Organ donation
-
మరణించినా మరికొందరిలో ప్రభవిస్తున్నారు!
సాక్షి, అమరావతి: మరణించినా అవయవదానం ద్వారా మరికొందరికి ప్రాణం పోస్తున్న వారి సంఖ్య గత మూడేళ్లుగా పెరుగుతోంది. దేశంతో పాటు రాష్ట్రంలోనూ అవయవ దాతల సంఖ్య క్రమంగా పెరుగుతోందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో 2021 నుంచి 2023 వరకు అవయవదానాల సంఖ్య 42,040కు చేరిందని, అదే సమయంలో రాష్ట్రంలోనూ ఈ సంఖ్య 965కు చేరిందని పేర్కొంది. అవయవదానాలను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. మరణించాక అవయవదానం చేయడం వల్ల మరొకరికి ప్రాణం పోసినవారవుతారన్న తరహాలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అవయవదానం నమోదును సులభతరం చేసేందుకు ఆధార్ అనుసంధానంతో డిజిటల్ వెబ్ పోర్టల్‌ను గతేడాది సెప్టెంబర్‌లో కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. మరణించాక తమ అవయవాలను దానం చేస్తామంటూ ఇప్పటి వరకూ రెండు లక్షల మంది ఈ పోర్టల్‌లో ప్రతిజ్ఞ చేయడం విశేషం. అవయవదానాలపై అవగాహన కల్పించేందుకు ఏటా భారతీయ అవయవదాన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సెమినార్లు, వెబ్నార్లు, వర్క్‌షాప్‌ల వంటి ప్రత్యేక కార్యక్రమాలతో ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. అవయవాల సేకరణ, మార్పిడి, పంపిణీ కోసం అవసరమైన మౌలిక సదుపాయాల యంత్రాంగాన్ని పటిష్టం చేయడంతో పాటు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక సంస్థలతో మూడంచెల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. జాతీయ స్థాయిలో ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్, ఐదు ప్రాంతీయ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్లు, రాష్ట్ర స్థాయిలో 21 రాష్ట్ర అవయవాలు, టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ప్రస్తుతం 900పైగా ఇనిస్టిట్యూషన్లు, ఆస్పత్రులు అవయవాల మార్పిడి, పునరుద్ధరణ నెట్‌వర్క్‌తో అనుసంధానమయ్యాయి.రూ.10 వేల పారితోషికంబ్రెయిన్ డెడ్ అయి అవయవదానాలు చేస్తున్న వారి అంత్యక్రియలను గౌరవప్రదంగా నిర్వహించాల్సిందిగా కేంద్ర మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. అవయవాల సేకరణ అంనతరం భౌతిక కాయాన్ని ఉచిత రవాణా సదుపాయాలతో స్వస్థలాలకు చేర్చడంతో పాటు.. కుటుంబ సభ్యులకు రూ.10 వేల పారితోషికం ఇవ్వాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. అవయవదానం చేసిన వ్యక్తి కుటుంబ సభ్యులను సత్కరించాలని కూడా ఆ ఆదేశాల్లో పేర్కొంది. -
పుట్టెడు దుఃఖంలోనూ అవయవదానం
విజయనగరం ఫోర్ట్: పుట్టెడు దుఃఖంలోనూ ఆ తల్లిదండ్రులు గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు అనంతలోకాలకు వెళ్లిపోతుందని తెలిసి అవయవదానానికి అంగీకరించి ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం మురపాక గ్రామానికి చెందిన గండి వెంకటరమణ ఈ నెల 20న భార్య దేవి, కుమార్తె పల్లవి (11)తో కలిసి ద్విచక్రవాహనంపై మండలంలోని ఎగువ కొండపర్తిలోని వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా అనంతగిరి మండలం ఎన్.ఆర్.పురం వద్ద బ్రేక్ ఫెయిల్ కావడంతో రోడ్డు పక్కన ఉన్న తుప్పల్లో పడిపోయారు. తుప్పల్లో ఉన్న రాళ్లపై పడడంతో పల్లవి తలకు తీవ్ర గాయమైంది. వెంకటరమణ కాలుకు, భార్య దేవి చేతికి గాయాలయ్యాయి. ప్రమాద బాధితులను వెంటనే గ్రామస్తులు ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పల్లవి పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరంలోని తిరుమల మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు పల్లవికి బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. పాప అవయవాలు దానం చేస్తే మరికొందరికి పునర్జన్మనిచ్చినట్లు అవుతుందని మెడికవర్ వైద్యులు పల్లవి తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. దీంతో వారు అవయవదానానికి అంగీకరించారు. తిరుమల మెడికవర్ ఆస్పత్రిలో పల్లవి శరీరం నుంచి శుక్రవారం రెండు కిడ్నీలు, కళ్లలోని కార్నియాలను సేకరించారు. కిడ్నీలను గ్రీన్ చానల్ ద్వారా అంబులెన్సులో విశాఖపట్నం మెడికవర్ ఆస్పత్రికి ఒకటి, కిమ్స్ ఐకాన్‌కు మరొకటి తరలించారు. నేత్రాలను విశాఖపట్నం ఎల్.వి.ప్రసాద్ ఐ ఆస్పత్రికి తరలించారు. అవయవదానానికి ముందుకొచి్చన పల్లవి తల్లిదండ్రులకు ఆస్పత్రి వైద్య సిబ్బంది, గ్రామస్తులు అభినందనలు తెలిపారు. -
‘చచ్చి’ బతికాడు!
అమెరికాలోని కెంటకీలో థామస్ హోవర్ అనే 36 ఏళ్ల వ్యక్తి డ్రగ్ ఓవర్‌డోస్ వల్ల గుండెపోటుకు గురయ్యాడు. హుటాహుటిన బాప్టిస్ట్ హెల్త్ రిచ్మండ్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అతనిక బతికి బట్ట కట్టడం కల్లేనని వైద్యులు తేల్చారు. అవయవ దానం చేసి ఉండటంతో ముందుగా గుండెను సేకరించాలని నిర్ణయించారు. ఆపరేషన్ టేబుల్‌పైకి తీసుకెళ్లి సరిగ్గా కత్తులూ, కటార్లకు పని చెప్పబోయే సమయానికి మనవాడు ఉన్నట్టుండి కళ్లు తెరిచాడు! కాళ్లూ చేతులూ కదిలించేందుకు ప్రయతి్నంచాడు. తన పరిస్థితి అర్థమై కన్నీరు పెట్టుకున్నాడు. ఇదంతా చూసి డాక్టర్లంతా దిమ్మెరపోయారు. దాంతో అవయవ సేకరణ ప్రయత్నాలకు స్వస్తి చెప్పారు. ఇది 2021 అక్టోబర్‌లో జరిగితే ఆస్పత్రి వర్గాలు మాత్రం వెలుగులోకి రానివ్వలేదు. కనీసం హూవర్ కుటుంబీకులకు కూడా సమాచరమివ్వలేదు. పైగా అతనిలో కనిపిస్తున్న ప్రాణ లక్షణాలను పట్టించుకోకుండా అవయవాలను సేకరించాల్సిందిగా డాక్టర్లపై ఒత్తిడి తెచ్చాయి. వారు నిరాకరించడంతో వేరే వైద్యులను నియోగిస్తే వాళ్లు కూడా చేతులెత్తేశారు. దీనికి ప్రత్యక్ష సాక్షి అయిన ఆస్పత్రి మాజీ ఉద్యోగి ఒకరు గత జనవరిలో హూవర్ సోదరి డోనాకు విషయం చేరవేయడంతో ఇదంతా వెలుగులోకి వచ్చింది. చివరికి వైద్యుల సలహా మేరకు అతన్ని ఇంటికి తీసుకెళ్లిందామె. హూవర్ బ హుశా ఇంకెంతో కాలం బతక్కపోవచ్చన్న డాక్టర్ల అంచనాలను వమ్ము చేస్తూ సోదరి సంరక్షణలో అతను చాలావరకు కోలుకున్నాడు. ఈ ఉదంతం ఇప్పుడు కెంటకీలో టా కాఫ్ ద టౌన్‌గా మారింది. కెంటకీ అటార్నీ జనరల్ కార్యాలయం దీనిపై విచారణ కూడా జరుపుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అవయవదానానికి ఒప్పుకున్న కుటుంబ సభ్యులు
-
అవయవ దానంతో ముగ్గురికి పునర్జన్మ
కాకినాడ క్రైం: ఆ యువకుడి అవయవ దానంతో ముగ్గురికి పునర్జన్మ లభించింది. పశి్చమగోదావరి జిల్లా తోకలపూడి గ్రామానికి చెందిన పోలిశెట్టి రేవంత్ శ్రీ మురహరి (19) స్వగ్రామం నుంచి విశాఖపటా్ననికి పరీక్ష రాసేందుకు ఈ నెల 21వ తేదీన బయలుదేరాడు. మార్గ మధ్యలో ఎర్రవరం హైవేపై రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కాకినాడ అపోలో ఆసుపత్రికి తరలించగా తగిన వైద్య సేవలు అందించినా తలకు తీవ్ర గాయం కావడంతో ఫలితం లేకపోయింది. బ్రెయిన్ డెడ్ అయింది. దీంతో వైద్యులు డాక్టర్ ఎంవీ కిరణ్‌కుమార్, డాక్టర్ శివరామగాంధీ కుమారుడి పరిస్థితిని తండ్రి సుబ్రహ్మణ్యంకి వివరించి అవయవ దాన ప్రాధాన్యాన్ని వివరించారు. దీంతో సుబ్మహ్మణ్యం జీవన్‌దాన్ వెబ్సైట్లో తన కుమారుడి అవయవ దానానికి రిజిస్టర్ చేశారు. దీంతో రేవంత్ కిడ్నీని కాకినాడ అపోలో ఆసుపత్రికి, మరో కిడ్నీని విశాఖపట్టణం కేర్ ఆసుపత్రికి, కాలేయాన్ని షీలానగర్ అపోలో ఆసుపత్రికి తరలించి ముగ్గురి ప్రాణాలు కాపాడారు. ఇందుకు కాకినాడ అపోలోలో ఆర్గాన్ హార్వెస్టింగ్ నిర్వహించారు. జిల్లా పోలీస్ శాఖ సాయంతో సోమవారం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అవయవాలను సురక్షితంగా సకాలంలో తరలించారు. -
అవయవాల అమ్మకం కథ కంచికేనా?
మంచిర్యాలక్రైం: మంచిర్యాల జిల్లా షెట్పల్లికి చెందిన రేవెళ్లి శ్రీకాంత్ అవయవ దానం వెనుక ఉన్న మిస్టరీ వీడడం లేదు. శ్రీకాంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందగా, అంబులెన్స్ నిర్వాహకులే శ్రీకాంత్ అవయవాలు అమ్ముకున్నారనే చర్చ ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇదికాస్త రోజు రో జుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఆగస్టు 6న ప్రమాదానికి గురైన శ్రీకాంత్ హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రిలో చనిపోయాడు. అనంతరం అతడి అవయవాలు అంబులెన్స్ డ్రైవర్లే అమ్ముకున్నారనే చర్చ మొదలైంది. అంబులెన్స్ డ్రైవర్లు మొదటి నుంచీ అవయవాలు దానం చేయాలంటూ ప్రోత్సహించడం మృతుడి కుటుంబ సభ్యులకు అనుమా నం కలిగించింది. అవయవాలను ఎక్కువ ధరకు అమ్ముకొని తమకు తక్కువ డబ్బులు ఇప్పించారేమోననే అనుమానం వ్యక్తం చేస్తూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గత నెల 13న ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచి్చంది. దీంతో అదే నెల 14న ‘అవయవాలు అమ్ముకున్నారు’అనే శీర్షికన ‘సాక్షి’దినపత్రికలో కథనం ప్రచురితం కాగా, సంచలనం సృష్టించింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్‌లోని కార్పొరేట్, కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. గత నెల 19న స్థానిక ఏసీపీ కార్యాలయంలో అవయవాలు అమ్ముకున్నారనే కథనంపై డీసీపీ భాస్కర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. అవయవాలు అమ్మకం జరగలేదని, కేవలం జీవాన్‌దాన్ అనే సంస్థకు శ్రీకాంత్ కుటుంబసభ్యుల ఒప్పందం మేరకు అవయవాలు దానం చేశారని వెల్లడిస్తూ శ్రీకాంత్‌ను ఆస్పత్రిలో చేరి్పంచడంలో కమీషన్ల కోసం వేర్వేరు ఆస్పత్రులకు తిప్పుతూ కాలయాపన చేసినందుకు, అవయవాలు అమ్ముకున్నారనే అసత్య ప్రచారం చేశారని పేర్కొన్నారు. ఆరోపణలు చేసినందుకు కిరణ్, నరేష్, శ్రావణ్, సాయిరాం, సాగర్‌లపై చీటింగ్ కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్‌పై వదిలేశారు. అవయవాలు అమ్మకం జరగలేదనే విషయాన్ని తేల్చేశారు. రూ.3లక్షలు ఇచ్చింది ఎవరు..? శ్రీకాంత్ అవయవాలు అమ్మకం జరగకపోతే శ్రీకాంత్ మృతదేహాన్ని అప్పగించిన తర్వాత కార్పొరేట్ ఆస్పత్రి సర్జన్.. శ్రీకాంత్ భార్య స్వప్న, కుటుంబ సభ్యులను పిలిపించి ఖర్చులకు తీసుకోమని రూ.3లక్షలు ఇచి్చనట్టు చెబుతున్నారు. అవయవాలు దానం చేస్తే రూ.3లక్షలు ఇవ్వడం ఎందుకు, దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకాంత్‌ను కరీంనగర్ ఆస్పత్రి నుంచి హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు సూచించారు. కానీ వెళుతున్న క్రమంలో అవయవాలు దానం చేసిన ఆస్పత్రి నుంచి యాదగిరి అనే వ్యక్తి ఫోన్ చేసి కరీంనగర్ వైద్యులు సూచించిన ఆస్పత్రికి వెళ్లకుండా అడ్డుకొని మాయమాటలు చెప్పి ఆ ఆస్పత్రికి రప్పించుకున్నాడు. ఈ యాదగిరి ఎవరనే దానిపై పోలీసులు దృష్టి సారించలేదు. మృతుడి కుటుంబ సభ్యులకు రూ.3లక్షలు ఇచ్చింది ఎవరనేదానిపైనా పోలీసులు స్పష్టత ఇవ్వలేకపోయారు. రూ.3లక్షల ప్రస్తావన, శ్రీకాంత్ భార్య స్పప్న ఫోన్‌నంబర్ ఎలా వెళ్లిందనే దానిపై స్పష్టత ఇవ్వకుండా పొంతన లేని సమాధానాలు చెప్పి దాటవేశారు. చివరకు కేసు విచారణ పూర్తి కాలేదని, అంబులెన్స్ నిర్వాహకులను మళ్లీ కస్టడీకి తీసుకొని శాస్త్రీయ ఆధారాలు సేకరించి ఈ కేసులో పూర్తి విచారణ చేపడుతామని పేర్కొనడం గమనార్హం. పూర్తిస్థాయి విచారణ ఏమైంది.. అవయవాలు అమ్ముకున్న కథ కంచికేనా అన్న చందంగా మారింది. విచారణ పేరిట రోజుకో మలుపు తిరుగుతోంది. శ్రీకాంత్ అవయవాలు ఎవరు..? ఎంతకు అమ్ముకున్నారనేది ఇంకా ప్రజల్లో చర్చనీయాంశంగానే మిగిలిపోయింది. పోలీసులు మాత్రం విచారణ కొనసాగుతోందని చెబుతున్నారు. గత నెల 27న కరీంనగర్ ఆస్పత్రి నిర్వాహకులు మంచిర్యాలకు వచ్చి వెళ్లినట్లు తెలిసింది. ఈ విషయమై సీఐ బన్సీలాల్‌ను సంప్రదించగా విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఈ కేసులో అంబులెన్స్ నిర్వాహకులపై కేసు నమోదు చేశామని, అవయవాలు అమ్మకంపై వస్తున్న వదంతులపై సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నామని, విచారణ సాగుతోందని తెలిపారు. -
వీసీ సజ్జనార్ అవయవదాన ప్రతిజ్ఞ.. క్యూఆర్ కోడ్ విడుదల
సాక్షి, హైదరాబాద్: మన దేశంలో ఎవరైనా మరణించిన తర్వాత వారి దేహాలను ఖననం లేదా దహనం చేస్తుంటారని, అలా చేసేముందు వారి శరీరంలో ముఖ్యమైన అవయవాలు దానం చేస్తే మరో 8 ప్రాణాలు బతుకుతాయని అదనపు డీజీపీ, తెలంగాణ రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. మరణానంతరం తాను తన అవయవాలు దానం చేస్తున్నట్లు ఈ రోజు ప్రతిజ్ఞ చేస్తున్నానని, ప్రజలందరూ కూడా ఈ విషయంలో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన కామినేని ఆస్పత్రి ఆధ్వర్యంలో అవవయదాన అవగాహన ప్రచారం ప్రారంభ కార్యక్రమంలో ఆయన ఈ మేరకు ప్రతిజ్ఞ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా ఆగస్టు 13వ తేదీని ప్రపంచ అవయవదాన దినోత్సవంగా చేసుకుంటారు. దీనిపై ఉన్న అపోహలను తొలగించి, మరింతమందిని ఈ దిశగా ప్రోత్సహించేందుకు, అవయవదానంపై అవగాహన కల్పిచేందుకు ఈ కార్యక్రమం చేపడతారు.ఈ సందర్భంగా కామినేని ఆస్పత్రుల సీఓఓ గాయత్రీ కామినేని మాట్లాడుతూ.. “గౌరవనీయులైన వీసీ సజ్జనార్ ఈ కార్యక్రమానికి వచ్చి అందరికీ స్ఫూర్తినిస్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు. ఇక్కడ అనేకమంది రోగులు తమకు జీవితంలో లభించే సెకండ్ ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. దాదాపు 14 వేల మందికి పైగా వ్యక్తులు అవయవమార్పిడి కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే మనమంతా స్పందించాలి. అవయవదాన ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ఇక్కడ మేం ప్రారంభిస్తున్నాం. ప్రతి ఒక్కరూ పేర్లు నమోదుచేసుకుని, ఇక్కడ ఉన్నవారికి ఒక ఆశ కల్పించాలని కోరుతున్నాను. రాబోయే సంవత్సరాల్లో జాతీయ సగటును మించి మన తెలుగు రాష్ట్రాల్లో అవయవ దానాలు జరగాలని ఆశిస్తున్నాను. ప్రస్తుత సమాజంలో మాత్రం పరిస్థితి అలా లేదు. దాతల కోసం ఎదురుచూపులు తప్పట్లేదు. అవయవదానం అంటే ప్రాణాన్ని నిస్వార్థంగా మరొకరికి దానం చేయడమే. అలా చేయడం ద్వారా మరో ఎనిమిది మందిలో మనం చిరంజీవులుగా ఎప్పటికీ ఉండిపోతాం. నేనూ ఇప్పటికే అవయవదాన ప్రతిజ్ఞ చేశాను. మీరంతా నాతో కలిసొస్తారని ఆశిస్తున్నా. మనమంతా కలిసి ఒక ప్రభంజనంలా ఈ అవయవదాన సత్కార్యాన్ని ముందుకు తీసుకెళ్దాం. వ్యాధులతో బాధపడుతున్న దశ నుంచి కొత్త జీవితంలోకి అడుగుపెట్టేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారు. వాళ్ల కథలు వింటే మీ హృదయాలు కరుగుతాయి” అని తెలిపారు.ప్రజలందరూ ముందడుగు వేసి, అవయవదాతలుగా మారాల్సిన అవసరం ఉందని అదనపు డీజీపీ వీసీ సజ్జనార్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... “కామినేని ఆస్పత్రిని నా తరఫు నుంచి, ప్రభుత్వం తరఫు నుంచి అభినందిస్తున్నాను. ఇటీవల ఇలాంటి కార్యక్రమం నేను చూడలేదు. అవయవదానం గురించి అవగాహన కల్పించేందుకు ఇది బాగా ఉపయోగపడుతుందని నాకు విశ్వాసం ఉంది. కామినేని కుటుంబంతో నాకు రెండు దశాబ్దాల సాహిత్యం ఉంది. పోలీసులకు కూడా వాళ్లు చాలా చేశారు. పోలీసు శాఖ తరఫున కూడా ఆ కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కొవిడ్ వచ్చినప్పుడు కామినేని ఆస్పత్రి చేసిన సేవలు అపూర్వం. నేను చాలామంది వైద్యులకు ఫోన్లు చేసేవాడిని. శశిధర్ లాంటివాళ్లు అర్ధరాత్రి చేసినా స్పందించేవారు. వైద్యులు, నర్సులు, అందరూ కొవిడ్ సమయంలో చాలా సేవలు చేశారు. తీవ్రగాయాలు అయినప్పుడు మొట్టమొదటగా కామినేని ఆస్పత్రికే మా సిబ్బందిని పంపేవాడిని. ముఖ్యంగా అవయవదానం విషయంలో చాలా అవగాహన రావాలి. కొన్ని లక్షల మంది అవయవాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ సమాచారం ప్రకారం గత సంవత్సరం దేశంలో 18,378 డొనేషన్లు అయితే, వాటిలో లైవ్ డొనేషన్లు 15,436 కెడావర్ డొనేషన్లు 2,942చొప్పున ఉన్నాయి. లైవ్ డొనేషన్లలో కూడా అత్యధికం అంటే దాదాపు పదివేలకు పైగా మహిళలే చేశారు. మూడోవంతు మాత్రమే పురుషులు ఉన్నారు. దేశంలో ఒక ట్రాన్స్‌జెండర్ కూడా అవయవదానం చేయడం విశేషం. మాతృప్రేమ ఇందులో స్పష్టంగా తెలుస్తోంది. పది సంవత్సరాల క్రితం 4,490 మంది మాత్రమే మొత్తం అవయవదానాలు చేశారు. ఇప్పుడు ఇంత పెరగడానికి వివిధ ఆస్పత్రులు, ప్రభుత్వాలు చేస్తున్న అవగాహన కార్యక్రమాలే కారణం. డాక్టర్ స్వర్ణలత లాంటివాళ్లు జీవన్‌దాన్ ద్వారా ఎంతో కృషి చేస్తున్నారు. ఇక్కడ కూడా చాలామంది వైద్యులు అవయవ మార్పిడి ఆపరేషన్లలో ఎంతో ముందున్నారు. వీరందరికీ నా మనఃపూర్వక అభినందనలు” అని చెప్పారు.క్యూఆర్ కోడ్ విడుదలఈ సందర్భంగా ఎవరైనా అవయవదానం చేయాలనుకుంటే అందుకు వీలుగా కామినేని ఆస్పత్రి తరఫున ఒక క్యూఆర్ కోడ్ విడుదల చేశారు. 18 ఏళ్లు నిండిన ఎవరైనా తమ స్మార్ట్ ఫోన్లోని క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే ఒక దరఖాస్తు ఫారం వస్తుంది. దాన్ని నింపి, సబ్మిట్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ అవయవదాతలుగా మారొచ్చు.అవయవదానంపై అవగాహన కల్పించేందుకు కామినేని ఆస్పత్రి డైరెక్ట్ మెసేజ్‌లు, సోషల్ మీడియా ప్రచారాలతో కూడిన సమగ్ర అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్వచ్ఛంద దాతలను ప్రోత్సహించేందుకు ఆసుపత్రి ఆవరణలో డిజిటల్ కియోస్క్ ఏర్పాటుచేశారు. ఆసక్తి ఉన్నవారు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. వారి వివరాలు సమర్పించిన వెంటనే వారి వాట్సప్ నంబర్లకు 'గర్వించదగిన అవయవ దాత' కార్డును పంపిస్తారు. ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కామినేని ఆస్పత్రి అందరినీ ఆహ్వానిస్తోంది. అవయవదాతగా పేరు నమోదుచేసుకోవడం ద్వారా, కుటుంబానికి జీవనాధారమైన వ్యక్తులకు ప్రాణదానం చేయగల అవకాశం మీకు దక్కవచ్చు. -
జన్మనిచ్చింది... కాలేయం ఇచ్చింది...
నాంపల్లి: కన్నకొడుకు కాలేయ సమస్యతో మంచంపట్టడంతో తన కాలేయంలోని కొంత భాగాన్ని ఇచ్చి పునర్జన్మనిచ్చింది ఓ తల్లి. ఉస్మానియా, నిలోఫర్ ఆసుపత్రుల వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్స చేసి ఆ బాలుడికి కాలేయ మార్పిడి చేశారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం కొండ వనమాల గ్రామానికి చెందిన మోదుగు గుణశేఖర్, అమల దంపతుల కుమారుడు మాస్టర్ చౌహాన్ ఆదిత్య(03) పుట్టుకతోనే పిత్తాశయ ధమని, కాలేయసమస్యతో బాధపడుతున్నాడు. దీంతో బాలుడిని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు కాలేయ మార్పిడి కోసం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ మధుసూదన్ నేతృత్వంలోని సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, కాలేయమారి్పడి బృందం, నిలోఫర్ వైద్యు లు కలిసి ఈ నెల 3న ఆదిత్యకు కాలేయమారి్పడి చికిత్సను విజయవంతం చేశారు. ప్రస్తుతం తల్లి, కుమారుడు ఆరోగ్యంగానే ఉన్నారు. వారిని మంగళవారం ఓజీహెచ్ నుంచి డిశ్చార్జి చేశారు. ఇదే శస్త్రచికిత్స కార్పొరేట్ ఆసుపత్రిలో నిర్వహించి ఉంటే రూ.30 లక్షలు అయ్యేవని, కూలిపని చేసుకుని జీవించే తమ జీవితాల్లో ఉస్మానియా, నిలోఫర్ ఆసుపత్రి వైద్యులకు వెలుగులు నింపారంటూ బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
ఊహించని పనిచేసి షాకిచ్చిన హీరో విశ్వక్ సేన్
ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం టాలీవుడ్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. లెక్కకు మించి హీరోలు వస్తున్నారు. వీళ్లలో తమదైన గుర్తింపు తెచ్చుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలా పెద్దగా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి నిలబడ్డ హీరోల్లో విశ్వక్ సేన్ ఒకడు. యాటిట్యూడ్ కామెంట్స్ వల్ల అప్పుడప్పుడు విమర్శలు ఎదుర్కొంటూ ఉంటాడు గానీ మంచి యాక్టర్. ఇప్పుడు అంతకు మించిన మంచి పని చేసి శెభాష్ అనిపించుకున్నాడు.(ఇదీ చదవండిు: Society Of The Snow Review: కన్నీళ్లు ఆపుకునే శక్తి ఉంటే ఈ సినిమా చూడండి)తాజాగా హైదరాబాద్‌లో 'మెట్రో రెట్రో' పేరుతో అవయవ దానంకి సంబంధించిన ఓ ఈవెంట్ జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్‌గా వచ్చిన విశ్వక్.. తాను కూడా అవయవ దానం చేస్తానని అన్నాడు. ఈ మేకరు తన వివరాలు ఇచ్చాడు. మిగతా తెలుగు హీరోలు కూడా విశ్వక్ సేన్‌లా ముందుకొస్తే, అభిమానులు కూడా తమ వంతుగా డోనర్స్ అవుతారు.రీసెంట్గా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించిన విశ్వక్ సేన్.. ప్రస్తుతం 'మెకానిక్ రాకీ' మూవీ చేస్తున్నాడు. రీసెంట్గా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. త్వరలో రిలీజ్ డేట్‌తో పాటు ఇతర వివరాలు వెల్లడిస్తారు.(ఇదీ చదవండిు: ఓటీటీలో ఇలియానా బోల్డ్ అండ్ కామెడీ సినిమా) -
ప.గో... పుట్టెడు దుఃఖంలోనూ పెద్దమనసు!
యలమంచిలి: పుట్టెడు దుఃఖంలోనూ ఉన్నతంగా ఆలోచించారు. ఇక కుమారుడు తమకు దక్కకపోయినా... ఆయన అవయవాలతో మరికొందరికి జీవితం కల్పించవచ్చని భావించారు. వెంటనే సొంత ఖర్చులతో బ్రెయిన్ డెడ్ అయిన కుమారుడిని విశాఖ తరలించి అవయవాలను దానం చేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం ఇలపకుర్రు పంచాయతీ కుమ్మరిపాలేనికి చెందిన ఎలక్ట్రీషియన్ కాండ్రేకుల శ్రీనివాసరావు(బుల్లియ్య) కుమారుడు పవన్ ఐటీఐ పూర్తి చేసి సౌండ్ సిస్టం కొనుక్కుని ఫంక్షన్స్‌కి అద్దె ప్రాతిపదికన ఏర్పాటు చేస్తూ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఈ నెల ఒకటోతేదీన కుమ్మరపాలెంలోని కోదండ రామాలయ వార్షికోత్సవం సందర్భంగా ఏకాహ భజన ఏర్పాటు చేశారు.దానికి పవన్‌కుమార్ తన స్నేహితుడు కుడక అజయ్‌తో కలసి సౌండ్ బాక్సులను ఏర్పాటుచేశాడు. వారిద్దరూ సౌండ్ బాక్సుల వద్ద ఉండగా ఒక్కసారిగా కొబ్బరి చెట్టు విరిగి ఇద్దరిపైనా పడింది. పవన్ తలకు, భుజానికి బలమైన గాయాలు కాగా, అజయ్ స్వల్పంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే ఆలయ కమిటీ సభ్యులు ఇద్దరినీ పాలకొల్లు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పవన్ తలలో రక్తస్రావం కావడంతో ప్రథమ చికిత్స చేసిన అనంతరం ఉన్నత వైద్యం కోసం భీమవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆరోగ్యశ్రీలో వైద్యం చేసినా... 13వ తేదీన పరిస్థితి విషమించడంతో ఇక బతికే అవకాశం లేదని ఇంటికి తీసుకెళ్లిపోవాలని వైద్యులు చెప్పారు. చేసేది లేక భీమవరంలోనే మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి బ్రెయిన్‌డెడ్ అయ్యిందని, బతకడని చెప్పడంతో వారంతా హతాశులయ్యారు. పుట్టెడు దుఃఖంలోనూ తమ కుమారుడి అవయవాలు దానం చేయాలని నిర్ణయించుకుని సొంత ఖర్చులతో వైజాగ్ కిమ్స్ హైకాన్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పవన్ శరీరం నుంచి గుండె, కాళ్ల నరాలు, కాలేయం, కిడ్నీలు దానం చేశారు. అనంతరం శనివారం సాయంత్రానికి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ పాలకొల్లు ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి), పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిలువూరి కుమార దత్తాత్రేయవర్మతో కలసి అక్కడకు వెళ్లి మృతదేహానికి నివాళులరి్పంచారు. అవయవ దానం చేసిన తల్లిదండ్రులను అభినందించారు. -
కర్నూలు: కృష్ణవేణి బ్రెయిన్ డెడ్.. అవయవాల తరలింపునకు గ్రీన్ ఛానల్
కర్నూలు, సాక్షి: తాను మరణించినా.. అవయవదానంతో మరికొందరికి ప్రాణం పోయాలనే ఆలోచన ఈరోజుల్లో కొంతమందికే కలుగుతోంది. అలాగే తమ వాళ్లు మరణించినా.. అంత దుఖంలోనూ అవయవదానానికి ముందుకు వచ్చే వాళ్లకు నిజంగా హ్యాట్సాఫ్. తాజాగా.. కర్నూలులో బ్రెయిన్ డెడ్ అయిన ఓ మహిళ నుంచి అవయవాల్ని దానం చేసేందుకు ముందుకు వచ్చింది ఆమె కుటుంబం. ప్రొద్దుటూరు చెందిన కృష్ణవేణి(38) కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్‌కి గురైంది. అయితే ఆమె కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. దీంతో కిడ్నీని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి, అలాగే లివర్, గుండెలను తిరుపతికి తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ హెలికాఫ్టర్‌లో గ్రీన్ ఛానెల్ ద్వారా తిరుపతికి అవయవాల్ని తరలించారు. స్విమ్స్‌లో లివర్ మార్పిడి సర్జరీ, అలాగే.. పద్మావతి హృదాయాలంలో హార్ట్ సర్జరీల ద్వారా ఇద్దరు పెషెంట్లకు కృష్ణవేణి అవయవాల్ని అమర్చనున్నారు. ఇదిలా ఉంటే.. శ్రీపద్మావతి హార్ట్ కేర్ సెంటర్లో ఇవాళ జరగబోయేది 14 వ హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ కావడం విశేషం. తమ బిడ్డ అవయవాల ద్వారా మరికొందరికి పునర్జన్మ కలగడం పట్ల కృష్ణవేణి కుటుంబ సభ్యులు కన్నీళ్లతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
మరణించినా మరొకరికి జీవనం.. అవయవ దానంపై ఎందుకింత నిర్లక్ష్యం?
దానాలన్నిట్లోకెల్లా ఫలానా దానమే గొప్పదని తరచూ అంటుంటాం. సందర్భాన్ని బట్టి ఒక్కోసారి విద్యాదానమనీ, అన్నదానమనీ, ఇలా ఆ పేరు మారుతుంటుందంతే. కానీ ఎప్పటికీ మారని గొప్పదానం ప్రాణదానం. దానికి దోహదపడేదే అవయవదానం. ప్రస్తుతం అవయవాల అవసరం ఉన్నవారు ఎక్కువగానూ, వాటిని దానం చేసే వారి సంఖ్య తక్కువగానూ ఉంది. మన సమాజంలో ఎన్నో అపోహలు రాజ్యమేలుతున్నాయి. అవగాహన లేకపోవడం వల్ల ఇందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. అయితే మరణించిన వ్యక్తికి ఏమాత్రం పనికిరాని అవయవాలు మరెందరి ప్రాణాలనో నిలబెడతాయనే విషయాన్ని చాలావరకు గుర్తించడం లేదు. మట్టిలో కలవడం కంటే.. కట్టెలో కాలడం కంటే ఇతరులకు ప్రాణదానం చేయడం ఎంతో మేలని ప్రతివారిలోనూ అవగాహన కలగాలి. అప్పుడే మరెందరో అవయవార్థులు జీవం పుంజుకొని సమాజంలో తమవంతు బాధ్యతలను పోషిస్తారు. ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు కొద్దిగా చైతన్యం వచ్చినా అవయవాల కోసం ప్రస్తుతం ఉన్న డిమాండ్‌తో పోలిస్తే లభ్యత తక్కువే. అపోహలు తొలగి మరింత మంది అవయవదానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. భారత్‌లో అవయవ దానం పరిస్థితి ఎలా ఉంది? దేశంలో అవయవ దానం గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అవయవాలు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రతి సంవత్సరం సుమారు 5 లక్షల మంది మరణిస్తున్నారు. దీనివల్ల తమ వారి ప్రాణాలను నిలుపుకోవడం కోసం వారి బంధువులు పడుతున్న వేదన ఎంత వర్ణనాతీతంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కేవలం మూత్రపిండాల కొరతతోనే దేశంలో ప్రతి 5 నిమిషాలకు ఒక ప్రాణం బలవుతోంది. ఫలితంగా ప్రతి ఏటా 1,00,000 మరణాలు సంభవిస్తున్నాయి మూత్రపిండాలు: దేశంలో దాదాపు 2,00,000 మూత్రపిండాలు అవసరం ఉండగా.. కేవలం 4,000 మార్పిడి (2 శాతం) మాత్రమే జరుగుతుంది. కాలేయం: లక్షమందికి కాలేయం అవసరం ఉండగా..500 (0.5%) మాత్రమే లభిస్తున్నాయి. గుండె: 50,000 మందికి గుండె అవసరం ఉంది.కానీ 50 మార్పిడులు (0.1%). మాత్రమే జరుగుతున్నాయి. కార్నియా: 1,00,000 ప్రజలకు కార్నియా అవసరం. అయితే 25,000 మాత్రమే (25 శాతం) అందుబాటులో ఉంది. అవయవ దానం విషయంలో భారత్ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. వీటిలో ముఖ్యమైనవి అవగాహన లేకపోవడం: చాలా మందికి అవయవ దానం గురించి తెలియదు. అపోహలు, మూఢనమ్మకాలు, మత విశ్వాసాలు: అవయవ దానానికి ఆటంకాలుగా మారాయి. కఠినమైన చట్టాలు: కూడా దీనిని ప్రభావితం చేస్తాయి. ఎక్కువ మంది మహిళలు దానం చేస్తారు. కానీ తక్కువ మంది అవయవాలను అందుకుంటారు. ఆసుపత్రుల కొరత: దేశంలో కేవలం 301 ఆసుపత్రులు మాత్రమే ట్రాన్స్ ప్లాంటేషన్ చేస్తున్నాయి. జనాభా పెరుగుదల: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సౌకర్యాలు లేకపోవడం.. పై కారణాలతో భారత్‌లో అవయవ దానాల రేటు కేవలం 0.34శాతం మాత్రమే ఉంది. ఇక పోతే మరణించిన వారి అవయవాలను దానం చేసేందుకు ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం 2019లో రూ.149.5 కోట్ల బడ్జెట్‌తో జాతీయ అవయవ మార్పిడి కార్యక్రమం ప్రారంభించింది. అవయవ దాన రేటులో తమిళనాడు వంటి రాష్ట్రాలు ముందున్నాయి. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి అవగాహన ప్రచారాలు, విద్య, సమాజ ప్రమేయం చాలా అవసరం. మానవ అవయవాలు, కణజాలాల మార్పిడి చట్టం, 1994 ప్రకారం అవయవ దానం జీవించి ఉన్న దాత ను చి లేదా బ్రెయిన్ డెడ్ అయిన దాత చేయవచ్చు. బ్రెయిన్ డెత్ అనేది రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయం కావడం వల్ల లేదా మరే కారణం చేతనైనా మెదడులో రక్తనాళం చిట్లడం వల్ల సంభవిస్తుంది. శాశ్వతంగా మెదడు పని చేయకపోవడాన్ని బ్రెయిన్‌డెత్‌గా నిర్ధారిస్తారు. జీవించి ఉన్న వారు కిడ్నీలు, ప్యాంక్రియాస్‌లోని భాగాలు, కాలేయంలోని భాగాలను దానం చేయవచ్చు. మరణం తర్వాత మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, ప్యాంక్రియాస్ పేగులను దానం చేయవచ్చు . అవయవ దానం అవశ్యకత ను దాని ప్రాముఖ్యతను విరివి గా ప్రచారం చేయాల్సిన అవస రం ఉన్నది. దాతగా మారాలనే నిర్ణయం ఎనిమిది మంది జీవితాలను కాపాడుతుంది. అవయవ దానం చేయడం వల్ల ఇతరులకు ఆనందాన్ని, చిరునవ్వులను అందించవచ్చు. కేవలం ఒక అవయవాన్ని దానం చేయడం ద్వారా మరణించిన వారు సైతం శాశ్వతంగా జీవించవచ్చు. చివరగా.. అవయవదానంపై అవగాహనను పెంచి అపోహాలను దూరం చేద్దాం. అవయవ దానాన్ని ప్రోత్సహించి, అవసరమైన వారికి జీవితాన్ని బహుమతిగా ఇద్దాం. -
అవయవదానంతో యువతికి పునర్జన్మనిచ్చిన వీఆర్వో
శ్రీకాకుళం రూరల్/గోపాలపట్నం(విశాఖ పశ్చిమ)/తిరుపతి తుడా : పుట్టెడు దుఖంలోనూ తమ కుమార్తె అవయవాలు దానం చేసి పలువురికి పునర్జన్మను ప్రసాదించిందో కుటుంబం. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కొత్తపేటకు చెందిన మౌనిక(23) వీఆర్వోగా పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆమెను శ్రీకాకుళంలోని రిమ్స్‌కు, అనంతరం మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో విశాఖలోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. మౌనిక మెదడు పూర్తిగా డెడ్ అయినట్టు అక్కడి వైద్యులు నిర్ధారించారు. తమ కుమార్తె అవయవాలు వేరేవారికి పునర్జన్మను ప్రసాదిస్తాయని తెలుసుకున్న తల్లిదండ్రులు.. దుఃఖాన్ని దిగమింగుకుని అవయవాల దానానికి ముందుకొచ్చారు. దీంతో శ్రీకాకుళం జిల్లా రాగోలులోని జెమ్స్ ఆస్పత్రిలో మౌనిక శరీరం నుంచి అవయవాలు వేరుచేశారు. గుండెను తిరుపతి పద్మాలయ హృదయాలయ ఆస్పత్రికి గ్రీన్ చానల్ ద్వారా ప్రత్యేక విమానంలో తరలించారు. ఒక మూత్ర పిండాన్ని వైజాగ్‌లోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి, మరో మూత్ర పిండాన్ని శ్రీకాకుళం జెమ్స్ ఆస్పత్రికి పంపగా.. రెండు కళ్లను రెడ్‌క్రాస్ సంస్థకు అప్పగించారు. ఈ సందర్భంగా మృతురాలి తల్లిదండ్రులు గోవిందరావు, ఉమాదేవి మాట్లాడుతూ తమ కూతురు చనిపోలేదని.. అవయవాలను దానం చేసి.. వారిలో బతికే ఉందని చెప్పారు. గుండె మార్పిడితో పునర్జన్మ తిరుపతిలోని శ్రీ పద్మావతి గుండె చికిత్సాలయం మరో యువతికి గుండె మార్పిడి చేసి పునర్జన్మను ప్రసాదించింది. నెల్లూరు పట్టణానికి చెందిన 21 ఏళ్ల యువతి డైలేటెడ్ కార్డియో మయోపతి సమస్యతో బాధపడుతోంది. ఈ నెల ఒకటో తేదీన ఆస్పత్రికి రావడంతో ఆ యువతికి వైద్య పరీక్షలు చేసి.. గుండె సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయిందని, మార్పిడి అనివార్యమని వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలో మౌనిక కుటుంబ సభ్యులు అవయవదానం చేయడంతో విషయాన్ని సీఎం కార్యాలయం చొరవ తీసుకుని సమాచారాన్ని సీఎం వైఎస్ జగన్‌కు వివరించింది. విశాఖ నుంచి గుండెను తీసుకొచ్చేందుకు చాపర్ విమానాన్ని అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధులను విడుదల చేయాలని సూచించారు. ఈ మేరకు ప్రత్యేక విమానంలో తెచ్చిన గుండెను యువతికి అమర్చారు సుమారు రూ.12 లక్షలకు పైగా ఖర్చయ్యే గుండె మార్పిడి చికిత్సను ఉచితంగా చేసి యువతికి పునర్జన్మను ప్రసాదించారు. ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి నేతృత్వంలోని వైద్యుల బృందం సుమారు 5.30 గంటల పాటు శ్రమించి విజయవంతంగా గుండెమార్పిడిని పూర్తిచేసింది. -
మహిళలే త్యాగమూర్తులు.. అవయవ దానంపై ఆసక్తికర అధ్యయనం!
అవయవదానం అనేది చాలా గొప్పది. శరీరంలో ఏదైనా అవయం పాడైపోయి చావుకు దగ్గరైనవారికి అవయవ మార్పిడితో తిరిగి ఊపిరిపోస్తున్నారు. అవయవ మార్పిడిలో అత్యాధునిక వైద్య విధానాలు రావడంతో అవయవ మార్పిడి చేయించుకునేవారి సంఖ్య గణనీయంగా ఉంటోంది. అయితే స్త్రీ, పురుషుల్లో అవయవ మార్పిడి చేయించుకున్నవాళ్లు ఎంత మంది? అవయవ దానం చేసినవారు ఎంత మంది అనే దానికి సంబంధించి ఓ ఆసక్తికర అధ్యయనం వెలుగులోకి వచ్చింది. ఐదుగురిలో నలుగురు మహిళలే.. దేశంలో అవయవదానం పొందిన ప్రతి ఐదుగురిలో నలుగురు పురుషులు ఉండగా మహిళలు కేవలం ఒక్కరే. ఇక అవయవ దానం చేసిన వారిలో ప్రతి ఐగుగురిలో నలుగురు మహిళలు ఉండగా మగవారు ఒక్కరే ఉన్నారు. 1995 నుంచి 2021 వరకు ఉన్న డేటా ప్రకారం దేశంలో 36,640 అవయవ మార్పిడిలు జరిగాయి. వీటిలో 29,000 మార్పిడులు పురుషులకు, 6,945 మార్పిడులు మహిళలకు జరిగాయి. అంటే అవయవదానం పొందిన వారిలో ఐదింట నాలుగు వంతుల మంది మగవారే ఉన్నారు. ఆర్థిక ఆర్థిక బాధ్యతలు, సామాజిక ఒత్తిళ్లు, పాతుకుపోయిన ప్రాధాన్యతలే ఈ అసమానతలకు కారణాలని నిపుణులు చెబుతున్నారు. చనిపోయిన తర్వాత అవయవ దానం చేసేవారిలో మగవారు ఎక్కువగా ఉండగా బతికుండగానే అవయవ దానంచేసిన వారిలో మహిళలే ఎక్కువ మంది ఉన్నారని నేషనల్ ఆర్గాన్ & టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ (NOTTO) డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. దేశంలో మొత్తం అవయవ దానాల్లో బతికుండి అవయవదానం చేసినవారినవి 93 శాతం ఉండగా వీరిలో అత్యధికులు మహిళలేనని ఆయన పేర్కొన్నారు. గ్రహీతల్లో మగవారే.. 2021లో ఎక్స్పెర్మెంటల్ అండ్ క్లినికల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయన పత్రం భారత దేశంలో అవయవ మార్పిడికి సంబంధించి భారీ లింగ అసమానతలను బయటపెట్టింది. 2019లో అవయవ మార్పిడి డేటాను విశ్లేషించిన ఈ అధ్యయనం సజీవ అవయవ దాతలలో 80 శాతం మంది మహిళలేనని తేల్చింది. వీరిలోనూ ప్రధానంగా భార్య లేదా తల్లి దాతలుగా ఉంటున్నారు. ఇక అవయవ గ్రహీతల విషయానికి వస్తే 80 శాతం మంది మగవారు ఉన్నారు. అవయవ దాతల్లో ఎక్కువ మంది మహిళలే ఉండటానికి ప్రాథమిక కారణాలను ఈ అధ్యయనం వివరించింది. కుటుంబంలో సంరక్షకులుగా, త్యాగానికి ముందుండేలా మహిళలపై సామాజిక-ఆర్థిక ఒత్తిడి ఉందని, మగవారే కుటుంబ పోషకులుగా ఉండటంతో వారు శస్త్రచికిత్స చేయించుకోవడానికి వెనుకాడతారని విశ్లేషించింది. పూణేలోని డీవై పాటిల్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన అవయవ మార్పిడి కోఆర్డినేటర్ మయూరి బార్వే మాట్లాడుతూ.. గత 15 ఏళ్లుగా తాను ఈ రంగంలో పనిచేస్తున్నానని, ఇన్నేళ్ల తన అనుభవంలో ఒక్కసారి మాత్రమే భర్త తన భార్యకు అవయవ దానం చేసేందుకు ముందుకు వచ్చాడని చెప్పారు. చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు అవయవదానం చేసేందుకు ముందుంటారని, ఒకవేళ వారిద్దరూ అందుబాటులో లేనప్పుడు, భార్యలు అవయవ దానానికి ముందుకు వస్తున్నట్లు ఆమె చెపారు. తరచుగా కుమార్తె అవివాహిత అయితే ఆమె దాత అవుతోందని, కానీ భార్యకు అవయవం అవసరమైనప్పుడు మాత్రం దాతలు ముందుకు రాకపోవడంతో వెయిటింగ్ లిస్ట్‌లో ఉండాల్సి వస్తోందని వివరించారు. -
అవయవదానంతో ఆరుగురికి ఊపిరి
రాంగోపాల్‌పేట్: తను శ్వాసను వదలి పెట్టి..మరో ఆరుగురికి ఊపిరి ఉదాడు. తను తనువు చాలిస్తూ ఐదు కుటుంబాల్లో వెలుగులు నింపాడు. కొండంత కొడుకును పోగొట్టుకున్న తల్లిదండ్రులు..ఇంటికి పెద్ద దిక్కుగా ఉండే భర్తను కోల్పోయిన భార్య పెద్ద మనసుతో తీసుకున్న ఆ నిర్ణయం ఆరుగురి ప్రాణాలు నిలబెట్టింది. బ్రెయిన్‌డెడ్‌కు గురైన ఓ వ్యక్తి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రావడంతో ఆరుగురు వ్యక్తులకు ప్రాణం పోసేందుకు సికింద్రాబాద్ కిమ్స్ డాక్టర్లు సిద్ధమవుతున్నారు. వివరాలలోకి వెళితే ఏపీలోని నెల్లూరు పట్టణం గౌతంనగర్ ప్రాంతానికి చెందిన అనంతరెడ్డి, సంపూర్ణమ్మల కుమారుడు హనుమాన్‌రెడ్డి (46) హైదరాబాద్‌లో వ్యాపారం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. భార్య విజయారెడ్డి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ నెల 29వ తేదీన తీవ్రమైన తలనొప్పి రావడంతో చికిత్స కోసం కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తీసుకుని వచ్చారు. రోగిని పరిశీలించిన వైద్యులు తలలో బ్లడ్ క్లాట్స్ అయ్యాయని గుర్తించారు. అతని ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు మూడు రోజుల పాటు శ్రమించినా మంగళవారం ఉదయం బ్రెయిన్ డెడ్‌కు గురి కాగా ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. కిమ్స్‌లోని అవయవదాన సమన్వయకర్తలు మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి అవయవదానం ఆవశ్యకతను వివరించారు. ఆయన మరణించినా మరికొంత మంది ప్రాణాలు నిలబెడతారని వారు వివరించారు. దీంతో కొండంత దుఃఖాన్ని దిగమింగుకుంటూనే తల్లిదండ్రులు, భార్యా, కుమారులు ఓ గొప్ప కార్యానికి అంగీకారం తెలిపారు. దీంతో వైద్యులు ఆయన రెండు కిడ్నీలు, లంగ్స్, లివర్, రెండు కార్నియాలను సేకరించి వారికి అప్పగించారు. వీటిని జీవన్‌దాన్‌లో రిజిస్ట్రర్ చేసుకుని దాతల కోసం ఎదురు చూస్తున్న వారికి అందిస్తామని జీవన్‌దాన్ ప్రతినిధులు తెలిపారు. -
అతడు.. ఆ ఆరుగురిలో సజీవం
లబ్బీపేట(విజయవాడ తూర్పు)/గన్నవరం/తిరుపతి తుడా: తనువు చాలించినా.. అవయవాల దానంతో ఆరుగురు జీవితాల్లో వెలుగులు నింపాడు 23 ఏళ్ల యువకుడు గారపాటి జయప్రకాష్. కొడుకు ఇక లేడన్న చేదు నిజం గుండెలను పిండేస్తున్నా.. పుట్టెడు దుఃఖంలో కూడా అతడి కుటుంబ సభ్యులు తీసుకున్న అవయవదానం నిర్ణయం అందరికీ ఆదర్శంగా నిలిచింది. వివరాల్లోకి వెళితే... కృష్ణాజిల్లా మొవ్వ మండలం చినముత్తేవి గ్రామానికి చెందిన గారపాటి జయప్రకాష్ (23) ఈ నెల 25న నిడుమోలు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తలకు బలమైన గాయం కావడంతో ఆయుష్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. చిన్న వయసులోనే తమ బిడ్డ దూరమైనా, కనీసం ఇతరుల జీవితాల్లో అయినా వెలుగులు నింపాలని భావించిన ఆ తల్లిదండ్రులు తమ కుమారుడి అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. జయ ప్రకాష్ గుండెను తిరుపతిలోని పద్మావతి ఆస్పత్రికి, లివర్, ఒక కిడ్నీని తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రికి, మరో కిడ్నీని విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రికి, కళ్లను విజయవాడలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి తరలించారు. గుండెను తిరుపతి తరలించేందుకు ఆయుష్ ఆస్పత్రి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టు వరకు పోలీసులు గ్రీన్‌చానల్ ఏర్పాటు చేశారు. 32 ఏళ్ల యువకుడికి గుండె మార్పిడి వైఎస్సార్ కడప జిల్లా వేముల ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల యువకుడు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గుండె సంబంధిత సమస్యతో తిరుపతిలోని శ్రీపద్మావతి గుండె చికిత్సాలయంలో చేరాడు. గుండె మారి్పడి అనివార్యమని నిర్ధారించి తాత్కాలిక చికిత్సను ప్రారంభించారు. ఈ క్రమంలో జయప్రకాష్ అవయవదానం విషయమై శ్రీపద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్ డైరెక్టర్ శ్రీనాథ్‌రెడ్డికి సమాచారం అందింది. సంబంధిత వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపగా వారు అనుమతి మంజూరు చేశారు. గుండె మార్పిడి చికిత్సకు అవసరమైన రూ.12 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా విడుదల చేశారు. ఈ క్రమంలో గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గుండెను తిరుపతికి తరలించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి గ్రీన్ చానల్ ద్వారా పద్మావతి కార్డియాక్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. శనివారం రాత్రి వైద్య బృందం సుదీర్ఘంగా శ్రమించి విజయవంతంగా గుండె మార్పిడిని పూర్తి చేశారు. యువకుడికి పునర్జన్మను ప్రసాదించారు. అవయవదానంతో ఇద్దరికి పునర్జన్మ ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు): బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవదానంతో ఇద్దరికి పునర్జన్మ లభించింది. శ్రీకాకుళానికి చెందిన బి.రామరాజు, లావణ్య దంపతుల కుమారుడు బి.కృష్ణశ్రావణ్ (17) ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఈ నెల 25న స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో విశాఖపట్నం ఎంవీపీ కాలనీ మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. శ్రావణ్‌కు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్ర దుఖఃలోనూ శ్రావణ్ తల్లిదండ్రులు అవయవదానం చేసేందుకు ముందుకొచ్చారు. ఒక కిడ్నీ మెడికవర్ ఆస్పత్రికి, మరో కిడ్నీ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. -
తీవ్ర విషాదంలోనూ దుఃఖాన్ని దిగమింగుకుని..
అహ్మదాబాద్: నవమాసాలు మోసి కన్న తల్లికి, బిడ్డ కోసం ఎన్నో కలలు కన్న ఆ తండ్రికి చివరకు కన్నీళ్లే మిగిలాయి. పుట్టిన బిడ్డలో బ్రెయిన్ డెడ్ అయ్యిందని వైద్యులు చెప్పిన మాటలతో ఆ తల్లిదండ్రులు హతాశులయ్యారు. అయితే అంత దుఃఖంలోనూ వాళ్లు తీసుకున్న నిర్ణయం.. వార్తల్లోకి ఎక్కింది. డైమండ్ ఫ్యాక్టరీలో పని చేసే హర్షద్, చేతన దంపతులకు ఈ నెల 13న మగబిడ్డ పుట్టాడు. అయితే.. శిశువులో కదలికలేవీ లేకపోవడంతో బిడ్డను ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించి.. వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఐదురోజుల తర్వాత పసికందుకు బ్రెయిన్ డెడ్ అయ్యిందని ప్రకటించారు. దీంతో ఆ తల్లిదండ్రులు శోకంలో మునిగిపోయారు. ఈలోపు జీవన్‌దీప్ ఆర్గాన్ డొనేషన్ ఫౌండేషన్ శిశువు తల్లిదండ్రులను సంప్రదించింది. అంత బాధలోనూ అవయవదానానికి సమ్మతించడంతో పీపీ సవానీ ఆసుపత్రి వైద్యులు బుధవారం శిశువు రెండు మూత్రపిండాలు, రెండు కార్నియాలు, కాలేయం, ప్లీహాన్ని సేకరించారు. వీటిని గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల్లో అవసరం ఉన్న ఆరుగురు చిన్నారులకు విజయవంతంగా అమర్చినట్లు సదరు ఫౌండేషన్ ప్రకటించింది. బ్రెయిన్‌డెడ్ (జీవన్మృతి) అయిన అయిదు రోజుల పసికందు అవయవాలు.. ఆరుగురు పిల్లలకు కొత్త జీవితాన్ని ప్రసాదించాయి. -
బ్రెయిన్‌డెడ్ అయిన మహిళ అవయవ దానం
వేలూరు: రాణిపేట జిల్లా సిప్‌కాడు సమీపంలోని తగరకుప్పం గ్రామానికి చెందిన రాబర్ట్ భార్య జభకుమారి(33). ఈ దంపతులకు ఒక కుమార్తె, కుమారుడున్నారు. దంపతులిద్దరూ సిప్కాడులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబర్ట్, జభకుమారి నాలుగు రోజుల క్రితం కంపెనీలో పని పూర్తి చేసుకొని బైకుపై ఇంటికి బయలు దేరారు. పొన్నై క్రాస్ రోడ్డులోని అనకట్టు చర్చి వద్ద వస్తున్న సమయంలో జభకుమారి ప్రమాదవశాత్తూ బైకు నుంచి కింద పడింది. ఆ సమయంలో జభకుమారి తలకు తీవ్రంగా గాయాలు కావడంతో వెంటనే ఆమెను రాణిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈక్రమంలో జభకుమారికి సోమవారం రాత్రి బ్రెయిన్‌డెడ్ అయ్యింది. దీంతో ఆమె అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వ చ్చారు. దీంతో ఆమె అవయవాలను రాణిపేటలోని సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు సిప్‌కాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఏడుగురికి పునర్జన్మనిచ్చిన ‘కీర్తి’
పిచ్చాటూరు: తాను మరణించినా.. తన అవయవాలతో ఏడుగురికి పునర్జన్మనిచ్చింది కీర్తి అనే యువతి. వివరాల్లోకి వెళితే.. తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం రామాపురం ఎస్సీ ప్రాంతానికి చెందిన సి.సంపత్‌కుమార్, అమ్ములు దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. సంపత్‌కుమార్ ఎడ్లబండి నడుపుతూ వ్యవసాయ కూలీగా పని చేస్తున్నారు. మొదటి కుమార్తె కీర్తి గత ఏడాది బీకామ్ పూర్తి చేసి చెన్నై అరుబాక్కంలోని కాల్ సెంటర్లో ఉద్యోగం చేస్తుండేది. రెండో కుమార్తె స్వాతి డిగ్రీ, మూడవ కుమార్తె స్మృతి ఫార్మసీ, కుమారుడు సారథి ఇంటర్ చదువుతున్నారు. కీర్తి ఆదివారం చెన్నై నుంచి స్వగ్రామం రామాపురం వచ్చింది. ఆ సమయంలో పెళ్లి చేసుకోవాలని కీర్తిని తల్లిదండ్రులు కోరారు. చెల్లెళ్లు, తమ్ముడి చదువులు కొలిక్కి వచ్చాక పెళ్లి చేసుకుంటానని అమ్మ, నాన్నలకు నచ్చజెప్పింది. సాయంత్రం తమిళనాడులోని కరడిపుత్తూరులో ఓ పెళ్లికి గ్రామంలోని తమ బంధువుతో కలసి ద్విచక్ర వాహనంపై వెళ్లింది. తిరుగు ప్రయాణంలో కరడిపుత్తూరు సమీపంలో రోడ్డుపై ఉన్న ఓ పెద్ద గుంతలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి దిగబడిపోవడంతో వెనుకవైపు కూర్చుని ఉన్న కీర్తి కిందపడిపోయింది. ఆమె తలకు, చేతికి తీవ్ర గాయమై స్పృహ కోల్పోయింది. వాహనం నడుపుతున్న రాబర్ట్‌కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు 108 సాయంతో ఇద్దరినీ సమీపంలో ఉన్న తిరువళ్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నైలోని రాజీవ్‌గాంధీ జనరల్ ఆస్పత్రికి తరలించారు. కీర్తిని పరీక్షించిన వైద్యులు ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్టు నిర్థారించారు. గుండె సహా మిగిలిన అన్ని అవయవాలు పనిచేస్తున్న విషయాన్ని గుర్తించారు. కీర్తి అవయవాలను దానం చేయడం ద్వారా మరికొంత మందిని బతికించే అవకాశం ఉందని వైద్యులు వివరించడంతో కీర్తి అవయవాలు దానం చేయడానికి తల్లిదండ్రులు అంగీకరించారు. కీర్తికి గౌరవ వందనం చెన్నై జీహెచ్ వైద్యులు కీర్తి శరీరం నుంచి గుండె, రెండు మూత్రపిండాలు, రెండు కళ్లు, గుండె వాల్వు, కాలేయం, మూత్రనాళాలు, ఊపిరితిత్తులను మంగళవారం రాత్రి సేకరించారు. స్టాండ్లీ ప్రభుత్వ ఆస్పత్రికి రెండు అవయవాలను తరలించి.. మిగిలిన వాటిని అదే ఆస్ప త్రిలోని రోగులకు అమర్చినట్టు వైద్యులు వెల్లడించా రు. రాగా, మంగళవారం అర్ధరాత్రి కీర్తి పార్థివదేహం వద్ద ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది గౌరవ వందనం చేశారు. కార్యక్రమంలో వందలాది మంది పాల్గొన్నారు. -
చనిపోయినా బతికుందాం!
మట్టిలో కలిసిపోయే గుండె ఇంకో మనిషిని బతికించగలదు. మంటల్లో కాలిపోయే కళ్లు మరో బతుకులో వెలుగు నింపగలవు. ఆయువు తీరిన దేహం మరొకరి ఆయుష్షు రేఖను పెంచగలదు. ఇందుకు ఒకటే దారి.. అదే అవయవదానం. అంపశయ్యపై ఉన్న వారి తలరాత మార్చాలన్నా.. చావు అంచుల్లో నించున్న వారిని తిరిగి బతుకు దారిలోకి తీసుకురావాలన్నా ఇదొక్కటే మార్గం. నేడు అవయవదాన దినోత్సవం. చనిపోయాక శరీర భాగాలను వృధా చేయడం కంటే మరో మనిషి కోసం వినియోగించడం మాధవ సేవ అని చెప్పే రోజు. అపోహలు వీడి ఓ చైతన్య కాగడాను ఊరూరా వెలిగించాల్సిన తేదీ. ఇచ్ఛాపురం రూరల్: మనిషి చనిపోయాక దేహంతో పాటే అవయవాలన్నీ మట్టిలో కలిసిపోతాయి. లేదా చితిలో కాలి బూడిదవుతాయి. అవే అవయవాలను దానం చేస్తే ఎన్నో కుటుంబాల్లో చిరునవ్వులు నింపవచ్చు. రోడ్డు ప్రమాదాల్లో బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారణ అయిన వారి నుంచి మాత్రమే అవయవాలను సేకరిస్తారు. బ్రెయిన్ డెడ్ కేసు అంటే మనిషి పూర్తిగా చనిపోయినట్లే లెక్క. సాధారణ మరణాల్లో నేత్రాలను తీసుకుంటారు. నమోదు ఇలా అవయవ దానం చేయాలనుకునే వారు ముందుగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, తమకు తెలిసినవారందరికీ సమాచారం అందివ్వాలి. దీని వల్ల అతను చనిపోయాక అవయవ దానం చేసేందుకు వీలు కలుగుతుంది. జీవన్‌దాన్ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం 2014లో ప్రవేశపెట్టగా, రాష్ట్ర విభజన అనంతరం విజయవాడ కేంద్రంగా 2015 నుంచి తమ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ పథకం ద్వారా బ్రెయిన్‌డెడ్ కేసుల నుంచి అవయవాలు సేకరిస్తారు. ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ జీవన్‌దాన్ డాట్ జీవోవి డాట్ ఇన్’ వెబ్ సైట్లో డోనర్లు తమ పేర్లు నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్నవారికి ప్రభుత్వం ఆర్గాన్ డోనార్ కార్డును అందజేస్తుంది. సజీవమూర్తి కిరణ్‌చంద్ సోంపేట పట్టణం గీతా మందిరం కాలనీకి చెందిన మల్లారెడ్డి మోహన్, గిరిజా కల్యా ణిల ఒక్కగానొక్క కుమారుడు కిరణ్‌చంద్(16) జిల్లా వాసుల్లో నింపిన స్ఫూర్తి అనన్యసామాన్యం. 2023 ఏప్రిల్ 15న పదో తరగతి ఆఖరి పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్న కిరణ్‌చంద్ అనారోగ్యానికి గురయ్యాడు. తీవ్రమైన తలనొప్పి, జ్వరంతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. అయితే మెదడులో సమస్య వచ్చిందని, వెంటనే విశాఖపట్నం వెళ్లాలని వైద్యులు సూచించడంతో హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి రాగోలు జెమ్స్ ఆస్పత్రికి మార్చారు. వారం రోజుల అనంతరం పరిస్థితి విషమించడంతో వైద్యులు, ఆర్గాన్ డొనేషన్ సమన్వయకర్తలు తల్లిదండ్రులకు అవయవదానంపై అవగాహన కల్పించారు. గుండె, కిడ్నీలు, లివర్, కళ్లను దానం చేసి మరికొందరి బతుకుల్లో వెలుగులు నింపారు. 8 మంది జీవితాల్లో ‘చంద్ర’కాంతులు జి.సిగడాం మండలం మధుపాం గ్రామానికి చెందిన పట్నాన చంద్రకళ(32) సీఎఫ్‌గా పనిచేసేవారు. ఈ ఏడాది మే 30న తలనొప్పితో బాధపడుతూ శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. అక్కడ పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆమెను విశాఖ విమ్స్ ఆస్పత్రికి తరలించారు. చంద్రకళ తలలో నరాలు చిట్లిపోయి రక్తస్రావం అయినట్లు గుర్తించారు. దీంతో బ్రెయిన్‌డెడ్ అయిందని, ఈమె అవయవాలను ఇతరులకు దానం చేసి వారి జీవితాలకు నూతన వెలుగులు ప్రసాదించాలని వైద్యులు కుటుంబ సభ్యులకు సూచించారు. భర్త శివను, ఇద్దరు కుమార్తెలను ఒప్పించడంతో జూన్ 1న అవయవదానం చేసి ఎనిమిది మంది జీవితాల్లో వెలుగులు నింపారు. -
నాన్న చనిపోయారు.. కానీ ఆయన గుండె చప్పుడు విన్నారు..
వాషింగ్టన్: అమెరికాలోని కనెక్టికట్ ప్రాంతానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు తమ తండ్రి గుండె చప్పుడు విని భావోద్వేగానికి గురయ్యారు. నాలుగేళ్ల క్రితం తన తండ్రి చనిపోగా ఆయన అవయవాలను దానం చేశారు ఆ బిడ్డలు. ఆ గుండె ఎక్కడ ఉందో వెతుక్కుంటూ వెళ్లిన ఆ అక్కాచెలెళ్లకు తండ్రి గుండెను అమర్చిన వ్యక్తి దొరికారు. వెంటనే ఆ గుండె మీద చెవులను ఆనించి తండ్రి గుండె చప్పుడు విన్నారు. మనల్ని ఇష్టపడేవాళ్లు విడిచి వెళ్లినా కూడా వారి జ్ఞాపకాలు మనలను తరచుగా పలకరిస్తూ ఉంటాయి. వారు మన మధ్య ఉంటే బాగుండన్న భావన నిత్యం కలుగుతూ ఉంటుంది. కానీ అవయవదానం చేసిన సందర్భాల్లో వ్యక్తులు మరణించినా వారి అవయవాలు వేరే వాళ్లకి అమరిస్తే అవి సజీవంగానే ఉంటాయి. అలా అవయవదానం చేసిన ఎస్టబెన్ శాంటియాగో(39) కుమార్తెలు తన తండ్రి అవయవాల కోసం వెతుకుతూ చివరికి ఆయన గుండెను కనుగొన్నారు. కిసండ్ర శాంటియాగో(22) ఈ వెతుకులాటకు శ్రీకారం చుట్టింది. అలా మొదలైన ఆమె ప్రయత్నం నాలుగేళ్లపాటు సాగి చివరికి తన తండ్రి హృదయాన్ని ఎవరికి అమర్చారో కనిపెట్టింది. వెంటనే తన చెల్లెళ్లను వెంటబెట్టుకుని అక్కడికి వెళ్లి వారు ఆయన గుండెల మీద తల ఆనించి గుండె చప్పుడును విని ఉద్వేగానికి లోనయ్యారు. కిసండ్ర శాంటియాగో మాట్లాడుతూ.. మా నాన్న నిజంగా సంతోషించేవారు. మా నాన్న కోమాలోకి వెళ్లి చనిపోయాక ఆయన అవయవాలను దానం చేయాలన్న నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమనిపించింది. చివరకు ఎలాగో అంగీకరించాను. ఆ రోజు నుంచి నా గుండె భారంగానే ఉంది. ఈరోజు ఆయన గుండె చప్పుడు విన్నాక అది తేలికైందని చెప్పి కన్నీటి పర్యంతమైంది. ఈ మొత్తం దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా విశేషమైన స్పందన వస్తోంది. View this post on Instagram A post shared by TODAY (@todayshow) ఇది కూడా చదవండి: దుబాయ్‌లో భారతీయుడి జాక్‌పాట్.. నెలకు రూ.5.59 లక్షలు.. -
మైనర్ బాలిక బ్రెయిన్ డెడ్.. అవయవాలు దానం
హైదరాబాద్: ఉరి వేసుకుని ఆత్మహత్యా యత్నం చేసిన రాయపూరి పూజ(16) అవయవాలను కుటుంబసభ్యులు దానం చేశారు. నిమ్స్ వైద్యులు బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేయడంతో ఆమె కుటుంబసభ్యులు అవయవదానం చేశారని జీవన్‌దాన్ ప్రతినిధులు సోమవారం ఒక ప్రకనలో తెలిపారు. వరంగల్ జిల్లా తీగరాజుపల్లికి చెందిన పూజ ఇంటర్మీడియెట్ చదువుతోంది. ఈ నెల 18న ఆమె ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడించింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం నిమ్స్‌కు తరలించారు. ఎమర్జెన్సీ విభాగంలో వైద్యులు సేవలందించారు. అయినా ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో బ్రెయిన్ డెత్‌గా నిర్ధారించారు. దీంతో అవయవ దానం పట్ల జీవన్ దాన్ కోఆర్డినేటర్ అవగాహన కల్పించడంతో పూజ అవయవాలను దానం చేసేందుకు ఆమె కుటుంబసభ్యులు ముందుకు వచ్చారు. దీంతో రెండు కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు, కార్నియాస్‌ను జీవన్ దాన్‌కు దానం చేశారు. -
దినేష్.. నీ త్యాగం చిరస్మరణీయం !
తాడేపల్లి రూరల్: అవయవదానం చేసి నలుగురికి జీవితాల్లో వెలుగులు నింపిన యువకుడికి మణిపాల్ యాజమాన్యం గురువారం ఘన నివాళులర్పించింది. విజయవాడ విద్యాధరపురానికి చెందిన వుజ్జురి దినేష్(22) ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో మణిపాల్ ఆసుప్రతికి తీసుకు వచ్చారు. ఆరోగ్య పరిస్థితిని గమనించిన వైద్యులు క్రేనియోటమీ శస్త్ర చికిత్సను నిర్వహించారు. అయినప్పటికీ ఆరోగ్య పరిస్థితిలో మార్పు కనిపించలేదు. వైద్యపరీక్షల అనంతరం బ్రెయిన్ డెడ్‌గా గుర్తించారు. దినేష్ భార్య వసంత, తండ్రి ఏడుకొండలు, తల్లి సుశీల అంగీకారం మేరకు జీవన్‌ధార్ చైర్మన్ డాక్టర్ కె. రాంబాబు, మణిపాల్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడిల ఆధ్వర్యంలో అవయవదానం జరిగింది. దినేష్ కాలేయం, కిడ్నీని మణిపాల్ ఆసుపత్రిలోని అవసరమైన వారికి ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా అమర్చినట్లు మణిపాల్ ఆసుపత్రి వర్గాలు తెలిపారు. కళ్లను వి.ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు, లంగ్స్‌ను కిమ్స్ (సికింద్రాబాద్), ఒక కిడ్నీని విజయ హాస్పిటల్(విజయవాడ)కు తరలించామని వివరించారు. అవయవ దానానికి ముందుకు వచ్చిన దినేష్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపింది. -
అవయవదానంపై నూతన విధానం రావాలి
సాక్షి, అమరావతి: దేశంలో అవయవదానం, అవయవమార్పిడికి నూతన విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని అన్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సమాఖ్యతో కలిసి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వస్త్య చింతన్ శిబిర్ కార్యక్రమంలో శనివారం రెండో రోజు మంత్రి పలు అంశాలపై మాట్లాడారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయకు పలు అంశాలపై వినతిపత్రం సమర్పించారు. అసంక్రమిత వ్యాధుల నుంచి ప్రజల ప్రాణాలను కాపాడటంలో ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానం గొప్ప విరుగుడుగా పని చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో 2021 అక్టోబర్‌లో అసంక్రమిత వ్యాధులపై స్క్రీనింగ్ ప్రారంభించామని చెప్పారు. భవిష్యత్తులో క్యాన్సర్, గుండె వ్యాధులకు ముందస్తు నిర్ధారణ పరీక్షలను గ్రామాల్లోనే చేపడతామన్నారు. ఇప్పటికే 600కుపైగా క్యాన్సర్ చికిత్సలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేర్చి ఏటా రూ.600 కోట్లకు పైగా ఖర్చు చేస్తూ ఉచితంగా వైద్యం అందిస్తున్నామని వివరించారు. రూ.350 కోట్లతో బోధన ఆస్పత్రుల్లో వైద్య పరికరాలు, వసతులు, స్టేట్ క్యాన్సర్ సెంటర్లను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్హెచ్ఎం నిధులను మరింత అదనంగా కేటాయించి సహకరించాలని కోరారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఎన్హెచ్ఎం మిషన్ డైరెక్టర్, ఏపీ కుటుంబ సంక్షేమ కమిషనర్ జె.నివాస్ తదితరులు పాల్గొన్నారు. -
చనిపోయి.. ఐదుగురి జీవితాలకు ‘సంతోష’మిచ్చాడు!
ఆరిలోవ (విశాఖ తూర్పు): విశాఖలోని ఆరిలోవ ప్రాంతం అంబేడ్కర్‌నగర్‌కు చెందిన బొండా వెంకట సంతోష్ కుమార్ (32) బ్రెయిన్‌డెడ్‌కు గురికాగా అతడి అవయవాలను దానం చేసేందుకు కుటుంబీకులు అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అవయవాలను దానం చేయడానికి గాను సంతోష్ భౌతికకాయాన్ని విమ్స్‌కు తరలించారు. అక్కడ శస్త్రచికిత్స చేసి శరీరంలో బాగా పనిచేస్తోన్న అవయవాలను తొలగించి జీవన్‌దాన్ ప్రొటోకాల్ ప్రకారం ఐదుగురికి కేటాయించారు. విశాఖ సీపీ సహకారంతో ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ చానల్ ఏర్పాటు చేసి అవయవాలను పలు ఆస్పత్రులకు తరలించారు. సంతోష్ భౌతికకాయానికి గురువారం విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు ఆధ్వర్యంలో ఆర్మీ జవాన్‌కు జరిగిన మాదిరిగా ఘన వీడ్కోలు పలికారు. సిబ్బంది రెండు వరసలుగా ఏర్పడి పూలుజల్లుతూ అమర్‌రహే సంతోష్ అంటూ నినాదాలు చేశారు. సంతోష్ తండ్రి శంకర్‌కు రాంబాబు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. విమ్స్ అంబులెన్స్‌లో ఆరిలోవలోని నివాసానికి పార్థివదేహాన్ని తరలించగా...కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. రాంబాబు మీడియాతో మాట్లాడుతూ..సంతోష్ శరీరం నుంచి 2 కారి్నయాలు, కిడ్నీలు, లివర్ తీశామన్నారు. హెల్త్‌సిటీలో అపోలోకు ఓ కిడ్నీ, షీలానగర్‌లో కిమ్స్ ఆస్పత్రికి మరో కిడ్నీ, హెల్త్‌సిటీలో పినాకిల్ ఆస్పత్రికి లివర్, హనుమంతవాక వద్ద ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి కార్నియాలను జీవన్‌దాన్ ప్రొటోకాల్ ప్రకారం తరలించినట్లు తెలిపారు.