
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి ఎజెండా, అవినీతి రహిత పాలనను ప్రజలు కావాలని కోరుకుంటున్నారన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్,, మోదీ పాలనతో బీజేపీ వరుస విజయాలతో దూసుకుపోతుందని ప్రశంసించారు. అదే సమయంలో కాంగ్రెస్ పై సెటైర్లు వేశారు లక్ష్మణ్. ‘అది సాధారణ ఎన్నిక అయినా, బైపోల్ అయినా బీజేపీ గెలుస్తోంది. ఢిల్లీలో కాంగ్రెస్ 3 సార్లు డక్ ఔట్ అయింది. కానీ క్రికెట్ లో 3 సార్లు డక్ ఔట్ అయితే పక్కన పెట్టేస్తారు. మరి డకౌట్ అయిన కాంగ్రెస్ పై రేవంత్ లాంటి నేతలు ఎనలేని ప్రేమ ఒలకబోయడం ఎందుకో?,
హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో గ్యారెంటీల పేరుతో నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు పాలన చేతకాక వాళ్ళలోనే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతయింది. అభ్యర్థులను పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఇక కాంగ్రెస్ ఎవరూ దిక్కులేక నేతలను అరువు తెచ్చుకుని బరిలోకి దింపారు. అడ్డు అదుపు లేకుండా గ్యారెంటీల పేరిట మోసం చేస్తున్న కాంగ్రెస్ కు కళ్లెం వేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ భవిష్యత్ ఓటర్లపై ఉంది.. మీరు కాపాడుకుంటారా లేదా అనేది మీ చేతుల్లోనే ఉంది. రేవంత్ గతంలో సోనియాను బలి దేవత అన్నారు.. ఇప్పుడు ఆయనకు ఆమె బంగారు దేవత అయింది. కేసీఆర్ పంథాలోనే రేవంత్ వెళ్తున్నారు.
ఉద్యోగులకు ఇవ్వాల్సిన 5 డీఏలు రేవంత్ బాకీ పడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి వారిని మోసం చేశారు. రిటైర్డ్ అయిన టీచర్ల రిటైర్ మెంట్ బెనిఫిట్స్ కోసం కోర్టు మెట్లెక్కాల్సిన దుస్థితి తెలంగాణలో ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లడిగే హక్కు కాంగ్రెస్ కు ఎక్కడిది?, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటై.. ఒకరిపై ఒకరు.. విమర్శలతో ఇష్యూ డైవర్ట్ చేస్తున్నాయి. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే రేవంత్ ను ప్రశ్నించి సమస్యలు పరిష్కరిస్తారు. అదే కాంగ్రెస్ ను గెలిపిస్తే రేవంత్ కు ఊడిగం చేస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ ఎన్నికలను ఎదుర్కోవడం కాంగ్రెస్ కు చేతకాక సర్వే పేరిట వాయిదా వేయాలని చూస్తున్నారు.
చిత్తశుద్ధి ఉంటే సర్వే రిపోర్టును కాంగ్రెస్ పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. గుజరాత్ లో కాంగ్రెస్ హయాంలోనే ముస్లింలను బీసీ జాబితాలో చేర్చారు. 10 శాతం రిజర్వేషన్లు ముస్లింలకు ఇచ్చి బీసీలకు 32 శాతం మాత్రమే ఇస్తారా?, దీనిపై వదిలిపెట్టబోము.. పాలన చేతకాకపోతే దిగిపోండి.. కానీ సర్వ నాశనం చేయొద్దు. మైనారిటీ పేరిట, ఈడబ్ల్యూఎస్ పేరిట, 10 శాతం రిజర్వేషన్ల పేరిట ముస్లింలు లబ్ది పొందుతున్నారు. మైనార్టీ పేరిట అన్ని సీట్లు ముస్లింలే తీసుకుంటున్నారు కదా?, కాంగ్రెస్ ఫేక్ పార్టీ.. ఫేక్ ప్రచారాలే వారికి తెలుసు. అశోక్ నగర్ వచ్చి రాహుల్ గాంధీ ముక్కు నేలకు రాసి నిరుద్యోగ ఓట్లు అడగాలి. లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఫీజు రీయింబర్స్మెంట్ రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’ అని లక్ష్మణ్ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment