ఆ నంబర్ ఏ పేరుతో సేవ్ చేసుకున్నానబ్బా..! | Excessive use of cell phones is threatening memory | Sakshi
Sakshi News home page

ఆ నంబర్ ఏ పేరుతో సేవ్ చేసుకున్నానబ్బా..!

Published Sun, Dec 29 2024 4:54 AM | Last Updated on Sun, Dec 29 2024 4:54 AM

Excessive use of cell phones is threatening memory

కొందరి పేర్లు గుర్తుకు రాకకొన్నిసార్లు సతమతం  

జ్ఞాపక శక్తికి ముప్పు తెస్తున్న సెల్‌ ఫోన్‌ అతి వినియోగం 

కుటుంబ సభ్యుల ఫోన్‌ నంబర్లు సైతం చెప్పలేని పరిస్థితి 

చిన్నపాటి లెక్కలకు, తేదీల కోసం సెల్‌ తెరవాల్సిందే.. 

చాప కింద నీరులా విస్తరిస్తున్న డిజిటల్‌ డిమెన్షియా సమస్య 

చదువుకునే పిల్లల్లో తీవ్ర ప్రభావం..  ఎంత చదివినా ముఖ్యాంశాలు గుర్తుండక కుంగుబాటు

అత్యవసర సందర్భాల్లో మొబైల్‌లో సన్నిహితులు, తెలిసిన వారి ఫోన్‌ నంబర్‌లు ఏ పేరుతో సేవ్‌ చేసుకున్నది ఎంత గింజుకున్నా గుర్తుకు రాదు. అంతెందుకు.. మన ఫోన్‌ నంబర్‌ తప్ప కుటుంబ సభ్యులందరి ఫోన్‌ నంబర్లు చెప్పలేని పరిస్థితి. కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువుల పుట్టిన తేదీ ఎప్పుడన్నది గుర్తుండదు. చిన్న లెక్క వేయడానికి మెదడు గజిబిజిగా మారి సెల్‌ ఫోన్‌లోని క్యాల్‌క్యులేటర్‌ను ఓపెన్‌ చేయాల్సి వస్తోంది. 

ప్రస్తుతం ఇలాంటి సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి. ఇది తరచూ జరుగుతూ ఉంటే మాత్రం ‘డిజిటల్‌ డిమెన్షియా’ అయ్యుండొచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత సాంకేతిక ఆధిపత్య యుగంలో మొబైల్‌ ఫోన్, ట్యాబ్, కంప్యూటర్, టీవీ ఇతర సాంకేతిక పరికరాల వినియోగం పెరిగిపోయింది. 

ఫలితంగా ఒకప్పుడు వృద్ధుల్లో సహజంగా కనిపించే డిమెన్షియా (చిత్త వైకల్యం) బారిన ఇప్పుడు చిన్న పిల్లలు, యువత పడుతున్నారు. దైనందిన జీవితంలో చాలా మంది మేల్కొని ఉండే సమయంలో 40 శాతం, ఆపై కూడా స్క్రీన్‌ చూడటానికి కేటాయిస్తున్నారు. దీంతో ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. ముఖ్యంగా చిన్నారుల్లో విజ్ఞానం, సృజనాత్మకతను సెల్‌ఫోన్‌లు చిదిమేస్తున్నాయనే చెప్పాలి.   – సాక్షి, అమరావతి

డిమెన్షియా ప్రారంభ దశ 
సాధారణంగా 60 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో డిమెన్షియా వస్తుంటుంది. సాంకేతికతను అతిగా వినియోగించడం ద్వారా జ్ఞాపక శక్తిలో వచ్చే సమస్యలను డిజిటల్‌ డిమెన్షియా అని 2012లో జర్మన్‌ న్యూరో శాస్త్రవేత్తలు అభివర్ణించారు. దీన్ని డిమెన్షియాకు ప్రారంభంలో వచ్చే మైల్డ్‌ కాగ్నిటివ్‌ ఇంపైర్‌మెంట్‌ అని కూడా కొందరు వైద్యులు చెబుతున్నారు. 

డిజిటల్‌ డిమెన్షియా మీద ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ఆధారంగా ఎక్కువ సమయాన్ని స్క్రీన్‌కు కేటాయించడంతో జ్ఞాపక శక్తిపై ప్రభావం పడుతుందని తేలింది.  

మెదడు డీయాక్టివ్‌  
సాధారణంగా రాయడం, చదవడం, ఇంకా మరేదైనా పనుల్లో ఉన్నప్పుడు చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలుస్తుంది. ఆ అంశాలను మెదడు యాక్టివ్‌గా పరిశీలిస్తూ ఉంటుంది. అదే మొబైల్‌ ఫోన్‌లో సోషల్‌ మీడియా, సినిమాలు చూడటం, వీడియో గేమ్స్‌ ఆడటం చేస్తున్నప్పుడు పూర్తిగా అందులోనే నిమగ్నం అవుతారు. చుట్టూ ఏం జరుగుతుందో కూడా గ్రహించకుండా మెదడు డీ యాక్టివ్‌ అయిపోతుంటుంది. 

ఈ నేపథ్యంలో రోజూ గంటల తరబడి స్క్రీన్‌ చూడటంతో మెదడు పనితీరుపై ప్రభావం పడుతోందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఇక చిన్న పిల్లల్లో అయితే ఆటిజం వంటి తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తుతున్నట్టు వెల్లడిస్తున్నారు. కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా డిజిటల్‌ తరగతుల రూపంలో విద్యార్థుల్లో స్క్రీన్‌ వినియోగం గణనీయంగా పెరిగింది. 

పాఠశాలలు, కళాశాలల్లో సైతం ప్రాజెక్ట్‌ వర్క్‌ల పేరిట ఇంటర్నెట్‌లో శోధించే అంశాలనే పిల్లలకు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలు మెదడుకు పని చెప్పడం లేదు. ఇది కూడా జ్ఞాపక శక్తి మీద ప్రభావం చూపుతోంది. 
 
ఇలా నివారించొచ్చు.. 
» మొబైల్, ల్యాప్‌ ట్యాప్, ఇతర డిజిటల్‌ స్క్రీన్‌ వినియోగం తగ్గించాలి. సుదీర్ఘంగా స్క్రీన్‌పై ఉండాల్సి వచి్చనప్పుడు మధ్య మధ్యలో విరామం తీసుకోవాలి.  
»    జ్ఞాపక శక్తి, మెదడు పనితీరుపై సానుకూల ప్రభావం చూపేలా వ్యాయామాలు చేయాలి. వ్యాయామంతో  మెదడు కణాల ఎదుగుదలకు తోడ్పడే హార్మోన్లు విడుదల అవుతాయి. వాకింగ్, జాగింగ్, ఏరోబిక్‌ వంటి వ్యాయామాలు మెదడులోని హిప్పో క్యాంపస్‌ భాగం వృద్ధికి తోడ్పడతాయి.  
»   రోజుకు 7 నుంచి 8 గంటల తప్పనిసరిగా నిద్ర పోవాలి. తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు. ఇవి మెదడు పనితీరుపై ప్రభావం చూపుతాయి.  
»  మద్యం సేవించడం, ధూమపానం విడనాడాలి. 
»   గ్రీన్‌ టీ, తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

మెదడు ఎదుగుదలపై ప్రభావం 
మాకు వస్తున్న 100 ఓపీల్లో 30–40 మొబైల్‌ అతి వినియోగం ద్వారా వచ్చిన సమస్యలవే ఉంటున్నాయి. సాధారణంగా చిన్న పిల్లల్లో ఐదున్నరేళ్ల వర­కూ మెదడు ఎదుగు­తుంది. ప్రస్తుత రోజుల్లో పిల్లలు అల్లరి చేస్తున్నారని తల్లిదండ్రులు మొబైల్‌ ఇచ్చేస్తున్నారు. ఏడాదిలోపు నుంచే స్క్రీన్‌ చూడటం మొదలు పెట్టడం చిన్న పిల్లల్లో మెదడు ఎదుగు దల మీద తీవ్ర ప్రభావం చూపుతోంది.  

ఫోన్, టీవీల్లో చూసే కార్టూన్‌లు, గేమ్‌లనే వాస్తవ ప్రపంచంగా పిల్లలు భావిస్తున్నారు. వయసుతో పా­టు ఈ సమస్య పెరిగి చదవులపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు.. – డాక్టర్‌ ఎన్‌.ప్రసన్నకుమార్, ప్రొఫెసర్, చైల్డ్‌ సైకియాట్రి, మానసిక వైద్యశాల విశాఖపట్నం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement