఇద్దాం. -
తాను చనిపోతూ.. ఆరుగురికి పునర్జన్మ
విశాఖపట్నం: పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులు చూపిన ఔదార్యం ఆరుగురికి పునర్జన్మనిచ్చింది. బ్రెయిన్ డెడ్ అయిన మహిళ అవయవాలను దానం చేసి ఆదర్శంగా నిలిచారు ఆ కుటుంబ సభ్యులు. జీవన్‌దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్, విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా గవరపాలెం గ్రామానికి చెందిన వెలమ పూర్ణకుమారి(53) తన కుమారుడుతో ద్విచక్రవాహనంపై ఈనెల 21న విశాఖ వస్తున్నారు. విశాఖ పోర్టు ఫ్లై ఓవర్‌పై వారి ద్విచక్రవాహనం ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో కిందపడిన పూర్ణకుమారి తలకు తీవ్రగాయమై అధిక రక్తస్రావం జరిగింది. దీంతో ఆమెను రామ్‌నగర్‌లో కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని కేర్ ఆస్పత్రి వైద్యులను ఆదేశించారు. వైద్యులు ప్రత్యేక శ్రద్ధ వహించి తలకు శస్త్రచికిత్స చేశారు. అయినప్పటికీ ఈనెల 23 రాత్రి బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. మంత్రి అమర్నాఽథ్ ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి అవయదానం కోసం ప్రోత్సహించగా అంగీకరించారు. జీవన్‌ధాన్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ రాంబాబుతో మాట్లాడి అవయదాన ప్రక్రియ ప్రారంభించాలని మంత్రి సూచించారు. ఆమె గుండె, రెండు కిడ్నీలు, రెండు కార్నియాలు, లివర్ తొలగించి అవసరమైన వారి కోసం తరలించినట్లు డాక్టర్ రాంబాబు తెలిపారు. అవయదానం చేయడానికి ముందుకు వచ్చిన పూర్ణకుమారి కుటుంబ సభ్యులను డాక్టర్ రాంబాబు అభినందించారు. పూర్ణకుమారికి భర్త జగదీశ్వరరావు, కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
అతడు.. ఆ ఆరుగురిలో సజీవం
లబ్బీపేట(విజయవాడ తూర్పు)/గన్నవరం/తిరుపతి తుడా: తనువు చాలించినా.. అవయవాల దానంతో ఆరుగురు జీవితాల్లో వెలుగులు నింపాడు 23 ఏళ్ల యువకుడు గారపాటి జయప్రకాష్. కొడుకు ఇక లేడన్న చేదు నిజం గుండెలను పిండేస్తున్నా.. పుట్టెడు దుఃఖంలో కూడా అతడి కుటుంబ సభ్యులు తీసుకున్న అవయవదానం నిర్ణయం అందరికీ ఆదర్శంగా నిలిచింది. వివరాల్లోకి వెళితే... కృష్ణాజిల్లా మొవ్వ మండలం చినముత్తేవి గ్రామానికి చెందిన గారపాటి జయప్రకాష్ (23) ఈ నెల 25న నిడుమోలు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తలకు బలమైన గాయం కావడంతో ఆయుష్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. చిన్న వయసులోనే తమ బిడ్డ దూరమైనా, కనీసం ఇతరుల జీవితాల్లో అయినా వెలుగులు నింపాలని భావించిన ఆ తల్లిదండ్రులు తమ కుమారుడి అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. జయ ప్రకాష్ గుండెను తిరుపతిలోని పద్మావతి ఆస్పత్రికి, లివర్, ఒక కిడ్నీని తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రికి, మరో కిడ్నీని విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రికి, కళ్లను విజయవాడలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి తరలించారు. గుండెను తిరుపతి తరలించేందుకు ఆయుష్ ఆస్పత్రి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టు వరకు పోలీసులు గ్రీన్‌చానల్ ఏర్పాటు చేశారు. 32 ఏళ్ల యువకుడికి గుండె మార్పిడి వైఎస్సార్ కడప జిల్లా వేముల ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల యువకుడు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గుండె సంబంధిత సమస్యతో తిరుపతిలోని శ్రీపద్మావతి గుండె చికిత్సాలయంలో చేరాడు. గుండె మారి్పడి అనివార్యమని నిర్ధారించి తాత్కాలిక చికిత్సను ప్రారంభించారు. ఈ క్రమంలో జయప్రకాష్ అవయవదానం విషయమై శ్రీపద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్ డైరెక్టర్ శ్రీనాథ్‌రెడ్డికి సమాచారం అందింది. సంబంధిత వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపగా వారు అనుమతి మంజూరు చేశారు. గుండె మార్పిడి చికిత్సకు అవసరమైన రూ.12 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా విడుదల చేశారు. ఈ క్రమంలో గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గుండెను తిరుపతికి తరలించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి గ్రీన్ చానల్ ద్వారా పద్మావతి కార్డియాక్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. శనివారం రాత్రి వైద్య బృందం సుదీర్ఘంగా శ్రమించి విజయవంతంగా గుండె మార్పిడిని పూర్తి చేశారు. యువకుడికి పునర్జన్మను ప్రసాదించారు. అవయవదానంతో ఇద్దరికి పునర్జన్మ ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు): బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవదానంతో ఇద్దరికి పునర్జన్మ లభించింది. శ్రీకాకుళానికి చెందిన బి.రామరాజు, లావణ్య దంపతుల కుమారుడు బి.కృష్ణశ్రావణ్ (17) ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఈ నెల 25న స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో విశాఖపట్నం ఎంవీపీ కాలనీ మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. శ్రావణ్‌కు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్ర దుఖఃలోనూ శ్రావణ్ తల్లిదండ్రులు అవయవదానం చేసేందుకు ముందుకొచ్చారు. ఒక కిడ్నీ మెడికవర్ ఆస్పత్రికి, మరో కిడ్నీ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. -
శ్రావణ్.. నీ కీర్తి శాశ్వతం
నరసన్నపేట: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నరసన్నపేట మారుతీ నగర్‌కు చెందిన కృష్ణ శ్రావణ్ మరో ఇద్దరికి ప్రాణదానం చేశాడు. కాకినాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్న శ్రావణ్ ద్విచక్ర వాహనంతో విజయవాడ దుర్గాదేవి దర్శనానికి వెళ్తూ మూడు రోజుల కిందట ప్రమాదానికి గురయ్యాడు. వైద్యం అందించిన విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. సమాచారం తెలుసుకున్న జీవన్‌దాన్ ప్రతినిధులు విద్యార్థి తల్లిదండ్రులు బంగారి రామరాజు, లావణ్య ప్రియతో సంప్రదింపులు చేసి అవయవ దానానికి అంగీకరింపజేశారు. గుండె, కాలేయం పనిచేయక పోవడంతో విద్యార్థికి చెందిన రెండు కిడ్నీలు శుక్రవారం జీవన్‌దాన్ రాష్ట్ర సమన్వయకర్త రాంబాబు ఆధ్వర్యంలో సేకరించి విశాఖ లోని రెండు ప్రైవేటు ఆస్పత్రులకు అందచేశారు. శ్రావణ్ పార్థివ దేహానికి స్వగ్రామం నందిగాం మండలం సుభద్రాపురంలో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. శ్రావణ్ తల్లి దండ్రులు బంగారి రామరాజు, లావణ్య ప్రియలకు పలువురు అభినందించారు. -
తాను మరణించినా మరో ఐదుగురికి జీవితం...
మరణశయ్యపై అచేతనంగా పడి ఉన్న కొడుకును చూసి కన్నపేగు కదిలి కదిలి కలచివేస్తున్నా.. దుఃఖం పొగిలి పొగిలి తన్నుకొస్తున్నా.. తీరని కడుపుకోత దావానలంలా తనువులను దహించి వేస్తున్నా.. విధిపై ఆక్రోశం కన్నీటిధారలు కడుతున్నా.. అంతరంగాన రేగిన ఆర్తనాదం నిశ్శబ్దంగా దేహాలను కంపింపజేస్తున్నా.. గుండెలను పిండేసే పెనువిషాదాన్ని పంటిబిగువనే భరిస్తూ ఆ తల్లిదండ్రులు కొండంత ఔదార్యం చూపారు. తమ కొడుకు చనిపోయినా మరికొందరికి పునర్జన్మనివ్వాలని తలంచారు. అవయవదానానికి అంగీకరించి ఆదర్శమూర్తులుగా నిలిచారు. గుంటూరు మెడికల్, చిలకలూరిపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేట శాంతినగర్‌కు చెందిన కట్టా రాజు, మల్లేశ్వరి దంపతులకు ముగ్గురు సంతానం. రాజు తోపుడుబండిపై కూరగాయలు అమ్ముతూ, ఆటో నడుపుతూ ముగ్గురు పిల్లలను చదివిస్తున్నాడు. ప్రథమ సంతానం కృష్ణ (18) ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. రెండో కుమారుడు సంతోష్ తొమ్మిదో తరగతి, మూడో కుమారుడు అభిషేక్ 8వ తరగతి చదువుతున్నారు. ఈనెల 23న కాలేజీకి వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉన్న సమయంలో కృష్ణను ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో కృష్ణ తలకు బలమైన గాయం కావడంతో తల్లిదండ్రులు అతడిని మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు రమేష్ హాస్పిటల్‌కి తరలించారు. కృష్ణకు ఈనెల 25న బ్రెయిన్ డెడ్ అయింది. ఈ విషయాన్ని ఆస్పత్రి వైద్యులు తల్లిదండ్రులకు తెలియజేయడంతో గుండెలవిసేలా రోదించారు. చేతికంది వచ్చిన బిడ్డ తమను చూసుకుంటాడనుకునే సమయంలో ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కన్నీరుమున్నీరయ్యారు. అంతటి బాధలోనూ తల్లిదండ్రులు గుండెను దిటవు చేసుకుని తమ బిడ్డ మరణం మరికొందరికి జీవితం ప్రసాదించాలని నిర్ణయించుకున్నారు. బిడ్డ అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. కృష్ణ ఈనెల 19న తన 18వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. పుట్టినరోజు జరుపుకున్న నాలుగురోజుల్లోనే ఇలా జరుగుతుందని ఊహించలేదని తల్లిదండ్రులు, స్నేహితులు విలపిస్తున్నారు. ఐదుగురికి పునర్జన్మ కృష్ణ నేత్రాలు గుంటూరు సుదర్శిని కంటి ఆస్పత్రికి, లివర్‌ను విశాఖపట్నం కిమ్స్ హాస్పిటల్‌కు, ఒక కిడ్నీని విజయవాడ ఆయుష్ హాస్పిటల్‌కు, మరో కిడ్నిని రమేష్ హాస్పిటల్‌కు, గుండెను తిరుపతి పద్మావతి హాస్పిటల్‌కి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా, గ్రీన్‌చానల్‌లో తరలించారు. ఇప్పటికే తీవ్ర అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉండి అవయవ మార్పిడి కోసం ఎదురు చూస్తున్న ఐదుగురికి జీవితాలను ప్రసాదించనున్నట్టు వైద్యులు చెబుతున్నారు. తిరుపతి వ్యక్తికి గుండె ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి స్పందించి తిరుపతిలో గుండె మార్పిడి అవసరమైన వ్యక్తి కోసం గుంటూరు నుంచి ప్రత్యేక హెలీకాప్టర్ ద్వారా గుండెను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. రోడ్డు మార్గం ద్వారా తరలించేసరికి విలువైన సమయం వృథా అవుతుందని ఆగమేఘాల మీద హెలీకాప్టర్‌ను రప్పించి, గ్రీన్ చానెల్ ద్వారా శస్త్ర చికిత్సకు మార్గం సుగమం చేశారు. మరణంలోనూ పరోపకారం కట్టా కృష్ణ నాకు మంచి మిత్రుడు. చిన్ననాటి నుంచి కలుపుగోలు స్వభావం కలిగినవాడు. ఇతరులకు సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటాడు. చివరకు మరణంలోనూ ఇతరులకు సహాయపడ్డాడు. మిత్రుడి మరణం తీవ్ర బాధ కలిగిస్తున్నా అతను చనిపోయినా ఇతరులకు ప్రాణదానం చేయడం గర్వంగా ఉంది. – పాలపర్తి మోహనవంశీ, స్నేహితుడు మంచితనానికి మారుపేరు కృష్ణ మంచితనానికి మారుపేరు. బంధువులందరితో కలుపుగోలుగా ఉండేవా డు. ఈనెల 19న సంతోషంగా పుట్టిన రోజు జరుపుకున్నాడు. రోజుల వ్యవధిలోనే అందరినీ విడిచి కానరాని లోకాలకు వెళ్లడం మనసును కలచివేస్తోంది. అవయవ దానం ద్వారా ఐదుగురికి కొత్త జీవితాలు ఇచ్చిన కృష్ణతో స్నేహం, బంధుత్వం పంచుకోవడం గర్వంగా భావిస్తున్నా. – పాలపర్తి నాని, స్నేహితుడు, మేనమామ కుమారుడు -
బ్రెయిన్‌డెడ్ అయిన మహిళ అవయవ దానం
వేలూరు: రాణిపేట జిల్లా సిప్‌కాడు సమీపంలోని తగరకుప్పం గ్రామానికి చెందిన రాబర్ట్ భార్య జభకుమారి(33). ఈ దంపతులకు ఒక కుమార్తె, కుమారుడున్నారు. దంపతులిద్దరూ సిప్కాడులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబర్ట్, జభకుమారి నాలుగు రోజుల క్రితం కంపెనీలో పని పూర్తి చేసుకొని బైకుపై ఇంటికి బయలు దేరారు. పొన్నై క్రాస్ రోడ్డులోని అనకట్టు చర్చి వద్ద వస్తున్న సమయంలో జభకుమారి ప్రమాదవశాత్తూ బైకు నుంచి కింద పడింది. ఆ సమయంలో జభకుమారి తలకు తీవ్రంగా గాయాలు కావడంతో వెంటనే ఆమెను రాణిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈక్రమంలో జభకుమారికి సోమవారం రాత్రి బ్రెయిన్‌డెడ్ అయ్యింది. దీంతో ఆమె అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వ చ్చారు. దీంతో ఆమె అవయవాలను రాణిపేటలోని సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు సిప్‌కాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఏడుగురికి పునర్జన్మనిచ్చిన ‘కీర్తి’
పిచ్చాటూరు: తాను మరణించినా.. తన అవయవాలతో ఏడుగురికి పునర్జన్మనిచ్చింది కీర్తి అనే యువతి. వివరాల్లోకి వెళితే.. తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం రామాపురం ఎస్సీ ప్రాంతానికి చెందిన సి.సంపత్‌కుమార్, అమ్ములు దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. సంపత్‌కుమార్ ఎడ్లబండి నడుపుతూ వ్యవసాయ కూలీగా పని చేస్తున్నారు. మొదటి కుమార్తె కీర్తి గత ఏడాది బీకామ్ పూర్తి చేసి చెన్నై అరుబాక్కంలోని కాల్ సెంటర్లో ఉద్యోగం చేస్తుండేది. రెండో కుమార్తె స్వాతి డిగ్రీ, మూడవ కుమార్తె స్మృతి ఫార్మసీ, కుమారుడు సారథి ఇంటర్ చదువుతున్నారు. కీర్తి ఆదివారం చెన్నై నుంచి స్వగ్రామం రామాపురం వచ్చింది. ఆ సమయంలో పెళ్లి చేసుకోవాలని కీర్తిని తల్లిదండ్రులు కోరారు. చెల్లెళ్లు, తమ్ముడి చదువులు కొలిక్కి వచ్చాక పెళ్లి చేసుకుంటానని అమ్మ, నాన్నలకు నచ్చజెప్పింది. సాయంత్రం తమిళనాడులోని కరడిపుత్తూరులో ఓ పెళ్లికి గ్రామంలోని తమ బంధువుతో కలసి ద్విచక్ర వాహనంపై వెళ్లింది. తిరుగు ప్రయాణంలో కరడిపుత్తూరు సమీపంలో రోడ్డుపై ఉన్న ఓ పెద్ద గుంతలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి దిగబడిపోవడంతో వెనుకవైపు కూర్చుని ఉన్న కీర్తి కిందపడిపోయింది. ఆమె తలకు, చేతికి తీవ్ర గాయమై స్పృహ కోల్పోయింది. వాహనం నడుపుతున్న రాబర్ట్‌కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు 108 సాయంతో ఇద్దరినీ సమీపంలో ఉన్న తిరువళ్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నైలోని రాజీవ్‌గాంధీ జనరల్ ఆస్పత్రికి తరలించారు. కీర్తిని పరీక్షించిన వైద్యులు ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్టు నిర్థారించారు. గుండె సహా మిగిలిన అన్ని అవయవాలు పనిచేస్తున్న విషయాన్ని గుర్తించారు. కీర్తి అవయవాలను దానం చేయడం ద్వారా మరికొంత మందిని బతికించే అవకాశం ఉందని వైద్యులు వివరించడంతో కీర్తి అవయవాలు దానం చేయడానికి తల్లిదండ్రులు అంగీకరించారు. కీర్తికి గౌరవ వందనం చెన్నై జీహెచ్ వైద్యులు కీర్తి శరీరం నుంచి గుండె, రెండు మూత్రపిండాలు, రెండు కళ్లు, గుండె వాల్వు, కాలేయం, మూత్రనాళాలు, ఊపిరితిత్తులను మంగళవారం రాత్రి సేకరించారు. స్టాండ్లీ ప్రభుత్వ ఆస్పత్రికి రెండు అవయవాలను తరలించి.. మిగిలిన వాటిని అదే ఆస్ప త్రిలోని రోగులకు అమర్చినట్టు వైద్యులు వెల్లడించా రు. రాగా, మంగళవారం అర్ధరాత్రి కీర్తి పార్థివదేహం వద్ద ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది గౌరవ వందనం చేశారు. కార్యక్రమంలో వందలాది మంది పాల్గొన్నారు. -
చనిపోయి.. ఐదుగురి జీవితాలకు ‘సంతోష’మిచ్చాడు!
ఆరిలోవ (విశాఖ తూర్పు): విశాఖలోని ఆరిలోవ ప్రాంతం అంబేడ్కర్‌నగర్‌కు చెందిన బొండా వెంకట సంతోష్ కుమార్ (32) బ్రెయిన్‌డెడ్‌కు గురికాగా అతడి అవయవాలను దానం చేసేందుకు కుటుంబీకులు అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అవయవాలను దానం చేయడానికి గాను సంతోష్ భౌతికకాయాన్ని విమ్స్‌కు తరలించారు. అక్కడ శస్త్రచికిత్స చేసి శరీరంలో బాగా పనిచేస్తోన్న అవయవాలను తొలగించి జీవన్‌దాన్ ప్రొటోకాల్ ప్రకారం ఐదుగురికి కేటాయించారు. విశాఖ సీపీ సహకారంతో ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ చానల్ ఏర్పాటు చేసి అవయవాలను పలు ఆస్పత్రులకు తరలించారు. సంతోష్ భౌతికకాయానికి గురువారం విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు ఆధ్వర్యంలో ఆర్మీ జవాన్‌కు జరిగిన మాదిరిగా ఘన వీడ్కోలు పలికారు. సిబ్బంది రెండు వరసలుగా ఏర్పడి పూలుజల్లుతూ అమర్‌రహే సంతోష్ అంటూ నినాదాలు చేశారు. సంతోష్ తండ్రి శంకర్‌కు రాంబాబు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. విమ్స్ అంబులెన్స్‌లో ఆరిలోవలోని నివాసానికి పార్థివదేహాన్ని తరలించగా...కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. రాంబాబు మీడియాతో మాట్లాడుతూ..సంతోష్ శరీరం నుంచి 2 కారి్నయాలు, కిడ్నీలు, లివర్ తీశామన్నారు. హెల్త్‌సిటీలో అపోలోకు ఓ కిడ్నీ, షీలానగర్‌లో కిమ్స్ ఆస్పత్రికి మరో కిడ్నీ, హెల్త్‌సిటీలో పినాకిల్ ఆస్పత్రికి లివర్, హనుమంతవాక వద్ద ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి కార్నియాలను జీవన్‌దాన్ ప్రొటోకాల్ ప్రకారం తరలించినట్లు తెలిపారు. -
చంద్రకళా.. నీది గొప్ప జన్మ
శ్రీకాకుళం: తాను చనిపోతూ మరో ఎనిమిది మందికి పునర్జన్మ ప్రసాదించిన పట్నాన చంద్రకళను గ్రామస్తులు వేనోళ్ల కీర్తించారు. చంద్రకళ చేసిన త్యాగం నిరుపమానమని, ఆమెది గొప్ప జన్మ అని కొనియాడారు. మండలం మధుపాం గ్రామానికి చెందిన పట్నాన చంద్రకళ(32) బ్రెయిన్‌డెడ్ అవ్వడంతో ఈనెల 2వ తేదీన మృతి చెందారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆమె అవయవాలను దానం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం గ్రామంలో చంద్రకళ సంతాప సభ నిర్వహించారు. మృతురాలికి ఇద్దరు ఆడపిల్లలు ఉండడంతో స్థానికులు, యువత కలిపి రూ.2 లక్షలు సేకరించి వారి పేరున డిపాజిట్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బగాది అప్పలనాయుడు, మాజీ సర్పంచ్ నల్లి తవిటినాయుడులతోపాటు గ్రామస్తులు, యువత పాల్గొన్నారు. ఈ కుటుంబంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆదుకోవాలని స్థానికులు కోరారు. -
బ్రెయిన్ డెడ్ విద్యార్థి అవయవదానం
-
బాలుడి అవయవదానం.. ఇద్దరికి ప్రాణదానం
శ్రీకాకుళం రూరల్/అక్కిరెడ్డిపాలెం/తిరుపతి తుడా(తిరుపతి జిల్లా)/గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటి సారిగా ఓ బ్రెయిన్ డెడ్ విద్యార్థి నుంచి అవయవాలు సేకరించారు. జిల్లా కేంద్రంలోని రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో అవయవదానం కార్యక్రమం ఆదివారం జరిగింది. సోంపేట మండలం గీతామందిర్ కాలనీకి చెందిన విద్యార్థి మళ్లారెడ్డి కిరణ్‌చంద్(16)కు బ్రెయిన్ డెడ్ కావడంతో మెదడులోని నరాలు చిట్లి అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. విద్యార్థి తల్లిదండ్రులు మోహన్, గిరిజాకల్యాణిల అంగీకారంతో అవయవాలు సేకరించారు. కిరణ్‌చంద్ ఈ నెలలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు. చివరి పరీక్ష ముందు రోజు రాత్రి తీవ్ర జ్వరం, తలనొప్పితో మంచానపడ్డాడు. వెంటనే తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సీటీ స్కాన్ చేసిన వైద్యులు మెదడులోని నరాలు ఉబ్బినట్లు గుర్తించారు. వెంటనే విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే కిరణ్‌చంద్ మెదడులోని నరాలు చిట్లిపోయాయని, ఎక్కడకు తీసుకెళ్లిన బతికే అవకాశాలు చాలా తక్కువని వైద్యులు తేల్చి చెప్పేశారు. దీంతో కిరణ్‌చంద్ తల్లిదండ్రులు శ్రీకాకుళంలోని రాగోలు జెమ్స్ ఆస్పత్రికి వారం రోజుల కిందట తమ కుమారుడిని తీసుకొచ్చారు. మోహన్, గిరిజాకల్యాణి దంపతులకు కిరణ్ ఒక్కడే కుమారుడు. అలాంటిది బిడ్డకు ఈ పరిస్థితి రావడంతో వారు చూసి తట్టుకోలేకపోయారు. ఏపీ జీవన్‌దాన్ సంస్థ ఆధ్వర్యంలో అవయవాలు దానం చేయొచ్చని, అవి వేరే వారికి ఉపయోగపడతాయని తెలుసుకున్నారు. గుండె, కిడ్నీలు, లివర్, కళ్లను మరో ఐదుగురికి అందిస్తే వారిలో తమ కుమారుడిని సజీవంగా చూసుకుంటామని వైద్యులకు చెప్పడంతో.. ఆదివారం రాగోలు జెమ్స్ ఆస్పత్రి వైద్యులంతా కలిసి అవయవాల తరలింపునకు శ్రీకారం చుట్టారు. గ్రీన్ చానెల్ ఏర్పాటు చేసి ఒక పైలెట్, ఎస్కార్ట్ ద్వారా అవయవాల తరలింపునకు జెమ్స్ ఆస్పత్రి వైద్యులు ఏర్పాట్లు చేశారు. గుండె, కిడ్నీలు, లివర్, కళ్లను ఆపరేషన్ చేసి తీశాక, ముందుగా గుండెను తిరుపతిలోని పద్మావతి ఆస్పత్రికి తరలించారు. మిగిలిన అవయవాలను విశాఖలోని ఇతరత్రా ఆస్పత్రులకు పంపిస్తామని జెమ్స్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ చెప్పారు. యువకుడికి కిడ్నీ, లివర్ కిరణ్‌చంద్ అవయవాలను గ్రీన్ చానల్ ద్వారా అంబులెన్స్‌లో విశాఖకు చేర్చారు. ఎయిర్‌పోర్టుకు సాయంత్రం 4.20 గంటలకు చేరుకోగా.. వెంటనే విశాఖలోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలోని ఓ యువకుడికి కిడ్నీ, లివర్‌ను అమర్చి ప్రాణం పోశారు. దిగ్విజయంగా చిన్నారికి గుండె మార్పిడి వైద్య రంగంలో మరో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల బాలికకు తిరుపతి శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్లోని వైద్యులు గుండె మార్పిడిని విజయవంతంగా పూర్తిచేశారు. నాలుగు నెలల వ్యవధిలోనే ఆస్పత్రిలో వరుసగా ముగ్గురికి గుండె మార్పిడి చికిత్సను నిర్వహించారు. కిరణ్‌చంద్ నుంచి గుండెను వేరుచేసి గ్రీన్ చానల్ ద్వారా విశాఖ విమానాశ్రయానికి, అక్కడి నుంచి విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి 27 నిమిషాల్లో శ్రీపద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్‌కు ప్రత్యేక అంబులెన్స్ ద్వారా తరలించారు. ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి, డాక్టర్ గణపతి బృందం ఐదేళ్ల చిన్నారికి గుండె మార్పిడి చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి బాలికకు గుండెను అమర్చారు. తిరుపతి జిల్లా, తడ మండలం, రామాపురంలో నివసిస్తున్న అన్బరసు, గోమతి దంపతులకు ఇద్దరు పిల్లలు. మొదట జన్మించిన చిన్నారి రీతిశ్రీ పుట్టుకతోనే గుండె బలహీనతతో జన్మించింది. వైద్య పరీక్షలు నిర్వహించి గుండె మార్పిడి అనివార్యమని వైద్యులు నిర్ధారించారు. చెన్నై ఎగ్మోర్ ఆస్పత్రిలో సంప్రదించగా, కొన్ని రోజుల చికిత్స అనంతరం తిరుపతిలోని టీటీడీ శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్‌కు వెళ్లాలని వైద్యులు సూచించడంతో నాలుగు నెలల కిందట ఇక్కడ చేరారు. వేగంగా స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం గుండె మార్పిడి అనివార్యం కావడంతో రీతిశ్రీ తల్లిదండ్రులు ఇటీవల సీఎంవో కార్యాలయంలో సీఎస్ జవహర్‌రెడ్డిని కలిశారు. తమ బిడ్డ పరిస్థితిని, మెడికల్ రిపోర్టులను అందజేశారు. పరిశీలించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి.. గంటల వ్యవధిలోనే ఆరోగ్యశ్రీ నుంచి రూ.10 లక్షలు మంజూరు చేయించారు. గుండె మార్పిడి చికిత్సకు రూ.20 లక్షలు ఖర్చవుతుండటంతో మరో రూ.10 లక్షలను టీటీడీ సమకూర్చింది. మొత్తం రూ.20 లక్షలతో చిన్నారి కుటుంబానికి ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగానే ఖరీదైన వైద్యాన్ని అందించారు. ఆరోగ్యశ్రీనే తమ బిడ్డను కాపాడిందని, సీఎం జగనన్నకు తాము రుణపడి ఉంటామని రీతిశ్రీ తల్లిదండ్రులు అన్బరసు, గోమతిలు కన్నీళ్లపర్యంతమయ్యారు. -
బ్రెయిన్‌డెడ్ మహిళ అవయవాలతో ప్రాణదానం..
బెంగళూరు: బ్రెయిన్‌డెడ్ అయిన మహిళ అవయవాలతో ఇద్దరి ప్రాణాలను కాపాడారు వైద్యులు. ఒకరికి లివర్, మరొకరికి కిడ్నీ సకాలంలో అందించి వారికి పునర్జన్మనిచ్చారు. కర్ణాటక ఉడుపి జిల్లా మణిపాల్‌లో ఈ ఘటన జిరిగింది. జిల్లాలోని ఉప్పండాకు చెందిన 44 ఏళ్ల శిల్పా మాధవ్ ఫిబ్రవరి 25న రోడ్డుప్రమాదానికి గురైంది. తీవ్రగాయాలపాలైన ఆమెను కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స అందించిన వెద్యులు ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించారు. దీంతో ఆమె బతికే అవకాశాలు లేకపోవడంతో అవయవదానం చేసేందుకు కుటుంబసభ్యులు అనుమతి ఇచ్చారు. అనంతరం కస్తుర్బా ఆస్పత్రి వైద్యులు శిల్పా మాధవ్ లివర్‌ను బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోని రోగికి అందించి అతని ప్రాణాలు కాపాడారు. అలాగే కిడ్నీని మంగళూరులోని ఆస్పత్రిలో ఓ రోగికి అమర్చారు. మరో కిడ్నీతో పాటు శిల్పా కళ్ల కార్నియాలు, చర్మాన్ని కసుర్బా ఆస్పత్రిలో భద్రపరిచారు వైద్యులు. వీటిని కూడా అవసరమైన వారికి అందిస్తామని చెప్పారు. చదవండి: బ్యాంకు ఉద్యోగి నిర్వాకం.. ఖాతాదారుల సొమ్ముతో ఆన్లైన్లో రమ్మీ ఆట -
ప్రీతి బ్రెయిన్‌డెడ్!.. నిమ్స్ వద్ద భారీగా పోలీసులు
సాక్షి, హైదరాబాద్: కేఎంసీ పీజీ విద్యార్థిని ప్రీతి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఇవాళ(ఆదివారం) మధ్యాహ్నం నిమ్స్ వైద్యులు బులిటెన్ విడుదల చేశారు. ర్యాంగింగ్ పెనుభూతంతో వణికిపోయిన ఆమె.. ఆత్మహత్యాయత్నం చేయడం, గత ఐదురోజులుగా నగరంలోని నిమ్స్‌లో ఆమె చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారం సాయంత్రం ప్రీతి తండ్రి నరేందర్ ఆమె ఆరోగ్య స్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రీతి బ్రెయిడ్ డెడ్ అయ్యిందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటివరకు కొంత ఆశ ఉండేది. కానీ, ఆమె బ్రతికే అవకాశం లేదని వైద్యులు తేల్చారు. ఆశలు వదిలేసుకున్నాం ఆయన మీడియా సాక్షిగా తెలిపారు. ‘‘ప్రీతిని సైఫే హత్య చేశాడు. సైఫ్‌ను కఠినంగా శిక్షించాలి. ఈ ఇష్యూను హెచ్‌వోడీ సరిగా హ్యాండిల్ చేయలేదు. ప్రీతి జోలికి రాకుండా సైఫ్‌ను నియంత్రించలేకపోయారు. సరికదా.. ఘటన తర్వాత కూడా మాకు టైంకి సమాచారం అందించలేదు. ప్రీతి మొబైల్లో వాళ్లకు కావాల్సినట్లుగా సాక్ష్యాలు క్రియేట్ చేసుకున్నారు. ఇది ముమ్మాటికీ హత్యే. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల’’ని డిమాండ్ చేశారాయన. కాసేపట్లో ప్రీతి హెల్త్ బులిటెన్‌పై నిమ్స్ వైద్యులు కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని నిమ్స్ డైరెక్టర్, పోలీసులకు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసు సిబ్బంది భారీగా మోహరించారు. అంతకు ముందు మంత్రి ఎర్రబెల్లి సైతం ప్రీతి బతుకుతుందన్న నమ్మకం ఒక్క శాతమే! అని ప్రకటించారు. ప్రీతి ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉందని ప్రకటించారాయన. ఇక ప్రీతి ఘటన బాధాకరమన్న మంత్రి.. బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. -
బైక్‌పై నుంచి కళ్లు తిరిగి పడి మహిళ బ్రెయిన్ డెడ్.. పేద గుండెకు పునర్జన్మ
తిరుపతి తుడా/అక్కిరెడ్డిపాలెం (విశాఖపట్నం): విశాఖపట్నానికి చెందిన ఓ మహిళకు బ్రెయిన్ డెడ్ కావటంతో కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకొచ్చారు. దీంతో ఆమె గుండెను శుక్రవారం ప్రత్యేక విమానంలో తిరుపతికి తీసుకొచ్చి గుండెజబ్బుతో బాధపడుతున్న 15ఏళ్ల బాలుడికి ఆరోగ్యశ్రీ కింద శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సాలయంలో పూర్తి ఉచితంగా శస్త్రచికిత్స చేసి అమర్చారు. నిజానికి.. 2021 అక్టోబర్ 11న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ చికిత్సాలయాన్ని ప్రజలకు అంకితం చేశారు. ఈ నేపథ్యంలో.. తొలిసారి ఇక్కడి వైద్యులు గుండెమార్పిడి చేశారు. ఈ యజ్ఞం పూర్వాపరాలు ఇవిగో.. పేద రైతుకు పెద్ద కష్టం.. అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ రైతుకూలీ నెలరోజుల క్రితం అనారోగ్యంతో ఉన్న తన పదిహేనేళ్ల కుమారుణ్ణి పద్మావతి ఆస్పత్రికి తీసుకొచ్చాడు. వైద్యులు అతని గుండెకు తీవ్ర ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధారించి మార్పిడి అనివార్యమని తేల్చిచెప్పారు. జీవన్‌దాన్ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసి చికిత్స అందిస్తూ వస్తున్నారు. వారం క్రితం ఆ బాలుడి పరిస్థితి మరింత విషమించింది. విశాఖపట్నంలో మహిళకు బ్రెయిన్ డెడ్ ఇంతలో.. విశాఖపట్నంలోని భెల్ (హెచ్‌పీవీపీ)లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న జంజూరు ఆనందరావు భార్య సన్యాసమ్మ (48) టౌన్షిప్లో ఉంటున్నారు. వీరి ఇద్దరి కుమారులూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. సంక్రాంతి సందర్భంగా సన్యాసమ్మ పెందుర్తి సమీప గ్రామంలో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ నెల 17న తన కుమారుడితో బైక్‌పై తిరిగి వస్తుండగా కళ్లు తిరిగి పడిపోయింది. దీంతో ఆమె తలకు బలమైన గాయమవడంతో షీలానగర్‌లోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు బ్రెయిన్ డెడ్ అయినట్లు శుక్రవారం ఉదయం వైద్యులు చెప్పారు. కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించటంతో వైద్యులు జీవన్‌దాన్ సైట్‌కు సమాచారమిచ్చారు. స్పందించిన సీఎంఓ.. సన్యాసమ్మ గుండె తిరుపతి పద్మావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడికి అమర్చే అవకాశముందన్న సమాచారం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం రెండు జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు, వైద్యులను అప్రమత్తం చేసింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ గ్రీన్ ఛానల్ ద్వారా ప్రత్యేక విమానంలో గుండెను తరలించేందుకు ఏర్పాట్లుచేసింది. ఆగమేఘాలపై గుండె తరలింపు మరోవైపు.. తిరుపతి నుంచి ముగ్గురు వైద్యులతో కూడిన బృందం విశాఖకు వెళ్లి సన్యాసమ్మ గుండెను వేరుచేసి ప్రత్యేక బాక్సులో భద్రపరిచారు. దాన్ని శరవేగంగా తిరుపతి తరలించేందుకు అన్ని ఏర్పాట్లుచేశారు. నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ ఆదేశాల మేరకు డీసీపీ ఆనంద్‌కుమార్, ట్రాఫిక్ ఏడీసీపీ శ్రావణ్‌కుమార్, నలుగురు సీఐలు, ఐదుగురు ఎస్ఐలు, 33 మంది సిబ్బంది భద్రతా, ట్రాఫిక్ ఆంక్షలను పర్యవేక్షించారు. షీలానగర్ ఆస్పత్రి నుంచి ఎయిర్‌పోర్టు వరకు నాలుగు కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ నియంత్రించారు. ఆ తర్వాత.. ►9.18 గంటలకు : ఆస్పత్రిలో అంబులెన్స్ బయల్దేరింది. ► 9.20 : ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ► 10.05 : అప్పటికే సిద్ధంగా ఉన్న ఇండిగో విమానం గుండెను తీసుకుని బయల్దేరింది. ►11.31 : రేణిగుంట విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయింది. ► 11.35 : విమానాశ్రయం నుంచి బాక్సును బయటకు తీసుకొచ్చారు. ► 11.56 : టీటీడీ అంబులెన్స్‌లో 21.5 కి.మీ. దూరాన్ని 21 నిమిషాల్లో తిరుపతిలోని శ్రీపద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్‌కు తీసుకొచ్చారు. ►11.57 : ఒక నిమిషంలోనే ఆస్పత్రిలోకి గుండెను చేర్చారు. ►అప్పటికే ఆపరేషన్‌కు అవసరమైన ఏర్పాట్లను ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి పర్యవేక్షణలో సిద్ధంచేసి ఉంచారు. ►ఆరుగురు డాక్టర్లతో కూడిన వైద్య బృందం 4.15 గంటలపాటు శ్రమించి గుండె మార్పిడి శస్త్రచికిత్సను దిగ్విజయంగా పూర్తిచేసింది. అందరి సహకారంతోనే.. దాత కుటుంబ సభ్యులు, ప్రభుత్వం, ప్రభుత్వ విభాగాలు, వైద్యుల ఉమ్మడి కృషితోనే ఇది సాధ్యమైంది. గుండెను తగిన జాగ్రత్తలతో భద్రపరిస్తే ఆరు గంటల వరకు పనిచేస్తుంది. సన్యాసమ్మ గుండెను మూడు గంటల్లోపే తిరుపతి ఆసుపత్రికి తరలించారు. అమర్చిన గుండె పూర్తి సామర్థ్యంతో పనిచేసి బాలుడు కోలుకునేందుకు వారం రోజులు పడుతుంది. – డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి ఆమెలేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నా సన్యాసమ్మ లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నా. ఇప్పటివరకు నేను, పెద్దబ్బాయి చైతన్య, చిన్నబాబు జయప్రకా‹Ùలు తేరుకోలేదు. ఇద్దరు కుమారులను కంటికి రెప్పలా చూసుకుని మురిసిపోయేది. వారికి ఏది కావాలన్నా నాతో గొడవపడి మరీ సాధించేది. – జంజూరు ఆనందరావు, సన్యాసమ్మ భర్త, భెల్ ఉద్యోగి -
తనువు లేకున్నా.. తనుంది!
ప్రొద్దుటూరు క్రైం: తాను చనిపోయినా.. తన శరీరంలోని అవయవాలు పది మందికి ఉపయోగపడాలనే ఆమె గొప్ప ఆలోచన పలువురికి ప్రాణం పోసింది. అవయవ దానంతో యువతి ఆదర్శంగా నిలవడమే కాకుండా మరికొందరికి కొత్త జీవితాన్ని అందిస్తున్నది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన దేవరశెట్టి సుచిత్ర (25) అనే యువతి బ్రెయిన్ డెడ్‌తో సోమవారం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో మృతి చెందింది. ఆమె కోరిక మేరకు కుటుంబ సభ్యులు అవయవదానం చేశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ప్రొద్దుటూరులోని శ్రీరాంనగర్‌కు చెందిన దేవరశెట్టి నరసింహులు, అనురాధ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. వారిలో పెద్ద కుమార్తె రూపశరణ్య, చిన్న కుమార్తె సుచిత్ర. సుచిత్ర స్థానికంగా బీ ఫార్మసీ పూర్తి చేసింది. కొన్ని నెలల క్రితం నుంచి బెంగళూరులో ఉద్యోగం చేస్తుండగా, రూపశరణ్య బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. నరసింహులు విద్యుత్‌శాఖలో లైన్ ఇన్స్పెక్టర్గా పని చేసి రిటైర్డ్ అయ్యారు. సుచిత్రకు డిసెంబర్ 31న తీవ్ర తలనొప్పిగా ఉందని చెప్పడంతో స్నేహితులు, తోటి ఉద్యోగులు హుటాహుటిన ప్రొద్దుటూరుకు తీసుకొచ్చారు. స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించి వైద్యుల సూచన మేరకు ఎమ్ఆర్ఐ స్కానింగ్ చేయించారు. బ్రైయిన్లో రక్తం గడ్డకట్టిందని స్కానింగ్‌లో నిర్ధారణ కావడంతో తల్లిదండ్రులు సుచిత్రను వెంటనే హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆపరేషన్ జరిగినా కోలుకోలేక సుచిత్ర సోమవారం మృతి చెందింది. కాగా తమ కుమార్తె మరణానంతరం అవయవ దానం కోసం రిజిస్టర్ చేయించిందనే విషయాన్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రి వైద్యులకు తెలిపారు. దీంతో కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి యువతి శరీరంలోని నేత్రాలు, గుండె, మూత్రపిండాలు, వెన్నెముకను సేకరించి భద్రపరిచారు. మంగళవారం సాయంత్రం ప్రొద్దుటూర్చులో అంత్యక్రియలు నిర్వహించారు. -
జిల్లాల్లో బ్రెయిన్ డెడ్ నిర్ధారణ
సాక్షి, హైదరాబాద్: జిల్లాల్లోనూ బ్రెయిన్‌డెడ్ నిర్ధారణ చర్యలు చేపట్టాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఫలితంగా అవయవదానాలు విరివిగా పెంచి, బాధితులకు మార్పిడి చికిత్సలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ముందుగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, అనంతరం ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోనూ బ్రెయిన్‌డెడ్ నిర్ధారణ ఏర్పాట్లు చేస్తారు. సంబంధిత మెడికల్ కాలేజీల్లోనూ అపస్మారకస్థితికి చేరిన రోగుల బ్రెయిన్‌డెడ్ నిర్ధారణ కమిటీలు ఏర్పాటు చేస్తారు. తక్షణమే కాకతీయ, నిజామాబాద్, సిద్దిపేట, మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీల్లో బ్రెయిన్‌డెడ్ నిర్ధారణ, అవయవాల సేకరణ చర్యలు తీసుకోనున్నారు. డిమాండ్ ఎక్కువ... అవయవాలు తక్కువ కిడ్నీ, లివర్, గుండె, ఊపిరితిత్తులు, క్లోమం వంటి అవయవాలను అవసరమైనవారికి మార్పిడి చేయడానికి వైద్యపరంగా వీలుంది. రాష్ట్రంలో జీవన్‌దాన్ పథకం ద్వారా అవయవ దానాలు, అవయవమార్పిడి జరుగుతున్నాయి. ఈ పథకం ద్వారా బ్రెయిన్ డెడ్ అయిన కేసుల నుంచి అవయవాలు సేకరిస్తారు. వెబ్సైట్లో డోనర్లు తమ పేర్లు నమోదు చేసుకుంటే, వారికి ప్రభుత్వం ఆర్గాన్ డోనర్ కార్డు అందజేస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో 2002లో తొలిసారి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగింది. జీవన్‌దాన్‌లో ప్రస్తుతం 2,863 మంది అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్నారు. నమోదు చేసుకోనివారు 90 శాతం మంది బాధితులు ఉంటారని జీవన్‌దాన్ వర్గాలు చెబుతున్నాయి. ఉదాహరణకు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ద్వారా ప్రస్తుతం 10 వేల మంది బాధితులు కిడ్నీ డయాలసిస్ చేయించుకుంటున్నారు. వారిలో సగం మందికైనా కిడ్నీ మార్పిడి చేయడానికి వీలుంది. కానీ, అవయవాల లభ్యత కొరవడింది. దానికి ప్రధాన కారణం బ్రెయిన్‌డెడ్ నిర్ధారణ చేయడానికి అనువైన వసతులు లేకపోవడమే. హైదరాబాద్‌లో మాత్రమే నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులతోపాటు 30 ప్రైవేట్ ఆసుపత్రుల్లో బ్రెయిన్‌డెడ్ నిర్ధారణ జరుగుతోంది. జిల్లాల్లో ఇటువంటి ఏర్పాట్లు లేవు. దీంతో వేలాదిమంది బ్రెయిన్‌డెడ్ కేసులు నమోదవుతున్నా, నిర్ధారణ జరగక అవయవాలు వృథాగా పోతున్నాయి. బ్రెయిన్‌డెడ్‌ను ఎలా నిర్ధారిస్తారు? ప్రమాదం వల్లగాని, నివారణ కాని వ్యాధి వల్ల కాని మనిషి అపస్మారక స్థితిలోకి చేరుకుంటాడు. కృత్రిమ ఆక్సిజన్ ద్వారా రక్తప్రసరణ జరుగుతున్నప్పటికీ తిరిగి స్పృహలోకి రాని స్థితిని బ్రెయిన్ డెడ్‌గా పేర్కొంటారు.ఆ సమయంలో గుండె స్పందనలూ, ఊపిరితిత్తుల పనితీరు, కిడ్నీలు, కాలేయం సజీవంగానే ఉంటాయి. అయితే రోగి ఎట్టి పరిస్థితుల్లోనూ బతికే అవకాశం ఉండదు. ఈ పరిస్థితిని నిర్ధారించాలంటే కొన్ని నిర్దిష్ట నిబంధనలు ఉన్నాయి. న్యూరాలజీ, న్యూరోసర్జరీ, అనస్థిసిస్ట్, జనరల్ ఫిజీషియన్‌లతోపాటు ఆస్పత్రి సూపరింటెండెంట్లతో కూడిన బృందం కొన్ని నిర్దిష్ట మార్గదర్శకాల ద్వారా బ్రెయిన్‌డెడ్ అనే విషయాన్ని నిర్ధారణ చేస్తారు. జిల్లాల్లో అనువైన పరిస్థితులు కరోనా కాలంలో పెరిగిన వైద్య మౌలిక సదుపాయాల కారణంగా అవయవ దానాలు, సేకరణకు అవకాశాలు విస్తృతమయ్యాయి. బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి అవయవాలను సేకరించాలన్నా, వారు చనిపోవడానికి ముందు అవసరమైన చికిత్స పొందాలన్నా తప్పనిసరిగా ఐసీయూ వసతి ఉన్న ఆసుపత్రులు కావాలి. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో 11,845 ఐసీయూ, వెంటిలేటర్లు ఉండగా, అందులో ప్రభుత్వంలో 2,143, ప్రైవేట్‌లో 9,702 ఐసీయూ, వెంటిలేటర్ పడకలు ఉన్నాయి. ఫలితంగా బ్రెయిన్‌డెడ్ అయిన కేసుల నిర్వహణ సులువని అంటున్నారు. కాగా, 2013లో 189 అవయవదానాలు జరిగితే, ఈ ఏడాది 662 జరగడం గమనార్హం. అవయవ మార్పిడికి డిమాండ్ పెరిగింది అవయవ మార్పిడికి రాష్ట్రంలో డిమాండ్ పెరిగింది. కానీ, ఆ మేరకు అవయవాలను అందించలేకపోతున్నాం. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో 10 వేల మంది కిడ్నీ డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఇంకా అనేకమంది రిజిస్ట్రేషన్న్ చేయించుకోవడంలేదు. ఈ నేపథ్యంలో జిల్లాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అవకాశం ఉన్నచోట బ్రెయిన్‌డెడ్ నిర్ధారణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. – డాక్టర్ స్వర్ణలత, జీవన్‌దాన్ ఇన్చార్జి -
బతికుండగా పదిమందికి పట్టెడన్నం.. చనిపోతూ ఐదుగురికి ప్రాణదానం
సాక్షి, కర్నూలు(హాస్పిటల్): తాను బతికి ఉండగా నాగలి చేతబట్టి ధాన్యరాశులు పండించి పదుగురికీ పట్టెడన్నం పెట్టాడు. చివరకు మరణించాక కూడా ఐదుగురికి తన అవయవాలను దానం చేసి వారిలో జీవిస్తున్నాడు. కర్నూలు మండలం పడిదెంపాడు గ్రామానికి చెందిన పరమేశ్వరరెడ్డికి ఈ నెల 5వ తేదీన బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరిశీలించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని కర్నూలు నుంచి సికింద్రాబాద్‌లోని కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్‌కు తరలించారు. అతన్ని రక్షించేందుకు మూడురోజుల పాటు వైద్యులు ఎంతో శ్రమించారు. కానీ దురదృష్టవశాత్తూ అతను మంగళవారం బ్రెయిన్ డెడ్ అయ్యారు. ఆ తర్వాత వైద్యబృందం అవయవదానంపై వారి కుటుంబసభ్యులు భార్య, కుమారులకు, బంధువులకు అవగాహన కల్పించారు. వారి అంగీకారంతో కళ్లు, కాలేయం, రెండు కిడ్నీలు దానం చేశారు. చనిపోతూ అతను మరో ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపినందుకు గర్వంగా ఉందని మృతుని కుటుంబసభ్యులు తెలిపారు. జీవనధాన్ ఆధ్వర్యంలో అవసరం ఉన్న చోటికి గ్రీన్‌చానెల్ ద్వారా కాలేయం, కిడ్నీలను తరలించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. చదవండి: (సత్తెనపల్లిలో కుమ్మేసుకున్న తెలుగు తమ్ముళ్లు)