చిరంజీవి.. ఈ శ్రీమన్నారాయణుడు
♦ తాను మరణించి మరో నలుగురికి జీవితాన్నిచ్చి..
♦ బ్రేయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి గుండె, కిడ్నీ, లివర్, కళ్లు సేకరణ
సాక్షి, బెంగళూరు: మరణంలోనూ మరో నలుగురికి జీవం పోసి జీవితాన్ని సార్థకం చేసుకున్నారు మైసూరుకు చెందిన శ్రీమన్నారాయణ. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీమన్నారయణ బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించడంతో ఆయన అవయవాలను బెంగళూరుకు తరలించి, అవసరమైన రోగులకు అమర్చారు. దీంతో మరణం తర్వాత కూడా మరో నలుగురికి శ్రీమన్నారాయణ జీవం పోసినట్లైంది. వివరాలు.....మైసూరుకు చెందిన శ్రీమన్నారయణ(38) కోళ్ల ఫారమ్ నిర్వహిస్తున్నారు. ఈనెల 3న కోళ్లు ఉన్న వ్యాన్‌లో మైసూరు ప్రధాన రహదారిపై వెళుతుండగా, వాహనం ఆగిపోవడంతో డ్రైవర్ మరమ్మత్తు చేస్తున్నారు. దీంతో శ్రీమన్నారాయణ కూడా కిందకు దిగాడు. ఆ సమయంలో వెనక నుంచి వచ్చిన బైక్ ఢీకొంది.
ప్రమాదంలో శ్రీమన్నారాయణ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను మైసూరులోని జేఎస్‌ఎస్ ఆస్పత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. అయితే శనివారం ఉదయం శ్రీమన్నారాయణ బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధరించారు. శ్రీమన్నారాయణ అవయవాలను దానం చేయాల్సిందిగా ఆయన కుటుంబ సభ్యులను వైద్యులు కోరారు. ఇందుకు వారు అంగీకరించడంతో శ్రీమన్నారాయణ గుండె, కిడ్నీ, లివర్, రెండు కళ్లను సేకరించారు.
గ్రీన్ కారిడార్ ఏర్పాటు.....
ఇక మైసూరు నుంచి అత్యంత వేగంగా బెంగళూరులోని ఆస్పత్రులకు ఈ అవయవాలను చేర్చేందుకు మైసూరు, బెంగళూరు పోలీసులు మైసూరు నుంచి బెంగళూరు వరకు జీరో ట్రాఫిక్(గ్రీన్ కారిడార్) మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో సాధారణంగా నాలుగు గంటల సమయం పడుతుండగా గ్రీన్ కారిడార్ ఏర్పాటుతో గంటన్నర వ్యవధిలోనే ఆంబులెన్స్ బెంగళూరుకు చేరుకోగలిగింది. అనంతరం బెంగళూరులో ఆవశ్యకత ఉన్న వివిధ ఆస్పత్రులకు ఆయా అవయవాలను తరలించారు.