
సాక్షి,నెల్లూరు: ‘అవయవదానం చేయండి. పదిమంది జీవితాల్లో వెలుగు నింపండి. ప్రాణదానం చేయండి’. కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు దీని అర్థాన్నే మార్చేస్తున్నాయి. అవయవదానం ముసుగులో అక్రమాలకుపాల్పడుతూ మానవత్వానికే మాయని మచ్చ తెస్తున్నారు. ఇటీవల కొన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న వ్యవహారాలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి చావుబతుకుల మధ్య నెల్లూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు చేసిన శస్త్రచికిత్స విఫలమై బ్రెయిన్‌డెడ్ అయింది. బాధితుడి పేదరికం ఆస్పత్రికి వరంగా మారింది. అతని అవయవాలపై కన్నేసింది. చికిత్సకైన బిల్లును చెల్లించు.. లేదా అవయవాలు దానం చేస్తావా? అంటూ ఆస్పత్రి యాజమాన్యం బాధితుని భార్యను బ్లాక్‌మెయిల్ చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె అంగీకరించింది. తర్వాత ఆస్పత్రి యాజమాన్యం నిర్వాకంపై ఆమె జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. అవయవదానం ముసుగులో కార్పొరేట్ ఆస్పత్రి వ్యవహారం అధికార బృందం విచారణ జరిపి చర్యలకు సిఫార్సు చేసినట్టు తెలిసింది.
ఏం జరిగిందంటే..
అల్లూరు మండలం ఉద్దేపుగుంటకు చెందిన ఏకొల్లు శ్రీనివాసులు (45) అనే వ్యక్తి ఈనెల 17వ తేదీ రాత్రి రోడ్డుపై నడిచి వెళుతుండగా బీరంగుంట గ్రామం వద్ద వెనుకనుంచి మోటార్‌బైక్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గుర్తించి అతడిని 108 వాహనంలో వైద్యం కోసం నెల్లూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ఈనెల 18వ తేదీన అతని మెదడుకు వైద్యులు శస్త్రచికిత్స చేయగా విఫలమై శ్రీనివాసులు కోమాలోకి వెళ్లిపోయాడు. బ్రెయిన్‌డెడ్ కావడంతో బతకడని భావించిన వైద్యులు అతని భార్య అరుణమ్మకు విషయం చెప్పారు. డిశ్చార్జి చేయాలంటే ఆపరేషన్ ఖర్చు రూ.1.27 లక్షలుచెల్లించాలని ఒత్తిడి తెచ్చారు. అసలే రెకా>్కడితే డొక్కాడని ఆ కుటుంబం బిల్లు చెల్లించలేని పరిస్థితి కావడంతో ఆస్పత్రి యాజమాన్యం శ్రీనివాసులు అవయవాలపై కన్నేసింది. బిల్లు చెల్లిస్తావా? కిడ్నీఇస్తావా? అంటూ అతని భార్యపై ఒత్తిడి పెంచారు. యాజమాన్యం ఒత్తిడి తట్టుకోలేని అరుణమ్మ అవయవాలు తీసుకోమని చెప్పింది. అంతే ఆగమేఘాలపై ఆస్పత్రి యాజమాన్యం రెండు కిడ్నీలు, గుండె, రెండుకళ్లు, సేకరించి అందులో కిడ్నీ మాత్రం ఉంచుకుని మిగిలిన అవయవాలు ఇతర ఆస్పత్రులకు పంపింది. అవయవాలు సేకరించిన ఆస్పత్రి యాజమాన్యం కనీస మానవత్వం కూడా చూపకుండా అంత్యక్రియలకు కూడా సాయం చేయలేదు. దీంతో గిరిజన మహిళ అరుణమ్మ తన భర్తను అనాథశవంలా వదిలివేయలేక అష్టకష్టాలు పడి మృతదేహన్ని తీసుకుని సొంతూరికి చేరుకుని ఇతరుల సాయంతో అంత్యక్రియలు చేసింది. ఆ తర్వాత తనకు జరిగిన అన్యాయంపై ఆమె రొడ్డెక్కింది. అధికారులకు ఆస్పత్రి యాజమాన్యంపై ఫిర్యాదు చేసింది.
అవయవ సేకరణలో ఎన్నెన్నో అనుమానాలు?
శ్రీనివాసులు అవయవదానంలో ఆస్పత్రి వర్గాలు వ్యవహరించిన వైఖరి పలు అనుమానాలకు తావిస్తోంది. బాధితుల దగ్గర్నుంచి ముందస్తుగా బిల్లు కట్టించుకోలేదు. ఎన్టీఆర్ వైద్యసేవలు వర్తించవని తెలిసినా ఖరీదైన శస్త్ర చికిత్స ఎలాచేశారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న..తలపైన బలమైన గాయాలు లేకపోయినా మెదడుకు శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఏముంది? నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో అవయవాలపై కన్నేసి బిల్లు చెల్లించలేరని తెలుసుకుని అతని భార్యను బ్లాక్‌మెయిల్ చేశారా? జీవన్‌దాన్ సంస్థ నిబంధనల ప్రకారం అవయవ దానం స్వీకరించే ఆస్పత్రి ఒక అవయవాన్ని మాత్రం తీసుకునే అవకాశం ఉంది. దానిని ఆస్పత్రి యాజమాన్యం రూ.లక్షల్లో విక్రయించే అవకాశం ఉంది. ఈ కోణంలో ఆస్పత్రి యాజమాన్యం కాసుల కోసం మానవత్వం మరిచిందా? మిగిలిన అవయవాలు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆస్పత్రులకు పంపిన వైనంలో కూడా కాసులు వేట ఉందా? అవయవ సేకరణ సమయంలో నిబంధనలు సక్రమంగా పాటించారా? ఇలా ఎన్నో అనుమానాలను అనేకమంది వ్యక్తం చేస్తున్నారు.
నివేదిక సిద్ధం
నెల్లూరులో ఓ ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో జరిగిన అవయవ సేకరణపై దుమారం రేగడంతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు. వైద్య అధికారుల బృందంతోపాటు కావలి సబ్‌కలెక్టర్, తహసీల్దార్ విచారణ జరిపి నివేదిక తయారు చేసి జిల్లా కలెక్టర్‌కు ఇచ్చారు. అధికారులు విచారణలో అవయవదానం ముసుగులో కార్పొరేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న అక్రమాలను ఎన్నో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఆస్పత్రి నిర్వాకంపై నివేదిక సిద్ధిం చేసి జిల్లా కలెక్టర్‌కు పంపారు. అయితే సదరు ఆస్పత్రిపై చర్యలు తీసుకోవద్దంటూ రాజకీయ ఒత్తిడి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment