ఆడబిడ్డ పుట్టిన వెంటనే శ్రీనితకు తీవ్ర అస్వస్థత
బ్రెయిన్ డెడ్ అని తెలిపిన వైద్యులు
మాతృ స్పర్శను ఆస్వాదించకుండానే కన్నుమూసిన బాలింత
కాజీపేట: ‘ఒక దీపం వెలిగించును వేలకొలది జ్యోతులు. ఒక దీపం చూపించును ప్రగతికి రహదారులు’ అన్నాడో కవి. ఓ యువతి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి అచేతనావస్థకు చేరుకోవడంతో జీవచ్ఛవంలా మారింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఎంత ఖరీదైన వైద్యం చేసినా బతికే అవకాశం లేదని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యుల అంగీకారంతో అవయవదానం చేసి నలుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. కానీ ఆ యువతి మాతృ స్పర్శను ఆస్వాదించకుండానే కన్నుమూసింది. ఈ విషాద ఘటన కాజీపేటలో శనివారం జరిగింది.
బాపూజీనగర్ కాలనీకి చెందిన వశాపాక శ్రీనిత (23) పదిరోజుల కింద ఆడశిశువుకు జన్మనిచ్చి తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శ్రీనిత ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే శ్రీనిత బ్రెయిన్ వాపు వచ్చి కోమాలోకి వెళ్లింది. చికిత్సకు ఆమె స్పందించకపోవడంతో బతికే అవకాశం లేదని, బ్రెయిన్ డెడ్ అని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. పుట్టిన బిడ్డ కనీసం తల్లి స్పర్శకు నోచుకోలేదు.
ఇక.. ఎప్పటికీ తిరిగిరాని తమ బిడ్డ మరో నలుగురి జీవితాల్లో వెలుగులు నింపితే చాలని కన్నవాళ్లు, భర్త అవయవదానానికి అంగీకరించారు. శ్రీనిత కళ్లు, గుండె, కిడ్నీలు, లివర్‌లను వైద్యులు శస్త్ర చికిత్స చేసి మరో నలుగురికి అమర్చారు. బిడ్డ పుట్టిందనే విషయం తెల్సి మురిసిపోయిన శ్రీనిత.. ఆ బిడ్డ ఆత్మీయ స్పర్శను ఆస్వాదించకుండానే కన్నుమూసింది. బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య శనివారం రాత్రి బాపూజీనగర్‌లో అంత్యక్రియలు పూర్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment