ఆ యువకుడికి భవిష్యత్‌పై ఎన్నో ఆశలు.. మరెన్నో బరువు బాధ్యతలు.. వాటన్నిటినీ మోయడానికి సిద్ధపడుతున్నాడు. అప్పుల్లో ఉన్న కుటుంబాన్ని గట్టెక్కించాలనుకున్నాడు. అందుకు ప్రభుత్వ ఉద్యోగమే సరైనదని భావించేవాడు. అందుకోసం కష్టపడి చదివేవాడు. ప్రతిభావంతుగా పేరు తెచ్చుకున్నాడు. వారం రోజుల్లో స్టీల్‌ప్లాంట్‌లో జరిగే జూనియర్ ఇంజినీర్ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. ఇంతలోనే విధికి క న్నుకుట్టింది. అతని కలలనూ, కొడుకుపై పెట్టుకున్న ఆశలనూ రోడ్డు ప్రమాదం రూపంలో వచ్చి చిదిమేసింది. ఈ విషాదగాథ రోడ్డు ప్రమాదంలో గాయపడి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్‌డెడ్ అయి, అవయవదానం చేసిన అల్లాడ సాయికుమార్‌ది.
విశాఖపట్నం/అల్లిపురం: సాయికుమార్ నగర శివారులోని రఘు ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతున్నాడు. కాలేజీలో 80 శాతం మార్కులు సాధిస్తూ ప్రతిభావంతుడిగానే గాక బుద్ధిమంతుడిగానూ పేరు సంపాదించాడు. తల్లిదండ్రులు చంద్రశేఖర్, కోటలక్ష్మిల పేదరికాన్ని చూసిన సాయికుమార్ అమ్మానాన్నలు పంపే డబ్బును అతి పొదుపుగా ఖర్చు పెట్టేవాడు. తాను తల్లిదండ్రులకు భారం కాకూడదనుకుని స్నేహితులతో బయటకు కూడా వెళ్లేవాడు కాదు. తొందరగా ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రభుత్వోద్యోగం సంపాదించాలని తరచూ స్నేహితులతో చెప్పేవాడు. తన ఉద్యోగంతో అప్పుల్లో ఉన్న కుటుంబాన్ని గట్టెక్కించాలని చెబుతుండేవాడు. ఇటీవల జరిగిన ‘గేట్ 2016’ పరీక్ష కూడా బాగానే రాశాడు. ఈ నెల 28న జరిగే స్టీల్‌ప్లాంట్ జూనియర్ ఇంజనీర్ పరీక్షకు హాజరవుతున్నాడు. హాల్‌టిక్కెట్టు కూడా తీసుకున్నాడు. ఈ పరీక్ష కోసం రేయింబవళ్లు కష్టపడి చదువుతున్నాడు కూడా.
తల్లిదండ్రులకు సాయికుమార్ ఒక్కడే కొడుకు. మరొక కుమార్తె ప్రియాంక. ఈమె బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది. ‘నిన్ను ఎమ్మెస్సీ చదివిస్తాను బాగా చదువు చెల్లెమ్మా!’ అంటుండేవాడు. ఎదిగివచ్చిన కొడుకు కొన్నాళ్లలోనే ఉద్యోగంలో చేరతాడని, తమ కష్టాలు తీరతాయని ఎన్నో కలలు కంటున్నారు. ఇంతలోనే పిడుగులాంటి వార్త! సాయికుమార్ బైకు ప్రమాదంలో గాయపడ్డాడని. కొడుకు తొందరగా కోలుకోవాలని తల్లిదండ్రులతో పాటు బంధువులు, స్నేహితులు కోటి దేవుళ్లకు మొక్కుకున్నారు. కానీ ఏ దేవుడూ కనికరించలేదు. సాయికుమార్ బ్రెయిన్‌డెడ్ అయి బతకడని వైద్యులు గుండెలు పిండేసే చేదు నిజాన్ని వెల్లడించారు. ఒకపక్క పుట్టెడు విషాదంలో ఉన్న వారంతా గుండె నిబ్బరం చేసుకుని సాయికుమార్ అవయవదానం చేయడానికి ముందుకొచ్చారు. ఫలితంగా సాయికుమార్ మరణించాక కూడా ముగ్గురికి ప్రాణదానం, మరో ఇద్దరికి వెలుగు ప్రసాదించగలిగాడు. విషణ్ణవదనంతో బంధుమిత్రులు, స్నేహితులు సాయికుమార్ మృతదేహాన్ని స్వగ్రామం కేడీపేటకు తరలించారు.
జీర్ణించుకోలేకపోతున్నాం..
సాయికుమార్ స్నేహితులతో చాలా స్నేహపూర్వకంగా ఉండేవాడు. ఒకసారి స్నేహం చేస్తే ఎవరూ ఆయనను వదులుకోవడానికి ఇష్టపడరు. ఎప్పుడూ చదువుపైనే ధ్యాస. ఎక్కడికైనా వెళ్దామన్నా వచ్చేవాడు కాదు. మా ఫ్రెండ్ ఇక లేడన్న నిజాన్ని మేమంతా జీర్ణించుకోలేకపోతున్నాం. - జిలానీ బాషా, సాయికుమార్ స్నేహితుడు
విధి చిదిమేసింది..
Published Sun, Feb 21 2016 11:29 PM | Last Updated on Sun, Sep 3 2017 6:07 PM
Advertisement