బ్రెయిన్ డెడ్ అయిన చిన్నారి పల్లవి కిడ్నీలు, నేత్రాలు దానం
రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులతో సహా గాయపడిన చిన్నారి
విజయనగరం ఫోర్ట్: పుట్టెడు దుఃఖంలోనూ ఆ తల్లిదండ్రులు గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు అనంతలోకాలకు వెళ్లిపోతుందని తెలిసి అవయవదానానికి అంగీకరించి ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం మురపాక గ్రామానికి చెందిన గండి వెంకటరమణ ఈ నెల 20న భార్య దేవి, కుమార్తె పల్లవి (11)తో కలిసి ద్విచక్రవాహనంపై మండలంలోని ఎగువ కొండపర్తిలోని వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు.
తిరిగి వస్తుండగా అనంతగిరి మండలం ఎన్.ఆర్.పురం వద్ద బ్రేక్ ఫెయిల్ కావడంతో రోడ్డు పక్కన ఉన్న తుప్పల్లో పడిపోయారు. తుప్పల్లో ఉన్న రాళ్లపై పడడంతో పల్లవి తలకు తీవ్ర గాయమైంది. వెంకటరమణ కాలుకు, భార్య దేవి చేతికి గాయాలయ్యాయి. ప్రమాద బాధితులను వెంటనే గ్రామస్తులు ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పల్లవి పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరంలోని తిరుమల మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు పల్లవికి బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు.
పాప అవయవాలు దానం చేస్తే మరికొందరికి పునర్జన్మనిచ్చినట్లు అవుతుందని మెడికవర్ వైద్యులు పల్లవి తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. దీంతో వారు అవయవదానానికి అంగీకరించారు. తిరుమల మెడికవర్ ఆస్పత్రిలో పల్లవి శరీరం నుంచి శుక్రవారం రెండు కిడ్నీలు, కళ్లలోని కార్నియాలను సేకరించారు.
కిడ్నీలను గ్రీన్ చానల్ ద్వారా అంబులెన్సులో విశాఖపట్నం మెడికవర్ ఆస్పత్రికి ఒకటి, కిమ్స్ ఐకాన్‌కు మరొకటి తరలించారు. నేత్రాలను విశాఖపట్నం ఎల్.వి.ప్రసాద్ ఐ ఆస్పత్రికి తరలించారు. అవయవదానానికి ముందుకొచి్చన పల్లవి తల్లిదండ్రులకు ఆస్పత్రి వైద్య సిబ్బంది, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment