హృదయవిదారక ఘటన
వాషింగ్ మెషీన్ లో పడి కవలల మృతి
న్యూఢిల్లీ: కొద్ది నిమిషాల పాటు తల్లి వదిలివెళ్లడమే ఆ చిన్నారుల శాపంగా మారింది. వాషింగ్ మిషన్ రూపంలో వచ్చిన మృత్యువు కవలలను పొట్టన పెట్టుకుంది. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో శనివారం జరిగిన హృదయవిదారక ఘటనలో రెండున్నరేళ్ల వయస్సు కల్గిన ఇద్దరు కవలలు నిశాంత్, నక్షయ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదవశాత్తు వాషింగ్‌మెషిన్‌లో పడి మృతి చెందారు. సెక్టార్-1లోని ఓ అపార్ట్‌మెంట్ లో ఈ దుర్ఘటన జరిగింది.
బట్టలు ఉతికేందుకు నిశాంత్, నక్షయ తల్లి వాషింగ్ మెషీన్ లో నీళ్లు నింపింది. వాషింగ్ మెషీన్ దగ్గరే ఆడుకుంటున్న పిల్లల్ని అక్కడే వదిలేసి డిటర్జెంట్ పౌడర్ కొనుక్కునేందుకు షాపుకు వెళ్లింది. తిరిగొచ్చేసరికి పిల్లలిద్దరూ కనిపించలేదు. ఎంత వెతికినా వారి జాడ కానరాలేదు. దీంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు.
ఆఫీసు నుంచి హుటాహుటిన తిరిగొచ్చిన చిన్నారుల తండ్రి రవీందర్ కూడా వెతుకుతుండగా చిన్నారులిద్దరూ వాషింగ్ మెషీన్‌లో తేలియాడుతూ కనిపించారు. వెంటనే వీరిద్దరినీ సమీలోని జైపూర్ గోల్డెన్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారులు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వాషింగ్‌మెషిన్‌లో మునగడం వల్లే నిశాంత్, నక్షయ ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు.