భూకంపం వచ్చిందన్నట్లుగా SLBC టన్నెల్‌ ప్రమాదం! | SLBC Tunnel Accident News: Officials Shocking Explanation To Ministers | Sakshi
Sakshi News home page

Tunnel Collapse: భూకంపం వచ్చిందన్నట్లుగా SLBC టన్నెల్‌ ప్రమాదం!

Published Sat, Feb 22 2025 3:49 PM | Last Updated on Sat, Feb 22 2025 5:12 PM

SLBC Tunnel Accident News: Officials Shocking Explanation To Ministers

నాగర్‌ కర్నూల్‌, సాక్షి: శ్రీశైలం ఎడమగట్టు కాలువ(SLBC) సొరంగం ప్రమాదం భారీ స్థాయిలోనే జరిగిందని తెలుస్తోంది. టన్నెల్‌ ప్రమాదంపై మంత్రులు ఉత్తమ్‌, జూపల్లి అధికారులతో సమీక్ష జరిపారు. ఆ భేటీలో Tunnel Collapse ప్రమాదం జరిగిన తీరును అధికారులు వారికి వివరించారు.

నాగర్‌ కర్నూల్‌ జిల్లా దోమలపెంట(Domalapenta) సమీపంలో.. ఎడమవైపు సొరంగం 14 కిలోమీటర్‌ వద్ద పైకప్పు ఒరిగిపోయింది. అయితే ప్రమాదం జరిగిన దృశ్యం.. భూకంపం వచ్చినట్లుగా ఉందని అధికారులు మంత్రులతో అన్నారు. భారీ శబ్ధంతో ప్రమాదం జరిగిందని, ఆ తీవ్రత వల్ల వెయ్యి క్యూబిక్‌ మీటర్లు రాళ్లు, మట్టి పేరుకుపోయాయి. దీంతో ఆందోళన చెందిన కార్మికులు, ఇంజినీర్లు మిషనరీ వదిలేసి బయటకు పరుగులు తీశారు. 150 మీటర్ల వరకు ప్రమాద తీవ్రత కనిపించింది అని అధికారులు తెలిపారు. 

ఇక సహాయక చర్యలపై మంత్రులు ఆరా తీశారు. ఉదయం నుంచి 40 మందిని టన్నెల్‌ నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని, గాయపడినవాళ్లను ఆస్పత్రికి తరలించామని వివరించారు. మరికొందరిని బయటకు తేవాల్సి ఉందని చెప్పారు. టన్నెల్‌లో భారీగా నీరు చేరిపోవడంతో.. సింగరేణి నుంచి సహాయక బృందాన్ని రప్పించినట్లు వివరించారు.  

అయితే ఇంకా ఎనిమిది మంది టన్నెల్‌లో చిక్కుకుపోయినట్లు నిర్ధారణ అయ్యింది . అందులో నలుగురు కూలీలు కాగా, మిగతా వారు అధికార సిబ్బంది అని సమాచారం. 

ఐదేళ్ల కిందట.. బీఆర్‌ఎస్‌ హయాంలో ఈ ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ మధ్యే తిరిగి ఈ పనులను మొదలుపెట్టాలని నిర్ణయించింది. నిలిచిన పనులను మళ్లీ కొనసాగించేందుకు సన్నాహాక పనులు జరుగుతుండగా.. ఈలోపు ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం.

ఎస్సెల్బీసీ సొరంగ మార్గం వివరాలు

  • నల్లగొండ, పాలమూరు జిల్లాల్లో మూడున్నర లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు ప్రారంభం అయిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులు
  • దివంగత నేత వైఎస్సార్ హయాంలో 2004 లో రూ. 2,200 కోట్లతో సొరంగం ప్రారంభం
  • ప్రస్తుత నాగర్ కర్నూల్ జిల్లా‌ అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద సొరంగం పనులకు వైఎస్సార్ శంకుస్థాపన
  • అరవై నెలల్లో పనులు పూర్తి కావాల్సిన సొరంగం
  • వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తోన్న పనులు
  • మధ్యలో వచ్చిన ప్రభుత్వాలు నిధులు కేటాయించకపోవడంతో సొరంగం ఆలస్యం
  • శ్రీశైలం‌ ఎడమగట్టు కాల్వపై 44 కిలోమీటర్ల సొరంగం తవ్వాల్సి‌ ఉంది
  • మిగతా పనుల పూర్తి కోసం ఇటీవలే నిధుల కేటాయింపు
  • 2010 నుంచి ఇప్పటి వరకు సొరంగం పూర్తి కోసం ఆరుసార్లు డెడ్ లైన్
  • 2026 జూన్ నాటికి సొరంగాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యం
  • 2017 లో సొరంగం అంచనా వ్యయం రూ. 3,152.72 కోట్లు పెంపు
  • ఈమధ్యే మరోసారి రూ.4,637 కోట్లకు పెరిగిన అంచనా వ్యయం
     

ఇదీ చదవండి: ఎల్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ఉదయం 8.20కి అసలేం జరిగిందంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement