
‘తోటా’కు అసెంబ్లీ ఆమోదంతో అవయవ దానాలు, మార్పిళ్లకు మార్గం సుగమం
రాష్ట్రంలో అవయవ దానం, మార్పిడిపై పెరుగుతున్న అవగాహన
సాక్షి, హైదరాబాద్: అవయవ దానం ఎంతో ఉదాత్తమైనది. సంకల్ప బలం ఉంటే గానీ సాధ్యమయ్యే విషయం కాదు. కొంతమంది కళ్లు, మూత్రపిండాలు ఇతర అవయవాలు దానం చేస్తారు. దాతలు చనిపోయాక వాటిని తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. తమవారి ప్రాణాలు కాపాడేందుకు కుటుంబసభ్యులు కిడ్నీ దానం చేయడం కూడా అడపాదడపా జరుగుతుంటుంది. గతంలో అవయవ దానం అంటే చనిపోయిన వారి కళ్లు దానం చేయడమే అనుకునేవారు. కానీ పదేళ్లలో పెరిగిన అవగాహన వల్ల కళ్లతో పాటు ఇతర అవయవాల దానం కూడా పెరిగింది. అవయవ మార్పిడితో పునర్జన్మ పొంది ప్రాణాలు కాపాడుకుంటున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది.
తాజాగా ‘తోటా’ అమలు తీర్మానంతో ఇది మరింత ఊపందుకునే అవకాశం ఏర్పడింది. గత పదేళ్లలో రాష్ట్రంలో అవయవాలను దానం చేసిన వారి సంఖ్య 1,594 కాగా.. ఎవరైనా చనిపోయిన తర్వాత, బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి సేకరించిన కంటి కారి్నయా, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు ఇతర అవయవాలను ట్రాన్స్ ప్లాంట్ చేయడం ద్వారా పన్నెండేళ్లలో ఏకంగా 6 వేల మంది పునర్జన్మ పొందారు. ఇంకా 3,823 మంది అవయవ మార్పిడి కోసం రాష్ట్ర ప్రభుత్వ ‘జీవన్‌దాన్’ కార్యక్రమం కింద నమోదు చేసుకున్నారు. దీనిని బట్టే రాష్ట్రంలో అవయవ దానం, అవయవ మార్పిడిపై ప్రజల్లో అవగాహన ఎంతగా పెరుగుతోందో స్పష్టమవుతోంది.
2021 నుంచి ఏటా 700 సగటుతో అవయవ మార్పిడి
అవయవ మార్పిడిలో దేశంలో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ అవయవ మార్పిడి రేటు 1.9 పర్ మిలియన్ పాపులేషన్ (పీఎంపీ)గా ఉంది. ఇది జాతీయ సగటు (0.65 పీఎంపీ) కంటే చాలా ఎక్కువ. తెలంగాణలో కూడా చైతన్యం పెరగడంతో 2021 నుంచి ప్రతి ఏటా 700 సగటుతో అవయవ మార్పిడి కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఊపిరితిత్తులు, కాలేయం, కంటి కారి్నయా మార్పిడిలు ఎక్కువగా ఉండగా, బ్రెయిన్ డెడ్ అయిన వారి ద్వారా సేకరించి గుండెను మార్చే శస్త్రచికిత్సలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ నెలలో ఇప్పటివరకు నాలుగు గుండె మార్పిడి శస్త్రచికిత్సలు జరగడం ప్రజల్లో పెరిగిన చైతన్యాన్ని సూచిస్తున్నాయి.
సవరించిన చట్టాన్ని అమలు చేసేలా తీర్మానం
రాష్ట్రంలో 1994 నాటి అవయవ మార్పిడి చట్టం ‘టీహెచ్‌ఓఏ’ (ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యుమన్ ఆర్గన్స్ యాక్ట్)ను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం గత పదకొండేళ్లుగా అమలు చేస్తూ వచ్చింది. దీంతో అవయవ మార్పిడి ఆశించిన స్థాయిలో జరగలేదు. కానీ ఇప్పుడు.. ఆ చట్టానికి సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2014లో తీసుకొచ్చిన ‘టీహెచ్‌ఓటీఏ–తోటా’ (ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యుమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్) చట్టాన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు చేసేలా సోమవారం శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించింది. దీంతో రాష్ట్రంలో మరింత పారదర్శకంగా, మానవ అవయవాల వ్యాపారాన్ని నిరోధించి, అవసరమైన వారికి చట్టబద్ధంగా, ఎక్కువ సంఖ్యలో అవయవ మార్పిడి జరిగేందుకు అవకాశం ఏర్పడింది.
‘జీవన్‌దాన్’ ద్వారా పునర్జన్మ
రాష్ట్ర ప్రభుత్వం ‘జీవన్‌దాన్’ కార్యక్రమం ద్వారా అధికారికంగా అవయవమార్పిడి ప్రక్రియను నిర్వహిస్తోంది. ఎవరికైనా వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా మూత్రపిండం (కిడ్నీ), గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, గుండె నాళాలు, కంటి కారి్నయా, క్లోమం (ప్యాంక్రియాస్) వంటి అవయవాలను మారుస్తున్నారు. 2013 నుంచి ఇప్పటివరకు 6,007 మందికి మార్చి కొత్త జీవితాన్ని అందించారు.
ఈ 6,007 మందిలో అత్యధికంగా 2,394 మందికి కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు జరగగా, కాలేయం (లివర్) మార్పిడి చికిత్సలు 1,462 మందికి జరిగాయి. 2013 నుంచి రాష్ట్రంలో గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు కూడా జరుగుతుండడం గమనార్హం. అప్పటినుంచి ఇప్పటివరకు 218 మందికి గుండె మార్పిడిలు జరగగా, 2017, 2022లో వరుసగా 32, 31 చొప్పున గుండె మార్పిడి చికిత్సలు జరిగాయి.
‘తోటా’తో వేగవంతం!
‘తోటా’ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయడం ద్వారా మానవ అవయవాల మార్పిడి ప్రక్రియ వేగవంతం అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బ్రెయిన్ డెడ్ అయినవారు, మరణించిన వారినుంచి అవసరమైన అవయవాలను సేకరించి, మార్పిడి చేసేందుకు వీలుగా నిబంధనల్లో మార్పులు జరిగాయి. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు.. వారి మనవళ్లు, మనవరాళ్లకు అవయవ దానం చేయడానికి ఈ చట్టం అనుమతి ఇస్తోంది. కొన్ని రకాల జన్యుపరమైన సమస్యల వల్ల పిల్లలకు కాలేయ మార్పిడి చేయాల్సి వచ్చినప్పుడు వారి గ్రాండ్ పేరెంట్స్ కాలేయ దానం (కాలేయంలో కొంత భాగం) చేయడానికి అవకాశం కలుగుతోంది.
అలాగే 1995 నాటి నిబంధనల ప్రకారం బ్రెయిన్ డెడ్ డిక్లేర్ చేసే అధికారం న్యూరో సర్జన్లు, న్యూరో ఫిజీషియన్లకు మాత్రమే ఉంది. కొత్త నిబంధనల ప్రకారం ఫిజీషియన్, సర్జన్, ఇంటెన్సివిస్ట్, అనస్థీషియన్ కూడా బ్రెయిన్ డెడ్ డిక్లేర్ చేయడానికి అర్హులు. మరోవైపు అవయవాల అక్రమ రవాణా, అక్రమ మార్పిడి చేస్తే ఇప్పటివరకు రూ.5 వేల జరిమానా, 3 సంవత్సరాల వరకూ జైలు శిక్ష విధించేందుకే అవకాశం ఉండేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం ఒక కోటి రూపాయల వరకు జరిమానా, 10 సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఏర్పడింది.
దాతల్లో 41 నుంచి 60 ఏళ్ల వారే ఎక్కువ
అవయవ దాతల్లో 41 సంవత్సరం నుంచి 60 సంవత్సరాల లోపు వారే అధికంగా ఉన్నారు. 2020 నుంచి అవయవ దానం చేసిన వారిని చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ఐదేళ్లలో 41 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు వారు 187 మంది అవయవదానాలు చేయగా, 51 నుంచి 60 ఏళ్లలోపు వారు 190 మంది ఉన్నారు. ఇక 61 నుంచి 70 వయస్సు గల వారు 88 మంది ఉన్నారు.
అవయవదానం చేసిన యువకుల్లో 21 నుంచి 30 ఏళ్ల వయస్సు వారు 149 మంది ఉండగా, 31 నుంచి 40 ఏళ్ల లోపు వారు 140 మంది ఉన్నారు. ఇక 1 నుంచి 10 ఏళ్ల వయస్సు వాళ్లు ఆరుగురు, 11 నుంచి 20 ఏళ్ల లోపు వారు 64 మంది ఉన్నారు. 71 నుంచి 78 ఏళ్ల లోపు వారు 36 మంది ఉంటే, 81 ఏళ్లు పైబడిన వారు 2020లో ఇద్దరు, 2023లో ఒక్కరు వారి అవయవాలను దానం చేశారు. కాగా 2020 నుంచి అవయవ దానం చేసిన 863 మందిలో మహిళలు 672 మంది కాగా, పురుషులు కేవలం 191 మాత్రమే కావడం గమనార్హం.
అవయవాల కోసం వెయిటింగ్‌లో 3,823 మంది
అవయవ మార్పిడి కోసం ‘జీవన్‌దాన్’ వద్ద ఇంకా 3,823 మంది నమోదు చేసుకుని ఉన్నారు. నిమ్స్, ఉస్మానియా, గాం«దీ, ఈఎస్‌ఐతో పాటు హైదరాబాద్‌లోని 41 ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు చేస్తారు. అత్యధికంగా నిమ్స్‌లో 620కి పైగా శస్త్రచికిత్సలు జరిగాయి.
– డాక్టర్ శ్రీభూషణ్ రాజు (జీవన్‌దాన్ నోడల్ ఆఫీసర్)
Comments
Please login to add a commentAdd a comment