ముస్తాబాద్ (సిరిసిల్ల): తాను మరణించినా మరో నలుగురికి ప్రాణదానం చేశారా మానవతామూర్తి. కలకాలం తోడూనీడగా ఉంటుందనుకున్న భార్య.. అనూహ్య రీతిలో బ్రెయిన్‌డెడ్ కాగా.. ఆమె అవయవాలు దానం చేసి త్యాగనిరతిని ప్రదర్శించారు భర్త. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామానికి చెందిన ఎరవెల్లి వినిల్ – సరిత దంపతులు. వినిల్ హైదరాబాద్‌లో దంత వైద్యుడిగా వైద్యసేవలు అందిస్తున్నారు. రెండురోజుల క్రితం సరిత అధిక రక్తపోటుకు గురై ఇంట్లో కింద పడిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. తలలో రక్తనాళాలు చిట్లిపోయి తీవ్ర రక్తస్రావం జరిగినట్లు డాక్టర్లు గుర్తించారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.
చివరకు సరిత బ్రెయిన్‌డెడ్ అయినట్లు డాక్టర్లు తేల్చారు. తన భార్యను రక్షించుకోలేక పోయా మని భర్త వినిల్ కన్నీటిపర్యంతమయ్యారు. ఆమె అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఒక వైద్యుడిగా అంతకు మించి మానవతావాదిగా ఆలోచించిన భర్త వినిల్.. బ్రెయిన్‌డెడ్ అయిన భార్య సరిత అవయవాల దానానికి అంగీకరించారు. శుక్రవారం సరిత గుండె, కాలేయం, కార్నియా, మూత్ర పిండాలను వైద్యులు సేకరించారు. హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో గుండె అవసరమున్న ఓ యువతికి ఆ గుండెను అమర్చేందుకు గ్రీన్‌చానల్ ఏర్పాటు చేశారు.
బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రి నుంచి 5 కి.మీ. దూరంలోని నాంపల్లిలోని కేర్ ఆస్పత్రికి సరిత గుండెను పది నిమిషాల్లో తరలించారు. 18 ఏళ్ల యువతికి గుండెను అమర్చారు. అలాగే సరిత మూత్ర పిండాలు, కార్నియా, కాలేయం మరో ముగ్గురికి అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సరిత మరణించినా ఆమె నలుగురి జీవితాల్లో వెలుగులు నింపారు. సరిత స్వగ్రామం పోత్గల్‌లో ఆమె త్యాగాన్ని గ్రామస్తులు స్మరించుకుంటున్నారు. భర్త వినిల్ మానవతావాదిగా.. నాలుగు కుటుంబాలకు జీవితాన్ని ఇచి్చన వ్యక్తిగా అభినందిస్తున్నారు.
ఆమె త్యాగం.. ‘సజీవం’
Published Sun, Aug 11 2019 1:09 AM | Last Updated on Sun, Aug 11 2019 1:09 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment