ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఎన్‌కౌంటర్
గ్యాంగ్ లీడర్ రంజన్ సహా నలుగురు హతం
ఈ బిహార్ గ్యాంగ్‌పై పలు హత్య, దోపిడీ కేసులు
ఢిల్లీ, బిహార్ పోలీసుల సంయుక్త ఆపరేషన్
న్యూఢిల్లీ: బిహార్‌కు చెందిన కరుడుగట్టిన నేర ముఠా ‘సిగ్మా గ్యాంగ్’లోని కీలక వ్యక్తులు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఢిల్లీ, బిహార్ పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో ఈ గ్యాంగ్ నాయకుడు రంజన్ పాఠక్ (25)తోపాటు గ్యాంగ్ సభ్యులు బిమ్‌లేష్ మహతో అలియాస్ బిమ్‌లేష్ సాహ్ని (25), మనీశ్ పాఠక్ (33), అమన్ ఠాకూర్ (21) చనిపోయినట్లు ఢిల్లీ క్రైమ్ విభాగం జాయింట్ కమిషనర్ సుందర్ కుమార్ తెలిపారు. వీరంతా బిహార్‌లోని సితామర్హి జిల్లాకు చెందినవారు.
గ్యాంగ్ నాయకుడు రంజన్ పాఠక్ తలపై రూ.50 వేల రివార్డు కూడా ఉంది. అతడిపై 8 క్రిమినల్ కేసులు ఉన్నాయి. డబ్బు కోసం ఓ వ్యక్తిని బెదిరించినందుకు ఈ నెల 13న కూడా అతడిపై కేసు నమోదైంది. రంజన్ ప్రమాదకరమైన నేరస్తుడని సుందర్‌కుమార్ తెలిపారు. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ గ్యాంగ్ భారీ దోపిడీలకు పాల్పడేందుకు కుట్ర చేసిందని చెప్పారు. వీరు కొద్దిరోజులుగా ఢిల్లీలో మకాం వేశారన్న విశ్వసనీయ సమాచారం అందటంతో నిఘా పెట్టామని, గురువారం తెల్లవారుజామున వారు ఓ కారులో వెళ్తున్నట్లు తెలియటంతో వెంబడించినట్లు పేర్కొన్నారు. రాత్రి 2.20 గంటల సమయంలో రోహిణిలోని బహదూర్ షా మార్గ్‌లో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుందని వెల్లడించారు. మృతులు 25 నుంచి 30 రౌండ్ల కాల్పులు జరుపగా, పోలీసులు 15 నుంచి 20 రౌండ్లు కాల్చారని వివరించారు. ఈ మూఠా ప్రయాణించిన కారు దోపిడీ చేసిందే. దాని నంబర్ ప్లేట్ కూడా నకిలీదేనని గుర్తించారు.
అల్లర్లకు కుట్ర పన్ని హతం..
ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన గ్యాంగ్‌స్టర్లు బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో భారీగా అలజడి సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు బిహార్ పోలీసులు గుర్తించారు. కొద్దిరోజుల క్రితం ఈ కుట్రకు సంబంధించిన ఆడియో వెలుగు చూడటంతో పోలీసులు వీరిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ‘ఎన్నికల సందర్భంగా ఏదో ఒక సంచలనం సృష్టించేందుకు ఈ గ్యాంగ్ ప్రణాళిక వేసింది’అని బిహార్ డీజీపీ తెలిపారు. సీతామర్హి జిల్లాలో వీరు ఇటీవల ఐదు వరుస హత్యలకు పాల్పడ్డారు. 25 రోజుల క్రితం బ్రహ్మర్షి సమాజ్ జిల్లా అధ్యక్షుడిని హత్య చేశారు. ఈ గ్యాంగ్ సుపారీ హత్యలు కూడా చేసేది.
#BigBreakingNews #Delhipolice #BiharPolice#Encounter
In the intervening night of 22-23.10.25, around 2:20 AM, a fierce shoot out took place on Bahadur shah marg from Dr Ambedkar Chowk to Pansali chowk, Rohini, Delhi between 4 suspected accused persons and joint team of Crime… pic.twitter.com/jZmT91isKg— Amit Bhardwaj (@AmmyBhardwaj) October 23, 2025



