గుండె, కిడ్నీలు అమర్చుకున్న వారిలో.. వాటి ‘ఓనర్ల’ జ్ఞాపకాలు, అలవాట్లు
ఓ పాత సినిమా.. కంటిచూపు దెబ్బతిన్న ఒక యువకుడికి, అంతక్రితమే మరణించిన మరో వ్యక్తి కళ్లను అమర్చుతారు.. ఆపరేషన్ సక్సెస్.. యువకుడికి చూపు బ్రహ్మాండంగా వచ్చేస్తుంది.. కానీ తరచూ ఎవరో వచ్చి తనను కత్తితో పొడుస్తున్నట్టుగా కళ్ల ముందు ఏదో దృశ్యం తారాడుతూ ఉంటుంది.. నిజానికి ఆ కళ్లకు సంబంధించిన వ్యక్తి చనిపోవడానికి కారణమైన ఘటన అది.
ఇదంతా జస్ట్ సినిమాటిక్ ఫిక్షన్, అవయవాల్లో అలా జ్ఞాపకాలేవీ నిక్షిప్తమయ్యే అవకాశమే లేదన్నది ఇటీవలి వరకు ఉన్న భావన. కానీ ఎవరి అవయవాలనైనా మరొకరికి అమర్చినప్పుడు.. వారి లక్షణాలు, అలవాట్లు కూడా వస్తాయని ఓ అధ్యయనంలో తేలింది. అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు ఈ అంశంపై పరిశోధన చేశారు.
సెల్యులార్ మెమొరీతోనే ఇదంతా!
శరీరంలో అన్ని కణాలకు కొంత జ్ఞాపకశక్తి ఉంటుందన్న ‘సెల్యులార్ మెమొరీ’ సిద్ధాంతాన్ని కొలరాడో వర్సిటీ శాస్త్రవేత్తలు తెరపైకి తెస్తున్నారు. ప్రతి వ్యక్తికి సంబంధించి కిడ్నీలు, గుండె, కళ్లు... వంటి వాటిలో.. వారి శారీరక, మానసిక లక్షణాల జ్ఞాపకాలు ఉంటాయని చెప్తున్నారు. వేరేవారికి ఈ అవయవాలు అమర్చినప్పుడు వారిని ఈ ‘సెల్యులార్ మెమొరీ’ ప్రభావితం చేస్తుందని.. అందుకే వారిలో కొత్త లక్షణాలు, అలవాట్లు కనిపిస్తాయని అంటున్నారు. మన కంప్యూటర్‌లో ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేసుకుంటే కొత్త ఆప్షన్లు అందుబాటులోకి వచ్చినట్టుగా.. దీనిని పోల్చుకోవచ్చని చెప్తున్నారు.
అవయవ మార్పిడికి ముందు, తర్వాత..
శాస్త్రవేత్తలు యూనివర్సిటీ పరిధిలోని ఆస్పత్రిలో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకున్న 47 మందిని స్టడీకి ఎంచుకున్నారు. ఇందులో కిడ్నీ, లివర్ నుంచి గుండె మార్పిడి వరకు చేయించుకున్నవారు ఉన్నారు. వారిలో అవయవ మార్పిడికి ముందు, తర్వాత ఉన్న అలవాట్లు, లక్షణాలను నమోదు చేశారు. అవయవ మార్పిడి తర్వాత ఎదుర్కొన్న అనుభవాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నో చిత్రమైన అంశాలు వెల్లడయ్యాయి.
డ్యూటీలో ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్‌ను నేరస్తులు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపేశారు. అతడి గుండెను ఓ యువకుడికి అమర్చారు. అవయవ మార్పిడి తర్వాత తరచూ తనను ఎవరో దగ్గరి నుంచి కాల్చేస్తున్నట్టుగా కలలు వస్తున్నాయని.. బుల్లెట్ తాకినట్టుగా నుదుటిపై తీవ్రంగా నొప్పికూడా వస్తోందని ఆ యువకుడు డాక్టర్లకు చెప్పాడు.
ఓ మూడేళ్ల పిల్లాడికి పవర్ రేంజర్స్ బొమ్మలంటే చాలా ఇష్టం. ఎప్పుడూ వాటితోనే ఆడుకునేవాడు. కానీ అతడికి గుండె మార్పిడి శస్త్రచికిత్స చేశాక.. ఒక్కసారిగా ఆ బొమ్మలను దూరం పడేయడం మొదలుపెట్టాడు. చిత్రమేంటంటే.. అతడికి అమర్చిన గుండె ఓ ఏడాదిన్నర చిన్నారిది. పవర్ రేంజర్స్ బొమ్మలను అందుకోవడానికి ప్రయత్నిస్తూ.. కిటికీ నుంచి పడిపోయి చనిపోయాడు.
ఇవే కాదు. ఆపరేషన్‌కు ముందు వరకు ఎంతో ప్రశాంతంగా ఉండే వ్యక్తి.. తర్వాత తీవ్రంగా కోపతాపాలకు, తీవ్ర భావోద్వేగాలకు గురవడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. మరోవైపు ఎప్పుడూ మూడీగా ఉండే కొందరు.. ఆపరేషన్ తర్వాత యాక్టివ్‌గా మారడం, అందరితో చనువుగా ఉండటాన్ని గుర్తించారు. ఒక్కసారిగా కొత్త అలవాట్లు రావడం, అప్పటివరకు ఇష్టంగా చేసిన పనులు అసలే నచ్చకపోవడం, ఆధ్యాత్మిక నమ్మకాల్లోనూ మార్పులు రావడం వంటివీ గమనించారు.
Comments
Please login to add a commentAdd a comment