ఈ చిన్నారి.. చిరంజీవి
♦ ఐదుగురికి జీవితాన్నిచ్చిన18 నెలల బాలుడు
♦ కన్నపేగు కోత దిగమింగి..తల్లిదండ్రుల స్ఫూర్తి
♦ చిన్నారి అవయవదానం.. తెలుగు రాష్ట్రాల్లో ప్రథమం
సాక్షి, విశాఖపట్నం : అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు హఠాత్తుగా ప్రమాదానికి గురయ్యాడు. పద్దెనిమిది నెలల ప్రాయంలోనే బ్రెయిన్‌డెడ్ అయ్యాడు.నిన్నటి దాకా గోరుముద్దలు తినిపించిన తమ చిన్నారి ఇక లేడని తెలియడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదనకు అంతులేదు. అయినా దానిని దిగమింగుకొని ఎంతో మందికి స్ఫూర్తినిచ్చే నిర్ణయం తీసుకున్నారు. తమ చిన్నారి అవయవదానానికి అంగీకరించి ఆదర్శప్రాయంగా నిలిచారు. వివరాల్లోకి వెళితే... విశాఖలోని ఆరిలోవలో ఉంటున్న మద్ది వెంకటనారాయణరాజు చిన్న కుమారుడు రోహిత్ (18 నెలలు) మర్రిపాలెంలో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి ఈనెల 11న తల్లితో వెళ్లాడు. ఆ రాత్రి ఆడుకుంటూ బయటకు వచ్చిన రోహిత్‌పై అక్కడే పార్క్ చేసి ఉన్న బైక్ పడింది. తలకు తీవ్రగాయాలైన బాలుడిని నగరంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అక్కడ చికిత్స పొందుతూ సోమవారం చిన్నారి బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయాన్ని తండ్రికి తెలియజేశారు. అవయవదానంపై అవగాహన కల్పించడంతో ఆ తండ్రి తన కుమారుడి అవయవాలను దానం చేయడానికి అంగీకరించారు. దీంతో రోహిత్‌ను నగరంలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. జీవన్‌దాన్ సంస్థ ద్వారా అవయవదానం ప్రక్రియను రాత్రి 10.30 గంటలకు పూర్తి చేశారు. రోహిత్ రెండు కళ్లు మోహిసిన్ ఐ బ్యాంకుకు, రెండు కిడ్నీలు, కాలేయాన్ని విశాఖ కేర్ ఆస్పత్రిలోని రోగులకు దానం చేశారు. దీంతో ఆ చిన్నారి తాను మరణించి మరో ముగ్గురికి ప్రాణదానం, ఇద్దరికి చూపును ప్రసాదించి ఈ లోకం నుంచి వెళ్లిపోయాడు. పద్దెనిమిది నెలల వయసులో ఓ చిన్నారి అవయవాలను దానం చేయడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే ప్రథమమని జీవన్‌దాన్ ప్రతినిధులు ‘సాక్షి’కి చెప్పారు.