సాక్షి ప్రతినిధి, వరంగల్: చిన్నప్పుడు మీరు అఆలు దిద్దిన బడిని చక్కగా తీర్చిదిద్ది రుణం తీర్చుకోవాలని భావిస్తున్నారా.. మీ ఆర్థికసాయాన్ని బడిఒడికి ఎలా చేర్చాలోనని యోచిస్తున్నారా.. ఎక్కడో దూరంగా ఉండటం వల్ల మీకు వీలు చిక్కడంలేదా.. ‘విద్యాంజలి’ ఉండగా.. చింత ఎందుకు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకంలో భాగస్వాములుకండి. మీ కలల సాకారానికి ఇది చక్కని వేదిక. సర్కారు బడుల్లోని సమస్యల పరిష్కారంలో దాతలను భాగస్వాములను చేయడమే ఈ పథకం ఉద్దేశం. ఆయా పరిశ్రమలవారు, స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ పథకం ద్వారా స్కూళ్లకు ఆర్థిక తోడ్పాటును ఇవ్వవచ్చు. విద్యాంజలిలో నమోదు చేసుకున్న పాఠశాలల్లో సమస్యల పరిష్కారం కోసం దాతలు ముందుకొస్తే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారితో ఎంవోయూ కుదుర్చుకొని పనులు మొదలుపెడతారు.
వెబ్‌సైట్‌లో పేరు నమోదు ఇలా..: రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలవారీగా అన్ని ప్రభుత్వ పాఠశాలల వివరాలు, సమస్యలు, అవసరాల గురించి ప్రధానోపాధ్యాయులు విద్యాంజలి వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారు. సంబంధిత పాఠశాలకు సాయం చేయాలనుకునేవారు అదే వెబ్‌సైట్‌లో ఉన్న దాతల ఆప్షన్‌ను క్లిక్ చేసి తమ పేర్లు నమోదు చేసుకొని సేవలను అందించవచ్చు.
తొలిస్థానం రాజన్న సిరిసిల్లదే..: ఈ ప్రక్రియలో రాష్ట్రంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, కేజీబీవీ, ఎంఎస్‌యూఆర్‌ఎస్, ఎయిడెడ్ తదితర అన్ని రకాల పాఠశాలలు 28,888 ఉండగా.. 21,585 పాఠశాలలు(74.72 శాతం) నమోదు చేసుకున్నాయి. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముందంజలో ఉంది. మొత్తం 514 పాఠశాలలకుగాను 506 (98.44 శాతం) పాఠశాలల పేర్లు నమోదు చేసి ప్రథమ స్థానంలో ఉండగా.. ఖమ్మం జిల్లా 1,273 పాఠశాలలకు 558 పాఠశాలల (43.83 శాతం) నమోదుతో చివరి స్థానంలో ఉంది.
నమోదైన సమస్యలివే...: పాఠశాలలను నమో దు చేసిన హెచ్‌ఎంలు తమ పాఠశాలల్లోని సమస్యలను కూడా అందులో పొందుపర్చారు. అత్యధికం గా నిర్మాణ పనులు, విద్యుత్ ఉపకరణాలు, బోర్డు లు, బల్లలు, కుర్చీలు, పుస్తకాలు, సైన్స్, గణితం కిట్లు, కంప్యూటర్, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్, ఇంటరాక్టివ్ వైట్‌బోర్డు, టీవీ, ల్యాప్‌టాప్, క్రీడలు, విద్యేతర(కో కర్క్యులర్) కార్యకలాపాలకు అవసరమైన వస్తు సామగ్రి, ఫస్ట్ ఎయిడ్ కిట్, వాటర్ ప్యూరిఫైడ్, థర్మామీటర్, చేతుల శుభ్రత (హ్యాండ్‌వాష్) సౌకర్యాలు, వీల్‌చైర్, హియరింగ్ హెడ్స్, టూల్‌కిట్స్, బోధన–అభ్యసన సామగ్రి, నిర్వహణ–మరమ్మతులు, కార్యాలయ అవసరాల కోసం సాయం చేయాల్సిందిగా దాతలను కోరారు.
దాతలు ముందుకొస్తేనే..
విద్యాంజలి పథకంతో పాఠశాలలను అభివృద్ధి చేసుకోవచ్చు. సమాజ భాగస్వామ్యంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. జిల్లా పరిషత్ హసన్‌పర్తి బాలుర పాఠశాల పేరును ఈ పోర్టల్‌లో నమోదు చేసుకున్నాం. ఇందుకోసం దాతలు సహకరించాలి.
Comments
Please login to add a commentAdd a comment