సాక్షి, న్యూఢిల్లీ: స్పా సెంటర్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి దేశ రాజధానిలో ఓ మైనర్ బాలికపై కొందరు లైంగిక దాడికి పాల్పడిన ఘటన తెలిసిందే. ఇంటి నుంచి పారిపోవాలన్న తప్పుడు నిర్ణయమే ఆ అమ్మాయి పాలిట శాపంగా మారింది. అమ్మాయిలను వ్యభిచారంలోకి దింపే ముఠా చేతుల్లో బంధీ అయిన ఆమె.. నాలుగు రోజులపాటు నరకం చవిచూసింది. డ్రగ్స్ ఇచ్చి మరీ పలువురు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. చివరకు ఎలాగోలా అక్కడి నుంచి బయటపడి పోలీసులను ఆశ్రయించటంతో అసలు విషయం వెలుగు చూసింది. అయితే ఈ వ్యవహారంలో పెద్ద ముఠానే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
స్పా సెంటర్ మాటున... స్పా సెంటర్ నిర్వాహకులను అరెస్ట్ చేసిన పోలీసులు విస్తూ పోయే విషయాలను వెల్లడించారు. ఈ వ్యవహారంలో భారీ సెక్స్ రాకెట్ నడిచినట్లు తెలిపారు. అమ్మాయిలను ట్రాప్ చేసి స్పా సెంటర్‌లో పని ఇప్పిస్తామని చెప్పి తీసుకొచ్చి విక్కీ, రాకేశ్ గోయల్‌లు వ్యభిచారాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో వారికి డ్రగ్స్ ఇచ్చి మరీ బలవంతంగా ఈ కూపంలోకి లాగుతున్నట్లు డీసీపీ సంజు కురువిల్లా వెల్లడించారు. వీరిలో కొందరు స్వచ్ఛందంగా ఈ రొంపిలోకి దిగగా.. లొంగని వారికి డ్రగ్స్ ఇచ్చి వారిపై దాష్టీకానికి పాల్పడినట్లు చెప్పారు. సుమారు పాతిక మంది అమ్మాయిలు ఈ స్పా సెంటర్ బాధితులుగా ఉన్నట్లు ఆయన తెలిపారు. తిండి పెట్టకుండా వారిని చిత్రవధ చేసేవారని, ఫలితంగా వారిలో చాలా మంది అనారోగ్యం పాలయ్యారని తెలుస్తోంది. విక్కీతోపాటు ముఠాకు చెందిన మరో అర డజను మంది పరారీలో ఉండగా, వారి కోసం గాలింపు చేపట్టినట్లు డీసీపీ వెల్లడించారు.
ఇదిలా ఉంటే ఢిల్లీకి చెందిన సదరు బాలిక(16) గతవారం బాయ్ ఫ్రెండ్‌తో పారిపోయింది. హరిద్వార్ వెళ్లిన వీళ్లిద్దరూ తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పాత ఢిల్లీ రైల్వే స్టేషన్ వద్దకు చేరుకుని, నాలుగు రోజులు అక్కడే గడిపారు. అమ్మాయిలను అక్రమంగా రవాణా చేసే ముఠా సభ్యుడు విక్కీ.. వీరిని గమనించి ఉద్యోగాలు ఇప్పిస్తానని తీసుకెళ్లాడు. ముందుగా సదరు యువకుడి నుంచి బాలికను వేరు చేసి ఓ ఇంటికి తీసుకెళ్లి.. అక్కడ తన స్నేహితులతో గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డాడు. ఆపై మత్తు పదార్థాలు ఇచ్చి బాలికను రోహిణి ఏరియాలోని ఓ స్పా సెంటర్‌కు తరలించాడు. స్పా సెంటర్ యాజమానితోపాటు మరో నలుగురు వ్యక్తులు సదరు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. చివరకు మేడపై నుంచి దూకి తప్పించుకోవాలని ఆమె యత్నించగా.. ముఠా సభ్యులు ఆమెను లాక్కొచ్చి గదిలో బంధించారు. ఆపై మత్తు మందు ఇస్తూ పలువురు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అలా నాలుగు రోజుల తర్వాత ఓరోజు ధైర్యం చేసిన యువతి.. నేరుగా ప్రధాన ద్వారం నుంచే పారిపోయి పోలీసులను ఆశ్రయించింది. గాయాలపాలైన ఆమెను ఆస్పత్రిలో చేర్పించిన పోలీసులు.. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆమె స్నేహితుడి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment