
ఆశయం ఐసీయూలో..!
గుంటూరు పెద్దాసుపత్రిలో బ్రెయిన్‌డెడ్‌ను నిర్ధారించలేని దుస్థితి
అవయవాల సేకరణకు అక్టోబరులోనే జీజీహెచ్‌కు అనుమతులు
గుండె మార్పిడి ఆపరేషన్లకు ‘గోఖలే’ ముందుకొచ్చినా స్పందించని వైద్యులు
రోగులకు శాపంగా మారిన అధికారులు, డాక్టర్ల నిర్లక్ష్యం
ఉన్నత ఆశయానికి తూట్లు పొడుస్తున్నారు...సహృదయ ట్రస్టు ఆధ్వర్యంలో డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే నేతృత్వంలో ఏడాదిలో 150కు పైగా గుండె ఆపరేషన్లు జరిగాయి...ఈ నెల 18లోపు గుండె మార్పిడి ఆపరేషన్లు సైతం నిర్వహించేందుకు సమాయత్తం అయ్యారు. అయితే జీజీహెచ్ అధికారులు, వైద్యాధికారుల నిర్లక్ష్యం కారణంగా ఉన్నతాశయానికి తూట్లు పడుతున్నాయి. గుండె మార్పిడి ఆపరేషన్లు నిర్వహించాలంటే బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి అవయవాలు సేకరించాలి. అయితే జీజీహెచ్‌లో బ్రెయిన్ డెడ్ నిర్ధారించలేని దుస్థితి నెలకొంది.
ఆశయం ఐసీయూలో..!
సాక్షి, గుంటూరు : రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి(జీజీహెచ్)లో గుండె ఆపరేషన్‌లు జరుగుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది మార్చి 18న సహృదయ ట్రస్టు ఆధ్వర్యంలో జీజీహెచ్‌లో పీపీపీ విధానంలో గుండె ఆపరేషన్లు మొదలు పెట్టారు. ఏడాదిలోపు ఎవరూ ఊహించని విధంగా 150 ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేసి నిరుపేద రోగులకు పునర్జన్మ ప్రసాదించారు. తాను చదువుకున్న కళాశాలకు ఏదో చేయాలనే తపనతో ముందుకు వచ్చిన ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే దాతల సహాయంతోపాటు, సొంత ఖర్చులతో ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించారు.
ఆ సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయనకు ఇటీవల పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది. దీంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని భావించిన డాక్టర్ గోఖలే జీజీహెచ్‌లో గుండె మార్పిడి ఆపరేషన్లు సైతం నిర్వహించాలని తలంచారు. ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా వచ్చాయి. అయితే దీనికి సంబంధించి ఎంత ప్యాకేజీ ఇవ్వాలనే దానిపై స్పష్టత రాకపోయినప్పటికీ దాతల సహాయంతో ఈనెల 18వ తేదీలోపు పూర్తి చేయాలనే తపనతో పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు. ఇప్పటికే గుండె మార్పిడి ఆపరేషన్‌ల కోసం ఎనిమిది మందిని పూర్తి స్థాయిలో పరీక్షించిన అనంతరం ముగ్గురు రోగులను సిద్ధం చేశారు. బ్రెయిన్ డెడ్ కేసులు రాగానే వారి గుండెను సేకరించి వీరిలో ఒకరికి మార్పిడి ఆపరేషన్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
బ్రెయిన్ డెడ్‌ను నిర్ధారించలేని దుస్థితి ...
గుంటూరు జీజీహెచ్ అత్యవసర వైద్య విభాగానికి నిత్యం పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాల కేసులు వస్తుంటాయి. వీటిలో బ్రెయిన్ డెత్ అయిన కేసులు అనేకం ఉంటాయి. జీవన్‌దాన్ పథకం ద్వారా బ్రెయిన్ డెత్ అయిన వ్యక్తి నుంచి అవయవాలు సేకరించేందుకు గత ఏడాది అక్టోబరులో జీజీహెచ్‌కు అనుమతులు వచ్చాయి. బ్రెయిన్ డెత్ కేసులను నిర్ధారించేందుకు ఇటీవల కమిటీని సైతం నియమించారు. అయితే జీజీహెచ్ వైద్యుల సమన్వయ లోపం వల్ల బ్రెయిన్ డెత్ కేసులను నిర్ధారించలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యుల మధ్య సమన్వయ లోపం రోగులకు శాపంగా మారింది. జీజీహెచ్‌లో గుండె మార్పిడి ఆపరేషన్లు నిర్వహించి చరిత్ర సృష్టించడంతోపాటు, పేద రోగులకు అండగా నిలవాలనే డాక్టర్ గోఖలే చేపట్టిన ఉన్నత ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన జీజీహెచ్ అధికారులు, వైద్యులే తూట్లు పొడుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.