breaking news
Rohini area
-
సిగ్మా గ్యాంగ్ హతం
న్యూఢిల్లీ: బిహార్‌కు చెందిన కరుడుగట్టిన నేర ముఠా ‘సిగ్మా గ్యాంగ్’లోని కీలక వ్యక్తులు ఎన్కౌంటర్లో హతమయ్యారు. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఢిల్లీ, బిహార్ పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో ఈ గ్యాంగ్ నాయకుడు రంజన్ పాఠక్ (25)తోపాటు గ్యాంగ్ సభ్యులు బిమ్లేష్ మహతో అలియాస్ బిమ్లేష్ సాహ్ని (25), మనీశ్ పాఠక్ (33), అమన్ ఠాకూర్ (21) చనిపోయినట్లు ఢిల్లీ క్రైమ్ విభాగం జాయింట్ కమిషనర్ సుందర్ కుమార్ తెలిపారు. వీరంతా బిహార్‌లోని సితామర్హి జిల్లాకు చెందినవారు. గ్యాంగ్ నాయకుడు రంజన్ పాఠక్ తలపై రూ.50 వేల రివార్డు కూడా ఉంది. అతడిపై 8 క్రిమినల్ కేసులు ఉన్నాయి. డబ్బు కోసం ఓ వ్యక్తిని బెదిరించినందుకు ఈ నెల 13న కూడా అతడిపై కేసు నమోదైంది. రంజన్ ప్రమాదకరమైన నేరస్తుడని సుందర్‌కుమార్ తెలిపారు. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ గ్యాంగ్ భారీ దోపిడీలకు పాల్పడేందుకు కుట్ర చేసిందని చెప్పారు. వీరు కొద్దిరోజులుగా ఢిల్లీలో మకాం వేశారన్న విశ్వసనీయ సమాచారం అందటంతో నిఘా పెట్టామని, గురువారం తెల్లవారుజామున వారు ఓ కారులో వెళ్తున్నట్లు తెలియటంతో వెంబడించినట్లు పేర్కొన్నారు. రాత్రి 2.20 గంటల సమయంలో రోహిణిలోని బహదూర్ షా మార్గ్‌లో ఎన్కౌంటర్ చోటుచేసుకుందని వెల్లడించారు. మృతులు 25 నుంచి 30 రౌండ్ల కాల్పులు జరుపగా, పోలీసులు 15 నుంచి 20 రౌండ్లు కాల్చారని వివరించారు. ఈ మూఠా ప్రయాణించిన కారు దోపిడీ చేసిందే. దాని నంబర్ ప్లేట్ కూడా నకిలీదేనని గుర్తించారు. అల్లర్లకు కుట్ర పన్ని హతం.. ఎన్కౌంటర్లో చనిపోయిన గ్యాంగ్స్టర్లు బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో భారీగా అలజడి సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు బిహార్ పోలీసులు గుర్తించారు. కొద్దిరోజుల క్రితం ఈ కుట్రకు సంబంధించిన ఆడియో వెలుగు చూడటంతో పోలీసులు వీరిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ‘ఎన్నికల సందర్భంగా ఏదో ఒక సంచలనం సృష్టించేందుకు ఈ గ్యాంగ్ ప్రణాళిక వేసింది’అని బిహార్ డీజీపీ తెలిపారు. సీతామర్హి జిల్లాలో వీరు ఇటీవల ఐదు వరుస హత్యలకు పాల్పడ్డారు. 25 రోజుల క్రితం బ్రహ్మర్షి సమాజ్ జిల్లా అధ్యక్షుడిని హత్య చేశారు. ఈ గ్యాంగ్ సుపారీ హత్యలు కూడా చేసేది. #BigBreakingNews #Delhipolice #BiharPolice#EncounterIn the intervening night of 22-23.10.25, around 2:20 AM, a fierce shoot out took place on Bahadur shah marg from Dr Ambedkar Chowk to Pansali chowk, Rohini, Delhi between 4 suspected accused persons and joint team of Crime… pic.twitter.com/jZmT91isKg— Amit Bhardwaj (@AmmyBhardwaj) October 23, 2025 -
సహోద్యోగులపై పోలీస్ కాల్పులు.. ముగ్గురు మృతి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఓ పోలీస్ తన వద్ద ఉన్న తుపాకీతో ముగ్గురు సహోద్యోగులపై కాల్పులు జరిపాడు. సోమవారం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు పోలీసులూ మృత్యువాతపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోహిణి ప్రాంతంలోని హైదర్‌పూర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో సిక్కిం రాష్ట్రానికి చెందిన పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. వీరి మధ్య జరిగిన గొడవ కారణంగా ఓ సిక్కిం పోలీస్(32) తోటి సిబ్బందిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసులు సంఘటన స్థలంలోనే మరణించారు. మృతులను కమాండర్ పింటో నామ్‌గ్యాల్ భూటియా, ఇంద్ర లాల్ చెత్రీగా పోలీసులు గుర్తించారు. మరొకరు దన్‌హంగ్ సుబ్బాకు తీవ్ర గాయాలవ్వగా బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రిలో చేర్చారు. అయితే చికిత్స పొందుతూ అతను కూడా మరణించినట్లు వైద్యులు తెలిపారు. కాల్పులు జరిపిన నిందితుడిని ప్రబిన్ రాయ్‌గా గుర్తించిన ఢిల్లీ పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. కాగా రాయ్ ఇండియన్ రిజర్వ్ బెటాలియన్స్, సిక్కిం పోలీసులకు చెందిన వాడు. రాయ్, భూటియా 2012 బ్యాచ్ నుంచి గ్రాడ్యూయెట్ పూర్తి చేయగా.. సుబ్బా, చెత్రీ 2013 బ్యాచ్‌కు చెందిన వారు. -
‘బబిత, నేనూ కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాం’
న్యూఢిల్లీ: మనిషి పుట్టుక నుంచి చావు దాకా ప్రతీ విషయంలోనూ ఏదో ఒక పరమార్థం దాగే ఉంటుంది అంటారు పెద్దలు. కొంతమంది సమాజం కోసం తమ జీవితాన్ని త్యాగం చేస్తే.. మరికొంత మంది తాము చనిపోయినా అవయవదానంతో నలుగురికి పునర్జన్మ కలిగించే గొప్ప భాగ్యం పొందుతారు. కారణజన్ములుగా కీర్తింపబడుతూ ఎంతో మంది తల్లులకు కడుపుకోత తీర్చే దేవతామూర్తులుగా నిలుస్తారు. ఢిల్లీకి చెందిన 20 నెలల పాపాయి ధనిష్ట కూడా ఈ కోవకే చెందుతుంది. ఓ ప్రమాదంలో ఆ చిన్నారికి బ్రెయిన్‌డెడ్ కాగా.. ఆమె అవయవాలు దానం చేసేందుకు తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. బిడ్డను కోల్పోయామనే బాధను దిగమింగుకుని ఐదుగురు వ్యక్తులకు కొత్త జీవితం ప్రసాదించేందుకు సిద్ధమయ్యారు. తద్వారా దేశంలోనే అత్యంత చిన్న వయసులో అవయవ దానం చేసిన వ్యక్తిగా ధనిష్ట పేరు నిలిచింది. వివరాలు... రోహిణి ప్రాంతానికి చెందిన ఆశిష్ కుమార్, బబిత దంపతులకు ధనిష్ట సంతానం. జనవరి 8న తమ ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో చిన్నారి అదుపు తప్పి మొదటి అంతస్తు నుంచి కిందపడిపోయింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆమెను స్థానిక గంగారాం ఆస్పత్రికి తరలించారు. తనను కాపాడేందుకు వైద్యులు మూడు రోజుల పాటు శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో జనవరి 11న బ్రెయిన్‌డెడ్ అయినట్లు ప్రకటించారు.(చదవండి: ఐదుగురికి లైఫ్ ఇచ్చిన రెండున్నరేళ్ల చిన్నారి) ఈ క్రమంలో.. అదే ఆస్పత్రిలో అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తూ వేదన అనుభవిస్తున్న పేషెంట్ల పరిస్థితిని కళ్లారా చూసిన ఆశిష్-బబిత.. తమ బుజ్జాయి ద్వారా వారి జీవితంలో వెలుగులు నింపాలని భావించారు. వైద్యులను సంప్రదించి.. తమ నిర్ణయాన్ని చెప్పగా వారు అందుకు అంగీకరించారు. దీంతో ఐదుగురికి కొత్త జీవితం లభించనుంది. ధనిష్ట గుండె, కాలేయం, రెండు కిడ్నీలు, కార్నియాలను వైద్యులు వారికి అమర్చారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి సిబ్బంది మాట్లాడుతూ.. ఇంతటి విషాదంలోనూ ధైర్యం ప్రదర్శించి.. స్వచ్చందంగా అవయవదానానికి ముందుకు వచ్చిన ధనిష్ట తల్లిదండ్రులను ప్రశంసించారు. ఇక బబిత, తాను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఆ ఐదుగురిలో తమ పాప బతికి ఉంటుందనే సంతోషమైనా మిగులుతుందని ఆశిష్ చెప్పాడు. అదే విధంగా అవయవదానంపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడంతో ప్రతిరోజూ ఎంతో మంది అభాగ్యులు కన్నుమూస్తున్నారని, ఆశిష్- బబితలా ఆలోచిస్తే అలాంటి వారికి ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కాగా భారత్‌లో సగటున ప్రతి ఏడాది సుమారు 5 లక్షల మంది అవయవాలు దెబ్బతినడం వల్ల మృతి చెందుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కాబట్టి మనం కూడా వీలైనంత ఎక్కువగా ఆర్గాన్ డొనేషన్ చేయడం సహా ఈ విషయంపై అవగాహన కల్పిస్తూ జీవితానంతరం కూడా ఈ లోకంలో మన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేద్దాం. చిన్నారి ధనిష్టలాగే మరికొంత మందిని బతికిద్దాం. ఏమంటారు?! -
స్పా సెంటర్ కాదది.. నరకకూపం
సాక్షి, న్యూఢిల్లీ: స్పా సెంటర్లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి దేశ రాజధానిలో ఓ మైనర్ బాలికపై కొందరు లైంగిక దాడికి పాల్పడిన ఘటన తెలిసిందే. ఇంటి నుంచి పారిపోవాలన్న తప్పుడు నిర్ణయమే ఆ అమ్మాయి పాలిట శాపంగా మారింది. అమ్మాయిలను వ్యభిచారంలోకి దింపే ముఠా చేతుల్లో బంధీ అయిన ఆమె.. నాలుగు రోజులపాటు నరకం చవిచూసింది. డ్రగ్స్ ఇచ్చి మరీ పలువురు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. చివరకు ఎలాగోలా అక్కడి నుంచి బయటపడి పోలీసులను ఆశ్రయించటంతో అసలు విషయం వెలుగు చూసింది. అయితే ఈ వ్యవహారంలో పెద్ద ముఠానే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. స్పా సెంటర్ మాటున... స్పా సెంటర్ నిర్వాహకులను అరెస్ట్ చేసిన పోలీసులు విస్తూ పోయే విషయాలను వెల్లడించారు. ఈ వ్యవహారంలో భారీ సెక్స్ రాకెట్ నడిచినట్లు తెలిపారు. అమ్మాయిలను ట్రాప్ చేసి స్పా సెంటర్లో పని ఇప్పిస్తామని చెప్పి తీసుకొచ్చి విక్కీ, రాకేశ్ గోయల్‌లు వ్యభిచారాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో వారికి డ్రగ్స్ ఇచ్చి మరీ బలవంతంగా ఈ కూపంలోకి లాగుతున్నట్లు డీసీపీ సంజు కురువిల్లా వెల్లడించారు. వీరిలో కొందరు స్వచ్ఛందంగా ఈ రొంపిలోకి దిగగా.. లొంగని వారికి డ్రగ్స్ ఇచ్చి వారిపై దాష్టీకానికి పాల్పడినట్లు చెప్పారు. సుమారు పాతిక మంది అమ్మాయిలు ఈ స్పా సెంటర్ బాధితులుగా ఉన్నట్లు ఆయన తెలిపారు. తిండి పెట్టకుండా వారిని చిత్రవధ చేసేవారని, ఫలితంగా వారిలో చాలా మంది అనారోగ్యం పాలయ్యారని తెలుస్తోంది. విక్కీతోపాటు ముఠాకు చెందిన మరో అర డజను మంది పరారీలో ఉండగా, వారి కోసం గాలింపు చేపట్టినట్లు డీసీపీ వెల్లడించారు. ఇదిలా ఉంటే ఢిల్లీకి చెందిన సదరు బాలిక(16) గతవారం బాయ్ ఫ్రెండ్‌తో పారిపోయింది. హరిద్వార్ వెళ్లిన వీళ్లిద్దరూ తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పాత ఢిల్లీ రైల్వే స్టేషన్ వద్దకు చేరుకుని, నాలుగు రోజులు అక్కడే గడిపారు. అమ్మాయిలను అక్రమంగా రవాణా చేసే ముఠా సభ్యుడు విక్కీ.. వీరిని గమనించి ఉద్యోగాలు ఇప్పిస్తానని తీసుకెళ్లాడు. ముందుగా సదరు యువకుడి నుంచి బాలికను వేరు చేసి ఓ ఇంటికి తీసుకెళ్లి.. అక్కడ తన స్నేహితులతో గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డాడు. ఆపై మత్తు పదార్థాలు ఇచ్చి బాలికను రోహిణి ఏరియాలోని ఓ స్పా సెంటర్‌కు తరలించాడు. స్పా సెంటర్ యాజమానితోపాటు మరో నలుగురు వ్యక్తులు సదరు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. చివరకు మేడపై నుంచి దూకి తప్పించుకోవాలని ఆమె యత్నించగా.. ముఠా సభ్యులు ఆమెను లాక్కొచ్చి గదిలో బంధించారు. ఆపై మత్తు మందు ఇస్తూ పలువురు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అలా నాలుగు రోజుల తర్వాత ఓరోజు ధైర్యం చేసిన యువతి.. నేరుగా ప్రధాన ద్వారం నుంచే పారిపోయి పోలీసులను ఆశ్రయించింది. గాయాలపాలైన ఆమెను ఆస్పత్రిలో చేర్పించిన పోలీసులు.. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆమె స్నేహితుడి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. -
హృదయవిదారక ఘటన
వాషింగ్ మెషీన్ లో పడి కవలల మృతి న్యూఢిల్లీ: కొద్ది నిమిషాల పాటు తల్లి వదిలివెళ్లడమే ఆ చిన్నారుల శాపంగా మారింది. వాషింగ్ మిషన్ రూపంలో వచ్చిన మృత్యువు కవలలను పొట్టన పెట్టుకుంది. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో శనివారం జరిగిన హృదయవిదారక ఘటనలో రెండున్నరేళ్ల వయస్సు కల్గిన ఇద్దరు కవలలు నిశాంత్, నక్షయ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదవశాత్తు వాషింగ్‌మెషిన్‌లో పడి మృతి చెందారు. సెక్టార్-1లోని ఓ అపార్ట్మెంట్ లో ఈ దుర్ఘటన జరిగింది. బట్టలు ఉతికేందుకు నిశాంత్, నక్షయ తల్లి వాషింగ్ మెషీన్ లో నీళ్లు నింపింది. వాషింగ్ మెషీన్ దగ్గరే ఆడుకుంటున్న పిల్లల్ని అక్కడే వదిలేసి డిటర్జెంట్ పౌడర్ కొనుక్కునేందుకు షాపుకు వెళ్లింది. తిరిగొచ్చేసరికి పిల్లలిద్దరూ కనిపించలేదు. ఎంత వెతికినా వారి జాడ కానరాలేదు. దీంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. ఆఫీసు నుంచి హుటాహుటిన తిరిగొచ్చిన చిన్నారుల తండ్రి రవీందర్ కూడా వెతుకుతుండగా చిన్నారులిద్దరూ వాషింగ్ మెషీన్లో తేలియాడుతూ కనిపించారు. వెంటనే వీరిద్దరినీ సమీలోని జైపూర్ గోల్డెన్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారులు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వాషింగ్‌మెషిన్‌లో మునగడం వల్లే నిశాంత్, నక్షయ ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు.


