న్యూఢిల్లీ: మనిషి పుట్టుక నుంచి చావు దాకా ప్రతీ విషయంలోనూ ఏదో ఒక పరమార్థం దాగే ఉంటుంది అంటారు పెద్దలు. కొంతమంది సమాజం కోసం తమ జీవితాన్ని త్యాగం చేస్తే.. మరికొంత మంది తాము చనిపోయినా అవయవదానంతో నలుగురికి పునర్జన్మ కలిగించే గొప్ప భాగ్యం పొందుతారు. కారణజన్ములుగా కీర్తింపబడుతూ ఎంతో మంది తల్లులకు కడుపుకోత తీర్చే దేవతామూర్తులుగా నిలుస్తారు. ఢిల్లీకి చెందిన 20 నెలల పాపాయి ధనిష్ట కూడా ఈ కోవకే చెందుతుంది. ఓ ప్రమాదంలో ఆ చిన్నారికి బ్రెయిన్‌డెడ్ కాగా.. ఆమె అవయవాలు దానం చేసేందుకు తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. బిడ్డను కోల్పోయామనే బాధను దిగమింగుకుని ఐదుగురు వ్యక్తులకు కొత్త జీవితం ప్రసాదించేందుకు సిద్ధమయ్యారు.
తద్వారా దేశంలోనే అత్యంత చిన్న వయసులో అవయవ దానం చేసిన వ్యక్తిగా ధనిష్ట పేరు నిలిచింది. వివరాలు... రోహిణి ప్రాంతానికి చెందిన ఆశిష్ కుమార్, బబిత దంపతులకు ధనిష్ట సంతానం. జనవరి 8న తమ ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో చిన్నారి అదుపు తప్పి మొదటి అంతస్తు నుంచి కిందపడిపోయింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆమెను స్థానిక గంగారాం ఆస్పత్రికి తరలించారు. తనను కాపాడేందుకు వైద్యులు మూడు రోజుల పాటు శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో జనవరి 11న బ్రెయిన్‌డెడ్ అయినట్లు ప్రకటించారు.(చదవండి: ఐదుగురికి లైఫ్ ఇచ్చిన రెండున్నరేళ్ల చిన్నారి)
ఈ క్రమంలో.. అదే ఆస్పత్రిలో అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తూ వేదన అనుభవిస్తున్న పేషెంట్ల పరిస్థితిని కళ్లారా చూసిన ఆశిష్-బబిత.. తమ బుజ్జాయి ద్వారా వారి జీవితంలో వెలుగులు నింపాలని భావించారు. వైద్యులను సంప్రదించి.. తమ నిర్ణయాన్ని చెప్పగా వారు అందుకు అంగీకరించారు. దీంతో ఐదుగురికి కొత్త జీవితం లభించనుంది. ధనిష్ట గుండె, కాలేయం, రెండు కిడ్నీలు, కార్నియాలను వైద్యులు వారికి అమర్చారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి సిబ్బంది మాట్లాడుతూ.. ఇంతటి విషాదంలోనూ ధైర్యం ప్రదర్శించి.. స్వచ్చందంగా అవయవదానానికి ముందుకు వచ్చిన ధనిష్ట తల్లిదండ్రులను ప్రశంసించారు. ఇక బబిత, తాను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఆ ఐదుగురిలో తమ పాప బతికి ఉంటుందనే సంతోషమైనా మిగులుతుందని ఆశిష్ చెప్పాడు.
అదే విధంగా అవయవదానంపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడంతో ప్రతిరోజూ ఎంతో మంది అభాగ్యులు కన్నుమూస్తున్నారని, ఆశిష్- బబితలా ఆలోచిస్తే అలాంటి వారికి ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కాగా భారత్‌లో సగటున ప్రతి ఏడాది సుమారు 5 లక్షల మంది అవయవాలు దెబ్బతినడం వల్ల మృతి చెందుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కాబట్టి మనం కూడా వీలైనంత ఎక్కువగా ఆర్గాన్ డొనేషన్ చేయడం సహా ఈ విషయంపై అవగాహన కల్పిస్తూ జీవితానంతరం కూడా ఈ లోకంలో మన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేద్దాం. చిన్నారి ధనిష్టలాగే మరికొంత మందిని బతికిద్దాం. ఏమంటారు?!
Comments
Please login to add a commentAdd a comment