రామారావు (ఫైల్)
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): తను చనిపోతూ నలుగురికి జీవం పోశాడు ఓ వ్యక్తి. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన యతిరాజ్యం రామారావు రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్‌కు గురై శాశ్వత లోకాలకు వెళ్లిపోతూ నేత్రాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు దానం చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఆమదాలవలసకు చెందిన రామారావు వ్యవసాయం చేసేవారు. ఈయనకు భార్య రూపావతి, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. భార్య గృహిణి, పిల్లలిద్దరికీ వివాహమైంది. కుమారుడు నగరంలోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌లో పనిచేస్తున్నారు.
పదేళ్ల కిందట వ్యవసాయ పనులు చేస్తుండగా జరిగిన ప్రమాదంలో రామారావు కాలు విరిగిపోయింది. చికిత్స చేసి రాడ్లు వేశారు. అప్పటి నుంచి ఇంటి వద్దనే ఉంటున్నారు. ఇదిలా ఉండగా వ్యక్తిగత పనుల నిమిత్తం ఈ నెల 2న వేరే వ్యక్తితో ద్విచక్ర వాహనంపై వెనక కూర్చుని వెళ్తుండగా రణస్థలం మండలం కొచ్చెర్ల గ్రామం వద్ద బండి అదుపు తప్పి రామారావు కింద పడిపోయాడు. దీంతో రామారావును విశాఖలోని కేర్ ఆస్పత్రిలో చేర్పించగా, 3వ తేదీన శస్త్రచికిత్స చేశారు.
అయినా ఫలితం లేకపోవడంతో బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించారు. దీంతో రామారావు అవయవాలు దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకొచ్చారు. ఆస్పత్రి యాజమాన్యం స్పందించి కాలేయం, ఊపిరితిత్తులను వేరే వారికి అమర్చేందుకు తీసుకున్నారు. రెండు నేత్రాలను ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి అందజేశారు. గుండెను చెన్నైలోని ఎంజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. రామారావు చనిపోతూ నలుగురికి జీవం పోయడంపై ఆయనను, ఆయన కుటుంబసభ్యులను పలువురు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment